అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ అణుపరీక్షలపై తీసుకున్న నిర్ణయంతో మూడు దశాబ్దాలుగా ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉన్న ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇటీవల రష్యా అణ్వస్త్ర క్రూయీజ్‌ ‌క్షిపణిని ప్రయోగించింది. తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ‌చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య సమావేశం జరిగింది. ఈ రెండు సంఘటనల తర్వాత ట్రంప్‌ ‌నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. 1992లో చివరిసారి అణుపరీక్షలు చేసిన అమెరికా తాజాగా భూగర్భ అణుపరీక్షలకు సిద్ధమవుతోందన్న సంగతి నవంబర్‌ 2‌న ట్రంప్‌ ‌చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైంది. సీబీఎస్‌కు 60 నిమిషాలపాటు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘పాకిస్తాన్‌, ‌చైనా, రష్యా, ఉత్తరకొరియాలు భూగర్భ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయి కనుక యు.ఎస్‌. ‌కూడా అణు పరీక్షలు నిర్వహించాల్సిందే’’ అని స్పష్టం చేశారు.

రష్యా, చైనాలు 1996 నుంచి పరీక్షలు నిర్వహించడం లేదు కదా అని ప్రశ్నించినప్పుడు, ‘‘వాళ్లు మీకు చెప్పి చేస్తారా?’’ అని ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు పాకిస్తాన్‌, ఉత్తరకొరియాలు అక్రమంగా అణుపరీక్షలు నిర్వహిస్తున్నాయి కదా? అంటూ ఎదురు ప్రశ్నించారు. యు.ఎస్‌. అణుపరీక్షలు నిర్వహించడానికి పాక్‌, ఉత్తర కొరియాలతో కూడా పోల్చుకోవడానికి వెనుకాడని ట్రంప్‌ ‌వ్యవహారశైలి హాస్యాస్పదంగా ఉన్నదనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఆ మరునాడే అంటే నవంబర్‌ 3‌న చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావోనింగ్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ అణ్వస్త్రపరీక్షలు చేయడం లేదని స్పష్టం చేసారు. ఒక బాధ్యతాయుత అణ్వస్త్ర దేశంగా మెలుగుతామని, కేవలం స్వీయరక్షణకు మాత్రమే అణ్వస్త్రాలు వినియోగిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రపంచ నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం కోసం గట్టి చర్చలు తీసుకోవా లని హితవు పలికారు. అంతేకాదు ప్రపంచ వ్యూహాత్మక సమతుల్యతను కాపాడటంలో యు.ఎస్‌. ‌కీలక పాత్ర పోషించాలని కూడా కోరారు. రష్యా కూడా తాను అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. ఇక 1990 నుంచి వరుసగా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తూ వచ్చిన దేశం ఉత్తర కొరియా మాత్రమే. అయితే 2018లో అణు పరీక్షలపై స్వీయ మారటోరియం ప్రకటించడం గమనార్హం.
మరోస్థాయికి అణ్వస్త్రపోటీ
ఇప్పటికే అణ్వస్త్రాలతో పరస్పరం బెదిరింపులకు పాల్పడుతున్న వివిధ దేశాల మధ్య నెలకొన్న అసమతు ల్యత, ట్రంప్‌ ‌దెబ్బకు మరో కొత్త స్థాయికి చేరుకుంటుం దనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. నిజానికి ఈ అణుపరీక్షల వల్ల కలిగే దుష్ప్రభావం ఎట్లా వుంటుందనేది పసిఫిక్‌ ‌సముద్రంలో1200 పగడా లదిబ్బలతో కూడిన మార్షల్‌ ఐలాండ్‌ ‌వాసులకు చాలా స్పష్టంగా తెలుసు. ఇక బయటి ప్రపంచంలో ఈ నష్టాలపై అవగాహన కలిగినవారు చాలా కొద్ది మంది మాత్రమే వుంటారు. 1947 నుంచి 1986 వరకు ఈ ద్వీపాలు అమెరికా పాలనలో కొనసాగాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత అమెరికా అణ్వాయు ధాలను విపరీతంగా పోగేసింది. ఇందుకోసం 1946 నుంచి 1958 మధ్యకాలంలో 67 అణు పరీక్షలు నిర్వహించడం చరిత్ర. ఇంధన పర్యావరణ పరిశోధనా సంస్థ (ఐఈఈఆర్‌) 2025‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ అణుపరీక్షల కారణంగా ఏర్పడిన పేలుళ్ల వల్ల హిరోషిమాపై వేసిన అణు బాంబు పేలుడుకు సమానమైన పేలుళ్లు 20 సంవత్స రాలపాటు ప్రతిరోజూ కొనసాగాయని పేర్కొంది. వీటివల్ల విడుదలైన రేడియేషన్‌ ‌వల్ల ఉత్తర ప్రాంత ద్వీపాల్లో 55% క్యాన్సర్‌ ‌కేసులు నమోద య్యాయని యు.ఎస్‌.‌కు చెందిన అటామిక్‌ ‌హెరిటేజ్‌ ‌ఫౌండేషన్‌ ‌వెల్లడించింది. ఈ ద్వీపాలనుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించిన రేడియేషన్‌తో కూడిన గాలుల వల్ల మరో లక్షమంది క్యాన్సర్‌ ‌బారిన పడ్డారు. ముఖ్యంగా శ్రీలంక, మెక్సికో వంటి సుదూర దేశాల్లో కూడా ఈ రేడియేషన్‌ ఆనవాళ్లు కనుగొన్నారు. గతంలో యు.ఎస్‌. అణుపరీక్షలు కేవలం పసిఫిక్‌ ‌ద్వీపాలకే పరిమితం కాలేదు. మోజేవ్‌ ఎడారిలోని నెవాడా క్షేత్రంలో కూడా నిర్వహించింది. 1951 నుంచి 1962 వరకు అమెరికా వంద వరకు భూమి ఉపరి తలంపైన, 828 భూగర్భ అణు పరీక్షలు నిర్వహిం చింది. వీటిల్లో చిట్టచివరిగా నిర్వహించింది 1992లో! భూగర్భ అణుపరీక్షలు సురక్షితమని భావించినప్పటికీ నెవాడాలో జరిపిన 32 పరీక్షల్లో వాతావరణంలోకి రేడియేషన్‌ ‌కలిసిపోయిందని 1993 యు.ఎన్‌. ‌నివేదిక పేర్కొంది. నిజం చెప్పాలంటే మార్షల్‌ ‌ద్వీపాల్లో అమెరికా అణుపరీక్షల వల్ల కలిగిన గాయాలు ఇప్పటికీ అక్కడి ప్రజలను సలుపుతూనే వున్నాయి. మార్షల్‌ ‌ద్వీపాల్లో ఎనెవెటాక్‌కు 200 మైళ్ల దూరంలో ఉన్న బికినీ ఎటోల్‌ ‌ద్వీపంలో యు.ఎస్‌. ‌జరిపిన అణు పరీక్ష, హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే వెయ్యిరెట్లు పెద్దది. పరీక్షా సమయంలో ఈ ద్వీపంలో 167 మంది నివసించే వారు. వీరిని అక్కడినుంచి ఖాళీ చేయించడంతో ఇప్పుడు ఆ ద్వీపంలో ఎవరూ ఉండటంలేదు. ఇక్కడ రేడియేషన్‌ ‌స్థాయి హెచ్చుగా ఉండటంతో, ఈ ద్వీపాన్ని 1978లో యు.ఎస్‌. ‌ప్రభుత్వం మూసి వేసింది. పసిఫిక్‌ ‌ప్రాంతంలో చివరి అణుపరీక్షను ఫ్రాన్స్ 1996‌లో నిర్వహించింది. దక్షిణ పసిఫిక్‌ ‌ప్రాంతంలోని పగడాల దిబ్బల ద్వీపాల్లో ఫ్రాన్స్ 193 ‌పరీక్షలు నిర్వహించింది. ఫ్రాన్స్ ‌నిర్వహించిన అణుపరీక్షల ప్రభావానికి 1.10లక్షల మంది ప్రజలు గురయ్యారని ప్రిన్స్‌టన్‌ ‌యూనివర్సిటీ, ఫ్రాన్స్‌కు చెందిన చెందిన పరిశోధనాత్మక జర్నలిజం సైట్‌, ‌నార్వేకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ వెల్లడించాయి. 1996 జనవరి 27న ఫ్రాన్స్ ‌తన చివరి అణుపరీక్షను నిర్వ హించింది. 1996 జులై నెలలో చైనా జింజియాంగ్‌ ‌ప్రావెన్స్‌లోని మారుమూలగా ఉండే లోప్‌ ‌నూర్‌ ‌క్షేత్రంలో అణుపరీక్షను నిర్వహించింది. చైనా నిర్వహించిన చివరి అణుపరీక్ష ఇదే. తాజాగా ట్రంప్‌ ‌ప్రకటించిన ప్రకారం యు.ఎస్‌. ‌మళ్లీ మార్షల్‌ ‌దీవులు, నెవాడా ఎడారి ప్రదేశంలో తన అణుపరీక్ష లను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రాంతాలు ఇప్పటికే అణుపరీక్షల పుణ్యమాని రేడియేషన్‌తో నిండిపోయి నివాసాలకు ఎంతమాత్రం అనువుగా లేవు. అయితే ట్రంప్‌ ‌ప్రకటించిన మరునాడే యు.ఎస్‌. ఇం‌ధన శాఖ మంత్రి క్రిస్‌ ‌రైట్‌ ‌మాట్లాడుతూ తమదేశం అణుపరీక్షలు నిర్వహించడంలేదని స్పష్టం చేయడం గమనార్హం.
సమగ్ర అణ్వస్త్ర వాప్తి నిరోధక ఒప్పందం
1996, సెప్టెంబర్‌లో సమగ్ర అణ్వస్త్రవాప్తి నిరోధక ఒప్పందాన్ని (సీటీబీటీ) రూపొందించారు. ఇందులో సంతకం చేసినవారు ఇక అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు. దీనిపై యు.ఎస్‌, ‌చైనా, రష్యాలు హడావిడిగా సంతకాలు చేసినా ఆయా దేశాలు అధికారిక ఆమోదం తెలపలేదు. 1996 తర్వాత భారత్‌ ‌రెండు (1998), పాకిస్తాన్‌ ‌రెండు (1998), ఉత్తర కొరియా ఆరు (2006-17 మధ్య కాలంలో) అణుపరీక్షలు నిర్వహించాయి. ప్రస్తుతం 5,459 అణ్వస్త్రాలతో రష్యా అగ్రస్థానంలో వుండగా 5,177 అణ్వస్త్రాలతో యు.ఎస్‌. ‌రెండో స్థానంలో ఉన్నట్టు ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ ‌సైంటిస్టస్ (ఎఫ్‌ఏఎస్‌) ‌వెల్లడించింది. ఇక చైనా 600, ఫ్రాన్స్ 290, ‌యునైటెడ్‌ ‌కింగ్‌డమ్‌ 225, ఇం‌డియా 180, పాకిస్తాన్‌ 170, ఇ‌జ్రాయిల్‌ 90, ఉత్తర కొరియా 50 అణ్వాయుధాలను కలిగి ఉన్నాయని ఎఫ్‌ఏఎస్‌ ‌తెలిపింది. 2030 నాటికి చైనా అణ్వాయుధాలు వెయ్యికి చేరతాయని అంచనా. సీటీబీటీపై మన దేశంతోపాటు పాకిస్తాన్‌ ‌కూడా సంతకం చేయలేదు. అమెరికా దీన్ని ఆమోదించలేదు. ఇక చైనా కూడా ఈ ఒప్పందాన్ని పూర్తిగా అంగీకరించలేదు. రష్యా మొదట్లో దీనిపై సంతకం చేసినా తర్వాత వెనక్కి తీసుకుంది.
భారత్‌పై ప్రభావం
ట్రంప్‌ ‌ప్రకటన నేపథ్యంలో తాజా పరిణామాలు భారత్‌పై ఏవిధమైన ప్రభావం చూపుతాయన్న ప్రశ్న తలెత్తడం సహజమే. 1998లో పోఖ్రాన్‌ అణుపరీక్షల తర్వాత మనదేశం స్వచ్ఛందంగా అణుపరీక్షలను నిలిపేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ ఏవిధంగా స్పందిస్తుందనేది మిలియన్‌ ‌డాలర్ల ప్రశ్నగా వుంది. ముఖ్యంగా ట్రంప్‌ ‌ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మన దేశానికి ఎంతవరకు లాభం? లేదా ఎంతవరకు నష్టం? అనేది బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1998లో జరిపిన హైడ్రోజన్‌ ‌బాంబు పరీక్షల్లో 10 నుంచి 15 కిలో టన్నుల శక్తి మాత్రమే వెలువడటం వల్ల, అనుకున్న విజయం సాధించలేదని అప్పట్లో డీఆర్‌డీఓ శాస్త్రవేత్త సంతానం ప్రకటిస్తే, అప్పటి అణు విభాగం ఛైర్మన్‌ ‌రాజగోపాల చిదంబరం మాత్రం అణుపరీక్షలు సక్సెస్‌ అయ్యాయని స్పష్టం చేయడంతో ఈ పరీక్షలపై వివాదం కొనసా గింది. అప్పట్లో భారత్‌ 58 ‌కిలోటన్నుల శక్తి వెలు వడిందని అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు ట్రంప్‌ అణుపరీక్షలపై చేసిన ప్రకటనతో, మనదేశం కూడా మరోసారి అణుపరీక్షలు నిర్వహించి గతంలో నిర్వహించిన పరీక్షలపై నెలకొన్న వివాదానికి ఫుల్‌స్టాప్‌ ‌పెట్టవచ్చుననేది కొందరి నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అయితే 1998 పరీక్షల్లో సేకరించిన డేటా, కంప్యూటర్‌ ‌సిమ్యులేషన్‌లు సరిపోతాయన్నది మరికొందరి వాదన. అమెరికా అణుపరీక్షలు మొదలు పెడితే, రష్యా, చైనాలు కూడా ఇదే బాటలో ముందుకెళతాయి. అప్పుడు భారత్‌ ‌మౌనంగా ఉండ•ం వల్ల వ్యూహాత్మకంగా వెనుక బడటం ఖాయం. ఒక శాంతికాముక దేశంగా, ప్రపంచ శాంతికోసం దౌత్యపరంగా ప్రయత్నించినా అవి ఫలించే అవకాశాలు చాలా తక్కువ! ఆయుధం ధరించు, శాంతంగా మాట్లాడు అనే రీతిలో భారత్‌ ‌కూడా అణు పరీక్షలు చేసి అప్పుడు శాంతికోసం యత్నించడం మరో మార్గం.
మళ్లీ ఆయుధ పోటీ తప్పదా?
ఒకవేళ ట్రంప్‌ ‌ప్రకటన ప్రకారం యు.ఎస్‌. అణుపరీక్షలను తిరిగి ప్రారంభిస్తే, రష్యా, చైనాలు ఎట్టిపరిస్థితుల్లో చేతులు ముడుచుకొని కూర్చోవు. అణ్వాయుధపోటీ పాపం యు.ఎస్‌.‌దేనంటూ ఈ రెండు దేశాలు మళ్లీ తమ అణుపరీక్షలను మొదలు పెడతాయి. ప్రస్తుతం అమెరికా-రష్యాల మధ్య స్టార్ట్ ఒప్పందం అమల్లో ఉంది. ఇరుదేశాల వద్ద ఉండా ల్సిన అణ్వాయుధాల పరిమితిని ఇది నిర్దేశిస్తుంది. ఈ ఒప్పందం వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ముగిసిపోనున్నది. ఒకవేళ యు.ఎస్‌. అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తే ఈ ఒప్పందం అమలు సందిగ్ధంలో పడటం ఖాయం. ఇప్పటివరకు అగ్రరాజ్యాలు విధించుకున్న మారటోరియం చట్టబద్ధమైంది కాదు. కేవలం తమకు తాము విధించుకున్నది మాత్రమే. ఈ మారటోరియం ఉత్తర కొరియాకు వర్తించదు. మరి అగ్రరాజ్యాలు ఈ మారటోరియాన్ని ధిక్కరిస్తే, ఇతర దేశాలు కూడా అణ్వస్త్ర పరీక్షల దిశగా తమ విధానాలను మార్చుకునే అవకాశాలే అధికం. ఇది అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని నిరుపయోగం చేయడమే కాదు, నిరాయుధీకరణ, అణ్వస్త్రాలను సమ కూర్చుకోకూడదన్న నియమాలను నీరుకారుస్తుంది. ఇతర దేశాలు మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఉపయోగించి, కొత్తతరం అణ్వస్త్రాలను తయారుచేసే ప్రమాదం పొంచి ఉంది. ఇది ప్రపంచ భద్రతకు అత్యంత ప్రమాదకరం. చైనా అణ్వస్త్ర పరీక్షలు తిరిగి మొదలుపెడితే, భారత్‌ ‌చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. భారత్‌ను చూసి పాకిస్తాన్‌ ‌ముందుకెళుతుంది. ఇదంతా ఒక శృంఖల చర్య మాదిరిగా ప్రాంతీయ భద్రతకు పెనుముప్పుగా రూపాంతరం చెందుతుంది. ఇక యు.ఎస్‌. ‌సహచర దేశాలు యు.ఎస్‌. ‌నిరోధకశక్తిని ప్రశ్నించడం మొదలు పెడతాయి. దురదృష్టవశాత్తు ప్రస్తుత నాయకులు రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన వినాశనాన్ని మరచిపోయారనే అనుకోవాల్సి వస్తున్నది. హిరోషిమా -నాగసాకి నగరాలపై అణుబాంబులు పడినప్పుడు ఎంతటి విధ్వంసం జరిగిందనేది ఎందుకు వీరు పరిగణనలోకి తీసుకోవడంలేదో అర్థం కాదు. ఎంతో శ్రమించి రూపొందించిన ఎన్‌పీటీ, నిరాయుధీకరణ ఒప్పందాలు దశాబ్దాల కాలంగా ప్రపంచాన్ని ఒక నియంత్రణలో ఉంచుతూ వచ్చాయి. ప్రస్తుతం ట్రంప్‌ ‌విధ్వంసక ప్రవృత్తితో మళ్లీ ప్రపంచం పెను విపత్తు అంచుకు చేరుతోంది. మానవాళి వినాశనానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే చెప్పాలి!
భూమి వినాశనానికి ఉన్నవి చాలు!
నిజానికి ఈ భూమిని సర్వనాశనం చేయడానికి ఇన్ని వేల వార్‌హెడ్‌లు అవసరం లేదు. 1945లో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా ప్రయోగిం చిన అణుబాంబుల కంటే ఎన్నోరెట్లు శక్తివంతమైన అణుబాంబులు ప్రపంచ దేశాల వద్ద ఉన్నాయి. ఇవి చాలు మానవాళి విధ్వంసానికి! అందువల్ల ఈసారి ప్రపంచ యుద్ధం జరిగితే, ఓడిన దేశాలు నాశన మైపోగా, గెలిచిన దేశం పావుకునేదేం లేదు! మానవ నాగరికత మళ్లీ మొదటినుంచి మొదలవుతుంది. అంటే యుద్ధాలు కర్రలతో కొట్టుకునే దశకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది!!

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE