సనాతన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఒక చారిత్రక లేదా పౌరాణిక కథ మాత్రమే కాదు, మానవ వికాసానికి అవసరమైన అత్యున్నత జీవన తత్త్వం ఇమిడి ఉంటుంది.
నరకాసురుడి సంహార ఘట్టం పురాణాల్లోని ఒక కథ కాదు. అది ప్రతి యుగానికి, ముఖ్యంగా, ఆధునిక సమాజానికి ఎంతో అవసరమైన ఒక అద్భుత జీవితసత్యం. శ్రీకృష్ణుడు మార్గదర్శకుడిగా, సత్యభామ శక్తిస్వరూపిణిగా నిలిచి చేసిన నరకాసురవధ నేటి మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక సంక్షోభాలకు ఎలాంటి పరిష్కారాన్ని చూపుతుందో విశ్లేషించే ఘట్టం ఇది. నేటి వేగవంతమైన, యాంత్రి కమైన, అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న ఆధునిక సమాజానికి శ్రీకృష్ణ -సత్యభామలందించే సమర సందేశం ప్రత్యామ్నాయమైన దిక్సూచిగా నిలుస్తోంది.
సంధ్యవేళ నరకాసురుడనే రాక్షసుడి అంతంతో దీపావళి వెలుగులు నిండాయని మన పురాణాలు చెబుతాయి. అయితే, ‘నరకాసురుడు’ అంటే కేవలం వేల సంవత్సరాల క్రితం జీవించిన ఒక దానవుడు మాత్రమే కాదు. చుట్టూ గమనిస్తే, నరకాసురుడు రూపం మార్చుకుని మన మధ్యే సంచరిస్తున్నాడు.. తోటి మనుషుల భావాలను గౌరవించని స్వార్ధం, అవినీతి, అహంకారం.. ఇతరులను అణచివేసే దురాశ నేటి నరకాసురులు.
సమాజంలో దాగి ఉన్న అజ్ఞానానికి, దురాశకు, అహంకా రానికి ప్రతీక. ప్రాగ్జ్యోతిషపురంలో నరకాసురుడు పదహారువేల మంది రాజ కన్యలను బంధించినట్లుగానే, నేటి మనిషి తన అనంతమైన కోరికలకు, మొబైల్ స్క్రీన్లు, సోషల్ మీడియా వ్యసనాలకు, భౌతిక భోగాల బానిసత్వానికి తన అంతః చైతన్యాన్ని బందీ చేసుకుంటున్నాడు. ఈ బంధనాల నుంచి మానవ మనస్సును విముక్తి చేయడమే, మనలోని ఆ చెడు ఆలోచనలనే ‘నరకాసురుడిని’ మట్టు బెట్టడమే నిజమైన నరకాసుర వధ!
శ్రీకృష్ణుడు – నడిపించే అంతరాత్మ
శ్రీకృష్ణుడు మనలోని పరమాత్మ చైతన్యానికి, వివేకానికి సంకేతం. జీవిత పోరాటంలో మనకు మార్గదర్శి ఆ వివేకమే. యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా ఆయుధం పట్టకుండా, రథసారథిగా నిలిచి సత్యభామను ఎలా నడిపించాడో, అలాగే మన జీవిత రథానికి కూడా వివేకమే సారథి కావాలి. జీవితం ఒక యుద్ధక్షేత్రం. ఇక్కడ నిత్యం సమస్యలు, ప్రతికూల పరిస్థితులు మనల్ని చుట్టుముడుతుంటాయి. ఈ సంక్షోభాలను కేవలం ఆవేశంతో, ఆగ్రహంతో ఎదుర్కోలేం. దానికి శ్రీకృష్ణుని లాంటి ప్రశాంతమైన. దృఢమైన వివేకం కావాలి. ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్న నైతిక సంక్షోభాలకు, మానసిక ఒత్తిళ్లకు భగవద్గీతా సారం అందిం చిన శ్రీకృష్ణుడి తత్వమే సరైన పరిష్కారం. ధర్మం వైపు నిలబడే ధై••ర్యాన్ని, సత్యం కోసం పోరాడే తత్త్వాన్ని కృష్ణుని పాత్ర మనకు బోధిస్తుంది. ఆధ్యాత్మికంగా శ్రీకృష్ణుడు మనలోని సద్బుద్ధికి, పరమాత్మ చైతన్యానికి సంకేతం. జీవిత యుద్ధంలో కేవలం ఆవేశం ఉంటే సరి పోదు. దానికి సరైన వివేకం (శ్రీకృష్ణుడు) తోడవాలి. ఆధునిక జీవితంలో మన చుట్టూ ఉన్న సమస్యలను ఎదుర్కొనేటప్పుడు ధర్మం వైపు నిలబడే ధైర్యాన్ని, స్పష్టమైన మార్గాన్ని శ్రీకృష్ణుడి తత్త్వం మనకు అందిస్తుంది.
సత్యభామ – స్త్రీశక్తి, భాగస్వామ్యస్ఫూర్తి
సత్యభామ స్త్రీశక్తికి, భాగస్వామ్య స్పూర్తికి నిదర్శనం. యుద్ధరంగంలో కృష్ణుడు సొమ్మసిల్లినప్పుడు సత్యభామ విల్లు పట్టి శత్రువును పడగొట్టింది. స్త్రీ అబల కాదు, అవసరమైనప్పుడు ధర్మరక్షణ కోసం ముందు నిలిచే మహాశక్తి అని ఇది నిరూపిస్తుంది. కుటుంబంలోనైనా,సమాజంలో, దేశ నిర్మాణంలో పురుషుడితో పాటు స్త్రీ సమాన భాగస్వామిగా నిలిచి, విపత్కర పరిస్థితుల్లో ముందుండి నడిపించగల సమర్ధురాలు అని సత్యభామ నిరూపించిందని చెప్పడంలో అతిశయోక్తి కాబోదు. నేటి ఆధునిక ప్రపంచంలో స్త్రీలు అన్ని రంగాల్లో దూసుకుపోవడానికి ఈ పురాణస్ఫూర్తే వ•ల స్రవంతి.
కుటుంబంలో, సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమాన భాగస్వాములుగా బాధ్యతలు పంచుకున్నప్పుడే ఎలాంటి పెద్ద సమస్యనైనా (నరకాసురుడి లాంటి చెడును) అధిగమించగలరనే సందేశం ఇందులో ఉంది. నరకాసురవధ ఒక రాక్షసుడి అంతం కాదు. మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, జ్ఞానమనే దీపాన్ని వెలిగించడం. నేటి వేగవంతమైన, ఒత్తిడితో కూడిన జీవితంలో మనలోని నరకాసురుడిని (చెడు ఆలోచనలను) సంహరించి, ఆత్మజ్ఞానంతో జీవించడమే ఈ ఘట్టం మనకు నేర్పే పర మార్ధం.
ప్రతి మనిషి తనలోని మాలిన్యాలను ప్రక్షాళన చేసుకోవడానికి అనుసరిం చాల్సిన నిత్యనూతన జీవనమార్గం. శ్రీ కృష్ణుడి వివేకం, సత్యభామ ధైర్యం మన గుండెల్లో నిలిచిననాడు, మనలోని అజ్ఞానాసురుడు అంతరిస్తాడు. అప్పుడే సమాజంలో శాంతి, సమతత్వం, నిజమైన వెలుగులు నిత్యసత్యమవుతాయి. ‘చెడు ఎంత శక్తివంతమైనదైనా, అధర్మం ఎంత ఆర్భాటం చేసినా, వివేకంతో కూడిన ధర్మం ముందు ఓడిపోక తప్పదు. నేటి ఆధునిక కాలంలో బాహ్య ప్రపంచంలో ప్రమిదలు వెలిగించడంతో పాటు, మన అంతరంగంలో ఉన్న అజ్ఞాన తిమిరాలను, అసహనాన్ని, అహంకారాన్ని దహనం చేయడమే నిజమైన సందేశం. సమాజంలో నారీశక్తికి తగిన గౌరవం ఇస్తూ, వివేకవంతమైన ఆలో చనలతో ముందడుగు వేసినప్పుడే నరకాసుర సంహా రానికి సంపూర్ణ సార్ధకత చేకూరుతుంది.
మనలోని మంచిని గెలిపించి, జ్ఞాన దీపాన్ని నిరంతరం వెలిగిద్దాం!

తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
8008577834