డిసెంబరు 4 ఉన్నవ 143వ జయంతి

ఇరవయ్యవ శతాబ్దారంభం నాటి భారతీయ పునరుజ్జీవన ఉషస్సులు  కొత్త దారులు చూపించాయి. ప్రపంచం నలుమూలలా నాడు సంభవించిన పరిణామాల ప్రభావమూ ఇందుకు దోహదపడింది. మహా సామ్రాజ్యం జార్‌ ‌రష్యా మీద చిన్న దేశం జపాన్‌ ‌సాధించిన విజయం భారత స్వాతంత్య్రోద్యమ దృష్టికి పదును పెట్టింది. ఆ చారిత్రక పరిణామం తరువాత రష్యాలో వచ్చిన బోల్షివిక్‌ ‌విప్లవాన్ని నాటి భారతీయులు సామాజిక మార్పులో మైలురాయిగా భావించారు. రష్యా పరిణామం దేశంలో ఉన్న సామాజిక అసమానతలను గుర్తించడానికి వీలైనదిగా వారు భావించారే తప్ప, బోల్షివిక్‌ ‌సిద్ధాంతం మీదనో, ఆ దేశం మీదనో మూఢభక్తిని పెంచుకోలేదు. ఇందుకు కారణం దేశీయమైన దృష్టి కలిగిన సంస్కరణో ద్యమం ఆ కాలానికి చోదకశక్తిగా పని చేయడమే. అలాంటి కాలం ఇచ్చిన మహనీయు లలో ఒకరు ఉన్నవ లక్ష్మీనారాయణ, బార్‌ ఎట్‌ ‌లా. ఉన్నవ ఉభయ ఉద్యమ మిత్రునిగా కనిపిస్తారు. రాజకీయ, సంస్కరణోద్యమాలు ఒకవైపు, కొత్త దృష్టితో సాహిత్యోద్యమం మరొకవైపు సాగించిన బహుముఖ ప్రజ్ఞాశీలి ఆయన. బోల్షివిక్‌ ‌విప్లవం, దాని ఆశయంగా చెప్పే శ్రామికవర్గాల ఉనికి అనే భావనలతో ఆయనే తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయమైన నవల రాశారు. అదే మాలపల్లి.


 లోతైన తాత్త్విక, సామాజిక, రాజకీయ నేపథ్యాలుంటే తప్ప మాలపల్లి వంటి నవల ఆ కాలంలో వెలువడడం సాధ్యపడేది కాదు. అందుకే ఆ నవలకు అంత పఠనీయత, ఖ్యాతి వచ్చాయి. ఉన్నవ గొప్ప సాహిత్యవేత్తగానే కాకుండా, గాంధేయవాదిగా, నిబద్ధతగల స్వాతంత్య్రం సమరయోధుడిగా కూడా తెలుగునాట చరిత్రకెక్కారు. తన కాలానికి తగ్గట్టు సంఘ సంస్కరణను ఆరాధించారు. దానికి అంకితమయ్యారు. ఆయన  హరిజనోద్ధారకుడు. స్త్రీ విద్య, వితంతు వివాహాలు ప్రోత్సహించిన సమున్నత  సంస్కర్త. రెండు భిన్నకోణాలైన కందుకూరి వీరేశలింగం సంస్కరణ ప్రభావం, గాంధీజీ జాతీయోద్యమ స్పృహ కూడా ఉన్నవ మీద కనిపిస్తాయి.

ఉన్నవ లక్ష్మీనారాయణ 1877 డిసెంబరు 4వ తేదీన గుంటూరు జిల్లా వేములూరుపాడులో జన్మించారు. తల్లిదండ్రులు శేషమ్మ, శ్రీరాములు. ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. అప్పటి బాల్య వివాహాల సంప్రదాయాన్ని అనుసరించి 1892లో ఆయన వివాహం లక్ష్మీబాయమ్మ వీరేశలింగంగారిని ఆహ్వానించి ఆయన అధ్యక్షతన జరిగింది కూడా. మెట్రిక్యులేషన్‌ ‌పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి ఎన్నో గ్రంథాలు చదివి సాహిత్యాభిలాషను పెంపొందించుకున్నాడు. గుంటూరులో 1900 సంవత్సరంలో యంగ్‌మెన్‌ ‌లిటరరీ అసోసియేషన్‌ ‌స్థాపించి ఎందరో యువకుల్లో సాహిత్యాభిలాషను పెంపొందిం చాడు.1902లో గుంటూరులో వితంతు శరణాలయాన్ని స్థాపించాడు. అందుకు ప్రేరణ వీరేశలింగం. గుంటూరులో తొలి వితంతు వివాహాన్ని జరిపించి, ఆ కార్యక్రమానికి  వీరేశలింగం గారినే  అధ్యక్షునిగా తీసుకువచ్చారు. ఉన్నవ ఉపాధ్యాయునిగా, న్యాయవాదిగా కూడా పనిచేశారు. స్వరాజ్య పార్టీలో, భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి ఉద్యమించారు.

 1903లో ఉపాధ్యాయ వృత్తికి ఉద్వాసన చెప్పి గుంటూరులో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. వీరేశలింగంగారి కోరిక మేరకు 1906లో రాజమండ్రిలో వితంతు శరణాలయం పర్యవేక్షణ బాధ్యతను చేపట్టాడు. 1908లో ర్యాలీ కంపెనీలో ఉద్యోగ బాధ్యతను నిర్వహించాడు. ఆయన ప్రవృత్తిరీత్యా ఒకే వృత్తిపై దృష్టిని కేంద్రీకరించలేదన్న విషయం స్పష్టమవుతుంది. 1912లో పూనేలో కార్వే మహిళా విద్యాలయాన్ని సందర్శించి, ఆ అవగాహన బాపట్లలో 1913లో కొండా వెంకటప్పయ్యగారి అధ్యక్షతన జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు ఆహ్వాన సంఘ కార్యదర్శిగా అవిరళ కృషి చేసి సభ విజయానికి దోహదం చేశాడు. ఆ సంవత్సరంలోనే విశాలాంధ్రకు సంబంధించిన న్యూస్‌ను జొన్న విత్తుల గురునాథం గారితో కలసి రూపొందించాడు.

అప్పటి సమాజంలో బారిష్టర్‌ ‌వృత్తికున్న విలువను గుర్తించి 1916లో ఐర్లాండ్‌ ‌డబ్లిన్‌లో బార్‌ఎట్‌లా పూర్తి చేశాడు. 1917లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా చేరి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నాడు.

గుంటూరులో స్త్రీ విద్య ప్రోత్సాహానికి 1922లో ‘శారదానికేతన్‌’ ‌సంస్థ స్థాపించి ఎందరో బాలికలకు చదువుకొనే అవకాశం కల్పించాడు. ఇప్పటికీ ఆ సంస్థ బాలికల విద్యాసంస్థగా ప్రగతి పథంలో నడుస్తుంది. ‘పల్నాడు’ పుల్లరి సత్యాగ్రహానికి 1922లో నాయకత్వం వహించి అరెస్టయి రాయవెల్లూరు జైలుకు వెళ్ళాడు. 1923లో కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. నిబద్ధత గల స్వాతంత్య్రోద్యమ వీరుడిగా 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యాడు. గుంటూరులో 1942లో క్విట్‌ ఇం‌డియా సందర్భంగా చురుగ్గా పాల్గొని అరెస్టై జైలుశిక్ష అనుభవించాడు. సాహిత్యవేత్తగా ఉన్నవ ఉన్నత శిఖరాలు అధిరోహించినా ఉద్యమకారునిగా ఆయనకు చరిత్రలో ఉన్న స్థానం ఎంతటిదో గుర్తు చేసుకోవడం కూడా అవసరమే.

రష్యా బోల్షివిక్‌ ‌విప్లవంతో స్ఫూర్తి పొందిన తొలి తెలుగు రచయితగా ఉన్నవ ఖ్యాతి గాంచారు. ఆ ప్రభావంతో 1921లో మాలపల్లి నవలకు శ్రీకారం చుట్టి 1922లో రాయవెల్లూరు కారాగారంలో ఉన్నప్పుడు పూర్తి చేశారు. దేశభక్తి; సంఘ సంస్కరణాభిలాషతో ఆ రచన సాగించారు. సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే రచనలు వారికి చేరాలంటే వాడుకభాషలో ఉండాలన్నది ఉన్నవ సంకల్పం. సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలు తొలగించి సమతా ధర్మాన్ని స్థాపించడమే నవల ఫలశ్రుతి. నిజానికి ఆయన ముందునుంచీ కుల వ్యవస్థను నిరసించాడు. ‘నాయకురాలు’, ‘బుడబుక్కల జోస్యం’, ‘స్వరాజ్య సోది’, భావతరంగాలు’ వంటి రచనలతో కూడా ఉన్నవ స్వాతంత్య్రోద్యమంతో పాటు సాహిత్యోద్యమంలో కూడా తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

దేశంలో చాలా చోట్ల గాంధీ రాకకు పూర్వమే నిమ్నవర్గాల పట్ల వివక్ష తగదన్న స్పృహ వచ్చింది. అగ్రవర్ణాలవారితో హరిజనులు కలిసిమెలిసి ఉండాలని భావించి సహ పంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు ఉన్నవ. అంతకు మించి ఆనాటి సమాజంలో హరిజనుల గాథను ఇతివృత్తంగా తీసుకొని నవల రాయడమే గొప్ప సాహసం. ఇందులో కథా నాయకుడిపేరు సంగదాసు. ఈ పాత్ర ద్వారా రచయిత ఆదర్శ సంఘ పునరుద్ధరణకు పూనుకున్నాడు. అందువల్ల ఈ నవలకు ‘సంగ విజయం’ అనే పేరు కూడా ఉంది. సుబ్బలక్ష్మి అనే నిమ్న వర్గ యువతి మీద మునసబు మనిషి చేయి చేసుకోవడం కూడా ఇందులో ఉంది. దీనికి బాధపడిన రామదాసు చేత ‘మాలమాదిగలంటే అంత చౌక?’ అన్న మాటను కూడా ఆనాడు ఉన్నవ పలికించారు. సంగదాసు, తక్కళ్ల జగ్గడు, రామానాయుడు,రామన్నచౌదరి,ఆదం సాహెబ్‌ ‌వంటి గ్రామీణ జీవితంలో కనిపించే పాత్రలు ఎన్నో ఉంటాయి. జైలు జీవిత చిత్రణ కూడా ఇందులో ఉంది.

 ఆధునిక ఇతిహాసంగా చెప్పే మాలపల్లి నవలను 1922లో నరసరావుపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది, వితరణశీలి, సాహిత్యాభిమాని బెల్లంకొండ రాఘవరావు రెండు భాగాలుగా ప్రచురించాడు. నవలలో జాతీయోద్యమ రాజకీయ వాతావరణం, మహాత్ముని ఆశయాలు, తెలుగువారి జీవన విధానం కలసి సాగుతాయి. సాంఘిక దురాచారాలు, సత్యాగ్రహ ఉద్యమాలు, వర్గ, వర్ణ విభేదాల స్వరూపాన్ని రచయిత వర్ణించారు.

మాలపల్లి నవలకు కాశీనాథుని నాగేశ్వరరావు రాసిన పీఠిక కరదీపిక వంటిది. ‘‘ఆంధ్ర సాహిత్య హృదయ పరిణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ కావ్యం అన్నారు. ఇందులో తెనుగుమాటలు, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము సమకూర్చాయి’’ అన్న ఆయన మాటలు అక్షర సత్యాలు. రామదాసు నవలలో పరిచయమయ్యే తొలి పాత్ర. ఈ నవలకు అతడే ఆయువుపట్టు. ఈ పాత్రను నాగేశ్వరరావుగారు పరిచయం చేసిన తీరు రమణీయం. నవల అంతా నాటకాన్ని మరిపిస్తూ సంభాషణల రూపంలో సాగుతుంది. నవల్లో రచయిత ‘చరమగీతం’, ‘సమతా ధర్మం’ అనే రెండు ప్రబోధాత్మక గేయాలను సామాన్య  వాడుకభాషలో, జానపద బాణీలో రాశారు. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ ‘‘తెలుగు విప్లవ సాహిత్యంలో వచ్చిన ప్రథమకావ్యం మాలపల్లి’’ అనడంలో అతిశయోక్తి లేదని చెప్పారు. హరిజనోద్ధరణ సంస్కరణ దృక్పథంతో వచ్చిన మాలపల్లి నవల ప్రబోధాత్మ కంగా, ఆదర్శ సమాజ సంకల్పాన్ని ప్రతిబింబించింది. కానీ తన ఆశయ చిత్రణలో రచయిత తీసుకున్న సిద్ధాంతం గాంధేయవాదమే. సముచిత పాత్ర చిత్రరణలతో జన సామాన్యానికి అర్థమయ్యే వాడుకభాషలో ఉన్నవ వారు రాసిన మాలపల్లి నవలను ఆచార్య రంగాగారు ‘‘టాల్‌స్టాయ్‌ ‌వార్‌ అం‌డ్‌ ‌పీస్‌’ ‌నవలతో పోల్చదగిన నవలగా’’ అభివర్ణించారు. గాంధీ సిద్ధాంతాలు సమాజంలో ఎలాంటి సామాజిక పరిణతిని తెచ్చాయో ఉన్నవ ఈ నవల ద్వారా చెప్పారని అనిపిస్తుంది.

కానీ ‘మాలపల్లి’ నవలను 1923లో మద్రాసు ప్రభుత్వం నిషేధించింది. మద్రాసు శాసనమండలిలో 1926లో అయ్యదేవర కాళేశ్వరరావుగారు ‘మాలపల్లి నవల’పై నిషేధాన్ని ఎత్తివేయాలని వాదించారు. ఆయన తెచ్చిన చర్చ ఫలితంగా మద్రాసు ప్రభుత్వం 1928లో కొన్ని మార్పులతో మాలపల్లి నవల ప్రచురణకు అనుమతించింది. అప్పటి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ ‌సర్‌.‌సి.ఆర్‌.‌రెడ్డి ఆ నవలను విశ్వవిద్యాలయం ద్వారా ప్రచురించి విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు. మద్రాసు ప్రభుత్వం 1936లో మాలపల్లి నవలపై రెండోసారి నిషేధం విధించి పాఠ్యగ్రంథంగా తొలగించింది. సి.రాజగోపాలాచారి 1937లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మాలపల్లి నవలపై నిషేధపు ఉత్తరువులను రద్దుచేసింది. ఆ విధంగా ఒక కాలపు చరిత్రకు ఛాయగా ఉన్న ఈ నవల కూడా చరిత్రను సృష్టించింది. రెండుసార్లు నిషేధానికి గురైంది. కానీ, సాహిత్యప్రియుల హృదయాలలో శాశ్వతంగానే ఉంది.

గాంధేయవాదిగా, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘసంస్తర్తగా, గుంటూరు శారదానికేతన్‌ ‌వ్యవస్థాపకుడిగా, తెలుగు నవలా సాహిత్య తాళికుడిగా గణననీయమైన కీర్తి ప్రతిష్ఠలు పొందిన ఉన్నవ వారి సతీమణి శ్రీమతి లక్ష్మీబాయమ్మ ఆయనకు చేదోడువాదోడుగా నిలిచి సహకరించింది. ఉన్నవవారు 1958 సెప్టెంబర్‌ 25‌వ తేదీన పరమపదించినా ఆయన తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులు.

– డా।। పి.వి.సుబ్బారావు 9849177594
వ్యాకసర్త : రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ & ‌తెలుగు శాఖాధిపతి, సి.ఆర్‌. ‌కళాశాల, గుంటూరు.

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram