భారత చరిత్ర రచన ప్రధానంగా బ్రిటిష్ వలస చరిత్రకారుల చేతుల మీదుగానే జరిగింది. తరచుగా పక్షపాత దృక్పథమే రాజ్యమేలేది. నిర్దిష్టంగా కీలకపాత్ర వహించిన రాజవంశాలపై, వారి సేవలపై వారు కావాలనే దృష్టి సారించలేదు. భావి తరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలను, వ్యక్తులను నిర్లక్ష్యం చేశారు. దేశంలో దేవాలయాలను కూల్చినవారికి ఇచ్చిన గుర్తింపు, వాటిని పునర్ నిర్మాణం చేసినవారికి ఇవ్వలేదు. ఉదాహరణకు బాబరు అయోధ్యలో రామమందిరాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించాడు. ఔరంగజేబు కాశీ క్షేత్రాన్ని ధ్వంసం చేశాడు. తిరిగి వాటిని 250 సంవత్సరాల క్రితం రాణి అహల్యాబాయి హోల్కార్ పునర్ నిర్మించారు. కానీ చరిత్రలో బాబర్, ఔరంగజేబులకు ఇచ్చిన గుర్తింపు అహల్యాబాయికి దక్కలేదు.
మహారాష్ట్ర ప్రభు కుటుంబాలలో ప్రముఖమైనది, హోల్కార్ వంశం. దీని స్థాపకుడు మల్హరరావు హోల్కార్. గొప్ప యోధుడు. తన ప్రభువుల అనుగ్రహా నికి పాత్రుడయ్యాడు. అందుకే పీష్వా బాజీరావు ఈతనికి మాల్వ జాగీరులిచ్చి, తనకు లోబడి ఉండే షరతుతో, ఒక చిన్న రాజుగా నియమించాడు. తర్వాత మల్హరరావు కొంత రాజ్యం సంపాదించి మాల్వలో ఉన్న ఇండోర్‌ను రాజధానిగా చేసుకొని, పేరుకు పీష్వాకు లోబడేలా వ్యవహరిస్తూ, చాలామట్టుకు స్వతంత్రంగానే పాలించాడు. ఆయన కోడలే అహల్యా బాయి హోల్కార్. ఆమె జీవితమంతా విషాదమే. అయినా మామగారి ఇండోర్ రాజ్యలక్ష్మి తనవలె అనాథ కావడం చూసి మహిళ అయినప్పటికీ రాజ్యరక్షణకై నడుం బిగించింది. ఇది అహల్యాబాయి జీవితచరిత్ర రాసిన చిలకమర్తి లక్ష్మీనరసింహం ఇచ్చిన క్లుప్త చిత్రణ (పేజి. 21,22). నిజమే, భారతదేశ చరిత్రలో అహల్యాబాయి ఒక స్మరణీయ మలుపు. దేశాభ్యుదయం, ప్రజాహితం జీవిత ధర్మాలుగా చేసుకొని చరితార్థమైన స్త్రీ మూర్తి. తన కాలానికి మించి పాలనా వ్యవహారాలను ప్రవేశపెట్టిన సృజనాత్మక శీలి.
హోల్కార్ రాజ్య రాజధాని ఇండోర్. దాని కొద్దిదూరంలోనే మాహూ పట్టణం ఉంది. చుట్టూ అడవులు. ఆ పట్టణానికి మూడు క్రోసుల దూరంలో వింధ్య పర్వతశ్రేణులలో ఒక గూడెం ఉంది. ఆ పల్లె కులవృత్తితో జీవించే గొల్లలకు సురక్షిత ఆవాసం. అక్కడే అంతా భగవంతుడని భావించే ఒక వృద్ధుడు నివసించేవాడు. అలాగే ఆ రాజ్యంలో ఎందరో మహర్షులు తపస్సు చేసుకొంటూ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రజలకు బోధిస్తూ ప్రజల నైతికతను పెంచుతున్నారు.
మన దేశంలో ఎందరో పండితులు, కవులు, వీరులు ఉదయించారు. వారిలో చాలామంది అజ్ఞాతంగా కాలగర్భంలో మరుగైపోయిన వారే ఎక్కువ. స్త్రీమూర్తుల విషయానికొస్తే యుగయుగాలుగా భారతదేశ చరిత్రలో పాలకులు, కవయిత్రులు, యోధులుగా గణనీయమైన పాత్రను పోషించిన గొప్ప మహిళలు ఉన్నారు. అక్బర్‌ను ఎదిరించి నిలిచిన గోండురాణి దుర్గావతి, బ్రిటిష్ వారిని ఎదిరించిన రaాన్సీరాణి చరిత్ర పుటలకెక్కారు. అంతటి విశిష్టమైన వారిలో అహల్యాబాయి హోల్కార్ నిశ్చయంగా ఒకరు. చిన్న వయసులోనే వితంతువైన ఆమె రాణిగా బాధ్యతలు స్వీకరించింది. రష్యాకు చెందిన కాథరిన్-xx, (1729-1796), ఇంగ్లాండుకు చెందిన ఎలిజబెత్-x, (1533-1603) డెన్మార్క్‌కు చెందిన మార్గరెట్-x, (1466`86) అస్సిరియన్ రాణి సమురామత్ (యుద్ధాలు, రాజధాని నిర్మాణం) ఈజిప్షియన్ రాణి హాత్సేపుట్స్ (1458-1479) (కళల పోషణ)ను అహల్యాబాయి హోల్కార్‌తో పోల్చ వచ్చును. వారంతా ఒక్కొక్క విషయంలో ప్రతిభా వంతులు. వారి అందరి లక్షణాలు అహల్యాబాయిలో కనిపిస్తాయి.
మూడో పానిపట్టు యుద్ధం తరువాత పూనాలో పీష్వాల ప్రాబల్యం బలహీనపడిరది. వారి ప్రాంతీయ సామంతులు హోల్కార్లు (ఇండోర్), గైక్వాడ్‌లు (బరోడా), భోంస్లేలు (నాగపూర్), సింధి యాలు (గ్వాలియర్) ఆయా ప్రాంతాలలో ప్రాముఖ్యం సంతరించుకున్నారు.
అహల్యాబాయి రాజ్యానికి వచ్చిన తరువాత ఎదుర్కొన్న పెద్ద సమస్య` రాజ్యానికి పశ్చిమాన నివసిస్తున్న గిరిజన జనాభా నుండి నిరంతర దోపిడీలు. అలాంటి చొరబాటుదారులతో జరిగిన యుద్ధం చేయడానికి ఆమె స్వయంగా సైన్యాన్ని నడిపించింది. రాజ్యంలో శాంతిని నెలకొల్పింది. అహల్యాబాయి నర్మదా నది ఒడ్డున ఉన్న పురాతన నగరం మహేశ్వర్‌ను అధికార కేంద్రంగా గుర్తించి, ఇండోర్‌ను ప్రధాన వాణిజ్య కేంద్రంగా మార్చారు. అహల్య భారతీయులకు పెద్దగా తెలియని పేరు. అయితే ఆమె సుమారు 28 సంవత్సరాలు మాల్వా ప్రాంతాన్ని పరిపాలించింది. 18వ శతాబ్దపు సామాజిక, పురుషాధిపత్య ప్రతికూలతను అధిగ మించి బలమైన స్థానిక పరిపాలనను సృష్టించింది. సింహాసనాన్ని అధిష్టించిన పురుషులందరూ మరణించిన తరువాత మాల్వారాణిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె ధర్మ సందేశాన్ని వ్యాప్తి చేయడం, హిందూ మతాన్ని పునరుద్ధరింపజేయడం, చిన్న తరహా పారిశ్రామికీకరణ, ఆధునిక ధర్మాలను ప్రోత్స హించడంలో బలమైన పాలకురాలుగా నిరూపించు కున్నది.
అహల్యాబాయి 1725లో (త్రిశతాబ్ది) అహమ్మద్ నగర్ జిల్లాలోని ఒక గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించింది. ధంగర్ సమాజానికి చెందిన ఆమె ఆ కాలంలోనే చదవడం, రాయడం నేర్చుకున్నది. మల్హర్‌రావు హోల్కార్ ఆమెను ఎనిమిది సంవత్సరాల వయసులో తన కుమారుడు ఖండేరావుకిచ్చి వివాహం చేశాడు. 1754లో రాజస్థాన్‌లో జరిగిన యుద్ధంలో ఖండేరావు ప్రాణాలు కోల్పోయాడు. 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాలు అధికారాన్ని కోల్పోయారు. 1765లో మల్హరరావు మరణించాడు. ఖండేరావు కుమారుడు మాలేరావు కూడా అదే సంవత్సరంలో మరణించాడు. అటువంటి సమయంలో 1767లో అహల్యాబాయి రాణి అయింది.
సింహాసనాన్ని అధిష్టించగానే అహల్యాబాయి ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు భిల్లుల తిరుగుబాటు. వారి నాయకులు గండా బిల్లు, తాంతియా బిల్లులను బంధించి, దాయాదిjైున దౌలత్‌రావు కుట్రను భగ్నం చేసిన వారికి తన కుమార్తె ముక్తాబాయినిచ్చి వివాహం చేస్తానని అహల్య ప్రకటించింది. దానితో జశ్వంత రావు బిల్లులను ఓడిరచి, దౌలత్‌రావు కుట్రను భగ్నం చేసి అహల్యాబాయిని కాపాడబనాడు. అన్నమాట ప్రకారం జశ్వంతరావుకు తన కుమార్తె ముక్తాబాయి నిచ్చి వివాహం చేసింది. దురదృష్టం, ఆ తరువాత మరో యుద్ధంలో జస్వంతరావు మరణించగా ముక్తాబాయి సతీ సహగమనం చేసింది. అహల్యా బాయి జీవితంలో అదొక పెను విషాదం.
అయినా ఆమె పరిపాలనను నిర్లక్ష్యం చేయలేదు. తన పరిపాలనలో రెండు ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చింది. మొదటిది ఆమె తన మామగారికి సన్నిహితంగా ఉండే తుకోజీ హోల్కార్‌కి సైనిక అధికారాన్ని అప్పగించింది. రెండవది రాష్ట్ర ఆదాయాన్ని ముట్టకుండా పాలకుల కుటుంబ, వ్యక్తిగత ఖర్చులు ఆమె వ్యక్తిగత ఆదాయం నుండే తీసుకునేది. అంటే ఆమెకు గల భూమి నుండి వచ్చే ఆదాయం నుండే తీసుకున్నదని బ్రిటిష్ రీజెంట్ జాన్ మాల్కం తన ‘ఎ మెమోయర్ ఆఫ్ సెంట్రల్ ఇండియా’లో రాశాడు.
అహల్య తన పాలనలో అనేక హిందూ ధార్మిక క్షేత్రాల రక్షణ, పునర్ నిర్మాణం, పునరుద్ధరణలో గొప్ప సహకారాన్ని అందిం చింది. వాటిలో ఆమె మొగలుల కాలంలో ధ్వంసమైన దేవాలయాలను పునరుద్ధ రించి, దాదాపు అన్ని ప్రధాన నదులను చేరుకోవడానికి ఘాట్‌లను నిర్మించారు. నానాసాహెబ్ పీష్వా నిర్మించిన ప్రసిద్ధ గంగా ఆర్తి ఉన్న దశాశ్వమేధ్ ఘాట్‌ను, మణికర్ణిక ఘాట్‌ను పునర్ నిర్మించారు. అహల్యాబాయి చేసిన ఆలయ నిర్మాణాల జాబితా అంతులేనిది. వాటిలో ముఖ్యమైనది వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం. ఆ ఆలయాన్ని నేడు ఈ రూపంలో చూడటానికి కారణం అహల్యబాయి కృషి.
సోమనాథ ఆలయాన్ని 1783లో మరాఠా సమాఖ్యలు పునర్ నిర్మించాయి. కాని అహల్యాబాయి గణనీయమైన సహకారం అందించి, ఉజ్జయిని, ద్వారకలో సౌకర్యాలు మెరుగుపరచడానికి కూడా దోహదపడిరది. భీమాశంకర్, త్రయంబకేశ్వర్‌లలో వంతెనలు, విశ్రాంతి భవనాలను నిర్మించింది. అహల్యాబాయి నిర్మించిన ముఖ్య ఆలయాలలో నేటికి మనకు కన్పించేది గయలోని విష్ణుపాద ఆలయం. అహల్య శివభక్తురాలైనప్పటికీ దీనిని నిర్మించినది (1787). పూరీలోని రామచంద్ర ఆలయం, రామేశ్వరంలోని హనుమాన్ ఆలయం, పార్తి వైద్యనాథ్‌్‌లోని శ్రీ వైద్యనాథ్ ఆలయం, అయోధ్యలోని సరాయు ఘాట్ మొదలైనవాటిని అభివృద్ధి చేసింది.
ఆమె కాలంలో మహేశ్వర పట్టణాన్ని సాహిత్యం, కళలకు కేంద్రంగా మార్చింది. ఆమె పాలనలో మహేశ్వర్‌లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఈ నగరం ప్రసిద్ధ మహేశ్వరీ చీరలకు నిలయం. ఆమె ఈ నగరాన్ని తమ నివాసంగా మార్చుకుని అనేకమంది కళాకారులు, శిల్పులను కూడా పోషిం చింది. రాజ్యంలో వాణిజ్యం ప్రోత్సహించింది.
అహల్యాబాయి ప్రభుత్వ మొదటి సూత్రం మితమైన అంచనా. గ్రామాధికారులు, భూ యజమానుల హక్కులపట్ల గౌరవం. ఆమె ప్రతీ ఫిర్యాదును స్వయంగా విన్నది. వివాదాలను ఈక్విటీ, ఆర్బిట్రేషన్ కోర్టుల (మధ్యవర్తిత్వం) ద్వారా పరిష్కరించుకోవాలని మంత్రులకు సూచించింది. ఆమె ఎల్లప్పుడు అందుబాటులో ఉండేది. న్యాయ పంపిణీకి సంబంధించిన అన్ని అంశాలపై ఆమెకు అవగాహన ఉంది. ఆమె నిర్ణయానికి అప్పీళ్లు చేసినప్పుడు కూడా శ్రద్ధగా వినేది. కేసుల దర్యాప్తులో ఏనాడూ అలసిపోలేదని సర్‌జాన్ మాల్కం తన గ్రంథంలో రాసుకున్నాడు.
కారవాన్‌లను (వ్యాపారుల పటాలాలను) భిల్లులు వేధిస్తూ ఉండేవారు. ఆమె వారితో మాట్లాడి వారి సంచార జీవన శైలిని వదులుకోవాలని ఒప్పిం చింది. వారికి సాగుకోసం భూమిని మంజూరు చేసింది. ఆమె దినచర్య ఈ విధంగా ఉండేది, తెల్లవారు జామున 2 గంటలకు లేచి ప్రార్థన, గ్రంథ పఠనం, బ్రాహ్మణులకు దానధర్మాలు చేసేది. అల్పాహారం, చిన్న విరామం తరువాత దర్బారు, పరిపాలనా విషయమై నిర్ణయాలు తీసుకునేది. తన ఆదేశాల మీద శంకరుని గుర్తు పెట్టేది. ఆగస్టు 13, 1795 న అహల్యాబాయి మరణించారు. కానీ ఆమె వారసత్వం, దేవాలయాలు, ప్రజాపనులు, ధర్మశాలల రూపంలో శాశ్వతంగా నిలచి ఉన్నాయి.
ముప్పయి సంవత్సరాల ఆమె శాంతియుత పాలన ఆశీర్వాదంతో భూవసతి పెరిగింది. వృద్ధులు, చిన్నవారు కూడా ఆమెను ఆశీర్వదించారు. వారి తల్లులతో పాటు వారి పిల్లలు కూడా అభినందించారని జోవన్నా బైలి అనే వ్యాసకర్త అన్నారు. జాన్ కీ ఆమెను ‘‘ది ఫిలాసపర్ క్వీన్’’ అని పిలిచారు. ఆమె జ్ఞాపకార్థం ఆగస్టు 26,1996వ తేదీన రెండు రూపాయిల విలువతో ఒక స్టాంపును భారత తపాలాశాఖ విడుదల చేసింది.
ఆంధ్ర ప్రభుత్వం వారి ఆదేశాను సారముగా, స్కూలు ఫైనల్ విద్యార్ధులకు ఈ ఉపవాచకముగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి ‘‘అహల్యాబాయి’’ నవలను 1958 బ్యాచ్‌కి నాన్‌డిటైల్డ్‌గా నిర్ణయిం చారు. ‘‘అబల అయ్యును బలవంతులగు దేశద్రోహుల దుష్ట ప్రయత్నముల నెదుర్కొని, ప్రజాశ్రేయ మార్గదర్శముగ, రాజధర్మమును పాలించిన అహల్యాబాయి భారత వీరనారీ మణులలో నొకతె’’ అని సంపాదక వర్గం పరిచయంలో రాశారు.
మూలం:
- మహారాణి అహల్యాబాయి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం పేజీ-1,21,22
- పరమ ధార్మికులు రాణి అహల్యాబాయి హోల్కార్ – చంద్రమౌళి కల్యాణ చక్రవర్తి.
- A Memories of Central India by Sir John Malcolm.
- ది ఫిలాసపర్ క్వీన్ ` అహాల్యాబాయి హోల్కారు: పుట్టి నాగలక్ష్మి ‘‘సంచిక’’ మే 30, 2021.