సమతుల్య దృష్టి ఏమిటంటే –
వారు విశేష సంస్కారసంపన్నులు; అయినా వారు మానవులే.
మనమూ మానవులమే; కాబట్టి ఆత్మసాధనకు మనకూ అవకాశముంది.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో బాలజ్ఞానుల కథలు కేవలం పురాణ రమ్యత కాదు; అవి మనసును ఉన్నత లక్ష్యాల వైపు మలిచే చిహ్నాలు. కారణజన్ములైన మహనీయులను మనతో పోల్చి ‘‘ఇది కల్పితం’’ అని తిరస్కరించడం సబబు కాదు. అదే సమయంలో, వారిని అందనంత దూరంలో ఉంచి మనసాధనను వదిలేయడం కూడా తగదు.
వారి జీవితం ఒక సూత్రాన్ని చెబుతుంది –
జ్ఞానం వయస్సుపై ఆధారపడదు; సంస్కారంపైనే ఆధారపడుతుంది.
సాధన ఎప్పుడైనా ప్రారంభించవచ్చు; ఫలితం ఈ జన్మలో కాని మరొక జన్మలో కాని వికసించ వచ్చు.
అందుకే భారతీయ దృష్టిలో బాలజ్ఞానులు అసంభవం కాదు – వారు సంస్కారం, సాధన, దైవానుగ్రహ సమన్వయముల ఫలితాలు.
చతురామ్నాయ పీఠాలు – కాంచీ కామకోటి పీఠం – అద్వైతం, ఆత్మనిర్భర భారత దృష్టి
చతురామ్నాయ, మూలామ్నాయ పీఠవ్యవస్థ – శంకరభగవత్పాదుల నిర్మాణమే, ఆదిశంకరుల అద్వైతం-ఆత్మనిర్భర భారతానికి ఆధ్యాత్మిక మూలాధారం.
భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఆదిశంకరభగవ త్పాదుల అవతరణం ఒక మహత్తర సంధికాల ఘట్టం. భారతదేశ చరిత్రలో కొన్ని మహనీయులు కాలాన్ని మలిచారు. వారిలో ఆదిశంకరభగవత్పా దులు అగ్రగణ్యులు. ఉపనిషత్తుల అద్వైతసారాన్ని స్పష్టంగా ప్రతిపాదించి, వేదప్రామాణ్యాన్ని పునరుద్ధ రించి, దేశవ్యాప్తంగా సంచరించి తాత్త్విక ఐక్యతను స్థాపించిన మహోన్నత కర్తృత్వం శంకరులది. వారి ఆవిర్భావం కేవలం తాత్త్విక పరిణామం మాత్రమే కాదు; అది సాంస్కృతిక, ఆధ్యాత్మిక, జాతీయ పునర్ని ర్మాణ ఉద్యమం. ఆ పునర్నిర్మాణానికి సంస్థాగత రూపం చతురామ్నాయ పీఠవ్యవస్థ. ఈ వ్యవస్థ శంకరుల నిర్మాణమే అనే దృఢనిశ్చయంతో చూస్తే, అద్వైత వేదాంతం భారత ఆత్మనిర్భరతకు మూలా ధారమని స్పష్టమవుతుంది.
ఈ తాత్త్విక పునరుజ్జీవనానికి శాశ్వతత్వం కలిగించేందుకు వారు సంస్థాగత నిర్మాణాన్ని సమకూర్చారు. సంప్రదాయంగా అంగీకరించిన శృంగేరి, ద్వారకా, పురీ, జ్యోతిర్మఠ రూపమైన చతురామ్నాయ పీఠవ్యవస్థ భారతదేశాన్ని నాలుగు దిక్కులుగా ఆధ్యాత్మికంగా ఏకం చేసిన నిర్మాణశిల్పం.
ఈ పరంపరలోనే కాంచీ కామకోటి పీఠం కూడా విశిష్ట స్థానాన్ని పొందింది. దక్షిణ భారత ఆధ్యాత్మిక–శాస్త్రపరంపరలో కాంచీ ఒక ప్రాచీన విద్యాక్షేత్రం. వేద, ఆగమ, శాస్త్ర సంప్రదాయాల సంగమస్థలంగా అది చిరకాలంగా కీర్తి పొందింది. సంప్రదాయ విశ్వాసం ప్రకారం శంకరభగవత్పాదుల కృపా పాత్రంగా కామకోటి పీఠం అద్వైత సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ భారతీయ చైతన్యానికి మార్గదర్శకత్వం వహించింది. చారిత్రక చర్చలు ఉన్నా, ఆధ్యాత్మిక ప్రభావం విషయంలో కాంచీ పీఠం భారతదేశంలో అద్వైత ధర్మబోధకు ప్రముఖ కేంద్రమైనది అనేది నిర్వివాదం.
అద్వైతం ప్రకటించిన మహావాక్యం – అహం బ్రహ్మాస్మి – వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. తత్త్వమసి- సమష్టి ఐక్యతను సూచిస్తుంది. జీవాత్మ–పరమాత్మల మధ్య అభేదసత్యం ఎలాగైతే పరమార్థం, అలాగే భారతదేశం, భారతీయుల మధ్య ఉన్న అంతఃసంబంధం కూడా అభేదమే. ఈ భావన వ్యక్తిని హీనభావం నుంచి, సమాజాన్ని విభజన నుంచి, దేశాన్ని పరాధీనత నుంచి విముక్తం చేస్తుంది.
చతురామ్నాయ పీఠాలు, కాంచీ కామకోటి పీఠం కలిసి భారతదేశాన్ని భౌగోళికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడ కట్టిపడేసిన కేంద్రాలుగా నిలిచాయి. వేదపారంపర్యం, గురుశిష్య సంబంధం, శాస్త్రసంరక్షణ – ఇవన్నీ ఈ పీఠాల ద్వారా నిరంత రాయంగా కొనసాగాయి. ఈ సంస్థాగత ఐక్యతకు మూలం అద్వైత తాత్త్విక దృష్టి; ఆ దృష్టికి మూలం ఉపనిషత్తుల అభేదసత్యం.
అందువల్ల శంకరుల ఆత్మనిర్భర దృష్టి – వ్యక్తి అంతరంగ స్వాతంత్య్రం – పీఠవ్యవస్థ ద్వారా ఏర్పడిన సమాజ ఐక్యత-ఈ రెండూ కలిసి ఆధునిక ఆత్మనిర్భర భారతానికి ఆధ్యాత్మిక పునాది. ఈ వ్యాసం ఆ అభేద దృష్టిని, చతురామ్నాయ, కాంచీ కామకోటి పీఠాల పాత్రను, అద్వైతం ద్వారా వ్యక్తి-దేశ సమగ్రతను పరిశీలించడానికి ప్రయత్నిస్తుంది.
1. కాలపరిమాణంలో శంకరుల అవసరం
శంకరుల అవతరణ సమయానికి భారతదేశం తాత్త్వికంగా విభిన్న దారుల్లో విస్తరించింది. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సౌర, కౌమార సంప్రదాయాలు వేర్వేరు ఆరాధనలతో విభజితమై ఉన్నాయి. వేదమూలాధారం ఉన్నా, సమన్వయ దృష్టి తగ్గింది. ఈ నేపథ్యంలో శంకరులు అవతరించి: వేదప్రామాణ్యాన్ని స్థాపించారు. ఉపనిషత్తుల అద్వైతసారాన్ని వెలికి తీశారు. భాష్యరచనల ద్వారా శాస్త్రసంప్రదాయాన్ని క్రమబద్ధీక రించారు. దేశవ్యాప్తంగా సంచరించి తాత్త్విక ఐక్యతను ప్రతిష్ఠించారు. ఈ కార్యాచరణకు శాశ్వతత్వం కలిగిం చేందుకు సంస్థాగత నిర్మాణం అవసరం. అదే చతురామ్నాయ, మూలామ్నాయ పీఠవ్యవస్థ.
2. చతురామ్నాయ పీఠాలు – జాతీయ ఐక్యతకు ధార్మిక రూపకల్పన
సంప్రదాయ ప్రకారం శంకరులు నాలుగు దిక్కులలో నాలుగు పీఠాలను స్థాపించారు:
శృంగేరి-దక్షిణామ్నాయము
(యజుర్వేద సంబంధం)
ద్వారకా-పశ్చిమామ్నాయము
(సామవేద సంబంధం)
పురీ- తూర్యామ్నాయము (ఋగ్వేద సంబంధం)
జ్యోతిర్మఠ/బదరీ- ఉత్తరామ్నాయము
(అథర్వవేద సంబంధం)
శ్రీ కాంచీపుర కామాకోటి – మూలామ్నాయము
ఈ వ్యవస్థలో గంభీరమైన ఆలోచన దాగి ఉంది. భారతదేశాన్ని కేవలం భౌగోళికంగా కాదు, ఆధ్యాత్మి కంగా ఒకటిగా నిలపడం. నాలుగు దిక్కులలో నాలుగు వేదప్రవాహాలు ప్రవహిస్తూ, ఒకే అద్వైత సిద్ధాంతాన్ని పరిరక్షించాలి-ఇదే శంకరుల సంకల్పం.
ఇది కేవలం మఠస్థాపన కాదు; ఇది ఒక ఆధ్యాత్మిక పరిపాలనా వ్యవస్థ. ప్రతి పీఠం ఒక వేదాన్ని, ఒక మహావాక్యాన్ని, ఒక సంప్రదాయాన్ని పరిరక్షిస్తుంది. ఈ విధంగా దేశం మొత్తాన్ని ఒకే తాత్త్విక దారంలో కట్టిపడేసింది.
3. అద్వైతం – ఆత్మనిర్భరతకు మూలతత్త్వం
అద్వైత వేదాంతం ప్రధాన సూత్రం:
‘‘బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః’’
ఈ సిద్ధాంతం వ్యక్తిలో భయాన్ని తొలగిస్తుంది. ఎందుకంటే అతడు పరబ్రహ్మస్వరూపుడే. ఆత్మ విశ్వాసం, స్వాభిమానము, స్వాతంత్య్రభావం – ఇవి అద్వైతానుభూతి నుంచి ఉద్భవిస్తాయి.
ఆత్మనిర్భర భారతం అంటే కేవలం ఆర్థిక స్వావ లంబన కాదు. అది సాంస్కృతిక, ఆధ్యాత్మిక, మానసిక స్వాతంత్య్రం.
అద్వైతం చెబుతుంది: మనం పరాధీనులం కాదు. మన మూలం పరబ్రహ్మ. జ్ఞానం మన అంతరంగం లోనే ఉంది.
ఈ భావన వ్యక్తిని లోపల నుంచి బలపరుస్తుంది. వ్యక్తి బలపడితే సమాజం బలపడుతుంది; సమాజం బలపడితే దేశం బలపడుతుంది.
4. చతురామ్నాయ, మూలామ్నాయ పీఠాలు – ఆత్మనిర్భర భారతానికి నిర్మాణ శిల్పం
శంకరులు కేవలం తత్వవేత్త కాదు; వారు దూరదృష్టి గల సంస్కృతిశిల్పి. పీఠాల ద్వారా వేదాధ్యయన పరంపర కొనసాగింది. సంస్కృతం, శాస్త్రాలు, ధర్మసూత్రాలు పరిరక్షించబడ్డాయి. గురుపరంపర నిరంతరత్వం పొందింది. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఏర్పడింది.
ఈ వ్యవస్థ వల్ల:
విదేశీ ఆలోచనల ఒత్తిడిలో కూడా వేద సంప్రదాయం నిలిచింది. భిన్నమతాలు ఉన్నా, వేదాధారిత ఐక్యత నిలిచింది.
ఆధ్యాత్మిక కేంద్రాలు దేశ ఐక్యతకు మూలస్తంభా లయ్యాయి. ఇది ఆత్మనిర్భరతకు సాంస్కృతిక ఆధారం.
5. అద్వైతం- జాతీయ చైతన్యానికి అంతరాత్మ
అద్వైతం భేదాలను తొలగిస్తుంది.
జాతి, మత, ప్రాంత, వర్ణ విభేదాలన్నీ పరమార్థంలో అసత్యమని ఉపదేశిస్తుంది. ఈ భావన దేశాన్ని అంతర్గతంగా ఏకం చేస్తుంది. ఒకే చైతన్యం అన్న భావన కలిగిన సమాజం విభజనకు లోను కాదు. శంకరుల సంచారం – కేరళ నుంచి కాశ్మీరం వరకు – ఒక జాతీయ యాత్ర. ఆ యాత్ర ఫలితమే చతురామ్నాయ, మూలామ్నాయ పీఠవ్యవస్థ.
చతురామ్నాయ, మూలామ్నాయ పీఠవ్యవస్థ శంకరుల నిర్మాణమే అని సంప్రదాయం దృఢంగా నమ్ముతుంది. చారిత్రక వాదప్రతివాదాలు పాశ్చాత్య భావదాస్య సముత్ప న్నాలు. భారత ఆధ్యాత్మిక ఐక్యతపై ఆ వ్యవస్థ చూపిన ప్రభావం అనివార్యం. అద్వైతం వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఇస్తుంది; పీఠవ్యవస్థ సమాజానికి నిర్మాణం ఇస్తుంది.
అందువల్ల ఆదిశంకరుల అద్వైతం కేవలం తత్వశాస్త్రం కాదు-
అది ఆత్మనిర్భర భారతానికి ఆధ్యాత్మిక రాజమార్గం.
వ్యక్తి బ్రహ్మస్వరూపుడని తెలుసుకున్నప్పుడు దేశం దాస్యమనోభావం నుంచి విముక్తమవుతుంది.
అదే శంకరుల సందేశం. అదే చతురామ్నాయ, మూలామ్నాయ పీఠవ్యవస్థ లక్ష్యం.
అదే ఆత్మనిర్భర భారతానికి ఆధ్యాత్మిక మూలాధారం.
శంకరుల ‘‘ఆత్మ’’ నిర్భరతే ఆధునిక ‘‘ఆత్మ నిర్భరత’’
జీవాత్మ-పరమాత్మ అభేదం వంటి భారత-భారతీయుల అభేదమే ఆత్మనిర్భర భారతం-
‘‘ఆత్మనిర్భర భారత్’’ అనే నినాదం ఆధునిక భారతదేశ ఆర్థిక-సామాజిక దిశను సూచిస్తుంది. కానీ భారతీయ దృష్టిలో ‘‘ఆత్మ’’ అనే పదం కేవలం వ్యక్తిగత సామర్థ్యాన్ని మాత్రమే సూచించదు; అది ఆధ్యాత్మిక పరమార్థాన్ని సూచిస్తుంది. ఈ సంద ర్భంలో ఆదిశంకరభగవత్పాదుల అద్వైతసిద్ధాంతం ఒక లోతైన ఆధ్యాత్మిక మూలాన్ని అందిస్తుంది. శంకరుల ‘‘ఆత్మనిర్భరత’’ భావన – జీవాత్మ పరమాత్మల మధ్య అభేదాన్ని ప్రకటించిన దృష్టి – ఆధునిక ఆత్మనిర్భర భారతానికి అంతరాత్మగా నిలుస్తుంది.
1. అద్వైతం – ఆత్మలోనే పరిపూర్ణత
శంకరులు ప్రకటించిన మహావాక్యార్థం:
‘‘తత్త్వమసి’’
‘‘అహం బ్రహ్మాస్మి’’
జీవుడు పరమాత్మతో వేరుకాదని అద్వైతం ప్రకటిస్తుంది.
అజ్ఞానం వల్లనే భేదభావం ఉద్భవిస్తుంది. జ్ఞానం కలిగితే అభేదసత్యం ప్రత్యక్షమవుతుంది.
ఈ సిద్ధాంతం వ్యక్తిలో ఒక మహత్తర విశ్వాసాన్ని నింపుతుంది:
నేను పరిమితుడను కాను. నా మూలం అనంతం.
పరాధీనత నా స్వరూపం కాదు.
అనే ఈ అంతర్గత స్వావలంబనే నిజమైన ‘‘ఆత్మనిర్భరత’’.
2. వ్యక్తి-దేశ సంబంధం:
తాత్త్విక సమాంతరము
ఎలాగైతే జీవాత్మ పరమాత్మల మధ్య పరమార్థంలో భేదం లేదో, అలాగే భారతదేశం, భారతీయుల మధ్య కూడా భేదం లేదు.
దేశం అనేది భూమి మాత్రమే కాదు; అది ప్రజల చైతన్యరూపం.
భారతీయుల ఆత్మస్వరూపం, సంస్కృతి, ధర్మబోధ, విలువలు – ఇవే భారతదేశం.
అందువల్ల భారతీయుడు బలపడితే భారతం బలపడుతుంది.
వ్యక్తి ఆత్మవిశ్వాసం దేశ ఆత్మవిశ్వాసంగా మారుతుంది.
ఇది అద్వైత దృష్టిలో సామాజిక అన్వయం.
3. పరాధీనతకు మూలం – అజ్ఞానం
అద్వైతం ప్రకారం బంధనానికి కారణం అజ్ఞానం (అవిద్య).
అదేవిధంగా జాతీయ పరాధీనతకు కారణం కూడా మనసులోని దౌర్బల్యం.
‘‘మనకు సాధ్యం కాదు’’ అనే భావం, ‘‘విదేశీయులే శ్రేష్ఠులు’’ అనే మోహం స్వసంస్కృతిపై నమ్మకం కోల్పోవడం ఇవి సమష్టి అజ్ఞానం.
శంకరుల సందేశం ఏమిటంటే –
సత్యాన్ని తెలుసుకో. నీ స్వరూపాన్ని గ్రహించు. అప్పుడు భయం తొలగిపోతుంది.
ఇదే జాతీయ స్థాయిలో ఆత్మనిర్భరతకు మూలసూత్రం.
4. అభేద భావం – ఐక్యతకు మూలం
అద్వైతం భేదాన్ని ఉపాధి ఆధారంగా మాత్రమే అంగీకరిస్తుంది.
స్వరూపంలో ఏకత్వమే.
భారతదేశంలో భాషలు, ప్రాంతాలు, ఆచారాలు వేర్వేరు. కానీ సంస్కృతి మూలం ఒకటే. ధర్మబోధ ఒకటే.
జీవాత్మ-పరమాత్మల మధ్య ఉన్న అభేదమే. భారత-భారతీయుల మధ్య ఉన్న అంతఃసంబంధానికి ప్రతీక.
ఈ భావన పెరిగితే:
ప్రాంతీయ విభేదాలు తగ్గుతాయి. మతవర్గ విభేదాలు సడలుతాయి. సామాజిక ఐక్యత బలపడుతుంది
ఇదే ఆత్మనిర్భర భారతానికి పునాది.
5. శంకరుల సంచారం – జాతీయ చైతన్యం
శంకరులు కేరళలో జన్మించి కాశ్మీరంలో శారదాపీఠాన్ని అధిరోహించారు.
పురీ, ద్వారక, శృంగేరి, బదరీ – నాలుగు దిక్కులను సంచరించారు. అలాగే మధ్యలో కాంచీ పురం. ఈ యాత్ర కేవలం తాత్త్విక విజయం కాదు;
అది భారతీయ ఐక్యతకు సంకేతం. అందువల్ల వారి అద్వైతం కేవలం వ్యక్తిగత మోక్షసాధన కాదు;
అది సమాజ ఐక్యతకు మార్గదర్శకం.
6. ఆధునిక ఆత్మనిర్భరత – ఆధ్యాత్మిక మూలం
నేడు ఆత్మనిర్భరతను ప్రధానంగా ఆర్థిక స్వావ లంబనగా చూస్తున్నారు. కానీ ఆర్థిక శక్తికి మూలం మానసిక శక్తి. మానసిక శక్తికి మూలం ఆత్మ విశ్వాసం. ఆత్మవిశ్వాసానికి మూలం స్వస్వరూప జ్ఞానం.
అందుకే శంకరుల అద్వైతం ఆధునిక ఆత్మనిర్భర భారతానికి తాత్త్విక ఆధారం. విద్యలో స్వావలంబన, సంస్కృతిలో గౌరవభావం, విజ్ఞానంలో స్వతంత్రత, ధర్మంలో స్థిరత్వం ఇవి అన్నీ అద్వైత దృష్టిలో నుంచే ఉద్భవించగలవు.
ముఖ్యమైన విచారం
జీవాత్మ పరమాత్మల మధ్య అభేదం తెలిసినవాడు ఎప్పుడూ హీనభావంతో జీవించడు.
అలాగే భారతదేశం, భారతీయుల మధ్య ఉన్న అంతఃసంబంధం గ్రహించిన సమాజం ఎప్పుడూ పరాధీనతను అంగీకరించదు.
శంకరుల ‘‘ఆత్మ’’ నిర్భరత వ్యక్తి అంతరంగ బంధ విముక్తి.
ఆధునిక ‘‘ఆత్మనిర్భర భారత్’’ జాతీయ అంతరంగ బంధ విముక్తి.
ఈ రెండూ వేర్వేరు కాదు. అద్వైత దృష్టిలో అవి ఒకటే.
అందుకే చెప్పవచ్చు –
శంకరుల ఆత్మనిర్భరతే ఆధునిక ఆత్మనిర్భర భారతం.
అభేద భావమే భారత భవిష్యత్తు.
చతురామ్నాయ, మూలామ్నాయ పీఠవ్యవస్థ — అద్వైత తాత్త్వికత – ఆత్మనిర్భర భారతం
శంకరదర్శనం
శంకర దర్శనం అంటే వారి ఉపదేశాలను చూడటం కాదు. వారిని చూడటం. వారిని ఎలా చూడాలో తెలియాలి అంటే ఈ ఏకాత్మతా స్తోత్రాన్ని అర్థం చేసుకోవాలి.
యం వైదికా మన్త్రదృశః పురాణాః
ఇన్ద్రం యమం మాతరిశ్వా నమాహుః।
వేదాన్తినో నిర్వచనీయమేకమ్
యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశన్తి।।
శైవాయమీశం శివ ఇత్యవోచన్
యం వైష్ణవా విష్ణురితి స్తువన్తి।
బుద్ధస్తథార్హన్ ఇతి బౌద్ధ జైనాః
సత్ శ్రీ అకాలేతి చ సిఖ్ఖ సన్తః।।
శాస్తేతి కేచిత్ కతిచిత్ కుమారః
స్వామీతి మాతేతి పితేతి భక్త్యా।
యం ప్రార్థన్యన్తే జగదీశితారమ్
స ఏక ఏవ ప్రభురద్వితీయః।।
‘‘స ఏక ఏవ ప్రభురద్వితీయః’’ – ఇది శంకర భగవత్పాదుల సర్వమతసమ్మత స్వరూపం
‘‘యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః… వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి’’ -ఈ వాక్యాలు భారతీయ ఆధ్యాత్మిక దృష్టిలోని విశాలతను ప్రకటిస్తాయి. వేదదృష్టికి అది ఇంద్రుడు, యముడు, వాయువు; వేదాంతికి అది నిర్వచనాతీత బ్రహ్మ; శైవునికి శివుడు; వైష్ణవునికి విష్ణువు; బౌద్ధునికి బుద్ధుడు; జైనునికి అర్హత్; సిఖ్కుకు ‘సత్ శ్రీ అకాల్’. పేర్లు భిన్నం – పరమార్థం ఒక్కటే. ‘‘స ఏక ఏవ ప్రభురద్వితీయః’’- ఆయనే ఒకడు, ద్వితీయుడు లేడు.
ఈ సమగ్ర దృష్టికి మూర్తిమంత రూపమే ఆదిశంకరభగవత్పాదులు. శంకరులు కేవలం అద్వైత తత్వాన్ని బోధించిన తాత్త్వికులు మాత్రమే కాదు; సర్వమత సమన్వయాన్ని ఆచరణలో చూపిన ఆచార్యులు. శైవుడికి ఆయన పరమ శివస్వరూపుడు; వైష్ణవునికి వేదాంతభాష్యకర్తగా నారాయణ స్వరూపుడు; శాక్తేయునికి శ్రీచక్ర ప్రతిష్ఠాపకుడిగా దేవీమయుడు; గాణాపత్యునికి గణనాథ తత్త్వప్రతిపాద కుడు; షణ్ముఖోపాసకునికి జ్ఞానశక్తి రూపమైన సుబ్రహ్మణ్య స్వరూపుడు; సౌరోపాసకునికి ‘‘జ్ఞానం ప్రకాశయతి’’ అని జ్ఞానసూర్యునిగా ప్రకాశించే తేజోమూర్తి.
అద్వైతసిద్ధాంతంలో బ్రహ్మమే సత్యం. అదే బ్రహ్మ భక్తుడి భావానుసారం అనేక రూపాలలో దర్శనమిస్తుంది. భక్తి రసంలో ‘‘శాస్తా’’, ‘‘కుమార’’, ‘‘స్వామి’’, ‘‘మాతా’’, ‘‘పితా’’ అని పిలిచే ఆ జగదీశ్వరుడు తత్త్వదృష్టిలో అభేద స్వరూపుడు. శంకరులు ఈ రహస్యాన్ని ‘‘బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః’’ అనే వాక్యసారంగా ప్రతిపాదించారు.
అందువల్ల శంకరభగవత్పాదులు స్వయంగా ఏకత్వ తత్త్వానికి ప్రతీక. ఆయనలో శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సౌర, కౌమార సంప్రదాయాలు విరోధాలు కాదు- సమన్వయ ప్రవాహాలు. షణ్మత స్థాపన భావన ఈ సమగ్రతను సూచిస్తుంది. భిన్న ఆరాధన మార్గాలు, కానీ లక్ష్యం ఒక్కటే – ఆ పరబ్రహ్మ స్వరూప దర్శనం.
భక్తుడి దృష్టిలో ఆచార్యుడు దైవం అవుతాడు. జ్ఞానదృష్టిలో దైవమే ఆచార్యుడిగా అవతరిస్తాడు. అందుకే శంకరులు వైష్ణవునికి విష్ణువుగా, శైవునికి శివునిగా, శాక్తేయునికి దేవీమయుడిగా, గాణా పత్యునికి గణపతిరూపుడిగా, షణ్ముఖారాధకునికి సుబ్రహ్మణ్యునిగా, సౌరోపాసకునికి జ్ఞానసూర్యునిగా అనుభవంలో ప్రత్యక్షమవుతారు.
పేర్లు మారినా పరమార్థం మారదు. రూపాలు భిన్నమైనా తత్త్వం ఏకం. ఆ ఏకత్వానుభూతినే శంకరులు జీవన మార్గంగా చూపించారు. అందుకే-
‘‘స ఏక ఏవ ప్రభురద్వితీయః’’
అయనే సర్వరూపుడు. ఆయనే సర్వనాముడు. ఆయనే అద్వితీయ పరబ్రహ్మస్వరూపుడు. అలాగే భారతీయులు, భారతం వేరు కాదు.

ఆచార్య రాణి సదాశివమూర్తి
ఉపకులపతి,
శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి