– ‌దాట్ల దేవదానం రాజు

వాకాటి పాండు  రంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన కథ


‘కొంతమంది అంతే. వాళ్లకు తోచింది చేస్తారు. చెబితే వినరు’ అని ఇంకాస్త గొంతు పెంచి ‘ఇదేం పిచ్చో… చస్తున్నాం, ఈయనతో. రోజంతా ఆ ముదనష్టపు పుస్తకాలతోనే ఉంటారు’ అంటోంది పక్కింటావిడతో కోడలు. అనుమానం లేదు. నాకు వినబడాలనే గట్టిగా చెబుతోంది.

నమ్మకాలు సడలుతున్నాయి. కుటుంబ సంబంధాల్లో చివరి మజిలీ ఇలాగే ఉంటుందేమో. ఇంట్లో స్థానం నెమ్మది నెమ్మదిగా దిగజారుతుందా?

ఇంట్లోనే కాదు. బయటకూడా అంతే కాబోలు. ఒక నిర్లక్ష్య భావన. పెద్దరికపు గౌరవాలు తగ్గుతున్నాయి. తరాల మధ్య వైరుధ్యాలు బాధ పెడుతున్నాయి.

మనుషుల్ని కలవడం మాట్లాడుకోవడం బాగానే ఉంటుంది. అయినా ఏదో వెలితి. పాపం శమించు గాక ఒకోసారి మనసు మరణాన్ని ఇష్టపడుతోంది. ఇక ఈ లోకంతో పనిలేదనిపిస్తోంది. నైరాశ్యం కూడదనుకుంటూనే మరి ఈ భావనలేమిటి?

అంతరంగంలో కల్లోల పవనాలు వీస్తున్నాయి. కలవరపెడుతున్నాయి. చుట్టూరా పచ్చని చెట్ల సముదాయాల నీడలు భయపెడుతున్నాయి. పూలు సైతం అమ్మోరు మెడలో కపాలాలు వేలాడుతున్నట్టుగా ఉన్నాయి. మనసంతా వికలం. నేను ఒంటరివాడినయ్యానా?

పుట్టుకను మంగళప్రదంగా స్వీకరించినవాడిని. అమ్మా నాన్నలకు నేనొక్కడినే మిగిలి గారాబంగా పెరిగినవాడిని. ఇపుడు మృత్యువును మంగళ వాద్యాలతో సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఇదేం చిత్రం?

అసలు మరణమంటే ఏమిటి? ఇష్టమైన అపురూపమైన జీవితం నుంచి నిష్క్రమించడమే కదా సకల అభిరుచుల్ని ఉన్నపళంగా వదిలేసి పారిపోవ డమే కదా సమస్త పోగేతల్ని ఉన్నదున్నట్లుగా విడిచిపెట్టి ఖాళీ చేతులతో వెళ్లిపోవడమే కదా.

ఇదేమిటీ? బతుకు నిస్సారంగా కనిపిస్తోంది. నిరాశ కమ్ముకొస్తోంది. భావాలు ఇంకిపోతున్నాయి. డైరీ రాత ఆగింది. కట్టుకున్న బట్టలు విప్పడానికి బద్ధకం. స్నానం చేయడం చిరాకు. దువ్వెన అందుకుని జుట్టు దువ్వుకోవడం పట్ల నిరాసక్తత. ఇదంతా దేనికి సంకేతమో అర్థం కాని పరిస్థితి. కడదాక నన్ను నేను నిలబెట్టుకోలేనా?

వీధుల్లోకి వెళుతున్నాను. వస్తున్నాను. జనాల్ని కలుస్తున్నాను. మాట్లాడుతున్నాను. తాజా గాలి కొత్త శక్తినిస్తుందని పడవెక్కి గోదారి మధ్యకెళ్లి తిరిగొచ్చాను. నిండు పున్నమి రోజుల్లో గోదారి అలల మీదుగా చంద్రుడ్ని చూసొచ్చాను. మధ్యాహ్నం ఎండవేడికి ఉక్కతో చెమట తడిసిన దుస్తుల్ని సూర్యుడికి చూపించాను కూడా. బాల్యస్మృతుల్లో ఒకటైన గోదారి స్నానాలు గుర్తుకొచ్చి పుష్కరరేవులో ఈతకు వెళ్లి మునకలేసాను. ఊపిరి బిగపెట్టి కాసేపు నీళ్లలో మునిగి వచ్చాను. మనవడి సైకిలు తీసుకుని ఆటల మైదానం వరకు తొక్కాను. వచ్చేటపుడు ఒకటే ఆయాసం. సైకిలు నడిపించుకుని వచ్చాను. అబ్బ… వయసు ప్రభావం ఎక్కువగానే ఉంది.

నాలో చెలరేగుతున్న వైపరీత్యాల్ని ఎవరూ పరామర్శించడం లేదు. ఎవరూ ఎవర్నీ పట్టించు కోవడం లేదు.

జీవితం వేగవంతమై పోయిందా? నిలబడి నీళ్లు తాగితే దాహం తీరదా? ఏదైనా పని చేయాలంటే ముందుగా తమకు ఒనగూడే ప్రయోజనమేమిటో తెలుసుకుని గానీ రంగంలోకి దిగరా? అంతా స్వార్థమేనా? పొరుగువాడికి సాయపడే దృష్టే లేదా? లబ్ధి చేకూరితే చాలు అది ఎంతటి అవినీతి సొమ్మైనా పర్వాలేదా? విలువలన్నీ విధ్వంసమయ్యాయా? అన్ని రంగాలూ భ్రష్టుపెట్టి పోయాయా?

ఇంట్లో ముందరి గది. అలమారాల్లో కొలువై ఉన్న మహానుభావులు. తమ జీవితకాలమంతా విలువైన సారస్వతాన్ని పండించినవారు. చేతులు జోడించి ప్రదక్షణ చేసాను. అన్నట్టు నేను రచయితను కూడా. అందమైన పదాల కూర్పుతో భావావేశం తన్నుకు వచ్చినపుడు కవిత్వం, కథలు తెగ రాసాను. నాది డెబ్బై ఏళ్ల జీవన సమరం. నా సాహితీ గమనంలో అర్థ శతాబ్ది పాటు ఒకొక్కరుగా గదిని చేరి పావనం చేసారు. ఘనమైన సాహితీవారసత్వం అందించి ఈ చోటును సంపద్వంతం చేసారు.

నా గ్రంథాలయం అరల్లోంచి ఉదాత్త సంస్కారాల జ్ఞానసంపద పిలుస్తోంది. జ్ఞానజ్యోతులు వెలిగిస్తోంది. ఇంటిలో ఉన్న ఈ పుస్తకాలు వినూత్న తరాన్ని ప్రసవించాలని ఉత్కృష్ట యుగమై ప్రభవించాలని ఘోషిస్తున్నాయి. అక్షరమంటే నాశనం లేనిది. ఎవరు తుంచగలరు?

ఎడతెగని ఆలోచనలు. ఎవరెవరో తలపుల్లోకి వస్తున్నారు. ఒకరొకరుగా కళ్లెదుట నిలబడుతున్నారు. భుజం తడుతున్నారు. కొత్తచూపు ప్రసరింప జేస్తున్నారు. దగ్గరగా వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. కంగారు పడొద్దని నిబ్బరంగా ఉండమని సంయమనం పాటించమని ప్రబోధిస్తున్నారు. గత కాలం కీర్తి చంద్రికల సొగసులు విప్పుతున్నారు. పువ్వునీ చెట్టునీ చంద్రుడ్నీ సూర్యుడ్నీ గోదారినీ పుస్తకాల్నీ ప్రేమిస్తూనే ఉండమన్నారు. ప్రేమ… కరుణ… మానవీయత… చూపించమంటున్నారు.

ఇది నేనే పొందిన అలౌకిక స్పందన.

‘‘నీలో తడి ఉంది. స్పందించే గుణం ఉంది. నీ అభిరుచి నీ ఇష్టం. చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేదు. ఎవరి అభిప్రాయమన్నా వారి వారి సొంతం. అందర్నీ గౌరవించు. ఆశలు పండించుకో. కలలు సాకారం చేసుకో’’ ధైర్యం నూరి పోస్తున్నంత సేపు దేహం పునరుత్తేజంతో కలకలలాడింది.

అంతా తాత్కాలికమే. స్వల్ప విరామం తర్వాత మళ్లీ నీరసం. జవసత్వాలు ఊడిగిపోయినట్టు వాస్తవం భయ పెడుతోంది. ఈ తరం నన్ను అర్థం చేసుకోరు. నన్ను వెంబడించే ప్రయత్నమూ చేయరు. అనుసరించడం తెలీదు. నా అనుభవాలూ జ్ఞానమూ ఎందుకూ పనికిరానివని వాళ్ల అభిప్రాయం. ఎవరూ నా వెంట నడవరని తెలిసిపోయింది. బలవంతం చేయడం వృథాప్రయాస. రకరకాల ఊహలు నన్ను ఒకచోట నిలవనీయడం లేదు.

‘అస్తమానం పుస్తకాలే లోకం. గంటలు గంటలు…కళ్లు వత్తుకుంటూ.. తనలో తాను మురిసిపోతూ…ఏమిటో ఆనందం? పనిలేనోడి తీరే అంత కాబోలు’

‘నిచ్చెనెక్కడం దిగడం… పుస్తకాలు ఊరికే నెలుక్కోవడం…పడితే ఎముకలు విరిగితే… బాధపడేది ఎవరు?’

‘ఈయనతో చచ్చే చావురా, బాబూ…  చెబితే వినే రకం కాదు. చెప్పకపోతే ఏ క్షణాన ఏం జరుగుతుందో… ఎలాగ ఈ మనిషితో’

‘అసలే చెదల గదుల కొంప. ఏదో రాత్రి కాడ చెదల గుంపు జట్టుకట్టి మూకుమ్మడిగా పడి ఆరగిస్తే గానీ దరిద్రం వదలదు’

‘కూడెడతాయా? గుడ్డెడతాయా? కట్ట కట్టి గోదాట్లోకి విసిరేస్తే ఈ ఇంటికి పట్టిన శని ఒక్క దెబ్బతో పోతుంది’

ఇవన్నీ ఎవరెవరో అన్న మాటలు కావు. నా వెనుక అలాగే అంటారనే చిత్రమైన ఊహ. చింత చచ్చినా చేవ చావనట్టు ఇంకా నాలో సృజన బలం ఉంది. ఊహలు జోడించి ఆలోచనల్ని అందంగా కాగితంపై వొంపగలను. గ్రంథాలు పఠించి పునర్మూల్యాంకనం చేసుకునే శక్తీ ఉంది.

అక్షరాల్లో అగ్గి విరజిమ్మే పదాలుంటాయి. వాటికి చెదలు పట్టవు. వాటి జోలికెళితే మాడి మసై పోతాయి. సుతి మెత్తని స్పర్శానుభూతితో చందనం వెదజల్లే సువాసనలు కలిగించే అక్షరాలుంటాయి. అవెప్పుడూ లోకువే. వాటిని భద్రంగా కాపాడుకోవాలి.

చీమల మందూ కిరసనాయిలుతో రసభంగం చేస్తే సరిపోతుంది. అద్దంలా కనిపించే అట్టలుంటాయి. పగలకుండా చూసుకోవాలి. అత్తారబత్తంగా అంటామే అలాగన్నమాట. గింజ దక్కితే గింజ పండినట్టుగా సకల జాగ్రత్తలతో కాపాడుకోవాలి.

నిద్ర లేదు. మరో కాలక్షేపం లేదు. కొత్తగా చూసే లోకం లేదు. పరిచయం కావాల్సిన మిత్రులూ లేరు. నా తోడూ నీడా మనసూ ఇవే. ఇవి సత్సాంగత్య పరిచయ వేదికలు.

వెతుకులాట. ఆ మూల నుంచి ఈ మూల దాక. జ్ఞాపక పొరల్నుండి దూరంగా జరిగిన వాటి గురించి అన్వేషణ. చదివినవీ నమిలినవీ ఆరగించుకున్నవీ- ఎప్పుడూ నెమరేస్తుంటాను. ఒక్క స్పర్శ చాలు. సృజన కారుడు కనిపిస్తాడు. సంఘటనలు గుర్తుకొస్తాయి. అచ్చం నిజమైన వ్యక్తుల్లాగే పాత్రలు పలకరిస్తాయి. మాట్లాడతాయి. యోగక్షేమాలు అడుగుతాయి. మనం చేయాల్సింది ఒకటే. మనసును అనుసంధానం చేయడం అంతే. ఆ పాత్రల నడవడిక ఇచ్చిన సందేశాలు గొప్పవి. బతుకుబాట సంస్కారవంతంగా గడపడానికి సాయపడ్డాయి. వేరెవ్వరూ ఇవ్వని భరోసా ఇచ్చాయి. పఠన శక్తితో పొందిన సామర్ధ్యం అది. వాటి సమక్షాన్ని గర్వకారణంగా భావించడం అందుకే.

‘ఒట్టి మొండి ఘటం. చెప్పింది ససేమిరా వినరు. మీ ధోరణి మీదే. ఎదుటి వాళ్లను అర్థం చేసుకోరు. మమ్మల్ని సవ్యంగా బతకనీయరు ’’ కింద పడి కాలు విరిగినపుడు అస్మదీయుల ఎత్తిపొడుపులు.

ఎముకలు విరగ్గొట్టుకోవడం నాకేమైనా సరదా అనుకుంటున్నారా? అవసరమైన పుస్తకం కోసం గాలిస్తూ దొరగ్గానే పొందే ఆనందం మీకు తెలుసా? ఒరేయ్‌… ‌నాయనలారా… మీకు చేతులు జోడించి చెబుతున్నాను. కళ్లు ఇంట్లోని చిన్న పెట్టెకు ఆరేసి అన్నపానీయాలు మానేసి గంటలసేపు సోఫాల్లో కూలబడకండ్రా… ఇంట్లో ఉన్న నలుగురూ సెల్‌ ‌మాయలో కూరుకుపోయి ఎవరికి వారే అన్నట్టు మాటామంతీ లేకుండా కుటుంబ బంధాల్ని విచ్ఛన్నం చేయకండిరా… కాసేపు పిల్లల ముందు కూచుని ఏదైనా చదువుతున్నట్టు కనీసం నటించండి. వారసులు గమనిస్తారు. అనుకరిస్తారు. మంచి ముత్యాలు వంటి కథలుంటాయి. తేనె జాలువారే కవిత్వం ఉంటుంది. జాగ్రత్తగా ఏరి వినిపించండి. నెమ్మదిగా రుచి చూపించండి. ఆనక చెవులు కోసుకునేంత ఇష్టాన్ని కనబరుస్తారు. వేటగాడు ఎరవేసి పిట్టల్ని చేజిక్కించు కున్నట్టు పఠనాల అభిరుచి వలలో అందంగా చిక్కుకు

పోతారు. వాళ్ల వాకిటిలో వాళ్లను సంచరించ నీయండి. మీదైన వాంఛల్ని వాళ్ల మీద రుద్దకండి. బలవంత పెట్టకండి. నాకు తెలుసు. మీకు సరైన బుద్ధి ఉండదు. ఇవన్నీ మీరు చేయరు. పోటీతత్వపు మానసిక ఒత్తిళ్లను ప్రేరేపిస్తారు. మీకు అదొక ఆనందం.

ఒకాయన కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. వెళ్లాను. చూసాను. అక్కడొక నగిషీలు చెక్కిన వంకరటింకరల షోకేసు. వంపుల్లో అందంగా పేర్చిన పుస్తకాలు. డ్రాయింగు రూముకు అదనపు ఆకర్షణ. ఎంత

అద్భుతంగా ఉంది?

‘పుస్తకాలు చదువుతారా?’ అమాయకంగా అడిగాను.

‘మా ఇంట్లో ఎవరూ పుస్తకాలు చదవరు’ గర్వంగా చెప్పాడు నవ్వుతూ.

పుస్తకాలు అలంకరణ వస్తువుగా మారిపోయాయా? హస్త భూషణమల్లా ఇంటికి కళాకృతి అయ్యిందా?

అక్షరాలు అమృత గుళికలు. ఆరోగ్యహేతువులు. అక్షరాలు గుప్పెట ఉంటే దేహం ఆనంద నిలయ మౌతుంది.        ఈ తెలుగుగడ్డ నా నాలుక మీద బీజాక్షరాలు చల్లిన పాఠశాల

ఈ తెలుగు నేల నీతిశాస్త్ర స్తన్యం కుడిపిన గోశాల

ఈ తెలుగు మట్టి శాస్త్ర విజ్ఞానాన్ని వండి వార్చిన పాకశాల

ఈ తెలుగు మాగాణి ఘన సారస్వత వారసత్వ సంపదల గ్రంథాలయం.

— – – – – – – – –

అర్థరాత్రి. చిమ్మ చీకటి. ఊరంతా గాఢనిద్రలో కలల పలవరింతల్లో ఉంది. ఒక్కసారిగా ఉలికి పాటు. మెలకువ గిలిగింతలు పెట్టింది. చివాలున లేచాను.

మెదడు పొరల్లో కలవరం. సంధించిన ప్రశ్నలు కుదిపేసాయి.

ముందు గది నా అభిరుచులు భద్రపరచిన పసిడి ఖజానా.

అంది పుచ్చుకునే వారసులు లేనపుడు… గదికి భారంగా తలుస్తున్నపుడు… ఏం చేయాలి?

రక్త నాళాల దారి మళ్లించిన గుండె నాది. అదాటున చెప్పాపెట్టకుండా ప్రాణం విడిస్తే వీటికి దిక్కెవరు? ఎవరు రక్షిస్తారు? ఎవరికి కావాలి?

ఇక లాభం లేదు. కఠోర నిర్ణయం తప్పదు. పవిత్ర దినాల్లో గోదాట్లోకి నాణాలు విసరడం తెలుసు. ఓ అవినీతి అధికారి రెండు తులాల బంగారం రూపుకట్టి మనసులో ఏదో స్మరించుకుంటూ గోదావరి నదికి పవిత్రంగా అర్పణ చేసిన ఉదంతం నాకు తెలుసు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. గుండె దిటవు చేసుకుని సంసిద్ధుడ్నయ్యాను.

ఒంటి గంటయ్యింది. ఇదే సరైన సమయం.

దుప్పట్ల కోసం వెదికాను. అయిదు దొరికాయి.

పుస్తకాల అలమారాలు. ఎదురుగా నిల్చున్నాను.  ఏడుపు ముంచుకొచ్చింది. ఏడ్చాను. దు:ఖపడ్డాను. పుస్తకవిలాపం.

ఆ చివర నుంచి ఈ చివర దాక చేతితో తడి మాను. చిత్రమైన అనుభూతి. ఒళ్లు జలదరించింది. ఒక్కో అర ఒక్కో పక్రియను పండించింది. దిగ్దండులైన సాహితీవేత్తల శ్వాసలు ఒంటికి తగిలినట్టు అనిపించింది.

సాంప్రదాయ పద్య సాహిత్యం, వర్తమాన ఆధునిక కవిత్వం, విశ్లేషణాత్మక వ్యాసాలు- వీటిని దొంతరలుగా పేర్చి గోదావరి మాతకు అర్పించాలి. అదీ నా దీక్ష. అనాదరణకు స్మృతి చిహ్నంగా గుణాఢ్యుడు కావ్య హోమం చేసినట్టు ఒక్కో గ్రంథాన్ని జలాధివాసం చేయిస్తాను.

భుజం మీద మోయగలిగే బరువును అంచనా వేసుకుని అయిదు మూటలుగా దుప్పటి మూలలు బిగించి కట్టాను. ఇంకా మిగిలాయి.

‘మిగిలిన వాటి సంగతి రేపు చూడొచ్చు’ అనుకున్నాను.

ప్రయాసపడి ఒక మూట ఎత్తుకున్నాను. సమతూకంతో భుజం మీద అమర్చుకున్నాను. చప్పుడు లేకుండా తలుపు తీసాను. అడుగులు తడబడు తున్నాయి.

ఇంటికీ గోదారికి మధ్య అయిదొందల మీటర్ల దూరం.

చిక్కని చీకటి. నిశ్శబ్ద వాతావరణం. చల్లని గాలి ముఖాన కొట్టింది. నడక సాగించాను.

గోదారి ఒడ్డు. పుష్కరాల రేవు. మూట దింపాను. సుడులు తిరుగుతున్న గోదారిని కాసేపు చూసి వెనుదిరిగాను.

నిర్మానుష్యం. చీకటి పరదాలో నిద్రలో ఉంది ఊరు. హుషారుగా నడిచాను.

రోడ్డు మీద కుక్క విశ్రాంతిగా పడుకొనిఉంది.  అడుగుల సడికి కళ్లు తెరిచి తల వారగా ఎత్తి చూసింది. తనకేమీ ప్రమాదం లేదనుకుంది కాబోలు యథాప్రకారం కళ్లు మూసుకుంది.

రెండో మూట భుజానికెత్తుకున్నాను. మళ్లీ రోడ్డున పడ్డాను. నడక భారంగా ఉంది. కొద్దిపాటి అలసట చెమట రూపంలో బట్టల్ని తడుపుతోంది. ఎవరూ గమనించకపోవడం అదృష్టం. లేకపోతే సవాలక్ష ప్రశ్నలు ఎదురయ్యేవి. అయినా గానీ నేను చేస్తున్న పని సరైనదేనా? కసి… అసహనం… అంతే.

నాలుగో మూట మోస్తున్నపుడు చిన్నగా గుండెలో అలజడి ప్రారంభమైంది. కాసేపు ఆగి బయలు దేరాను. నా వ్యవహారం పట్టువదలని విక్రమార్కుని తంతులా ఉంది.

సగం దూరం వెళ్లానో లేదో జెండా స్తంభం దగ్గర మొదటి అంతస్తు బాల్కనీ లోంచి ఓ మనిషి తాలూకు నీడ. చేతిలో సిగరెట్టు ఉంది. వంగి తేరిపారి చూస్తున్నాడు. నడక వేగం పెంచాను. వాడు రహస్యంగా వెంబడిస్తాడా? వాడికేం పని ?

ఉత్సుకత ఎంతటి కార్యాన్నైనా చేయిస్తుంది. ఏం చెప్పగలం?

అమ్మయ్య… ఇక ఆఖరి మూట ఒక్కటే ఉంది. నాలో శక్తి సన్నగిల్లుతోంది. ఎలాగోలా దీన్ని గోదావరి తల్లి చెంతకు చేర్చాలి. అప్పటిగ్గానీ అనుకున్న పని సాధ్యం కాదు. కాసేపు మంచం మీద విశ్రాంతి తీసుకుని వెళితే మంచిదేమో. అమ్మో…. కునుకు పడితే మొత్తం శ్రమ బూడిదలో పోసినట్టవుతుంది. మొండి ధైర్యం. తెగింపు. ఊరక కూర్చోనీయదు.

అంతకుముందు లాగే మూట ఎత్తుకున్నాను. కొద్దిగా తూలాను.

‘ఆగండి’ ఎవరో పిలిచినట్లయ్యింది. గిరుక్కున వెనక్కి తిరిగాను. ఎవరూ లేరు. అంతా ఉత్తి భ్రమ.

నెల క్రితం మనవడు అనిందు అన్న మాటలు రాజేసిన మం•లా గుర్తుకొచ్చాయి. రివ్వుమని ఎగసిన తారాజువ్వలా మనసును తాకింది. లోలోపలి పొరలు విచ్చుకుంటున్నట్లుగా ప్రతిధ్వనించాయి.

‘తాతయ్యా… ఇయన్నీ మీరు చదివేసారా? నిజం… నిజంగా. అన్నీ మీ బుర్రలోకి ఎక్కేసాయా? చాలా గ్రేట్‌ ‌కదా. అయితే పెద్దయ్యాక నేనూ చదివేత్తా’ అని తుర్రుమని లోపలికి పోయాడు. అపుడపుడు నాకుమల్లే కళ్లజోడు ఎగదోసి పుస్తకం చదవడం, పేజీలు గుర్తుంచుకోడానికి కాగితం ముక్క అడ్డుపెట్టడమే కాకుండా నెత్తి మీద పుస్తకం పెట్టుకుని గరగ ఆట ఆడటం గుర్తుకొచ్చింది. నుదుటి మీద వెన్న కరగటం మొదలెట్టింది. మేథో మథనం.

దబ్బున భుజం మీంచి మూటను నేలకు విసిరి కొట్టాను. తప్పులు చేయడం సహజం. సరిదిద్దుకోవడం అనుభవం నేర్పిన పాఠం. ఇపుడు నేను చేయాల్సింది అదే.

పరుగెట్టాను గోదారి చెంతకు. ఎంత ఓపిక అరువు తెచ్చుకున్నా దూరం తరగడం లేదు. ఒగురుస్తున్నాను. ఆయాసం.

గోదారి దరి చిక్కడం లేదు. నాలోని కొత్త ఉత్సాహం అడుగులు వేయిస్తోంది.

లక్షలాది ఆపన్నుల జీవనోపాధి గోదారి. మాగాణి పంటల జలనిధి గోదారి.

పుష్కరాల రేవు చేరాను. కానరాని వెలుగు. గూడుకట్టుకున్న చీకటిలో అలల చప్పుడు.

గుండె గుభేలుమన్నది. చూపులకు గుడ్డితనం. మూటలేవీ?

మూటలు లేవు. చుట్టూ వెదికాను. నలుదిక్కులా పిచ్చోడిలా తిరిగాను. గోదారి మధ్యలో వేట పడవల ఆకారమేదో అవతలి ఒడ్డుకు వెళుతున్నట్టుగా ఉంది.

గోదారి ఒడ్డున పాదముద్రల ఆనవాళ్ల కోసం గాలిస్తూనే ఉన్నాను.

ఒక్కసారిగా నేల మీదకు కూలపడిపోయాను.

 కళ్లు మూసుకున్నాను. గంటసేపు అట్లాగే ఉండి పోయాను.

అలమారాల నిండుగా పుస్తకాలు.

‘శూన్యాలు పూరిస్తూనే ఉండాలి. బావి తరాల అవసరాలకు ఇంకా రెట్టింపు సేకరించాలి ’. లేచాను.

కళ్లెదుట నిండు కుండలా గోదారి… పుస్తకాల దొంతరులుగా అలలు.

By editor

Twitter
Instagram