ఆగ్నేయాసియా దేశాల గ్రూపు – భారత్ (ఆసియన్-ఇండియా)ల సంయుక్త సదస్సు అక్టోబర్ 26న మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగింది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా పాల్గొనగా, విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. ఈ ఆసియన్-ఇండియా సదస్సులో పాల్గొన్న 12 ప్రధానిగా నరేంద్రమోదీ నిలిచారు. సదస్సుకు సహ అధ్యక్షత వహించిన మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మాట్లాడుతూ భారత్` ఆసియన్ దేశాల మధ్య సంబంధాలు పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రయోజనాలు, విలువలతో కూడిన స్నేహం ఆధారంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నరేంద్రమోదీ మాట్లాడుతూ భద్రత, ఆర్థిక సహకారం, అనుసంధానత, అభివృద్ధి అనే అంశాలు ఇరుపక్షాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఆసియన్ గ్రూపులో తూర్పు తైమూర్ లేదా తైమూర్ లెస్టే 11వ సభ్యదేశంగా చేరడం విశేషం. ఈ కొత్త సభ్యురాలిని సదస్సు అభినందించింది.
2026-30 మధ్య పరస్పర సహకారానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను నాయకులు ఆమోదించారు. లావోస్ రాజధాని వియంటెనేలో 2024లో జరిగిన 21వ ఆసియన్ సదస్సులో ప్రకటించిన పది సూత్రాల అజెండా ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉంది. ముఖ్యంగా పర్యాటకం, విద్య, డిజిటలైజేషన్, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలు ఈ సూత్రాల్లో భాగంగా ఉన్నాయి. 2025 సదస్సు ఆసియన్-ఇండియాల మధ్య వస్తు వాణిజ్య ఒప్పందాన్ని (ఏఐటీఐజీఏ) మరింత ఆధునికీకరించడం ద్వారా ఆర్థిక విలీనీకరణ గతివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఎందుకంటే ఈ ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుంది.
ముఖ్యంగా ఆసియన్ దేశాలతో మనదేశ ఆర్థిక లోటు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. 2016-17లో 9.66 బిలియన్ డాలర్లున్న ఈ లోటు 2022`23 నాటికి ఏకంగా 43.57 బిలియన్ డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో, భారత్ దీన్ని సరిదిద్దే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే వాణిజ్యాన్ని మరింత విస్తరించడం, అమల్లో ఉన్న సుంకాల విధానాలను మరింత సరళతరం చేయడం, నాన్`టారిఫ్ అడ్డంకులను తొలగించడం, సేవలు, పెట్టుబడి రంగాల్లో అవకాశాల సృష్టి మొదలైన అంశాలను ఏఐటీఐజీఏ సమీక్షించింది. విశేషమేంటంటే మనదేశం నిర్వహించే మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో 11%తో ఆసియన్ దేశాలు నాలుగో స్థానంలో ఉండటం విశేషం. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), సీమాంతర చెల్లింపుల వ్యవస్థ, ఫింటెక్ సొల్యూషన్స్ (ఆర్థిక సాంకేతిక పరిష్కారాలు) రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలన్న అంశానికి సదస్సులో జరిగిన చర్చలు గట్టి ప్రాధాన్యతనిచ్చాయి. ఆసియన్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత ఆధునికీకరించే క్రమంలో మనదేశంలో అమల్లో ఉన్న యుపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్) చెల్లింపుల వ్యవస్థపై మరింత ఆసక్తి కనబరచాయి. భవిష్యత్తులో డిజిటలీకరణను మరింత విస్తరిం చేందుకు వీలుగా 2024 సదస్సులో ఆసియన్` ఇండియా ఫండ్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. కృత్రిమమేధ, సరఫరా శృంఖలాల నిర్వహణకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ, డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకునేందుకు వీలుగా ఇరుపక్షాల మధ్య చర్చలు జరిగాయి. ఇండియా`మయన్మార్`థాయ్‌లాండ్ త్రైపాక్షిక హైవే, కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలకు సంబంధించిన ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలని కూడా నేతలు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు మన ఈశాన్య రాష్ట్రాలకు ఆగ్నేయాసియాదేశాలతో సీమాంతర వాణిజ్య నిర్వహణ మరింత విస్తరించ గలదు. ఆవిధంగా సరిహద్దు ప్రాంతాలు ఆర్థిక నడవాలుగా రూపొం దుతాయి. ఈ త్రైపాక్షిక హైవేను ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించే అవకాశాలను కూడా ఆసియన్`ఇండియా సదస్సు పరిశీలించింది. ‘‘కనెక్టింగ్ ది కనెక్టివిటీస్’’ (సంధాయకతలను అనుసంధానించడం) అనే వ్యూహం కింద, ‘‘ఆసియన్ మాస్టర్ ప్లాన్ ఆన్ ఆసియన్ కనెక్టివిటీ`2025’’తో ఈ త్రైపాక్షిక హైవేను అనుసంధానించే అవకాశాలపై చర్చలు జరిగాయి. భౌతిక అనుసంధానతతో పాటు, డిజిటల్ కనెక్టివిటీపై కూడా ఈ సదస్సులో చర్చలు జరిగాయి.
బ్రాండ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లు, జలాంతర్గాముల కేబుల్ వ్యవస్థలు, ఉపగ్రహ కమ్యూనికేషన్ వంటి అనుసంధానతలపై కూడా సదస్సు చర్చించింది. అంతేకాదు మొట్టమొదటి ఆసియన్`ఇండియా ట్రాక్`1 సైబర్ విధాన చర్చలు, మౌలిక సదుపాయాలకు పొంచి ఉన్న సైబర్ ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన ఛానల్స్ ఏర్పాటుపై కూడా ఇరు పక్షాలు చర్చించాయి.
తీవ్ర ఒత్తిడిలో ఆసియన్ దేశాలు
ప్రస్తుతం ఆగ్నేయసియా దేశాలు ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న పోటీ నేపథ్యంలో తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు అమెరికా నుంచి, మరోవైపు చైనాల నుంచి వత్తిళ్లు పెరిగిపోవడంతో, తమ ఆర్థిక స్వాతంత్య్రం పెను ప్రమాదంలో పడిరదన్న భావన ఆసియన్ దేశాల్లో గట్టిగా నాటుకుపోయింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో భారత్ రంగ ప్రవేశం వీటికి ఊరట కలిగించే అంశం. ఎందుకంటే ఒకరి వ్యవహారాల్లో మరొకరు కల్పించుకోకుండా, పరస్పర గౌరవం తో కొనసాగే భారత్‌తో సహకారం ఆసియన్ దేశాలకు పెద్ద ఊరట కలిగిస్తోంది. ఆసియన్ ప్రాంతీయ వేదిక (ఏఆర్‌ఎఫ్), ఆసియన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్ (ఏడీఎంఎం`ప్లస్), తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్) వంటి ఆసియన్ దేశాల నిర్వహణలో కొనసాగే విభాగాల్లో కూడా భారత్ పాల్గొనడం ప్రాంతీయ ఫ్రేమ్‌వర్క్‌లో సంస్థాగత నిబద్ధతను వెల్లడిస్తోంది.
స్వేచ్ఛా వాణిజ్యం, సరిహద్దు వివాదాలు, దక్షిణ చైనా సముద్రంలో చైనా అనుసరిస్తున్న దుందుడుకు వైఖరి ఆసియన్ దేశాలతో పాటు భారత్‌ను ఆం దోళనకు గురిచేస్తున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక సముద్ర సహకారంపై ఇరు పక్షాలు దృష్టి పెట్టాయి. 2026ను ఆసియన్`ఇండియా సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటించడం ఇందులో భాగమే! ఈ దేశాల నేవీల మధ్య పరస్పర అంతర నిర్వహణ, పైరసీ నిరోధక కార్యకలాపాలు, తనిఖీలు, సహాయ కార్యక్రమాలు, సముద్ర సైబర్ దాడులు, చట్ట విరుద్ధంగా చేపలు పట్టడాన్ని నిరోధించడం వంటి అంశాల్లో ఈ దేశాలు పరస్పరం సహకరించు కుంటాయి. ఈ నేపథ్యంలో ఆసియా`ఇండియా రక్షణ మంత్రుల రెండో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
ఇండో-పసిఫిక్‌కు ముఖద్వారం
ఆసియన్`ఇండియా భాగస్వామ్యం ప్రధానంగా ద్వైపాక్షికమైంది. ఇది భవిష్యత్తులో ఇండో-పసిఫిక్ సంబంధాలను మరింత బలీయంగా నిర్మించేం దుకు దోహదం చేయగలదు. భారత్ పరంగా చూస్తే తాను అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద, ఇండో`పసిఫిక్ ప్రాంతంలో కీలక పాత్ర పోషించ డానికి, ఈ ఆసియన్ దేశాలను ఒక ముఖద్వారంగా పరిగణిస్తోంది. ఎందుకంటే మలక్కా జలసంధి వంటి కీలకమైన వాణిజ్య రవాణా మార్గాలు ఆసియన్ దేశాల నియంత్రణలోనే కొనసాగుతున్నాయి. ఈ మలక్కా జలసంధి ద్వారానే మనదేశానికి చెందిన 80 శాతం ఇంధన రవాణా జరుగుతోంది. అందువల్ల మన ఇంధన భద్రత రీత్యా ఆసియన్ దేశాలతో స్నేహ సహకారాలు చాలా కీలకం! ఆసియన్ దేశాల పరంగా చూస్తే ప్రస్తుతం అవి చైనా-అమెరికా వాణిజ్య విభేదాల ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ఇప్పుడు భారత్ ప్రజాస్వామ్య బద్ధమైన సంతులనంతో వాటికి స్వాంతన కలిగిస్తోంది. ముఖ్యంగా చైనా, అమెరికాలు వాణిజ్యం పేరుతో ఆసియన్ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఆసియన్ దేశాలకు ప్రాధాన్యం కల్పించే రీతిలో వాణిజ్యం కొనసాగాలన్న విధానాన్ని అనుసరిస్తుండటం వీటికి ఆనందం కలిగించే అంశం. అంటే ప్రాంతీయ కార్యకలాపాలన్నీ ఆసియన్ దేశాల నియంత్రణలోనే జరగాలన్నది భారత్ విధానం. ఆ విధంగా ఆసియన్ దేశాల వ్యూహాత్మక స్వాతంత్య్ర పరిరక్షకురాలిగా భారత్ ఒక వెలకట్టలేని భాగస్వామిగా రూపొందింది. భారత్ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, సమృద్ధ యువశక్తితో పెట్టుబడులకు గొప్ప అవకాశంగా ఆసియన్ దేశాలకు కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న ఇండియాలో ఇప్పటివరకు అనుసరిస్తున్న చైనా కేంద్రిత వాణిజ్య విధానాలపై ఆధారపడే తమ సరఫరా శృంఖలాలను భారత్ వైపునకు మరల్చేందుకు ఆసియా దేశాలకు భారత్ ఒక అవకాశంగా రూపొందిందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద భారత్ అందిస్తున్న సహకారానికి ఆసియన్ దేశాల అధినేతలు భారత్‌కు కృతజ్ఞతలు తెలపడం విశేషం.
ఆసియన్ దేశాలకు భారత్ సహకారం
ఆసియన్ పవర్ గ్రిడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా 400 మంది ఆసియన్ దేశాల వృత్తి నిపుణులకు భారత్ శిక్షణ ఇస్తుంది. కొత్తగా సభ్యురాలైన తైమూర్ లెస్టే (ఈస్ట్ తైమూర్) దేశానికి తక్షణం ఉపయోగపడే ప్రాజెక్టు(క్యుఐపీ)లను మనదేశం అందుబాటులోకి తెస్తుంది. నలందా విశ్వవిద్యాలయంలో ఆగ్నేయాసియా దేశాల అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ప్రాంతీయ నిపుణులను తయారు చేయడం దీని లక్ష్యం. గుజరాత్ లోని లోథాల్‌లో ‘‘ఈస్ట్ ఆసియా సమ్మిట్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్’’ ను మనదేశం నిర్వహిస్తుంది. దీంతో పాటు సముద్ర భద్రతపై పరస్పర సహకారానికి సంబం ధించిన సదస్సును కూడా మనదేశం నిర్వహిస్తుంది.
11 సభ్యదేశాలు
ఆసియన్ దేశాల్లో ప్రస్తుతం 11 దేశాలు సభ్యులుగా వున్నాయి. బ్రూనై, కంబోడియా, ఇండొనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాంలతో పాటు తాజాగా ఈస్ట్ తైమూర్ లేదా తైమూర్ లెస్టే ఇందులో సభ్యురాలిగా చేరింది. నిజానికి విస్తరిస్తున్న కమ్యూనిజాన్ని అడ్డుకునేందుకు వీలుగా ఐదు ఆసియన్ దేశాలు ఒక గ్రూపుగా 1967లో ఏర్పడ్డాయి. ప్రపంచ దేశాలతో ఆసియన్ దేశాల వాణిజ్యం 25 నుంచి 30శాతం వరకు వుంటోంది. అంటే యూరోపియన్ యూనియన్ దేశాల నిర్వహించే వాణిజ్యం తర్వాతి స్థానం వీటిదే! భారత్‌కు ఎంతో కీలకంగా ఉన్న ఈ దేశాలకు చైనా పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఈ దేశాల సముద్ర జలాలు కూడా తమవేనంటూ దుందుడుకుగా వాదిస్తున్న చైనా ఈ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఇండో`పసిఫిక్ ప్రాంతం రూపొందడంతో, ఇదే ప్రాంతానికి చెందిన ఆసియన్ దేశాలకు ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగిపోయింది. మనదేశం విషయానికి వస్తే 40 నుంచి 50శాతం వాణిజ్యం ఈ ప్రాంతం గుండానే జరుగుతుంది. ఆసియన్ దేశాలు బలీయమైన ఆర్థిక వ్యవస్థలుగా రూపొందు తుండటంతో, ఇక్కడి మార్కెట్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఆసియన్ దేశాలన్నీ అంతర్జాతీయ వేదికలపై ఒకే వాణిని వినిపిస్తుండటంతో వీటి ప్రాధాన్యత మరింతగా పెరిగింది.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
మనదేశం 2009లో ఆసియన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. కానీ దీనివల్ల మనకు పెద్దగా లాభించడంలేదు. అదీకాకుండా చైనా వస్తువులు మనదేశంలోకి ప్రవేశించడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తోంది. మనదేశం ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ)లో చేరడానికి ఇదే ప్రధాన కారణం. ఆర్‌సీఈపీలో ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, ఆసియన్ దేశాలు భాగస్వాములు. పాకిస్తాన్ చైనా సహాయంతో ఈ గ్రూపు దేశాలతో సహకారం పెంపొందించు కోకుండా చూడటం ప్రస్తుతం భారత్ ముందున్న ప్రధాన సమస్య! అందువల్ల మనదేశం ఈ దేశాలతో వాణిజ్యం, తయారీ, సేవ, ఆర్థిక సాంకేతిక సహకారం వంటి రంగాల్లో నిరంతరం సంబంధాలు కొనసా గించాల్సిందే. భారత్‌కు తనకున్న సానుకూలతలను వినియోగించుకుంటూ క్రమంగా బలమైన నాయకత్వ స్థాయికి ఎదగడమే లక్ష్యం కావాలి.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్