ఆంధప్రదేశ్‌లో టీనేజీ గర్భధారణలు, బాల్య వివాహాల సమస్య ఆందోళనకర స్థాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దీని సగటు 8.8 శాతంగా ఉండగా, పల్నాడు, కర్నూలు, చిత్తూరు, బాపట్ల జిల్లాలు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో నెలకు సగటున 400 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పేదరికం, అవగాహన లోపం, అభద్రతా భావం వల్ల జరుగుతున్న బాల్య వివాహాలే ఈ దుస్థితికి ప్రధాన కారణాలు. శరీరం ఎదగని వయసులో గర్భం దాల్చడం వల్ల తల్లీబిడ్డల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లడమే కాకుండా,ఆ బాలికలు చదువుకు, ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. చట్టాలు, నిఘా కమిటీలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు కావాలని, బాలికల విద్య, ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారానే ఈ సామాజిక ముప్పును అరికట్టగలమని ఈ కథనం వివరిస్తోంది.
పదమూడు-పందొమ్మిది ఏళ్ల మధ్య వయసులో గర్భం దాల్చడాన్ని టీనేజీ గర్భధారణగా పరిగణిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దీని సగటు 8.80 శాతానికి చేరింది.జిల్లాల వారీగాపల్నాడు (14.94%), కర్నూలు (13.50%), చిత్తూరు జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి.
పల్నాడు జిల్లాలోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ఇక్కడ టీనేజీ గర్భిణుల శాతం 2026 మార్చినాటికి 14.94% ఉంది. అయితే ఆగస్టు నెల ఐసీడీఎస్ లెక్కల ప్రకారం దీనిని 7,71 శాతానికి తగ్గినట్లు చూపిస్తున్నారు. జిల్లాలోని తొమ్మిది ప్రాజెక్టుల పరిధిలో 8,900 మంది గర్భిణులు నమోదు కాగా, వారిలో 686 మంది బాలికలే (7.71 శాతం). మాచర్ల ప్రాజెక్టులో 1,393 మంది గర్భిణుల్లో 116 మంది, ఈపూరులో 532 మందిలో 79 మంది, గురజాలలో 643 మందిలో 71 మంది, పిడుగురాళ్లలో 846 మందిలో 70 మంది టీనేజీ బాలికలు ఉన్నారు. ఈపూరు ప్రాజెక్టులో దాదాపు ప్రతి ఏడుగురు గర్భిణుల్లో ఒకరు బాలిక కావడం గమనార్హం. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఈ కేసులు ఎక్కువ. చట్టవ్యతిరేకం కావడంతో కుటుంబాలు విషయాన్ని బయటకు రానీయడం లేదని, అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువేనని క్షేత్రస్థాయి సమాచారం. ఐసీడీఎస్ అధికారులు పంచాయతీ స్థాయి కమిటీలతో ప్రతి 15 రోజులకోసారి సమావేశాలు నిర్వహిస్తూ, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులను చైతన్యపరుస్తున్నారు.
టీనేజీ గర్భధారణ విషయంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర సగటు శాతం 8.8 ఉండగా జిల్లా సగటు 13.60 శాతం ఉండటం గమనార్హం. నెలనెలా కొత్తగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏటా 45 వేల నుంచి 48 వేల ప్రసవాలు అవుతున్నాయి. వీటిలో 13 నుంచి 14 శాతం కౌమార బాలికలు ఉంటున్నారు. జిల్లాలో పీహెచ్సీ, యూపీహెచ్‌సీల్లో ఏప్రిల్ నుంచి ఆగస్టు 4 వరకు 16,856 మంది గర్భిణులు పేర్లు నమోదు చేసుకొన్నారు. వీరిలో 2,178 మంది 18 ఏళ్లు నిండని వారే.పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, కోడువ•రు ఆరోగ్య కేంద్రాల పరిధిలో టీనేజీ ప్రెగ్నెన్సీ వారి శాతం 15-24 శాతం వరకు ఉంటోంది. ఏటా మాతామరణాల్లో టీనేజీల శాతం 5 వరకు ఉంటోంది.
చిత్తూరు జిల్లాలో ప్రతి నెలా సగటున 400కు పైగా టీనేజీ గర్భధారణ కేసులు నమోదవుతున్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా వెల్లడించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ప్రభుత్వ పోర్టల్‌లో నమోదైన 12,045 మంది గర్భిణుల్లో 1,283 మంది టీనేజీ బాలికలేనని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. అంటే దాదాపు ప్రతి పది మంది గర్భిణుల్లో ఒకరు కౌమార బాలికే. ముందస్తు గర్భస్రావాలు, నమోదుకాని కేసులను కలిపితే అసలు సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా. జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్య మరింత తీవ్రం. కుప్పం పరిధిలోని మల్లనూరు, శాంతిపురం, రాళ్లబూదూరు, మాజినేపల్లి, కంగుంది ప్రాంతాలతో పాటు పలమనేరు, పెద్దపంజాణి, పలసముద్రం, సరిహద్దు గ్రామాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఏపీ పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వే ప్రకారం కుప్పం నియోజకవర్గంలో టీనేజీ గర్భధారణ రేటు 14.9 శాతం. కొన్నిచోట్ల తమకంటే రెట్టింపు వయసున్న పురుషులతో బాలికలకు పెళ్లిళ్లు జరిపిస్తుండటం మరింత కలవరపెడుతోంది. పరీక్షలు పూర్తవ్వగానే మెడలో తాళి పడుతున్న ఉదంతాలు ఎన్నో.
పార్వతీపురం మన్యం జిల్లాలో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు 13 వరకు 10640 మంది గర్భిణులుగా నమోదు కాగా అందులో టీనేజ్ గర్భిణులు 622 మంది ఉన్నారు. బాపట్ల జిల్లాలో టీనేజ్ గర్భిణుల శాతం 12.91 గా ఉంది. ప్రతి వందమంది గర్భిణుల్లో 12 నుంచి 13 మంది టీనేజ్ గర్భిణులు ఉంటున్నారు.
వాస్తవానికి టీనేజీ గర్భధారణ సున్నా స్థాయిలో ఉండాలి. అది సాధ్యం కాక అధికారులు 5 శాతాన్ని బెంచ్మార్కుగా నిర్దేశించారు. ఆ పరిమితి కంటే తక్కువగా (3.98%) నమోదైంది ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే. మిగతా జిల్లాల్లో 5 నుంచి 13 శాతానికి పైగా ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పరిస్థితి మరింత అదుపు తప్పింది. ఇటీవల మంత్రులు, కార్యదర్శుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై వైద్యారోగ్య శాఖతో పాటు ఇతర కీలక శాఖలను అప్రమత్తం చేశారు.
ఎందుకీ దుస్థితి?
పేదరికం, అవగాహన లోపం, పరిణామాల పట్ల భయం లేకపోవడం, పర్యవేక్షణ లోపం. ఇవే ప్రధాన కారణాలని అధికారులు అంటున్నారు. కోవిడ్ తర్వాత కుటుంబాలను చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు, ఆడపిల్లల భద్రతపై అభద్రతా భావం, వ•ఢ నమ్మకాలు బాల్య వివాహాలను మరింత పెంచాయి. ‘‘ఆడపిల్ల బాధ్యత ఎంత త్వరగా తీరితే అంత మంచిది’’ అనే ధోరణి గ్రామాల్లో ఇంకా బలంగానే ఉంది. దీనికి తోడు తెలిసీ తెలియని వయసులో క్షణికావేశం, అత్యాచార ఘటనలు కూడా చిన్న వయసు గర్భాలకు కారణమవుతున్నాయి. కిశోర బాలికలకు ఆరోగ్యం, పునరుత్పత్తి ఆరోగ్యం, పోషకాహారం, రక్తహీనతపై అవగాహన కల్పించాల్సిన రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్కేఎస్కే) వంటి పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు కావడం లేదు. మత్తు పదార్థాల వ్యాప్తి సమస్యను మరింత జటిలం చేస్తోంది.
తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు
శరీరం పూర్తిగా ఎదగని వయసులో గర్భం తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదకరం. గర్భాశయం పూర్తిస్థాయిలో సన్నద్ధం కాని దశలో గర్భం దాలిస్తే శారీరకంగానే కాదు, మానసికంగానూ సమస్యలు ఎదురవుతాయని ప్రసూతి వైద్య నిపుణులు వైద్యులు అంటున్నారు. రక్తహీనత, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తి కాన్పు కష్టమవుతుందని, సిజేరియన్లకు ఆస్కారం పెరుగుతుందని, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరిగితే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వీరు చెబుతున్నారు. తల్లికే సరైన పోషకాహారం అందక బలహీనపడితే కడుపులోని బిడ్డకు పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? ఫలితంగా తక్కువ బరువుతో, నెలలు నిండకుండానే శిశువులు జన్మిస్తున్నారు. మాతాశిశు మరణాల ముప్పూ పెరుగుతోంది.
చదువుకూ దూరం.. పథకాలకూ దూరం
బాల్య వివాహంతో బాలిక చదువు అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన కలగానే మిగిలిపోతాయి. మరో విషాదం ఏమిటంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలు పొందాలంటే గర్భిణికి 19 ఏళ్లు నిండి ఉండాలి. దీంతో అత్యంత అవసరమైన చిన్నారి తల్లులకే పోషకాహారం, ఆర్థిక సాయం, సరైన వైద్యసేవలు అందకుండా పోతున్నాయి. ఈ ప్రభావం కుటుంబానికే పరిమితం కాకుండా రాష్ట్ర ఆర్థిక, సామాజిక ప్రగతిపైనా పడుతోంది.
అడ్డుకట్టకు చర్యలు
బాల్య వివాహాల నిరోధానికి జిల్లా (కలెక్టర్), డివిజన్ (ఆర్డీఓ), ప్రాజెక్టు (సీడీపీఓ), మండలం (తహసీల్దార్), గ్రామ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటయ్యాయి. గ్రామ పర్యవేక్షణ కమిటీకి సర్పంచ్ లేదా ప్రత్యేకాధికారి అధ్యక్షత వహిస్తే, అంగన్వాడీ కార్యకర్త కన్వీనర్‌గా ఉంటారు. పంచాయతీ కార్యదర్శి, వీవోఏ, ఉపాధ్యాయుడు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్త, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులు.
ఆగిన 91 బాల్యవివాహాలు
చిత్తూరు జిల్లాలో బాల్యవివాహాలపై ఈ ఏడాది పది నెలల్లో 1098 హెల్ప్‌లైన్‌కు 95 ఫిర్యాదులు రాగా, అధికారులు జోక్యం చేసుకుని 91 వివాహాలను అడ్డుకున్నారు. మరో 4 కేసులు నమోదు చేశారు. ఒక్క కుప్పం మండలంలోనే 12 పెళ్లిళ్లు ఆగాయి. శాంతిపురం, వి.కోటల్లో 8 చొప్పున, తవణంపల్లెలో 6, పలమనేరు, పెద్దపంజాణిల్లో 5 చొప్పున, బంగారుపాళ్యం, వెదురుకుప్పంలలో 4 చొప్పున బాల్య వివాహాలను నిలువరించారు. గుడిపాల మినహా అన్ని మండలాల నుంచీ ఫిర్యాదులు రావడం సమస్య విస్తృతికి అద్దం పడుతోంది. బాల్య వివాహాలను ప్రోత్సహించినా, వాటిలో పాల్గొన్నా బెయిల్ లేని రెండేళ్ల కఠిన కారాగార శిక్ష తప్పదని జిల్లా పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. బడి మానేసే బాలికలపై ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు దృష్టి పెట్టాలని, అనుమానం వస్తే 1098కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. కౌమార దశలో గర్భం దాల్చి ఆసుపత్రికి వచ్చే కేసులను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు బాలల సంరక్షణ అధికారులు వెనుకాడటం లేదు.నెలకు 400కు పైగా టీనేజీ గర్భాలు నమోదవుతున్న జిల్లాలో పది నెలల్లో వంద లోపు ఫిర్యాదులే అందడం, వెలుగులోకి రాని పెళ్లిళ్లు ఎన్నో ఉన్నాయనడానికి స్పష్టమైన సంకేతం. ప్రతి టీనేజీ గర్భవ• బాల్య వివాహం వల్లే కాకపోయినా, ఈ అంతరం నిఘా వ్యవస్థలోని లోపాలను బయటపెడుతోంది.చట్టాలున్నా పటిష్ఠంగా అమలు కాకపోవడమే అసలు సమస్య.
గ్రామకమిటీలు కాగితాలకే పరిమితం కాకుండా క్రియాశీలకంగా పనిచేయాలి. పెళ్లి జరిగిపోయాక కాదు, పెళ్లి మాట మొదలైనప్పుడే సమాచారం అందేలా పురోహితులు, కల్యాణ మండపాలు, శుభలేఖల ముద్రణాలయాలను భాగ స్వాములను చేయాలి. బడిమానేసిన ప్రతి బాలికనూ గుర్తించి తిరిగి బడికి చేర్చాలి. పై చదువులకు హాస్టళ్లు, రవాణా, ఉపకార వేతనాలు అందుబాటులో ఉండాలి. పాఠశాల స్థాయి నుంచే వయసుకు తగిన ఆరోగ్య విద్యను అందించాలి. ఆర్కేఎస్కే వంటి కార్యక్రమాలను పునరుజ్జీవింపజేసి, కిశోర బాలికలకు రక్తహీనత పరీక్షలు, పోషకాహారం క్రమం తప్పకుండా అందేలా చూడాలి. తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు స్వయం సహాయక సంఘాలను, గ్రామ పెద్దలను భాగస్వాములను చేయాలి. అదే సమయంలో శిక్షల భయంతో కుటుంబాలు గర్భాన్ని దాచి, బాలికను వైద్యానికి దూరం చేయకుండా చూడాలి. ఇప్పటికే గర్భం దాల్చిన బాలికలకు వయసుతో సంబంధం లేకుండా పోషకాహారం, వైద్యసేవలు అందేలా నిబంధనలను పునఃసమీక్షిం చాలి. శిక్ష బాధ్యులకే గాని, బాధిత బాలికకు కాకూడదు.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్