దీపావళి వచ్చిదంటే కాలుష్యం పెరగిపోతోందంటూ గగ్గోలు పెట్టడం కొన్ని వర్గాలకు ఆనవాయితీగా మారింది. కాలుష్యానికి కారణం టపాకాయలేనంటూ ఏటా ఒక ప్రణాళిక ప్రకారం వీరంతా దుష్ప్రచారం మొదలు పెడతారు. పర్యావరణ సంరక్షకులుగా చెప్పుకునే వీరంతా కేవలం దేశ రాజధాని ఢిల్లీనే ప్రధానంగా తమ ప్రచారానికి ఎంచు కుంటున్నారు. కానీ కాలుష్యానికి కారణం ఒక్క దీపావళేనా? ఇతర పర్యావరణ కారణాలను ఎందుకు దాస్తున్నారు అనే పరిశీలన అవసరం. ఇక్కడ గమనించాల్సి విషయం ఏమిటంటే కాలుష్యానికి టపాకాయలు కాల్చడం అనేది ఒక కారణం మాత్రమే. కానీ అసలు సమస్య ఈ శీతాకాలంలోనే జరిగే పంట వ్యర్ధాల దహనం. ఢిల్లీ  పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, ‌హరియాణాలలో అక్టోబర్‌, ‌నవంబర్‌ ‌నెలల్లో రైతులు పంట వ్యర్ధాలను దహనం చేస్తూ ఉంటారు.

ఈ సంవత్సరం సుప్రీంకోర్టు దీపావళి సందర్భంగా గ్రీన్‌ ‌క్రాకర్స్ ‌వాడకాన్ని మాత్రమే అనుమతించింది. ఈ నకిలీ ఉదారవాదులు దీనిని అవకాశంగా తీసుకుని తమ హిందూ వ్యతిరేక ఎజెండాను ఎప్పటి లాగే అమలు చేశారు.

ఢిల్లీలో చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొద్ది నెలల వ్యవధిలోనే కాలుష్య నియంత్రణ కోసం అనేక చర్యలను చేపట్టింది ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వం. ఇవేవీ ఈ విమర్శకులకు పట్టవు. ఇన్నేళ్లుగా లేని కాలుష్య సమస్య ఈ ఎనిమిది నెలల్లోనే కాలుష్యం ప్రారంభమైంది అనే రీతిలో విమర్శల దాడి జరుగుతోంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి నిజాయితీగా కొన్ని విషయాలను పరిశీలించాలి.

అంత హిందూ వ్యతిరేక ఎందుకో?

ఉత్తరాది రాష్ట్రాల్లో దీపావళి అంటే నాలుగు రోజుల పండుగ. దీపావళి నాలుగు రోజులలో ప్రధానంగా కనిపించేది బాణసంచా. అంటే ధంతేరాస్‌, ‌కాశీ చౌదాస్‌, ‌లక్ష్మీపూజ, హిందూ నూతన సంవత్సరం. వీటిలో టపాకాయలను లక్ష్మీపూజ రోజునే ఎక్కువగా కాలుస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల మధ్య జరుగుతుంది. మిగతా రోజుల్లో కాల్పడం కొంత తక్కువే. కానీ రోజంతా టపాకాయలు కాల్చి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారనే ఆరోపణలే ఎక్కువ.

 దీపావళితో మాత్రమే ఢిల్లీ వాతావరణం అంతా కలుషితం అవుతుందనే దుష్ప్రచారం ఎందుకు? కేవలం దీపావళి రోజునే టపాకాయలు కాలుస్తున్నారా? మతాలకు అతీతంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో టపాకాయలు కాల్చడం లేదా? రాజకీయ ర్యాలీలు, విజయోత్సవాలు, ఇతర సంబరాల్లో ఉపయోగించే బాణాసంచా సంగతేంటి? ఇటీవల ఉత్తర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం కాలుష్య నివారణ కోసం బక్రీద్‌ ‌సందర్భంగా జంతువులను బలి ఇవ్వడానికి మార్గదర్శకాలను తీసుకొచ్చింది. దీంతో నకిలీ ఉదారవాదులు గగ్గోలు పెట్టేశారు. ప్రాంతం, మతం, కులం, మతంతో సంబంధం లేకుండ, అన్ని రకాల కాలుష్యాల పట్ల ఒకే విధమైన ఆందోళన ఎందుకు ఉండదు? కేవలం హిందువుల పండుగలను నిందిండానికి మాత్రమే వీరి గళాలు ఎందుకు పరిమితం అవుతున్నాయి? అంటే వీరి ఆందోళన పర్యావరణం కోసం కాదు. తమ హిందూ వ్యతిరేక తను చాటుకోవడానికి దీపావళి ఒక సందర్భంగా కనిపిస్తుంది.

వాస్తవానికి కాలుష్య నియంత్రణ కోసం అనేక చర్యలు, చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సక్రమంగా అమలవుతున్నాయా? ముఖ్యంగా కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం-1981 (గాలి), పర్యావరణ పరిరక్షణ చట్టం – 1986 (ఈపీఏ), నీటి (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం-1974 ఉన్నాయి. ఇవన్నీ సక్రమంగా అమలు చేస్తే కాలుష్యం సమస్య ఎక్కడ ఉంటుంది?

పడిపోయిన గాలి నాణ్యత

ఢిల్లీలో దీపావళి వేడుకల తర్వాత రోజు ఉదయం 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 347గా నమోదైంది. దీనిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ‘చాలా ప్రమాదకరం’ (వెరీ పూర్‌) ‌కేటగిరీగా వర్గీకరించింది.

దీపావళి సాయంత్రం 4 గంటలకే ఢిల్లీలో ఏక్యూఐ 345గా ‘వెరీ పూర్‌’ ‌కేటగిరీలో నమోదైనట్లు సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ ‌క్వాలిటీ అండ్‌ ‌వెదర్‌ ‌ఫోర్‌కాస్టింగ్‌ అం‌డ్‌ ‌రీసెర్చ్ ‌వెల్లడించింది. పండుగకు ముందు 156.6గా ఉండే ఇప్పుడు దాని కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉందని బోర్డు తెలిపింది. కలుషితమైన గాలిని ఎక్కువసేపు పీల్చడం వల్ల తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సీపీసీబీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక కాలుష్య కారక సూక్ష్మ ధూళికణాల పీఎ2.5 స్థాయిలు ఐదేళ్ల గరిష్ఠానికి పెరిగినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విశ్లేషణలో తేలింది. దీపావళి తర్వాత 24 గంటల్లో సగటు పీఎం2.5 సాంద్రత ఒక క్యూబిక్‌ ‌మీటర్‌కు 488 మైకోగ్రాములకు చేరింది. పండగకు ముందు ఇది 156.6 మైకోగ్రాములుగా ఉంది. ఢిల్లీలో 2021 నుంచి ఏటా దీపావళి ముందు, ఆ తర్వాత సగటు పీఎం2.5 స్థాయులు పెరిగాయి. 2021లో 163.1 నుంచి 454.5కి, 2022లో 129.3 నుంచి 168కి, 2023లో 92.9 నుంచి 319.7కి, 2024లో 204 నుంచి 220కి పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దిద్దుబాటు చర్యలు

కాగా దీపావళికి ముందు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొంత ఫలితాలిచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నగరంలో కాలుష్యం సగానికి సగం తగ్గింది. గతేడాది వాతావరణంలో ‘పీఎం-2.5’ స్థాయి గతేడాది 778 పాయింట్లకు చేరు కోవడంతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కాలుష్య నగరంగా ఢిల్లీని గుర్తించారు. ఈ పరిస్థితిపై పర్యావరణ పరిరక్షణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం వాహనాల రాకపోకలను నియంత్రించడం, డీజిల్‌ ‌వాహనాలను నిషేధించడం తదితర చర్యల వల్ల కొంతమేరకు కాలుష్యం తగ్గింది. ప్రభుత్వం సకాలం తీసుకున్న చర్యల వల్ల వాతావరణంలో కాలుష్యం 200 పాయింట్ల స్థాయికి దిగివచ్చింది. గ్రాప్‌ 2 ‌చర్యలను ఢిల్లీలో అమలులోకి తెచ్చింది. ఈ చర్యల్లో భాగంగా నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు అమలులోకి రానున్నాయి. డీజిల్‌ ‌జనరేటర్లు, కట్టెల పొయ్యిలపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది.

నగరంలోని వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు శీతాకాలంలో చలి బాగా పెరగడంతో కాలుష్యం పెరుగుదల తీవ్రమైనట్లు అధికారులు వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయులు తీవ్రమైన జోన్‌లోకి ప్రవేశిస్తున్నందున నియంత్రణ చర్యలను వేగవంతం చేస్తున్నామని వివరించారు.

తగ్గని వ్యర్థాల దహనం

హరియాణా, పంజాబ్‌లలో వ్యర్థాలను తగులపెట్టడం వల్ల ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ప్రతిఏటా 3.50 కోట్ల టన్నుల పంట దుబ్బలను తగులబెడతారు. ఇలా తగుల బెట్టడంపై 2015 సంవత్సరం నుంచే దేశవ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ ఈ రెండు రాష్ట్రాల రైతులు వినిపించుకోవడం లేదు. ‘పంట దుబ్బలను మంటపెట్టకుండా వాటి రీసైక్లింగ్‌ ‌కోసమో, మరో అవసరానికి ఉపయోగించేందుకు వాటిని మేము ఎక్కడికి తీసుకపోగలం? ఏం చేయగలం? దుబ్బను తరలించేందుకు కూడా డబ్బులు ఖర్చుగావా? అని వాదిస్తున్నారు.

ఉత్తరాది నుంచి వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా దుబ్బ తగులబెట్టిన కాలుష్యం నగరానికి వస్తోందని నాసా ఉపగ్రహం ఇటీవల తీసిన ఫొటోలు బయటపెట్టాయి.

కాగా వరదలు ,పంటల ఆలస్యం కారణంగా పంజాబ్‌, ‌హరియాణాలలో పంట వ్యర్థాలను తగలబెట్టే సంఘటనలు 77.5 శాతం తగ్గినప్పటికీ.. ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగానే ఉందని ఎన్‌సీఆర్‌ఐ ‌చెబుతోంది.

గ్రీన్‌ ‌క్రాకర్స్ ‌ఫలించాయా?

ఈసారి కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ ‌క్రాకర్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. పైగా గతేడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన 296 ఏక్యూఐతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రీన్‌ ‌క్రాకర్స్‌ను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు. సాధారణ టపాసులపై పూర్తి నిషేధం విధిస్తే అక్రమ రవాణా పెరిగి, మరింత హానికరమైన వాటిని కాలుస్తారని, అందుకే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే గ్రీన్‌ ‌క్రాకర్స్‌కు అనుమతి ఇస్తున్నామని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కాలుష్య తీవ్రత తగ్గకపోవడం గమనార్హం.

సాధారణ టపాసులతో పోలిస్తే గ్రీన్‌ ‌క్రాకర్స్ 30 ‌శాతం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. వీటిని సీఎస్‌ఐఆర్‌-‌నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇం‌జినీరింగ్‌ ‌రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది. వీటిలో అల్యూమినియం, బేరియం వంటి హానికర రసాయనాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ఢిల్లీలో కాలుష్య తీవ్రత తగ్గకపోవడం క్షేత్రస్థాయిలో నిబంధనల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఢిల్లీలో కృత్రిమ వర్షాలు

దేశ రాజధాని ఢిల్లీలో అతి త్వరలోనే కృత్రిమ వర్షాన్ని కురిపించే అవకాశం ఉంది. ఈ మేరకు తొలి సారిగా జరిగిన ప్రయత్నాలు విజయవంతం అయినట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు. దీపావళి తర్వాత వాయు కాలుష్యాన్ని గణనీయ స్థాయిలో తగ్గించాలంటే, ప్రజలకు ఊరట కల్పించా లంటే కృత్రిమ వర్షాన్ని కురిపించాల్సిందే. గత కొన్ని దశాబ్దాల్లో ఇక్కడ అధికారంలో ప్రభుత్వాలన్నీ కృత్రిమ వర్షం ప్రతిపాదనపై చర్చించాయి. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేకపోయాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి చివరివారంలో ఢిల్లీ అధికార పీఠాన్ని బీజేపీ చేపట్టింది. పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంజీందర్‌ ‌సింగ్‌ ‌సిర్సా కృత్రిమ వర్షాన్ని కురిపించి తీరుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్‌ ‌మూడోవారంలో భారత వాతావరణ శాఖ ఈ శుభవార్త చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్‌ ‌సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని మంజీందర్‌ ‌సింగ్‌ అప్పట్లో వెల్లడించారు. ఈక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులనూ ఆయన పొందారు.

కాగా కృత్రిమ వర్షాలతో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇందు కోసం ఉపయోగించే సిల్వర్‌ అయోడైడ్‌ ‌వంటి రసాయనాల వల్ల పర్యావరణం, నేల, నీరు, జలచరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వీటి వల్ల శ్వాసకోశ సమస్యలు, ఇతర ఆరోగ్య ప్రమాదాలు కలగొచ్చు.ఏదైనా ఒక ప్రాంతంలో కృత్రిమ వర్షాన్ని కురిపిస్తే చుట్టుపక్క ప్రాంతాల సహజ వర్షపాత చక్రానికి అంతరాయం కలుగుతుంది. దీని వల్ల ఇతర ప్రాంతాల్లో ఊహించని కరవులు, వరదలు సంభవించొచ్చు. వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలు ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. ఈ పద్ధతి ఎల్లప్పుడూ ఆశించిన స్థాయిలో వర్షపాతాన్ని అందించదు. కొన్ని సందర్భాల్లో అధిక వర్షపాతం వరదలు రావచ్చు. ఇంకొన్ని సార్లు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది. ఏమైనా పర్యావరణ పరిరక్షణ ఒక రాజకీయ ఆయుధంగా కాకుండా, పూర్తిగా ప్రజోపయోగం లేదా, పర్యావరణ శ్రేయస్సునే దృష్టిలో పెట్టుకోవాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. ఏ విధంగా చూసినా ఢిల్లీ పర్యావరణ కాలుష్యం గురించి మౌలిక వాస్తవాలను ఇంకాస్త పటిష్టంగా గమనించక తప్పదు.

క్రాంతిదేవ్‌ ‌మిత్ర

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE