సాంఘిక సంస్కరణలకు, ప్రగతిశీల రాజకీయాలకు మారుపేరని చెప్పుకునే కేరళ రాష్ట్రం ఇప్పుడు సరికొత్త అస్తిత్వం కోసం తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. భారతదేశంలో వామపక్ష భావజాలానికి, లౌకికవాదానికి పెట్టనికోటగా ఉన్న కేరళ ప్రస్తుతం సాంస్కృతిక జాతీయవాదం వైపు పరుగులు పెడుతోంది. సుమారు అయిదు దశాబ్దాలుగా వామపక్ష కూటమికి, కాంగ్రెస్‌ కూటమికి మాత్రమే అధికారం ఇస్తూ వస్తున్న కేరళ ప్రజానీకం ఇక ఈ రెండు పార్టీల ప్రజాస్వామ్యానికి స్వస్తి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది. గత కొద్ది కాలంగా ఈ రెండు పార్టీల ప్రజాస్వామిక వ్యవస్థకు చెదలుపడుతోంది. రాష్ట్రంలో, రాష్ట్ర ప్రజల హృదయాల్లో క్రమంగా మూడో పార్టీకి ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ`బీజేపీ అన్నా, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు`ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నా అంటరాని వ్యవస్థలుగా పరిగణించిన కేరళ ప్రజలు క్రమంగా ఈ రెండింటి వైపు మొగ్గు చూపడం ప్రారంభమైంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం దీనికి నిదర్శనం.

వచ్చే ఏడాది శాసనసభకు జరిగే ఎన్నికలు రాష్ట్రాన్ని సిద్ధాంతాలు, అస్తిత్వాలు, అధికారాల రణభూమిగా మార్చేస్తున్నాయి. తమ కాళ్ల కింద కదిలిపోతున్న రాజకీయ ప్రాధాన్యాన్ని కాపాడుకోవ డానికి, అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ నాయకత్వంలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌`ఎల్‌డీఎఫ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌`యూడీఎఫ్‌ నానా అవస్థలూ పడుతున్నాయి. అనేక దశాబ్దాలుగా వామపక్ష భావజాలంతో, కుహానా లౌకికవాదంతో తమను మురిపిస్తున్న ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ల రాజకీయాలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. నిలదీస్తున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఇక్కడి రాజకీయాలను సరైన దారిలోకి మళ్లిస్తున్నాయి. రాష్ట్ర ప్రజల్లో జాతీయవాదాన్ని, సాంస్కృతిక ఔన్నత్యాన్ని, భారతీయ నాగరికతను, విలువలను ప్రేరేపిస్తున్నాయి. సర్వత్రా జాతీయవాదానికి ప్రాధాన్యత లభిస్తోంది. వామపక్ష సమావేశాల్లో సైతం ఇదే అంశం పదే పదే ప్రస్తావనకు వస్తోంది. ఇంతవరకూ ఎరుపు రంగుతోనే రాస్తూ వస్తున్న కేరళ చరిత్రను ఇక ముందు కాషాయ రంగుతో కూడా రాయాల్సిన అవకాశం, అవసరం కనిపిస్తోంది.

వివాదాలకు నిలయం

గత కొద్ది కాలంగా రాష్ట్రంలో ఒకదాని తర్వాత ఒకటిగా వెలుగు చూస్తున్న వివాదాలను పరిశీలించిన వారికి వామపక్ష కూటమి ప్రభుత్వంలోని సైద్ధాంతిక డొల్లతనం స్పష్టంగా కళ్లకు కడుతోంది. అది వివాదాలు, అక్రమాలు, అవినీతి స్కామ్‌లలో చిక్కుకుని విలవిలలాడుతోంది. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ఆర్‌ఎస్‌ఎస్‌పై దుమ్మెత్తి పోయడానికి అవస్థలు పడుతోంది. వామపక్ష ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌పై దాఖలైన ఒక తప్పుడు కేసును ఇప్పుడు వెలికి తీసింది. దానికి కాంగ్రెస్‌ పార్టీ వత్తాసు పలికింది. ఆర్‌ఎస్‌ఎస్‌పై కోర్టు కొట్టేసిన కేసును తిరగదోడడాన్ని బట్టి వామపక్ష ప్రభుత్వ నైతిక విలువలను అర్థం చేసుకోవచ్చు.

మరో వివాదం కూడా కేరళ వామపక్ష విధానాలకు అద్దం పడుతోంది. రాష్ట్రంలోని విద్యాలయాల్లో కట్టు బొట్టు విషయంలో నిబంధనలు, నిషేధాలు విధించిన కేరళ విద్యామంత్రి శివన్‌ కుట్టి విద్యా సంస్థల్లో విద్యార్థులు హిజాబ్‌ ధరించడాన్ని మాత్రం సమర్థించారు. ఇది ముస్లిం వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని తేల్చి చెప్పారు. మార్క్సిస్టు పార్టీకి చెందిన శివన్‌ కుట్టి ద్వంద్వ వైఖరిని హిందువులు తూర్పారబట్టి, వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ దీన్ని నిస్సిగ్గు బుజ్జగింపు ధోరణిగా అభివర్ణించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రమేశ్‌ చెన్నితాల కూడా బీజేపీ వాదనను నర్మగర్భంగా సమర్థించారు. వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలోని బీజేపీ మీద దాడి చేయడానికి ఛత్తీస్‌గఢ్‌లో క్యాథలిక్‌ సన్యాసినులను బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని కూడా ఉపయోగించుకుంటున్నాయి. ఆ కేసు పూర్వాపరాలను వామపక్ష ప్రభుత్వం గానీ, కాంగ్రెస్‌ గానీ ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఈ పార్టీలకు పాలన, విధానాలు ఎక్కడా పట్టడం లేదు. అవి సిద్ధాంతాలకు, విలువలకు, నైతికతకు పూర్తిగా నీళ్లు వదిలినట్టు కనిపిస్తోంది.

అస్తిత్వానికి అగ్ని పరీక్ష

రాష్ట్ర బీజేపీ నాయకత్వం వామపక్షాలు సైద్ధాంతికంగా బలహీనపడుతు న్నాయనడానికి వాటి ప్రచారమే నిదర్శనమని విమర్శలు సాగిస్తోంది. అల్పసంఖ్యాక వర్గాల వారి ఓట్ల కోసం చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్న వామపక్షాలు తాము ఈ క్రమంలో సిద్ధాంతపరంగా దిగజారుతున్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఆ పార్టీలు ఘనంగా ప్రచారం చేసుకునే లౌకిక వాదాన్ని కూడా వారే స్వయంగా నీరుకార్చేయడం జరుగుతోంది. ఒకప్పుడు ఇటువంటి బుజ్జగింపు ధోరణులను బహిరంగంగా తిరస్కరించిన వామపక్షాలు ఇప్పుడు ఏ దారీ లేక వాటినే అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ విమర్శలు సాగిస్తోంది. కాంగ్రెస్‌ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా ఉంది. అటు వామపక్షాలను, ఇటు బీజేపీని విమర్శించడం దానికి కత్తి మీద సాములా మారింది. ఒకప్పుడు హేతువాదానికి, సంక్షేమానికి తమ ఎన్నికల ప్రచారంలో ప్రాధాన్యమిచ్చిన వామపక్షాలు ఇప్పుడు బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి.

బీజేపీ గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఒక సీటుతో బోణీ చేసిన దగ్గర నుంచి వామపక్షాలు కంటగింపు మరీ ఎక్కువైంది. త్రిచూర్‌ లోక్‌సభ స్థానం నుంచి నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్‌ గోపి విజయం సాధించడం వామపక్షాలను, కాంగ్రెస్‌ పార్టీని పునరాలోచనలోకి నెట్టింది. బీజేపీని ఆదరించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వారు ఇదివరకటి మాదిరిగా దానిని అంటరాని పార్టీగా చూడడం లేదని ఆ పార్టీలకు అర్థమైంది. రాష్ట్రంలో బీజేపీ ఓటు వాటా 16 శాతానికి పెరిగింది. తిరువనంతపురం, పాలక్కాడ్‌, త్రిచూర్‌ నియోజకవర్గాల్లో అది 25 శాతానికి మించి పోయింది. రాష్ట్రంలో హిందువుల జనాభా 54.73 శాతం కాగా, ముస్లిం జనాభా 26.56 శాతం, క్రైస్తవుల జనాభా 18. 45 వరకూ ఉంది. అంటే, ముస్లింలు, క్రైస్తవుల జనాభా కలిసి 45 శాతం వరకూ ఉంది. ఈ రెండు వర్గాలు పటిష్టంగా ఉన్నంతగా హిందువులు సంఘటితంగా లేకపోవడం సమస్యగా కనిపిస్తోంది. బీజేపీ ఓటు వాటా ఎన్నికల్లో క్రమంగా పెరుగుతున్నప్పటికీ, సమీప భవిష్యత్తులో అది అధికారానికి వచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రస్తుతం గట్టి ప్రయత్నాలు సాగిస్తోంది. దేవుడి సొంత దేశంగా గుర్తింపు పొందిన కేరళలో భావితరాల వారే చరిత్రను తిరగరాయాలి.

జాతీయవాదానికి ప్రాధాన్యం

ఇక్కడ వెళ్లప్పళ్లి నటేశన్‌ నాయకత్వంలోని ఏళవ కులస్థులు, జీ సుకుమారన్‌ నాయకత్వంలోని నాయర్‌ కులస్థులు పూర్తిగా సాంస్కృతిక జాతీయవాదం వైపే మొగ్గు చూపిస్తున్నారు. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత బలమైన వర్గంగా ఉన్న యువ క్రైస్తవులు కూడా క్రమంగా తమ ఇదివరకటి ప్రాధాన్యలకు స్వస్తి చెప్పి, కొత్త భావాలను పుణికి పుచ్చుకుంటు న్నారు. కేరళ రాజకీయ సమీకరణాలు త్వరితగతిన మారుతున్నాయి. సాధారణ ప్రజానీకం కూడా వామపక్ష పాలన పట్ల మొహం మొత్తిపోయి ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి విజయన్‌ మీదే కాక, ఆయన మంత్రుల మీద కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గల్ఫ్‌ నుంచి వచ్చే విరాళాలు కూడా ఆగిపోవడంతో వామపక్షాల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఇక్కడి ముస్లిం, క్రైస్తవ వర్గాలు బాగా బలంగా ఉన్న మాట నిజమే కానీ, ఇక్కడ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల ఉనికి విస్తరించడం మాత్రం ఖాయంగా జరుగుతోంది. ప్రజల్లో బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీల వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది.

యువ ఓటర్లలో జాతీయవాద భావజాలం క్రమంగా వేళ్లు పాదుకుంటోంది. వర్గ పోరాటాలు, బూజుపట్టిన సిద్ధాంతాల పట్ల వారికి మొహం మొత్తుతోంది. వామపక్షాలు ఒక వైపు, కాంగ్రెస్‌ పార్టీ మరొకవైపు హిందూ ప్రయోజనాలను పణంగా పెట్టి అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగించడం కూడా యువ ఓటర్లకు ఏవగింపు కలిగిస్తోంది. మొత్తం మీద 2026 శాసనసభ ఎన్నికలు కేరళలో చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ప్రజలు వామపక్షాలు, కాంగ్రెస్‌ మధ్య మాత్రమే పోటీ ఉండాలని, తాము ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకదానికి మాత్రమే ఓటు వేయాలనే అభిప్రాయం నుంచి బయటపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర సైద్ధాంతిక భవిష్యత్తు, సామాజిక పురోగతి మీద వారి దృష్టి కేంద్రీకృతమవుతోంది. రాష్ట్రంలో నిస్సందేహంగా జాతీయవాద చైతన్యం ప్రబలుతోంది. బుజ్జగింపులు, విధేయతలు, అస్తిత్వాల మీద ఆధారపడి కాకుండా, సిద్ధాంతాలు, విలువల మీద ఆధారపడి పాలన సాగించాలన్న అభిప్రాయం యువతలో స్పష్టంగా కనిపిస్తోంది. యువత ధోరణి క్రమంగా మార్క్స్‌ నుంచి మందిరం వైపు మళ్లుతోందని అర్థమయ్యే వామపక్షాలు బీజేపీని రానున్న ఎన్నికల్లో లక్ష్యంగా చేసుకోవడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నాయి.

– జి.రాజశుక, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE