క్రైస్తవ విస్తరణ తెలుగు సీమలో కుగ్రామాల్లో, చిట్టడవుల్లో మొదలైందనుకుంటారు. మరికొందరు అది తీరప్రాంతాల్లో తన దండయాత్ర ఆరంభించిందనుకుంటారు. కాదు, కాదు కళింగసీమను…ఉప్పెనలా తాకిందనుకునేవాళ్లూ ఉన్నారు. లేదు, లేదు…పలనాటిసీమలో అనేవాళ్లూ, రేనాటి నేలలో అని కూడా అంటూ ఉంటారు. ఇవేవీ నిజం కాదు. క్రైస్తవం తెలుగు ప్రాంతాలను వలయాకారంలో ఆక్రమించి, మత విస్తరణ అనే అనైతిక యాత్రను మొదలు పెట్టింది. తెలుగునాట క్రైస్తవ మిషనరీల విస్తరణ కాంక్ష ఎప్పుడు మొదలైంది? ఏ ప్రాంతాలను ఎప్పుడు తాకింది? సంవత్సరాల వారీగా. లెక్కలు తీసే ప్రయత్నంలో భాగ·మే ఈ వ్యాసం.

“How shall we deal with Hindu and muhammadian enquirers and Convert who have more than one wife” ఇది 1886 లో రెవరెండ్ జెజే లూకాస్ అనే మత బోధకుడు రాసిన పుస్తకం. కానీ, 1840ల చివర నుంచే ఒక వైపు రాయలసీమలోని కడప, కర్నూలు, అనంత పురం, చిత్తూరు జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలనే క్రైస్తవానికి మళ్లించాయి మిషనరీలు. నిరుపేద గ్రామాలను, మారుమూల ప్రాంతాలను ఎంపిక చేసుకుని,అక్కడే తిష్టవేసి, తమ విస్తరణ కాంక్షకు ఆచరణ రూపమిచ్చాయి. ఈ మాటలు నేను చెప్పడం లేదు. మిషనరీల విస్తరణ కోసం మన దేశంలో పనిచేసిన జి. హెర్బర్ట్ వేర్ 1912లో రాసిన “Christian Missions In The Telugu Country” పుస్తకంలోనే వాస్తవాల ఆధారంగా క్రైస్తవ మిషనరీలు రాయలసీమను క్రైస్తవసీమగా మార్చిన విషాద వాస్తవాన్ని పంచుకునే ప్రయత్నంలో వెతుకుతుండగా, రెవరెండ్ జేజే లూకాస్ పుస్తకం రహస్యాల చిట్టా విప్పింది. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ రాజకీయ సంచలనాలకు కేంద్రమైన కడప జిల్లా నుంచే క్రైస్తవ మిషనరీలు చేసిందేమిటో చూద్దాం.1859లో పులివెందుల, జమ్మలమడుగుకు సంబంధించిన కలసపాడు క్రైస్తవ మిషనరీ13 సమావేశాలు నిర్వహించింది. 619 మందితో మతదీక్ష(బాప్టిజం) చేయించింది. మరో 527 మందిని మతం మార్చేందుకు సిద్ధంగా ఉంచింది. 1869లో 1677 మంది మతం మార్చింది. మరో 1,154 మందిని మతం మార్చేందుకు సిద్ధం చేసింది. 1876-77 ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో పెద్ద కరవు వచ్చింది. దీన్నే ‘నూకల కరవు’గా పిలుస్తారు. వండుకోవడానికి బియ్యం లేక, పశువులకు పెట్టే ‘తౌడు’ తిన్నారు జనం. తౌడు తినడం వల్ల మలవిసర్జన కష్టమై నానా అవస్థలు పడ్డారు. ఆసుపత్రి సౌకర్యం లేక రోజుల తరబడి కడుపు నొప్పితో అల్లాడిపోయారు. దుర్భిక్షంలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆసరాగా తీసుకున్న ముత్యాలపాడు మిషన్ ఇంచార్జీ మిస్టర్ స్కాట్ మతమార్పిడి మొదలుపెట్టాడు. 1879లో 76 స్వస్థత సభలు నిర్వహించాడు. 2,377 మందిని క్రైస్తవం స్వీకరించేలా చేశాడు. మరో 1,795 మందిని స్వస్థత సభలకు వచ్చేవారికి అతిథ్యమిచ్చేవారిగా మార్చారు. ఇలా మతమార్పిడికి గురైనవారిలో ఎక్కువగా ఎస్సీలు, వెనుకబడిన కులాలకు చెందినవారు ఉన్నారు. ఏ వర్గాలను లక్ష్యంగా చేసుకుంటే..తమ పని పూర్తవుతుందో మిషనరీలు ముందుగానే గుర్తించేవి. వెంటనే రంగంలోకి దిగేవి. ఆనాటి గెజిట్ల ప్రకారం, మరీ ముఖ్యంగా కడప జిల్లా గెజిట్ ప్రకారమే గ్రామీణ జనాభా 300  నుంచి 400కు మించేది కాదు. పెద్ద గ్రామమైతే జనాభా 1,000 ఉండేదని గెజిట్ చెపుతుంది. హైదరాబాద్ లాంటి మహానగరాల జనాభాయే ఆ కాలంలో 10 వేలకు మించని రోజులు. చిన్న గ్రామమైనా, పెద్ద గ్రామ మైనా, జనాభాల్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు. వీరినే లక్ష్యంగా చేసుకున్నాయి మిష నరీలు. వారికి ఆర్థిక, వైద్య సదుపాయాలను ఎరగా వేశాయి. సీమనేలపై శిలువలు పాతాయి. 1855లో ముత్యాలపాడు, మద్దూరు గ్రామాల్లో సుమారు 74 మంది బాప్టిజం తీసుకున్నారని, ఈ ప్రభావంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా మిషనరీ వద్దకు వచ్చి, తాము కూడా చేరతామని ప్రాధేయపడేవారని ఎం.జే.క్లే అనే క్రైస్తవ మత ప్రబోధకుడు రాసుకున్నాడు. దీంతో 1855 తర్వాత ముత్యాలపాడు చుట్టుపక్కల గ్రామాల్లో మిషనరీ పనిని ఉధృతం చేసినట్టు పేర్కొన్నాడు. అయితే 1853లో జరిగిన ఓ ఘటనతో క్రైస్తవంలో చేరేందుకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారనే మాట అబద్ధమని అర్థమవుతుంది. నంద్యాల ప్రాంతంలోని రుద్రవరం గ్రామంలో జూలై, 1852లో 30 మంది బాప్టిజం తీసుకున్నారు. సెప్టెంబర్, 1853లో గూబగుండం, జమ్ములదిన్నె గ్రామాల్లో 80 మంది బాప్టిజం తీసు కున్నారు. దీంతో గ్రామాలకు గ్రామాలనే క్రైస్తవంలోకి చేర్పించాలనే మిషనరీలు భావించాయి. డిసెంబర్, 1853లో గోరిగెన్నూరు, మద్దూరు గ్రామాలకు వెళ్లి స్వస్థత సభలు పెట్టేందుకు ప్రయత్నించాయి ఆ పనిలో భాగంగా వచ్చిన వ్యక్తికి గ్రామాల్లోని దళితులు, బీసీలు అందరూ కలిసి దేహశుద్ధి చేశారు. ఊరి పొలిమేరల వరకూ తరిమారు. అంతకుముందు 1849లో నంద్యాల ప్రాంతంలో రెవరెండ్ ఉరియాడేవిస్ చేసిన ఇదే తరహా ప్రయత్నాలను రుద్రవరం, తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తిప్పికొట్టారు. మతమార్పిడికి నిరాకరించారు. మిషనరీలవల్ల నేరుగా బాప్టిజం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం కష్టమైపోయింది. దీంతో అప్పటికే మతమార్పిడి చేసుకుని, మిషనరీలకు సన్నిహితంగా ఉండే వ్యక్తులను అవి రంగంలోకి దించాయి. అలాంటి వ్యక్తులద్వారా వారి బంధువులను ఉచ్చులోకి లాగే కుట్రకు దిగాయి. ఆ క్రమంలో చుట్టుపక్కల గ్రామాల్లోని బంధువుల ప్రమేయంతో పల్లె ప్రజలు బాప్టిజం తీసుకోవడం పెరిగిపోయింది. కడప, కర్నూలు జిల్లాల్లోనే కాదు ఏ ప్రాంతంలో అయినా భూ తగాదాలుంటాయి. రాయలసీమ జిల్లాల్లో కొంత ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ కులాలకు ఉండే భూ తగాదాలను, భూమిలేని వారిని మభ్యపెట్టి, తగాదాల పరిష్కారం మార్గం చూపిస్తామని, తమవద్దకు వస్తే ఆర్థిక స్థితి మారుతుందనే ఆశచూపి మత మార్పిడులకు పాల్పడిన దాఖలాలెన్నో. ఆనాటికి కలరా, మశూచి వంటి వ్యాధులు ప్రబలి గ్రామీణులు అవస్థలు పడేవారు. ప్రాణాలు కోల్పోయేవారు. ఇలాంటి సమయంలో, వైద్య సదుపాయం అందించడం ద్వారా బాధితులతో మిషనరీలు మత మార్పిడి చేయించేవి. ఇది కాస్త మైదాన ప్రాంతాలను అనుసరిస్తూనే, క్రమంగా రాయలసీమ జిల్లాలను ఆనుకొని ఉన్న, నల్లమల అటవీ ప్రాంత పొరుగు గ్రామాలను కూడా ఆక్రమించింది. ముఖ్యంగా పాత కర్నూలు జిల్లాలో ఇప్పటి ప్రకాశం జిల్లా ప్రాంతానికి సైతం తమ కార్యకలాపాలను మిషనరీలు  విస్తరిం చాయి.

హెర్బర్ట్ తన పుస్తకంలో నిస్సిగ్గుగా కొన్ని విషయాలు రాశాడు. మిషనరీ కార్యకలాపాల విస్తరణకు రెండు అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. అందులో మొదటిది 1897 కరువు కాగా రెండవది 1899-1901లో తీవ్ర క్షామం అని పేర్కొన్నాడు.  కర్నూలు, బళ్లారి ప్రాంతాల్లో నీటి కొరతను ప్రస్తావిం చాడు. తాగునీటి కటకట, సాగునీరు లేకపోవడం గురించి రాశాడు. ఒక్క కర్నూలు జిల్లాలో తొమ్మిది నెలల కరవులో 48వేల మంది చనిపోయినట్టు రాశాడు. కరవు, దుర్భిక్షంలో ప్రజల ప్రాణాపాయ స్థితిని సొమ్ము చేసుకుని, అనారోగ్యాన్నీ, పేదరికాన్నీ, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని రాయలసీమ ప్రాంతంలో మిషనరీలు క్రైస్తవాన్ని విస్తరించాయి. ఇన్ని మరణాలు సంభవిస్తున్న సందర్భాలను అద్భుత అవకాశాలుగా అభివర్ణించడం, ఉన్మాదానికి పరాకాష్ఠగా చెప్పాలి.

నదీతీరాల్లో సాంస్కృతిక విధ్వంసం

రాయలసీమ ప్రాంతంలో మతరక్కసి ఎలా కోరలు చాచి, నిరుపేదల కష్టాన్నీ, ఆపదల్నీ ఆసరాచేసుకుని విస్తరణకు పూనుకుందో చూశాం. ఇప్పుడు కోస్తా ప్రాంతానికి వద్దాం. కృష్ణ, గోదావరీ నదీతీర ప్రాంతంలో, బందరు, కాకినాడ, విశాఖ పట్నం వంటి రేవు పట్టణాల్లో 19వ శతాబ్దం ఉత్తరార్థంలో, క్రైస్తవ మిషనరీలు నిరుపేదలే లక్ష్యంగా మతమార్పిడులను విజయవంతంగా చేపట్టాయి. ఇది కృష్ణ, గోదావరి నదీ తీరాల్లో జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు, ప్రజా జీవనంలో సనాతన ధార్మిక వైభవంపై దుష్ప్రభావాన్ని చూపింది. ప్రాచీన ఆలయ సంపద జనపదాన్ని తీర్చిదిద్దింది. సాహిత్య సేవకు పునాదులు వేసింది. అలాంటి పవిత్రభూమిలో క్రైస్తవం జడలు విప్పింది. ఇవేమీ కల్పిత కథలు కావు. పరిశోధకులు, చరిత్రకారులు చెప్పినవే. హెర్బర్ట్ వేర్ రాసిన ‘క్రిష్టియన్ మిషన్స్ ఇన్ తెలుగు కంట్రీ’ పుస్తకం సహా అనేక ఇతర పరిశోధన పుస్తకాలను సంప్రదించి మాత్రమే చెపుతున్నవి. 19వ శతాబ్దం ఉత్తరార్థంలో కృష్ణా, గుంటూరు, రాజమండ్రి సహా తూర్పు తీరంలో విశాఖపట్నంలో రకరకాల పేర్లతో క్రైస్తవ మిషనరీలు  దళితులే లక్ష్యంగా మతమార్పిడి కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. గోదావరి డెల్టాతో పాటు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలకు మిషన రీలు విస్తరించాయి. గోదావరి డెల్టాలో అయినా, తూర్పు తీరంలో అయినా, దక్షిణ కోస్తాలో అయినా ప్రధానంగా దళితులనే లక్ష్యంగా చేసుకున్నాయి ఈ మిషనరీలు. కృష్ణా జిల్లాలోని ఉత్తర ప్రాంతంలో చర్చి మిషనరీ సొసైటీ, రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో అమెరికన్ ఎవాంజెలికల్ లూథరన్ చర్చి, విశాఖ పట్నంలో లండన్ మిషనరీ సొసైటీ, కాకినాడలో కెనడియన్ బాప్టిస్ట్ మిషన్, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ సొసైటీలు మతమార్పిడులు మొదలుపెట్టాయి. ఎస్సీలనే లక్ష్యంగా చేసుకున్నాయి. ఇక్కడ చెపుతున్న వాస్తవాలను ఎవరైనా రూఢీ చేసుకోవాలంటే వి.శాంతకుమారి రాసిన Church Missionary Society in Coastal Andhra, 1850-1950: Mediating Change among the Malas ఆర్టికల్ చదవవచ్చు. క్రైస్తవ మిషనరీలు ఎక్కడా కూడా నేరుగా మతమార్పిడి అనే మాటను ఉపయో గించవు. ఎస్సీలకు విద్య, వైద్యం, ఆర్థిక స్వావలంబన పేరిట, వారికి దగ్గరై, క్రమంగా వారిని స్వస్థత సభలకు ఆహ్వానించడం, అక్కడి నుంచి వారిని విజయవంతంగా దారి మళ్లించడమే మిషనరీల లక్ష్యం. మరీ ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతంలోని నదీ, సముద్ర తీర ప్రాంతాల్లో ఎస్సీ జనాభా చాలా అధికం. విసిరేసినట్టు ఉండటం కాకుండా, ఒకేచోట కొన్ని వేల కుటుంబాలు ఉండటంతో, ఈ ప్రాంతాలను తమ లక్ష్యంగా మిషనరీలు ఎంపిక చేసుకున్నాయి. దీంతోపాటు అప్పటికే ఆంగ్లేయుల పాలన ఉండటం కూడా వాటికి అనుకూలించింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో, ఎస్సీ జనాభా ఉన్న ప్రాంతంలో 1850 నుంచి 1950 వరకు, సుమారు వందేళ్ల కాలంలో, కొన్నివేల ఎస్సీ కుటుంబాలు మతమార్పిడికి గురయ్యాయి. 1766లో కోస్తాంధ్ర ప్రాంతం నిజాం అధీనంలో నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలోకి రావడంతో మిషనరీ కార్యకలాపాలకు మార్గం సుగమం అయ్యింది. కోస్తా ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వ్యాపారం మాత్రమే చేయలేదు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లోని ప్రజల సాంస్కృతిక వారసత్వాన్ని, సనాతన ధర్మంపై వారికి గల విశ్వాసాలను తుడిచిపెట్టేయాలనేది దాని లక్ష్యం. వాణిజ్యం కోసం ప్రవేశించి, మతమార్పిడులు చేసి, ఆ తర్వాత, పాలనా యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో 1859 నుంచి 1877 మధ్య సుమారు 56వేల కుటుంబాలు బాప్టిజం తీసుకున్నాయనే లెక్కలున్నాయి. బ్రిటీష్ ఇండియాలోని గెజిట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆయా ప్రాంతాల జనాభా నిష్ఫత్తి ఎలా మారిందో తెలుస్తుంది. సర్కారు జిల్లాలుగా పిలిచే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కొన్ని వేల కుటుంబాలు ఈ కాలంలోనే క్రైస్తవాన్ని స్వీకరించాయి. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో 1850 నుంచి 1900వరకు రాగానే క్రైస్తవ జనాభా పెరగడమే కాదు, చర్చి ఆస్తులు సైతం భారీగానే పెరిగాయి. ఆ కాలంలో కూడగట్టిన ఆస్తుల మూలంగానే ఇటీవలి కాలంలో చర్చి ఆస్తులపై ఆధిపత్యం కోసం క్రైస్తవుల్లోని రెండు వర్గాలు బాహటంగా ఘర్షణకు దిగిన ఘటనలు చూశాం. ఆంధ్రా ఎవాంజెలికల్ లూథరన్ చర్చిపై ఆధిపత్యం కోసం ఇద్దరు పాస్టర్ల మధ్య తగాదా సుప్రీం కోర్టు దాకా వెళ్లిందంటే, దాని ఆస్తి ఏ స్థాయిలో ఉన్నదీ ఊహించుకోవచ్చు. మిషనరీల ప్రభావంతో క్రైస్తవ జనాభా పెరగడంతో, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, క్రైస్తవులకు విలువైన భూములను ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చర్చిలకు సంబంధించిన ఆస్తులు సుమారు 1,000 వరకు ఉంటాయని అంచనా. ఈ ఆస్తుల విలువ కొన్ని వందల కోట్ల రూపాయలకు చేరడంతో హత్యలు, హత్యాయత్నాలు మొదలయ్యాయి. చర్చి ఆస్తులను ఆక్రమిస్తున్నారనే పేరిట 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా The Protection of Christian Properties from Illegal Sale and Occupation Act పేరిట ఓ చట్టమే చేసింది. మతమార్పిడి సందర్భంలో ఆస్తుల సంగతి ఎందుకు అనుకుంటున్నారేమో? కానీ ఇబ్బడిముబ్బడిగా క్రైస్తవ జనాభా పెరగడంతో ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యక్తుల ద్వారా చర్చిలకు పెద్ద ఎత్తున ఆస్తులు సమకూరాయి. ఈ ఆస్తులపై ఆధిపత్యం కోసం రాజకీయ ప్రాబల్యాన్ని చర్చిలు పెంచుకున్నాయి. కోస్తా ప్రాంతంలో మతమార్పిడులు ముఖ్యంగా దళితుల బాప్టిజం స్వీకరణ గురించి తెలుసుకోవాలంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా(సీఎసఐ) డాక్యుమెంట్లను, చారిత్రక పత్రాలను పరిశీలిస్తే చాలు. ఎస్సీల్లో ఓ సామాజిక వర్గం లక్ష్యంగా మిషనరీలు మతమార్పిడులు చేశాయని సీఎసఐ డాక్యుమెంట్లు చెపుతున్నాయి. మచిలీపట్నంలో జనరల్ పీటర్ ఆధ్వర్యంలో 1810లోనే చర్చి కార్యక్రమాలు మొదలై క్రమంగా ఊపందుకున్నాయి. మత్స్యకార సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మతమార్పిడులు చేయాలని చూస్తే, వ్యతిరేకత కనపరిచినట్టు మచిలీపట్నంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశం తర్వాత జరిగిన చారిత్రక ఘటనలు చూస్తే తెలుస్తుంది. రెవరెండ్ జాన్ టక్కర్, ఆనాడు కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన జాన్ గోల్డింగామ్‌లు 1836లో చర్చి మిషన్ సొసైటీని స్థాపించి మతమార్పిడులను మొదలుపెట్టారు. దీన్ని ‘తెలుగు మిషన’గా పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని ఉత్తర ప్రాంతంతో పాటు మచిలీపట్నంపై  సీఎసఐ దృష్టి సారించింది. మతమార్పిడులను ప్రోత్సహిం చింది. అందుకే ఇప్పుడెవరైనా వెళ్లి పరిశీలించినా, ఆ ప్రాంతాల్లో క్రైస్తవ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 1830 నాటికి కోస్తా గ్రామీణ ప్రాంతాల్లోని కుల జనాభాకు 1876 నాటికి ఉన్న కుల జనాభాకు చాలా వ్యత్యాసం వచ్చింది. క్రైస్తవం స్వీకరించినవారు తమను తాము క్రైస్తవులుగా చెప్పుకున్నారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటివారు మళ్లీ తమ కుల అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, రిజర్వేషన్లు పొందడం మొదలు పెట్టారు. విశ్వాసంలో మాత్రం తాము క్రైస్తవుల మంటూ చెప్పుకున్నారు. రెవరెండ్ జాన్ టక్కర్ ఆధ్వర్యంలో సీఎసఐ కార్యకలాపాలు క్రమంగా ఏలూరు, బెజవాడ, రాఘవాపురం, ఖమ్మంమెట్టు, డోర్నకల్ వరకూ పాకాయి. రాయలసీమలో కర్నూలు నుంచి మొదలుపెట్టి మొత్తం సీమ ప్రాంతంలో మిషనరీ కార్యక్రమాలు విస్తరించాయి. చిత్తూరు ఇందుకు కొంత మినహాయింపు. 1888లో ఖమ్మం మెట్టు మిషనరీ కార్యక్రమాలకు ప్రధానంగా మారి, ఇటు తెలంగాణలోకి విస్తరించింది. బ్రిటీష్ సామ్రాజ్య విస్తరణ ఎంత దీర్ఘకాలిక ప్రణాళికతో, క్రమబద్ధంగా, పద్ధతిగా సాగిందో, మిషనరీ కార్యకలాపాలు కూడా అలాగే ముందు ఒక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని, అక్కడి నుంచి మొత్తం ప్రాంతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవడమనే పద్ధతిని పాటించాయి. కర్నూలు కేంద్రంగా రాయలసీమను, కృష్ణా జిల్లా కేంద్రంగా మొత్తం కోస్తా ప్రాంతాన్ని, అటు తూర్పు తీరంలో విశాఖ పట్టణం కేంద్రంగా చేసుకుని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కబళించాయి. తెలుగుసీమలో మిషనరీ కార్యక్రమాలను నిశితంగా అధ్యయనం చేస్తే, మొత్తం బ్రిటీష్ ఇండియా చరిత్రను మరోకోణం నుంచి చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ బ్రిటీష్ పాలనను ఆధునికతను తెచ్చిన కాలంగా పరిగణించే చారిత్రక ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించి, మతపరమైన ఆధిపత్యాన్ని రుద్దిన పాలనకాలంగా, దేశీయ చింతనను, విశ్వాసాలను, సాంస్కృతిక సంపదను ధ్వంసం చేసిన కాలంగా పరిగణించాల్సి ఉంటుంది.

హైందవంపై క్రైస్తవ దాడి – చారిత్రక పత్రాలు

క్రైస్తవ మత మార్పిడి భూతం కేవలం ఎస్సీ, బహుజనులనే కాదు, అగ్రవర్ణాలను కూడా వదల్లేదు. రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు సైతం బాప్టిజం తీసుకున్న దాఖలాలు తెలుగుసీమ సామాజిక చరిత్రలో తారసపడతాయి. వలసవాద నాగరికత, అది తీసుకువచ్చిన ఆధునికత, ఈ రెండింటివల్ల చోటు చేసుకున్న సామాజిక పరివర్తన సాంస్కృతిక విధ్వంసానికి దారి తీసింది. ధార్మిక మూలాలపై దాడి చేసింది. సనాతన తత్వాన్ని దూరం చేసింది. వలసవాదం, నాగరికత, ఆధునికత ఈ మూడింటినీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో అధ్యయనం చేస్తే, ప్రాచీనమైన ఆర్షధర్మానికి జరిగిన కీడు తెలుస్తుంది. తెలుగు ప్రాంతాల్లో శతాబ్దాల క్రితమే వేదాధ్యయనం, ధార్మిక సేవ, దేశీయ చింతనకు చాలా కృషి జరిగింది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశంతో పరిస్థితులు తారుమారయ్యాయి. తెలుగువారు చాలా మంది ఆధునికతను, ఆంగ్లభాషను మైమరచి ఆదరించారు. పనిలో పనిగా క్రైస్తవం అలముకున్నది. మతమార్పిడి ఉధృతమైంది. ఇది నేను చెపుతున్నది కాదు. ‘హిస్టరీ ఆఫ్ తెలుగు క్రిస్టియన్స’పేరిట 1910లో వెలువడిన పుస్తకాన్ని నిశితంగా పరిశీలిస్తే, తెలుగు ప్రాంతాల్లో మతమార్పిడి శతాబ్దాల క్రితమే ఎలా మొదలైందో తెలుస్తుంది. వలస పాలన ఆరంభంలోనే కులవ్యవస్థపై బ్రిటీష్ మేధావులు దృష్టి పెట్టారు.అది  మతమార్పిడికి, సామాజిక అంతరాలకు ఉపయోగ పడుతుందని గుర్తించారు. మత మార్పిడికి భారతదేశంలో ఉన్నన్ని అవకాశాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవని తీర్మానించారు. ‘హిస్టరీ ఆఫ్ తెలుగు క్రిష్టియన్స’ పుస్తకంలో ఆద్యంతం ఈ ధోరణి వ్యక్తమవుతుంది. అంతే కాదు, మిషనరీల మతమార్పిడి చర్యలను వ్యతిరేకించిన దాఖలాలను కూడా ఈ పుస్తకం చెప్పకనే చెబుతుంది. ఒకప్పటి దత్తమండలాలుగా పిలిచే ప్రాంతాల్లో సామాజిక వివక్ష ఎదుర్కొన్న కులాలే కాదు, అగ్రవర్ణాలకు చెందిన వారు కూడా వలసపాలకుల మాయలోపడి మతమార్పిడికి సిద్ధపడ్డారు. వితరణశీలత పేరిట జనాకర్షక కార్యక్రమాలు నిర్వహిస్తూ మతమార్పిడికి రంగం సిద్ధం చేశాయి క్రైస్తవ మిషనరీలు. తొలిదశలో రాయలసీమ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రత్యేక కారణాలున్నాయి. వర్షాభావం, దుర్భిక్షం కారణంగా సీమ జన జీవనం కష్టంగా మారిన నేపథ్యంలోనే , మిషనరీలు ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. 1911-12 మధ్య కాలంలో కేవలం 16 నెలల వ్యవధిలో సుమారు 45వేల మంది వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు బాప్టిజం తీసుకున్నట్టు తెలుగు క్రిస్టియన్ల చరిత్ర పుస్తకం చెపుతుంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బళ్లారి మొదలు అనంతపురం  జిల్లాలో  వేలాది కుటుంబాలు మతం మారాయి. అనంతపురం జిల్లా 1910నాటికే కరవు బారిన పడింది. అప్పటి నుంచి సుమారు వందేళ్ల కరవును అనుభవించింది. ఈ కరవుకాలంలో మిషనరీలు పల్లెలపై కన్నేసి, మతమార్పిడికి పథక రచన చేశాయి. దుర్భిక్ష పరిస్థితులను సువార్త కూటములకు ఆసరాగా మార్చుకున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని సుమారు 18 వివిధ సామాజిక వర్గాలే లక్ష్యంగా మతమార్పిడులు చేశాయి. రాయలసీమ జిల్లాల్లో సుమారు 3 లక్షల 40వేల మందిని మతం మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాయి. పత్రికలు ప్రచురించడం, వైద్యసాయం అందించడం వంటి ఎరలు వేసి…ప్రజలను తమ ముగ్గులోకి దింపాయి. క్రైస్తవ మిషనరీలు తొలిదశలో నేరుగా మతమార్పిడి గురించి ప్రస్తావించకుండా వైద్యసాయం చేశాయి. ఈ క్రమంలో విగ్రహారాధనపై ఏవగింపును పెంచేందుకు ప్రయత్నించాయి. 1830 నాటికే తెలుగు ప్రాంతాల్లోకి ప్రవేశించిన మిషనరీలు ముందు సామాజిక అధ్యయనం చేశాయి. వివిధ సామాజిక వర్గాల స్థితిగతులు, ఆర్థిక ఆదాయం, కుల వృత్తులు వంటి అంశాలను నిశితంగా పరిశీలిం చాయి. వాటి వలకు చిక్కే వర్గాలు ఎస్సీ, ఎస్టీలే అని గుర్తించాయి. మనం ఇప్పటికీ బాగా పరిశీలిస్తే, తెలుగు ప్రాంతాల్లోని కుల వృత్తులకు చెందినవారు మతం మార్చుకున్న దాఖలాలు చాలా అరుదు. కుమ్మరి, కమ్మరి, కురవ, యాదవ, కంసాలి, చాకలి వంటి కులాల్లో మత మారిన దాఖలాలు లేవు. దక్షిణ భారత దేశంలో మతమార్పిడులకు ప్రత్యేక పద్ధతులనే కనిపెట్టేందుకు చాలా శ్రమించాల్సి వచ్చినట్టు Catholic missions in southern India పుస్తకంలో W. Strickland అంటాడు. ‘క్రిస్టియన్ మిషన్స’ పుస్తకంలో T.w.m. మార్షల్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. సామాజిక వర్గాల విభజనను మరింత తీవ్రం చేయడం వల్ల తమ పని సులువు అవుతుందని మిషనరీలు భావించాయి. ఈ ఉద్దేశంతోనే వివక్షను మరింత పెంచేందుకు ప్రయత్నించాయి. సామాజిక విభజనను ఇది మరింత పెంచింది. వివక్షను ఎదుర్కొన్న సామాజికవర్గాలు మిషనరీల ఆకర్షణ మంత్రానికి గురయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయ ప్రధాన కుటుంబాలు, మోతుబరి రైతుల కుటుంబాలు సైతం మతమార్పిడికి ఎందుకు మొగ్గు చూపాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 1699లోనే ‘కర్ణాటక మిషన’ పేరిట కన్నడదేశంలో క్రైస్తవం విస్తరించడం మొదలుపెట్టింది. ఈ ప్రభావమే రాయలసీమపై పడిందంటారు పరిశోధకులు. అనతి కాలంలో కర్ణాటకలో ఒక లక్షా యాభై వేల మంది తమ మతం మార్చుకున్నారని చరిత్ర పుటలు తిరగేస్తే తెలుస్తుంది. కర్ణాటకలో మతమార్పిడులు జరుగుతుండగానే తెలుగు ప్రాంతాలపై మిషనరీలు  దృష్టి సారించాయి. అప్పటికే తెలుగువారి జనాభా గురించి ఒక స్పష్టమైన అంచనాకు వచ్చాయి. మొత్తం తెలుగు ప్రాంతాల జనాభా 1710 నాటికి ఒక కోటీ 22 లక్షలుగా మిషనరీలు నిర్ధారించాయి. తమ లక్ష్యా లను చేరుకోవ డానికి మిషనరీలు ఎంత నిర్దిష్టంగా పనిచేశాయో దీన్నిబట్టి తెలుస్తుంది. కర్ణాటక ప్రాంతంలో మిష నరీలు తలపెట్టిన మతమార్పిడి కార్యక్రమానికి బ్రాహ్మణులతో పాటు కులవృత్తులకు చెందిన వారి నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఒకానొక దశలో మిషనరీలకు సంబంధించిన సిబ్బందిపై వెనుకబడిన తరగతులు చెందినవారు దాడి చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంనుంచి గోదావరి దాటి, అటు మహారాష్ట్రలోకి వెళ్లాలని మిషనరీలు చాలా ప్రయత్నాలు  చేశాయి. కానీ వాటి ఆటలు సాగలేదు. అందుకే నేటికీ మహారాష్ట్ర ప్రాంతంలో క్రైస్తవ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దాదాపుగా ఉండదని చెప్పాలి. ఎస్సీ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవడంలో మిషనరీలు లక్ష్యాన్ని సాధించాయి. సామాజిక అంతరాన్ని మత ఘర్షణగా మార్చడంలో విజయవంతమయ్యాయి. అయితే సమాజంలోని సంపన్నవర్గాలు ముఖ్యంగా మోతుబరి రైతు కుటుంబాలు సైతం తమవైపు ఆకర్షితులు కావడంతో మిషనరీలు సంతోషించాయి. ఈ విషయాన్ని హిస్టరీ ఆఫ్ తెలుగు క్రిస్టియన్స్ పుస్తకంలో చూడొచ్చు. ముఖ్యంగా కడప జిల్లా నుంచి అటు పైకి పెన్నా తీరంలోని ప్రాంతంలో, దక్షిణ కోస్తా ప్రాంతంలోకి మిషనరీలు ప్రవేశించిన తర్వాత రెడ్డి, నాయుడు సామాజిక వర్గాలకు చెందినవారు బాప్టిజం తీసు కున్నారు. ఈ పరిణామానికి మూలమేంటనేది ఇప్పటికీ అంతుబట్టని విషయం. ముఖ్యంగా వెలనాటి రెడ్లు బాప్టిజం తీసుకున్నట్టు తెలుగు క్రిస్టియన్ల చరిత్ర చదివితే తెలుస్తుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని పెద్ద ఆరికట్ల ప్రాంతంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు తొలిదశలో క్రైస్తవాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ జోషి

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.