‘‌బసవరాజు (నంబాల కేశవరావు)ను భద్రతా బలగాలు భౌతిక నిర్మూలించిన సంగతి చాలామంది నమ్మలేకపోయారు. అందుకే దేశమంతా ఆ వార్త వినగానే దిగ్భ్రాంతికి గురైంది. ఆయనను చుట్టుముట్టే చర్య మే 18న ఆరంభమై 21న ముగిసింది. చివరికి బసవరాజు, మరొక 26 మంది నక్సల్స్ ఎదురుకాల్పులలో చనిపోయారు. ఇది అబూజ్‌మడ్‌లోని కుడ్మెల్‌-‌కల్హాజ్‌-‌జట్లూరు ప్రాంత అడవులలో జరిగింది. ఆపరేషన్‌ ‌బ్లాక్‌ ‌ఫారెస్ట్ ‌చర్యకు ఇది పరాకాష్ట. అయితే మొత్తంగా నక్సల్‌ ‌రహిత భారత్‌ అనే లక్ష్యం మాత్రం వచ్చే సంవత్సరం మార్చికి నెరవేరుతుందని అంతా భావిస్తున్నా, అంతకు ముందే అది చోటు చేసుకోవచ్చు.’ అని చెప్పారు, బస్తర్‌ ‌రేంజ్‌ ‌పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ‌జనరల్‌ ‌సుందరరాజ్‌ ‌పట్టిలింగం. ఇప్పుడంతా కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌గా చెబుతున్న ఘటనకు, బస్తర్‌ ‌కేంద్రంగా నక్సల్స్ ‌మీద ఆరంభమైన యుద్ధానికి నాయకత్వం వహించిన 2003 ఐపీఎస్‌ ‌బ్యాచ్‌కు చెందిన సుందరరాజ్‌ ‌గడచిన 25 ఏళ్లుగా బస్తర్‌ ‌రేంజ్‌లోనే పనిచేస్తున్నారు. ఆపరేషన్‌ ‌బ్లాక్‌ ‌ఫారెస్ట్ ‌భద్రతా బలగాలు నక్సల్స్ ‌మీద సాగించిన వ్యతిరేక చర్యలలో బసవరాజు అంతం అత్యంత కీలకమైనదని వ్యాఖ్యానించారు. ఏఎన్‌ఐ, ‌న్యూస్‌లాండ్రీ వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.

బసవరాజు మరణం నక్సల్స్ ‌గదాఘాతమేనని సుందరరాజ్‌ ‌వ్యాఖ్యానించారు. ఈ మరణంతో సంస్థ నిర్జీవం కావడం తథ్యమని అన్నారు. నక్సల్స్‌కు ఉన్న తిరుగుబాటు అనుభవం, విధ్వంసక నైపుణ్యం మనకు తెలిసినా దీనితో వామపక్ష ఉగ్రవాదం తుదిశ్వాస వీడక తప్పదని అన్నారు. నక్సల్స్ ‌చర్యల సామర్థ్యం పాతాళానికి వెళ్లిపోతుందని అభిప్రాయపడ్డారు. అలా అని మాకు చంపి ఆనందించే పైశాచిక లక్షణం ఏమీ లేదు. ఇది యుద్ధం. వారు దాడి చేస్తే మేం ప్రతిదాడి చేయకతప్పదు. ప్రతిదాడి చేయకుంటే మేం బతకం. ఇక సీనియర్‌ ‌నాయకులు కొద్దిమంది మిగిలి ఉన్నారు. వారంతా వచ్చి లొంగిపోవడానికి ఇది మంచి సమయం అని సుందరరాజ్‌ అన్నారు. నక్సల్స్‌ను లొంగుబాటుకు ప్రోత్సహించకుండా చంపడానికే బలగాలు ప్రాధాన్యం ఇస్తున్నాయన్న ప్రచారాన్ని సుందరరాజ్‌ ‌తిరస్కరించారు. పెద్ద నాయకులంతా 60-70 మధ్య వయస్కులే. వారు లొంగిపోతే మేం స్వాగతిస్తాం. కానీ అహం, పిడివాదం వారిని లొంగుబాటుకు సిద్ధం కానీయడం లేదని అనుకుంటున్నాను అన్నారు. ఇంకా అడవులలోనే ఉంటాం, హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తామంటే, ఎప్పటికీ సమాజానికి బెడదగానే ఉండిపోవాలనుకుంటే మాత్రం ప్రభుత్వం అంగీకరించదు అని కూడా ఆయన హెచ్చరించారు. మార్చి 2026 తరువాత మావోయిజం ఉండదు అన్న ప్రకటన తరువాత నంబాల కేశవరావు, వివేక్‌ ‌చంద్రియాదవ్‌ (‌ప్రయాగ్‌), ‌రామచంద్రారెడ్డి (చలపతి)లను భద్రతా బలగాలు తుదముట్టించాయని సుందరరాజ్‌ ‌గుర్తు చేశారు.

కర్రెగుట్ట ప్రాంత నక్సల్‌ ఏరివేత చర్యకు ఆపరేషన్‌ ‌కగార్‌ అన్న పేరును భద్రతా బలగాలు ఏనాడూ అధికారికంగా ప్రకటించలేదని, ఇది మీడియా సృష్టి అని, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా, భదాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దులలోని కర్రెగుట్టలో ప్రారంభించిన 21 రోజుల ఏరివేత చర్యకు మాత్రమే తాము ఆపరేషన్‌ ‌బ్లాక్‌ ‌ఫారెస్ట్ అని పేరు పెట్టామని సుందరరాజ్‌ ‌తెలియచేశారు. 2024 వరకు చాలా ఆపరేషన్‌లు జరిగినా వేటికీ పేరు పెట్టలేదు. కానీ నక్సల్‌ ‌నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసే పని చిరకాలంగా సాగుతున్న మాట నిజమని అన్నారాయన. అయితే ఇటీవలనే ఆ పనిలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించామని, నక్సల్‌ ‌తిరుగుబాటు ఆగేది కాదని, ఆ హింసకు అడ్డే లేదని ఇవి కొనసాగుతూనే ఉంటాయని ఇటీవలి కాలం వరకు ఉన్న అభిప్రాయాలు ఇప్పుడు చతికిలపడ్డాయని ఆయన అన్నారు. ఈ విజయాలు భద్రతా బలగాల ఆత్మ స్థయిర్యాన్ని పెంచడమే కాదు, నక్సలిజాన్ని కూడా అంతం చేయవచ్చునన్న నమ్మకం ప్రజలలోను వచ్చింది. మా ప్రత్యేక దళాలు డీఆర్‌జీ(బస్తర్‌ ‌ఫైటర్స్), ‌స్పెషల్‌ ‌టాస్క్ ‌ఫోర్స్, ‌సీఆర్‌పీఎఫ్‌, ‌కోబ్రా యూనిట్‌ అన్నీ క్షేత్రస్థాయిలో సమన్వయంతో, అవిశ్రాంతంగా పోరాడాయి.

ఇదెలా సాధ్యమైందంటే, ఇంతకు ముందు కాకులు దూరని కారడవుల వంటి చోట కూడా బలగాలు వెళ్లడానికి మౌలిక వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఒక్క 2024 సంవత్సరంలోనే 30 శిబిరాలు ఏర్పాటు చేశారు. 2025 తొలి నాలుగు మాసాలలో మరొక 12 ఏర్పాటు చేశారు. ఇప్పుడు 17 నెలల్లో 42 శిబిరాలు ఏర్పాటు చేయగలిగితే, గతంలో మాత్రం 12 నుంచి 14 మాత్రమే ఉన్నాయి. ఇవి కేవలం భద్రతా బలగాల శిబిరాలు, బసలు అనుకుంటే పొరపాటు. ఛత్తీస్‌గఢ్‌లో సామాజిక మార్పు తేవడం కూడా వీటి ఉద్దేశం. రోడ్లు వేయడంలో సిబ్బంది సహకరించింది. సుదూర ప్రాంతాలకు రవాణా ఏర్పాటయింది. ఒకప్పుడు అబూజ్‌మడ్‌ అం‌టే నక్సల్స్‌కే పరిమితమైన కీకారణ్యం. ఇప్పుడు అలా కాదు. అక్కడ కొంత అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో సాధించిన మరొక విజయం 130 డి జాతీయ రహదారి నిర్మాణం. ఇది మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌లను కలుపుతుంది.

2024 నుంచి ఎంతమంది లొంగిపోయారు?

గడచిన 17 మాసాలలో నక్సల్‌ ‌వ్యతిరేక చర్యలు చాలా తీవ్రమయ్యాయి. దీనితో అటు మరణాలు, ఇటు లొంగుబాట్లు కూడా ఎక్కువయ్యాయి. 2023లో బస్తర్‌ ‌రేంజ్‌లో భద్రతాబలగాలకీ, నక్సల్స్‌కీ మధ్య 69 ఎన్‌కౌంటర్లు జరిగాయి. 2024లో ఆ సంఖ్య 123కు చేరింది. ఈ సంవత్సరం జనవరి-మే నెలల నడుమ 49 ఎన్‌కౌంటర్లు జరిగాయి. నక్సల్స్ ‌మరణాలు 2023లో కేవలం 20 కాగా, 2024లో అవి 217కు పెరిగాయి. 2025 తొలి ఐదు మాసాలలో 184 మంది నక్సల్స్ ‌మరణించారు. అరెస్టులు, లొంగుబాట్లు కూడా విపరీతంగానే జరిగాయి. గత ఏడాదిలో, ప్రస్తుత సంవత్సరం ఐదు మాసాలలో 1,335 మంది నక్సల్స్‌ను అరెస్టు చేశారు. 2024లో 929 మంది, ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 406 మంది అరెస్టయ్యారు. ఇదే కాలంలో 1,337 మంది నక్సల్స్ ‌లొంగిపోయారు. 2024లో 800 మంది, ఈ ఐదుమాసాలలో 537 మంది లొంగిపోయారు.

ఆపరేషన్‌ ‌బ్లాక్‌ ‌ఫారెస్ట్‌లో పలు భద్రతా వ్యవస్థలు భాగమైనప్పటికీ వాటిలో డీఆర్‌జీ ప్రముఖంగా నిలిచింది. ఇందులో సభ్యులంతా బస్తర్‌ ‌ప్రాంతానికి చెందిన యువకులు, ఇంకా, వారిలో అధికులు లొంగిపోయిన నక్సల్స్ ‌కావడం విశేషం. అంతా స్థానికులే ఉండడంతో ఇది సాధించిన ఫలితాలు స్ఫుటంగా ఉన్నాయి. వీరందరికీ ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, భాష, ఈ ప్రాంతం కరతలామలకం.2015లోనే ఆవిర్భవించిన డీఆర్‌జీ నక్సల్‌ ‌వ్యతిరేక చర్యలలో చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం డీఆర్‌జీకి చెందిన 3000 మంది బస్తర్‌ ‌ప్రాంతంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. సుందరరాజ్‌ ‌కూడా బస్తర్‌లో మాట్లాడే గోడీ భాషను నేర్చుకున్నారు. వారి భాషలోనే మాట్లాడతారు.

భద్రతాబలగాలు నక్సల్స్ ‌గాలింపు చర్యలలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య, కొండలు గుట్టలు. నక్సల్స్ ఇవన్నీ బాగా తెలుసు. అదే వారి బలం. నక్సల్స్ ‌ప్రయోగించే ఐయీడీలు కూడా సమస్య. ఇందుకు నిదర్శనం, ఇటీవల నక్సల్స్ ఇచ్చిన ప్రకటన. మందుపాతరలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి కర్రెగుట్ట ప్రాంతానికి ప్రజలు పోకూడదని ఆ ప్రకటనలో హెచ్చరించారు. ఈ మందుపాతరలతో భద్రతా బలగాలు మాత్రమే కాదు, గిరిజనులూ బలైపోయారు.

కర్రెగుట్టలో సాధారణ పౌరులు మరణించారని ఆరోపణలు వస్తున్నాయి. 2024 నుంచి 300 మంది అమాయక గిరిజనులు మరణించారని వార్తలు వచ్చాయి. దీనికి సుందరరాజ్‌ ‌పట్టిలింగం సమాధానం ఇది:

భద్రతాబలగాలు సాధారణ పౌరులను ఎక్కడా చంపడం లేదు. ఎదురుకాల్పులలో మరణించిన వారంతా నక్సల్స్ ‌మాత్రమే. మరొక విషయం. పోలీసు కాల్పులలో సాధారణ పౌరులు మరణించారంటూ అప్పుడప్పుడు వార్తలు వస్తాయి. కానీ గడచిన 30 ఏళ్లలో నక్సలైట్లే 2000 మందిని ఇన్‌ఫార్మర్‌ల పేరుతో చంపారు. ఇటీవల భద్రతాబలగాలు నిర్వహించిన ఏ చర్య ఎవరూ చట్ట విరుద్ధమని అనడం లేదు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE