మొంధా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు… ముఖ్యంగా కోస్తా జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. శ్రీకాకుళం మొదలు తిరుపతి దాకా జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత వల్ల ప్రాణ నష్టం తగ్గినప్పటికి మింటిని-మంటిని ఏకం చేస్తూ కురిసిన భారీ వర్షాల కారణంగా కొద్ది రోజులలో చేతికి అందవలసిన పంట నీటిపాలైంది. మొంథా రైతన్నను గట్టి దెబ్బతీసింది. మాగాణి, మెట్ట, ఉద్యానవన… ఇలా అన్ని రకాల పంటలు తుపాను దెబ్బకు సర్వనాశనమయ్యాయి. కంకి, పొట్ట దశలో ఉన్న వేలాది ఎకరాల వరి నీట మునిగింది. తుపాను తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తీర ప్రాంతంలో రాకాసి అలలకు రహదారులు ధ్వంసమయ్యాయి.. భారీ వర్షాలతో నదులు, చెరువులు ఉప్పొంగి గ్రామాలను ముంచెత్తాయి. రహదారులకు గండ్లు పడి అనేక గ్రామాల మధ్య రాకపోకలు స్థంభించాయి.
రాష్ట్రంలో, ముఖ్యంగా మరో తుపాను (మొంథా) పీడ కల మిగిల్చింది. ప్రాణ నష్టం తప్పినా, రహదారులు, విద్యుత్ స్తంభాలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలకు, పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, నంద్యాల జిల్లాలు కకావికలమయ్యాయి.
తుపాన్ తీరం దాటిన తర్వాత కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహించాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒడిశాలోని భగలటి నుంచి వరద పోటెత్తడంతో బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది. డొంకూరు వద్ద కాజ్వేపై నీరు చేరడంతో సమీపంలోని నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెల్లిగెడ్డకు భారీగా వరదనీరు చేరడంతో సమీపంలోని గ్రామాల్లోని పొలాలను వరద ముంచెత్తింది. ఎన్‌టిఆర్ జిల్లాలోని మున్నేరు, బుడమేరు, పాలేరు, వైరాయేరు, కట్టలేరు పొంగిపొర్లాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఏలేరు, తాండవ, ఎర్రకాలువ, బురద కాలువలు పొంగాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ, నల్లమాడ, కందేరు, వల్లేరు వాగు, పెద్ద మద్దూరువాగు, చిన్న చెరువు, ఇసుకవాగు, రాజుగారి పాలెం వాగులలో వరదల వెల్లువెత్తాయి. అనకాపల్లి జిల్లాలోని శారదా నది, అవకాలువ, పెద్దేరునది, జాగారంగెడ్డ, సర్పా, వరాహ, ఉప్పుటేరు, మెలిపాక కాలువ, రావణాపల్లి రిజర్వాయర్ పొంగాయి. చోడవరం నియోజకవర్గం భోగాపురం ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా శారదా నది ఉగ్రరూపం దాల్చింది. తాచేరు, పెద్దేరు, బొట్టేరు కలయికతో నీటి ప్రవాహం పెరగడంతో గట్టు పెద్దఎత్తున కోతకు గురైంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని భవనాసి, కందూనది, నల్లవాగు, వక్కిలేరు, చామకాల్వ, మదలిలేరువాగు, సిద్ధారం, మంచినీళ్ల వాగు, రాళ్లవాగు, గాలేరు పొంగాయి. కడప జిల్లాలో కుందూ నది ఉగ్రరూపం దాల్చింది. చాపాడు మండలం సీతారామపురం వద్ద వంతెనపై నుంచి నీరు ప్రవహించి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాలోని పెన్న, మన్నేరు. నక్కల వాగు, లింగసముద్రం, అలుగువాగు, కల్లూరు చెరువు, పైడేరువాగు, కండలేరు, పందలవాగు, పొట్టేళ్లకాలువ పొంగాయి.
మొంథా తుపాను ప్రభావంతో పంటలు భారీగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరితోపాటు మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పెసర పంటలకు అపారనష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఈ ఖరీఫ్‌లో 72.87 లక్షల ఎకరాల్లో సాగవగా… అందులో 38.96 లక్షల ఎకరాల్లో వరి ఉంది. అందులోనూ, దాదాపు 31.14 లక్షల ఎకరాలు తుపాను ప్రభావిత జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. 243 మండలాల పరిధిలోని 1.38 లక్షల హెక్టార్లలోని 2.96 లక్షల మెట్రిక్ టన్నుల పంటలు దెబ్బతిన్నాయి.
అరటి, బత్తాయి వంటి తోటలు ఈదురుగాలులకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిరప, పత్తి, కంది, అరటి, బొప్పాయి, వేరుశనగ వంటి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ అన్ని జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల, జిల్లాల వరకూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరి సాగుదారులు పూర్తిగా నష్టపోయారు. డెల్టా ప్రాంతంలో వరి పైరు నేల కొరిగింది. వరి ప్రస్తుతం కంకుల దశలో ఉంది. మరో పదిహేను రోజుల్లో పంట చేతికి వస్తుందనుకుంటున్న దశలో నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. ముంపునీరు దిగిపోయిన తర్వాత సత్వర యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ తుపాను ప్రభావం దిగుబడులపై ఎక్కువగా ఉంటుందని, ఎకరాకు కనీసం 5 నుంచి 8 బస్తాలు దిగుబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ధాన్యం రంగుమారడం, తేమశాతం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ధాన్యానికి మొలకలొచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
రూ.5,265 కోట్లు నష్టం
మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రంలో రూ.5,265 కోట్ల మేర నష్టం సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుపాను ప్రభావం చూపింది. వ్యవసాయ రంగానికి సంబంధించి 1.38 లక్షల హెక్టార్లలోని 2.96 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. రూ.829 కోట్ల మేర రైతులు నష్టపోయారు. మొత్తం 1.74 లక్షల మంది రైతులపై తుఫాన్ ప్రభావం పడిరది. 12,215 హెక్టార్లలో రూ.40 కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 23,979 మంది రైతులకు నష్టం వాటిల్లింది. ఆక్వా రంగంలో 32 వేల ఎకరాల్లోని రూ.514 కోట్ల విలువైన పంటను నష్టపోయారు. పట్టు పరిశ్రమ-65 కోట్లు నష్టం వాటిల్లింది. పశుసంవర్ధక శాఖకు రూ.71 లక్షలు నష్టం వాటిల్లగా.. రాష్ట్రవ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయి.
రహదారులు, భవనాల శాఖ పరిధిలోని 4,794 కిలోమీటర్ల రహదారులు, 311 కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ నష్టం రూ.2,3774 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 18 జిల్లాల్లోని 862 కిలో మీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ శాఖకు రూ.454 కోట్ల నష్టం జరిగింది. 48 పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. వీటి పునరుద్ధరణకు రూ.109 కోట్లు ఖర్చవు తుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,817 విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా..26,575 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. 429 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ శాఖకు రూ.19 కోట్ల నష్టం జరిగింది. జలవనరుల శాఖకు రూ.234 కోట్ల నష్టం.
ముందస్తు జాగ్రత్తలతో ప్రాణనష్ట నివారణ
అధికారుల ముందు జాగ్రత్త చర్యల ఫలితంగా ప్రాణ నష్టాన్ని నివారించారు. చలిగాలుల తీవ్రతకు అద్దంకి నియోజకవర్గంలో ఇద్దరు మరణించారు. 3,175 మంది గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 2,130 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి… ప్రజలకు అత్యవసర వైద్య సేవలందించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి… 1.16 లక్షల మందిని తరలించి, వారికి భోజన ఏర్పాట్లు చేశారు.297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, ఆయా ప్రాంతాల్లో దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. రహదారులపై విరిగిపడిన 380 చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించారు.
తుపాను బాధిత కుటుంబానికి 25 కిలోల వంతున బియ్యం, మత్స్య, చేనేత కార్మికులకు 50 కిలోల చొప్పున ప్రభుత్వం అందచేసింది. కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో పంచదార అందిం చారు. ఈ మేరకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 14,415 రేషన్ షాపుల్లో లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3424 మెట్రిక్ టన్నుల పంచదారతో పాటు ఇతర నిత్యావసరాలను పంపిణీ చేశారు.
ప్రణాళికాబద్ధ కార్యాచరణతో….
సాంకేతిక అనుసంధానత, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణతో ‘మొంథా’ తుపాను నుంచి నష్టాలను, ముఖ్యంగా ప్రాణ నష్టం తగ్గించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇరవై తొమ్మిదేళ్ల క్రితం (1996) తుపానుతో కోనసీమ అల్లల్లాడిన ప్రాంతంలోనే ప్రస్తుత తుపాను తీరం దాటినప్పటికీ, ముందస్తు చర్యలతో నష్టాన్ని నివారించగలిగామని చెప్పారు.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్