భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


‘అత్తయ్యగారూ! మీకెందుకీ శ్రమ. హాయిగా టీవీ చూస్తూ కాలక్షేపం చేయండి.ఇక ఇంటిపని, వంటపని నా కొదిలేయండి’ అని కోడలితో చెప్పించుకునే రోజెప్పుడొస్తుందానని కలలుకంది విశాలాక్షి.

వచ్చిన కొత్త కోడలు ‘సుచరిత’ అలా అనకపోగా ‘‘గంటల తరబడి అలా కూర్చోకండత్తయ్యా ! కాళ్లు, నడుము, మెడ పట్టుకుపోతాయి. మధ్యలో లేచి కొద్దిగా కాళ్లు,చేతులు ఝాడించండి. తేలిక పనులు చేస్తూ, ఏవైనా పుస్తకాలు చదువుతూ చురుకుగా ఉండండి. సీనియర్లు చేసే యోగా చేయండి!’’ అంది అత్తారింటికి వచ్చిన నెలరోజుల్లోపలే ఒకనాడు.

కోడలు సలహా విన్న విశాలాక్షి మాట్లాడాలో అర్థ్ధంగాక కోడలి వంక వెర్రిమొర్రి చూపులు చూడసాగింది.

‘ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉందే! కొత్తా, పాతా, చిన్నా, పెద్దా లేదు. నిర్మొహ మాటంగా నోటికెంతొస్తే అంత అనేస్తోంది. ముక్కు సూటి తత్వమా? లేక గడసరితనమా!? అర్థం కావడంలేదు’

మీమాంసలో పడి కొట్టుమిట్టాడింది విశాలాక్షి.

రోజులు గడుస్తున్నాయి. రాను రానూ కోడలు ముక్కుసూటి మనిషని, ఉన్నది ఉన్నట్లు నిష్కల్మషంగా మాట్లాడే పిల్లని అర్థమైంది విశాలాక్షికి. అప్పట్నుంచి ఆమె మీమాంసకు ఉపశమనం కలిగింది.

* * *

సుచరిత కాపురానికి వచ్చి వ•డు నెలలయింది. కొత్తకోడలు ఇంట్లో పాత మనిషిలా, కలివిడిగా తిరగడం చూసి మురిసిపోతూ కొడుక్కీ,స్నేహితులకి కోడలి మంచి గురించి చెప్పీచెప్పీ సుడిబడిపోతోంది విశాలాక్షి. బీడు మీద వర్షంలా, దాహార్తిని తీర్చుకుంటున్న భూదేవిలా, వరం పొందిన తపస్వినిలా విశాలాక్షి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.

* * *

ఎనిమిదేళ్ల క్రితం ఫార్మా ఫ్యాక్టరీలో బాయిలర్‌ ‌పేలిన ప్రమాదంలో విశాలాక్షి భర్త శేఖర్‌ ‌ప్రాణాలు కోల్పోయాడు. ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో పెద్ద తుఫాను. రెక్కలు తెగిన పక్షి అయింది విశాలాక్షి.

ఆ సంవత్సరమే బి.టెక్‌ ‌పూర్తిచేసి కొత్తగా ఉద్యోగంలోచేరింది కూతురు ‘ప్రియ’. కొడుకు విశాల్‌ ‌చిన్నవాడు. ఇంటర్మీడియేట్‌ ‌రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ప్రియ పెళ్లి నెలరోజుల్లో ఉందనగా జరిగిందీ అనర్థ్ధం. ఏంచేయాలో దిక్కు తోచలేదు. భర్త దినకర్మలయ్యాక,పనులన్నీ చక్కబడేదాకా ఉండాలని అక్క, బావను కోరింది.

అక్క భర్తతో వచ్చి నాలుగు రోజులుండి తిరిగి వెళుతూ ‘‘నాకూ, మీ బావకు శలవులంతగా దొరకవు. మీరే వారణాసికి రండి. కొద్ది మార్పు ఉంటుంది. గంగాస్నానం చేసి విశ్వనాథుడిని, అన్నపూర్ణని దర్శించుకుని వెళ్లవచ్చు’’ అంది బెనారస్‌ •••నివర్సిటీలో పనిచేస్తున్న విశాలాక్షి అక్క.

‘‘అక్కా! ప్రియ పెళ్లి నెలరోజుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో పెళ్లివారేమంటారో తెలియదు. వారి దగ్గర్నుంచి కబురేమీ లేదు. పురోహితుణ్ణి కనుక్కోవాలి. వారి తంతు చూస్తుంటే పెళ్లి వాయిదా పడుతుందేమోనని భయమేస్తోంది. వారితో మాట్లాడాలి. ఇన్సూరెన్సు క్లెయిమ్‌, ‌కంపెనీ కాంపెన్సేషన్‌ ‌పనులు. అత్యవసరమైన పనులు ఉన్నాయక్కా! అదీగాక విశాల్‌కి పరీక్షలు, ప్రియకి ఆఫీసు. నువ్వు, బావ నాకు అండగా ఉంటారను కుంటే మమ్ముల్ని రమ్మంటున్నావు. మేమక్కడికి రావడానికి ససేమిరా కుదరదక్కా!’’ అంటూ నిస్సహాయత వెలిబుచ్చింది విశాలాక్షి.

‘‘అవును విశాలా! నీవన్నదీ నిజమే. ఇప్పుడు నీ మీద పెద్ద బాధ్యత ఉంది. బాధ్యతల భారం భాగించేది కాదు.. బాధించేది. పిల్లల భవిష్యత్తే నీ లక్ష్యం!’’ అంటూ వెన్నుతట్టి వెళ్లారు విశాలాక్షి అక్కా, బావ.

* * *

రోజులు గడుస్తున్నాయి. విశాలాక్షి ఒక్కొక్కటిగా బయటి పనులు చేసుకోవడం మొదలెట్టింది.

పెళ్లివారికి అక్కతో ఫోను చేయించింది విశాలాక్షి.

‘‘ఇపుడు పెళ్లేమిటమ్మా!? శేఖర్‌ ‌గారున్నప్పుడు అనుకున్నాం. పరిస్థితులు మారాయి కదా?మేము పునరాలోచించాలి!’’ అన్నాడు పెళ్లికొడుకు తండ్రి చాలా తేలిగ్గా. పెళ్లి వాయిదా పడ్డది.

వ•డు నెలల తరువాత ఫోను వచ్చింది పెళ్లికొడుకు తండ్రి దగ్గర నుంచి.

‘‘సిటీలో ‘ఫ్లాట్‌’ అమ్మాయి పేరిట రాస్తామన్నారు శేఖర్‌ ‌గారు…!’’ అంటూ నీళ్లు నమిలాడు …పెళ్లికొడుకు తండ్రి క్లుప్తంగా.

‘‘ఆయన అన్న మాట నిజమే. ఇప్పుడు పరిస్థితి వేరు. అందుకే ‘ఆలోచించి చెబుతానన్నయ్య గారూ! కొద్ది సమయమివ్వండి’’ అని ప్రాధేయపడింది విశాలాక్షి.

విషయాన్ని కట్నకానుకల పరంగా గాక, బాంధవ్యాల పరంగా పూర్వాపరాలు ఆలోచించింది. కూతురితో గాని, కొడుకుతోగాని విషయం ప్రస్తావించి విషయాన్ని జటిలం చేయదలుచుకోలేదు.

మరుసటి రోజునే పెళ్లికొడుకు తండ్రికి ఫోనుచేసి ‘‘అన్నయ్యగారూ! ఆయన అన్నట్లుగానే ఫ్లాట్‌ ‘‌ప్రియ’ పేరిట రాస్తాను. కానీ, ఫ్లాట్‌ అమ్మాయికి ఇవ్వడానికి నాకు ఐదు సంవత్సరాల సమయం కావాలి. అందుకు మీకంగీకారమైతే ముందుకెళదాము’’ విస్పష్టంగా చెప్పింది విశాలాక్షి.

అందుకాయన నిస్సంశయంగా ‘సరే’ అనడం ముహూర్తం పెట్టించి, భర్త చనిపోయిన ఆరునెలల లోపునే కూతురి పెళ్లి జరిపించి భర్తకి ఘన నివాళి అర్పించింది విశాలాక్షి.

పెళ్లవుతునే బెంగుళూరులో పనిచేస్తున్న భర్త దగ్గరికి వెళ్లింది ప్రియ.

* * *

భర్త ఉన్నప్పుడే గేటెడ్‌ ‌కవ్యనిటీలో ఫ్లాట్‌ ‌ఖరీదు సమానంగా తప్పనిసరై తీసుకున్న ఇన్సూరెన్స్ ‌పాలసీ అక్కరకొచ్చి, ఇంచుమించు అప్పటివరకు కట్టిన వాయిదాలతో, తాముంటున్న వ•డు పడక గదుల ఫ్లాట్‌ ‘‌నామినీ’ విశాలాక్షిపేరిట రిజిస్టర్‌ అయింది.

ఫ్యాక్టరీ మేనేజ్మెంట్‌ ఇచ్చిన పెద్ద మొత్తం కాంపెన్సేషన్‌తో బాటు విశాలాక్షికి ఉద్యోగం ఇవ్వజూపారు. ఉద్యోగ ప్రతిపాదన తిరస్కరించింది విశాలాక్షి.

విశాల్‌ ‌సి.ఎ. ఇంటర్‌ అవుతూనే ఆ కంపెనీ ఉద్యోగం ఇవ్వడంతో స్థిరపడ్డాడు. చూస్తూనే ఐదేళ్లు గడిచాయి. విశాల్‌ ‌సి.ఎ.పూర్తయింది.

* * *

విశాలాక్షి కొడుక్కి సంబంధాలు చూడ్డం మొదలెట్టింది. కాని చుట్టుపక్కల అత్తాకోడళ్ల గొడవలు చూస్తున్న తనకి ఎక్కడో ఏదో చిన్నసంశయం, భయం మొదలయ్యాయి. కోడలు వచ్చాక తన పరిస్థితి ఎలా ఉంటుందోనన్న శంక మొదలయింది. తల్లి దిగులుగా ఉండడం, ఆందోళన పడడం గమనించాడు విశాల్‌.

ఎవరితో,ఎక్కడ కలిసి మాట్లాడినా ‘ఎలాంటి కోడలు వస్తుందో…’ అన్న ‘టాపిక్‌’ ‌మీదకే సంభాషణ మరల్చేది. విశాల్‌ అక్క ప్రియకు ఫోను చేసి..

‘‘అక్కా! అమ్మ భయపడుతోంది. కోడలి మాట వస్తే చాలు టెన్షన్‌ ‌పడుతోంది’’ అన్నాడు విశాల్‌

‘‘అవును. ఈ మార్పు నేనూ గమనించాను. తానెందుకు భయపడుతోంది. నేను అమ్మతో మాట్లాడ తాను. నువ్వు కంగారుపడకు’’ అని తమ్ముడికి ధైర్యం చెప్పింది ప్రియ.

గోవిందుడు గాండీవునికి గీత బోధించినట్లు విశాల్‌ ‌తల్లికి ఎప్పటికప్పుడు ధైర్యం నూరిపోస్తున్నాడు. అయినా తల్లిలో ఏ మాత్రం మార్పు రాలేదు. కోడలంటేనే ఏదో భూతంలా భ్రాంతి చెందుతోంది.

ఆమె మాటలు వినీవినీ వేసారిన విశాల్‌ ‌నొచ్చుకుని ‘‘కోడలు వస్తే ఏదో అయిపోతుందన్న భయం వదిలేయమ్మా. భీష్ముడిలా నేను పెళ్లి చేసుకోన్లే!’’ అని తన నిర్ణయం చెప్పాడు ఓ రోజు విశాల్‌.

‘‘‌సారీ నాన్నా! ఇంకెప్పుడలా అనను. మాట్లాడను. తప్పుగా మాట్లాడాను. నువ్వు కూడా ఇంకెప్పుడూ ఇలాటి మాటలు వద్దు’’ అని తను మాటిచ్చి, మాట తీసుకుంది కొడుకు దగ్గర విశాలాక్షి.

* * *

విశాల్‌ ‌పెళ్లయి ఆరుమాసాలు దాటాయి.

విశాలాక్షి వస్తున్నదంటేనే భయపడే స్థితికి వచ్చారావిడ అపార్టుమెంటు స్నేహితులు.

‘‘బాబోయ్‌! ‌నీ కోడలి మంచి గురించి మాట్లాడావంటే మేవిక వెళ్లిపోతాం తల్లీ!’’ అంటున్నారు కవ్యనిటీ సీనియర్‌ ‌సిటిజన్సు లేడీస్‌ ‌గ్రూప్‌లో స్నేహితులు.

సాధారణంగా సాయంత్రం ఆరయితే చాలు…వారంతా కవ్యనిటీలో స్విమ్మింగ్‌ ‌పూల్‌కి, టెన్నిస్‌ ‌కోర్ట్‌కి మధ్య అందంగా పొందికగా ఉన్న ల్యాండ్‌ ‌స్కేప్‌ ‌పక్కన కుర్చీలలో సవ•హాలుగా కూర్చుని సాయంత్రం ఏడూ, ఏడున్నర వరకు కాలక్షేపం చేస్తారు. తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరాది ప్రాతాలవారితో ఆ అపార్టుమెంటు అదో ‘లిటిల్‌ ఇం‌డియా’.

విశాలాక్షి, రజని, మీర, ప్రియాంక, మంజు, సావిత్రి, ప్రియ ఒక సవ•హంగా కూర్చుని మనసు విప్పుకుని కబుర్లు చెప్పుకునే వారు. ఎప్పుడూ గలగలా మాట్లాడే విశాలాక్షి వారం రోజులుగా ముందుగా రావడం, మౌనంగా, పరధ్యాన్నంగా ఉండడం గమనించారు మిగతా స్నేహితులు.

* * *

ఆరోజు కూడా అందరికంటే ముందుగా వచ్చి కూర్చుని ఉంది విశాలాక్ష్మి.

‘‘విశాలా! వారంనుంచీ గమనిస్తున్నా. ఏదో బాధ పడుతున్నావు. బాధను పంచుకోకపోతే రెట్టింపవుతుంది. ఏమిటి నీ ప్రాబ్లెమ్‌?’’ అం‌టూ అనునయంగా అడిగింది సావిత్రి.

ఽఅహ! ఏమీ లేదు. కొద్దిగా తలనొప్పి. అంతే’’ అంది విశాలాక్షి కుడిచేత్తో సావిత్రి చేతిని నొక్కి పట్టుకుని.

ఽలేదు. నువ్వేదో దాస్తున్నావు. మేమందరం. నిన్ను గమనిస్తున్నాము. నిన్నంతగా తొలిచేస్తున్న సమస్యేమిటి?’’ అనునయంగా అడిగింది సావిత్రి విశాలాక్షి ఎదురుగా కూర్చుని.

ఒక్కసారిగా సావిత్రి భుజంమీద వాలి బావురుమంది విశాలాక్షి. కంగారు పడి విశాలాక్షిని దగ్గరికి తీసుకుంది సావిత్రి.

‘‘ప్రియ ఫోను చేసి తనదగ్గరికొచ్చి ఉండమని ఒకటే గోల చేస్తోంది. బట్టలు, మందులు సర్దుకుని వచ్చేయమని రోజూ పోరుతోంది!’’ అంది విశాలాక్షి కొద్ధిగా తేరుకుని.

‘‘విశాల్‌ ‌వెళ్లవద్దన్నాడా?’’

‘‘లేదు. నీ ఇష్టం అన్నాడు. నేనే నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నాను’’ అంది విశాలాక్షి.

‘‘నాకర్థ్ధం కావడంలేదు. దీనిలో ఇంతగా బాధపడవలసిన సమస్య ఏముంది? వెళ్లడం నీ కిష్టమా లేదా?’’ చనువుగా అడిగింది సావిత్రి.

మౌనంగా నేలచూపులు చూసింది విశాలాక్షి వంచిన తలెత్తకుండా.

‘‘స్కూలుకి వెళ్లనని మారాం చేసే పిల్లల మనస్తత్వం కన్పిస్తోంది నీలో! ఇంత చిన్న విషయానికి ఇంతలా మధనపడుతున్నావంటే ప్రియదగ్గరికి వెళ్లడానికి నీకిష్టం లేదనట్లు అర్థ్ధమవుతోంది. అవునా !?’’ అంది సావిత్రి విశాలాక్షి ముఖంలోకి సూటిగా చూస్తూ.

‘‘ప్రియ దగ్గరికి ప్రతి సంవత్సరం వెళుతూనేవున్నాను. అక్కడకి వెళితే నేనొక వంటమనిషినే! అది వంటింటి జోలికి రాదు. నా అలసటని అసలు పట్టించుకోదు. పైగా నన్ను దెప్పుతూనే ఉంటుంది ?’’ చెప్పడానికి సంశయిస్తూ అంది విశాలాక్షి.

‘‘ఓస్‌! ఇం‌తచిన్న సమస్యకేనా అంత చింత విశాలా? ప్రియకి నీ బాధ అర్థమయ్యేలా చెప్పు. చిన్న విషయానికే ఇంత నిర్వేదం కూడదు. మా అందరికీ సమస్యలు లేవనుకున్నావా? మన మీద మనం విశ్వాసం పెంచుకోవడమే వీటికి మార్గం…’’ ఇంకేదో చెప్పబోతున్న సావిత్రిని అడ్డుకుంది విశాలాక్షి.

‘‘ప్రియకు నామీద ప్రేమ లేదని కాదు నేననేది. నేనంటే దానికి ఆరోప్రాణం. మన తరం వారికి పిల్లలతో ఇదే సమస్య. సమస్య చెప్పుకునేంత పెద్దది కాదు. దాచుకునేంత చిన్నది కాదు. వయసు మీరాక శారీరక శ్రమ శరీరాన్నే కాదు, మనసుని కూడా బలహీనపరుస్తుంది. అందుకే ప్రియ దగ్గరికి వెళ్లాలంటే మనసు అంగీకరించడంలేదు’’ అంది విశాలాక్షి కళ్లుతుడుచుకుంటూ.

ఎవరూ కొద్ది సేపు మాట్లాడలేదు.నిశ్శబ్దం ఆవరించింది. వంచిన తలలెత్తి ఎవరూ మరొకరి వంక చూడడం లేదు.ఇద్దరిలోనూ అనిర్వచనీయమైన మౌన బాధ! కొన్ని నిమిషాలు గడిచాయి.

‘‘విశాలా! భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తే తప్ప మన లాటి మధ్యతరగతి వారు ఆర్థికంగా నిలదొక్కుకోలేని రోజులివి. పని ఒత్తిడితో అలిసి, చనువుతో పిల్లలు ఒక్కోసారి మాట జారుతారు. అలాటివి ఎక్కడివక్కడ వదిలేస్తేనే మనసుకు సాంత్వన! ఇది నీ వరకే పరిమితం కాదు. వయసు మళ్లిన వారందరి పరిస్థితి ఇదే. అదంతే…! కలిసి పయనించాల్సిందే. లేకుంటే ఒంటరివాళ్లం అవుతాము!’’ నిశ్శబ్దాన్నిచీలుస్తూ అంది సావిత్రి.

* * *

ఉదయం నుంచి నిర్లిప్తంగా ఉంది విశాలాక్షి.

విశాల్‌ ఆఫీసుకి బయలుదేరుతూ తల్లి దగ్గరికి వచ్చి మాట్లాడానికి ప్రయత్నించి తల్లి సీరియస్‌గా ఉండడం గమనించి మౌనంగా ఆఫీసుకి వెళ్లిపోయాడు.

‘‘రేపు ఉదయం నేను ఆఫీసుకి వెళ్లేలోగా నువ్వెప్పుడు వెళ్లేది చెబుతే టికెట్‌ ‌బుక్‌ ‌చేస్తానమ్మా!’’ అన్నాడు విశాల్‌ అం‌తకు ముందు రోజు రాత్రి.

విశాలాక్షి తాత్సర్యం చేస్తూ ఏ నిర్ణయం చెప్పలేదు కొడుక్కి.

భోజనం చేసి అత్తాకోడలు హాలులో సోఫాలో కూర్చుని కబుర్లాడుతూ ‘‘అత్తయ్యా ఎప్పుడు బయలుదేరుతారు మీరు ?’’ అంది సుచరిత.

సర్రున కోపమొచ్చింది విశాలాక్షికి.

‘‘నువ్వొక్కదానివే అడగలేదనుకున్నాను. ఆ మురిపం కూడా తీరింది. నన్ను బలవంతంగా ఇక్కడ నుంచి పంపిద్దామనుకుంటున్నారు’’ అంటూ విసవిసా రూములోనికి వెళ్లి బెడ్‌ ‌మీద వాలింది విశాలాక్షి.

అత్తగారి వెనకనే గది లోనికి వెళ్లి ‘‘అత్తయ్యగారూ! ఈ విషయంలో నా ప్రమేయమేమీ లేదు. ఆయన మిమ్ముల్ని అడిగి చెప్పమని నాకు పదే పదే ఫోను చేస్తున్నారు. అత్తయ్యగారికిష్టం లేనట్లుంది. బలవంతం చేయొద్దని నేను మొత్తు కుంటూనే ఉన్నాను. నా మాట వింటేనా!?’’ అంది సుచరిత నొచ్చుకుని ఇందులో తన పాత్రేమీ లేదని సమర్థించుకుంది.

‘‘సరేలే…వాడు సాయంత్రం వచ్చాక మాట్లాడుతానని చెప్పు!’’ అంటూ పక్కకు తిరిగి పడుకుంది విశాలాక్షి. సుచరిత తలుపు దగ్గరిగా వేసి బయటకు వచ్చింది.

* * *

సాయంత్రం నాలుగ్గంటలకు విశాలాక్షి టీ తాగుతుండగా ఫోను వచ్చింది. ప్రియ…‘‘ఎప్పుడు బయలుదేరుతున్నావమ్మా ? ఎందుకంత మొండిచేస్తున్నావు? కూతురికో నీతి. కొడుక్కో నీతా?’’

‘‘ఏం మాట్లాడుతున్నావే అర్థం పర్థం లేకుండా….’’

‘‘మా పెళ్లయిన కొత్తల్లో నువ్వేమనేదానివి గుర్తుందా?’’

‘‘ఏమన్నానేవిటీ…?’’

‘‘ఏంటే మీ అత్తగారు మొగుణ్ణి ఒక్కణ్ణి వదిలి ఎప్పుడూ మీదగ్గరే ఉంటుంది. మిమ్ముల్ని కాపురం చేసుకోనిస్తుందా?’’ అని అడిగేదానివి.

కొరడాతో ఛెళ్లున కొట్టినట్లనిపించింది విశాలాక్షికి. అవతలి వారి తప్పొప్పులను సులభంగా ఎత్తి చూపించవచ్చును. అదే మన వరకు వస్తే మాత్రం ఆ సూత్రాలేవీ తమకు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తారు.అదే మనుషుల బలహీనత !

విశాలాక్షి మౌనంగా వినడం తప్ప మారు మాట్లాడలేకపోయింది.

‘‘వాడి పెళ్లయి ఎన్నాళ్లయింది? ఏనాడయినా వాళ్లిద్దరినీ స్వేచ్ఛ వదిలి ఇల్లు కదిలావా?

కొత్తగా పెళ్లయిన జంట. ఏవో ముద్దు, మురిపాలు ఉంటాయి. ఇంట్లో ఒక పార్టీకి వీల్లేదు. ఆ పిల్ల మంచిది కాబట్టి సరిపోయింది’’ అంది ప్రియ గట్టిగా.

‘‘ఏం వాళ్లేమైనా నీతో మొరపెట్టుకున్నారా స్వేచ్ఛలేదని… లేక నువ్వే వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నావా ?’’ అంది విశాలాక్షి మాటల్ని వత్తి పలుకుతూ .

‘‘లేదు. లేదు! నాతో ఎవరూ మొరపెట్టుకోలేదు’’ కంగారుగా అంది ప్రియ.

‘‘సరే! వాడనలేదు. ఆ అమ్మాయి అనలేదు. మాటవరసకు నువ్వే అన్నావనుకుందాం. అంటే ప్రతింటా కొత్తగా పెళ్లయిన ప్రతి జంటను వదిలేసి ఇంట్లో వారంతా వానప్రస్థానాలకు వెళ్లాలనా నీ ఉద్దేశ్యం?’’ ఆవేశంగా అంది విశాలాక్షి.

‘‘అమ్మా! అతిగా ఆలోచించకు. అపోహలతో ఆవేశపడకు. రోజులు మారు తున్నాయి. పరిస్థితులు మారుతున్నాయి. మార్పులతో నువ్వూ మమేకం కావాలి. నీకూ తెలుసు…పెళ్లయ్యాక వాడికి శలవు దొరకలేదు. వాళ్లిద్దరు ఎక్కడికీ వెళ్లలేదు. వాళ్లని ఒంటరిగా వదిలి నాల్రోజులు నువ్వు నాదగ్గరికి రావడానికి నీకేమిటి ప్రాబ్లెమ్‌?’’ అనునయంగా అడిగింది ప్రియ.

‘‘నిజమే ప్రియా! రోజులు మారాయి. మాలాటివారికి మాత్రం కాదు. వినే తరం మాది. మేము పెద్దవారి మాట జవదాటలేదు.కడుపున పుట్టినవారి మాట కాదనకూడదు. ఎవరు చెప్పినా వినడం, చేయడం వినా వేరే మార్గంలేదు. మాకు మట్టుకు స్వేచ్ఛ, స్వతంత్రం అక్కరలేదు. అవునా!?’’ అని నిష్ఠూరంగా మాట్లాడి ఫోను పెట్టేసి ఆలోచనలోపడింది విశాలాక్షి.

‘ప్రియ అన్నమాటల్లో తప్పేముంది. ఎందుకంత కటువుగా మాట్లాడాను. పిల్లల మనసులు తెలుసుకుని మసలే వివేచనా శక్తి నాకు కొరవడిందా! దాని కొచ్చిన ఆలోచన నా కెందుకు రాలేదు’ అంతర్మథనంలో పడింది విశాలాక్షి.

అదేక్షణంలో ప్రియ దగ్గరనుంచి మళ్లీ ఫోను.

‘‘అమ్మా! నీ మనసు నొప్పించాను. క్షమించమ్మా!’’ అంది ప్రియ నొచ్చుకుంటూ.

‘‘లేదు ప్రియా! గంతలు కట్టిన గుర్రంలా, బావిలో కప్పలా అయ్యాను. అందుకే ఆలోచన, వివేకం కొరవడ్డాయి. నువ్వన్నట్లు కాలంతో మమేకం కావడానికి ప్రయత్నిస్తాను’’ కూతురితో నింపాదిగా అంది విశాలాక్షి.

ఆ మాట ప్రియతో చెప్పాక మనస్సుకి హాయిగా అనిపించింది విశాలాక్షికి.

ఓ గంట తరువాత కోడల్ని పిలిచి ‘‘టికెట్‌ ‌బుక్‌ ‌చేయమని చెప్పమ్మా వాడికి’’ అని చెప్పింది.

‘‘అలాగే అత్తయ్యా!’’ బెదురుగా అంది సుచరిత వెనక్కి వెళుతూ

‘‘ఎక్కడికని అడగవా?’’ అంది విశాలాక్షి.

‘‘బెంగుళూరే కదా!’’

‘‘కాదు…కాశీకి ! బెంగళూరు తరువాత వెళతాను’’ అంది విశాలాక్షి.

‘‘కాశీకా!?’’ అంది విస్మయంగా సుచరిత

‘‘అవును. ఇప్పటికి ఆ కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహం కలిగింది’’అంది విశాలాక్షి.

‘‘రిటర్న్ ‌టికెట్‌ ఎప్పుడు బుక్‌ ‌చేయమంటారు?’’ అంది సుచరిత అమా యకంగా.

‘‘నెలకో, రెణ్ణెల్లకో. నువ్వు నెలతప్పాకో…నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు చెబుతాను’’ అంది విశాలాక్షి సిగ్గుపడుతున్న కోడలి తలమీద ఆప్యాయంగా రాస్తూ.

సుచరితకు అత్తగారి అంతరంగం అవగతమైంది.

‘‘తొందరగా వచ్చేయండి. మీ చల్లని తోడునీడ మాకవసరమత్తయ్యా!’’ అంది సుచరిత రెండు చేతులు జోడించి.

-కేశిరాజు వెంకట వరదయ్య

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.