కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాని అధ్యక్షుడు, వాస్తవంగా మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ పరువును బిహార్‌ ఎన్నికల ఫలితాలు నిట్టనిలువునా తీసేశాయని మనమంతా భ్రమపడ్డాం. బిహార్‌లో పోతేపోవచ్చు. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన గాంధీ-నెహ్రూ కుటుంబం ఇలాంటివి ఖాతరు చేయదు. బిహార్‌ అపకీర్తిని పూర్వపక్షం చేస్తూ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతర్జాతీయ ఖ్యాతి రాహుల్‌ ‌ఖాతాలో వచ్చి పడింది. అదేమిటో ఒక్కసారి చూడడం జాతి ఎదుట ఉన్న కర్తవ్యం. కొందరు చూసి ఊరుకుంటారు. కానీ చూసి తరించేవారూ ఉన్నారు, కాబట్టి వారికి తరించే అవకాశం ఇవ్వాలి.


అమెరికా తొలి నల్లజాతి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆత్మకథ రాసుకున్నారు.  పేరు- ‘ఎ ప్రామిస్డ్ ‌ల్యాండ్‌’. ఇం‌దులో బరువైన విషయాలకు తప్ప చోటు దక్కదు. రాసిన వ్యక్తి అంతటివాడు. చరిత్ర సృష్టించిన వాడు. అందులో చాలామంది ప్రపంచ నేతల గురించి ఒబామా గుర్తు చేసుకున్నారు. ఇందుకు  తనదైన శైలిని నిర్మించుకున్నారు. ఆ పుస్తకం నిండా లోతైన అధ్యయనం, వ్యంగ్యం పోటీ పడ్డాయట. లోతైన అధ్యయనానిదే పెద్దపీట అని కొందరు సమీక్షకులు తేల్చారు. కానీ వ్యంగ్యాస్త్రాలు వేయించుకునే అదృష్టం కొందరికే ఇచ్చారు ఒబామా. ఆ సదవకాశం మన రాహుల్‌కూ ఇచ్చారు.

 రాహుల్‌లో ధైర్యం లేకపోవడం ఒకటే కాదు, జ్ఞానం విషయంలో అపరిపక్వత కూడా ఉందని తేల్చారు ఒబామా. ఆహా! ఒబామా అధ్యయనం లోతైనదని ఈ రెండు మాటలతోటే యావత్‌ ‌ప్రపంచం అంగీకరించకతప్పదు.

చేతికి ఎముక లేకుండా భజన సమాజాలను పోషించే కాంగ్రెస్‌ ‌పార్టీలో ఈ విశ్లేషణని అంతా ఒప్పుకుంటారా ఏమిటి? కొందరు అర్ధమైనా ఒప్పరు. కొందరికి అర్ధం కాక ఒప్పుకోరు. ఈ రెండో బాపతు వారి కోసం బహు పసందైన వివరణ ఇచ్చారు ఒబామా మాస్టారు. రాహుల్‌జీని ఓ బడిపిల్లాడు అనుకోండి! కాస్సేపే అనుకోండలా. చదవాల్సిందంతా చదివేసినట్టు కనిపిస్తూ, చండామార్కుల వారి దగ్గర నుంచి  మొదటిగా తానే మార్కులు కొట్టేయాలనుకునే విద్యార్థి వలే ఉంటాడట. దీనికి మళ్లీ కొసరు వివరణ కూడా దయచేశారు, అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు. చదివిన విషయం మీద పట్టు సాధించాలన్న అభిరుచీ, తృష్ణ ఆ రెండింటిలో ఒకటి ఆయనలో కనిపించదని ఒబామా ఇంత పరిశోధనలోను హంసపాదు పెట్టారు. అభిరుచా, తృష్ణా! ఏది ఆయనలో లోపించినది? ఆ ఏదో ‘ఒకటి’ ఏదో నిగ్గు తేల్చడానికి ఒబామా మళ్లీ భారత్‌ ‌వస్తారేమో! ఆ సంగతి ఎలా ఉన్నా, ఇక్కడ కూడా ఒబామా అధ్యయనం స్థాయి జెర్రిగొడ్డుతో పోటీ పడుతున్నదని రుజువైంది. లేదా మరి!

ఎన్నికల గంటలు మోగడం పాపం, నుదిటికి వీశెడు విభూతి అద్దుకుని గుళ్లూ గోపురాలూ తిరిగే రాహుల్‌నీ, తాను శివభక్తుడని చాటుకునే ఈ గాంధీ కుటుంబ వారసుడినీ ఒబామా ఎలా అంచనా వేసి ఉండేవారో! ఇంతవరకు చేసిన అధ్యయనం తక్కువా! కాదు. ఈ విధంగా రాహుల్‌ ‌కీర్తిప్రతిష్టలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి. వారి గుణగణాలు భూగోళమంత•కీ తళతళా మెరుస్తూ కనిపిస్తున్నాయి. బిహార్‌లో ఏకంగా 75 స్థానాలకు పోటీ చేసి 19తో సరిపెట్టుకున్నారాయన. కానీ, కాంగ్రెస్‌ ఓటమి పాపం అసలు గాంధీ కుటుంబీకులకు ఏనాడూ అంటనే అంటదు. ఆ పాపమేదో తమ మీద వేసుకుని త్యాగం చేయడానికి చాలామంది ఉత్సాహపడుతూ ఉంటారు. అదేం ప్రారబ్ధమో, ఒక్కసారి ఆయనతో చేయి కలిపిన వాళ్లెవరూ మళ్లీ ఆ అమృతహస్తం తాకాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఆంధప్రదేశ్‌లో చంద్రబాబు అంతటి వారు కూడా చేతితో చేయి కలపడం దుస్సాహసమని చాలా పెందరాళే గ్రహించారు. ఈ తెలివిడి కర్ణాటకలో కుమారస్వామికి బొత్తిగా లోపించింది. ఫలితం- కాంగ్రెస్‌ ‌చెలిమి కారణంగా నిండుసభలో భోరున విలపించారు. అలాంటి ఘనత ఉన్నా కూడా,  సాహసించి ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వీ కాంగ్రెస్‌ ‌పాణిగ్రహణం చేశారు. పదిహేను స్థానాల తేడాతో ఘటబంధనం చతికిలపడింది.  ఒబామా గారు ఇంకొన్ని విషయాలు కూడా పరిశోధించవలసి ఉంటుంది. ఇందుకు అవసరమైన ఇన్‌పుట్స్ ‌రిపబ్లిక్‌ ‌టీవీ అర్ణబ్‌ అం‌దించగలరు.

ఒబామా ఇంతగా రాహుల్‌ ‌గాంధీని పరిశీలించారు కదా, అందుకు కారకులైన వారి రాజకీయ గురువును గురించి పిసరంత అధ్యయనం జరిపి దాని సారాంశం అక్షరబద్ధం చేసి ఉంటే, వారి మొత్తం ఆత్మకథకే కాదు, రాహుల్‌ ‌మీద చేసిన వ్యాఖ్యలకు కూడా నిండుదనం దండిగా కూడేది. రాహుల్‌ ‌రాజకీయ గురువు డిగ్గీరాజా, దిగ్విజయ్‌ ‌సింగ్‌. ఇలాంటి శిష్యరత్నాన్ని జాతికి అందించిన ఆ గురువు ప్రతిభను చూసి ఒబామా కూడా డంగై పోక తప్పదు. డిగ్గీ గురించి నాలుగంటే నాలుగు ముక్కలు చేర్చినా ఆ ఆత్మకథ అమ్మకాలు కనీసం వందల్లో పెరుగుతాయి. గురువుగారి ద్వితీయ వివాహం, ముదిమిలోని ప్రేమ ముచ్చట్లు తదితర విషయాలు రాస్తే జనం బారులు తీరి ఆత్మకథ వేలల్లో కొనుగోలు చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అది వేరే విషయం. ఈ గురుశిష్యులను చూస్తే – కనీసం తెలుగువారికి- కన్యాశుల్కంలో గిరీశం, వెంకటేశం అనేవారి గురుశిష్య బంధం గుర్తుకు వస్తుంది. ‘మీ దగ్గర చదువుకున్నందుకు నాకేం వచ్చింది? చుట్టకాల్చడం తప్ప’ అని వెంకటేశం నిష్ఠురపడతాడు. అలాగే డిగ్గీరాజా శిష్యరికంతో రాహుల్‌కి తలాతోకా లేకుండా మాట్లాడే కళ తప్ప మరేమీ అబ్బలేదు. కన్నుకొట్టే విద్య, పార్లమెంటులో దానిని ప్రదర్శించే నేర్పూ రాహుల్‌కి ఎవరి దగ్గర పట్టుబడిందో వెల్లడించే అవకాశం ఒబామా తీసుకోలేదు. ఇది లోటే!

 మన్మోహన్‌ ‌సింగ్‌ ‌గురించి కూడా ఒబామా అధ్యయనం చేశారండోయ్‌! అయితే వ్యంగ్యానికి కాసేపు విరామం ఇచ్చి, ‘దయతో కూడిని నిష్పాక్షికత’ ఉన్న నాయకుడని హుందాగా తూకం వేశారు ఒబామా. దయ ఆయనకు ఉందో, సోనియా దయ ఆయనకు ఉందో కొంచెం గందరగోళం ఉందిక్కడ. ఇక మన్మోహన్‌ ‌నిష్పాక్షికత గురించి ఒబామాకి ఇంకొంచెం లోతైన అధ్యయనం అవసరమని చెప్పక తప్పదు. ఎందుకంటే, నిష్పాక్షికంగా ఉండే సదవకాశం ఆయన పదేళ్ల హయాంలో ఒక్క నిమిషం పాటు కూడా రాలేదాయె! తను జారీ చేసిన ఆర్డినెన్స్‌ని కాంగ్రెస్‌ ‌యువరాజు, అనగా రాహుల్‌ ‌విలేకరుల సమావేశంలో పరపరా చించి పారేస్తే నిస్సహాయంగా ఉండిపోయారు పాపం, మన్మోహన్‌. ‌జాతి యావత్తు జాలిపడిందప్పుడు. కాబట్టి ఆయనలో నిష్పాక్షికత కంటే నిస్సహాయత పుష్కలంగా ఉందని ఒబామా గుర్తించాలి. ఆత్మకథ రెండో ముద్రణలో మార్పులు చేయాలి. సోనియాజీ గురించి కూడా ఒబామా ఒక వ్యాఖ్య చేశారు. ఆ క్షణంలో ఆయనను సౌందర్యోపాసన కమ్మేసింది. కాబట్టి ఆ వ్యాఖ్య ఇప్పుడొద్దు. ఇంకా ప్రియాంకా వాద్రా గురించి కూడా కొంత అధ్యయనం చేసి ఉంటే బాగుండేది.

ఈ ముగ్గురు గురించి ప్రస్తావించి ఒబామా తేనెతుట్టె కదిల్చారు. నిజానికి పాఠకలోకానికి కించిత్‌ అసంతృప్తి మిగిల్చేశారు. లోతైన అధ్యయనం అవసరమైన వారు శతాధిక కాంగ్రెస్‌లో ఎందరో ఉన్నారు మరి! కేంద్రమంత్రిగా చిరకాలం తిష్టవేసుక్కూర్చుని, కేసులలో ఇరుక్కుని పోలీసులు వచ్చేసరికి సింహద్వారాలు మూసుకున్న సుప్రీం కోర్టు లాయరు చిదంబరం గురించి ఒబామా అధ్యయనం ఎలా ఉండి ఉండేదో కదా, అని పాఠకలోకం అనుకోకుండా ఉండగలదా! పాకిస్తాన్‌ ‌వెళ్లి మరీ మోదీని తిట్టి వచ్చిన అరవీర భయంకర లౌకకవాది మణిశంకర్‌ అయ్యర్‌ ఒబామా అధ్యయనానికి మంచి వనరై•, మెదడుకు మేత కూడా పెట్టేవాడు కదా! కానీ ఒబామా ఇలాంటి కొన్ని మహదవకాశాలని జారవిడుచుకున్నారు.

ఇలా ఒక్కొక్కరి గురించి ఎందుకు అధ్యయనం! అసలు కాంగ్రెస్‌, అం‌దులోని భజనకళా వైదుష్యాల గురించి, అవినీతి ప్రావీణ్యం గురించి, పదవీ మోహ క్రాంతత గురించి బోలెడంత అధ్యయనానికి అవకాశం ఉంది. అక్రమాలు చేయడం, జైలుకు వెళ్లడం, నాలుగైదు స్థానాల కోసం నిన్ననే బూతులు తిట్టిన ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపడం వంటి చిత్రాతిచిత్రమైన విన్యాసాలూ, విషయాలూ చర్చకు వచ్చి ఆ పుస్తకానికి దండిగా పఠనీయత వచ్చి పడేది. రెండో భాగం ఉందంటున్నారు కదా, అందులో ‘అధ్యయనం’ మరింత లోతుగా ఉంటుందని ఆశిద్దాం.

About Author

By editor

Twitter
Instagram