మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
‘ఇచ్చి పుచ్చుకోండి’- ఇదీ ఈ సంవత్సర ప్రచార అంశం.
ఏటా మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం. ప్రతీ సంవత్సరమూ ఒక్కో అంశానికి ప్రధాన స్థానం. మరి ఇప్పటి థీమ్ ఏం చెప్తోంది?, ఏం ఇవ్వాలి, ఏది అందుకోవాలి…. మన దేశ నేపథ్యంలో చెప్పాలంటే స్త్రీలకు మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా వర్తించిత తీరాల్సిన కీలక సూత్రం ఇది.
నిరుటి అంశం : వనితాభ్యుదయ సాధనకు వేగం పెంచు. ఇందులో భాగమా అన్నట్లు- ఇప్పుడు ఇక మర్యాద గురించిన ప్రస్తావన. ఆ మాటకొస్తే… ప్రతీ ఒక్కరికీ గౌరవం ఇచ్చినపుడే, తిరిగి అందుతుంది. మహిళలు అనేసరికి మర్యాదా మన్ననా అనేది ముఖ్యపాత్ర వహిస్తుంది సర్వసహజంగా.
మహిళా దినోత్సవ ప్రకటన ఇప్పటిది కాదు. అంతర్జాతీయంగా నూట పదకొండు ఏళ్లనాటిది. అమెరికా, జర్మనీ, ఆస్ట్రియా, డెన్మార్క్, స్విస్; అటు తర్వాత రష్యా, చైనా, స్పెయిన్, మరెన్నో దేశాలు ఇందులో భాగమయ్యాయి.
ఒక దేశానికో, సిద్ధాంతానికో, భావజాలానికో పరిమితమైపోకుండా స్థూల అర్థంలో పరిశీలిస్తే – ఇంటా బయటా పడుతుంది మరింత బాధ్యతాయుతపాత్ర. బాధ్యతగా ఉంటారు కాబట్టే వారికి గౌరవం ఇవ్వండి, వారి నుంచి గౌరవాన్ని పొందండి అంటోంది అంతర్జాతీయ సమాజం.
బాధ్యత ఉన్నచోటనే హక్కులూ ఉంటాయి. ఇవి కలివిడిగా ఉండేవే కానీ విడదీయటానికి వీలు పడనవి. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ‘మర్యాద ఇవ్వండి’ దగ్గరే ఆగిపోయామా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది ఎవరికి వారే! ప్రత్యేకించి భారత్‌లో నేటి సందర్భాన్ని అనుసరించి అంతా కోరుతోంది ‘బాధ్యతాయుత సాధికారత’నే.
ఒకే ఒక అక్షరం ‘స్త్రీ’. తెలుగులో పర్యాయ పదాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ చాలా మటుకు విశేషణాలు.
అతివ, ఇంతి, కాంత, చెలి, తరుణి, నారి, నాతి, మగువ, ముద్రిత, వెలది, ఇంకా ఎన్నెన్నో పేర్లు. ఆడది, అబల వంటి పదాలు ఏ సమాజమూ అంగీక రించనవి. గృహిణిని ఆంగ్లంలో హోమ్‌మేకర్ అంటున్నాం. ఆమె బాధ్యతనీ అధికారాన్నీ ప్రతిఫలించే మాట.
ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ; మర్యాదను ఇచ్చిపుచ్చుకోండి, మహిళను గౌరవంగా చూసి ఆమె నుంచి గౌరవాన్ని పొందండి అనాల్సిన పరిస్థితి నేటికీ ఉందంటే… పూర్వాపరాల ఆలోచన చేయాల్సిందే.
అది 1910. విశ్వవ్యాప్త మహిళా సదస్సు ఏర్పా టైంది. తదుపరి వత్సరంలో కొన్ని దేశాల్లో మార్చి నెలలోనే వనితా దినోత్సవాలయ్యాయి. వారి శ్రమశక్తికి గమనింపు, గుర్తింపు, గౌరవం, ఆదరం లభించాలన్న నినాదాలు మారుమోగాయి.
శాంతి, హక్కులు అనే రెండూ అనంతర కాలంలో ప్రాచుర్యం అందుకున్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన సర్వప్రతినిధి సభ పిలుపునివ్వడంతో ప్రపంచ మహిళా దినోత్సవ నిర్వహణ మార్చి 8గా ఖాయమైంది.
ఆ పిలుపు వెలువడి దరిదాపు అర్థశతాబ్ది!
భారతదేశానికి సంబంధించి-
కెప్టెన్ లక్ష్మీ సెహగల్‌ను గుర్తు చేసుకోవాలి అందరూ.
నేతాజీ స్థాపిత ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా దళ ప్రముఖురాలు.
నాయకురాలిగా కెప్టెన్. వృత్తిపరంగా వైద్యసేవ.
ఝాన్సీ రెజిమెంట్‌కు కీలక ప్రాతినిధ్యం వహించిన నారీమణి.
నేతాజీ కుడిభుజమై
స్వాతంత్య్ర క్షేత్రానికి – జాతిని నడిపిన
దివ్య జ్యోతి, వీరఝాన్సీ స్ఫూర్తి!
అప్పట్లో స్త్రీ లోకాన్ని ఏకీకృతం చేసిన నేతల్లో ఒకరు ఆమె.
శ్రమకు ఫలితం ఉండాలన్న నినాదంతో సంఘటితపరిచారు.
ఏటేటా నేపథ్య అంశాలను ఐరాస ప్రకటిస్తూ వస్తోంది. అవి ఇవీ :
1996 గత అవగాహన, భావి కార్యాచరణ
1997 శాంతి సామరస్య సాధన
1998 హక్కుల గుర్తింపు, పాటింపు.
1999 స్త్రీలపై హింస నివారణ
2000 వనితా ప్రపంచ సమన్వయం
తదుపరి ఈ పాతికేళ్లలో… నారీ లోకానికి అవకాశాల కల్పన, సమత్వ భావన, నిర్ణయశక్తిని వేగవంతం చేయడం, బాలికల సంరక్షణ, సమాన అవకాశాల లభ్యత, సాంకేతికతలో మరింత ముందడుగు, గ్రామీణ వనితలపై చూపు సారింపు, అందరినీ శక్తిమంతంగా రూపుదిద్దడం, సృజనాత్మ కతకు చోటు, నవీన ఆవిష్కరణలు, ఇంకెన్నో థీమ్‌ల పరంపర.
2011కు విశేష ప్రాధాన్యం ఉంది. ఆ ఏడాదిన వనితా దినోత్సవం వంద దేశాల్లో జరిగింది. ‘వంద’ ఎందుకంటే, సరిగ్గా అంత చారిత్రక నేపథ్యక్రమం ఉండటమే. అంటే అది శతవసంతోత్సవ ఘట్టం!
‘దినోత్సవం కాదు, మాసోత్సవం’ అంది ఒక దేశం, మరో దేశం ప్రత్యేక నాణేన్ని విడుదల చేసింది. వేడుకల్లో భాగంగా, వేలాది మైళ్ల ప్రయాణం అంటూ నాన్‌స్టాప్ విమానాన్ని నడిపింది వేరొక దేశం. ఆ వేరొక ఆ మరేదో కాదు-సాక్షాత్తు మన దేశమే!
దేశవ్యాప్తంగా పలుచోట్ల సమస్యల పరిష్కార కేంద్రాలను స్థాపించింది భారత ప్రభుత్వ నిర్వహణ లోని మహిళాభివృద్ధి మంత్రిత్వశాఖ.
వనితల సాధికారతకు పనిచేసే శాఖ ఇదే. దీనికి రెండు దశాబ్దాల ప్రత్యేక చరిత్ర. విద్య, ఆరోగ్యం, పోషణ, పరిరక్షణ, ఆర్థిక స్వావలంబన, ఇతరత్రా కూడా కార్యక్రమాలు చేపడుతోంది.
వ్యవసాయం, కళారంగం, పరిశ్రమలు, వాణిజ్య వ్యవహారాలు, ఉపాధి శిక్షణ, ఆర్థిక అంశాలు, వైద్యసేవలు, కుటుంబ సంక్షేమం, నిర్వహణ వంటి అనేకానేక రంగాల్లో స్త్రీల స్థితిగతులను పరిశీలి స్తుంటుందీ మంత్రిత్వ విభాగం. కమిటీలు, కమిషన్లు, చట్టబద్ధంగా గల ఇతర సంస్థలు, స్వయంప్రతిపత్తి వర్తించేవి, సంబంధిత సొసైటీలన్నీ దీనిలోనివే. పథకాల రూపకల్పన, సమగ్ర ఆచరణ, విశ్లేషణ, సమన్వయ విధులు నిర్వర్తిస్తుంటుందీ శాఖ.
జాతీయ మహిళా కమిషన్, హక్కుల పరిరక్షణ సంస్థ, సామాజిక సంక్షేమ పరికల్పన, సాధికారతా మిషన్… ఇలా అనేకం ఉన్నాయి. పనులు నిర్వర్తిస్తూన్నాయి.
సాధికారతకు అర్థం – నిర్ణయశక్తి. అన్నింటా తగినంత ప్రాతినిధ్యం ఉండటం, సమాజ వికాసంలో భాగస్వామ్యం కావడం. రాజకీయ సాధికారత కాగితాలకే పరిమితం కాకూడదు. సాంస్కృతికంగా అది వైరుధ్యాలకు దారితీయకూడదు. ఇప్పటి సమాజంలో ‘వనితా సాధికారత ఎందుకు?’ అని ప్రశ్నించే వాళ్లున్నారు. ‘మరీ ఇంత సాధికారతా’ అంటూ దీర్ఘాలు తీసేవారూ ఉన్నారు. ‘ఆడపెత్తనం’ అని ఈసడించే వ్యక్తులూ కనిపిస్తున్నారు. అణగి మణిగి ఉండాలని శాసించే ప్రబుద్ధులూ ఉన్నారు నేటి వ్యవస్థలో. నియంత్రణ ఎప్పుడని అడిగేవారూ సరేసరి!
ఎందరు ఎన్ని విధాలుగా భావిస్తున్నా, కొన్ని ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానాలు లేవు. రావు,
1. స్త్రీని చిన్న చూపు చూడటమనేది కొందరి సహజ లక్షణమా, కాదా?
2. నిందలు, దూషణలు స్త్రీ ఆధారంగా జరుగుతున్నాయా, లేదా?
3. నేరాలూ, ఘోరాలూ స్త్రీల మీద నానాటికీ పెరగడం లేదా?
4. కించపరిచే ధోరణికి కొందరు అలవాటు పడటమనేది నిజమా, కాదా?
నాదాలూ నినాదాలకు కొదవలేదు ఇక్కడైనా, ఎక్కడైనా! మహిళా దినోత్సవం అనేగానే ప్రపంచ మంతా తక్షణ స్పందనతో నిండుతుంది. సందేశాలూ, ఉపదేశాలూ టన్నులకొద్దీ పుట్టుకొస్తాయి. దేశంలోనూ ఊరూ వాడా సభలూ సమావేశాలతో హోరెత్తుతాయి. ఇవన్నీ ఈ అన్నీ ఎప్పుడంటే, ఒక్క రోజువరకే! దినోత్సవం అనేది నిత్యోత్సవం కానంతవరకూ పరిస్థితి ఇలాగే ఉంటుంది.
రాజ్యాంగ అధికరణలు ఎన్నెన్నో చెప్తున్నాయి. వనితలకు ప్రత్యేక సదుపాయాలు ఉండాలని, ఉపాధి అవకాశాలు విస్తృతం కావాలని, సామాజిక భద్రత విస్తరించాలని, జీవనభద్రత చట్టనిబంధనలకు సరిసమానమవ్వాలనీ… వివరిస్తూన్నాయి. జాతీయ స్థాయిన మహిళా విధానమంటూ ఉంది. మిలీనియం అభివృద్ధి లక్ష్యాల్లో వనితలకు సంబంధించినవి అనేకానేకం. ఎన్నో కమిటీలు ఎన్నెన్నో సూచన లిచ్చాయి, ఇస్తున్నాయి. అయినా, వనితల భద్రత, సాధికారతలు ఇవాళ్టికీ ప్రశ్నార్థకాలుగా మిగిలి పోతున్నాయి. తెలియనిదెవరికి?
పడతి మీద హత్యాచారం జరిగితే… పత్రికలూ ప్రసార సాధనాలూ ఘోషిస్తాయి. నిరసనలు వెల్లువెత్తు తాయి. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తపరుస్తుంటారు. పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటారు. న్యాయస్థానాల తీర్పులు కొన్ని తమవంతు పాత్రను పోషిస్తుంటాయి.
నేరగాళ్లు బహిరంగంగా తిరుగుతుంటారు. పోలీసులకు మాత్రం కనిపించరు! ఆ నేరగాళ్లే ప్రచార ప్రసార రంగాల్లో ప్రత్యక్షమై విజయ చిహ్నం. చూపుతుంటారు. ఏం జరిగిందో అంతు పట్టక, ఏది జరగనుందో ఊహకైనా తట్టక సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతుంటారు. వీటన్నింటి నట్టనడుమ మిణుకుమిణుకుమంటూ ఉంటుంది వనితా భద్రత!
స్థానికం, ప్రాంతీయం, జాతీయం, అంతర్జా తీయం… ఏ స్థాయిలోనైనా, ఏ దశలో అయినా స్త్రీని గౌరవించడమనేది ప్రచారాలతో రాదు. ఏడాదిలో ఒక రోజున ఉత్సవం అంటూ ఉత్సాహం ప్రదర్శిస్తే, స్త్రీలకు ఒనగూడేది ఏదీ ఉండదు. అలా అని స్త్రీలు సాధికారతకు సంబంధించి సొంత నిర్వచనాలు వల్లించడం అన్ని సందర్భాల్లోనూ శోభించదు.
‘లలనా! నీవు లేని జగతిలో దీపాలు వెలుగునా’ అంటాడో కవి. ‘నీ శ్రమ అంచనాలకు అందునా’ అనీ వర్ణిస్తాడు. ఈ వాక్యాల వెనక ఉన్న అంత ర్లీనతను సవ్యంగా అర్థం చేసుకున్న వ్యక్తులు ఉన్నపుడే- మహిళా సాధికారత ప్రత్యక్షమవుతుంది. అది కొరవడితే వనితా దినోత్సవ నిర్వహణ వార్షిక తంతుగానే మిగిలిపోతుంది.
కావాల్సింది, కోరాల్సిందీ, కలకాలం నిలబెట్టు కోవాల్సిందీ వనితల బాధ్యతాయుత సాధికారతనే! అది అందరి చేతుల్లో, చేతల్లో ఉంది, ఉంటుంది.

జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్