‘శ్రీరామజన్మభూమి ఉద్యమం తొలినాళ్ల నుంచి అయోధ్య రామమందిర నిర్మాణం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సహా 1991 నుంచి 2026 వరకు సాక్షాత్తూ శ్రీరామచంద్రమూర్తి నాతో తన పని చేయించుకున్నాడు. ఆయన ఇక చాలు అని చెప్పిన తర్వాతనే శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నాను. విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మచ్చలేనివాడు అని నన్ను పేర్కొనడం కాదు. మొదటి నుంచి నేను మచ్చలేనివాడినే’ అని విశ్వహిందూపరిషత్ ఉపాధ్యక్షులు చంపత్‌రాయ్ స్పష్టం చేశారు. రామమందిరం వంటి అతిపెద్ద ప్రాంగణంలో చోరీ జరగడం పెద్ద విషయం కాదని అన్నారు. అయితే దానిపై రాజకీయపక్షాలు, మీడియా దుష్ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో భక్తుల మనోభావాలు దెబ్బతినలేదని తెలిపారు. ఇప్పటికీ సగటున రోజుకు 80 వేల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకుంటున్నారని చెప్పారు. శ్రీరాముడు అందరివాడని, అందుకే శ్రీరామజన్మభూమి ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సహా యావత్ దేశం మద్దతు ఇచ్చిందని తెలిపారు. తద్వారా భవ్యమైన రామమందిరం అనేక శతాబ్దాల నాటి హిందువుల కల సాకారమైందని చెప్పారు. సమాజం కోసం, దేశం కోసం సర్వం త్యాగం చేసిన అశోక్సింఘాల్జీ జీవితం నవతరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. విశ్వహిందూపరిషత్ పూర్వ అంతర్జాతీయ అధ్యక్షులు అశోక్ సింఘాల్ శతజయంత్యుత్సవంలో పాల్గొనే నిమిత్తం అక్టోబర్ 3న భాగ్యనగరానికి చంపత్ రాయ్ వచ్చారు. ఈ సందర్భంగా వారితో జరిపిన ముఖాముఖిని విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని జాగృతి పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.
అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇటీవల దాఖలు చేసిన అభియోగపత్రంలో ప్రాసిక్యూషన్ సాక్షిగా మిమ్మల్ని చేర్చింది. మీకు క్లీన్చిట్(నిష్కళంకం) ఇచ్చింది. ఈ పరిమాణాన్ని మీరు ఎలా చూస్తారు?
నేను మొదట్నుంచి నిష్కళంకుడిగానే ఉన్నాను. ఉంటాను కూడా. దేశంలో దినపత్రికలు ఏమి రాశాయి.. టీవీ చానెళ్లు ఏమి పేర్కొన్నాయనేదాని మీద నేనెప్పుడూ దృష్టి పెట్టలేదు. చానెళ్లు కేవలం అసత్యాలను ప్రచారం చేశాయి. దేశాన్ని తప్పుదారి పట్టించాయి. పాత్రికేయ విలువలను భ్రష్టు పట్టించాయి. అయినప్పటికీ నేను మానసికంగా దృఢంగా ఉన్నాను. మౌనాన్ని ఆశ్రయించాను.
భద్రతా లోపాలు చోరీకి దారి తీశాయంటారా?
లేదు.. లేదు.. భద్రతకు సంబంధించి ఎలాంటి లోపాలకు తావు లేదు. సువిశాలమైన, అతిపెద్దదైన దేవాలయ ప్రాంగణంలో దొంగతనం జరగడం చెప్పుకోదగినంత విషయం కాదు. అది సర్వ సాధారణం. హుండీ నుంచి చోరీ జరగలేదు. హుండీకి భక్తులు సమర్పించే నగదు, తదితరాల లెక్కింపు గదిలో చోరీ జరిగింది. హుండీకి భక్తులు భారీగా సమర్పించుకుంటూ ఉంటారు. అది ఎంత భారీ పరిణామం అంటే హుండీకి ఒకరోజు జరిగిన సమర్పణల లెక్కింపు ఎనిమిది రోజులకు కూడా పూర్తికాని సందర్భాలు ఉన్నాయి. లెక్కింపు రెండు షిప్టులలో జరుగుతుంటుంది. 44 మంది యువకులు హుండీ వసూళ్లను లెక్కిస్తుంటారు. వారంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. 2024 నుంచి ఈ లెక్కింపు జరుగుతోంది. నిందితులను స్వయంగా మేము పట్టుకున్నాం. జూన్ 4, 2026న నేను ఢిల్లీ నుంచి అయోధ్యకు రైలులో వెళుతున్నాను. అలా ప్రయాణిస్తున్న నాకు అయోధ్య నుంచి వాట్సప్ సందేశం వచ్చింది. ‘‘నేడు లెక్కింపు గది మరుగు దొడ్డిలో నోట్ల కట్ట దొరికింది’’ అని అందులో ఉంది. రూ.2.25 లక్షల నోట్ల కట్ట అది. ఆ సందేశంలో ఇంతే ఉంది. మరే ఇతర వివరాలు లేవు. జూన్ 5వ తేదీ తెల్లవారుజాము సమయానికి నేను అయోధ్య చేరుకున్నాను. అదే రోజున సీసీటీవీ కెమెరాల ద్వారా నమోదైన దృశ్యాలను కర్ణాటక నుంచి వచ్చిన ప్రచారక్ గోపాల్‌రావు పరిశీలించారు. వాటిలో దొంగతనం చేస్తున్న ముగ్గురు యువకులు కనిపిం చారు. అదే విషయాన్ని నాకు చెప్పారు. గోపాల్ రావు, డాక్టర్ అనిల్ మిశ్రాలు చోరీ సంగతి నాకు తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదు. అదే యువకులు హుండీ వసూళ్ల లెక్కింపు చేయడానికి యధావిధిగా వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండవ షిఫ్టులో పనిచేయడానికి వచ్చారు. వారిని లెక్కించడానికి అనుమతించాం. ఆ రోజుకు లెక్కింపు ముగించుకొని ఇళ్లకు వెళుతున్న ఆ ముగ్గురిని ఆపాం. అలా దొంగలను మేం స్వయంగా అదుపులోకి తీసుకున్నాం. చోరీకి అడ్డుకట్ట వేశాం. మరుగుదొడ్డిని గోపాల్ స్వయంగా తనిఖీ చేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా వారిని గోపాల్ గుర్తు పట్టారు. ఆయనకు మిశ్రా సహకరించారు. జూన్ 5వ తేదీన నేను రంగంలోకి వచ్చాను. మర్నాడు రామజన్మభూమి మందిర ప్రాంగణం పోలీసుల ఆధ్వర్యంలో ఆ ముగ్గురిని విచారించాం. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో మందిరం పోలీసులు పనిచేస్తుంటారు. ఎస్పీ పర్యవేక్షణలో నిందితులను ప్రశ్నించాం. ఆ సందర్భంగా మరో ముగ్గురు నిందితుల గుట్టు బైటపడింది. వారిని కూడా అదుపులోకి తీసుకున్నాం. మొత్తానికి ఆరుగురు వెలుగులోకి వచ్చారు. వారి నివాసాల నుంచి రూ.81 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. ఆ నగదును నిందితులే స్వయంగా అప్పగించారు. నేను లేదా గోపాల్ లేదా అనిల్ నిందితుల ఇళ్లకు వెళ్లలేదు. మందిర పోలీసులు వారి ఇళ్లకు వెళ్లారు. ఈ విషయంలో సివిల్ పోలీసులు, క్రైమ్‌బ్రాంచ్ అధికారులు బైట నుంచి అనధికారికంగా సహకరిం చారు. జూన్ 6, 7 తేదీల్లో నేను, అనిల్ మిశ్రా ఒకే గదిలో పన్నెండేసి గంటలు ఉండిపోయాం. ‘‘నగదు తీసుకొని రండి లేకపోతే మీ మీద దొంగలు అనే ముద్ర పడిపోతుంది. జీవితం నాశనమైపోతుంది’’ అని నిందితులకు అదేపనిగా నచ్చచెప్పాం. వారి తల్లిదండ్రులను పిలిపించాం. ఎట్టకేలకు చోరీ నగదును స్వాధీనం చేసుకోగలిగాం. ఇది పూర్తిగా ఒక అంతర్గత వ్యవహారం. ఏదైనా సంస్థలో దొంగతనం జరిగినప్పుడు నిర్వాహకులు మొదట పోలీసులకు ఫిర్యాదు చేయరు. ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్) నమోదు చేయరు. సంస్థ పరువు, ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇస్తారు. చోరీ చేసిన వారు యువకులు. వాళ్ల జీవితాలు ఏమైపోతాయో అని మేం ఆలోచించాం. కానీ సమాజం అలా ఆలోచించ లేదు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు చోరీ సంగతిని ఎవరో చేరవేశారు. జూన్ 7న మందిరం భద్రతను చూసుకునే ఎస్పీని నేను కలిశాను. జరిగినదంతా వివరించాను. కానీ అప్పటికే ఆ విషయం ప్రజలకు తెలిసిపోయింది. టీవీ చానెళ్లతో ప్రజలు ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడటం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తున్న మేం మౌనంగా ఉండిపోయాం. చోరీకి నైతిక బాధ్యత వహించాలని విశ్వహిందూపరిషత్(వీహెచ్‌పీ) సర్వోన్నత నాయకుల బృందం నాకు సూచించింది. చోరీతో మాకు ఎలాంటి సంబంధం లేకపోయిన ప్పటికీ సూచనను శిరసావహించాం. ఇంత పెద్ద సముదాయంలో జరిగే ప్రతి సంఘటనకు నైతిక బాధ్యత వహించాలా? హుండీ వసూలు లెక్కింపు గది బాధ్యత ఎవరిది? అయినప్పటికీ మీరు నైతిక బాధ్యత వహించాలని వీహెచ్‌పీ బృందం సూచించింది. అలాగే అని చెప్పి నైతిక బాధ్యతను స్వీకరించాను. పదవికి రాజీనామా చేయాలని కోరింది. వెంటనే రాజీనామా చేశాను. రాజీనామా చేస్తూ అతిపెద్ద లేఖ రాశాను. కానీ ఆ లేఖను గోప్యంగా ఉంచారు. మీతో సహా దేశంలో ఏ ఒక్కరికి ఆ లేఖలో వివరాలు తెలియవు. అందులో ఒక్క వాక్యం మాత్రమే అందరికీ తెలుసు. ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరీజీ దానిని బైటకు తెచ్చారు. కానీ ట్రస్టు సమావేశంలో చంపత్ రాయ్ రాజీనామా చేశారని మాత్రమే ఆయన చెప్పారు. నా రాజీనామా లేఖ చాలా పెద్దది.
చోరీ వెనక ఏదైనా రాజకీయ ప్రోద్బలం ఉందా?
లేదు.. లేదు.. అలాంటిదేమీలేదు. అవన్నీ ఊహాజనితాలు. వాటిని నేను నమ్మను.
కానీ అఖిలేష్ యాదవ్‌కు చోరీ సమాచారాన్ని ఎవరో ఇచ్చారని మీరు ఇప్పుడే చెప్పారు..!
ఔను.. ఔను. అదే చోరీ సమాచారం బైటకు రావడానికి కారణమైంది. లేకపోతే అఖిలేష్ యాదవ్‌కు ఆ సంగతి ఎలా తెలుస్తుంది?
లోపలివారే ఈ పని చేశారా?
అది నాకు తెలియదు. నేనెవరినీ వేలెత్తి చూపను. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు.
చోరీ ఎంత కాలంగా జరుగుతున్నది?
అది నేను చెప్పలేను. ఎందుకంటే పొద్దస్తమానం సీసీటీవీ కెమెరాలను అంటిపెట్టుకొని నేను ఉండను. వాటి రికార్డులను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పరిశీలించింది. సిట్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేసింది నేనే. సిట్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి జూలై 12న లేఖ రాశాను. అలా చేయాలనే సూచన నాకు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది. జరిగినదంతా పూసగుచ్చినట్టుగా సిట్‌కు వివరించాను. ఆ పని మూడుసార్లకు పైగా చేశాను. అందుకనే సిట్ ప్రాథమిక నివేదికలో ఎక్కడా కూడా నా పేరు లేదు. ఆ తర్వాత సిట్ ద్వితీయ, తుది నివేదికలు నాదాకా రాలేదు. ఎందుకంటే నాకు సంబంధించిన ఎలాంటి ప్రమేయం(చోరీలో) లేదు కాబట్టి. మందిరంలో చాలా జరుగుతుంటాయి. వాటిన్నింటినీ నేనెలా చూడగలను? మీరు ఆ పని చేయండి.. మీరు ఈ పని చేయండి అంటూ పని విభజన ఉంటుంది. కానీ నైతిక బాధ్యత నాదిగా మారింది. రాజీనామా చేయాలన్నారు. చేశాను. ఆ పనిచేశాక ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. చోరీ ఎప్పటి నుంచి జరుగుతున్నది చెప్పలేను. భద్రతా లోపాలకు అవకాశం లేదు. కానీ దొంగలను పట్టుకున్నది చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు అనే ముగ్గురు కార్యకర్తలు మాత్రమే.
ప్రాసిక్యూషన్ సాక్షిగా మీ పాత్ర ఎలా ఉంటుంది?
తెలియదు. కోర్టుకు వెళితే కానీ తెలియదు. విషయం కోర్టు వరకు వెళ్లడాన్ని స్వాగతిస్తున్నాను. ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), స్థానిక పోలీసులు నన్ను ఐదు నుంచి ఆరు పర్యాయాలు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి సమాధానాలు ఇచ్చాను. పారిపోవాల్సినంత అవసరం నాకు ఏముంది? మేం దీనిని ఎదుర్కొంటాం.
కోర్టు ఎదుట మీ రాజీనామా లేఖలో వివరాలు వెల్లడిస్తారా?
కోర్టులో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను. అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. తప్పుడు సాక్ష్యం ఇవ్వను. నిజం చెప్పడం నా అలవాటు. అవసరమైతే పేర్లు బైటపెడతాను. ఇదంతా కోర్టులో నన్ను అడిగే ప్రశ్నల మీద ఆధారపడి ఉంటుంది.
శ్రీరామజన్మభూమి ఉద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీకి చెదిన ఒక నేత అని విన్నాము. ఆ వివరాలు చెప్తారా?
ఔను. నిజమే. ఆయన ఎవరో కాదు ఉత్తరప్రదేశ్ శాసనసభకు మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన దావూదయాళ్ ఖన్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. తొలిసారిగా రామజన్మభూమి అంశాన్ని ఆర్ఎస్ఎస్ సమావేశంలో ఆయన లేవనెత్తారు. మార్చి 6, 1983న ముజఫర్‌నగర్‌లో హిందూ సమ్మేళనాన్ని ఆర్ఎస్ఎస్ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి రజ్జూభయ్యా వచ్చారు. మాజీ ప్రధాని గుల్జారీలాల్ నందా కూడా ఉన్నారు. అదే సమ్మేళనానికి ఖన్నా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మేళనాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ‘‘హిందూ బంధువులారా.. దేశానికి స్వరాజ్యం సిద్ధించి చాలా కాలమైపోయింది. ఇప్పుడు అయోధ్య, కాశీ, మథురలకు విముక్తి కల్పించండి’’ అని పిలుపు నిచ్చారు. అంతే జరిగింది. ఆ వెంటనే ‘‘వెళ్లండి.. దావూదయాళ్ ఖన్నాను కలవండి’’ అని అశోక్ సింఘాల్జీకి రజ్జూభయ్యా సూచించారు. ఖన్నాను అశోక్‌జీ కలిశారు. ‘‘ఇందిరాగాంధీ మీ నాయకు రాలు. ఆమె మిమ్మల్ని పిలిచి హెచ్చరించిన పక్షంలో మీరు పదవిని కోల్పోవాల్సి ఉంటుంది’’ అని ఖన్నాతో ఆయన అన్నారు. అలాంటి పరిస్థితి రానివ్వనని వెనువెంటనే తన పదవికి ఖన్నా రాజీనామా చేశారు. ఆ ప్రకారంగా శ్రీరామజన్మభూమి ఉద్యమానికి బీం పడింది.
అప్పటి కేంద్ర హోం మంత్రి, కాంగ్రెస్ నేత బూటాసింగ్ కూడా ఉద్యమానికి అండగా నిలిచారా?
ఔను. ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో హోం మంత్రిగా బూటాసింగ్ ఉన్నారు. ‘‘రామజన్మభూమికి సంబంధించి కోర్టులో హిందువులు దాఖలు చేసిన అన్ని పిటిషన్లు పటిష్టంగా లేవు. వాటిని కోర్టు తోసిపుచ్చే అవకాశం ఉంది.మీరు పాట్నా వెళ్లండి. ఇందిరాగాంధీకి రాజ్యాంగ సలహాదారుగా వ్యవహరించిన లాల్ నారాయణ్ సిన్హాను కలవండి’’ అని సింఘాల్జీకి బూటాసింగ్ సూచించారు. ఆయన సూచన మేరకు అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి దేవకీనందన్ అగర్వాల్, క్షేత్ర సంఘచాలక్ వీరేంద్రసింగ్ కుమార్ చౌదరి, ఓ న్యాయవాదితో కూడిన బృందం పాట్నాలో సిన్హాను కలుసుకుంది. వారికి న్యాయపక్రియను ఆయన వివరించారు. రామ్‌లల్లా (బాలరాముడు) తరఫున ఒక కొత్త సివిల్ వ్యాజ్యాన్ని ఆయన స్వయంగా తయారు చేశారు. ఫిర్యాదిదారుగా రామ్‌లల్లాను పేర్కొన్నారు. 1987లో న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మిగిలిన అన్ని వ్యాజ్యాలను న్యాయ స్థానం తోసిపుచ్చింది. న్యాయ పోరాటంలో వ్యాజ్యం విజయం సాధించింది.
శ్రీరామజన్మభూమి ఉద్యమంలోకి మీరు ఎలా వచ్చారు?
1986లో నేను విశ్వహిందూపరిషత్‌లో ఉన్నాను. ఆ సమయంలో ఉద్యమం ముందుకు సాగుతోంది. నాకు కేటాయించిన ప్రాంతంలో ఉద్యమం విజయవంతమయ్యే దిశగా పనిచేస్తుండే వాడిని. 1991లో అశోక్ సింఘాల్‌జీ నన్ను పిలి చారు. ‘‘మీరు ఆగ్రాను వీడి అయోధ్యకు చేరుకోండి.. అక్కడి పనులు చూసుకోండి’’ అని సూచించారు.
అప్పటి ఉద్యమ వాతావరణం ఎలా ఉండేది?
చాలా బాగుండేది. సమాజంలో ఉత్సాహం ఉండేది. ఉద్యమానికి సంబంధించిన ఏదైనా పిలుపునకు ప్రజలు వెంటనే స్పందించేవారు. ఉద్యమానికి మద్దతుగా ఆగ్రాలో ఏడాది కాలంలో 150 రోజులు బంద్‌నకు పిలుపు ఇచ్చాం. బంద్‌కు మద్దతుగా దుకాణాలు, వ్యాపారాలు, ఇతర అన్ని కార్యకలాపాలు మూతపడ్డాయి. 1986, 1987, 1988 సంవత్సరాలలో ఉద్యమానికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి ఒక వాతావరణం నెలకొంది.
ఉద్యమాన్ని ప్రభుత్వం అడ్డుకున్నదా?
అడ్డుకోలేదు.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల్లోపల మద్దతు ఇచ్చింది. (వివాదాస్పద కట్టడం) తాళాలు తీయించింది. నారాయణ్‌దత్ తివారి శిలాన్యాస్ చేయించారు. వీర్బహదూర్సింగ్ తాళాలు తీయించారు. బూటాసింగ్, అరుణ్ నెహ్రూ ఇలా కాంగ్రెస్ పార్టీ నేతలంతా దొడ్డిదారిన మద్దతు ఇచ్చారు. ఉద్యమాన్ని అత్యంత శాంతియుతంగా సమాం ముందుకు తీసుకువెళుతుండేది. అంతే శాంతియుతంగా అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తుండేది.
అప్పట్లో సోషల్ మీడియా లేదు. అయినప్పటికీ ఉద్యమం దేశమంతటా ఎలా విస్తరించింది?
సోషల్ మీడియా సమాజహితమైనదా? సమాజానికి వ్యతిరేకమైనదా? అది అసలు సమా జానికి చెందినదా? అనేది ఎవ్వరికీ అంతుపట్టనిది. అసలు సోషల్ మీడియాకు చెందినవారు, యూట్యూబర్లు బాధ్యతాయుతమైన పౌరులేనా? అనే ప్రశ్నకు కాదు అని నేను బదులిస్తాను. అయితే వారిలో కొందరు బాధ్యతతో వ్యవహరిస్తూ ఉండవచ్చు. ఎక్కువమందికి ఏ మాత్రం బాధ్యత ఉండదు. కానీ అప్పట్లో ప్రజలు వారి అభిప్రాయాన్ని రాతపూర్వకంగా వెల్లడించేవారు. బాధ్యతాయుతంగా రచించేవారు. ప్రసంగాలు చేస్తుండేవారు. ప్రసంగాలో తప్పులు దొర్లేవికావు. వాటి ఆధారంగా మీరు చార్జ్‌షీట్(అభియోగపత్రం) నమోదు చేయలేరు. అలా చేస్తే కోర్టు కేసు అవుతుంది. ప్రసంగాల ద్వారా మేము సమాజాన్ని చైత్యనపరిచేవారం. ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు. ఎవరిని విమర్శించలేదు. వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది నేటి కాలానికి నైతికతగా మారడం దురదృష్టకరం. అదే ఇప్పుడు సభ్యతగా మారింది.
అప్పటి ఆంధప్రదేశ్‌లో మారుమూల పల్లెల నుంచి కూడా శ్రీరామ్ అని రాసి ఉన్న ఇటుకలను అయోధ్యకు పంపించేంతగా ఉద్యమం ఎలా విస్తరించింది?
ప్రజల మధ్య సంబంధాలు, సాధువులు, కార్యకర్తల ద్వారా మాత్రమే అది సాధ్యమైంది. వేదాంతం, రాఘవులు, కోటేశ్వరశర్మ, సత్యం, కర్ణాటకకు చెందిన కేశవ్ హెగ్డే, బెంగళూరుకు చెందిన శివరుద్ర స్వామి, తదితరులు వారి వారి క్షేత్రాలో పనిచేశారు. సోషల్ మీడియా లేదు. ప్రసంగాలే ప్రధానం. నేను కేవం ఐదుగురిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భాలు కూడా అప్పట్లో ఉండేవి. అశోక్సింఘాల్జీ, దత్తోపంత్‌ఠేంగ్డీజీ లాంటి వారంతా పూనుకున్నారు. అందరి హృదయాల్లో శ్రీరాముడు కొలువై ఉన్నాడు. అందుకనే ఉద్యమం దేశంలో అందరిని చేరుకుంది.
ఉద్యమానికి పర్యాయపదంగా విశ్వహిందూ పరిషత్ ఎలా మారింది?
ఉద్యమానికి ముందువరుసలో విశ్వహిందూ పరిషత్ ఉండేది. ఆత్మగా ఆర్ఎస్ఎస్ ఉండేది. ఆత్మ కంటికి కనిపించదు. ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ ఆత్మ అయితే మేం కేవం ముఖం, వాక్కు అని అశోక్ సింఘాల్‌జీ అంటుండేవారు.
ప్రస్తుతానికి వస్తే రామమందిరంలో జరిగిన దానితో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భావించవచ్చా?
అలాంటిదేమీ లేదు. అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. సగటున రోజుకు 80 వేలమంది భక్తులు బాలరాముని దర్శించు కుంటున్నారు. టీవీ చానెళ్ల దుష్ప్రచారం సమాంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది.
ఈ సందర్భంగా ట్రస్టుకు ఏమైనా సూచన చేయాలనుకుంటున్నారా?
లేదు. ఎలాంటి సూచన చేయాలనుకోవడంలేదు.
ట్రస్టులో ఇకపై మీ పాత్ర ఎలా ఉండనుంది?
ఎలాంటి పాత్రను నేను కోరుకోవడంలేదు. నాకు అప్పగించిన పని పూర్తి చేశాను. 1991 నుంచి 2026 వరకు నా జీవితంలో రామజన్మభూమి మాత్రమే ఉంది. ఇక చేయాల్సింది ఏమీ మిగల్లేదు.
కానీ మొదటి నుంచి ఉన్న మీరు ఇప్పుడు నా పాత్ర ముగిసిందని అని అంటున్నారు..
మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కొన్నింటిని వదులుకోవాల్సి ఉంటుంది. భగవంతుడు నాతో ఎంత పని చేయించుకోవాలని అనుకున్నాడో అంతా చేయించుకున్నాడు. ఇక చాలు విశ్రాంతి తీసుకో అని భగవంతుడు అన్నాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. మీరు అడిగారు కాబట్టి నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను తప్ప నా అంతట నేనుగా మీతో మాట్లాడటంలేదు. అలాగని నేను వెనుకపడిపోలేదు.
తాజాగా ట్రస్టుకు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)ని నియమించారు. దానిపై మీ వ్యాఖ్య
ఏమీ లేదు. సీఈఓను నియమించాలని ఒక బృందం నిర్ణయించింది. దాంతో నాకేం సంబంధం? అదే బృందం అర్హుల నుంచి దరాఖాస్తులను ఆహ్వానించింది. 5,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. సీఈఓను ఎంపిక చేశారు. ఇందులో నా పాత్ర ఏముంది? ప్రస్తుతం నేను ఎలాంటి పదవిలో లేను. కనుక ఎలాంటి సలహాలు ఇవ్వను. ఒకవేళ అడిగితే మార్గదర్శనం చేస్తాను తప్ప నా అంతట నేనుగా సలహాలు ఇవ్వను.
అశోక్ సింఘాల్జీతో మీ అనుబంధం, వారి శతజయంతి వేడుకల నిర్వహణను వివరిస్తారా?
వారితో నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. ఎంతని చెప్పగలను? ప్రస్తుతం అశోక్‌జీ శతజయంతి వేడుకలో భాగంగా దేశవ్యాప్తంగా 60 నుంచి 70 ప్రాంతాలలో సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నాం. ప్రతి సదస్సుకు లేదా సమావేశానికి కనీసం వెయ్యిమంది హాజరవుతారని అంచనా. నేను కూడా వాటిలో పాల్గొంటున్నాను. అశోక్‌జీ జీవన ప్రస్థానాన్ని ప్రజలకు వివరిస్తున్నాను.
నవతరానికి అశోక్‌జీ జీవితం ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది?
1950లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్‌లో అశోక్‌జీ పట్టభద్రులయ్యారు. ఆయన యువకుడిగా దేశాభివృద్ధిని ఆకాంక్షించారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం రహదారులపై ఆందోళనలు చేయలేదు. ఉద్యోగం చేయాలనే తలంపు లేదు. ఆర్ఎస్ఎస్ ద్వారా హిందూ సమాజాన్ని ఏకం చేయాలనే మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు. అశోక్‌జీ తరహాలో వేలాదిగా యువకులు వ్యక్తిగత జీవితాన్ని, గృహస్తు జీవితాన్ని త్యాగం చేసి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌లుగా సమాజ సేవకు అంకితమయ్యారు. నేను కూడా నా 29వ యేట దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు, దానిని వ్యతిరేకించినందుకుగాను 19 నెలలు కారాగారంలో ఉన్నాను. అప్పట్లో కనీసం 80 వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కారాగారవాసాన్ని అనుభ వించారు. 35వ యేట ఉద్యోగాన్ని వదులుకున్నాను. శ్రీరామజన్మభూమి ఉద్యమంలో భాగమయ్యాను. అప్పట్లో మేము కూడా యువకులమే. మీరు(నేటి నవతరాన్ని ఉద్దేశించి) ఎలాంటి మార్గాన్ని ఎంచు కుంటున్నారు? త్యాగంతో కూడుకున్న మార్గాన్ని ఎంచుకోండి. జీవితాన్ని అంకితం చేసుకునే మార్గాన్ని ఎంచుకోడి. ఇప్పుడంటే ఆందోళనలు చేపట్టే అధికారం ఉంది. మేం దేశం కోసం ఆందోళనలు చేశాం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆందోళనలకు దిగలేదు. దేశం కోసం పాటుపడాలి. ప్రతికూల వాతావరణంలోనూ దేశం కోసం, సమాజం కోసం పనిచేయాలి.
ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్‌జీ అయోధ్య రామమందిరం హిందువులకు ఆరాధనా మందిరం మాత్రమే కాదని, ప్రపంచ శాంతికి ఒక విశ్వవాపిత దిక్సూచి అని వర్ణించారు. ఈ వ్యాఖ్యను మీరు ఎలా చూస్తారు?
శ్రీరాముడు అందరి హృదయాలో కొలువై ఉంటాడు. శ్రీరాముడు భారతదేశానికి ఆత్మగా ఉన్నాడు. భారత్‌లో నివసించే వారెవరైనా సరే వారందరి హృదయాలలోనూ సీతాపతి ఉంటాడు. ఈ మాటను వారు అవునన్నా, కాదన్నా వారందరిలోనూ దాశరథి ఉంటాడు. రాఘవుడు అందరివాడు. రామచంద్రుడికి అందరూ కావాలి.
