ఆంధప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తన ప్రాధాన్యతను పెంచుకోడానికి పలువిధాలుగా కృషి చేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాకు మరింత దగ్గరయ్యేలా సంచార జాతుల సదస్సు, విశ్వకర్మ యజ్ఞం, ధన్వంతరి జయంతి, యజ్ఞం కార్యక్రమాలు నిర్వహించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి అందుతున్న అపారమైన సహకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక బహుముఖ వ్యూహాన్ని రూపొందించింది.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో విజయవాడలో అక్టోబరు 22న జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో చర్చించిన నాలుగు ప్రధాన అంశాలు… ‘మనసులో మాట’, ‘చేరువ’, ‘జనవారధి’, ‘మన జెండా.. మన వూరు’ కార్యక్రమాలు ప్రజలతో పార్టీ అనుబంధాన్ని పెంచుకోవడానికి వ్యూహాత్మక మార్గాన్ని నిర్దేశిస్తు న్నాయి. ఈ సమావేశం, ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడంపై దృష్టి సారించింది.
రాష్ట్రంలో సమన్వయంతో ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్డీయే కూటమి పిలుపు నివ్వడంతో పాటు, విజయానికి ఐక్యత అత్యంత అవసరమని, క్షేత్ర స్థాయిలో అన్ని భాగస్వామ్య పక్షాల మధ్య బలమైన సమన్వయం నెలకొనాలని మాధవ్ స్పష్టం చేశారు. స్థానికసంస్థల ఎన్నికలు కేవలం అధికార పీఠాన్ని అధిరోహించడానికి మాత్రమే కాక, గ్రామ స్థాయి నుంచి ప్రజల నాడిని, వారి మద్దతును తెలుసుకోవడానికి ఒక పరీక్ష వంటివి. అందుకే, ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే సాధారణ ఎన్నికలకు దిక్సూచిగా మారే అవకాశం ఉన్నందున, సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
క్షేత్ర స్థాయికి నాయకత్వం
పార్టీని పునాది స్థాయిలో పటిష్ట పరిచేందుకు ఒక నిర్దిష్ట కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా, నవంబర్ మొదటి వారంలో జిల్లా పదాధి కారులు ఎంపిక చేసిన మండలంలో కనీసం ఒక రోజు పర్యటన చేయాలని నిర్ణయించారు. మండల స్థాయిలోని కార్యకర్తలతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకోవడం, వారిలో ఉత్సాహాన్ని నింపడం, క్షేత్ర స్థాయిలో పార్టీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో సమీక్షించడం ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశం. నాయకత్వం క్షేత్ర స్థాయికి వెళ్లడం ద్వారా, కార్యకర్తలకు ఆత్మస్థైర్యం పెరిగి, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలుగుతారు.
కార్యకర్తలకు శికణ తరగతులు
సంస్థాగత బలోపేతం క్రమంలో శిక్షణ ప్రాధాన్య తను గుర్తిస్తూ, నవంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు జోన్ల వారీగా గ్రామస్థాయి కార్యకర్తలతో కార్య శాలలు నిర్వహించనున్నట్లు మాధవ్ వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్రంలో పార్టీ పాత్ర, ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే విధానాలపై ఈ కార్య శాలల్లో శిక్షణ ఇస్తారు.
గత విజయాలు, భవిష్యత్ లక్ష్యాలు
పార్టీ ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో 19 శాతం ఓటింగ్, గోదావరి జిల్లాల్లో 27 శాతం ఓటింగ్ సాధించిందని మాధవ్ గుర్తు చేశారు. ఈ గణాంకాలు పార్టీకి ఉన్న బలాన్ని, నిర్దిష్ట ప్రాంతాల్లో గల పట్టును సూచిస్తాయి. రాబోయే ఎన్నికల్లో ఈ శాతాన్ని మరింత పెంచడానికి, ప్రతి కర్యకర్త క్రియాశీలకంగా పనిచేయా లని ఆయన పిలుపునిచ్చారు.
ఆదోని మండల పరిషత్‌ను బీజేపీ కైవసం చేసుకోవడడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆదోని శాసనసభ్యుడు డాక్టర్ పార్థ సారథిని అభినందించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎంపీ పురందేశ్వరి ఇచ్చిన పిలుపు కూడా ఇదే లక్ష్యాన్ని నొక్కి చెప్పింది.
నాలుగు ప్రధాన కార్యక్రమాలు
పదాధికారుల సమావేశంలో కేవలం ఎన్నికల వ్యూహాలపైనే కాకుండా, ప్రజా సంబంధాలను పెంపొందించేందుకు నాలుగు ప్రధాన కార్యక్రమా లను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్ర మాలు పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు, ప్రజా సమస్యల పట్ల పార్టీకున్న నిబద్ధతను తెలియజేసేందుకు రూపొందించారు.
మనసులో మాట (మన్ కీ బాత్)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా చేసే ‘మన్ కీ బాత్’ ప్రసంగాన్ని కేవలం వినడానికే పరిమితం కాకుండా విద్యార్థుల•,యువతకు ఆ కార్యక్రమంపై క్విజ్ పోటీలు నిర్వహించడం ద్వారా వారిని ఆకర్షించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా మోదీ పాలనపై సానుకూల చర్చను సృష్టించడం లక్ష్యంగా పేర్కొన్నారు.
చేరువ
ప్రజా సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయం, పథకాల వివరాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం ద్వారా, కేంద్రం పట్ల విశ్వసనీయత పెరిగి, స్థానిక నాయకత్వానికి బలం చేకూరుతుందని అంటున్నారు.
జనతా వారధి
ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లేందుకు ‘జనతా వారధి’ ఒక చక్కడి వేదికగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా, బీజేపీ కార్యకర్తలు స్థానిక సమస్యల పరిష్కారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య వారధిగా నిలబడాలని చెప్పారు.
మన జెండా.. మన వూరు
జాతీయవాదాన్ని, పార్టీ గుర్తింపును పెంపొం దించేందుకు ప్రతి గ్రామంలో బీజేపీ పతాకాలను ఆవిష్కరించాలని నిర్ణయించారు. దీనికి అదనంగా, సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించడం ద్వారా పార్టీని దేశభక్తి, సమైక్యత అనే భావజాలంతో మరింతగా అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నాలు పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి దోహదపడతాయని భావిస్తున్నారు.
సామాజిక వర్గాల ఆదరణ
పార్టీ తన సంస్థాగత విస్తరణలో భాగంగా కేవలం రాజకీయ నాయకత్వంపైనే కాకుండా, రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలకు చేరువ కావడానికి ఒక బలమైన కార్యాచరణను అమలు చేస్తోంది. ఈ వ్యూహం పార్టీకి సామాజిక న్యాయం పట్ల, అట్టడుగు వర్గాల సంక్షేమం పట్ల గల నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి, పార్టీ కొన్ని ముఖ్య కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించింది.
నిర్దిష్ట వర్గాలపై దృష్టి
సంచార జాతులు: విజయవాడలో ప్రత్యేకంగా సంచార జాతుల సభను నిర్వహించడం ద్వారా, ఈ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెలికి తీయడానికి బీజేపీ ప్రయత్నించింది. ఈ వర్గాలకు సరైన గుర్తింపు, విద్య, ఉపాధి అవకా శాలు, భూమి హక్కులు వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొనాలని లక్ష్యంగా పెట్టుకుంది.
విశ్వకర్మలు: అమరావతిలో నిర్వహించిన విశ్వకర్మ యజ్ఞం కార్యక్రమం, ఈ వృత్తిదారులు, కళాకారుల వర్గానికి పార్టీ ఇస్తున్న గౌరవాన్ని, ప్రాధాన్యతను సూచిస్తుంది. తమ వృత్తులలో నైపుణ్యాన్ని పెంచుకోవడం, ఆర్థికంగా బలోపేతం కావడం వంటి అంశాలపై దృష్టి సారించడం ద్వారా వారి సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ కృషి చేస్తోంది.
ధన్వంతరి జయంతి
తిరుపతిలో ధన్వంతరి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా, నాయీ బ్రాహ్మణుల సమస్యలపై గళం విప్పింది. నాయీ బ్రాహ్మణులు తమ వృత్తితో పాటు ధన్వంతరి ఆయుర్వేదాన్ని కూడా అభ్యసించి ప్రచారం చేశారని పేర్కొంది. వారు బలహీనులు కాదని అత్యంత బలవంతులని పేర్కొంది. వీరి వృత్తుల్లోకి కార్పొరేట్లు చొచ్చుకు వచ్చి వారి జీవనోపాధికి గండికొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తూ వీరికి అన్ని రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా కృషి చేస్తామని పార్టీ హామీ ఇచ్చింది.
వెనుకబడినవర్గాల కోసం కూడా పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించడం, బీజేపీ సమ్మిళిత రాజకీయ వైఖరికి నిదర్శనం. గతంలోనూ రాజకీయ ప్రాధాన్యత లభించని ఈ వర్గాల సమస్యలను వెలికితీసి, వాటి పరిష్కారం కోసం గట్టి ప్రయత్నాలు చేయడం ద్వారా పార్టీ వారి అభిమానాన్ని, నమ్మకాన్ని పొంద గలిగింది. ఈ చర్యలు కేవలం ఎన్నికల వ్యూహంలో భాగంగా కాకుండా, పార్టీ సిద్ధాంత పరమైన సామాజిక న్యాయం లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి. ఇలా బీజేపీ తన రాజకీయ పునాదిని కేవలం అగ్రవర్ణాలకే కాకుండా, అన్ని అణగారిన వర్గాలకు విస్తరించడానికి కృషి చేస్తోంది.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్