మృణాళిని అంటే పద్మాల సమూహం. తామరపువ్వు, కమలం. అరవిందం. కుముదం. జలజం. శతపత్రం. సరోజమన్నా, రాజీవమన్నా, వనజ అని పిలిచినా, సరోజనిగా వర్ణించినా అది అందానికీ ఆనందప్రదానికీ మారుపేరు.స్వచ్ఛతకు, వికాసానికి పర్యాయంగా ఉంటుందీ పూబాల. ఒకటిగా కాదు – అనేకంగా పద్మాలుంటే, జీవన సరోవరం ఎంత బాగుంటుందో!అందచందాలతో చూపరులకు కళానందాన్ని అందించే పేరు మృణాళిని. నర్తనతో అంతటి ప్రత్యేకత సాధించిన కళారమణి.ఆమె నుంచి నృత్యశిక్షణ పొందినవారు వేలల్లో ఉంటారు. స్వస్థలం కేరళ. బాల్యమంతా స్విట్జర్లెండ్‌లో. అనంతర విద్యాభ్యాసం కలకత్తాలో. నృత్య నిపుణత్వ సాధన అమెరికాలో. తదుపరి నివాసం భారతదేశంలోనే.ఈ దేశంలో ఎన్నో సేవలు చేశారామె. సరికొత్త నాట్యరీతుల్ని సృజించారు. ‘పద్మభూషణ’ అయ్యారు పేరుకు తగినట్లే! జనవరి మూడోవారం అనగానే…. మనందరి స్మృతి పథంలో తళుక్కుమంటారామె. సరిగ్గా దశాబ్ది క్రితం తను శాశ్వతంగా కన్ను మూసినపుడు – అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ‘జాతికి కీర్తి కిరీటం మృణాళినీ సారాభాయ్‌’ అని శ్లాఘించారు.

నర్తకీమణులు ఎందరో ఉంటారు. దేశవిదేశాల్లో కళాప్రదర్శనలిస్తుంటారు. మృణాళిని మాత్రం ఎక్కడ ఏ ప్రదర్శన ఇచ్చినా, పట్టం కట్టింది భారతీయతకే. ఎలుగెత్తి చాటింది భారతీయతనే. ఇంతటి దేశాభిమానం ఆమెకు మొదటి నుంచీ ఉంది.

అమ్ము స్వామినాథన్‌ ఒక సామాజిక కార్యకర్త. దేశీయ సంప్రదాయాలకు ప్రచారం కలిగించిన క్రియాశీలి. ఫలితంగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలోనూ ముందు నడిచారు. రాజ్యాగపరిషత్‌ సభ్యులయ్యారు. ఆ ప్రముఖురాలి తనయే మృణాళిని.

దేశం, సామాజిక బాధ్యత, నైతిక విలువలు, ఆచరణాత్మకత గురించి తల్లి నుంచి అలవరచుకున్నారు మృణాళిని. పౌరవిధులు, ప్రశ్నించే తత్త్వం, నాయకత్వ పటిమను పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నారు. ఎటువంటి స్థితినైనా తనకు అనువుగా మలుచుకునేంత నేర్పును సొంతం చేసింది.

కాలక్రమంలో మార్పుచేర్పులు చోటు చేసుకున్నాయి. కుటుంబ పరిణామాల కారణం ఆసక్తిగా, నివాసం స్విస్‌కి మారింది. అక్కడ ఉండగానే, నాట్యకళ పట్ల ఆసక్తి పెరిగింది. అక్కడి విద్యా లయంలో చేరి, విదేశీ నాట్యరీతిని గమనించారు. విలక్షణంగా ఉండే భారత నృత్య విధానం మీదా మక్కువ పెంచుకుంది. తొలి నుంచి ఆమె ఆలోచనలన్నీ భారతీయతవైపే. ఫలితంగా భారత్‌కు పయనం. అదీ శాంతినీకేతన్‌కు!అక్కడ అధ్యయనం పరిశీలన, విశ్లేషణ, బోధన, నృత్య కార్యక్రమాల నిర్వహణంతో కాలం శరవేగంగా గడిచింది. ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనిదే ‘ఆనంద పాఠశాల.’ ఇప్పటికీ మృణాళిని పేరిట ఉంది.

శాంతినికేతనం విశ్వభారతీ విద్యాలయం. పశ్చిమబెంగాల్‌కు మణిమకుటం. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఉంది ఆ వర్సిటీలోనే. సంగీత, నృత్య, తదితరాల సాంస్కృతిక విభాగమూ అందులోనే.

విదేశీ నర్తకులతో పరిచయం విస్తరించింది. మకాం అమెరికాకు మారింది. ఆ దేశపు తీరుతెన్నులనూ సమగ్రంగా గ్రహించారు.అక్కడి ప్రసిద్ధ సంస్థ ‘ అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ డ్రమెటిక్‌ ఆర్ట్స్‌’ పలు ప్రయోగాలకు నాంది. సంవత్సరాలు దాటుతున్న కొద్దీ ఆమె యోచనలన్నీ భారత్‌ చుట్టూ పరిభ్రమించాయి. పర్యవసానమే, తిరిగి భారత్‌కు రాక. ఆ సమయంలోనే రెండు భారతీయ నర్తనరీతుల(భరత నాట్యం, కథాకళి)పై మృణాళిని అనురక్తి దట్టంగా అల్లుకుంది.

భరత నాట్యంలో….తంజావూరు, కళాక్షేత్ర, పండనల్లూర్‌ తదితర శైలులున్నాయి. వాటిలోని నాటకీయత, హావభావ ప్రాధాన్యత, భావోద్విగ్నతలను బాగా ఆకళింపు చేసుకున్న మృణాళిని మరికొన్ని నృత్య భంగిమలను జత చేశారు. దేశీయ సాంస్కృతిక వారసత్వ అంతర్భాగంగా ఉంచేందుకు ఎంత చేయాలో అంతా చేశారు. కళాత్మక వ్యక్తీకరణకు ప్రాధాన్యమిచ్చారు.

కేరళకు సంబంధించిన కథాకళికి జాతీయ, అంతర్జాతీయ ప్రశస్తి. నృత్యంతో నాటక ప్రదర్శన అన్న మాట. ఇందులో రామాయణ, భారతాది ఇతిహాసాల నుంచి పాత్రల ప్రదర్శనలు.

కథా విధానమంతా హావభావ ప్రకటనే. జతగా – ధగధగల ఆభరణాలు, తళుకుబెళుకుల కిరీటాలు. మెరుపుల దుస్తులు. ఆకర్షణీయ అలంకరణలు.ఏ రూపం ప్రదర్శించాలన్నా ఎంతో అనుభవ సామర్థ్యం ఉండాలి. ఏదీ మాట్లాడకుండానే, భావ వ్యక్తీకరణలతో కథనంతా నడిపించాలి.

ఓర్పు, నేర్పు ఉంటే తప్ప` ఇతరులకు ఇదంతా అసాధ్యం. వర్తమాన పరిస్థితులను, ఆధునిక విధి విధానాలను జోడిరచటంలో మృణాళిని కృతకృత్యులయ్యారు. ప్రతీ ప్రదర్శనలోని ప్రతీ పాత్రకీ ఒక విశిష్టత కలిగేలా తనవంతు కృషిని కొనసాగించారు.

ఈ అన్నీ ఉత్తమ ఫలితాలనిచ్చాయి. ఆమె పేరు ప్రఖ్యాతులు ఖండాంతరాలకు చేరాయి. ఎన్నో దేశాలకు వెళ్లివచ్చారు. వెళ్లిన ప్రతీచోటా భారతీయ సంస్కృతికి పట్టాభిషేకం చేసి, రసజ్ఞ వీక్షకుల ప్రశంసలెన్నింటినో అందుకున్నారు. విలక్షణత చాటారు.ఆమె దర్శకత్వ ప్రతిభ ఇంతా అంతా కాదు. వందలాది ప్రదర్శనలకు మార్గదర్శనం చేయడంలో, వేదికలమీద జనరంజకంగా దిద్ది తీర్చడంలో ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని ఆవిష్కరించారు. కళారూపాలు ఎంతో విభిన్నంగా ఉంటే అంతా బాగా ప్రేక్షకుల సమాదరణకు మూలమవుతాయి. అలా అని, ఆ విభిన్నత శాస్త్రీయ సిద్ధాంతాల పరిధి దాటిపోకూడదు. ‘శాస్త్రీయత, సృజనాత్మకత పరస్పర ప్రోత్సాహకాలుగా ఉండి తీరాలన్నది నా లక్ష్యం. అప్పుడే ఏ కళాప్రక్రియలకైనా ఘనత కలుగుతుంది. అది శాశ్వతంగా నిలిచిపోతుంది. నా ప్రయత్నమంతా ఇందుకే’అనేవారామె. ఆశయాలకు తగిన సహకారం కుటుంబ నుంచి పూర్తి స్థాయిలో లభించింది.

మృణాళిని భర్త విక్రం సారాభాయ్‌ ఎంత ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తో మనందరికీ తెలుసు. ఆయనది విజ్ఞానరంగమైనా, కళారంగంలోని సతీమణికి అన్ని విధాలా ఉత్సాహ ప్రోత్సాహాలందించారు. భర్తది నిరంతర శాస్త్రాన్వేషణ అయితే, భార్యది సదా సర్వదా కళాపోషణ. కుమార్తె మల్ల్లికా సారాభాయ్‌ తల్లి నుంచి కళాత్మకతను సంపూర్ణంగా పుణికి పుచ్చుకున్నారు. తానూ నృత్యరంగాన్నే ఎంచుకుని, మాతృమూర్తి అడుగుజాడల్లో నడిచారు. అమ్మ మాదిరే భరత నాట్యం, కూచిపూడి పట్ల అభిరుచి పెంపొందించుకున్నారు.

నర్తకిగా, నృత్యదర్శకురాలిగా కూడా మల్లిక పేరు సంపాదించడంలో జనని పాత్ర, ప్రాధాన్యత ఎంతైనా ఉంది. కుటుంబ నేపథ్యాన్ని అనుసరించి, సామాజిక సేవా కార్యకర్తగానూ అందరి మన్ననలూ అందాయి ఆమెకి. తనూ పద్మభూషణురాలు అయ్యారంటే, అదంతా అమ్మ మృణాళినికే చెందుతుందనడం ఎంతైనా విశేషాంశం. ఇప్పటికీ కృతజ్ఞతలందిస్తున్నారు అవకాశం లభించిన ప్రతిసారీ!

విదుషీమణి మృణాళిని అప్పట్లో ‘దర్పణ’ అనే సంస్థను స్థాపించారు. పేరుకు తగినట్లు, అద్దంలో చూసినట్లు, చూపినట్లు నృత్యాభినయ కౌశల్యాన్ని వెలుగులోకి తెచ్చారు. అనేకమంది యువకళాకారులకు వేదిక కల్పించారు. వందలాది ప్రదర్శనలిచ్చిన మృణాళిని, ఫ్రాన్స్‌లో మరువరాని అనుభవం కలిగిందని ఒక ఇంటర్వ్యూలో విపులీకరించారు. ప్యారిస్‌ నగరంలోని థియేటర్‌లో ప్రదర్శించినపుడు, కళాభిమానుల నుంచి మరి ఏ ఇతర ప్రాంతంలోనూ రానంత అద్భుత గుర్తింపు అక్కడ లభించిందని ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఫ్రాన్స్‌లో ఉన్న సంస్థ ప్రత్యేక ప్రశంసగా పతకాన్ని బహూకరించింది. మెక్సికో సంస్థ స్వర్ణపతకం అందజేసింది.

ఎన్ని సత్కారాలు వరించినా, బిరుదులు కోరి వచ్చినా నిగర్వత్వమే ఆమెకి సహజ ఆభరణంగా ఉండేది. పిల్లలను ఎంతగానో ప్రేమిస్తూ అనేక ప్రక్రియలను వెలువరించారు. చిన్న పిల్లల మనస్తత్వం ఎరిగిన ఆమె వారి భావాల విపులీకరణతో వచన రచనలెన్నో చేశారు. దేశ రాజధానిలోని సంగీత నాటక అకాడమీ వేదికమీద పురస్కృతిని స్వీకరించి ఇప్పటికి మూడు దశాబ్దాలు! నాటికలు, కథలు బాలల కోసం రాయడంలో ఉన్న ఆనందం ఎంత పెద్ద పురస్కారం అందుకున్నా తనకు కలగదని వినమ్రంగా అన్నారు ఆ రోజున.

‘దశాబ్దాలుగా కళారంగంలో ఉన్నారు. పేరెంతో సంపాదించారు. ఇప్పుడు మీ వయసు పెరుగుతోంది. ఇంకా ఎందుకు ఇంతగా శ్రమ తీసుకుంటున్నారు’ అని ఓ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు, ‘నేనూ, నాట్యం వేరు కాదు. దూరం కావడం, దూరంగా ఉండటం జరగని పని’అనే సమాధానం అపూర్వం! ఈ మూడు వాక్యాలూ చాలు… ఆమె అంకితభావాన్ని ఉదాహరణ సహితంగా వెల్లడిరచడానికి!

కళకి, ఆరోగ్యానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ ` ‘కళ అంటే లోపలి. ఉద్వేగాన్ని వ్యక్తం చేయడం! దీనివల్లనే కళాకారులకు మానసిక ఆరోగ్యం రెట్టింపు అవుతుంది. శారీరక ఆరోగ్యమూ సహజంగానే పెంపొందుతుంది. అందుకే ఏ కళాప్రక్రియ అయినా ఆరోగ్యభాగ్యమే.’ఈ వ్యాఖ్యలు ఆమె మనోగతాన్ని సంపూర్తిగా ఆవిష్కరిస్తున్నాయి.

వృద్ధాప్యం, అది కలిగించిన అనారోగ్యంతో మృణాళిని శాశ్వతంగా వెళ్లిపోయినపుడు కళాహృదయాలెన్నో శోకించాయి. ఆమె లేకున్నా, ఇప్పటికీ ఆ సేవల ఫలితాలు నాట్యరంగాన ప్రతిఫలిస్తున్నాయి. కళారమణి మృణాళిని! అక్షరాలా విదుషీమణి!

 – జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE