ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై గర్జిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. ఒకప్పుడు భద్రంగా భావించిన రాత్రి బస్సు ప్రయాణం, ఇప్పుడు భయంకర కలగా మారింది. వీటిని ‘మృత్యు శకటాలు’ అని పిలవడం అతిశయోక్తి కాదు. తరచూ ఘోర ప్రమాదాలు, దగ్ధవుతున్న బస్సులు, వాటిలోని ప్రయాణికుల సజీవ దహనాలు అటు బస్సుయాజమాన్యాలు, ఇటు అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
అక్టోబర్ 24 తెల్లవారుజామున కర్నూలు వద్ద సంభవించిన బస్సు దగ్ధం దేశాన్ని కుదిపేసింది. ఈ దుర్ఘటనలో ద్విచక్రవాహనచోదకుడు సహా 20 మంది చెందారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొని, దానిని దాదాపు 300 మీటర్ల దూరం లాక్కెళ్లింది. గంటకు వందకిలోమీటర్లకు పైగా వేగంగా వెళుతున్న బస్సు కింద ద్విచక్రవాహనం చిక్కుకుంది. బస్సు డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగి, నిమిషాల్లోనే బస్సు అగ్నికి ఆహుతైంది. మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య బస్సును ఆపి, తోటి డ్రైవర్‌ను నిద్రలేపి, ఇద్దరూ కలిసి వాటర్ బబుల్స్‌తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాకపోవడంతో బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. తలుపులను తెరవకుండానే వారిద్దరు పరారయ్యారు. ఫలితంగా తలుపు తెరుచుకోక ప్రయాణికుల్లో 19 మంది సజీవదహనం అయ్యారు. ద్విచక్రవాహన చోదకుడు (శివశంకర్) అంతకుముందే మరణించాడు. బస్సులో డ్రైవర్లు సహా మొత్తం 41 మంది ఉన్నారని అధికారులు నిర్ధారించారు. మృతుల్లో తెలంగాణకు చెందినవారు ఆరుగురు, ఆంధప్రదేశ్‌కి చెందిన ఏడుగురు, కర్ణాటక, త•మిళనాడుకు సంబంధించి ఇద్దరేసి, బీహార్, ఒడిశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. అర్ఘ బంధోపాధ్యాయ, మేఘనాధ్, చందన, సంధ్యా రాణి, అనూష, గిరి రావు (తెలంగాణ) జి ధాత్రి, రమేష్, అనూష, శశాంక్, మావత, శ్రీనివాస్ రెడ్డి, త్రిమూర్తులు (ఆంధప్రదేశ్), ఫిలోమెన్ బేబీ, కిషోర్ కుమార్(కర్ణాటక) ప్రశాంత్, యువన్ శంకర్ రాజ్ (తమిళనాడు) అమృత్ కుమార్ (బిహార్) కెంగువా దీపక్ కుమార్ (ఒడిశా) మృతుల్లో ఉన్నారు. ఈ బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ శివ కూడా ప్రమాద మృతుల్లో ఉన్నాడు. అయితే, బస్సు ఢీకొట్టకముందే బైకర్ శివ అతిగా మద్యం తాగి ఉండటంతో బైక్ డివైడర్ ను ఢీకొని మరణించాడు.
విపత్తుగా మార్చిన మద్యం మత్తు
బస్సు ప్రమాదానికి కారణమైన శివశంకర్ మద్యం తాగి వామనం నడిపినట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. అతను తన స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి ఒక చోట మద్యం కొనుగోలు చేసిన వీడియోలను పోలీసులు సేకరించారు. కానీ, ఈ ఘోర ప్రమాదానికి ఇది ఒక్కటే కారణమని చెప్పలేం. కేవలం బైక్ ఢీకొనడమే అంత పెద్ద అగ్ని ప్రమాదానికి కారణం కాకపోచ్చని, బస్సు డిజైన్‌లో లోపం, దానికి అక్రమంగా మార్పులు, చేర్పులు, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ప్రమాదం, రహదారులు, రవాణాశాఖ అధికారుల నిర్లక్ష్యం… లాంటివి కారణం కావచ్చంటున్నారు..
ఈ బస్సు మృత్యు శకటమే..!!
ప్రమాదం బారిప పడిన బస్సు గురించి పోలీసుల దర్యాప్తులో బయటపడిన అంశాలు క•లవరపరు స్తున్నాయి. ఈ బస్సు దాదాపు మృత్యు శకటమే. ఇలా దగ్ధం కాకపోయినా, మరో విధంగానైనా ఈ బస్సు అపాయకరమే. ఏదో ఒక రకంగా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే వాహనం. ఈ బస్సుపై రూ.23,120 విలువ గల 16 ఛలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. జరిమానా చెల్లించకుండానే బస్సు తెలుగు రాష్ట్రాల మధ్య, ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తోంది. ఇంతగా నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నా, అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తు న్నారనే వైనం ఈ ప్రమాదంతో తేటతెల్లమయ్యింది. డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అయిదవ తరగతి విద్యార్హత మాత్రమే కలిగిన అతను, 10వ తరగతి చదివినట్లు నకిలీ సర్టిఫికెట్‌తో హెవీ లైసెన్స్ పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది.
మరోవైపు.. ఆల్‌ఇండియా పర్మిట్ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. తాజా ఘటనతో.. భారీగా లొసుగులు బయటపడుతున్నాయి. ఈ బస్సు డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్ కాగా, కావేరి ట్రావెల్స్ అక్కడే ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంది. బస్సుకు ఒడిశాలోని రాయగడలో మార్పులు, చేర్పులతో ఫిట్‌నెస్ చేయించింది. కేవలం 43 సీట్లకు అనుమతి పొంది, వాటిని స్లీపర్‌గా మార్చి నడుపుతోంది. ఇక, ప్రమాదం బారిన పడిన బస్సు 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకుంది. 2023లో ఎన్‌ఓసీతో డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్ మార్పు చేసుకుంది. రిజిస్ట్రేషన్ మార్చి స్లీపర్ కోచ్‌గా అక్రమానికి తెరలేపి నడుపుతోంది.
తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు
ప్రస్తుత బస్సు దుర్ఘటనతో ఆర్టీఏ అధికారులు మత్తు వీడారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. అత్యవసర ద్వారాలు మూసి ఉండడం, సుదూర ప్రయాణాలకు కూడా ఒకే డ్రైవర్ ఉండడం, ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేయక పోవడం, డమ్మీ ఫైర్ పరికరాలు ఉండడం వంటి లోపాలు బయటపడుతున్నాయి. అలాంటి కొన్ని బస్సులు అక్కడికక్కడే సీజ్ చేశారు. మరికొన్నిటికి చలానాలు విధించారు.
ఈ పరిస్థితి ఒక్క కర్నూలు బస్సుకే పరిమితం కాదు. తరచూ దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు హడావిడి అప్పటికే పరిమితం పరిపాటిగా మారింది. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులను రోడ్ల మీదకు రాకుండా శాశ్వత చర్యలు తీసుకొనే ప్రయత్నాలు మాత్రం లేవు.
ప్రభుత్వాల సాయం
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుంటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల వంతున సాయం ప్రకటించాయి. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి మరణించిన వాళ్ల కుటుంబాలకు రూ.2 లక్షలు వంతున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.
బస్సుల డిజైన్లలో లోపం
స్లీపర్ బస్సులు ప్రయాణికులకు సౌకర్యవంతంగా తోస్తున్నప్పటికీ, వాటి డిజైన్ మాత్రం ప్రాణాంతకంగా మారుతోంది. ప్రధానంగా స్లీపర్ బస్సుల్లో బెర్త్‌ల మధ్య గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండడంతో, ఇలాంటి ఆపద సమయంలో ప్రయాణికులు బయటకు రాలేకపోతున్నారు. బెర్త్‌ను అనుసంధానించే గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండటంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లగలిగే అవకాశం ఉంటోంది. ఇలాంటి అగ్ని ప్రమాదాలప్పుడు రెప్పపాటు కాలం ఆలస్యం కూడా ప్రాణాంతకమే. కానీ, స్లీపర్ బస్సుల్లో ఇరుకైన మార్గాలు, తలుపులు బ్లాక్ కావడం,
మితిమీరిన వేగం ప్రాణాంతకం
గతంలోని చాలా ప్రమాదాల మాదిరిగానే ప్రస్తుత దుర్ఘటనకు కూడా మితిమీరిన వేగమే కారణమని అధికారులు నిర్థారించారు. 2022లో జరిగిన మొత్తం ప్రమాదాల్లో 72 శాతం, 2023లో 68 శాతం దుర్ఘటనలకు అతివేగమే కారణమని కేంద్ర రహదారులు, రవాణా శాఖ గణాంకాల పేర్కొంటు న్నాయి. దూర ప్రయాణ బస్సులు, ట్రక్కులు రాత్రి సమయంలోనే ఎక్కువగా నడవడం, డ్రైవర్లకు విశ్రాంతి లోపించి నిద్రమత్తుతో వాహనాలు నడపడం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణాలుగా చెబుతున్నారు. వీలైనంత తొందరగా గమ్య స్థానం చేరుకోవాలంటూ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల యజమానులు డ్రైవర్లపై ఒత్తిడి పెడుతూండటం కూడా ప్రాణాలతో చెలగాటంగా మారుతోందని అంటున్నారు.
భద్రతా ప్రమాణాల జాడేది?
చాలా ప్రైవేట్ బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉండటం లేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు పనిచేయడం లేదు. ఫైర్ ఎక్స్ టింగ్వైజర్లు కూడా పనిచేయక పోవడం సాధారణంగా మారింది. కొన్ని బస్సుల్లో వాటిని పోలిన డమ్మీ ఫైర్ ఎక్స్ టింగ్వైజర్లు పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. చూసేవాళ్లకు అవి ఫైర్ సేఫ్టీ పరికరాలుగా కనిపించినా.. ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అవి పనిచేయవు. ఇక, ప్రాథమిక చికిత్స బాక్సులు, పరికరాలు బస్సుల్లో కనిపించక దశాబ్దాలు దాటిపోయింది. కనీసం దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే, రాత్రివేళ ప్రయాణించే బస్సుల్లో కూడా ప్రాథమిక చికిత్స కిట్‌లు ఉండటం లేదు. ప్రయాణికులను ఆకర్షించేందుకు బస్సులను లైట్లు, డిజైన్‌లతో అలంకరిస్తున్నారు తప్ప భద్రతపై మాత్రం శ్రద్ధ పెట్టడం లేదన్నది నిర్వివాదాంశం. ఈ నిర్లక్ష్యానికి మూలం అధికారుల చూసీ చూడనట్లు వ్యవహరించే తీరు, తేలికపాటి తనిఖీలు కూడా మరో కారణమని అంటున్నారు. తనిఖీలు అవసరమైనంత స్థాయిలో జరగడం లేదని సాక్షాత్తూ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అంగీకరించారు. తనిఖీలు కఠినంగా చేస్తే అధికారులు తమను వేధిస్తున్నారని వాహనదారులు ఫిర్యాదులు చేస్తున్నారని, అందుకే కాస్త తగ్గించామని, కానీ, ఇకపై మాత్రం అలా ఉండదని ఓ హెచ్చరిక అయితే జారీచేశారు.
కొత్త నిబంధనలు అమలవుతాయా?
ఈ ఘటనలతో కదిలిన ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందిస్తోంది. ఇకపై టూరిస్ట్, ట్రావెల్స్, ఆర్టీసీ, విద్యాసంస్థలు వంటి అన్ని కొత్త బస్సుల్లో అగ్ని ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించే ఫైర్ అలర్ట్ సిస్టమ్, మంటలు ఆర్పేందుకు స్పింక్లర్లు, ఫైర్ సిలిండర్లు ఏర్పాటు తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. అలాంటి బస్సులకే ఫిట్ నెస్ సర్టిఫికెట్ లు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవస్థలు సరిగా అమలు చేసినప్పుడే వాహన రిజిస్ట్రేషన్ అనుమతిస్తారు.
పాత బస్సుల్లో కూడా దశలవారీగా ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిట్‌నెస్ రెన్యువల్ సమయంలో ఫైర్ సేఫ్టీ వ్యవస్థ లేకపోతే రెన్యువల్ ఇవ్వబోమని రవాణాశాఖ స్పష్టం చేసింది. అలాగే, సింగిల్ డ్రైవర్‌లతో దూర ప్రయాణాలను నిషేధించే ఆలోచన కూడా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కర్నూలు చిన్నటేకూరులో అగ్నికి ఆహుతైన ఆ బస్సు కేవలం ఒక వాహనం కాదు.. అది మన వ్యవస్థల వైఫల్యానికి ప్రతీక. నిబంధనలు ఉన్నా అమలు కావడం లేదు. తనిఖీలు ఉన్నా నిజాయితీ కనిపించడం లేదు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉన్నా బస్సులు మంటల్లో దహనమవుతున్నాయి. నిబంధనలకు లోబడి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తేనే రోడ్డు ప్రయాణం సురక్షితమవుతుంది. లేకపోతే ప్రతి రాత్రి రోడ్లపై మరో మృత్యు శకటం ప్రయాణం మొదలవుతుంది.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068