సామాజిక సంస్కరణలు, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే బాగా ముందున్నట్టు కేరళ గణాంకాలు, రికార్డులు ప్రతి ఏటా తెలియజేస్తుంటాయి. నిజానికి ప్రపంచంలో మరే అగ్రరాజ్యంలోనూ లేనంతగా కేరళ రాష్ట్రం ఈ అంశాల్లో దూసుకుపోతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రతి ఏటా నవంబర్ 1 న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాల రోజున చెబుతోన్న ఈసారి నవంబర్ 1న జరిగిన 69వ రాష్ట్రావతరణ దినోత్సవాల్లో పినరాయి విజయన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించినట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుపేదరికాన్ని పూర్తిగా నిర్మూలించమని ఆయన గణాంకాలతో సహా వివరించారు.
రాష్ట్రంలో ఈ అతి పేదరికాన్ని నిర్మూలించ డానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా కృషి చేస్తోంది. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, పంచాయతీలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సామాజిక సేవా సంస్థల సహాయ సహకారాలతో విజయన్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా నిరుపేదరికాన్ని నిర్మూలించడానికి గట్టిగా కృషి చేస్తోంది. పినరాయి విజయన్ నాయకత్వంలో వామపక్ష కూటమి (ఎల్.డి.ఎఫ్) రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 మే నెలలో జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో ఈ అతి పేదరిక నిర్మూలన కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. వాస్తవానికి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కార్యక్రమాలు రూపొందించడమన్నది మొదటి నుంచి జరుగుతూ వస్తున్నదే. మొదటగా 1973-74లో అప్పటి ప్రభుత్వం ప్రజల సహకారంతో రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడానికి నడుం బిగించింది. ఆ ప్రభుత్వం అతి కష్టం మీద పేదరికాన్ని 59.8 శాతానికి తగ్గించగలిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు కూడా అనేక సంవత్సరాలు పేదరికం మీద పోరాటాలు జరిపిన తర్వాత 2011 నాటికి 11.3 శాతానికి తగ్గింది.
పేదరికంపై పోరాటం
నీతి ఆయోగ్ సంస్థకు చెందిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (2023) కూడా కేరళలో పేదరికం చాలావరకు తగ్గినట్టు, పేదల్లో అధిక సంఖ్యాకులు అన్ని విధాలా పురోగతి సాధించినట్టు ప్రకటించింది. ఇక్కడ కూడు, గూడు, గుడ్డకు అవకాశం లేక నానా అవస్థలూ పడుతున్న వారి సంఖ్య చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్టు కూడా అది తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ గణాంక వివరాలు ప్రకారం, కేరళలో కూడు, గూడు, గుడ్డకు నోచుకోని వారి సంఖ్య మొత్తం పేదల జనాభాలో 0.55 శాతమే ఉన్నట్టు రికార్డులు తెలియజేస్తున్నాయి. ఈ విషయంలో జాతీయ సగటు 14.96 శాతంగా నమోదై ఉంది. కేరళలో పేదల సంఖ్య, పేదరికం స్థాయి జాతీయ సగటు కంటే బాగా తక్కువగా ఉన్నట్టు కేరళ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
రాష్ట్రంలో పేదరికాన్ని అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఏ పేదవాడూ తనకు తానుగా వచ్చి తన పేదరిక వివరాలను వెల్లడించా ల్సిన అవసరం ఉండదు. పేదరికాన్ని అంచనా వేయడానికి, పేదల సంఖ్యను స్వయంగా అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల మంది సుశిక్షిత ఉద్యోగులను నియమించింది. ఈ ఉద్యోగులకు స్థానిక సంస్థలే కాకుండా, ప్రజా ప్రయోజనాల కోసం ఇదివరకే నియమించిన కుటుంబశ్రీ పథకం కార్యకర్తలు కూడా సహకరించాల్సి ఉంటుంది. పేదరికంగా బాగా ఎక్కువగా కూరుకుపోయి ఉన్న వ్యక్తుల్ని గుర్తించడం వీరికి అప్పగించిన లక్ష్యం. ఒక్కసారి కాకుండా అనేక పర్యాయాలు సర్వే చేసిన తర్వాత నిరుపేద కుటుంబాలను గుర్తించారు. రాష్ట్రంలో 64,006 కుటుంబాలు పరమ పేదరికంలో కొట్టుమిట్టాడు తున్నట్టు గుర్తించారు. ఈ కుటుంబాల్లోని వ్యక్తుల సంఖ్యను బట్టి మొత్తం 1,03,099 మంది వ్యక్తులు కూడు, గూడు, గుడ్డ వంటి మౌలిక విషయాలకు ఆమడ దూరంలో ఉన్నట్టు తెలిసింది. ఆహారం, ఆరోగ్యం, జీవనం, ఇల్లు వంటి నాలుగు మౌలిక సౌకర్యాలకు వీరు నోచుకోవడం లేదని ఈ అధ్యయనంలో అర్థమైంది.
విభిన్న కార్యక్రమాలు
వాస్తవానికి, ఈ పేదల అవసరాలన్నీ ఒకే విధంగా లేవు. ఒక్కొక్క కుటుంబం పరిస్థితి ఒక్కో విధంగా ఉంది. అందరికీ ఒకే విధమైన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపట్టడం వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం భావించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పేదల విషయంలో విభిన్న సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. ఒక్కొక్క నిరుపేద కుటుంబానికి ఒక్కో సూక్ష్మ సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టవలసి వచ్చింది. ఒక్కొక్క నిరుపేద కుటుంబాన్ని కలుసుకుని, వారి అవసరాలను గుర్తించి, వారికి గుర్తింపు పత్రాలను జారీ చేయడానికి ప్రభుత్వానికి ఆరేడు నెలల కాలం పట్టింది. ఎవరికి ఎటువంటి ఇల్లు అవసరం, ఎటువంటి జీవనం అవసరం, ఆరోగ్యం ఏ స్థాయిలో ఉంది, వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు, ఎటువంటి వస్త్రాలను ధరిస్తున్నారు వగైరా విషయాలను అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక తరహా సంక్షేమాన్ని చేపట్టడం ప్రారంభించింది.
కాగా, అతి పేదరికాన్ని నిర్మూలించడం ఆషామాషీ విషయం కాదు. ఒకసారి సహాయం చేసినా, కొద్ది కాలం పాటు వదలకుండా సహాయం చేసినా పేదరికం తొలగిపోయే దురవస్థ కాదు. అనేక ఏళ్ల పాటు, కనీసం ఒక తరం వృద్ధిలోకి వచ్చే వరకూ పేదరిక నిర్మూలన కార్యక్రమం కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. పైగా, కేరళకు సంబంధించి నంత వరకూ రాష్ట్రంలో అనేక గిరిజన జాతులు నిరుపేదరికం కంటే కనాకష్టమైన స్థితిలో ఉన్నాయి. రాష్ట్రంలో గిరిజన జనాభా ఇంకా మౌలిక అవసరాలకు, సౌకర్యాలకు దూరంగానే ఉండడం జరుగుతోంది. రాష్ట్రంలో నిరుపేదరికాన్ని నిర్మూలించామని చెప్పుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తొందరపడుతున్నట్టు కనిపిస్తోంది. కొత్తగా మరికొన్ని కుటుంబాలు పేదరికంలోకి దిగజారకుండా చర్యలు తీసుకోవడం కూడా అందని మాని పండుగానే ఉంది. అన్ని వైపుల నుంచి, అన్ని కోణాల నుంచి నిరుపేదరికాన్ని నిర్మూలిస్తామని కేరళ ప్రభుత్వం అనేక పర్యాయాలు ప్రకటించింది. కానీ, పేదరికం నాలుగైదేళ్లలో మటుమాయమయ్యే అవకాశం లేదు. పేదరికం నుంచి బయటపడాలని, ప్రభుత్వ సౌకర్యాలను, కార్యక్రమాలను, పథకాలను ఉపయోగించుకుని అభ్యున్నతి సాధించాలన్న తాపత్రయం నిరుపేదల నుంచి కూడా వ్యక్తం కావలసిన అవసరం ఉంది.
సమగ్రాభివృద్ధికి దూరం
రాష్ట్రంలోని వేలాది నిరుపేద కుటుంబాలకు ఆహారం, ఆరోగ్యం, జీవనం, ఇల్లు అందించడానికి కోట్లాది రూపాయల ఖర్చుతో పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం వారికి ఉచిత విద్యనందించడానికి, వారికి తగ్గ ఉపాధి కల్పించ డానికి కూడా పెద్ద ఎత్తున కృషి చేయాల్సి ఉంటుంది. కేరళ రాష్ట్రం అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఉపాధికల్పనలో మాత్రం అట్టడుగు స్థితిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కేరళ మోడల్ ప్రస్తుతం ఎదుగూ బొదుగూ లేకుండా ఆగిపోయి ఉందని, ఉపాధి కల్పనకు అవకాశాలే కనిపించడం లేదని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి కల్పనకు అవకాశాలు లేకపోయినా, సంపద సృష్టి స్తంభించిపోయినా పేదరిక నిర్మూలన సాధ్యం కాదని, మరో రెండు మూడేళ్లలో మరింత ఎక్కువ సంఖ్యలో పేద కుటుంబాలు పెరిగే ప్రమాదం కూడా ఉందని విమర్శకులు భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని ప్రాథమిక సదుపాయాల ప్రాజెక్టులను, హైటెక్ హరిత పరిశ్రమల నిర్మాణాన్ని చేపట్టింది. దీనివల్ల పేదలకు, నిరుపేదలకు కొద్దిపాటి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పేదల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, పేద కుటుంబాలలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ నైపుణ్య కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని కలగలిపి పథకాలు, కార్యక్రమాలు చేపట్టడం వల్ల పేదరికాన్ని, నిరుపేదరికాన్ని నిర్మూలించడం మరింత తేలికవుతుందని, సామాజిక భద్రత విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని ఆర్థిక, సామాజిక నిపుణులు ప్రభుత్వానికి సూచించడం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా నిరుపేద నిర్మూలన పథకాన్ని కొద్దిగా మార్చే పక్షంలో ఫలితాలు మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయని కూడా టీవీ చర్చల్లోనూ, యూట్యూబ్ ఛానల్స్‌లోనూ నిపుణులు ప్రభుత్వానికి సూచించడం జరుగుతోంది.
ప్రజలకు సంబంధించిన పథకాలు, కార్యక్రమాల్లో కొద్దిపాటి లోపాలు, లొసుగులు ఉండడం సహజం. అతి పేదరిక నిర్మూలన కోసం తాము చేపట్టిన సంక్షేమ పథకాలు, సామాజిక కార్యక్ర మాలు కాలం గడిచే కొద్దీ, అనుభవాలను పండించుకుంటున్న కొద్దీ మార్పులు, చేర్పులకు లోనవుతాయని, అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య సూత్రాలను అమలు చేయడానికి, వాటిని పటిష్ఠం చేయడానికి తాము చేస్తున్న కృషిని శంకించవద్దని, తమ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలని విజయన్ ప్రభుత్వం గత నవంబర్ 1న జరిగిన అధికారిక రాష్ట్రావతరణ కార్యక్రమంలో ప్రజలను, నిపుణులను అభ్యర్థించింది. పేదరిక నిర్మూలన కోసం, ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమానికైనా పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా తమ మద్దతు తప్పకుండా ఉంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. నిరుపేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్న కేరళ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందా అన్నది వేచి చూడాల్సిన విషయం.
జి.రాజశుక
సీనియర్ జర్నలిస్ట్