శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలను యావత్‌ ప్రపంచం జరుపుకుంటున్న తరుణంలో మానవాళికి ప్రేమను పంచుతూ ఆయన ఇచ్చిన సందేశం మరో శతాబ్దం తర్వాత కూడా అంతే ఆవశ్యకతను కలిగి ఉంటుంది. మీ హృదయాల్లో ప్రేమజ్యోతిని వెలిగించడానికి నేను వచ్చాను అని సత్యసాయిబాబా ప్రకటించారు. నేడు ఆ జ్యోతి ప్రపంచమంతటా లక్షలాది కుటుంబాల్లో దేదీప్యమానంగా వెలుగుతునే ఉంది.

సాయిబాబా సందేశం ఏదేని దేశం, జాతి, తెగ, వర్గం, మతం, కులానికి మాత్రమే పరిమితమై నది కాదు. ఆ సందేశం సార్వజనీనమైనది, కాలానికి అతీతమైనది. ప్రపంచంలో ఉన్న ఏకైక మతం ప్రేమ, ఏకైక కులం మానవత్వం, ఏకైక భాష హృదయభాష, ఏకైక దేవుడు సర్వాంతర్యామి అని సాయిబాబా చెప్పిన మాటలు కొందరికి మాత్రమే వర్తించేది కాదు. ఈ మాటలు మానవుల్లో ఆధ్యాత్మిక చేతనత్వాన్ని మేల్కొల్పడానికి ఉపకరించే పునాదులు. ఇవి ప్రపంచంలో అనేక మందిలో గాఢమైన పరివర్తనను తీసుకొని వచ్చాయి.

మహిమలు కావవి దీవెనలు

సత్యసాయిబాబా స్వహస్తాలతో విభూది, తదితర పవిత్రమైన వస్తువులను సృష్టించడం, ఎలాంటి వైద్య విధానాలకు అందని వ్యాధులను నయం చేయడం, వేల మైళ్ల దూరంలో ఉన్న భక్తులకు భద్రతతో కూడిన భరోసాను ఇవ్వడం, వారి జీవితాల్లో కోరుకున్న మార్పు జరిగేలా సరైన సమయంలో జోక్యం చేసు కోవడం వంటి మహిమలు ప్రపంచమంతటా ప్రాచు ర్యాన్ని పొందాయి. అయితే బాబా ఎప్పుడూ కూడా అలాంటి అసాధారణమైన, అత్యవసరమైన వాటి నుంచి దృష్టిని మరల్చడానికే ప్రయత్నించేవారు. ఆ క్రమంలో ‘‘నేను ప్రదర్శించే మహిమలు నా విజిటింగ్‌ కార్డులు’’ అని ఒకానొక సందర్భంలో వారు అన్నారు. అలాగని అవి శక్తిని ప్రదర్శించే సాధనాలు కావు. అవి మనసా వాచా కర్మణా భక్తి భావాన్ని కలిగి ఉన్నవారిలో దైవత్వాన్ని మేలుకొలిపి, వారిలో విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన కరుణతో కూడిన భావవ్యక్తీకరణలు.

బాబా మాటల్లో చెప్పాలంటే.. మానసిక పరివర్తన తేవడమే నిజమైన మహిమ. ఈ ఏక వాక్యం ఆయన చేపట్టిన కార్యక్రమానికి కేంద్రంగా మారింది. అనేక మంది ఆయన అరచేతి నుంచి ఉద్భవించిన వస్తువులను పొందిన అనుభవానికి అతీతంగా కోపం స్థానంలో సహనాన్ని, అహంకారం స్థానంలో మాన వత్వాన్ని, ద్వేషం స్థానంలో ప్రేమను, లక్ష్య సాధనలో అయోమయం స్థానంలో స్పష్టతను అలవరచుకున్నారు.

ఆయన భౌతికంగా కనుమరుగైనప్పటికీ నిశ్శబ్దంగా ప్రతీ ఒక్కరిలోనూ గూడుకట్టుకున్న వారి మహిమలు కాలానికి అతీతంగా వాటిపని అవి చేసు కుంటూపోతున్నాయి. బాబా ఆరు దశాబ్దాల పైచిలుకు కాలంలో 2,000కు పైగా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. ఆయన ఆ క్రమంలో ప్రపంచంలో ప్రతీ ఒక్కరికి ఉపకరించే ఒక సార్వజనీన ఆధ్యాత్మిక తత్త్వాన్ని అందించారు. బాబా ప్రసంగాలు దైనందిన జీవితానికి ఉపయుక్తంగా ఉండటం విశేషం.

లక్షలాది మందికి ఆధ్యాత్మిక డీఎన్‌ఏ

బాబా బోధించిన అందర్నీ ప్రేమించు.. అందర్నీ సేవించు, ఎప్పుడూ సాయపడు.. ఎప్పుడూ గాయ పరచకు, పనే దైవం.. పనే ప్రార్థన అనే దివ్య వాక్కులు లక్షలాది మందికి ఒక ఆధ్యాత్మిక డీఎన్‌ఏగా మారిపోయాయి. బాబా బోధనలు వినూత్నంగా ఉండటానికి కారణం అవి ఆధ్యాత్మిక సత్యాలను అందరికీ అర్థమయ్యేలా కుటుంబం, ఉద్యోగం, సమూ హంతో ముడిపెట్టి ఉండటం. ఆయన శాస్త్రవేత్తలు, దేశాధినేతలు, బాలలు, అమాయక గ్రామీణులు.. ఇలా ఎవరిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటికీ మానవుడి అస్తిత్వం వెనుక లోతైన అర్థాన్ని వివరించడానికి దైనందిన జీవితంలో ఎదురయ్యే విషయాలను ఉదాహరణలుగా చెప్పేవారు. అన్ని మతాల ఐక్యత, మేధావితనం కన్నా వ్యక్తిత్వం మిన్న, సైన్సు, ఆధ్యాత్మికతల మధ్య సమరసతను పాదుగొల్పడంలో ముందు వరుసలో నిలిచారు. బాబాకు సంబం ధించినంత వరకు భక్తి అనేది ఒక విధివిధానం కాదు. అది పవిత్రమైనది, చిత్తశుద్ధి కలిగినది. ప్రేమను సాధన చేసేది. ఆసుపత్రులు, తాగునీటి ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, అంతర్జాతీయ సేవా ఉద్యమాన్ని చేపట్టడం ద్వారా ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు పవిత్రమైనవి అనే నానుడికి బాబా నిదర్శనంగా నిలిచారు.

– డా.పద్మనాభన్‌ రంగనాథన్‌

బాబా వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌

About Author

By editor

Twitter
YOUTUBE