‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం’ నినాదం ఐదున్నర దశాబ్దాలైనా చైనా మహాకుడ్యాన్ని దాటి రాలేకపోయింది. భారతావనిని తాకలేకపోయింది. అసలు ఆ వాదాన్నీ, నినాదాన్నీ ఎర్ర చైనా సాంస్కృతిక విప్లవమే సమాధి చేసేస్తే ఇంకా దానికోసం ఎదురు చూడడమేమిటి? మన అడవులలో ప్రతిధ్వనించిన వసంత మేఘ గర్జన విప్లవాన్ని కురిపించకుండా మోసగించినా, అమాయకుల నెత్తుటిధారలతో ఆకుపచ్చని అడవి నిరంతరం తడిసిపోతూనే ఉంది. కమ్యూనిజం ప్రవచనాలు భూగోళం మీద మూగబోయినా, కమ్యూనిస్టులు చట్టసభలను మరిగినా చారిత్రక గతితార్కిక భౌతికవాదం గురించి గొంతు చించుకునే మావోలు 55 ఏళ్లకయినా కళ్లు తెరిచే ఉద్దేశంలో మాత్రం లేరు. ప్రయాణం ప్రారంభించినచోటే ఉన్నామన్న వాస్తవాన్ని నిరాకరిస్తూనే ఉన్నారు. ఉద్యమమో, విప్లవమో.. అది ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. ఇక ముందూ వేయలేదు. కొండలలో కొలువు తీరే ప్రజా కోర్టులే ‘విప్లవానికి’ కాళ్లూ చేతులూ నరికేసి వికలాంగులను చేస్తే నడక సాధ్యమా? కానీ అర్బన్‌ నక్సల్స్‌ ఒంటి మీద ఈగ వాలినా అర్ధరాత్రి భారత అత్యున్నత న్యాయస్థానం తలుపులు భళ్లున తెరుచుకుంటాయి. 1968 వద్దనే నిలబడి, 2025లోనూ విప్లవానికి పరిపక్వ పరిస్థితులవిగో… కనపడలేదా.. ఎర్రబావుటా భుగభుగలు..! అంటూ దబాయించడం ముందు దగా వెనుక దగా అని వాళ్ల గతితర్కం గమనించడం లేదు. కాలాన్ని వెనక్కి తిప్పలేమన్న జ్ఞానం వాళ్ల చారిత్రక దృష్టిలో లేదు. వారికి హింసే నిత్యం, హింసే సత్యం. చారు మజుందార్‌, కొండపల్లి సీతారామయ్య, నంబాల కేశవరావు… ఎవరైనా, నాయకత్వం చేపట్టిన వారు ఎవరైనా మావోయిస్టు హింసామార్గాన్ని విస్తరించినవారే. విధ్వంసక దృష్టికి పదును పెట్టినవారే. 1967 నుంచి సాగిన ప్రస్థానం వేరు. మే 5, 2025 తరువాత వేరు. మరి ఇకపై…! అదే ఇప్పుడు అంతా వేస్తున్న ప్రశ్న. అంతేకాదు, ఈ దురాగతం ఇంకానా అని కూడా ప్రశ్నిస్తున్నాయి….పాయింట్‌ బ్లాంక్‌లో ఛిద్రమైన మెదళ్లు, నక్సల్స్‌ క్రూరత్వంతో తెగిపడి తరగతి గదుల గుమ్మాలకు వేలాడిన శిరస్సులు…

ఛత్తీస్‌గఢ్‌ సహా అన్ని గిరిజన ప్రాంతాలలో సమస్యలు నిజం. అభివృద్ధి ఫలాలు వారికి అందని మాటా నిజం. వివక్ష నిజం. ఈ దుస్థితి నుంచి రక్షించి, వారికి న్యాయం చేయడానికి బదులు ఆ పరిస్థితిని నక్సల్స్‌ లేదా మావోయిస్టులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడమే అసలు విషాదం. గిరిజనులలో కొందరు మావోయిస్టులకు మద్దతుగా నిలవడం భద్రతా బలగాలకు సమస్యగా మారింది. గిరిజన ప్రాంతాలు మరో యాభయ్‌ ఏళ్లు వెనక్కి పోయే పరిస్థితి దాపురించింది. గిరిజనులను, వారి స్త్రీలు, పిల్లలను మానవ కవచాలుగా నక్సల్స్‌ ఉపయోగించు కుంటున్నారు.

నక్సల్‌బరీలో పుట్టి..

పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరీలో ప్రయాణం ఆరంభించి, శ్రీకాకుళం అడవులకు వచ్చి, తరువాత ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్‌ చేరి, ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో స్తంభించిపోయింది` మావోయిస్టు రక్త చరిత్ర. అవన్నీ నెత్తుటి అడుగులే. వృథా త్యాగాలే. ఛత్తీస్‌గఢ్‌లోనే నక్సల్స్‌ కేంద్రీకరించ డానికి కారణం` ఆ రాష్ట్ర భౌగోళిక స్వరూపం. అది 44 శాతం అడవులతో నిండి ఉంది. ఇదే మావో యిస్టుల ఆఖరి మజిలీ అయింది. 55 ఏళ్ల కాల్పులు, ఎదురుకాల్పులు, హింస, ప్రతిహింసలకు మే 5, 2025 తుదివాక్యం పలికింది. ఇక ఇలాంటి ‘నూతన ప్రజాస్వామిక భారత సమాజ స్థాపన’ వద్దే వద్దని వర్తమానకాలం ఘోషిస్తున్నది. అర్ధశతాబ్దపు నక్సల్స్‌ లేదా మావోయిస్టుల ప్రయాణంలో మొదటిసారి మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయనే నంబాల కేశవరావు (బసవరాజు/బీఆర్‌). మరొక 26 మంది కూడా ఈ ఎదురుకాల్పులలోనే చనిపోయారు. నంబాల స్థానాన్ని భర్తీ చేయడానికి మరొకరు లేరు. అంతా వృద్ధులే. మావోయిస్టు నాయకత్వం మంచం పట్టింది. సేనాని పదవికి మరొకరు రావడం లేదన్నదే తాజావార్త. అయినా సేనాని ఎందుకు, ఎర్రసైన్యమే లేదు. ఇవన్నీ రహస్యోద్యమంలో ఉండే సహజ బలహీనతలు. నూతన ప్రజాస్వామిక సమాజం కోసమంటూనే బులెట్‌ను ఆరాధించిన ఫలితం. చీలికలే సిద్ధాంతాన్నీ, విప్లవాన్నీ ముందుకు తీసుకుపోతాయన్న అసహజ దృష్టి. ప్రపంచంలో ఎవరూ హర్షించని తమిళ ఈలం హింసాత్మక ధోరణులతో, ఇస్లామిక్‌ ఛాందసవాదంతో తుపాకీ బాంధవ్యం కలుపుకున్న ఫలితం.

 నంబాల ఎన్‌కౌంటర్‌ – చివరి అంకం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాలది 45 ఏళ్లు నక్సల్‌ జీవితం. నాటి రీజినల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల (నేటి నిట్‌, వరంగల్‌)లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓఝా అనే ఆర్‌ఎస్‌ఎస్‌/ఏబీవీపీ కార్యకర్తను హత్య చేసిన తరువాత ఆయనకు నక్సలిజం నీడనిచ్చింది. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిన నంబాల రెండేళ్ల తరువాత చింతపల్లిలో పట్టుబడ్డారు. విశాఖ జైలులో ఉండగా బెయిల్‌ పొంది, మళ్లీ కనిపించలేదు. నక్సల్స్‌ పంథాలో పైపైకి వెళ్లారు. పీపుల్స్‌వార్‌లో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్‌ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి (ముప్పాళ లక్ష్మణరావు, 70 ఏళ్లు, ఇప్పుడు అనారోగ్యంతో ఫిలిప్పైన్స్‌లో గడుపు తున్నారని చెబుతారు)తో కలసి ఏర్పాటుచేశారు. దానికి తానే నాయకత్వం వహించారు. అప్పుడు ఆయనకు ఉన్న పేరు`బసవరాజు లేదా బీఆర్‌. 2001లో పీపుల్స్‌వార్‌ ఏడో కాంగ్రెస్‌లో సెంట్రల్‌ మిలిటరీ ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకుని దేశవ్యాప్తంగా సంస్థ హింసాత్మక కార్యకలాపాలను విస్తరించారు. ఆయన లిబరేషన్‌ టైగర్స్‌ తమిళ ఈలం నుంచి శిక్షణ కూడా తీసుకున్నారు. పీపుల్స్‌వార్‌, మావోయిస్టు పార్టీ సెంటర్‌ (ఎంసీసీ)ల విలీనంలో గణపతి, బసవరాజులదే కీలకపాత్ర. 2016లో గణపతి వయోభారంతో మిలటరీ కమిషన్‌ ఇన్‌చార్జిగా వైదొలగడంతో, ఆ స్థానంలో నంబాలను నియమించారు. ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌ పేరుతో భారత ప్రభుత్వం చేపట్టిన మావోయిస్టు నిర్మూలన చర్యలో పరాకాష్ఠ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌. మార్చి 31, 2026 నాటికి నక్సల్స్‌ రహిత భారతాన్ని ఆవిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రతిజ్ఞ ఛత్తీస్‌గఢ్‌ అడవులలో ప్రతిధ్వనించింది. నంబాలతో పాటు, ఎన్‌కౌంటర్‌ జరిగిన అబూజ్‌మడ్‌ డివిజన్‌ సీనియర్‌ కేడర్‌, పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ సభ్యులు కూడా అక్కడే మరణించారన్న వాస్తవ సమాచారమే బయటకు వచ్చింది. నంబాల మరణించిన సంగతిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధ్రువీకరించారు. ఈ ఆపరేషన్‌ను నిర్వహించిన భద్రతా బలగాలను ప్రధాని నరేంద్ర మోదీ సైతం అభినందించారు. ఇది చాలు, నంబాల ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు ఉద్యమం మీద వేసిన వేటు ఎంత తీవ్రమో తెలుసుకోవడానికి. 50 గంటలు సాగిన ఎన్‌కౌంటర్‌లో బసవరాజు సహా 27 మంది నక్సల్స్‌ మరణించారని ఛత్తీస్‌గడ్‌ లోని బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పి. సుందర్‌రాజ్‌ చెప్పారు.

ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌

మావోయిస్టు రహిత భారతదేశం కోసం కేంద్ర ప్రభుత్వం ఆరంభించినదే ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌ లేదా ఆపరేషన్‌ కగార్‌. మార్చి 31, 2026కు భారత్‌లో మావోయిస్టులను సంపూర్ణంగా నిర్మూలి స్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవలి కాలంలో పలు సందర్భాలలో ప్రకటించిన సంగతి కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. నక్సల్‌ ఏరివేత, మావోయిస్టు పంథాను పతనం చేయడం ఇందులో కీలకం. కానీ కగార్‌ ఏరివేత ఛత్తీస్‌గఢ్‌పై ప్రధానంగా గురి పెట్టింది. కర్రెగుట్టల పేరు అందుకే ఎక్కువగా వినిపిస్తున్నది. ఇది ఛత్తీస్‌గఢ్‌`తెలంగాణ సరిహద్దుల లోనిది. ఏప్రిల్‌ 21, 2025న ఇది తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇంతవరకు మావోయిస్టులే లక్ష్యంగా తలపెట్టిన ఆపరేషన్‌లలో కగార్‌ అతి పెద్దదని చెబుతున్నారు. కానీ ఈ చర్యకు ఆపరేషన్‌ కగార్‌ (ఆఖరి పోరాటం) అని అధికారికంగా పేరు పెట్టలేదు. ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌ పేరుతో ఇది ప్రారంభమైంది. కగార్‌ అనే పేరును మీడియా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చినదేనని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ఏరివేతే లక్ష్యంగా

 దక్షిణాసియా టెర్రిజం పోర్టల్‌ వెల్లడిరచిన వివరాల ప్రకారం బ్లాక్‌ ఫారెస్ట్‌ చర్యలో లేదా ఆపరేషన్‌ కగార్‌లో 2025 సంవత్సరం, మొదటి మూడు మాసాలలోనే 140 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఆ పోర్టల్‌ లెక్క ప్రకారమే, మావోల కారణంగా మరణించిన వారి సంఖ్య (2000 సంవత్సరం నుంచి మే17, 2025 వరకు) 11,881. ఇందులో సాధారణ పౌరులు 4105. 2708 భద్రతా సిబ్బంది. 4816 నక్సలైట్లు.

2024లోనే వాస్తవంగా ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌ మొదలైనా, ఈ సంవత్సరం జనవరి నుంచి కాల్పులు తీవ్రరూపం దాల్చాయి. ఆ ఎన్‌కౌంటర్‌లలో చనిపోయిన వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. చలపతి, నంబాల కేశవరావుల ఎన్‌కౌంటర్‌తో కోలుకోని దెబ్బ తగిలిందని అంతా అంగీకరించారు. దీనితో నాయకత్వ సమస్య కూడా ఏర్పడిరది. తాత్కాలికంగా సంస్థను నడిపిస్తున్న మాద్వి హిడ్మాయే పూర్తి స్థాయి నాయకత్వం వహిస్తారన్న అభిప్రాయాలు ఉన్నాయి. కేంద్రం కఠిన వైఖరి మావోయిస్టులకు తీవ్ర నష్టం చేయడం ఆరంభించాక చర్చల ప్రతిపాదన వచ్చింది. చర్చలు కేంద్రం బాధ్యత అంటూ కాంగ్రెస్‌ సహా ఎన్ని విపక్షాలు చెప్పినా కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. చర్చల ప్రసక్తి లేదని ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌ శర్మ వెల్లడిరచిన సంగతి తెలిసిందే. మావోయిస్టులు ఆయుధాలు కింద పెట్టే వరకు ఆపరేషన్‌ కగార్‌ కొనసాగుతుందని ఆయన చెప్పేశారు. ఇప్పటికీ అర్బన్‌ నక్సల్స్‌ కాల్పుల విరమణ నినాదం వినిపిస్తున్నారు. నంబాల సంస్మరణ సభలలో ఇదే వినిపించింది.

అతి పెద్ద ఆపరేషన్‌

కేంద్రం చేపట్టిన ఈ బహుముఖ వ్యూహంలో లక్ష వరకు పారామిలటరీ సభ్యులు ఉన్నారు (ఫ్రీప్రెస్‌ జనరల్‌). సెంట్రల్‌ రిజర్వ్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), కోబ్రా యూనిట్లు, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌ (డీఆర్‌జీ), రాష్ట్ర పోలీసులు ఇందులో ఉన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. సమాచార సేకరణకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగిస్తున్నారు. అలాగే శాటిలైట్‌ ఇమేజరీ కూడా. వీటిని బట్టి భద్రతాబలగాలు గురి పెట్టినవారు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. నక్సల్స్‌ తప్పించుకోవడం కూడా వేసవిలో కష్టం. ఎందుకంటే అడవి అంతా ఆకు రాలి అనాచ్ఛాదితంగా ఉంటుంది. నాలుగు హెలికాప్టర్‌లు, 20 డ్రోన్‌లు ఉపయోగిస్తున్నారు. ఎన్‌టీఆర్‌ఓ మ్యాప్‌లు ఉపయోగించుకుంటున్నారు.

కగార్‌లో కొన్ని ప్రత్యేకతలను చూస్తున్నారు పరిశీలకులు. అలిపిరి ఘటన సమయంలో భద్రతా బలగాల మధ్య సమన్వయ లోపం గురించి పెద్ద చర్చ జరిగింది. కగార్‌ నిర్వహణలో రాష్ట్రాల మధ్య మంచి సమన్వయం కనిపిస్తున్నది. 800 చదరపు మైళ్ల పరిధిలో ఈ భారీ వేట జరుగుతున్నది. ఇదంతా కర్రెగుట్టల పరిసరాలలోనే ఉంది. భారతదేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావం కింద తీవ్రస్థాయిలో నలిగిపోతున్న ప్రదేశం ఇదే. ఏప్రిల్‌ 21, 2025న మిషన్‌ సంకల్ప్‌ పేరుతో ఇది మొదలయిందని ఒక వర్గం మీడియాలో కనిపించింది. పేరు ఏదైనా సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా బెటాలియన్‌, జిల్లా రిజర్వ్‌గార్డ్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇంకా ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగాలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. కగార్‌ జరుగుతున్న ప్రాంతం చాలామంది మావోయిస్టు ప్రముఖులు తలదాచుకునే స్థలం. సెంట్రల్‌ కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాదరావు (చంద్రన్న), సుజాత, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ నాయకుడు బర్సే దేవ, కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ (మిలటరీ ఆపరేషన్స్‌) మాద్వి హిడ్మా, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యులు సాన్ను, దామోదర్‌ ఇక్కడే తలదాచుకుంటారని చెబుతారు.

 మే 26న పత్రికలలో వచ్చిన నివేదిక ప్రకారం, ఆపరేషన్‌ కగార్‌ జనవరి నుంచి కూడా ఉధృతంగానే నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఇది సాగుతున్నది. దాదాపు 20 పారామిలటరీ బెటాలియన్‌లు మోహరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ మావోయిస్టు డివిజన్‌లోను, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలోను వారి కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. సరైన ప్రణాళిక, వ్యూహంతో ప్రభుత్వం కగార్‌ చేపట్టింది. భద్రత కరువైన ప్రదేశాలను మొదట గుర్తించింది. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలలో ఇటీవల కాలంలో 302 ఫార్వార్డ్‌ ఆపరేటింగ్‌ బేస్‌లు ఏర్పాటు చేశారు. 612 ఫోర్టిఫైడ్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మే 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20000 మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌

నక్సల్‌ తిరుగుబాటు దేశానికి అతి పెద్ద అంతర్గత బెడద అని 2006లో నాటి ప్రధాని డాక్టర్‌ మన్‌మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితులు ఆయన చేత ఆ మాట అనిపించాయి. కానీ యూపీఏ ప్రభుత్వ హయాంలో నక్సల్స్‌ బెడద నివారణపై సాచివేత దారుణమైన పరిణామాలను తెచ్చింది. 2010 నాటి దంతేవాడ దాడి (76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చనిపోయారు) యూపీఏలోని గందరగోళ స్థితికి ఉదాహరణగా నిలిచింది. ఇంత జరిగినా ఒక విధానమంటూ యూపీఏ అనుసరించ లేదు. తరువాత 2013లో జరిగిన దర్భా వ్యాలీ దాడి కూడా అలాంటిదే. పలువురు కాంగ్రెస్‌ నేతలు సహా మొత్తం 29 మందిని పొట్టన పెట్టుకున్న ఈ ఉదంతం యూపీఏ నిష్పూచీ వైఖరిని పట్టిచ్చింది. 2004 నుంచి 2010 వరకు నక్సల్‌ హింస పెట్రేగిపోయింది. 2004లో అయితే 1,533 నక్సల్‌ ఘటనలు జరిగాయి. 566 మంది బలయ్యారు. 2010 నాటికి నక్సల్‌ హింసాత్మక ఘటనలు మరింత పెరిగాయి. ఆ సంవత్సరం 2,213 ఘటనలు జరగగా, 1,005 మంది చనిపోయారు. 2009లో ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ ప్రారంభమైంది. ఇది ఎలాంటి పునాది లేకుండా ఆరంభమైందన్న విమర్శ ఉంది. బలగాల మధ్య సమన్వయం కూడా లేదు. అలాగే అధికార పార్టీ (కాంగ్రెస్‌)లో కూడా ఏకాభిప్రాయం లేదు. పి. చిదంబరం వంటి వారు హంట్‌ను పూర్తిగా సమర్ధించగా, దిగ్విజయ్‌ సింగ్‌ వంటివారు చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని, చంపుకుంటూ పోవడం సరికాదని పత్రికలలో వ్యాసాలు రాశారు.

కానీ ఇవాళ కాంగ్రెస్‌ నేతలు చాలావరకు కేంద్రంతో సహకరించే ధోరణిలోనే ఉన్నారు. పౌరహక్కుల నేతల బృందం ఒకటి ఏప్రిల్‌ 29న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలసి కగార్‌ నిలిపివేయవలసిందిగా కేంద్రానికి సూచించ వలసిందని కోరింది. రేవంత్‌ ఈ విషయంలో వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నట్టే ఉంది. ఆó బృందంతో ఆయన దాదాపు మూడు గంటలు చర్చించారు. తరువాత కేంద్రంతో సహకరించక తప్పదని తేల్చారు. కానీ నక్సల్‌ ఉద్యమం గిరిజనుల ఆర్థిక, సామాజిక స్థితిగతులే పునాదిగా అంకురించిందని చెప్పారు. కేంద్రం తీసుకున్న విధానానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండవలసిన అవసరం లేదని ఆ బృందం ఉపాధ్యక్షుడు, మాజీ మావోయిస్టు జంపన్న తరువాత విలేకరుల సమావేశంలో చెప్పడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మావోయిస్టుల తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టే ఉంది. మే 2న జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపి వేయాలని అభిప్రాయపడ్డారు. మావోయిస్టు పరిభాషలో ‘ప్రభుత్వ ప్రేరేపిత హింస’ అని కూడా వ్యాఖ్యానించారు. కగార్‌ కారణంగా 23 మంది అమాయక గిరిజనులు ఇరు పక్షాల కాల్పుల మధ్య చిక్కుకుని చనిపోయారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటే, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి (బీజేపీ)కఠిన వైఖరితో ఉన్నారు. హింసాత్మక పంథాలో ప్రభుత్వాన్ని సవాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మే 3వ తేదీన ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌లో భద్రతా సిబ్బందిని కలసి నైతిక స్థయిర్యం ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో 2023లో బీజేపీ అధికారంలోకి రాగానే నక్సల్‌ నిర్మూలన చర్యలు తీవ్రం చేసింది. జనవరి 2024 నుంచి చూస్తే 350 మందిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. 300 మంది వరకు లొంగిపోయారు.

బీజేపీ వైఖరి

నక్సల్‌ విధానం పట్ల యూపీఏ వైఖరి కన్నా బీజేపీ వైఖరి చాలా స్పష్టంగా, కఠినంగా ఉందని మేధావులు అంగీకరిస్తున్నారు. మోదీ ప్రభుత్వం అటు ఉగ్రవాద నిర్మూలన, ఇటు అభివృద్ధి వ్యూహం జమిలిగా అనుసరిస్తున్నది. ఈ సంవత్సరం రూపొందించిన జాతీయ పథకం, కార్యాచరణ పటిష్టంగా, బహుముఖంగా ఉన్నాయి. సరైన వ్యూహంతో సమన్వయంతో జనవరి 2024లో దీనిని ఆరంభించి, 17 మాసాల తరువాత భద్రతాబలగాలు అబూజ్‌మడ్‌ మీద ఆధిపత్యం సంపాదించాయి. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, టెలికాం, బ్యాంకింగ్‌ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. 7,700 మొబైల్‌ టవర్స్‌ ఏర్పాటు చేశారు. విద్యాలయాలు, వైద్యాలయాలు వచ్చాయి. నైపుణ్య కేంద్రాలు ఏర్పాటైనాయి. ఈ చర్యల ప్రభావం కనిపిస్తున్నది. 2014లో ఉన్న 35 నక్సల్‌ ప్రభావిత జిల్లాలు ప్రస్తుతం 6కు తగ్గాయి. నక్సల్స్‌ హింసాకాండకు సంబంధించిన ఘటనలు యూపీఏ ప్రభుత్వంలో 17,000. ఇప్పుడు 8000గా నమోదైనాయి. మావోయిస్టుల చేతులలో మరణించిన వారి సంఖ్య నాడు 7000 కాగా, ప్రస్తుతం అది 2000గా నమోదైంది.

నక్సల్స్‌కు ఆయుధాలు ఎక్కడివి?

నక్సల్స్‌కు అత్యాధునిక ఆయుధాలు కూడా అందాయి. ఇవి పోలీసు స్టేషన్‌లు, భద్రతాబలగాల శిబిరాల మీద దాడి చేసినప్పుడు చేజిక్కించుకున్నవి. కొన్ని అక్రమ మార్గాల ద్వారా దిగుమతి అయినవి. దంతేవాడ వంటి హత్యాకాండ తరువాత ఎత్తుకెళ్లిన పోలీసుల ఆయుధాలు. పాత ఆయుధాలను కూడా వారు కొనుగోలు చేస్తారు. భద్రతా దళాల నుంచి ఆయుధాలు పొందడానికి వారికి లంచాలు ఇవ్వ జూపుతారు. చిన్న చిన్న ఆయుధాలు వారే తయారు చేసుకుంటారు. మందుగుండు నేపాల్‌, మైన్మార్‌, బాంగ్లా సరిహద్దుల గుండా రహస్యంగా దిగుమతి చేసుకుంటారని కూడా చెబుతారు. చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఆయుధాలు అందుకుంటున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 2017లోనే కేంద్ర హోంశాఖ సాక్షాత్తు లోక్‌సభలో వెల్లడిరచిన వివరాల ప్రకారం ఫిలిప్పైన్స్‌, టర్కీ సహా కొన్ని ఐరోపా దేశాలలోని మావోయిస్టు సంస్థలతో వీరికి సంబంధం ఉంది. నంబాల కేశవరావు మృతి పట్ల ఆ దేశాల వారు కొందరు సంతాపం వ్యక్తం చేసిన సంగతి ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. సీపీఐ (మావోయిస్టు) దక్షిణాసియా మావోయిస్టు పార్టీల, సంస్థల సమన్వయ సంఘంలో సభ్యురాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజిజు ఒక సందర్భంలో లోక్‌సభలోనే చెప్పారు. సీపీఐ (మావోయిస్టు) సంస్థకు జర్మనీ, ఫ్రాన్స్‌, టర్కీ, ఇటలీలలో పనిచేస్తున్న మావోయిస్టు సంస్థలతో సంబంధం ఉంది. ఫిలిప్పైన్స్‌ కమ్యూనిస్టు పార్టీ 2005లో, 2011లో వీరికి తర్ఫీదు ఇచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెల్లడిరచారు.

ధనం గుంజుతారు

బలవంతపు వసూళ్లే నక్సల్స్‌ కీలక ఆదాయ వనరు. ధనరూపంలోను వస్తురూపం లోను కూడా ఈ వసూళ్లు ఉంటాయి. అటవీ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేయించే కంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూళ్లు భారీగానే ఉంటాయి. ఇంకా వ్యక్తుల నుంచి, అటవీ ఉత్పత్తుల కంట్రాక్టర్లు, గనుల సంస్థల నుంచి తీసుకోవడమే కాదు, ఆ ప్రాంతంలో ఉండే గనులకు అక్రమ తవ్వకం ద్వారా కూడా డబ్బు పోగేస్తారు. దొంగసారా తయారీ, అమ్మకాలలోను వీరికి వాటా ఉంటుంది. ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, ఒడిశా అటవీ ప్రాంతాలలోనే 1,61,040 గనులు ఉన్నాయి. ఇదే కాదు, గంజాయి, నల్లమందు పంట ద్వారా కూడా డబ్బులు తెస్తారు. ఛత్తీస్‌గఢ్‌ పోలీసు యంత్రాంగం చెప్పిన వివరాల ప్రకారం 2009లో నక్సల్స్‌ వసూలు చేసిన మొత్తం రూ. 2000 కోట్లు. 2010లో ఆనాటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లై వెల్లడిరచిన వివరాల ప్రకారం నక్సల్స్‌ ఆదాయం 2010లో రూ 1400 కోట్లు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో అంచనా రూ 1500 కోట్లు.

జ్ఞానద్వేషం

ఒక ప్రాంతం, ఒక సమాజం పురోగమించా లంటే మొదట కావలసినది చదువు. కానీ చదువుకు కూడా నక్సల్స్‌ ఆటంకంగా మారారు. ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 2009`2012 మధ్య 140 పాఠశాలల మీద నక్సల్స్‌ దాడులు చేశారు. ఇవన్నీ తీవ్రంగా వెనుకబడి ఉన్న జార్ఖండ్‌, బిహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలోనే జరిగాయి. ఆ ప్రదేశాలలో డ్రాపౌట్లు పెరిగాయి. వీరిలో మళ్లీ బాలికలే ఎక్కువ. పాఠశాల భవనాలను భద్రతా బలగాలు ఒకసారి బసలుగా ఉపయోగించుకుంటే వాటిని పేల్చి వేయడం మరొక చర్య. ఒడిశాలోని బాలంగీర్‌లో ఒక పాఠశాల గోడకు మావోయిస్టులు ఎన్నికల విషయమై ఒక పోస్టర్‌ అతికించారు. దీనితో 12 రోజులు ఆ పాఠశాల మూతపడిరది. ఏప్రిల్‌ 9, 2009న జార్ఖండ్‌లోని బెల్హారీ అనే గ్రామంలోని పాఠశాల భవంతిని మావోయిస్టులు రెండు డైనమైట్లతో పేల్చేశారు. ఎన్నికల బహిష్కరణ పిలుపు పేరుతో అదే వారం మొత్తం పది పాఠశాల భవనాలకు నష్టం చేశారు. బిహార్‌లోని గోసాయిన్‌ `పెస్రలోని ప్రాథమిక పాఠశాల భవంతిని మందు పాతర పెట్టి పేల్చారు. ఏప్రిల్‌ 14,2009న ఇది జరిగింది. పాఠశాలల మీద దాడులను కొందరు మావోయిస్టులు సమర్ధించారు. ఇక్కడ పాఠశాల భవంతులు నిర్మించేది భద్రతా బలగాల కోసమేనని వాళ్ల వాదన. ఈ కాల్పులలో ఉద్దేశపూర్వకంగా లేదా పొరపాటున కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది కూడా చనిపోయారని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ తెలియచేసింది. 2009-2012 మధ్య ఇవి జరిగాయి.73 మంది ఉపాధ్యాయులు కూడా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ నక్సల్బరీకి జన్మ స్థానం కాబట్టి ముందు నుంచి అక్కడి మావోయిస్టుల ఘన కార్యాలు జుగుప్సాకరంగా ఉంటాయి. మొదటి నుంచి పాఠశాలలకు వచ్చి పిల్లల ఎదుటే ఉపాధ్యాయులను చంపడం వారికో వినోదం. అదే కొనసాగింది. మార్చి 20,2009న ఆ రాష్ట్రం లోని జందా అనే గ్రామ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిని తరగతి గదిలోకి ప్రవేశించిన వెంటనే చంపేశారు. అతడు సీపీఎం (మార్క్సిస్టు) సభ్యుడే. కోయల్లబెడాలో (ఛత్తీస్‌గఢ్‌) తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని తరగతి గదిలోనే కాల్చి చంపారు. అతడి తండ్రి అంతకు ముందు సంవత్సరమే మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఆయన పోలీసు అధికారి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నక్సలిజం ఆరంభంలో పశ్చిమ బెంగాల్‌లో వీరి అకృత్యాలు ఎంత అమానవీయమో తెలియాలంటే, ఆనాటి ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా పత్రికలు చూసినా తెలుస్తుంది. ఇక్కడ ఆ పత్రిక పేరు ప్రస్తావించడం ఎందుకంటే – ఇదంతా బూర్జువా పత్రికల, పెట్టుబడిదారీ పత్రికల దుష్ప్ర చారం అని అలవోకగా కొట్టిపారేసే, ఆ మాటను రెండో ఆలోచన లేకుండా నమ్మే వారి కోసమే.

ఎందుకీ ఘోర వైఫల్యం?

నాగభూషణ్‌ పట్నాయక్‌, ఐవీ సాంబశివరావు, కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, బండయ్య మాస్టారు వంటి ఎందరో నక్సలైట్‌ ఉద్యమంలో లేదా మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. ఆరంభంలో అంతా ఉన్నత విద్యావంతులే ఆయుధం పట్టారు. కొందరు చనిపోయారు. కొందరు ఆయుధం వీడి తిరిగి జనజీవన స్రవంతిలో కలిశారు. నక్సల్స్‌ ఆవేశాన్ని అర్థం చేసుకోవడం అవసరమేనని ఎక్కువ మంది అభిప్రాయపడుతూ ఉంటారు. సమాజం, దాని దుస్థితి పట్ల, రావలసిన మార్పు పట్ల వారికి ఒక తపన ఉందని చాలామంది నమ్మారు. కానీ మొదటి నుంచి ఈ ఉద్యమం తప్పిదాలతో నడిచింది. ‘చైనా చైర్మన్‌ మా చైర్మన్‌’ (చారు మజుందార్‌) అన్న నినాదంలో ఉన్నదేమిటి? దీనితోనే మావో యిస్టుల ఉద్యమంలో మట్టివాసన ఉండదన్న విషయం అర్ధమైంది. వర్గ పోరాటం అనే అంశం మీద ఇప్పటికీ పాత వైఖరితోనే ఉంటే వాస్తవిక దృక్పథమనిపించుకుంటుందా? ఒకనాడు మావోయిస్టులు గోడల మీద రాజ్యాంగాన్ని దగ్ధం చేయాలని రాశారు. రాజ్యాంగం దేశానికీ, హక్కులకీ ఉన్న బంధాన్ని మాత్రమే కాదు, అది రాసిన డాక్టర్‌ అంబేడ్కర్‌ జీవితమిచ్చిన స్ఫూర్తి కోణం నుంచి కూడా జనం దృక్కోణాన్ని మార్చింది. ఇది ఎంఎల్‌ పార్టీల పాత వైఖరికి సవాలే అయ్యింది. అడవులలో ఉండి పోరాడే నక్సలైట్ల పరువు పట్టణ ప్రాంతాలలో ఉంటూ, టీవీ సెట్లలో కనిపిస్తూ, సభలలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ, ప్రొఫెసర్లుగా, అధ్యాపకులుగా విలాసవంతమైన జీవితం గడిపే అర్బన్‌ నక్సల్స్‌ కారణంగా పాతాళానికి దిగజారి పోయిందంటే అతిశయోక్తి కాదు. పౌరహక్కులు అంటే మావోయిస్టులకు, ముస్లిం ఉగ్రవాదులకు మాత్రమే ఉంటాయన్న అభిప్రాయానికి దేశ ప్రజలు వచ్చేలా చేసిన ఘనత వీళ్లదే. వీళ్ల మాటే దేశ ప్రజలకు రోతగా మారింది. నంబాల ఎన్‌కౌంటర్‌ మైనారిటీలపై దాడికి బీజేపీ వేసుకుంటున్న ముందస్తు పథకంగా చెప్పే వారూ హక్కుల కార్యకర్తలలో కనిపిస్తున్నారు. లోపాలు ఉండవచ్చు, అయినా ప్రజాస్వామ్యం తెచ్చిన విప్లవాన్ని నిరాకరిస్తే ఎలా? దేశంలో కటిక దారిద్య్రం పోయిందని అంతర్జాతీయ సర్వేలు చెప్పినా వీరు నమ్మరు. శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత ముందుకు వెళ్లాయో పట్టదు. కమ్యూనిజం పేరు వింటేనే పారిపోయే తరం వచ్చిందన్న వాస్తవం పట్టదు. తూర్పు ఐరోపా పరిణామాలు, సోవియెట్‌ రష్యా పతనం, చైనాలో వచ్చిన పెట్టుబడిదారీ పోకడలు వీరు పట్టించుకో లేదు. ఆ దేశాలతో తమకు సంబంధం లేదని, తాము చైనాకు ఏనాడో దూరమయ్యామని వీరు అనొచ్చు. కానీ వీళ్లు అడుగులు నేర్చినది ఆ దేశాల నుంచే. ‘వసంతకాల మేఘ గర్జన’ అంటూ 1967 జూలైలో ఇక్కడి నక్సల్స్‌ ఊగిపోవడం ఎందుకు? చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఎంత భ్రమ కల్పించింది? ‘భారతదేశంపై వసంత మేఘం గర్జించింది. డార్జిలింగ్‌ ప్రాంతంలోని విప్లవ రైతాంగం సాయుధ తిరుగుబాటు బావుటానెగరవేసింది. భారత కమ్యూనిస్టు పార్టీలోని ఒక విప్లవ గ్రూపు నాయకత్వంలో గ్రామీణ విప్లవ సాయుధ పోరాటం ప్రారంభమైంది. భారత ప్రజల విప్లవ పోరాటంలో ఇది బ్రహ్మాండమైన ప్రాధాన్యతను సంతరించుకోబోతోంది.

ఈ పోరాటం భారత అభివృద్ధి నిరోధకుల్లో భయోత్పాతాన్ని సృష్టించింది.’ ఎంత పెద్ద అబద్ధం! అయితే 1975లో అత్యవసర పరిస్థితి వేళ కేంద్రం నిషేధించిన నక్సల్‌ గ్రూపులు అక్షరాలా 26. కానీ ఇప్పుడు అక్కడెక్కడా ఆ సిద్ధాంతం జాడ నామమాత్రంగా కూడా లేదు. వాటిలో ఎవరిదీ వసంతం? ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌ను గిరిజనులకు వ్యతిరేకంగా కేంద్రం జరుపుతున్న హత్యాకాండగా చిత్రించడం హక్కుల నాయకుల నీచత్వానికి పరాకాష్ట. ఇందుకు ఒక్క ఆధారం కూడా చూపకుండా మాట్లాడుతున్నారు. నక్సల్స్‌ చనిపోతే అది విజయంగా భావించడం ఏమిటి? మోదీ, అమిత్‌ షా భద్రతాబలగాలను అభినందించడం ఏమిటి? ఇదేమి సంస్కారం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నవారికి ఒక ప్రశ్న. దంతేవాడలో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది చనిపోతే పండుగ చేసుకోవడం ఏమిటి? అని జవాహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులను కూడా వీళ్లు ప్రశ్నించగలరా? ఎవరి ప్రాణం తీసే హక్కు అయినా ఎవరికీ ఉండదు అని గగ్గోలు పెడుతున్నారు కాబట్టి ఈ ప్రశ్న.

అడవులలో తుపాకీ పడగ నీడలో గిరిజనుల ఆక్రందనలు, అడవి మాటున మహిళా మావోలపై జరిగిన లైంగిక వేధింపులు దాచేస్తూ హక్కుల కార్యకర్తలు మాట్లాడవచ్చు. ఉద్యమం మీది కులం ముద్రను దాచే ప్రయత్నమూ చేయవచ్చు. కానీ అవి చిదంబర రహస్యాలే. అరుంధతీ రాయ్‌ వంటి వాళ్లు నక్సల్స్‌ గన్నులు పట్టిన గాంధీలంటూ చెత్త ప్రకటనలు చేయవచ్చు. ఇలాంటివి నక్సల్స్‌ మీద వైముఖ్యం పెంచేవే. అమరులను చేయగలిగేవి కావు.

కొసమెరుపు: ఛత్తీస్‌గఢ్‌ ఖాళీ అయింది. ఇప్పుడు మహారాష్ట్రకు కేంద్రం దృష్టి మళ్లించింది.

–  జాగృతి డెస్క్‌


‘నగ్జలైట్లకు చైనా పూర్తి మద్దతు’

‘చైనా కమ్యూనిస్టు పార్టీ, చైనా ప్రభుత్వము తమ పత్రికల ద్వారా, రేడియో ద్వారానూ అదే పనిగా ప్రచారం చేయడం మూలంగా నగ్జలైట్ల కుహనా విప్లవ అతివాద దుందుడుకు థీసిస్‌కు ఒక రకమైన ‘విప్లవ సువాసన’ అంటింది. దానితో వారు తమ ఈ అద్భుతమైన విప్లవంలోకి అనేక మంది సమరశీల విద్యార్థులను, యువకులను, పెటీ బూర్జువా మేధావులను ఆకర్షించగలిగారు.’

సీపీఎం నాయకుడు ‘మాకినేని బసవపున్నయ్య రచనల సంకలనం’ (ప్రజాశక్తి, ఏప్రిల్‌ 2011)లోని 236వ పేజీలోని పేరా ఇది. ‘నగ్జలిజం`దాని రూపాంతరాలు’ అన్న వ్యాసంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నగ్జలైట్ల కార్యకలాపాల తాజా పరిణామాలను పరిశీలించిన చిత్తశుద్ధి గల ప్రతి ఒక్కరికీ రైతాంగ గెరిల్లా యుద్ధమనీ, వ్యవసాయ విప్లవమనీ, ప్రజాయుద్ధమనీ ఇలా మాట్లాడినవన్నీ వట్టి బూటకమని స్పష్టంగా తోచకమానదు. స్కూళ్లపై, కాలేజీలపై, గ్రంథాలయాలపై బాంబులను వేయడం, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన – ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)కి చెందిన విద్యార్థి, యువజన, కిసాన్‌, ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తలను హత్య చేయడం, పోలీసు వారినీ, సివిలియన్‌ ఆఫీసర్లను చంపడం, స్వార్థపర వ్యక్తులు గాని, పార్టీలు గాని డబ్బిస్తే ఎవరినైనా చంపడానికి సిద్ధపడటం`అవి వారి నిత్య కార్యకలాపాలుగా పరిణమించాయి’ (పే.238) అని రాశారాయన. నగ్జలైట్ల కార్యకలాపాలకు ఎవరూ ఉత్తేజితులు కాకపోవడం వల్ల ‘తమలోకి పనీపాటా లేని వారందరినీ పట్టణాల్లోనూ, నగరాల్లోనూ వుండే సంఘ వ్యతిరేక గూండాలను మూకుమ్మడిగా చేర్చుకున్నారు’ అన్నారు బసవపున్నయ్య.

ఆది నుంచి నక్సలైట్లు ఎన్నికల బహిష్కరణ నినాదం ఇస్తూనే ఉన్నారు. రాజీవ్‌గాంధీకి లోక్‌సభలో (కారణాలు ఏమైనా) 402 స్థానాలు లభించినప్పుడు, ఎన్‌టీఆర్‌కు శాససనభలో 202 స్థానాలు లభించినప్పుడు ఎన్నికల బహిష్కరణ పిలుపునిచ్చారు. ఇది ఇప్పటికీ కొనసాగుతున్నది. ఇదే అంశాన్ని బసవపున్నయ్య (పే.239) విశ్లేషించారు. ‘1968`70 మధ్య బూర్జువా వర్గం మన దేశంలో ఆరు రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు జరిపింది. ఆ ఎన్నికలలో నూటికి 70 నుంచి 80 శాతం మంది వరకూ వోటింగులో పాల్గొ న్నారు. అయినప్పటికీ వారు గ్రుడ్డిగా ఎన్నికలను బహిష్కరించాలనే నినాదాన్నే పునశ్చరణ చేస్తూ ఇప్పటికీ ఎన్నికలు కాదు, సాయుధ పోరాటమే మార్గమంటారు!’ అని విమర్శించారు.


ఎంఎల్‌  ‘పార్టీ కూడా ఒక ‘కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపే’

‘దళిత స్త్రీవాద ఉద్యమాలు వలన పార్టీలో అంతర్గత సమస్యలు తలెత్తాయి. ఈ ఉద్యమాలు రాకముందు సమాజంలోని అసమానతలు పార్టీలో వ్యక్తమైనా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు పార్టీలోని స్త్రీలు, దళిత బహుజనులు ఈ అసమానతలను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఏ దళిత`బహుజనుల విముక్తికై పార్టీ కృషి చేస్తున్నదో ఆ శ్రేణులకు చెందిన వారే నాయకత్వ స్థానంలో లేకపోవటానికి అసమానతలే కారణమని దళితవాదులు అంటున్నారు. అలాగే స్త్రీలు పార్టీ లోపల కూడా స్త్రీల పట్ల వివక్షత కొనసాగుతున్నదని, కుటుంబంలాగా పార్టీ కూడా ఒక ‘కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపేనని’ విమర్శిస్తున్నారు. పార్టీలు అంతర్గత నిర్మాణాన్ని ప్రజాస్వామ్య విలువల ఆధారంగా పునర్‌ వ్యవస్థీకరించుకోవాలని ఈ విమర్శలు స్పష్టం చేస్తున్నాయి. అందుకుగాను వివిధ ఆధిపత్య వ్యవస్థలను కూలదోసి వాటి వలన ఉత్పన్నమయ్యే అసమానతలను రూపుమాపాలి.’

(‘మూడు దశాబ్దాల నక్సల్బరీ గమ్యం గమనం’/1998/ పర్స్‌పెక్టివ్‌/పే 27)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE