ఆంధప్రదేశ్ అభివృద్ధితోనే భారతదేశ ప్రగతి ముడిపడి ఉందని, రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘ఢిల్లీ- అమరావతి’ కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తాయని స్పష్టం చేశారు. అక్టోబరు 16న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన తొలుత శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకున్నారు. అక్కడి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని వీక్షించారు. నన్నూరు వద్ద సూపర్ జిఎస్‌టి-సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో కలసి పాల్గొన్నారు. రాష్ట్రంలో రూ.13,400 కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా జాతికి అంకితం చేసి,మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు.
వికసిత్ భారత్ ఆవిష్కరణకు స్వర్ణాంధప్రదేశ్ మరింత తోడ్పటు కానుందని, డబుల్ ఇంజన్ సర్కార్‌లో రాష్ట్ర సామర్థ్యాన్ని మరింత పెంచబోతు న్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారమవు తుందన్నారు. వికసిత భారత్ లక్ష్యాన్ని వేగంగా సాధించడానికి మల్టీ మోడల్ ఇన్‌ఫాస్ట్రక్చర్‌ను వేగంగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. హైవేలు, కొత్త రైల్వేలైన్లు, పరిశ్రమలకు కొత్త ఊతం ఇస్తున్నాయన్నారు. ఆంధప్రదేశ్ ఆత్మగౌరవానికి, సంస్కృతికి నిలయమని, సైన్స్, కొత్త ఆవిష్కరణలకు కేంద్రమని, ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయని, యువతకు అనంతమైన శక్తి ఉందని పేర్కొన్నారు.‘ఏ రాష్ట్ర అభివృద్ధికైనా ఇంధన భద్రత అవసరం.రూ.3 వేల కోట్లతో చేపట్టనున్న ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్ర ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పాలనలో చాలా గ్రామాల్లో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా ఉండేవి కావు. ఇప్పుడు అందరికీ విద్యుత్ అందుతోంది’అని మోదీ అన్నారు.
రాష్ట్రంలో గూగుల్ పెట్టుబడులు
ఆంధప్రదేశ్ సామర్థ్యాన్ని యావత్ ప్రపంచం గమనిస్తోందని, రాష్ట్రంలో గూగుల్ భారీ స్థాయిలో పెట్టుబడి ప్రకటించడమే అందుకు నిదర్శనమని ప్రధాని అన్నారు. గూగుల్ ఏఐ హబ్ దేశానికే కాకుండా ప్రపంచానికే సేవ లె అందిచబోతోందని అన్నారు. చంద్రబాబు విజన్‌ను ప్రశంసించారు. రాష్ట్ర అభ్యున్నతి రాయలసీమ అభివృద్ధితో ముడిపడి ఉందని, కర్నూలులో ప్రారంభించే ప్రాజెక్టులు సీమలోని అన్ని ప్రాంతాల వారికీ ఉద్యోగాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పెట్టుబడులు ఉపాధి అవకాశాలను కూడా పెంచుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సామర్థ్యాన్ని విస్మరించిందని, ఎన్‌డిఏ ప్రభుత్వంలో ముఖ్చమంత్రి చ•ంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆత్మనిర్భర భారత్‌లో రాష్ట్రం ఒక కొత్త శక్తిగా అవతరిస్తుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో డ్రోన్ రంగంలో కర్నూలు దేశానికే గర్వకారణంగా నిలవనుందన్నారు. నిమ్మకూరులో ప్రారంభించే అడ్వాన్స్ నైట్ విజన్ ఫ్యాక్టరీతో దేశ రక్షణ రంగంలో మరో అడుగు పడిందని పేర్కొన్నారు. నవరాత్రి మొదటి రోజు నుంచి వస్తు సేవాపన్ను(జీజిఎస్‌టీ) భారం తగ్గించామని, రాష్ట్ర ప్రజలు రూ.8 వేల కోట్లు ఆదా చేసుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. జీఎస్‌టీ ఉత్సవాలను స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్స హించేలా జరుపుకోవాలని కోరారు. ప్రధాని ప్రసంగంలో శంకుస్థాపన చేసిన, ప్రారంభించిన ప్రాజెక్టుల గురించి వివరించారు.
మోదీ సంస్కరణలు దేశానికే గేమ్ ఛేంజర్లు : చంద్రబాబు
ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికే గేమ్ ఛేంజర్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివర్ణించారు. ఈ 21వ శతాబ్దం ఆయనదే అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నందుకు, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 ఏళ్లుగా కొనసాగుతున్నందుకు అభినందనలు తెలిపారు. మోదీ సహకారంతోనే ఆంధప్రదేశ్ అభివృద్ధి పథంలో వెళుతోందని పేర్కొంటూ, ఇప్పుడు జీఎస్‌టీ పొదుపు ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇలాంటి లాభాలు మరిన్ని చూడబోతు న్నామని అన్నారు. జీఎస్‌టీ సంస్కరణలు తీసుకొచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన సంస్కరణల కారణంగా భారత్ ప్రపంచ వ్యాప్తంగా గౌరవం పొందుతోందని, 2047 నాటికి మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్ అని పేర్కొన్నారు. యుద్ధాలు, టారిఫ్‌లు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని, ఈ సమయంలో మోదీ చెప్పిన స్వదేశీ మంత్రం మనకు బ్రహ్మాస్త్రమని అన్నారు. త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్, కడపలో స్టీల్ ప్లాంట్ రానున్నాయని తెలిపారు.
మోదీ కర్మయోగి: పవన్ కల్యాణ్
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిజమైన కర్మయోగి అని,ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెడుతున్నారని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.రాష్ట్రంలో కూటమి సర్కార్ 15 ఏళ్ల పాటు ఉంటుందని అన్నారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తోందన్నారు. జీఎస్‌టీ తగ్గింపుతో రాష్ట్రం రూ.8 వేల కోట్ల ఆదాయం కోల్పోతుందని తెలిసినా, పేదలకు మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారని పేర్కొన్నారు. భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కారణం ప్రధాని మోదీనే కారణమన్నారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని చేసిన అభివృద్ధి పనుల ప్రారంభోత్స వాలు, శంకుస్థాపనలు చేసిన… పరిశ్రమలు, విద్యుత్ సరఫరా, రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువు వంటి కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులు ప్రాంతీయ మౌలిక సదుపాయాలను పెంపు, పారిశ్రామికీకరణను వేగిర పరచడం, రాష్ట్రంలో సమ్మిళిత సామాజిక-ఆర్థిక వృద్ధిని సాధించాలన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయి.
కర్నూలు-3 పూలింగ్ స్టేషన్‌లో రూ.2,880 కోట్లకు పైగా వ్యయంతో ఏర్పాటు చేసిన సరఫరా వ్యవస్థను మెరుగుపరిచే ప్రాజెక్టు. ఇందులో భాగంగా 765 కేవీ డబుల్-సర్క్యూట్ కర్నూలు-3 పూలింగ్ స్టేషన్- చిలకలూరిపేట విద్యుత్ సరఫరా లైన్ నిర్మించనున్నారు. ఇది కరెంట్ సరఫరా సామర్థ్యాన్ని 6000 ఎంపీఏలు పెంచుతుంది. దేశాభివృద్ధిలో కీలకమైన పునరుత్పాదక విద్యుత్ సరఫరాను భారీ ఎత్తున మెరుగుపరుస్తుంది. రూ. 4,920 కోట్లకు పైగా వ్యయంతో చేపడుతోన్న కర్నూలులోని ఓర్వకల్ పారిశ్రామిక ప్రాంతం, కడపలోని కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాన్ని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్‌ఐసీడీఐటీ), ఆంధప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. పలు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఈ ప్రాజెక్టులను వాక్-టు-వర్క్ పద్ధతిలో ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలతో ఆధునిక, ఆవిష్కరణ ఆధారిత తయారీ కేంద్రాలుగా రూపొందించారు. ఇవి రూ. 21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించటం, సుమారు లక్ష ఉద్యోగాలను సృష్టించడం, ఆంధప్రదేశ్ పారిశ్రామిక వృద్ధి, ప్రపంచ పోటీతత్వాన్ని పెంచుతాయన్న అంచనా ఉంది.
రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలను పెంచే చర్యల్లో భాగంగా సబ్బవరం నుంచి షీలానగర్ వరకు రూ. 960 కోట్లతో నిర్మించే ఆరువరుసలత గ్రీన్‌ఫీల్డ్ రహదారి విశాఖపట్నంలో రద్దీని తగ్గించటంతో పాటు వాణిజ్యం, ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
రాష్ట్రంలో రూ. 1140 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. పీలేరు నుంచి కలూర్ విభాగాన్ని (భాక్రాపేట వరకు) నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసిన రహదారి, కడప సరిహద్దు నుంచి సీఎస్ పురం వరకు వెడల్పు చేసిన రహదారి, గుడివాడ – మచిలీపట్నం ఎన్‌హెచ్-165 విభాగంలో గుడివాడ – నూజెల్ల రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు వరుసల ఆర్‌ఓబీ, ఎన్‌హెచ్-716 రహదారిలో పాపాగ్ని నదిపై నిర్మించిన భారీ వంతెన, ఎన్‌హెచ్-565లో కనిగిరి బైపాస్, ఎన్. గుండ్లపల్లి పట్టణంలో ఎన్‌హెచ్-544 డీడీలో మెరుగుపరిచిన బైపాస్‌లు ఇందులో ఉన్నాయి. ఇవి భద్రతను మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించ టంతో పాటు ఆంధప్రదేశ్‌లో ప్రాంతీయ అను సంధానను మెరుగుపరుస్తాయి.
రూ. 1,200 కోట్ల విలువైన కీలక రైల్వే ప్రాజెక్టులలో కొన్నింటికి శంకుస్థాపన. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. కొత్తవలస-విజయ నగరం నాలుగో రైల్వే లైన్, పెందుర్తి- ఉత్తర సింహాచలం మధ్య రైల్వే ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశారు. కొత్తవలస-బొడ్డవర విభాగం, శిమిలిగూడ-గోరాపూర్ విభాగాల డబ్లింగ్‌ను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు రద్దీని తగ్గించటంతో పాటు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఆటంకం లేని ప్రయాణికులతో పాటు సరకు రవాణాకు వీలు కల్పిస్తాయి. ఈ ప్రాంతం మొత్తం పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక వృద్ధిని ప్రోత్సహిస్తాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తాయి.
ఇంధన విభాగంలో ఆంధప్రదేశ్‌లో 124 కి.మీ, ఒడిశాలో 298 కి.మీ పొడవున్న గెయిల్ (ఇండియా) లిమిటెడ్‌కు చెందిన శ్రీకాకుళం – అంగుల్ సహజ వాయువు పైప్‌లైన్‌ను (మెయిన్‌లైన్) కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. దీన్ని రూ. 1,730 కోట్ల పూర్తి వ్యయంతో నిర్మించారు. చిత్తూరులో ఇండియన్ ఆయిల్‌కు చెందిన 60 టీఎమ్‌టీపీఏ (సంవత్సరానికి వెయ్యి మెట్రిక్ టన్నులు) ఎల్‌పీజీ బాట్లింగ్ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎల్‌పీజీ కేంద్రం ఆంధప్రదేశ్‌లోని 4 జిల్లాలు, తమిళనాడులోని 2 జిల్లాలు, కర్ణాటకలోని 1 జిల్లాల్లో 7.2 లక్షల మందికి పైగా వినియోగదారులకు 80 పంపిణీ దారుల ద్వారా సేవలందించనుంది. గృహాలు, వ్యాపార సంస్థలకు స్థిరమైన, విశ్వసనీయమైన ఎల్‌పీజీ సరఫరా ఉండేలా చూసుకోవటంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది.
రక్షణ రంగ తయారీని పెంచే చర్యల్లో భాగంగా కృష్ణాజిల్లాలోని నిమ్మకూరులో రూ. 362 కోట్ల పెట్టుబడితో రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ఏర్పాటు చేసిన రాత్రి చూసేందుకు ఉపయోగపడే ఉత్పత్తుల అధునాతన కర్మాగారాన్ని (ఏఎన్‌వీపీఎల్- అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ ప్రొడక్టస్ ఫ్యాక్టరీ) ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ కర్మాగారం భారత రక్షణ దళాలకు కావాల్సిన అధునాతన ఎలక్ట్రో-ఆప్టికల్ వ్యవస్థలను తయారు చేస్తుంది. ఇది రక్షణ తయారీలో స్వావలంబనను బలోపేతం చేయటంతో పాటు ఈ ప్రాంతంలో నైపుణ్య ఆధారిత ఉపాధిని ప్రోత్సహిస్తుంది.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్