అవతారిక
శంకర భగవత్పాదులు అద్వైత వేదాంత తత్వశాస్త్రానికి ప్రాణప్రదాతగా భారత ఆధ్యాత్మిక చరిత్రలో అపూర్వ స్థానం సంపాదించారు. ఆయన ప్రకారం పరమ సత్యం బ్రహ్మమే, ఈ జగత్తు మాయగా అనుభవించబడుతుందని స్పష్టంగా వివరించారు. జీవాత్మ, పరమాత్మ మధ్య ఏకత్వమే తమ బోధనల సారాంశం అని ఉపదేశించారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలపై ఆయన రచించిన భాష్యాలు వేదాంతానికి స్థిరమైన పునాదిని ఏర్పరచాయి. జ్ఞానమార్గమే మోక్షానికి ప్రధాన సాధనమని, అవిద్య వల్లనే మనిషి తన నిజస్వరూపాన్ని గ్రహించలేడని ఆయన తాత్త్వికంగా నిరూపించారు. శ్రవణం, మననం, నిదిధ్యాసనం ద్వారా బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుందని బోధించి ఆచరణాత్మక మార్గాన్ని చూపించారు. భక్తి, జ్ఞానానికి సమన్వయం కల్పించి ఆధ్యాత్మికతను ప్రజలకు సులభతరం చేశారు.

భారతదేశంలోని నాలుగు దిక్కుల్లో చతురామ్నాయ పీఠాలను మధ్యలో కాంచీపురంలో కామాక్షీ అమ్మవారి సన్నిధిలో మూలామ్నాయ పీఠాన్ని స్థాపించి ధార్మిక ఐక్యతకూ, సంస్కృతీ పరిరక్షణకూ కృషి చేశారు. వివిధ మతపరమైన వాదాలను తార్కికంగా సమర్థించి సనాతన ధర్మాన్ని పునరుద్ధ రించిన సంస్కర్తగా నిలిచారు. ఈ విధంగా శంకరా చార్యుల తాత్త్విక మూర్తిత్వం భారతదేశ చరిత్రలో ఆధ్యాత్మిక పునర్జీవనానికి మూలస్థంభంగా నిలిచి తరతరాలపాటు స్ఫూర్తినిస్తోంది.
శ్రీ శంకర భగవత్పాదుల జన్మ కాల నిర్ధారణ
శంకరభగవత్పాదుల జన్మ కాలనిర్ధారణ విషయంలో రెండు ప్రధానమైన వాదాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పాశ్చాత్యవాద ప్రభావితం. రెండవది ప్రాచీన గురు పరంపర తిలకించిన చారిత్రక సత్యం. మాక్స్ ‌ముల్లర్‌, ‌వెబర్‌, ‌వింటర్‌ ‌నిట్జ్ ‌వంటి పశ్చిమ పరిశీలకుల కృతక వాద ప్రభావం వల్ల శ్రీ శంకర భగవత్‌ ‌పాదులు క్రీ. శ 8 వ శతాబ్దిలో జన్మించారు అనే అసత్యవంతమైన అభిప్రాయం లోకవ్యాప్తిని పొందింది.
దీనికి బలాన్ని చేకూర్చిన మరొక ఉదంతం శ్రీ మాధవ విద్యారణ్య స్వామి చరిత్ర. విద్యారణ్య స్వామి వారు హంపి వద్ధ శ్రీ శృంగేరీ శ్రీవిరూపాక్ష శ్రీపీఠాన్ని స్థాపించి శ్రీ శంకర భగవత్పాదులు లోకానికి అందించిన అద్వైత సిద్ధాంతాన్ని, షణ్మతాలను ప్రచారం చేయటానికి కటిబద్ధులై తనకున్న రాజ గురుత్వ బలంతో అప్పటికి కొన్ని వందల సంవత్స రాల క్రితం ఆదిశంకరులు నెలకొల్పిన, విదేశీయుల దండయాత్రలలో వైభవాన్ని కోల్పోయిన చతురా మ్నాయ పీఠములను పునరుద్ధరణ గావించారు. ఇక్కడ గమనించదగిన, హర్షించదగిన విషయం. చతురామ్నాయ పీఠములు విదేశీయుల దురాక్ర మానికి గురైనాయి కానీ కాంచీపురంలోని శ్రీ కామకోటి మూలామ్నాయ పీఠం మాత్రం వారి దుష్ట చేష్టల బారినపడలేదు. అలా ఆ నాలుగు పీఠాలు విద్యారణ్య స్వామి వారివల్ల పునర్‌వైభవాన్ని సంతరించుకున్నాయి.
ఈ విషయం కాలాంతరంలో సంచార పీఠంగా మారి గుంటూరులో శ్రీశ్రీశ్రీ బోధానంద భారతీ మహాస్వామి వారు స్థిరపరిచిన, వీరి శిష్యులైన శ్రీశ్రీశ్రీ కల్యాణానందభారతీ మహాస్వామి వారిచేత సుస్థిరమైన శ్రీవిద్యారణ్య ప్రతిష్ఠిత శ్రీశృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీపీఠచరిత్రలో లభ్యమయ్యే సత్యం. ఈ సత్యం మరుగున పడటం వల్ల శ్రీ విద్యారణ్య స్వామివారే చతురామ్నాయ పీఠములను నెలకొల్పా రనే భ్రాంతికి లోనౌవుతున్నారు అటు పాశ్చాత్యులు, ఇటు అదే చరిత్ర అనుకుంటూ చదువుకునే వారు కొందరు. దీనికి కారణం పాశ్చాత్య జనులు వ్రాసిన అసత్యపు రాతలే మన దేశ చరిత్ర అనే అపోహ బలీయంగా వారిలో పాతుకుపోవటమే. మరి అసలు విషయం తెలియాలి అంటే శ్రీ కామకోటి చరిత్రను చూడాలి.
శ్రీ కాంచీపురస్థ కామకోటి పీఠం నమోదు చేసిన ఆది శంకరభగవత్పాదుల జన్మశతాబ్దము- గురుపరంపర.
అది ఒక మహాపురుష పరంపర చూసిన చరిత్ర, భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఆది శంకరభగవత్పాదుల అవతరణం యుగప్రవర్తక ఘట్టం. ఉపనిషత్తుల అద్వైతసారాన్ని స్పష్టంగా ప్రతిపాదించి, వేదమాతను సంరక్షించి, భౌతిక-ఆధ్యాత్మిక సంక్షోభ సమయంలో ధర్మ సంస్థాపన చేసిన మహోన్నత గురుస్వరూపం ఆయనది. కాంచీ కామకోటి పీఠ గురుపరంపర విశ్వాసానుసారం, శంకరులు క్రీస్తుపూర్వం 509వ సంవత్సరంలో (వైశాఖ శుక్ల పంచమి, పునర్వసు నక్షత్రం) అవతరించినారని అంతాఅంగీకరిస్తారు.
ఈ కాలనిర్ణయం పీఠంలో పరంపరాగతంగా కొనసాగుతున్న గురునామావళి, పీఠాధిపతుల నామక్రమం, ఆధ్యాత్మిక సంప్రదాయ ఆధారాలపై నిలబడి ఉంది. ఈ పీఠం ప్రకారం, ఆదిశంకరులు ఒక తాత్త్విక సంస్కర్త మాత్రమే కాదు; వారు దివ్యజ్ఞానాన్ని మానవజాతికి ప్రసాదించిన పరమ శివావతారం.
గురుపరంపర వీక్షించిన చరిత్ర
కాంచీ కామకోటి పీఠం తన ఆరంభాన్ని స్వయంగా ఆదిశంకరులవారితో అనుసంధానిస్తుంది. పీఠ సంప్రదాయం ప్రకారం, శంకరులు భారతదేశాన్ని సంచరించి వేదమార్గాన్ని పునరుద్ధరించి, చతురామ్నాయ పీఠాలను స్థాపించిన తరువాత కాంచీపురంలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి కామాక్షీ అంబా సన్నిధిలో కామకోటి పీఠాన్ని ఆవిష్కరించారు.
కాఞ్చ్యం శ్రీచక్రరాజం స్థాపితవాన్‌ ‌శఙ్కరో గురుః ।
కామాక్ష్యాః సన్నిధౌ నిత్యం కామకోటిప్రదాయకః ।।
అనే పరంపరావాక్యం ఈ విశ్వాసాన్ని ప్రతిఫలిస్తుంది.
శ్రీ కామకోటి గురుపరంపర స్తుతి
నారాయణం పద్మభువం వసిష్ఠం
శక్తిం చ తత్పుత్రపరాశరం చ ।
వ్యాసం శుకం గౌడపదం మహాన్తం
గోవిన్దయోగీన్ద్రమథాస్య శిష్యమ్‌ ।।
శ్రీ‌శఙ్కరాచార్యమథాస్య పద్మ-
పాదం చ హస్తామలకం చ శిష్యమ్‌ ।
‌తం తోటకం వార్త్తికకారమన్యాన్‌
అస్మద్గురూన్‌ ‌సన్తతమానతో?స్మి ।।
(సంప్రదాయ గురుపరంపర స్తోత్రం)
ఈ శ్లోకం ద్వారా నారాయణుని నుండి ప్రారంభమైన జ్ఞానప్రవాహం శంకరులవారికి చేరిందని సూచిస్తుంది.
ఆది గురుపరంపర (ఆధ్యాత్మిక మూల శ్రేణి)
క్రమం గురు పేరు
1 శ్రీమన్నారాయణుడు
2 బ్రహ్మదేవుడు
3 వశిష్ఠ మహర్షి
4 శక్తి మహర్షి
5 పరాశర మహర్షి
6 వేదవ్యాసుడు
7 శ్రీ శుక మహర్షి
8 గౌడపాదాచార్యులు
9 గోవింద భగవత్పాదులు
10 ఆదిశంకరభగవత్పాదులు
11 పద్మపాద, హస్తామలక, తోటకులు, సురేశ్వర ఆచార్యులు వారు.
(కాంచీ కామకోటి పీఠ గురుపరంపర (సంక్షిప్త పట్టిక)
కాంచీ పీఠ విశ్వాసం ప్రకారం ఆదిశంకరులవారే పీఠ స్థాపకులు. గురుపరంపర నిరంతరంగా కొనసాగుతూ వస్తున్నదని సంప్రదాయం చెబుతుంది.
క్రమం పీఠాధిపతి
1. శ్రీ ఆదిశంకరభగవత్పాదులు
2 శ్రీ సురేశ్వరాచార్యులు
3 శ్రీ సర్వజ్ఞాత్మేంద్ర సరస్వతీ

68 శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు (మహాపెరియవ)
69 శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు
70 శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు (ప్రస్తుత పీఠాధిపతి)
71 శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు (ఈ మధ్యనే దీక్ష తీసుకున్నవారు)
(గమనిక: మధ్యలోని గురువుల సంపూర్ణ జాబితా విస్తృతమైనది; పీఠ అధికారిక గురుపరంపర గ్రంథాలలో లభ్యం.)
పీఠాధిపతుల గురుపరంపర ఆదిశంకరులవారి నుండి నిరంతరాయంగా కొనసాగుతున్నదనే ప్రత్యక్ష పరంపరా క్రమమే పీఠ సంప్రదాయంలో అత్యంత ప్రధానాంశం. ఈ గురుశ్రేణి వేదాధ్యయన పరిరక్షణ, శాస్త్రప్రచారం, ధర్మబోధ, దేశభక్తి,ఆధ్యాత్మిక జాగరణకు కేంద్రబిందువుగా నిలిచింది.
జన్మకాలిక శతాబ్ద ప్రస్తావన
కాంచీ పీఠ దృష్టిలో శంకరుల జన్మకాలం (క్రీ.పూ. 509) ఆధారంగా ఆయన జన్మించి 2500 సంవత్సరాలకు పైగా గడిచినదనే భావన వ్యక్తమవు తుంది. ఈ గణన ప్రకారం ఆయన అవతరణం భారతీయ సంస్కృతికి క్రీస్తుపూర్వ యుగంలోనే జరిగిన దివ్యసందేశంగా భావించాలి.
శంకరులు ఉపనిషత్తుల నుంచి ప్రకటించిన మహావాక్యాలు –
అహం బ్రహ్మాస్మి (బృహదారణ్యక ఉపనిషద్‌ 1.4.10)
‌తత్త్వమసి (ఛాన్దోగ్య ఉపనిషద్‌ 6.8.7)
‌ప్రజ్ఞానం బ్రహ్మ (ఐతరేయ ఉపనిషద్‌ 3.3)
అయమాత్మా బ్రహ్మ (మాణ్డూక్య ఉపనిషద్‌ 2)
ఈ ‌మహావాక్యాల ప్రచారం, వ్యవస్థీకరణ శంకరుల కార్యరూపంలో ప్రత్యక్షమైందని పీఠం దృఢస్వరంతో ప్రకటిస్తుంది.
ఇవి కేవలం తాత్త్విక సిద్ధాంతాలు కాక, మానవ జీవితానికి ఆధ్యాత్మిక స్వాతంత్య్ర ప్రకటనలుగా కనబడుతాయి.
కాంచీ పీఠ గురుపరంపరలో ఈ మహావాక్యాలు జీవనాచరణలో అనుసరణీయంగా వచ్చాయి. పీఠాధిపతులు వేదాధ్యయనం, యజ్ఞయాగాది సంప్ర దాయం, శ్రీవిద్యోపాసన, భక్తి–జ్ఞాన సమన్వయాన్ని కొనసాగిస్తూ శంకరుల ఆదేశాన్ని ఆచరణలో నిలిపారు.
శంకరులు – అవతార పురుషులు
సనాతన ధర్మమార్గ దర్శకులైన కాంచీ పీఠాధిపతుల పారంపరిక ఉపదేశ ప్రకారం శంకరులు పరమశివస్వరూపులు. వారికి వయస్సుతో పని ఏముంది? శంకరః శంకర స్సాక్షాత్‌ అనే భావన గురుపరంపరలో సజీవంగా ఉంది. అవతార రహస్యం అనేది చారిత్రక పరిమితులను అధిగమించి ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రతిపాదిస్తుంది.
అష్ట వర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్రవిత్‌,
‌షోడశే కృతవాన్‌ ‌భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్‌.
అన్న ప్రాచీన శ్లోకవచనాలననుసారించి ఎనిమిదేళ్ల వయసుకే నాల్గు వేదాలను అధ్యయనం చేశారు. పన్నెండు సంవత్సరాలకు అన్ని శాస్త్రాలను తెలుసుకున్నారు. పదునారు సంవత్సరాల వయస్సుకు బ్రహ్మసూత్ర భాష్యం చేసారు.ముప్పై రెండు సంవత్స రాలకు అంతర్ధానమయ్యారు.
శంకరుల దివ్యచరిత్రలో బాల్య వయస్సులోనే సన్యాసగ్రహణం, గురుపాదసేవ, భాష్యరచన, దేశవ్యాప్త దార్శనిక సంచారం- ఇవి యుగధర్మాన్ని పునర్నిర్మించిన కార్యాలు. కాంచీ పీఠ దృష్టిలో ఇవి కేవలం సంఘటనలు కాదు; ధర్మసంస్థాపనకు అవతారపురుషుని లీలలు.
పీఠం పాత్ర
కాంచీ కామకోటి పీఠం శతాబ్దాలుగా భారత దేశంలో వేదరక్షణకు, శాస్త్రప్రచారానికి, సమాజ నైతికతకు దిక్సూచిగా నిలిచింది. గురుపరంపరలోని జగద్గురువులు దేశవ్యాప్తంగా సంచరించి ధర్మబోధ చేశారు. ప్రత్యేకించి 68వ జగద్గురు శ్రీచంద్ర శేఖరేంద్ర సరస్వతీ మహాస్వామిగారు (మహా పెరియవ) ద్వారా పీఠానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఆయన జీవితం గురుపరంపర విశ్వాసానికి సజీవసాక్ష్యం.
కాంచీ కామకోటి పీఠం దృష్టిలో ఆదిశంకర భగవత్పాదుల జన్మ క్రీ.పూ. 509లో జరిగిన దివ్యావతారం. గురుపరంపర విశ్వాసం ఈ కాలనిర్ణయాన్ని ఆధారంగా చేసుకుని శంకరుల బోధను నిరంతరాయంగా కొనసాగిస్తోంది. శంకరుల సందేశం కాలాతీతం.
ఇక శంకరుల జన్మవైశిష్ట్యాన్ని, వారి జన్మలో అంతరార్థాన్ని పరిశీలిద్దాం.
బాల్యంలోనే బ్రహ్మజ్ఞానులు -కారణజన్ముల మహిమ, మన దృష్టి
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక విశేష లక్షణం కనిపిస్తుంది -వయస్సుతో సంబంధం లేకుండా జ్ఞానం వికసించడం. అష్టావక్రుడు, నచికేతుడు, శుక మహర్షి, ధృవుడు, ప్రహ్లాదుడు, ఉపమాన్యువు, మార్కండేయుడు, శంకరభగవత్పా దులు మొదలైన మహనీయులు బాల్యదశలోనే పరమాత్మతత్త్వాన్ని గ్రహించినవారిగా వర్ణించబడ్డారు. ఆధునిక మానసిక దృష్టితో చూస్తే ఇది అసాధారణం, కొందరికి అసంభవం కూడా అనిపించవచ్చు. కాని భారతీయ దర్శనంలో ఇది అసంభవం కాదు-అది ‘‘కారణజన్మ’’ భావనతో సంబంధించింది.
1. వయస్సు – జ్ఞానానికి ప్రమాణమా?
వేదాంతసారం ప్రకారం జ్ఞానం శరీర పరిపక్వతకు సంబంధించి ఉండదు. నాయమాత్మా వయసా లభ్యః -ఆత్మజ్ఞానం వయస్సుతో రాదు. అది అంతఃకరణ శుద్ధి, పూర్వసంస్కారాలు, ముముక్షుత్వం ఆధారంగా లభిస్తుంది. అష్టావక్రుడు జనకసభలో వాదించేటప్పుడు 12 సంవత్సరాల బాలుడే. నచికేతుడు యమధర్మరాజును ప్రశ్నించి నప్పుడు 8-12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న కుమారుడే. ధృవుడు ఐదేళ్ల వయస్సులోనే తపస్సు చేసి విష్ణుదర్శనం పొందాడు. శుక మహర్షి యువకుడే అయినా అసంగబ్రహ్మజ్ఞాని. తల్లి కడుపులో ఉండగానే బ్రహ్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు. అలాగే శంకరభగవత్పాదులు ఎనిమిదేళ్లకే ఉపనిషత్తుల సారాన్ని గ్రహించి, పన్నెండేళ్లకే భాష్యాలు రచించి, ముప్పై రెండేళ్లలో భారతాన్ని సంచరించి తాత్త్విక పునరుద్ధరణ చేశారు. యుగే. యుగే. అంటే, భారతీయ దృష్టిలో జ్ఞానం అనేది అనుభవ సంపాదన ఫలితంగా ఒక్క జన్మలో మాత్రమే పుట్టేది కాదు; అది అనేక జన్మల సాధన ఫలితంగా వికసించగలదు.
2. కారణజన్మ సిద్ధాంతం
పురాణాలు, ఇతి హాసాలు ‘‘కారణజన్మ’’ అనే భావనను ప్రతిపాదిస్తాయి. కొన్ని ఆత్మలు లోకహితార్థం, ధర్మస్థాపనార్థం, తాత్త్వికబోధార్థం జన్మిస్తాయి. గీతలో శ్రీకృష్ణుడు ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పిన భావానికి ఇది సమీపం. ఈ మహనీయులు సాధారణ జీవుల మాదిరిగా శూన్యస్థితి నుంచి ప్రారంభించరు; వారు పూర్వసాధన సంపత్తితో అవతరిస్తారు. అందుకే వారిలో బాల్యంలోనే విరక్తి, జ్ఞానదాహం, తపస్సు కనిపిస్తుంది.
ఇది కల్పితకథనమని కొందరు భావించవచ్చు. కాని భారతీయ దర్శనశాస్త్రం పునర్జన్మ, సంస్కార సిద్ధాంతాలను అంగీకరిస్తుంది. పూర్వజన్మసాధన ఫలితంగా ఈ జన్మలో అతి చిన్న వయస్సులోనే మహా జ్ఞానం వికసించవచ్చు అని వేదాంతం సమర్థిస్తుంది.
3. వారిని మనతో పోల్చడం సరైనదా?
ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది: ‘‘వారు బాల్యంలోనే సాధించారు; మనం సాధించలేము; కాబట్టి అది కేవలం పురాణకల్పన’’ అని చెప్పడం సమంజసమా?
ఇది రెండు దృక్కోణాల్లో చూడాలి:
(అ) సమానత్వ దృష్టి:
మనమూ అదే పరమాత్మస్వరూపమే. తత్త్వంగా చూస్తే, ఆత్మస్వరూపం అందరిదీ ఒకటే. కాబట్టి వారు సాధించిన బ్రహ్మజ్ఞానం మనకూ సాధ్యమే. శంకరులు కూడా ‘‘తత్త్వమసి’’ అని ఉపదేశించారు. ఆత్మజ్ఞానం ఎవరికైనా సాధ్యమే.
(ఆ) భిన్నత్వ దృష్టి:
ప్రత్యేక సంస్కారాలు, పూర్వసాధన, అంతఃకరణ శుద్ధి వేరువేరు. ఒక విద్యార్థి జన్మతః గణితంలో ప్రతిభావంతుడు కావచ్చు; మరొకరికి ఎక్కువ శ్రమ అవసరం. అందువల్ల బాల్యంలోనే పరిపూర్ణజ్ఞానం అందరికీ రావాలి అని చెప్పడం తప్పు. అదే విధంగా, వారిని మనతో పోల్చుకుని ‘‘ఇది అసంభవం’’ అని తిరస్కరించడం కూడా తర్కసంగతం కాదు.
4. చారిత్రకత – తాత్త్వికత
అష్టావక్రుడు నిజంగా పన్నెండేళ్ల వయస్సులో వాదించాడా? నచికేతుడు యమలోకానికి శరీరంతో వెళ్లాడా? శుకుడు సూర్యమండలాన్ని అధిగ మించాడా? ఇవి చారిత్రక పరిశోధన ప్రశ్నలు కావచ్చు. కాని భారతీయ సంప్రదాయం ప్రధానంగా ఈ కథల తాత్త్వికార్థాన్ని ముందుకు తెస్తుంది.
అష్టావక్రుడు – శరీరదోషం జ్ఞానానికి అడ్డంకి కాదని సూచన.
నచికేతుడు – ముముక్షుత్వం వయస్సుతో సంబంధం లేదని సూచన.
ధృవుడు – దృఢసంకల్పం చిన్నవాడికీ సాధ్యమే అని సూచన.
శుకుడు – అసంగత్వం పరాకాష్ఠ.
శంకరులు – జ్ఞానవిజ్ఞాన సమన్వయం.
అందువల్ల, వీరిని కేవలం చారిత్రక దృష్టితో కొలిచి ‘‘ఇది సాధ్యం కాదు’’ అని నిరాకరించడం భారతీయ దర్శనపరంపరను అర్థం చేసుకోకుండా చేసిన నిర్ణయం అవుతుంది.
5. మనకు ఉపదేశం ఏమిటి?
ఈ మహనీయుల జీవితాల ఉద్దేశం మనలో అసూయ లేదా నిస్సహాయత కలిగించడం కాదు; ప్రేరణ కలిగించడం. వారు సాధించినది అసాధ్యం కాదు – కాని అది సాధారణ స్థాయికి మించి ఉన్న సాధన ఫలితం. వారు మార్గదర్శకులు. వారు చూపిన మార్గంలో మనం కూడా ప్రయాణించవచ్చు, యథాశక్తి.
‘‘వారు కారణజన్ములు; కాబట్టి మనకు సాధ్యం కాదు’’ అని పూర్తిగా వదిలేయడం ఒక అతి.
‘‘వారు సాధారణ మనుషులు; కాబట్టి వారి మహిమ కల్పితం’’ అని తిరస్కరించడం మరొక అతి.
సమతుల్య దృష్టి ఏమిటంటే –
వారు విశేష సంస్కారసంపన్నులు; అయినా వారు మానవులే.
మనమూ మానవులమే; కాబట్టి ఆత్మసాధనకు మనకూ అవకాశముంది.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో బాలజ్ఞానుల కథలు కేవలం పురాణ రమ్యత కాదు; అవి మనసును ఉన్నత లక్ష్యాల వైపు మలిచే చిహ్నాలు. కారణజన్ములైన మహనీయులను మనతో పోల్చి ‘‘ఇది కల్పితం’’ అని తిరస్కరించడం సబబు కాదు. అదే సమయంలో, వారిని అందనంత దూరంలో ఉంచి మనసాధనను వదిలేయడం కూడా తగదు.
వారి జీవితం ఒక సూత్రాన్ని చెబుతుంది –
జ్ఞానం వయస్సుపై ఆధారపడదు; సంస్కారంపైనే ఆధారపడుతుంది.
సాధన ఎప్పుడైనా ప్రారంభించవచ్చు; ఫలితం ఈ జన్మలో కాని మరొక జన్మలో కాని వికసించవచ్చు.
అందుకే భారతీయ దృష్టిలో బాలజ్ఞానులు అసంభవం కాదు – వారు సంస్కారం, సాధన, దైవానుగ్రహ సమన్వయముల ఫలితాలు.
చతురామ్నాయ పీఠాలు — కాంచీ కామకోటి పీఠం — అద్వైతం, ఆత్మనిర్భర భారత దృష్టి
చతురామ్నాయ, మూలామ్నాయ పీఠవ్యవస్థ – శంకరభగవత్పాదుల నిర్మాణమే, ఆదిశంకరుల అద్వైతం-ఆత్మనిర్భర భారతానికి ఆధ్యాత్మిక మూలాధారం.
భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఆదిశంకరభగవత్పాదుల అవతరణం ఒక మహత్తర సంధికాల ఘట్టం. భారతదేశ చరిత్రలో కొన్ని మహనీయులు కాలాన్ని మలిచారు. వారిలో ఆదిశంకరభగవత్పాదులు అగ్రగణ్యులు. ఉపనిషత్తుల అద్వైతసారాన్ని స్పష్టంగా ప్రతిపాదించి, వేదప్రామాణ్యాన్ని పునరుద్ధరించి, దేశవ్యాప్తంగా సంచరించి తాత్త్విక ఐక్యతను స్థాపించిన మహోన్నత కర్తృత్వం శంకరులది. వారి ఆవిర్భావం కేవలం తాత్త్విక పరిణామం మాత్రమే కాదు; అది సాంస్కృతిక, ఆధ్యాత్మిక, జాతీయ పునర్నిర్మాణ ఉద్యమం. ఆ పునర్నిర్మాణానికి సంస్థాగత రూపం చతురామ్నాయ పీఠవ్యవస్థ. ఈ వ్యవస్థ శంకరుల నిర్మాణమే అనే దృఢనిశ్చయంతో చూస్తే, అద్వైత వేదాంతం భారత ఆత్మనిర్భరతకు మూలాధారమని స్పష్టమవుతుంది.
ఈ తాత్త్విక పునరుజ్జీవనానికి శాశ్వతత్వం కలిగించేందుకు వారు సంస్థాగత నిర్మాణాన్ని సమకూర్చారు. సంప్రదాయంగా అంగీకరించిన శృంగేరి, ద్వారకా, పురీ, జ్యోతిర్మఠ రూపమైన చతురామ్నాయ పీఠవ్యవస్థ భారతదేశాన్ని నాలుగు దిక్కులుగా ఆధ్యాత్మికంగా ఏకం చేసిన నిర్మాణశిల్పం.
ఈ పరంపరలోనే కాంచీ కామకోటి పీఠం కూడా విశిష్ట స్థానాన్ని పొందింది. దక్షిణ భారత ఆధ్యాత్మిక–శాస్త్రపరంపరలో కాంచీ ఒక ప్రాచీన విద్యాక్షేత్రం. వేద, ఆగమ, శాస్త్ర సంప్రదాయాల సంగమస్థలంగా అది చిరకాలంగా కీర్తి పొందింది. సంప్రదాయ విశ్వాసం ప్రకారం శంకరభగవత్పాదుల కృపాపాత్రంగా కామకోటి పీఠం అద్వైత సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ భారతీయ చైతన్యానికి మార్గదర్శకత్వం వహించింది. చారిత్రక చర్చలు ఉన్నా, ఆధ్యాత్మిక ప్రభావం విషయంలో కాంచీ పీఠం భారతదేశంలో అద్వైత ధర్మబోధకు ప్రముఖ కేంద్రమైనది అనేది నిర్వివాదం.
అద్వైతం ప్రకటించిన మహావాక్యం – అహం బ్రహ్మాస్మి – వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. తత్త్వమసి— సమష్టి ఐక్యతను సూచిస్తుంది. జీవాత్మ–పరమాత్మల మధ్య అభేదసత్యం ఎలాగైతే పరమార్థం, అలాగే భారతదేశం, భారతీయుల మధ్య ఉన్న అంతఃసంబంధం కూడా అభేదమే. ఈ భావన వ్యక్తిని హీనభావం నుంచి, సమాజాన్ని విభజన నుంచి, దేశాన్ని పరాధీనత నుంచి విముక్తం చేస్తుంది.
చతురామ్నాయ పీఠాలు, కాంచీ కామకోటి పీఠం కలిసి భారతదేశాన్ని భౌగోళికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడ కట్టిపడేసిన కేంద్రాలుగా నిలిచాయి. వేదపారంపర్యం, గురుశిష్య సంబంధం, శాస్త్రసంరక్షణ – ఇవన్నీ ఈ పీఠాల ద్వారా నిరంతరాయంగా కొనసాగాయి. ఈ సంస్థాగత ఐక్యతకు మూలం అద్వైత తాత్త్విక దృష్టి; ఆ దృష్టికి మూలం ఉపనిషత్తుల అభేదసత్యం.
అందువల్ల శంకరుల ఆత్మనిర్భర దృష్టి — వ్యక్తి అంతరంగ స్వాతంత్య్రం – పీఠవ్యవస్థ ద్వారా ఏర్పడిన సమాజ ఐక్యత -ఈ రెండూ కలిసి ఆధునిక ఆత్మనిర్భర భారతానికి ఆధ్యాత్మిక పునాది. ఈ వ్యాసం ఆ అభేద దృష్టిని, చతురామ్నాయ, కాంచీ కామకోటి పీఠాల పాత్రను, అద్వైతం ద్వారా వ్యక్తి–దేశ సమగ్రతను పరిశీలించడానికి ప్రయత్నిస్తుంది.
1. కాలపరిమాణంలో శంకరుల అవసరం
శంకరుల అవతరణ సమయానికి భారతదేశం తాత్త్వికంగా విభిన్న దారుల్లో విస్తరించింది. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సౌర, కౌమార సంప్రదాయాలు వేర్వేరు ఆరాధనలతో విభజితమై ఉన్నాయి. వేదమూలాధారం ఉన్నా, సమన్వయ దృష్టి తగ్గింది. ఈ నేపథ్యంలో శంకరులు అవతరించి: వేదప్రామాణ్యాన్ని స్థాపించారు. ఉపనిషత్తుల అద్వైతసారాన్ని వెలికి తీశారు. భాష్యరచనల ద్వారా శాస్త్రసంప్రదాయాన్ని క్రమబద్ధీకరించారు. దేశవ్యాప్తంగా సంచరించి తాత్త్విక ఐక్యతను ప్రతిష్ఠించారు. ఈ కార్యాచరణకు శాశ్వతత్వం కలిగించేందుకు సంస్థాగత నిర్మాణం అవసరం. అదే చతురామ్నాయ, మూలామ్నాయ పీఠవ్యవస్థ.
2. చతురామ్నాయ పీఠాలు — జాతీయ ఐక్యతకు ధార్మిక రూపకల్పన
సంప్రదాయ ప్రకారం శంకరులు నాలుగు దిక్కులలో నాలుగు పీఠాలను స్థాపించారు:
శృంగేరి — దక్షిణామ్నాయము (యజుర్వేద సంబంధం)
ద్వారకా — పశ్చిమామ్నాయము (సామవేద సంబంధం)
పురీ — తూర్యామ్నాయము (ఋగ్వేద సంబంధం)
జ్యోతిర్మఠ/బదరీ — ఉత్తరామ్నాయము (అథర్వవేద సంబంధం)
శ్రీ కాంచీపుర కామాకోటి — మూలామ్నాయము
ఈ వ్యవస్థలో గంభీరమైన ఆలోచన దాగి ఉంది. భారతదేశాన్ని కేవలం భౌగోళికంగా కాదు, ఆధ్యాత్మికంగా ఒకటిగా నిలపడం. నాలుగు దిక్కులలో నాలుగు వేదప్రవాహాలు ప్రవహిస్తూ, ఒకే అద్వైతసిద్ధాంతాన్ని పరిరక్షించాలి — ఇదే శంకరుల సంకల్పం.
ఇది కేవలం మఠస్థాపన కాదు; ఇది ఒక ఆధ్యాత్మిక పరిపాలనా వ్యవస్థ. ప్రతి పీఠం ఒక వేదాన్ని, ఒక మహావాక్యాన్ని, ఒక సంప్రదాయాన్ని పరిరక్షిస్తుంది. ఈ విధంగా దేశం మొత్తాన్ని ఒకే తాత్త్విక దారంలో కట్టిపడేసింది.
3. అద్వైతం — ఆత్మనిర్భరతకు మూలతత్త్వం
అద్వైత వేదాంతం ప్రధాన సూత్రం:
‘‘బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః’’
ఈ సిద్ధాంతం వ్యక్తిలో భయాన్ని తొలగిస్తుంది. ఎందుకంటే అతడు పరబ్రహ్మస్వరూపుడే. ఆత్మవిశ్వాసం, స్వాభిమానము, స్వాతంత్య్రభావం — ఇవి అద్వైతానుభూతి నుంచి ఉద్భవిస్తాయి.
ఆత్మనిర్భర భారతం అంటే కేవలం ఆర్థిక స్వావలంబన కాదు. అది సాంస్కృతిక, ఆధ్యాత్మిక, మానసిక స్వాతంత్య్రం.
అద్వైతం చెబుతుంది: మనం పరాధీనులు కాదు. మన మూలం పరబ్రహ్మ. జ్ఞానం మన అంతరంగంలోనే ఉంది.
ఈ భావన వ్యక్తిని లోపల నుంచి బలపరుస్తుంది. వ్యక్తి బలపడితే సమాజం బలపడుతుంది; సమాజం బలపడితే దేశం బలపడుతుంది.
4. చతురామ్నాయ, మూలామ్నాయ పీఠాలు — ఆత్మనిర్భర భారతానికి నిర్మాణ శిల్పం
శంకరులు కేవలం తత్వవేత్త కాదు; వారు దూరదృష్టి గల సంస్కృతిశిల్పి. పీఠాల ద్వారా వేదాధ్యయన పరంపర కొనసాగింది. సంస్కృతం, శాస్త్రాలు, ధర్మసూత్రాలు పరిరక్షించబడ్డాయి. గురుపరంపర నిరంతరత్వం పొందింది. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఏర్పడింది.
ఈ వ్యవస్థ వల్ల:
విదేశీ ఆలోచనల ఒత్తిడిలో కూడా వేదసంప్రదాయం నిలిచింది. భిన్నమతాలు ఉన్నా, వేదాధారిత ఐక్యత నిలిచింది.
ఆధ్యాత్మిక కేంద్రాలు దేశ ఐక్యతకు మూలస్తంభాలయ్యాయి. ఇది ఆత్మనిర్భరతకు సాంస్కృతిక ఆధారం.
5. అద్వైతం- జాతీయ చైతన్యానికి అంతరాత్మ
అద్వైతం భేదాలను తొలగిస్తుంది.
జాతి, మత, ప్రాంత, వర్ణ విభేదాలన్నీ పరమార్థంలో అసత్యమని ఉపదేశిస్తుంది. ఈ భావన దేశాన్ని అంతర్గతంగా ఏకం చేస్తుంది. ఒకే చైతన్యం అన్న భావన కలిగిన సమాజం విభజనకు లోను కాదు. శంకరుల సంచారం – కేరళ నుంచి కాశ్మీరం వరకు – ఒక జాతీయ యాత్ర. ఆ యాత్ర ఫలితమే చతురామ్నాయ, మూలామ్నాయ పీఠవ్యవస్థ.
చతురామ్నాయ, మూలామ్నాయ పీఠవ్యవస్థ శంకరుల నిర్మాణమే అని సంప్రదాయం దృఢంగా నమ్ముతుంది. చారిత్రక వాదప్రతివాదాలు పాశ్చాత్య భావదాస్య సముత్పన్నాలు. భారత ఆధ్యాత్మిక ఐక్యతపై ఆ వ్యవస్థ చూపిన ప్రభావం అనివార్యం. అద్వైతం వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఇస్తుంది; పీఠవ్యవస్థ సమాజానికి నిర్మాణం ఇస్తుంది.
అందువల్ల ఆదిశంకరుల అద్వైతం కేవలం తత్వశాస్త్రం కాదు-
అది ఆత్మనిర్భర భారతానికి ఆధ్యాత్మిక రాజమార్గం.
వ్యక్తి బ్రహ్మస్వరూపుడని తెలుసుకున్నప్పుడు దేశం దాస్యమనోభావం నుంచి విముక్తమవుతుంది.
అదే శంకరుల సందేశం. అదే చతురామ్నాయ, మూలామ్నాయ పీఠవ్యవస్థ లక్ష్యం.
అదే ఆత్మనిర్భర భారతానికి ఆధ్యాత్మిక మూలాధారం.
శంకరుల ‘‘ఆత్మ’’ నిర్భరతే ఆధునిక ‘‘ఆత్మనిర్భరత’’
జీవాత్మ–పరమాత్మ అభేదం వంటి భారత–భారతీయుల అభేదమే ఆత్మనిర్భర భారతం
‘‘ఆత్మనిర్భర భారత్‌’’ అనే నినాదం ఆధునిక భారతదేశ ఆర్థిక–సామాజిక దిశను సూచిస్తుంది. కానీ భారతీయ దృష్టిలో ‘‘ఆత్మ’’ అనే పదం కేవలం వ్యక్తిగత సామర్థ్యాన్ని మాత్రమే సూచించదు; అది ఆధ్యాత్మిక పరమార్థాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంలో ఆదిశంకరభగవత్పాదుల అద్వైతసిద్ధాంతం ఒక లోతైన ఆధ్యాత్మిక మూలాన్ని అందిస్తుంది. శంకరుల ‘‘ఆత్మనిర్భరత’’ భావన — జీవాత్మ పరమాత్మల మధ్య అభేదాన్ని ప్రకటించిన దృష్టి — ఆధునిక ఆత్మనిర్భర భారతానికి అంతరాత్మగా నిలుస్తుంది.
1. అద్వైతం — ఆత్మలోనే పరిపూర్ణత
శంకరులు ప్రకటించిన మహావాక్యార్థం:
‘‘తత్త్వమసి’’
‘‘అహం బ్రహ్మాస్మి’’
జీవుడు పరమాత్మతో వేరుకాదని అద్వైతం ప్రకటిస్తుంది.
అజ్ఞానం వల్లనే భేదభావం ఉద్భవిస్తుంది. జ్ఞానం కలిగితే అభేదసత్యం ప్రత్యక్షమవుతుంది.
ఈ సిద్ధాంతం వ్యక్తిలో ఒక మహత్తర విశ్వాసాన్ని నింపుతుంది:
నేను పరిమితుడను కాదు. నా మూలం అనంతం.
పరాధీనత నా స్వరూపం కాదు.
అనే ఈ అంతర్గత స్వావలంబనే నిజమైన ‘‘ఆత్మనిర్భరత’’.
2. వ్యక్తి–దేశ సంబంధం: తాత్త్విక సమాంతరము
ఎలాగైతే జీవాత్మ పరమాత్మల మధ్య పరమార్థంలో భేదం లేదో,
అలాగే భారతదేశం, భారతీయుల మధ్య కూడా భేదం లేదు.
దేశం అనేది భూమి మాత్రమే కాదు; అది ప్రజల చైతన్యరూపం.
భారతీయుల ఆత్మస్వరూపం, సంస్కృతి, ధర్మబోధ, విలువలు – ఇవే భారతదేశం.
అందువల్ల భారతీయుడు బలపడితే భారతం బలపడుతుంది.
వ్యక్తి ఆత్మవిశ్వాసం దేశ ఆత్మవిశ్వాసంగా మారుతుంది.
ఇది అద్వైత దృష్టిలో సామాజిక అన్వయం.
3. పరాధీనతకు మూలం — అజ్ఞానం
అద్వైతం ప్రకారం బంధనానికి కారణం అజ్ఞానం (అవిద్య).
అదేవిధంగా జాతీయ పరాధీనతకు కారణం కూడా మనసులోని దౌర్బల్యం.
‘‘మనకు సాధ్యం కాదు’’ అనే భావం, ‘‘విదేశీయులే శ్రేష్ఠులు’’ అనే మోహం
స్వసంస్కృతిపై నమ్మకం కోల్పోవడం ఇవి సమష్టి అజ్ఞానం.
శంకరుల సందేశం ఏమిటంటే —
సత్యాన్ని తెలుసుకో. నీ స్వరూపాన్ని గ్రహించు. అప్పుడు భయం తొలగిపోతుంది.
ఇదే జాతీయ స్థాయిలో ఆత్మనిర్భరతకు మూలసూత్రం.
4. అభేద భావం — ఐక్యతకు మూలం
అద్వైతం భేదాన్ని ఉపాధి ఆధారంగా మాత్రమే అంగీకరిస్తుంది.
స్వరూపంలో ఏకత్వమే.
భారతదేశంలో భాషలు, ప్రాంతాలు, ఆచారాలు వేర్వేరు. కానీ సంస్కృతి మూలం ఒకటే. ధర్మబోధ ఒకటే.
జీవాత్మ–పరమాత్మల మధ్య ఉన్న అభేదమే. భారత–భారతీయుల మధ్య ఉన్న అంతఃసంబంధానికి ప్రతీక.
ఈ భావన పెరిగితే:
ప్రాంతీయ విభేదాలు తగ్గుతాయి. మతవర్గ విభేదాలు సడలుతాయి. సామాజిక ఐక్యత బలపడుతుంది
ఇదే ఆత్మనిర్భర భారతానికి పునాది.
5. శంకరుల సంచారం — జాతీయ చైతన్యం
శంకరులు కేరళలో జన్మించి కాశ్మీరంలో శారదాపీఠాన్ని అధిరోహించారు.
పూరీ, ద్వారక, శృంగేరి, బదరీ – నాలుగు దిక్కులను సంచరించారు. అలాగే మధ్యలో కాంచీ పురం. ఈ యాత్ర కేవలం తాత్త్విక విజయం కాదు;
అది భారతీయ ఐక్యతకు సంకేతం. అందువల్ల వారి అద్వైతం కేవలం వ్యక్తిగత మోక్షసాధన కాదు;
అది సమాజ ఐక్యతకు మార్గదర్శకం.
6. ఆధునిక ఆత్మనిర్భరత — ఆధ్యాత్మిక మూలం
నేడు ఆత్మనిర్భరతను ప్రధానంగా ఆర్థిక స్వావలంబనగా చూస్తున్నారు. కానీ ఆర్థిక శక్తికి మూలం మానసిక శక్తి. మానసిక శక్తికి మూలం ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసానికి మూలం స్వస్వరూప జ్ఞానం.
అందుకే శంకరుల అద్వైతం ఆధునిక ఆత్మనిర్భర భారతానికి తాత్త్విక ఆధారం. విద్యలో స్వావలంబన, సంస్కృతిలో గౌరవభావం, విజ్ఞానంలో స్వతంత్రత, ధర్మంలో స్థిరత్వం ఇవి అన్నీ అద్వైత దృష్టిలో నుంచే ఉద్భవించగలవు.
ముఖ్యమైన విచారం
జీవాత్మ పరమాత్మల మధ్య అభేదం తెలిసినవాడు ఎప్పుడూ హీనభావంతో జీవించడు.
అలాగే భారతదేశం, భారతీయుల మధ్య ఉన్న అంతఃసంబంధం గ్రహించిన సమాజం ఎప్పుడూ పరాధీనతను అంగీకరించదు.
శంకరుల ‘‘ఆత్మ’’ నిర్భరత వ్యక్తి అంతరంగ బంధ విముక్తి.
ఆధునిక ‘‘ఆత్మనిర్భర భారత్‌’’ ‌జాతీయ అంతరంగ బంధ విముక్తి.
ఈ రెండూ వేర్వేరు కాదు. అద్వైత దృష్టిలో అవి ఒకటే.
అందుకే చెప్పవచ్చు —
శంకరుల ఆత్మనిర్భరతే ఆధునిక ఆత్మనిర్భర భారతం.
అభేద భావమే భారత భవిష్యత్తు.
చతురామ్నాయ, మూలామ్నాయ పీఠవ్యవస్థ — అద్వైత తాత్త్వికత — ఆత్మనిర్భర భారతం
శంకరదర్శనం
శంకర దర్శనం అంటే వారి ఉపదేశాలను చూడటం కాదు. వారిని చూడటం. వారిని ఎలా చూడాలో తెలియాలి అంటే ఈ ఏకాత్మతా స్తోత్రాన్ని అర్థం చేసుకోవాలి.
యం వైదికా మన్త్రదృశః పురాణాః
ఇన్ద్రం యమం మాతరిశ్వా నమాహుః।
వేదాన్తినో నిర్వచనీయమేకమ్‌
‌యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశన్తి।।
శైవాయమీశం శివ ఇత్యవోచన్‌
‌యం వైష్ణవా విష్ణురితి స్తువన్తి।
బుద్ధస్తథార్హన్‌ ఇతి బౌద్ధ జైనాః
సత్‌ శ్రీ అకాలేతి చ సిఖ్ఖ సన్తః।।
శాస్తేతి కేచిత్‌ ‌కతిచిత్‌ ‌కుమారః
స్వామీతి మాతేతి పితేతి భక్త్యా।
యం ప్రార్థన్యన్తే జగదీశితారమ్‌
‌స ఏక ఏవ ప్రభురద్వితీయః।।
‘‘స ఏక ఏవ ప్రభురద్వితీయః’’ — ఇది శంకరభగవత్పాదుల సర్వమతసమ్మత స్వరూపం
‘‘యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః… వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి’’ -ఈ వాక్యాలు భారతీయ ఆధ్యాత్మిక దృష్టిలోని విశాలతను ప్రకటిస్తాయి. వేదదృష్టికి అది ఇంద్రుడు, యముడు, వాయువు; వేదాంతికి అది నిర్వచనాతీత బ్రహ్మ; శైవునికి శివుడు; వైష్ణవునికి విష్ణువు; బౌద్ధునికి బుద్ధుడు; జైనునికి అర్హత్‌; ‌సిఖ్కుకు ‘సత్‌ శ్రీ అకాల్‌’. ‌పేర్లు భిన్నం — పరమార్థం ఒక్కటే. ‘‘స ఏక ఏవ ప్రభురద్వితీయః’’- ఆయనే ఒకడు, ద్వితీయుడు లేడు.
ఈ సమగ్ర దృష్టికి మూర్తిమంత రూపమే ఆదిశంకరభగవత్పాదులు. శంకరులు కేవలం అద్వైత తత్వాన్ని బోధించిన తాత్త్వికులు మాత్రమే కాదు; సర్వమత సమన్వయాన్ని ఆచరణలో చూపిన ఆచార్యులు. శైవుడికి ఆయన పరమ శివస్వరూపుడు; వైష్ణవునికి వేదాంతభాష్యకర్తగా నారాయణ స్వరూపుడు; శాక్తేయునికి శ్రీచక్ర ప్రతిష్ఠాపకుడిగా దేవీమయుడు; గాణాపత్యునికి గణనాథ తత్త్వప్రతిపాదకుడు; షణ్ముఖోపాసకునికి జ్ఞానశక్తి రూపమైన సుబ్రహ్మణ్య స్వరూపుడు; సౌరోపాసకునికి ‘‘జ్ఞానం ప్రకాశయతి’’ అని జ్ఞానసూర్యునిగా ప్రకాశించే తేజోమూర్తి.
అద్వైతసిద్ధాంతంలో బ్రహ్మమే సత్యం. అదే బ్రహ్మ భక్తుడి భావానుసారం అనేక రూపాలలో దర్శనమిస్తుంది. భక్తి రసంలో ‘‘శాస్తా’’, ‘‘కుమార’’, ‘‘స్వామి’’, ‘‘మాతా’’, ‘‘పితా’’ అని పిలిచే ఆ జగదీశ్వరుడు తత్త్వదృష్టిలో అభేద స్వరూపుడు. శంకరులు ఈ రహస్యాన్ని ‘‘బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః’’ అనే వాక్యసారంగా ప్రతిపాదించారు.
అందువల్ల శంకరభగవత్పాదులు స్వయంగా ఏకత్వ తత్త్వానికి ప్రతీక. ఆయనలో శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సౌర, కౌమార సంప్రదాయాలు విరోధాలు కాదు- సమన్వయ ప్రవాహాలు. షణ్మత స్థాపన భావన ఈ సమగ్రతను సూచిస్తుంది. భిన్న ఆరాధన మార్గాలు, కానీ లక్ష్యం ఒక్కటే – ఆ పరబ్రహ్మ స్వరూప దర్శనం.
భక్తుడి దృష్టిలో ఆచార్యుడు దైవం అవుతాడు. జ్ఞానదృష్టిలో దైవమే ఆచార్యుడిగా అవతరిస్తాడు. అందుకే శంకరులు వైష్ణవునికి విష్ణువుగా, శైవునికి శివునిగా, శాక్తేయునికి దేవీమయుడిగా, గాణాపత్యునికి గణపతిరూపుడిగా, షణ్ముఖారాధకునికి సుబ్రహ్మణ్యునిగా, సౌరోపాసకునికి జ్ఞానసూర్యునిగా అనుభవంలో ప్రత్యక్షమవుతారు.
పేర్లు మారినా పరమార్థం మారదు. రూపాలు భిన్నమైనా తత్త్వం ఏకం. ఆ ఏకత్వానుభూతినే శంకరులు జీవన మార్గంగా చూపించారు. అందుకే —
‘‘స ఏక ఏవ ప్రభురద్వితీయః’’
అయనే సర్వరూపుడు. ఆయనే సర్వనాముడు. ఆయనే అద్వితీయ పరబ్రహ్మస్వరూపుడు. అలాగే భారతీయులు, భారతం వేరు కాదు.

రచన : ఆచార్య రాణి సదాశివ మూర్తి,
కులపతి, శ్రీ వేంకటేశ్వర వైదిక విశ్వ విద్యాలయం, తిరుపతి

About Author

By editor

Twitter
YOUTUBE