– కన్నెగంటి అనసూయ

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


‘నేనెవరో ఇక్కడికి వచ్చిన వాళ్లల్లో ఎవరైనా చెప్పగలుగుతారా?’’

పిల్లలు ఒకటే అరుపులూ, కేరింతలు. ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. కొంతమంది పెద్దవాళ్లు మాత్రం ఇటే చూడసాగారు.

మామూలు ఫంక్షన్లకి భిన్నంగా ఇదేదో కొత్తగా, ఆశ్చర్యంగా ఉంది చాలామందికి, ఆసక్తిగా ఉంది మరి కొంతమందికి.

అంతకు ముందే నిశ్చితార్థం అయిందేమో కబుర్లలో మునిగి తేలుతున్న కొత్త జంట కూడా కబుర్లాపి నా వైపే చూడసాగారు.

‘‘నన్నెవరైనా గుర్తుపట్టారా?’’ శక్తినంతా కూడగట్టుకుని మళ్లీ గట్టిగా అరిచాను. ఎవ్వరూ మాట్లాడలేదు. తెలిసిన ఒకళ్లిద్దరు మాత్రం నవ్వారు.

‘‘ఎవరూ చెప్పలేరా? సరే చెప్పద్దు. పోనీ చేతులెత్తండి..’’ నవ్వుతూ.. అన్నాను అందర్నీ కలయ చూస్తూ.. ఎవ్వరూ చేతులెత్తలేదు. ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఏవేవో గుసగుసలు…?

‘‘ఉదయపు ముహూర్తం కావటంతో నిశ్చితార్థం అయిపోయింది. భోజనాలకు చాలా సమయం ఉంది కాబట్టి.. ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలడుగుతాను. సమాధానం చెప్పండి. ప్రశ్నలు అంటే కౌస్‌ బనేగా క్రోర్‌ పతీలో అమితాబ్‌ అడిగేంత జటిÄలమైన ప్రశ్నలైతే కావు. అన్నీ మీకు సంబంధించినవే. సమాధానం చెప్పిన వారికి బహుమతులు ఉంటాయి. అలా అని నేనేదో మిమ్మల్ని అందర్నీ ఎంగేజ్‌ చేయటానికి వచ్చినదాన్నయితే కాదు..

నేనూ ఒక అతిథినే. మీ అందరి బంధువునే. అయితే నేనెవరో చెప్పండి. ఎవరికైనా తెలుసా.. చేతులెత్తండి..’’ నవ్వుతూ అన్నాను. ఎవ్వరూ మాట్లాడలేదు..

‘‘ఇక్కడ మీకొక కథó చెబుతాను. వినండి. ఇక్కడున్న యువతీ యువకులకి ఇది బాగా ఉపకరిస్తుంది. కూడా..’’ అని చుట్టూ ఒకసారి చూసి మొదలు పెట్టాను.

‘‘నాయకుణ్ణి ఎంచుకోవటానికని ఒక అడవిలో కుందేళ్లన్నీ సమావేశం అయినాయి. మాంసాహారం తినే జంతువుల కళ్లన్నీ తమ మీదే ఉంటున్నాయని, తమని తామే కాక తమ జాతిని రక్షించుకోవటానికి ఒక నాయకుడు అవసరం అని అవి భావించి అక్కడ సమావేశం అయ్యాయి. తన తెలివి తేటల్లో ఎన్నో ప్రమాదాల నుండి బయట పడటమే కాక, రోజుకో కుందేలుని తినేసే సింహానికి బావిలో తన నీడను తనకే చూపించి తనంతట తానే నీళ్లల్లోకి దూకేలా చేసేసి సింహం చావుకి కారణమై, అడవిలోని జంతువు లన్నింటినీ దాని బారి నుండి తప్పించిన కుందేలూ అక్కడే ఉంది. అలా చేయటం వల్ల అది ప్రపంచ ప్రసిద్ధి చెందిన కుందేలు అయ్యింది. కాకపోతే అది చాల వృద్ధురాలైపోయింది. దానికి అన్ని విధాలా అనుభవం ఎక్కువ అని నాయకుణ్ని ఎంపిక చేసే బాధ్యత దానికి అప్పగించారు. సరేనంది వృద్ధ ప్రపంచ కుందేలు.

‘‘సరే అయితే. సరిగ్గా ఇక్కడికి అయిదు మైళ్ల దూరాన ఒక చెరువు ఉంది కదా. అది మనందరికీ తెలిసిన చెరువే. నాయకుడు అవ్వాలని అనుకునేవారు ఇక్కడికి వచ్చి వరసగా నిలబడండి. నేను ఈలవేస్తాను. పరుగు మొదలెట్టండి. ఎవరు ముందు వెళతారో అతనే నాయకుడు’’ అంది.

సరేనని పోటీలో పాల్గొనాలనుకునే కుందేళ్లన్నీ వచ్చి పక్క పక్కనే వరుసగా నిలబడ్డాయి.

వృద్ధి కుందేలు ఈల వేసింది. పరుగు మొదలైంది. కొన్ని ప్రారంభంలోనే, మరికొన్ని కాస్తం దూరం వెళ్లాకా, ఇంకొన్ని ఇంకాస్త దూరంగా వెళ్లాక ఆయాసం వచ్చి ఆగి పోయాయి.

రెండు మాత్రం ముందుకు దూసుకు పోతున్నాయి. అయితే… ఆగిపోయిన కుందేళ్లు ఊరికే కూర్చోలా..’’

అని చెప్పి ఆపి అందరి వైపూ చూసాను. చాల ఆసక్తిగా వింటున్నారు.. బహుశా బహుమతుల ప్రభావం అనుకుంటా అని మనసులో నవ్వుకుని ఎవరో అందిస్తే కాసిన్ని నీళ్లు తాగేలోపే ‘‘చెప్పండి చెప్పండి.. తర్వాతేం జరిగింది’’ అని ఒకటే అరుపులు.

కొంతమంది పిల్లలు కథ ఆసక్తిగా ఉందనుకుని ముందుకంతా వచ్చి కింద కూర్చున్నారు. పెద్ద వాళ్లల్లో కొందరైతే బర్రున శబ్దంవచ్చేలా కుర్చీలను ఈడ్చి మరీ నా దగ్గరకంటా కూర్చున్నారు.

మళ్లీ కథచెప్పటం మొదలుపెట్టా. ఈసారి పిల్లలూ వినసాగారు..

‘‘…అయితే ..పరుగాపేసిన కుందేళ్లు ఏం చేసాయంటే ఆ రెండు కుందేళ్ల వెనకే పరిగెత్తుతూ.. ‘‘ఆపెయ్యండి… ఆపెయ్యండి. ఇంకా చాలా దూరం ఉంది చెరువు. ఆయాసం ఎక్కువైతే గుండె ఆగిపోతుంది అని అరిచాయి.’’ అని అరిచింది.

దాంతో ఒకటి ఆగిపోయింది.

ఇక మిగిలింది ఒక్క కుందేలు. మళ్లీ అన్నీ కలిసి దాన్ని హెచ్చరించటం మొదలు పెట్టాయి. అయినా అది పరుగు ఆపలేదు. అది గెలిచింది.

వృద్ధ కుందేలు దానిని కుందేళ్లకి నాయకుడిగా ప్రకటించింది. అయితే కుందేళ్లల్లో కొన్ని దాన్ని చుట్టుముట్టి.. ‘‘అంతదూరం నువ్వెలా పరిగెత్త గలిగావు? నీకు ఆయాసం రాలేదా? చనిపోతానేమో నని భయం వేయలేదా? వెనుక నుండి వీళ్లంతా అరుస్తున్నారు కదా..’’ అని అడిగాయి.

‘‘నా లక్ష్యం నాయకుడు అవ్వటం. నా గమ్యం చెరువు. నాకుంది ఏకాగ్రత. దాంతో పరుగెట్టా. ఫలితం వచ్చింది.’’ అంది గెలిచిన కుందేలు.

‘‘శభాష్‌’’ అంది వృద్ధి కుందేలు.

ఇదంతా మీకెందుకు చెప్పానంటే ‘‘ఎవరి జ్ఞానం వారిదే, కొంతమందికి జవాబులు తెలుస్తాయి. కానీ అది సరైన జవాబో, కాదో మళ్లీ అందరూ నవ్వు తారేమో..’’ అని చుట్టూ చూస్తారు. అలా ఎప్పుడైతే చుట్టూ ఉన్న వాళ్ల మీద ఆధారపడతారో.. వాళ్లు ఎప్పటికీ గెలవలేరు. అలానే మిగిలిపోతారు. గెలిచిన కుందేల్లా.. ఎవ్వర్నీ పట్టించుకోకుండా తను చెప్పాలనుకున్నది చెప్పటం, చెయ్యాలనుకున్నది చేసేయ్యటం నాయకత్వ లక్షణాలు. జాగ్రత్తగా గమనిస్తే మనలో చాలామందిలో చొరవ తక్కువ. ఎవరన్నా ఏమన్నా అను కుంటారేమో అనే సందేహం. ఎవరన్నా చెయ్యెత్తితే మనం ఎత్తుదాం అని చుట్టూ చూస్తారు. మొహమాటమే సగం అభివృద్ధికి ఆటంకం’’ అని నేనింకా చెబుతూనే ఉన్నా.. ఇంతలో.. ఒకమ్మాయి లేచి నిలబడిరది..

‘‘అడగండి. చెబుతా.’’ అంటూ.. ఆ తర్వాత మరికొందరు నిలబడ్డారు. నేను చెబుతానంటే, నేను చెబుతానని..

సరే.. ఇక ఆలస్యం చేయదలచుకోలేదు. ‘‘నీ పేరేంటమ్మా.?’’

‘‘నున్న భారతి’’

‘‘సరే. మీ నాన్న గారి పేరు..?’’ అనడిగాను. చెప్పింది. అలాగే వాళ్ల అమ్మగారి పేరు

‘‘మిమ్మల్ని ఎంతో గారంగా పెంచి ఉంటారు కదా మీ నాన్నగారు?’’ అన్నాను.

ఇంత ముఖం చేసుకుని జూకాలు ఇంత దూరం ఊగేట్టుగా అవున న్నట్టు తలూపింది.

‘‘అయితే మీ నాన్నగారు ఎంత గారంగా మిమ్మల్ని పెంచారో… మీ నాన్నగారిని కూడా వాళ్ల నాన్నగారు, అమ్మగారూ అంతే గారంగా పెంచి ఉంటారు కదా? వాళ్ల ఇద్దరి పేర్లూ చెబుతారా?’’ అనడిగాను. ముందు కాస్త తటపటాయించినా అతి కష్టం మీద చెప్పింది.

‘‘అయితే…మీ తాతయ్యని కూడా వాళ్ల నాన్న అలానే పెంచి ఉంటారు కదా. అంటే మీ నాన్న వాళ్ల తాతయ్య. ఆయనకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల్ళూ ఎంతమందో చెప్పగలుగుతావా?’’

నేనిలా అడుగుతున్నంతలో కొంతమంది పక్క వాళ్లతో గుసగుసలు మొదలెట్టారు. మరికొంత మందైతే ఫోన్‌లు తెరిచి పేర్లు వెతుక్కుంటున్నారు. నాకు అర్థ్ధమైపోయింది.

పక్క వాళ్లతో గుసగుసలాడి తెలుసుకోవద్దని, ఆ ఫంక్షన్‌లో ఉన్నాళ్లు ఎక్కడో దూరంగా ఉన్నాళ్లని ఫోన్లో తెలుసుకోవద్దని వార్నింగ్‌ ఇచ్చాను.

అంతా ఒక్కసారిగా నిశబ్దంగా అయిపోయారు. ‘‘ఏమ్మా? తెలిసాయా పేర్లు?’’ అనడిగాను.

ఆ అమ్మాయి నీళ్లు నములుతూ దిక్కులు చూస్తూంది సిగ్గుపడుతున్నట్టు.

‘‘కూర్చోమ్మా.! నువ్వు ఎప్పుడైతే నా కథ ఇంకా పూర్తి కాకుండానే నేను చెప్తానని లేచి నిలబడ్డావో…అప్పుడే సగం గెలిచావు. అయితే నీ ఒక్కదానికే కాదు.. ఇవ్వాళా, రేపూ చాల మందికి బంధుత్వాలు కేవలం అమ్మానాన్నల వరకే తెలుస్తున్నాయి. మరికొద్దిమందికి మాత్రమే వెనకటి తరం, అంటే… అమ్మమ్మా, తాతయ్య, నాయనమ్మా, తాతయ్యా.. ఇంతవరకూ తెలుస్తున్నారు. పెద్దవాళ్లు చెప్పక పోవటం కావచ్చు, పిల్లలకి వినే ఓపిక, సమయం లేక కావచ్చు… రాకపోకలు లేక కూడా కావచ్చు. అందులో సగం పెద్దవాళ్ల తప్పున్నా.. మిగతా సగం మీదే. ఎందుకంటే.. ఒక క్రికెటర్‌ గురించో ఒక సినిమా నటుడి గురించో అడిగితే ఠక్కున చెప్పేసే చాలామంది.. వంశపు వేళ్లయిన స్వంత వంశీకుల గురించి, తమ అస్తిత్వానికి కారకు లైన వారి గురించి తెలుసుకోవాలని లేకపోవటం మన దురదృష్టం’’’ అని కాసేపాగి..

‘అయితే… ఇక్కడ చాలమంది పెద్దవాళ్లూ, పిల్లలూ ఉన్నారు. పిల్లల్ని వదిలేస్తే పెద్ద వాళ్లల్లో ఎవరైనా భారతి వాళ్ల తాతయ్య తండ్రికి అన్న దమ్ములు ఎంతమందో, అక్కచెల్లెళ్లు ఎంతమందో ఎవరైనా చెప్పగలరా?’’ అనడిగాను..

ఎవ్వరూ నోరు మెదపలేదు… కొంతమంది పెద్దవాళ్లు నేనెక్కడ వాళ్లని అడుగుతానో అని నా దృష్టిలో పడకుండా ఉండేందుకు నానా కష్టాలూ పడుతున్నారు..

ఎంతసేపైనా ఎవ్వరూ ఏమీ మాట్లాడక పోయేసరికి ..

‘ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే నేనెవరో తెలిసి పోతుంది’’ అన్నాను..

అయినా ఎవ్వరూ మాట్లాడలేదు.

అప్పుడన్నాను..

‘‘ఇవ్వాళ నిశ్చితార్థ. పెళ్లి ఇంకా వారం రోజు లుంది. ఆరోజు మళ్లీ ఇలాంటి సందర్భం ఉంది. అప్పుడు ఎవరైతే ‘‘నున్న వారి వంశ వృక్షం ‘‘ గురించి విపులంగా రాసుకుని వస్తారో.. వాళ్లకి….’ అని ఆపేశాను..

‘‘ఏం బహుమతి.. ఏం బహుమతి’’ అని అరిచారందులో కొంతమంది.

ముప్పై వేల విలువ చేసే.. వస్తువు’’ అన్నాను ఒక సంచిని పైకెత్తి చూపిస్తూ..

అరిచేసారంతా. కొంతమంది అయితే భోజనాలకు వెళ్లకుండా సంభాషణల్లో పడిపోయారు. మొత్తం మీద నేను చెప్పిన విషయాల ప్రభావం వాళ్లందరి మీదా పడ్డట్టు తెలుస్తూనే ఉంది.

చాలమంది నన్ను పలకరించి మాటల మధ్యలో నేనెవర్నో తెలుసుకోవటానికి చాల యుక్తులు ప్రయోగించారు కానీ నేను బయటపడలేదు.

పెళ్లి కూతురి తండ్రి నవ్వుతూ నా దగ్గరకి వచ్చి.. ‘‘మొత్తం మీద విజయం సాధించావు.’’ అన్నాడు. నవ్వుతూ.

‘‘చూద్దాం. వారం రోజులే కదా..’’ అన్నాను నవ్వుతూ.

పెళ్లి రోజు రానే వచ్చింది. లగ్నం తెల్లవారగట్ట కావటంతో భోజనాలయ్యాక బోలెడంత సమయం ఉందేమో..అతిథులు చాలామంది హాజరై భోజనం చేసి వెళ్లి పోతున్నారు. దగ్గర బంధువులు మాత్రం భోజనాలు చేసి వచ్చి కూర్చున్నారు. అందులో నిశ్చితార్థ రోజున ఉన్నవాళ్లంతా ఉన్నారు. బహుశా బహుమతి ప్రభావం అనుకుంటా. సరే ఏదైతే ఏమైందిలే.. ఉన్నారు కదా అంతే చాలు అని మనసులో అనుకుని మైక్‌ అందుకున్నాను..

మొత్తం ఆరుగురు నున్న వారి వంశవృక్షం గురించి రాసుకొచ్చారు. అందులో ఒక్కటి మాత్రమే విపులంగా ఉంది. ఎందుకైనా మంచిదని నాకు తెలిసినా కూడా అన్నీ అక్కడున్న పెద్ద వాళ్లకి ఒకసారి చూపించి నిర్ధారించుకున్నాక..

‘‘నిజంగా గొప్ప ప్రయత్నమే చేసారు. అయితే.. ఇక్కడ కొన్ని విషయాలు మీతో నేను చెప్పదలచు కున్నాను. తర్వాతే విజేత ఎవరో చెప్తాను.’’

నిత్యం…మనం సోషల్‌ మీడియాలో తిరుగు తూనే ఉంటాం.

నా దృష్టిలో… సమయాన్ని వృథా చేసుకుంటూ పల్లెటూళ్లల్లో… అరుగుల మీద పొద్దుపోయేదాకా కూర్చుని బాతాఖానీలతో కాలక్షేపం చేసేవాళ్ల కంటే తక్కువేం కాదు ఇలా ఎంతసేపూ సోషల్‌ మీడియాలో గడిపే వాళ్లు. వాటి వల్ల ఎంత ఉపయోగం అనేది తమకు తామే తెలుసుకోవాలి. చేరాల్సిన గమ్యాలూ, సాధించాల్సిన లక్ష్యాలు లేనివాళ్లు మాత్రమే సమయం ఇలా వృథా చేస్తూంటారు.

ముఖ్యంగా ఇన్‌స్టాగ్రాంలో సినిమా యాక్టర్లని, వాళ్ల పిల్లల్నీ, భర్తలనీ చూస్తూ అదో లాంటి ఆనందం అనుభవిస్తాం. వాళ్ల అమ్మా నాన్నల్నీ ఆత్రుతగా చూసేస్తాం. అపురూపంగా భావిస్తాం. కానీ మనం ఇలా నేలపై ఉండటానికి కారణమైన మన వంశ వారసుల్ని కానీ, బంధువుల గురించి కానీ తెలుసుకోవటానికి ప్రయత్నించం.

ఇప్పటికిప్పుడు…నా పేరేంటో, నేనేంటో, నేను ఎన్ని తెలుగు, హిందీ సినిమా లకి కథ, మాటలూ, పాటలూ రాశానో చేప్తే అందరూ నాతో సెల్ఫీలంటూ వెంటపడతారు. మరికొంతమందైతే మా అమ్మ తోనూ, మా అమ్మమ్మతోనూ కూడా సెల్ఫీ తీసుకోవటం మొదలుపెడతారు. అవసరమా?

మన స్వంత వంశస్తులు మనకి అక్కరలేదు.

మనల్ని ప్రేమించి పెద్ద చేసి, మనకి పుట్టుకతోనే ఒక కుటుంబాన్నీ, ఒక సంస్కృతిని, సంప్రదాయాన్నీ, అలవాట్లనీ, ఆచారాలని .. వీటితో పాటు కొండంత ప్రేమని, అనుబంధాన్నీ, ఆత్మీయతనీ ఇచ్చిన మన తల్లిదండ్రుల గురించి ఉన్న ఆసక్తే మన అమ్మానాన్నల తల్లిదండ్రుల గురించీ ఉండాలి కదా? వాళ్లే లేకపోతే మన అమ్మానాన్నలెక్కడ? అలా మన వంశపు లోతుల వరకూ ఆలోచించండి. ఎంత ఆసక్తి కలిగించే విషయాలు ఉంటాయో అందులో..?

ఆ తరం వారిని పలకరిస్తే ఎన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాము?

మనకి వారసత్వంగా, వంశపారంపర్యంగా ఆస్తులే కాదు వచ్చినవి, వాటితో పాటు వంశమూ, వంశపు పద్ధతులూ వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తూ, ఆస్తుల్నే స్వీకరిస్తాము. సరైన పంపకాలు జరక్కపోతే కోర్టుకి కూడా వెళతాము. కానీ వంశ వారసులే సంస్కృతీ, సంప్రదాయాలను విస్మరిస్తే వెళ్లే కోర్టుల్ని కూడా మనం తయారుచేసుకోవాలేమో.. అందుకే… మీ మీ వంశాల గురించి తప్పక తెలుసుకోండి. ఇంకా కుదిరితే అధ్యయనం చేయండి. అది పిల్లలకు చెప్పండి.

నాకు తెలిసీ చాలా మంది… మన పెద్ద వాళ్లు మనకి ఎవరినైనా పరిచయం చేస్తూ వాళ్లు మనకు ఏమవుతారో చెబుతుంటే ఆసక్తిగా వినటం మానేసి .. కొంతవరకూ విని ‘‘అమ్మబాబోయ్‌.. బుర్ర హీటెక్కి పోతుంది… నాకు చెప్పద్దు’’ అంటాం. అదే ఏ సినిమా నటి గురించైనా అయితే అలా అంటామా? ఇంకా ఇంకా తెలుసుకోవాలని తరచి తరచి అడుగుతాం. వడ్డీ లెక్కలైతే అలా అంటామా? ఎవరైనా మన పొలం గట్టు కాస్తంత జరిపినట్టు అనుమానం వస్తే ఎన్నో డబ్బులు ఖర్చు చేసి సర్వేయర్‌ ని పిలిచి కొలతలు వేయించి అర్థమయ్యేట్లు చెప్పించుకుంటామే. అలాంటిది కాదా బంధుత్వం? చెప్పండి.

ఏకాగ్రత లేకపోవటమూ, బంధుత్వాల గురించి చులకన భావమే దీనికి కారణం.

మన తాతయ్యలూ, నాయనమ్మలూ కష్టపడటం నేర్పారు మన తల్లిదండ్రు లకు. మీరు తింటారనే పొలంలో పండ్ల చెట్లు నాటారు పెద్దవాళ్లు. చెట్లు వాళ్లేస్తే పండ్లు మనం తింటున్నాం. పొలాన్నించి మామిడి కాయలొస్తే ఈ చెట్టు ఎవరు నాటారు నాన్నా అని ఎప్పుడైనా అడిగారా? అడగరు. కష్టం గురించి మీకు వద్దు. పళ్లు మాత్రమే కావాలి.

తప్పు. అది తప్పు. బంధువులు మనకి దేవుడు ఇచ్చిన వరం. మనం అవునన్నా.. కాదన్నా వాళ్లు మనతోనే. అలాంటి బంధుత్వాలను మనం వదులుకోవచ్చా..?

రండి. మన బంధువుల కార్యక్రమాలకు హాజరవ్వండి. పేరు పేరునా మనసారా పలకరించు కోండి. మన పెద్ద వాళ్లను ఆ సందర్భంగా తలచుకోండి. అందరూ ఆసక్తిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా నేను ఎవరో.

‘‘మీరంతా ఏ నున్న వారి అన్నదమ్ములకు మనవలో, ముని మనవలో… ఆ అన్నదమ్ముల ఏకైక గారాల చెల్లికి మనవరాలిని నేను. కాబట్టి మనమంతా అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ల మనవలం.

నేను ఇంతకు ముందు జరిగిన వాటికీ హాజరయ్యాను. ఎవరూ కనీసం నన్ను అడగలేదు మీరు ఎవరని? ఈ పెళ్లికి, నిశ్చితార్ధానికి ఎందుకు ముందుగా వచ్చానో తెలుసా? మా నాయనమ్మ, తాతయ్య, మా నాన్న, అమ్మ, పెదనాన్నలు, పెద్దమ్మలు.. అత్తలూ, మా నాయనమ్మ అన్నదమ్ముల మనవలూ పిల్లలూ… అందర్నీ కళ్లారా చూసుకోవ టానికి.. కలుసుకోవటానికి.. వాళ్ల జ్ఞాపకాల జాడల్ని వెతుక్కోవటానికి.

‘‘మీ నాన్న.. పొలంలో నాట్లు వేసాడంటే ఎన్ని ఎడ్ల బళ్లున్నా ధాన్యం బస్తాలు ఇళ్లకు చేర్చటానికి సరిపోయేవి కావు’’

‘‘మీ అమ్మ వాకిట్టో కళ్లాపి చల్లి ముగ్గేసిందంటే నిలబడిపోవాల్సిందే ఎవరైనా’’

ఇలాంటి జ్ఞాపకాలే కదా మనకి కొండంత బలం. ఆలోచించండి. ఎవరితో ఏమేం అనుభవాలో..

ఒక్కసారి అందరం ఇలా కలిస్తే.. జ్ఞాపకాలను పంచుకుంటే ఎంత మానసిక ఆనందం, బలం వస్తుందో. మీలోకి మీరు తొంగి చూసుకోండి.

అందర్లో.. ఏదో కొత్త అనుభూతి.

అక్కడొక కొత్త వంశ వృక్షం వేళ్లూనుతోంది.

వచ్చేవారం కథ..

ధ్యేయం – సి. యమున

About Author

By editor

Twitter
Instagram