అంతర్జాతీయంగా బంగారం వెండి ధరలు అనూహ్యంగా ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోతుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తున్న అంశం. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ఈ రెండు విలువైన లోహాల ధరలు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి. బంగారం కొనడం కలగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కారణం ఏమిటన్నది సామాన్యుడిలో సహజంగా ఉత్పన్నమయ్యే ప్రశ్న.
ప్రధానంగా వివిధ దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు బంగారం ధరలు పెరగడానికి కారణమన్నది సహజంగా చెప్పే మాట! ఇదే సమయంలో అమెరికా డాలర్ బలహీన పడటం, రాజకీయ వత్తిళ్ల నేపథ్యంలో యు.ఎస్. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాల నేపథ్యంలో మదుపర్లు సురక్షితమైన బంగారం కొనుగోలు వైపు మళ్లడం కూడా ఇందుకు మరో కారణం. అదీకాకుండా ట్రంప్ అనుసరిస్తున్న తలతిక్క విధానాల వల్ల యు.ఎస్. షట్‌డౌన్‌కు చేరుకుంది. ఇది కూడా మదుపర్లలో ఆందోళన కలిగించి, బంగారంవైపు మొగ్గు చూపేలా చేసిందని చెప్పవచ్చు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగారం కొనుగోలు సురక్షితమైనదిగా మదుపర్లు భావిస్తారు. అంతేకాకుండా డాలర్ ప్రమేయాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా భారత్, రష్యా, చైనాల కేంద్ర బ్యాంకులు పెద్దమొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్ విపరీతంగా పెరిగి ఈ లోహం ధరలు ఆకాశాన్నంటే రీతిలో పరుగులు పెడు తున్నాయని వాణిజ్య వర్గాలు చెప్పే మాట.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు వాణిజ్య యుద్ధాలకు దారితీస్తున్న క్రమంలో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా భారత్, చైనా వంటి అతిపెద్ద మార్కెట్లు కలిగిన దేశాలు ప్రపంచ వాణిజ్యంలో డాలర్ పెత్తనాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. డాలర్ బూచిని చూపిస్తూ అమెరికా ఆంక్షల పేరుతో అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలు ఇప్పుడు ప్రపంచ దేశాలకు గుదిబండగా మారి, వాటి వాణిజ్యాలను దెబ్బతిపడమే కాదు… ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యే పరిస్థితి ఏర్పడటంతో ఆయా దేశాలు మేల్కొని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.ఈ పరిణామాలతో సంప్రదాయ ద్రవ్య వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ నేపథ్యంలో డాలర్ వంటి ఫియట్ కరెన్సీల నుంచి బంగారం ఆధారిత ఈటీఎఫ్‌లు, డిజిటల్ బంగారం వంటి సాధనాల ద్వారా బంగారంపై పెట్టుబడులు పుంజుకోవడంతో ధరలపై ఒత్తిడి పెరుగుతోంది.
ఇక మనదేశం విషయానికి వస్తే ధరతో సంబంధం లేకుండా, పండుగలు, పబ్బాలకు బంగారాన్ని పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉదాహరణకు మొన్నటి ధన త్రయోదశి నాడు ఒక్కరోజే దేశవ్యాప్తంగా 46 టన్నుల బంగారం అమ్మకం నమోదు కావడం ఇందుకు గొప్ప ఉదాహరణ.దీని విలువ రూ.65వేల కోట్లు! అలాగే .15వేల కోట్ల మేర వెండి కొనుగోళ్లు జరిగాయి. గత ఏడాది ఇదేరోజున దేశంలో 25 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగా యి! అంటే ఈ ఏడాది 21 టన్నులు అధికం! తనవద్ద గల బంగారం నిల్వలను చూపుతూ, ప్రపంచాన్ని డాలర్‌తో శాసించాలనుకుంటున్న ట్రంప్ ఈ కొనుగోళ్లు చూస్తే ఒక్కసారి కళ్లు తేలవేయకుండా ఉండలేడు! అదీ భారత్ మార్కెట్ సత్తా!
పెరిగిన బంగారం ఈటీఎఫ్ లావాదేవీలు
పైన చెప్పిన కారణాల మాట ఎలా ఉన్నా బంగారం ధరలు ఇంత తీవ్ర స్థాయిలో పెరగడానికి బంగారం ఆధారంగా జరిగే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లావాదేవీలు విపరీతంగా పెరగడమ ప్రధాన కారణం! ఈటీఎఫ్ సాధారణంగా బంగారం, స్టాక్‌లు, బాండ్లు వంటి స్టాక్ ఎక్స్చేంజ్‌ల్లో ట్రేడ్ అయ్యే ఆస్తుల లావాదేవీలను ఎప్పటికప్పుడు గమనిస్తుం టుంది. దీనివల్ల ఇటువంటి వస్తురూపంగా ఉండే ఆస్తులు మదుపర్లకు మరింత ఎక్కువగా అందుబాటు లోకి వస్తాయి. నిజానికి మొట్టమొదటి బంగారం ఆధారిత ఈటీఎఫ్‌ను 2003లో ప్రవేశపెట్టారు. మొదట్లో ఇది సాధారణ మదుపర్లకు అందుబాటులో ఉండేది కాదు. దీనిపై పెట్టుబడులు పెట్టాలన్నా వీరికి చాలా కష్టసాధ్యంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చి బంగారం ఆధారిత ఈటీఎఫ్ అందరికీ అందుబాటులోకి రావడంతో, స్టాక్‌లు, బాండ్ల మాదిరిగానే బంగారాన్ని కూడా ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో నెలకొన్న అస్థిరత, వాణిజ్య యుద్ధాలు, కరెన్సీల విలువల హెచ్చుతగ్గుల నేపథ్యంలో మదుపర్లు ఈ బంగారం ఆధారిత ఈటీఎఫ్‌లపై పెట్టుబడులు పెట్టడం సురక్షితమని భావిస్తున్నారు.
బంగారం కొనుగోళ్లపై దృష్టి
డాలర్ పెత్తనాన్ని అడ్డుకోవడం కోసం, భారత్, రష్యా, చైనా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు డాలర్ రిజర్వ్ స్థానంలో బంగారాన్ని పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా ప్రకారం ఉద్గమిస్తున్న మార్కెట్ వ్యవస్థల్లో 2006లో 10,300 టన్నుల బంగారం నిల్వ లుండగా, 2025 నాటికి ఈ నిల్వలు ఏకంగా 161 శాతం పెరిగాయి. అంటే వివిధ ఆర్థిక వ్యవస్థలు క్రమంగా డాలర్ నుంచి దూరం కావడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ బంగారం కొనుగోళ్లను విస్తృతంగా చేపట్టడానికి కారణమని చెప్పాలి. అంతేకాదు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడి నేపథ్యంలో యుఎస్‌కు అనుకూలంగా ఉన్న బ్రిటన్, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా యు.ఎస్. డాలర్‌తో పాటు, బ్రిటిష్ పౌండ్, యూరో, జపనీస్ యెన్ కరెన్సీల వినియోగంపై ఆంక్షలు విధించడంతో మిగిలిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ ‘స్విఫ్ట్’ నుంచి రష్యాను మినహాయించడం, యుక్రెయిన్‌కు ఆర్థిక మద్దతు కల్పించేందుకు రష్యా కేంద్ర బ్యాంకు రిజర్వ్‌లను స్తంభింపజేయడం వంటి చర్యలకు యు.ఎస్. ఇతర యూరోపియన్ దేశాలు ఉపక్ర మించాయి. ఈ చర్యలు ఒక్కసారి ఉద్గమిస్తున్న మార్కెట్లను మేల్కొనేలా చేశాయి. ఫలితంగా ఈ దేశాలు కూడా బంగారం నిల్వలను పెంచుకోవడమే శ్రేయస్కరమని భావించి ఆదిశగా కొనుగోళ్లు మొదలు పెట్టాయి. ఆవిధంగా ఉద్గమిస్తున్న మార్కెట్లు డీ-డాల రైజేషన్ పక్రియను కొనసాగిస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలు ఆంక్షల పేరుతో తమకు తామే కష్టాలను కోరి తెచ్చుకుంటున్నాయని, ఈ ఉద్గమిస్తున్న ఆర్థిక వ్యవస్థలు భావిస్తున్నాయి. ఇక్కడ కేవలం బంగారం మాత్రమే సమస్య కాదు! రానున్న కాలంలో పశ్చిమ దేశాలు విధించే ఆంక్షల ప్రభావం పెద్దగా ఉండ బోదని కూడా వివిధ దేశాలు అంచనా వేస్తున్నాయి.
రష్యా, చైనాల ప్రభావం
2006లో రష్యా బంగారాన్ని అధికంగా కొనుగోలు చేయడం మొదలుపెట్టి 2014లో క్రిమియాను ఆక్రమించకున్న తర్వాత ఈ కొనుగోళ్లను మరింతగా పెంచేసింది. ఫలితంగా ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలున్న దేశాల్లో రష్యా ఒకటిగా నిలిచింది. ఇక చైనా కూడా తన వద్ద గల యు.ఎస్. బాండ్లను అమ్మకానికి పెట్టి, వచ్చిన మొత్తంతో బంగారం కొనుగోలు మొదలు పెట్టింది. ముఖ్యంగా అమెరికా విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో, డీ-డాలరైజేషన్ పక్రియకు ఇలా శ్రీకారం చుట్టింది. ఆ విధంగా యు.ఎస్. కరెన్సీపై ఆధారపడటం తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం రష్యా, చైనాలనుంచి పెద్ద ఎత్తున డిమాండ్ కొనసాగు తున్న నేపథ్యంలో ఈటీఎఫ్‌లపై మదుపర్ల డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉండబోతున్నదనేది సుస్పష్టం. అంటే బంగారం ధరల పెరుగుదల నిరంతరాయంగా కొనసాగుతుందని భావించాలి. ఈ రెండు కారకాలతో పాటు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్‌కు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పట్లో డిమాండ్ తగ్గదు. ఫలితంగా ప్రస్తుత పరిస్థితుల్లో వీటి ధరలను ఆడ్డుకోవడం అసాధ్యం. ధరలు ఇదే మాదిరి కొనసాగితే బంగారం ఆధారంగా ఈటీఎఫ్‌లోకి పెట్టుబడుల ప్రభావం మరింత పెరుగుతుంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక
తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గత సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఈ మూడు నెలల కాలంలో బంగారానికి సంబంధించిన ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడుల విలువ 26 బిలియన్ డాలర్లు! ఈ ఏడాది మొదటి నుంచి తొమ్మిది నెలల కాలంలో ఈ పెట్టుబడుల మొత్తం 64 బిలియన్ డాలర్లు!! బంగారం ధరలు ఇంతగా పెరుగుతున్నప్పటికీ ఉద్గమిస్తున్న మార్కెట్ల కేంద్ర బ్యాంకులపై దీని ప్రభావం ఎంతమాత్రం లేకపోవడం విశేషం. ముఖ్యంగా ఆయా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లపై భౌగోళిక, రాజకీయ కారణాలు మాత్రమే ప్రభావం చూపాయన్నది సుస్పష్టం. మొత్తంమీద చెప్పాలంటే బంగారానికి సంబంధించి ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు, ఉద్గమిస్తున్న మార్కెట్ల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లపై పెడుతున్న పెట్టుబడులు, ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదలకు కారణమని స్పష్టమవు తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో 2026 చివరి నాటికి ఔన్సు బంగారం ధర 4900 యు.ఎస్. డాలర్లకు చేరుతుందని గోల్డ్ మన్ సాఛెస్ అంచనా వేయడం గమనార్హం. కాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం ఈ ఏడాది తొలిరోజుల నాటికి ప్రపంచ వ్యాప్తంగా గనుల నుంచి వెలికి తీసిన బంగారం నిల్వలు 216,265 టన్నులు! ఇందులో ఆభరణాల రూపంలో వున్నది 97,149 టన్నులు, ఖడ్డీలు, నాణేల రూపంలో 48,634 టన్నులు!
యు.ఎస్.వద్ద అధిక బంగారం నిల్వలు?
ప్రస్తుతం యు.ఎస్. వద్ద 8,133,46 టన్నుల బంగారం నిల్వ ఉంది. ప్రస్తుత పెరిగిన బంగారం ధరతో పోలిస్తే దీని విలువ 1 ట్రిలియన్ డాలర్లను దాటిపోయింది! అయితే యు.ఎస్. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఔన్సు బంగారం విలువను 42 డాలర్లుగా అధికారికంగా నిర్ధారించింది. ఈ విలువకు, ప్రపంచ మార్కెట్‌లో ప్రస్తుత బంగారం విలువకు ఎంతమాత్రం పొంతన లేకపోవడం గమనార్హం. కాగా యు.ఎస్.వద్ద ఉన్న ఈ నిల్వలు, జర్మనీ కంటే రెండు రెట్లు, జపాన్ కంటే పదిరెట్లు అధికం!! అమెరికా వద్ద ఇంత పెద్దమొత్తంలో బంగారం నిల్వకు కొన్ని కారణాలున్నాయి. 1933లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేశారు. యు.ఎస్. పౌరులు బంగారం కలిగి ఉండటం చట్టవిరుద్ధమనేది ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సారాశం. దీంతో ప్రతి యు.ఎస్. పౌరుడు తమవద్ద వున్న బంగారాన్ని ట్రాయ్ ఔన్స్ ధర 20.67 డాలర్లకు తప్పనిసరిగా ప్రభుత్వానికి అమ్మవలసిబ వచ్చింది. 1934లో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పెను ఆర్థిక సంక్షోభం సమయంలో యు.ఎస్. ప్రభుత్వం గోల్డ్ రిజర్వ్ యాక్ట్ పేరుతో ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం ప్రభుత్వం వద్ద ఉన్న బంగారం మొత్తాన్ని ఖజానాకు తరలించారు. అలా దేశంలోని బంగారం మొత్తం ఒక్కచోటికి చేర్చి ‘‘ఫోర్ట్ నాక్స్ బులియన్ డిపాజిటరీ’’ను ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1934లో యు.ఎస్. ప్రభుత్వం బంగారంతో పోల్చినప్పుడు డాలర్ విలువను తగ్గించింది. ఫలితంగా బంగారం నిల్వ చేసుకోవడానికి యు.ఎస్. అత్యంత సురక్షితంగా ప్రపంచ దేశాలు పరిగణించాయి. యూరప్ దేశాల్లో రాజకీయ అస్థిరత నెలకొన్న తరుణంగా ఆయా దేశాలకు చెందిన మదుపర్లు, సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను యు.ఎస్.కు తరలించాయి. యూరోపియన్ రీ-ఎరేంజ్‌మెంట్ కార్యక్రమాలను అమలు చేసినప్పుడు అమెరికా ఎగుమతులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇదే సమయంలో ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు తమవద్ద వున్న బంగారం నిల్వలను యు.ఎస్. లోని ప్రైవేటు హోల్డిం గ్స్‌కు తరలించాయి. ఈవిధంగా అమెరికా వద్ద పెద్దమొత్తంలో బంగారం నిల్వలు పేరుకుపోయాయి. ఈ కారణంగానే అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను శాసించగలుగుతోంది.
జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్