భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
అదొక సుందర ఉద్యాన వనం. ఆ వనంలోని బల్లమీద ఒక్కతే సుఖాసీనురాలై ఉంది సుస్మిత. ప్రియుని రాకకై దాదాపు అరగంట నుంచి వేచి చూస్తోంది. తన మదిని దోచిన మనోహరుడు ఎప్పుడు వస్తాడా?అని వేయి కళ్లతో ఎదురు చూస్తోంది.
ఆమె అంత ఆత్రంగా ఎదురు చూడ్డానికి బలమైన కారణమే ఉంది. అతను రాగానే తన కోరికని తెలియజేయాలని ఆమె మనసు ఎంతగానో ఉవ్విళ్లూరుతోంది. తన కోరిక విని నవ్వుకుంటాడా? పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తాడా? లేక తన వ్యథ అర్థం చేసుకుని తన కోరికని మన్నిస్తాడా?ఏం చేస్తాడు? నా ప్రేమ కోసం ఏమైనా చేస్తానని మాటిచ్చాడుగా? మన్నిస్తాడేమోలే. అలా పరిపరి విధాలుగా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు. సమయం గడిచేకొద్దీ ఉత్కంఠని భరించలేక పోతోంది.
ఎలాగైతేనేం, ఆమె నిరీక్షణ ఫలించి అతను రానే వచ్చాడు. వస్తూనే ఆమెని చూసి ‘‘హా….’’ అని పలకరించబోయాడు. వెంటనే ఆమె చూపుడు వేలిని పెదాలకి అడ్డంగా పెట్టుకుని ‘‘వద్దు…’’ అన్నట్టు వారించింది. అతని నోటికి టక్కున తాళం పడింది. ఏమిటన్నట్టు ఆశ్చర్యంగా చూసాడు.
‘‘సందీప్! నీ నోటినుంచి ఇప్పుడు బయటికి రాబోయిన పదం ఏమిటో నేనూహించగలను. అది నీ నోటినుంచి రాకూడదనే అలా అడ్డుకున్నాను.’’
‘‘ఏం ఎందుకని? నేన్నిన్నుపలకరిస్తే తప్పేంటట?’’ అన్నాడు ఆమె పక్కనే కూర్చుంటూ.
‘‘పలకరించడం తప్పు కాదు. నాకో చిత్రమైన కోరిక కలిగింది. ఆ కోరికని నువ్వే తీర్చాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది’’ అన్నది.
‘‘ఉవ్విళ్లూరుతోంది? భలే… ఎంత బ్యూ….’’ అని ఏదో చెప్పబోయాడు.
ఆమె మధ్యలోనే త్రుంచేసింది. ‘‘ఆగాగు సందీప్.. నువ్వా పదం పలకడానికి వీల్లేదు. ‘ఎంత అందమైన పదం!’ అను చాలు’’ అన్నది. సందీప్ చిత్రంగా చూసాడు ఆమె కళ్లల్లోకి.
‘‘ఎందుకని?’’
‘‘మరేం లేదు. నా మీద నీకున్న ప్రేమ ఎంత గాఢమైనదో తెలుసుకోవాలనుకున్నాను. అందుకే నీకో పరీక్ష పెట్టబోతున్నాను’’ అన్నది అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ. సందీప్ కళ్లెగరేసి ఏమిటన్నట్టు చూసాడు.
‘‘నా ప్రేమ కోసం నువ్వు ఏమైనా చేస్తానని అన్నావు గుర్తుందా?’’
‘‘అవును అన్నాను.’’
‘‘అందుకే అడుగుతున్నాను. ఈ క్షణం నుంచీ మరో గంట సేపటి వరకూ ఒక్క ఇంగ్… కాదు కాదు.ఒక్క ఆంగ్ల పదం కూడా మనం మాట్లాడకూడదు. ఏం మాట్లాడుకున్నా అచ్చ తెలుగులోనే. అదీ మన నియమం’’ అన్నది చేతి గడియారంలో సమయం ఎంతయిందో చూసుకుంటూ.
‘‘ఈ పరీక్షలో నేను పా….’’ అని ఏదో అనబోయాడు. ఆమె కళ్లతోనే హెచ్చరికగా చూసే సరికి తన తప్పుని గ్రహించి వెంటనే సరిదిద్దుకున్నాడు ‘‘ఉత్.. ఉత్.. ఉ,..త్తీ…ర్ణు…డి….ని కాకపోతే?’’ అని అడిగాడు.
‘‘ఏముంది? మన ప్రేమలో పస లేదని తేలిపోతుంది’’ అన్నది.
అనుకోకుండా అతని నోటినుంచి ఎప్పుడూ అలవాటుగా అనుకునే ఒక ఆంగ్ల వాక్యం బయటికి రాబోయింది. వెంటనే తమాయించుకుని ‘‘ఓ నా భగవంతుడా’’ అన్నాడు దాన్ని తెలుగులోకి తర్జుమా చేసుకుంటూ.
‘‘అదీ. అలా మాట్లాడాలి’’ అన్నది గలగలా నవ్వేస్తూ.
‘‘ఎంత గడ్డురోజురా బాబు’’ అనుకున్నాడు మనసులో. ‘‘సరే.. ప్రేమదేవత పరీక్ష పెట్టాక కాదనేదేముంది? అలాగే కానీయ్’’ అన్నాడు. అన్నాడే కానీ ఏమీ మాట్లాడ్డం లేదు.
‘‘ఏమిటి సందీప్… ఇంత నిశ్శబ్దం. ఎప్పుడూ గలగలా మాట్లాడే వాడివి. ఏదో ఒకటి మాట్లాడు’’ అన్నది.
‘‘ఏం మాట్లాడగలను. నీతో ఏం మాట్లాడాలన్నా ఆ వ•డు పదాల ఆంగ్ల వాక్యంతోనే కదా నేను మొదలెట్టేది? ఇప్పుడు నువ్వు ఆ భాషనే నిషేధించేశావు. ఎలా మాట్లాడగలను?’’ అన్నాడు.
‘‘దాన్నే అచ్చ తెలుగులో చెప్పు. ఎవరొద్దన్నారు?’’ అన్నది.
‘‘సుస్మితా… నేను నిన్ను పె.. పె.. పె… ప్రేమి…స్తు…న్నాను.’’ అన్నాడు ఒక్కొక్క మాట కూడబలుక్కుంటూ.
‘‘నేను కూడా నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను సందీప్… కానీ ఒక్క షరతు. మరో గంటవరకూ నువ్వు తెలుగులో మాత్రమే మాట్లాడాలి’’ అన్నది.
‘‘తప్పకుండా ప్రేయసీ… నీ కోరిక నేనెందుకు కాదనాలి? తెలుగులోనే మాట్లాడుతాను. నీ హృదయంలో చోటు సంపాదించుకుంటాను’’ అన్నాడు ఇదివరకు చదివిన నవలల్లోని ప్రేయసీప్రియుల సంభాషణల్ని గుర్తు చేసుకుంటూ.
‘‘కృతజ్ఞతలు సందీప్. అవునూ… ఇంత ఆలస్యమయిందేం? నాలుగున్నరకే వస్తానన్నావు కదా?’’ అని అడిగింది.
‘‘ఏం చెప్పమంటావు? నా బై….’’ అనబోయి టక్కున ఆగిపోయాడు. ఆ పదం నోటినుంచి బయటికి వచ్చిందంటే తాను ఈ పరీక్షలో ఓడిపోయినట్టే. ‘‘నా ది…ది…ది… ద్విచ…క్కర వాహనం… ట్రబ్….కాదు కాదు… ఇబ్బందిని కలగజేసింది. కి… కాదు… కాదు… పద… తాడన… కడ్డీ ఎంత గట్టిగా కొట్టినా వెంటనే స్టా…. అహ… కాదు… ప…ప… ప్రారంభం… కాలేదు’’ అన్నాడు.
అతని అవస్థ చూసి చిన్నగా నువ్వుకుంది సుస్మిత.
‘‘పోనీలే… దానికి నువ్వేం చేస్తావు? అన్నట్టు ఈ మధ్య కాలంలో చలన చిత్రాలేం చూసావు?’’ అని అడిగింది.
చలనచిత్రాలు? అని ఒక్క క్షణం ఆలో చించి… అదేమిటో అర్థం చేసుకున్నాకా ఉత్సాహంగా చెప్పాడు తాను చూసిన చలనచిత్రం పేరేమిటో.
‘‘అవునా? ఏ నేపథ్యమో?’’ అని అడిగింది.
‘‘నేపథ్యం? నేపథ్యం ఏమిటి??’’ అని అడిగాడు.
‘‘అదే మహానుభావా? కేంద్రీయ ఆలోచన అన్న పదాల్ని అంగ్లంలోకి తర్జుమా చేసుకుని చూడు. అప్పుడు అర్థమవుతుంది’’ అన్నది.
సందీప్ కాస్సేపు దీర్ఘంగా ఆలోచించి ‘‘కేంద్రీయ… ఆలోచన….. ?! ఓ అదా? ఇప్పుడర్థ్ధమైంది. కేంద్రీయ ఆలోచన ఏమిటంటే… మెమ…’’ అనబోయి టక్కున ఆగిపోయాడు. ‘‘… కాదు కాదు…. మతిమరపు హీ…. కాదు కాదు… మతిమరపు… కథా… నాయకుడు…. చుట్టూ అల్లబడిన కథ’’ అన్నాడు.
‘‘అవునా? బాగుందా మరి?’’
‘‘సూ…. ఛ… ఛ…. అద్భుతం… అమోఘం… గొప్ప ఫీ… అబ్బబ్బ… ఏమిటిది? అడుగడుగునా ఆంగ్ల పదాలు అడ్డు తగులుతున్నాయి? గొప్ప అనుభూతి ఉన్న సి… కాదు కాదు… చలన చిత్రం’’ అన్నాడు.
దాదాపు గంటసేపు వాళ్లు అనేక విషయాల మీద సంభాషణలు చేసుకున్నారు. ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకున్నారు. ప్రేమభావాల్ని అచ్చ తెలుగులో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. అలా తెలుగు భాషకే కట్టుబడి ఉండడానికి వాళ్లు చాలా అవస్థలు పడ్డారు. కొన్నిపదాలకు తెలుగు అర్థ్ధం తెలియక పోతే చెప్పదలచుకున్నది తాత్కాలికంగా ఆపేసి చరవాణిలో అంతర్జాలం తెరిచి శోధించి మరీ సరైన తెలుగు పదాలు తెలుసుకుని మాట్లాడుకున్నారు.
సుస్మిత చేతి గడియారం వైపు మళ్లీ చూసింది. ‘‘సందీప్…. సమయం సరిగ్గా గంట గడిచింది… నువ్వు ఉత్తీర్ణుడివయ్యావు. కంగ్… అహ… కాదు కాదు…. శుభాభినందనలు’’ అన్నది.
‘‘హమ్మయ్య…’’ అనుకుంటూ హాయిగా నిట్టూర్చాడు. అతని శరీరమంతా స్వేదంతో నిండిపోయింది. ఎక్కడ ఏ ఆంగ్ల పదం తారసపడి తమ ప్రేమని భగ్నం చేస్తుందో అని చాలా గాభరాగా గడిపాడు. ‘ఈ గంట గడిస్తే చాలురా బాబు’ అన్నట్టు ఉద్రిక్తతతో గడిపాడు. అతను మాట్లాడే ప్రతీ వాక్యంలో ప్రతీ పదానికీ ఆటంకం ఏర్పడి మాట్లాడ్డమే చాలా కష్టంగా తోచింది. అచ్చ తెలుగులో మాట్లాడ్డమంటే గాల్లో వేలాడే తాడుమీద సమతౌల్యుం పాటిస్తూ నడిచే దొమ్మరసాని సాహసంలా అనిపించింది.
‘‘సందీప్ ఒక్కటి అడుగుతాను. నిజం చెప్పు. ఈ గంట సేపూ ప్రియురాలితో మాట్లాడిన అనుభూతి ఏమైనా కలిగిందా నీకు?’’
సందీప్ తల అడ్డంగా ఆడించాడు.
‘‘ప్రేయసితో కబుర్లు చెపుతుంటే కలిగే మధుర భావనలు చోటుచేసున్నాయా నీ మనసులో?’’
సందీప్ మళ్లీ తల అడ్డంగా ఆడించాడు.
‘‘చూసావా మరి? మన భాషలో మనం మన ప్రేమని వ్యక్తం చేసుకోలేము. పరాయి భాషలో అయితే ఎంచక్కా ఎలాంటి ఇబ్బందీ లేకుండా వ్యక్తం చేసుకోగలుగుతాము. ఇది బానిత్వం కాదా? మన మాతృభాషని మనం కోల్పోయినట్టే కదా? ఆంగ్లేయులు వదిలి వెళ్లిన ఈ పరాయి భాషని ఇంకా ఎన్నాళ్లు మన నెత్తిన పెట్టుకుంటాము? పిల్లలు తెలుగులో మాట్లాడితే అవమానంగా భావించే తల్లిదండ్రుల్నీ, ఉపాధ్యాయుల్నీ, పాఠశాలల్నీ ఏమనాలి? నీకో సంగతి తెలుసా? ఒక నివేదిక ప్రకారం మరో యాభయ్ సంవత్సరాల తర్వాత తీయ తేనియలూరే ఈ తెలుగుభాష ప్రపంచంలో మిగిలి ఉండదట. ఎలా ఉంటుంది…మాట్లాడే వాళ్లు లేనప్పుడు? ఆదరణ లేకపోతే ఏదైనా అంతరించిపోవాల్సిందే కదా? ఎన్నో మధురమైన నుడికారాలు, జాతీయాలు, అద్భుతమైన ప్రయోగాలతో ఆకాశానికెగసిన మన సారస్వత వారసత్వ సంపద అంతరించిపోవలసిందేనా? అనిర్వచనీయమైన మహాకావ్యాలు, అమోఘమైన గ్రంథరాజాలు పరిఢవిల్లిన ఈ తెలుగుభాష అంతరించి పోతుంటే చూస్తూ ఊరుకోవలసిందేనా?’’ అని అడిగింది. ఆమె మాట్లల్లో నిజాయతీతో కూడిన వ్యథ• స్పష్టంగా కనిపించింది.
సందీప్ ఆమె కళ్లల్లోకి ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. ఏదో తమాషాకి పెట్టిందనుకున్న ఈ పరీక్ష వెనుక ఇంతటి ఆవేదన ఉందా? అనుకున్నాడు.
‘‘నిజమే సుస్మితా… మన భాషని మనం కాకపోతే ఇంకెవరు కాపాడుతారు? ఈ నిర్లక్ష్యానికి ఇక్కడితో విరామ చిహ్నం పెట్టేద్దాం. మన మాతృభాషని మనమే కాపాడుకుందాం’’ అన్నాడు.
సుస్మిత మనసు అచ్చతెలుగు జావళీలా పరవశించిపోయింది. ‘‘సందీప్… నువ్వు నా హృదయాన్ని గెలుచుకున్నావు’’ అంటూ అతన్ని గట్టిగా హత్తుకుని కౌగిలిలో ఒదిగిపోయింది.
వాగ్దేవి మధుర వీణాగానం ఆమె హృదయంలో సరిగమలు పలికింది.
– పసుపులేటి తాతారావు