సాధారణంగా గేమ్స్‌ను ఎటువంటి ప్రమాదం లేని వినోదంగా పరిగణించడం కద్దు. కానీ ఇటీవల టాస్క్ ఆధారిత కొరియన్‌గేమ్స్‌వల్ల చోటు చేసుకుంటున్న విషాద సంఘటనల నేపథ్యంలో జెన్‌జెడ్‌లో ఇదొక ప్రమాదకర ధోరణిగా మారుతుండటం వర్తమాన వైచిత్రి! ఇటువంటి గేమ్‌లు ఆడటం వల్ల తీవ్రస్థాయిలో ప్రమాదాలు ఎదురయ్యే అవకాశమున్నదని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ గేమ్స్ ఆడటం వల్ల కలిగే విపరిణామాల్లో మొదటిది మానసికంగా తారుమారు కావడం, తన గుర్తింపును తానే కోల్పోవడం. అంటే కొన్ని గేమ్స్, ఆడేవారిని కొరియన్‌ ‌పేర్లు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తాయి. అంటే వీటిని ఆడేది పిల్లలే కాబట్టి వారు ఆ విధంగా చేయడం వల్ల తమ ‘‘గుర్తింపునకు నిజ జీవిత సంబంధాలను కోల్పోవడం’’ జరుగుతోంది. ఫలితంగా వీరు వాస్తవిక ప్రపంచానికి దూరంగా వెళ్లిపోతున్నారు. ఇది ఏ స్థాయికి వెళుతున్నదంటే, ఒకానొక పరాకాష్ట దశలో వీరు ‘‘కొరియాయే మా జీవితం’’ అన్న స్థాయికి చేరుకొని, చివరకు తమ మూలాలు భారత్‌లో ఉన్నాయన్న సంగతిని కూడా అంగీకరించడంలేదు.

భావోద్వేగ పూరిత కథలు, సిమ్యులేషన్‌ ‌ఫార్మాట్లు మిథ్యా ప్రపంచానికి, వాస్తవిక ప్రపంచానికి మధ్య సరిహద్దును చెరిపేయడంతో, ఈ గేమ్స్‌లో పాల్గొనే వారిని పూర్తిగా డిజిటల్‌ ‌గేమ్‌ ‌మాస్టర్స్ ‌లేదా కాల్పనిక పాత్రలపై భావోద్వేగపరంగా పూర్తి స్థాయిలో ఆధారపడే దశకు తీసుకెళ్లడం ఈ గేమ్‌ల లోని ప్రత్యేకత.
విపరీతంగా చెడ్డపేరు తెచ్చుకున్న ‘‘బ్లూ వేల్‌ ‌ఛాలెంజ్‌’’ ‌గేమ్‌ ‌మాదిరిగానే అనధికారిక ‘‘కొరియన్‌ ‌వ్‌ ‌గేమ్స్’’ ‌రోజువారీగా ఇచ్చే ప్రొఫైల్‌ ‌చిత్రం మార్పు వంటి ప్రమాదరహిత టాస్క్‌లు క్రమంగా 50 రోజుల తర్వాత స్వీయహాని లేదా ఆత్మహత్యకు పురికొల్పే దశకు చేరుకుంటాయి. ఈ గేమ్స్ ‌సాధారణంగా ప్రైవేటు సోషల్‌ ‌మీడియా లింక్‌ల ద్వారా అందు బాటులో ఉంటాయి తప్ప, అధికారిక యాప్‌ల్లో కనిపించవు. ముఖ్యంగా తల్లిదండ్రులు కనిపెట్ట కుండా పిల్లలు రహస్యంగా ఈ గేమ్స్‌ను ఆడటానికి ఇదే ప్రధాన కారణం. ఆవిధంగా ఆడటానికి టీనేజర్లను ఈ గేమ్స్ ‌ప్రోత్సహిస్తాయి!
డిజిటల్‌ ‌ప్రపంచంతో మమేకం
ఈ గేమ్స్ ఆడేవారు అత్యద్భుతమైన డిజిటల్‌ ‌ప్రపంచంతో మమేకమవడం వల్ల వారిలోని మెదడు తీవ్రస్థాయి ఉద్దీపనలకు లోనవుతుంది. ఫలితంగా వారు వాస్తవ ప్రపంచంలో తమ రోజువారీ పనులు ముఖ్యంగా చదువుపై ఏవిధమైన ఆసక్తి చూపరు! తమ వయసుకు అత్యవసరమైన చదువు, ఇతర కార్యకలాపాలు వారికి ఎటువంటి సంతృప్తిని ఇవ్వవు. పిల్లలు ఈ గేమ్‌ల పేరుతో అధికసమయం స్క్రీన్‌పైనే దృష్టిని కేంద్రీకరించడం వల్ల వారి మెదడులోని ప్రీ ఫ్రంటల్‌ ‌కార్టెక్స్ ‌దెబ్బతింటుంది. ఉద్దీపనల నియంత్రణ, నిర్ణయాలు తీసుకోవడంలో ఈ భాగం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది దెబ్బతిన్న పిల్లల ప్రవర్తన ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. దీనికి బానిసలైన పిల్లలు, యువత తమకు తాము సామాజిక జీవితం నుండి విడివడి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వీరు తామే సృష్టించుకున్న డిజిటల్‌ ‌ప్రపంచంలో మునిగిపోయి, ఇతరులతో వ్యక్తిగత సంభాషణ, సంబంధాలను ఎంతమాత్రం పట్టించుకోరు.
ముగ్గురు అక్కాచెల్లెళ్ల విషాదం
ఫిబ్రవరి నెలలో ఘజియాబాద్‌కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ‘‘కొరియన్‌ ‌వ్‌గేమ్‌’’‌లో పూర్తిగా మునిగిపోయి, ఇక ఈ గేమ్‌ ‌లేకపోతే తాము బతకడం అసాధ్యమని భావించి ఆత్మహత్యకు పాల్ప డటం దేశాన్ని కుదిపేసింది. ముఖ్యంగా దేశంలోని జెన్‌జెడ్‌పై ఈ గేమ్‌ల వల్ల పడుతున్న ప్రతికూల ప్రభావం ఎంత దారుణంగా ఉంటున్నదీ ఈ సంఘటన స్పష్టం చేసింది. ముఖ్యంగా ‘‘టాస్క్’’, ‘‘‌ఛాలెంజ్‌’’ ఆధారంగా నిర్వహించే కొరియన్‌ ‌గేమ్స్‌కు ఎంత దారుణంగా బానిసలవుతున్నదీ దీని ద్వారా తెలిసినా, వెలుగులోకి రాని సంఘటనలు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. విదేశీ డిజిటల్‌ ‌సంస్కృతి మనదేశ జెన్‌జెడ్‌పై చూపుతున్న ప్రతికూల ప్రభావం నేపథ్యంలో వీటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు టీనేజ్‌ అమ్మాయిలు ‘‘కొరియన్‌ ‌లవ్‌ ‌గేమ్‌’’ ‌లేదా ‘‘కొరియన్‌ ‌లవర్‌ ‌గేమ్‌’’ ‌లేదా ‘‘వీ ఆర్‌ ‌నాట్‌ ఇం‌డియన్స్’’‌కు పూర్తిగా బానిసలైనట్టు తెలుస్తోంది. కోవిడ్‌ ‌మహమ్మారి కాలంలో మనదేశంలో విపరీతంగా విస్తరించిన ఈ గేమ్‌ను వీరు మూడేళ్లుగా ఆడుతు న్నట్టు వార్తలు వచ్చాయి. ఈ గేమ్‌పై నిర్వహించిన ప్రాథమిక విచారణ విస్తుకొలిపే నిజాలను వెల్లడించింది. ఇందులో మొత్తం 50 దశలుంటాయి. చిట్టచివరి దశలో ఆత్మహత్యకు పురికొల్పుతుంది. ఇది సరిగ్గా అత్యంత అప్రతిష్టను మూటగట్టుకున్న ‘‘బ్లూ వేల్‌ ‌ఛాలెంజ్‌’’ ‌లేదా ‘‘మొమొ ఛాలెంజ్‌’’ ‌గేమ్‌ల మాదిరిగా ఉండటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బాలికలు స్కూలుకెళ్లడం లేదా బయటకు వెళ్లడం పూర్తిగా మానేసారు. రోజువారీ జీవితాన్ని పూర్తిగా మరచి, ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా కాలం గడిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనించి, వారు ఫోన్లు వాడకుండా కట్టడి చేయడం వారిని తీవ్ర నైరాశ్యానికి గురిచేసి చివరకు ‘‘సారీ నాన్నా, కొరియాయే మా జీవితం’’ అంటూ ఒక నోట్‌ ‌పెట్టడం కంట నీరు పెట్టించింది. వీరు ఆత్మహత్యకు కూడా వెనుకాడ లేదంటే ఈ గేమ్‌ ‌వారిపై కలిగించిన ప్రభావం తీవ్రత ఎంతస్థాయిలో ఉన్నదీ అర్థం చేసుకోవచ్చు. మరో విచిత్రమేమంటే ప్రతి వారం, నలుగురు లేదా ఐదుగురు రోగులు ప్రేరణ నియంత్రణ రుగ్మతకు (ఇన్‌స్పిరేషన్‌-‌కంట్రోల్డ్ ‌డిజార్డర్‌) ‌చికిత్స నిమిత్తం వస్తున్నట్టు ఎయిమ్స్ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ ‌రిషికేష్‌ ‌వెల్లడించడం, విదేశీ సంస్కృతికి చెందిన ఈ గేమ్స్ ఎం‌తటి ప్రమాదాన్ని కలుగజేస్తున్నదీ స్పష్టం చేస్తున్నది.
టాస్క్‌లు, పాయింట్లతో ఆకర్షణ
‘‘పొప్పీ ప్లే టైమ్‌’’, ‘‘‌ది బేబీ ఇన్‌ ఎల్లో’’ వంటి ఆన్‌లైన్‌ ‌గేమ్‌లు రోజువారీ టాస్క్‌లు, పాయింట్‌లు ఇవ్వడం ద్వారా పాల్గొనేవారిని స్క్రీన్‌నుంచి కదల కుండా చేస్తున్నాయి. ఈ గేమ్‌లు భావోద్వేగపరంగా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుండటంతో వీటికి అలవాటుపడిన వారు మళ్లీ వెనక్కి రాలేకపోతున్నారు. ఈ గేమ్‌ల్లో చూపించే ‘‘మిథ్యా వాస్తవికత’’ కొరియాకు సంబంధించినదై ఉండటంతో గేమ్‌లో పాల్గొనేవారు క్రమంగా తమను తాము కొరియన్లుగా భావించు కోవడం మొదలవుతోంది. ఫలితంగా వారు తమ చుట్టుపక్కల ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయి, తమను తాము ఒంటరి చేసుకొని చివరకు తీవ్రస్థాయి నిర్ణయాలు తీసుకునే దశకు చేరుకుంటున్నారు. ఈ గేమ్‌లు మెదడులో ఆనందానికి, సంతోషానికి కారణమయ్యే భాగాలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగించి, నిరంతరం తీవ్ర డిప్రెషన్‌కు, ఉద్వేగానికి గురిచేస్తాయి. ఫలితంగా టీనేజ్‌ ‌పిల్లలో విపరీతమైన మూడ్‌ ‌స్వింగ్‌లు, క్షణికావేశానికి గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని మానసిక వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అదీకాకుండా ఈ గేమ్‌లు మామూలుగా అధికారిక యాప్‌ల్లో ఉండవు కనుక, వీటిని రహస్యంగా వీక్షించడంవల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య సంఘర్షణలు జరుగుతున్నాయి.
అభిమానుల కోసం అడ్డదారులు
కొరియన్‌ ‌సంస్కృతిలో ‘‘కె-పాప్‌’’,‘‘‌కె-డ్రామాస్‌’’ ‌వంటి గేమ్‌లు చాలా సానుకూలతతో ఉంటాయి. ఇవి చాలా ప్రాచుర్యం పొందడంతో, ప్రమాదకర మైన రహస్య గేమ్‌లు రంగప్రవేశం చేశాయి. ముఖ్యంగా ఎక్కువమంది అభిమానులను సంపా దించాలన్న లక్ష్యంతో వీటి రూపకల్పన జరుగుతుంది. ఈ గేమ్‌ల్లో మునిగిపోయిన జెన్‌జెడ్‌లు కొరియన్‌ ‌సెలబ్రిటీలు లేదా వర్చువల్‌ ‌పార్ట్‌నర్స్‌తో ఏకపక్షంగా భావోద్వేగపరమైన బంధాలను ఏర్పరచుకోవడం క్ర మంగా వారిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఇదే సమయంలో హాని కలిగించే కారకాలు కూడా వీరిని ఇందుకు ప్రోత్సహిస్తుండటం దారుణం. ఇదిలా ఉండగా ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వ్యక్తమవ డమే కాకుండా, ఈ గేమ్‌లను నిషేధించాలన్న డిమాండ్‌లు ఊపందుకున్నాయి. 16 సంవత్సరాల లోపు పిల్లలపై గట్టి నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమ య్యాయి. ఐటీ చట్టం కింద భారత ప్రభుత్వం ఇప్పటికే పబ్జీ/బీజీఎంఐ వంటి చాలా యాప్‌లను నిషేధించింది. అయితే ఈ నిషేధం నేపథ్యంలో వీపీఎన్‌ ‌లేదా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో, ఏవిధమైన పరిశీలన లేని వర్షన్స్‌ను జెన్‌జెడ్‌ ‌డౌన్‌లోడ్‌ ‌చేసుకుంటున్నారనేది నిపుణులు చెప్పే మాట. ఈ నేపథ్యంలో పిల్లలు స్క్రీన్‌లను వీక్షించే సమయం ఎక్కువగా ఉండటం, పేర్లను మార్చుకోవడం, ఒంటరిగా ఉండటం వంటి అంశాలపై దృష్టిపెట్టి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక వైద్యులు, పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.


2020 ‌నుంచి దక్షిణ కొరియా డెవలపర్స్ ‌భారత్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. క్రాఫ్టన్‌ ఇం‌డియా ఇంక్యుబేటర్‌ ‌పోగ్రామ్‌ ‌ద్వారా 200 మిలియన్‌ ‌డాలర్లు పెట్టుబడులు పెట్టారంటే ఈ గేమ్‌లకు మనదేశంలో ఎంతటి ఆదరణ ఉన్నదీ అర్థమవుతుంది.కొరియన్‌ ‌గేమ్స్ ‌వీడియోల రూపంలో ఉంటాయి. వీటిని దక్షిణ కొరియాకు చెందిన ఒక గ్లోబల్‌ ‌హబ్‌… ‌మొబైల్‌, ‌పీసీ గేమింగ్‌ ‌పరిశ్రమలకోసం రూపొందించింది. 2010లో భారత్‌లోకి ప్రవేశించిన ఈ గేమ్స్ ‌విపరీత ప్రాచుర్యం పొందాయి. మనదేశంలో మంచి ఆదరణ పొందిన గేమ్స్ ఈవిధంగా ఉన్నాయి.
– బ్యాటిల్‌ ‌గ్రౌండ్స్ ‌మొబైల్‌ ఇం‌డియా: బీజీఎంఐ ఇండియా వర్షన్‌ 2021‌లో విడుదలైంది.
– పబ్జీ మొబైల్‌: ‌దీన్ని ద.కొరియా కంపెనీ క్రాఫ్టన్‌ అభివృద్ధి చేసింది. మనదేశంలో బాగా పాపులర్‌ అయింది. 200మిలియన్ల మంది దీన్ని ఆడతారు. 2018లో గ్లోబల్‌ ‌లాంచ్‌తో ఇండియాలో ప్రవేశించింది.
– రోడ్‌ ‌టు వాలొర్‌-ఎం‌పైర్స్: ‌దీన్ని కూడా క్రాఫ్టన్‌ ‌కంపెనీ అభివృద్ధి చేసింది. భారతీయ కంటెంట్‌ ఉం‌డటం దీని ప్రత్యేకత.
– సోలో లెవెలింగ్‌-అరైజ్‌: ఇది యాక్షన్‌ ఆర్‌పీజీ. కొరియాలో బహుళ ప్రాచుర్యం పొందిన వెబ్‌టూన్‌ ఆధారంగా దీన్ని రూపొందించారు. 2024లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
– కూకీ రన్‌-‌కింగ్‌డమ్‌: ‌దేవ్‌సిస్టర్స్ ‌రూపొందించిన పాపులర్‌ ‌మొబైల్‌ ఆర్‌పీజీ. భారత్‌లో దీన్ని పబ్లిష్‌ ‌చేసేందుకు ఇటీవల ఇందులో క్రాఫ్టన్‌ ‌భాగస్వామి అయింది.
– ఇంటరాక్టివ్‌ ‘‘‌వ్‌ ‌గేమ్స్’’: ‌కొరియన్‌ ఇతివృత్తంతో కూడిన రొమాన్స్ ‌లేదా సిమ్యులేషన్‌ ‌గేమ్స్ ‌వంటివి.
– కె-పాప్‌ ‌డేటింగ్‌ ‌గేమ్‌ ‌లేదా కొరియన్‌ ‌గేమ్స్: ఇన్‌ఫినిట్‌ (‌ఛాట్‌ ‌సిస్టమ్స్ ‌లేదా 3డి స్టోరీలైన్స్.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE