ఇటీవల ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఎంత వరకు నిలుస్తుందన్నది ప్రశ్నగా మారింది. ఇది ఒక బలహీన ఒప్పందం అనే భావన పాశ్చాత్య దేశాల్లోనే కాక, ముస్లిం దేశాల్లోనూ నెలకొంది. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య శత్రుత్వాలకు, వైషమ్యాలకు ఇక తెరదించాలన్న అక్టోబర్ 10 నాటి ఒప్పందం పట్ల సుమారు 156 దేశాలు హర్షం వ్యక్తం చేసినప్పటికీ, మళ్లీ ఎప్పుడు ఎలా విస్ఫోటనం చోటు చేసుకుంటుందోనని ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ ఒప్పందం కొనసాగడమన్నది అనేక పరిస్థితులు, పరిణామాల మీద ఆధారపడి ఉంది. హమాస్ చేతిలో బందీలై విగతజీవులుగా మారిన వందలాది మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను హమాస్ ఇజ్రాయెల్‌కు అప్పగించడం కూడా ఇందులో ఒకటి. ఈజిప్టులోని షారమ్ ఎల్-షేక్ ప్రాంతంలో ఇజ్రాయెల్, హమాస్ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని హమాస్ అన్ని విధాలుగానూ ఉల్లంఘిస్తోందంటూ ఇజ్రాయెల్ ఇప్పటికే ఆరోపణలు సాగిస్తోంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, ఒప్పందాలను ఉల్లంఘించ డమనేది హమాస్ నాయకత్వానికి మొదటి నుంచి పరిపాటిగా ఉంటూ వస్తోంది. తమ అధీనంలోని బందీల మృతదేహాలను, అవశేషాలను వెంటనే ఇజ్రాయెల్‌కు అప్పగిస్తామని, గాజాలోని పాలస్తీనాకు చెందిన ప్రాంతాల్లో ఉన్న బందీల అవశేషాలను కూడా ఇజ్రాయెల్‌కు త్వరలోనే స్వాధీనపరుస్తామని హమాస్ నాయకత్వం హామీ ఇచ్చిన తర్వాతే ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ సైనిక దళాలు గాజా నుంచి, పాలస్తీనా ప్రాంతాల నుంచి నిష్క్రమించిన 72 గంటల లోపు, తాము బందీల మృతదేహాలను, అవశేషాలను తప్పకుండా ఇజ్రాయెల్ పరం చేస్తామని గాజా నాయకత్వం ఒకటికి రెండుసార్లు ప్రకటించింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ, హమాస్ ఇంత వరకూ ఇజ్రాయెల్‌కు అందజేసింది నాలుగు మృతదేహాలను మాత్రమే. దీంతో ఇతర బందీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహావేశాలతో రగిలి పోతున్నారు. హమాస్ ఆ నాలుగైదు మృతదేహాలను ఇజ్రాయెల్ కు అప్పగించడానికి కూడా ఈజిప్టు ఒత్తిడే కారణం. నిజానికి గాజాలో ఇప్పటికీ 19 మృతదేహాల అవశేషా లను బహిరంగ ప్రదేశాల్లో ఉంచారు. అంతేకాక, అనేక మృతదేహాలను లక్షలాది టన్నుల చెత్తాచెదారం కింద పడేసి ఉంచారు.
నెరవేరని నియమాలు
ఈ మృతదేహాలను, అవశేషాలను వెలికి తీసి ఇజ్రాయెల్‌కు పంపించడానికి హమాస్ నాయకత్వానికి చాలా కాలం పట్టేట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో హమాస్ సభ్యులకు స్థానికంగా ఎటువంటి సహాయమూ అందడం లేదు. వీటిని తరలించాలన్న పక్షంలో మానవ సహాయంతో పాటు భారీ పరికరాల సహాయం కూడా అవసరమవుతుంది. అయితే, హమాస్ మాత్రం తాము ఇజ్రాయెల్ బందీలు, సైనికుల మృతదేహాలు, అవశేషాలన్నిటినీ ఇజ్రాయల్‌కు ఒప్పందం ప్రకారం తరలించేశామని, తమ దగ్గర ఇక తరలించడానికి ఏమీ లేవని ప్రపంచ దేశాలకు చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇజ్రాయెల్ మళ్లీ హమాస్ మీద దాడి చేయడానికి ఇది ఒక కారణంగా మారే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్ నాయకత్వం కూడా ఇందుకు తగ్గట్టుగానే ప్రతిస్పందించింది. ఆకలి దప్పులతో అలమటిస్తున్న గాజా ప్రజలకు తాము సరఫరా చేస్తామన్న 600 ట్రక్కుల ఆహార ధాన్యాల్లో సగం మాత్రమే ఇస్తామని, ఇతర పాలస్తీనా ప్రాంతాల్లోకి వెళ్లడానికి గాజాకు ఉన్న ఏకైక మార్గాన్ని, రాఫా సరిహద్దును గాజా ప్రజల కోసం తెరిచే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ఇప్పటికే హమాస్ నాయకత్వానికి హెచ్చరికలు పంపించింది. గాజా ప్రజల కోసం ఇజ్రాయెల్ ఆహార ధాన్యాలు సరఫరా చేయాలన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన.
ఇలా ఉండగా, ఇజ్రాయెల్ సైనిక బలగాలు నిష్క్రమించిన ప్రాంతాల్లో తమ ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు హమాస్ ఇప్పటికే శీఘ్రగతిన చర్యలు ప్రారంభించింది. ఆ ప్రాంతాల్లో సరికొత్త చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు, ఇజ్రాయెల్ సహాయంతో తమ మీద పోరాటం సాగించిన స్థానిక తీవ్రవాద బృందాలను మట్టుబెడుతున్నాయి. ఇజ్రాయెల్‌కు సహకరించిన ప్రతివారినీ బహిరంగంగా వధిస్తోంది. గాజాలో భద్రత పెంచడానికి, సుస్థిరతను నెలకొల్పడానికి, పౌరుల హక్కులు కాపాడడానికి తాము ప్రయాసపడుతున్నామంటూ హమాస్ వరుసగా ప్రకటనలు జారీ చేస్తోంది. కొన్ని కీలక విషయాల్లో హమాస్ మొండి వైఖరిని అనుస రించడం, పైగా తాము ఆయుధాలను వదిలిపెట్టేది లేదని హమాస్ నాయకత్వం ప్రకటించడం ట్రంప్‌లో అసహనాన్ని రేకెత్తిస్తోంది. ‘వారు ఆయుధాలను వదిలిపెట్టని పక్షంలో మేము వారు ఆయుధాలు వదిలిపెట్టేలా చేస్తాం. ఇది ఈసారి మరింత వేగంగా, హింసాత్మకంగా జరగబోతోంది’ అని ఆయన హెచ్చరించారు.
ఇజ్రాయెల్‌తో యుద్ధంలో అత్యంత దారుణంగా దెబ్బతిన్న హమాస్ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో సహా అనేక దేశాలతో ఎదురుతిరిగి మాట్లాడు తుండగా, ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహూ మాత్రం ఒప్పందానికి పూర్తిగా కట్టుబడి ఉండి, ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే, హమాస్ నాయకులతో ఈ ఒప్పందం కుదర్చుకున్నందుకు మాత్రం ఇంటా బయటా ఆయన కష్టనష్టాలు రాను రానూ ఉధృతమవుతున్నాయి. గతంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై టెల్ అవీవ్ హైకోర్టు ఆయన మీద విచారణ ప్రారంభించింది. ఆరోగ్యం బాగా లేదనే కారణం మీద ఆయన ఈ విచారణను ఒకటి రెండు రోజులు వాయిదా వేయించగలిగారు. కానీ, 2023 అక్టోబర్ నెలలో ఇజ్రాయెల్ మీద హమాస్ దాడులు జరిపి వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకునిపోవడం మీద ఆయన నియమించిన విచారణ కమిషన్ ఇక తప్పనిసరిగా ప్రారంభం కావలసి ఉంది. దేశ ప్రజల నుంచి ఆ విషయంలో ఒత్తిడి రాను రానూ పెరుగు తోంది. విచిత్రమేమిటంటే, టెల్ అవీవ్ హైకోర్టు ఈ విచారణను నిలిపి వేయడానికి 30 రోజుల గడువు నిచ్చింది. దీని మీద విచారణ కమిషన్‌ను నియ మించడం నిరర్థకమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇంటి సమస్యలు
దేశంలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించనవసరం లేదని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్నే కొనసాగించాలని నెతన్యాహు నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కొన్ని ప్రధాన పార్టీలు పట్టుబడుతున్నాయి. అయితే, హమాస్ నాయకులు ఆయుధాలు వదిలి పెట్టకపోయినా, ఇజ్రాయెల్ సాయుధ దళాలు గాజా ప్రాంతం నుంచి నిష్క్రమించినా నెతన్యాహూ ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఒప్పందంలోని నిబంధనలను హమాస్ నాయకులు పూర్తిగా నెరవేర్చకుండా నెతన్యాహూ ప్రభుత్వం తమ సాయుధ దళాలను ఉపసంహరించకూడదని సంకీర్ణ ప్రభుత్వంలోని కొన్ని పార్టీలు వాదిస్తున్నాయి. వాస్తవానికి 2023 అక్టోబర్ తర్వాత ఇజ్రాయెల్ ప్రజల ఆలోచనా ధోరణిలోనే కాక, సంకీర్ణ ప్రభుత్వం లోని అతివాద పార్టీల ఆలోచనా ధోరణిలో కూడా బాగా మార్పు వచ్చింది. ప్రపంచ దేశాల్లో చాలా భాగం నెతన్యాహూను ఒంటరి వాడిని చేసినా, 2023 అక్టోబర్ హమాస్ దాడులకు నెతన్యాహూ బాధ్యతను తీసుకోకపోయినా, ఈ 75 ఏళ్ల నాయకుడే చివరికి విజేతగా అవతరించే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్, హమాస్ నాయకుల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఏ క్షణంలోనైనా కకావికలు కావచ్చనే భయం వెంటాడుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ దీనికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేస్తోంది. హమాస్ నాయకులు ఎప్పటి మాదిరిగానే ఈ ఒప్పందాన్ని అడపాదడపా ఉల్లంఘించడం కొనసాగు తూనే ఉంది. షారమ్ ఎల్ షేక్ శిఖరాగ్ర సమావేశం ఫలితాలను హమాస్ అంతగా ప్రాముఖ్యం ఇస్తున్నట్టు కనిపించడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందంపై పూచీకత్తు సంతకాలు చేసిన అమెరికా, ఈజిప్టు, టర్కీ, ఖతార్ దేశాలు ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతికి, యుద్ధ విరమణకు సంబంధించి సంయుక్త ప్రకటన చేశాయి కానీ, అందులో పాలస్తీనా గురించిన ప్రస్తావనే లేదు. నిజానికి, హమాస్ నాయకత్వానికే కాక, ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ముస్లిం దేశాలన్నిటికీ పాలస్తీనా సమస్యే అత్యంత ప్రధానమైన అంశం. ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదాన్ని కూడా ఒప్పందంలో చేర్చి ఉంటే సబబుగా ఉండేదని ఆ తర్వాత ఈజిప్టు ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ఒప్పందంపై తప్పనిసరిగా సంతకాలు చేయాల్సిన ఇజ్రాయెల్, హమాస్‌లను దీని నుంచి దూరం పెట్టడం వల్ల కూడా ఈ ఒప్పందం అమలయ్యే సూచనలు కనిపించడం లేదు.
రహస్యంగా మార్పులు
గత నెల ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ తమ ముందుంచిన ముసాయిదా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ తర్వాత నెతన్యాహూ మార్చేసినట్టు కనిపిస్తోందని, గాజా, పాలస్తీనా ప్రాంతాల నుంచి దశలవారీగా తమ సాయుధ దళాలను ఉపసంహరిస్తామనే అంశాన్ని, పాలస్తీనా అధికార యంత్రాంగం అధికా రాన్ని క్రమంగా బలహీనపరుస్తామనే ఇజ్రాయెల్ ప్రకటనను అందులోంచి తొలగించారని అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు ఆరోపించాయి. భారత దేశంతో సహా ఈ సమావేశంలో పాల్గొన్న 27 దేశాలు ఈ ఒప్పందానికి మద్దతు తెలిపాయి. హమాస్ నాయకులు, పాలస్తీనాలోని కొన్ని వర్గాలు కలిపి గాజాను పాలించడానికి ఈజిప్టు 15 మంది సభ్యు లతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇజ్రాయెల్ కూడా ఆమోదం తెలిపింది. పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్‌కు మేనల్లుడు, పాలస్తీనా మాజీ విదేశాంగ మంత్రి అయిన నాసర్ అల్ కిద్వా ఈ కొత్త ఏర్పాటులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.
గాజాకు వివిధ దేశాలు అండగా ఉండడానికి, గాజా అభివృద్ధికి అంతర్జా తీయంగా నిధులు సేకరిం చడానికి అమెరికా కొద్ది రోజుల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ఒక ప్రతిపాద నను ప్రవేశపెట్టబోతోంది. ఇందుకు ఈజిప్టు కూడా తన వంతు సహాయ సహకారాలు అందించబోతోంది. కాగా, ఈజిప్టు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ కలిసి, గాజాలో ఏర్పడే కొత్త పాలనా వ్యవస్థను పర్యవేక్షించాలని కూడా అమెరికా అధ్యక్షుడు కోరే అవకాశం ఉంది. ట్రంప్ వ్యక్తిగత పర్యవేక్షణ ఎంత కాలం కొనసాగుతుందన్నది అరబ్ దేశాలకు అర్థం కావడం లేదు. ఈ మధ్య కాలంలో గల్ఫ్ దేశాల భద్రతకు, ఉమ్మడి దేశాల ఆర్థిక దేశాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ట్రంప్‌కు తన ప్రయోజ నాలే ముఖ్యమని, చివరికి ఆయన పడవని నట్టేట ముంచే అవకాశం లేకపోలేదని అరబ్ దేశాలు భావిస్తున్నాయి.
జి.రాజశుక
సీనియర్ జర్నలిస్ట్