సీమాంతర ఉగ్రవాద, దేశ అంతర్గత వామపక్ష తీవ్రవాదానికి చుక్కపెట్టాలన్నది జాతి ప్రబల ఆకాంక్ష. దానిని గౌరవించిన కేంద్రప్రభుత్వం అంతర్జాతీయంగా, జాతీయంగా ఆపరేషన్‌ సిందూర్‌, ఆపరేషన్‌ కగార్‌ చేపట్టింది. ఈ రెండూ ఆధునిక  యుద్ధతంత్రాలలో భాగమే. ఆత్మనిర్భరతకు నిదర్శనం. ఈ రెండిరటి పరిణామాలను  ప్రపంచ యుద్ధ చరిత్రలో సరికొత్త పంథాలుగా అంతర్జాతీయ, జాతీయ  నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

సీమాంతర ఉగ్రవాదంతో పాటు దేశంలో అంతర్గత వామపక్ష తీవ్రవాదాన్ని తుద ముట్టిం చేందుకు కేంద్రం ముప్పేట దాడులు కొనసాగి స్తోంది. దాయాది దేశానికిగుణపాఠం చెప్పడంతో పాటు, వచ్చే ఏడాది (2026) మార్చి 31 తేదీ నాటికి భారత్‌ను తీవ్రవాద రహిత దేశంగా మారు స్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పదేపదే చేసే ప్రకటనలకు పరిస్థితులు పదును పెడుతు న్నాయని భావించవచ్చు. చత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రెగుట్టల ఆపరేషన్‌ అందులో భాగమే. దాయాది దేశం కవ్వింపు చర్యలు, పెహల్గావ్‌లో పర్యాటకులపై మారణహోమానికి ఆపరేషన్‌ సిందూర్‌ తో ధీటుగా సమాధానం చెప్పింది.

‘పాక్‌ అణ్వాయుధం ఉపయోగిస్తే 25 శాతం దేశ ప్రజలను కోల్పోయినా ఖాతరు చేయం. కానీ పాకిస్తాన్‌ సూర్యోదయం చూడదు’ అన్న నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి మాటలను ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ఆపరేషన్‌ సిందూర్‌తో ఆచరణలో చూపారు. అయితే నాటి ప్రధాని అన్న ‘పాతిక’ శాతం నష్టం లేకుండానే మోదీ దాయాది దేశం పెడపోకడ లను నిలువరించారు. ‘సిందూరం గన్‌ పౌడర్‌గా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో శత్రువులు సహా ప్రపంచానికి అర్థమై ఉంటుంది. మన సైనిక దళాలు కేవలం 22 నిమిషాల్లో తొమ్మిది భారీ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసి, దాయాది దేశం పాకిస్తాన్‌ను మోకాళ్ల మీద నిలబెట్టాయి. ఇకపై పాక్‌ పాల్పడే ప్రతి ఉగ్రవాద చర్యకు ప్రతిచర్య అనివార్యం. ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదు. నేరుగా తలపడితే ఓటమి తప్పదని తెలిసే దొంగదెబ్బ తీయడానికి ఉగ్రవాదాన్ని ఎంచుకుంది. కానీ ఇక్కడ మోదీ ఉన్నాడన్న సంగతి విస్మరించినట్లుంది’ అని మే 22న జైపూర్‌ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు జాతి జనుల్లో అమిత విశ్వాసాన్ని పాదుకొలిపాయనడంలో సందేహం లేదు. ‘సిందూర్‌ చర్య మన మహిళల సిందూరాన్ని చెరిపేసిన వాళ్లను మట్టిలో కలిపివేసిందని వ్యాఖ్యానించారు. ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో దేశం గర్విస్తోందనీ అన్నారు.

‘ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్నది దేశంలోని ప్రతిపౌరుడి సంకల్పం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం సంఘటితమైంది. ఆ మహమ్మారికి వ్యతిరేకంగా మన సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ప్రపంచవ్యాప్తంగా కొత్త నమ్మకాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా మన సైన్యం సరిహద్దు దాటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో చూపిన పరాక్రమం మన దేశాన్ని ఉన్నతంగా నిలిపింది. ఆపరేషన్‌ సిందూర్‌ అంటే కేవలం ఒక సైనిక మిషన్‌ కాదు. అది మన సంకల్పం, ధైర్యాలకు ప్రతీక. దాని విజయంతో ప్రజల్లో దేశభక్తిభావం వెల్లివిరిసింది. త్రివర్ణ పతాకలు చేపట్టి సైన్యానికి అభినందనలు తెలిపేందుకు పల్లెల నుంచి మహా నగరాల వరకు కదలి వచ్చాయి. ఆపరేషన్‌ సిందూర్‌ విజయం ప్రజలను ఎంత ప్రభావితం చేసిందంటే…సైన్యంలో వలంటీర్లుగా చేరేందుకు ఎందరో యువకులు ముందుకు వచ్చారు. బిహార్‌ కతిహార్‌లో, యూపీ కుశీనగర్‌ సహా అనే నగరాల్లో ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పుట్టిన శిశువులకు ‘సిందూర్‌’ అని పేరు పెట్టారు’ అని గత నెల (మే) 25 నాటి మన్‌ కీ బాత్‌( మనసులోని మాట) ప్రసంగంలోనూ పేర్కొన్నారు.

కాగా, భారతదేశానికి అతి పెద్ద అంతర్గత శత్రువు మావోయిస్టు పార్టీయేనని పదమూడేళ్ల క్రితం అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వ్యాఖ్యా నించారు. పాలనా వ్యవస్థలోని లోపాల నుంచి, ‘భూమికోసం భుక్తి కోసం’ అనే నినాదాలతో మావోయిస్టు ఉద్యమం పుట్టింది. తుపాకీతోనే రాజ్యాధికారం సాధిస్తామంటూ పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరి అనే గ్రామంలో 1967 మేలో పురుడుపోసుకున్న తిరుగుబాటు తెలుగురాష్ట్రాలకు విస్తరించింది. దశాబ్దంన్నర క్రితం నాటికి 20 రాష్ట్రాల్లో దాదాపు 225 జిల్లాలను తీవ్ర ప్రభావితం చేయగల స్థాయిలో ఆ ఉద్యమం విస్తరించింది.

 అదే సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో ‘ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌’ ప్రారంభించింది. ఎంతటి బలగాన్నైనా ఎదిరి నిలుస్తామన్న వామపక్ష తీవ్రవాదుల సవాల్‌తో ‘ప్రగతి కోసం శాంతి కోసం భద్రత’ అనే భావనతో ఉక్కుపాదం మోపేందుకు దృఢంగా సంకల్పించింది. ‘2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్‌’ లక్ష్యం అలా పుట్టిందే. ఆ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో 2024 జనవరిలో ఆపరేషన్‌ కగార్‌ ఆరంభించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగించిన దాడుల్లో సుమారు ఏడాదిన్నర కాలంలో 350 మంది మావోయిస్టులు హతమయ్యారు. నారాయణపూర్‌-బీజాపూర్‌ అడవుల్లో మే 21న జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణం కీలక పరిణామంకాగా, కగార్‌ ఆపరేషన్‌లోనే ఇది ప్రధాన ఘట్టంగా కేంద్ర హోం మంత్రి సహా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  • జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE