నానుడి పాతదే అయినా సజీవమైనది. ఒకవైపు అఫ్గానిస్తాన్‌ ‌విదేశాంగమంత్రి అమీర్‌ఖాన్‌ ‌ముత్తఖీ భారత్‌ ‌పర్యటన. మరోవైపు ఆ దేశంతో పాకిస్తాన్‌ ‌ఘర్షణ ప్రస్తుతం ప్రధాన వార్తలయ్యాయి. అఫ్గాన్‌ ‌భారత్‌కు దగ్గర కావడాన్ని తట్టుకోలేక పోతున్న పాకిస్తాన్‌ ఆ ‌దేశం మీద దాడులకు తెగించింది. ఈ ఘర్షణల్లో ముగ్గురు అఫ్గాన్‌ ‌క్రికెట్లర్లు మృతిచెండడం విషాదాన్ని నింపింది. దీనితో వార్తకు మరింత ప్రాధాన్యం వచ్చింది. గతానికి భిన్నంగా అఫ్గాన్‌ ‌మన దేశంతో సన్నిహిత సంబంధాలు నెరపేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. తమ దేశంలో భారత్‌ ‌వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించబోమని చెప్పింది. ఇంతకీ తాలిబాన్‌ ‌పాలనలోని అఫ్గాన్‌తో భారత్‌ ‌సంబంధాలు కొనసాగించడం ప్రయోజన కరమేనా అన్న సందేహాలూ లేకపోలేదు.

అఫ్గాన్‌ ‌విదేశాంగమంత్రి భారత్‌ ‌పర్యటన ప్రపంచాన్ని ఆకర్షించింది. అక్టోబర్‌ ‌రెండో వారంలో ముత్తాఖీ ఆరురోజులు భారత్‌లో పర్యంచారు. తాలిబన్‌ ‌రెండోసారి అధికారం చేపట్టిన (2021) తర్వాత ఆ దేశం నుంచి ఓ నాయకుడు భారత్‌ ‌రావడం ఇదే తొలిసారి. అక్టోబర్‌ 10‌న ముత్తఖీ మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌భేటీ అయి విస్తృత అంశాలపై, ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. అభివృద్ధి సహకార ప్రాజెక్టులలో, ముఖ్యంగా ఆర్థిక సంబంధాలు, ఆరోగ్య సంరక్షణ, ప్రజా మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాల్లో సహకారంపై, భద్రత, సాంస్కృతిక సహకారంతో పాటు ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులను పెంచే మార్గాలపై చర్చించారు.

అఫ్గాన్‌ ‌ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా భారత్‌ ఆపన్నహస్తం అందించిందనీ, తమకు భారత్‌ ‌కీలకమని అమీర్‌ఖాన్‌ ‌ముత్తఖీ అభివర్ణించారు. అఫ్గానిస్థాన్‌ ‌రాజధాని కాబూల్‌లోని భారత సాంకేతిక మిషన్‌ను రాయబార కార్యాలయం హోదాను అప్‌‌గ్రేడ్‌ ‌చేస్తున్నట్లు మన దేశం ప్రకటించింది. ఇరుదేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌గుర్తు చేశారు. భారత్‌, అఫ్గానిస్తాన్‌ల మధ్య ప్రాచీన కాలంగా సాంస్కృతిక, చారిత్రిక సంబంధాలు ఉన్నాయి. మహా భారత కాలంలోని జనపదాల్లో గాంధారం ఒకటి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలను సమన్వయం చేసుకోవాలని భారత్‌ ‌సూచించింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు, అలాగే భారత ప్రజలు, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకు జైశంకర్‌ ‌కృతజ్ఞతలు తెలియజేశారు.

అఫ్గాన్‌ ‌మీద దాడి.. పరువు పోయిన పాక్‌

ఆమీర్‌ఖాన్‌ ‌ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలోనే రాజధాని కాబుల్‌లో భారీ పేలుళ్లు కలకలం సృష్టించాయి. తెహ్రీక్‌ ఇ ‌తాలిబన్‌ ‌పాకిస్తాన్‌ -‌టీటీపీ అధినేత చీఫ్‌ ‌నూర్‌ ‌వాలి మెహ్సూద్‌ ‌స్థావరం లక్ష్యంగా పాకిస్తాన్‌ ‌వైమానికి సేన బాంబులతో దాడి చేసింది. టీటీపీ ఇటీవల తమ దేశంలోని ఖైబర్‌ ‌పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఓరక్‌జాయ్‌ ‌జిల్లాలో ఇటీవల జరిపిన దాడుల్లో లెఫ్టినెంట్‌ ‌కర్నల్‌, ‌మేజర్‌సహా 11 మంది సైనికులు మరణించారని ఇందుకు ప్రతీ కారంగా కాబుల్‌ ‌మీద డాది చేస్తామని పాక్‌ ‌చెబుతోంది. కాగా కాబూల్‌ ‌మీద దాడిని తీవ్రంగా పరిగణించిన అప్గానిస్తాన్‌ ‌సైన్యం పాకిస్తాన్‌ ‌మీద విరుచుకుపడింది. ఈ ఘర్షణలో పాకిస్తాన్‌ ‌సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏ యుద్ధం జరిగినా తమదే పైచేయి అని చెప్పుకోవడం పాకిస్తాన్‌కు అలవాటు. ఎప్పటిలాగే అఫ్గాన్‌కు బుద్ధి చెప్పామని ప్రచారం చేసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ ‌పరువు బజారుపాలు చేశారు తాలిబన్లు, అఫ్గాన్‌ ‌పౌరులు. స్పిన్‌ ‌బోల్దక్‌ ‌వద్ద పాకిస్తాన్‌ ‌మిలిటరీ ఔట్‌ ‌పోస్టులపై తాలిబన్‌ ‌బలగాలు మెరుపు దాడులు చేసింది. అక్కడ కాపలాగా ఉన్న పాకిస్తాన్‌ ‌సైనికులు పారిపోయారు. తాలిబన్లు కొందరిని బందించడంతో పాటు వారి సైనిక దుస్తులు, ఆయుధాలు, ఆహార పదార్థాలు స్వాధీన చేసుకున్నారు. వీటిని నంగర్‌హార్‌ ‌ప్రావిన్స్‌లో బహిరం గంగా ప్రదర్శించారు. పాక్‌ ‌సైనికుల ప్యాంట్లను ప్రదర్శిస్తూ.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ దృశ్యాలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఈ క్రమంలో అప్గాన్లు సోషల్‌ ‌మీడియా యాక్టివిస్ట్‌లు ‘93,000 ప్యాంట్స్ ‌సెర్మనీ 2.0’ అని పోస్టులు పెట్టారు. 1971, డిసెంబర్‌లో భారత లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌జగ్జీత్‌ ‌సింగ్‌ అరోరా, ఇతర సైన్యాధికారుల సమక్షంలో పాక్‌ ‌లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ఆమిర్‌ అబ్దుల్లా నియాజీ లొంగుబాటు పత్రంపై సంతకం చేశారు. ప్రస్తుతం ఆ చిత్రాన్ని నెటిజన్లు షేర్‌ ‌చేస్తున్నారు. అప్పుడు 93,000 మంది పాక్‌ ‌సైనికులు భారత్‌ ‌ముందు లొంగిపోయారు. ‘అప్పుడు భారత్‌ ఎదుట.. ఇప్పుడు అఫ్గాన్‌ ‌ముందు. ‘టీమ్‌ 93,000’ ‌విషయంలో అప్పుడూ ఇప్పుడూ ఏమీ మారలేదు. భవిష్యత్తులో భారత్‌ ‌రికార్డును అఫ్గాన్‌ ‌బ్రేక్‌ ‌చేస్తుందేమో’ అని వారు పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇది పాక్‌కు తీవ్ర అవమానమే అనే చర్చ నడుస్తోంది.

పాకిస్తాన్‌తో పోలిస్తే అఫ్గాన్‌ ‌సైన్యం దగ్గర యుద్ధ విమానాలు కూడా లేవు. అమెరికా సైన్యం వదిలి వెళ్లిన ట్యాంకర్లతో పాకిస్తాన్‌ ‌సరిహద్దుల మీద తాలిబన్‌ ‌విరుచుకుపడ్డారు. వెంటనే దిగివచ్చిన పాకిస్తాన్‌ ‌తమ మధ్య శాంతిని కుదర్చాలంటూ ఖతార్‌, ‌సౌదీ అరేబియా ప్రభుత్వాలకు ఫోన్‌ ‌చేసి వేడుకుంది. దీంతో ఆ దేశాలు చొరవ తీసుకున్నాయి. రెండు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది.

అయితే కాల్పుల విరమణ సమయంలో వక్రబుద్ధి చాటుకుంది పాకిస్తాన్‌. అఫ్గాన్‌లోని తూర్పు ప్రావిన్స్‌లో పాకిస్తాన్‌ ‌సైన్యం జరిపిన బాంబుదాడిలో ముగ్గురు అఫ్గాన్‌ ‌దేశవాళీ క్రికెటర్లు మృతి చెందారు. ఈ ఆటగాళ్లు ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడి తిరిగి వస్తుం డగా పాక్‌ ‌సైనం క్రూరత్వానికి వారు బలై అయి పోయారు. ఈ దాడిలో క్రికెటర్లతో మరో ఏడుగురు అఫ్గాన్‌ ‌పౌరులు సైతం ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ ‌క్రికెట్‌ ‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడి కారణంగా నవంబర్‌లో శ్రీలంక-పాకిస్తాన్‌తో జరిగాల్సిన ముక్కోణపు టీ 20 సిరీస్‌ ‌నుండి అఫ్గానిస్తాన్‌ ‌తప్పుకొంది. పాకిస్తాన్‌ ‌దుశ్చర్యను అఫ్గన్‌ ‌టీ 20 జట్టు కెప్టెన్‌ ‌రషీద్‌ ‌ఖాన్‌ ‌తప్పుపట్టారు. పాక్‌తో మ్యాచ్‌ ‌రద్దును సమర్ధిస్తూ.. తమకు ఆటకన్నా దేశమే ముఖ్యమన్నారు.

కాగా అక్టోబర్‌ 19‌వ తేదీన కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్‌ ‌రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్‌, అఫ్గాన్‌ ‌రక్షణ మంత్రి ముల్లా యాకూబ్‌ ‌మధ్య ఖతార్‌ ‌రాజధాని దోహాలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ పాటించాలని ఇరుపక్షాలు అంగీకా రానికి వచ్చాయి. ఈ క్రమంలో అఫ్గాన్‌ అం‌తర్గత వ్యవహారాల శాఖ డిప్యూటీ మంత్రి మహమ్మద్‌ ‌నబి ఒమారి పాక్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. తమ ప్రత్యర్థి ఎలాంటి ఆక్రమణకు పాల్పడినా.. తమ దళాలు వారిని భారత సరిహద్దు వరకూ పరిగెత్తి స్తాయని వ్యాఖ్యానించారు.

డ్యూరాండ్‌ ‌రేఖ అసలు వివాదం

పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌ ‌మధ్య సరిహద్దు డ్యూరాండ్‌ ‌రేఖ. 2,640 కిలోమీటర్ల పొడవున ఉండే ఈ రేఖను తాలిబన్‌ ‌గుర్తించడం లేదు. ఇందుకు కారణం ఈ రేఖకు ఇరువైపులా అఫ్గాన్‌కు చెందిన పష్తూన్‌ ‌తెగ ప్రజలుంటారు. డ్యూరాండ్‌ ‌రేఖ కారణంగా తమ జాతి ప్రజలు విడిపోవడం అఫ్గాని స్తాన్‌కు ఇష్టం లేదు. అఫ్గాన్‌ను తాలిబన్‌ ‌చేజిక్కించు కున్న తర్వాత పాకిస్తాను డ్యూరాండ్‌ ‌రేఖ వెంబడి కంచె నిర్మాణాన్ని ప్రారంభించింది. దీన్ని తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కంచె పష్తూన్‌ ‌తెగలోని కుటుంబాల మధ్య వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంబంధాలకు అడ్డుకట్ట వేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాలను పాకిస్తాన్‌ ‌పట్టించుకో కుండా ఫెన్సింగ్‌ను కొనసాగించడంతో పాటు.. సరిహద్దు పొడవునా చెక్‌పోస్టులు నిర్మించింది. దీంతో చాలా చోట్ల ఫెన్సింగ్‌ ‌నిర్మాణాలను తాలిబన్‌ ‌కూల్చివేశారు.

పాకిస్తాన్‌ 17 ‌లక్షల మంది అఫ్గాన్‌ ‌శరణార్థులకు ఆశ్రయమిస్తోంది. వీరిని ఉగ్రవాదులుగా మలచింది. 80, 90 దశకాల్లో అఫ్గాన్‌లో ఉన్న రష్యా సేనలపై దాడి చేసేందుకు ఈ శిబిరాల్లో శిక్షణ పొందిన యువతను వినియోగించింది. అల్‌ ‌కాయిదా లాంటి సంస్థలకూ ఉగ్రవాదులను ఇక్కడి నుంచే సరఫరా చేసింది. తాలిబన్లు రెండోసారి అధికారంలోకి వచ్చిన దీనికి అడ్డుకట్టపడింది. దీంతో 2023లో అక్రమంగా ఉంటున్న అఫ్గానిస్తాన్‌ ‌వలసదారులు వెళ్లిపోవాలని ఉత్తర్వులు తెచ్చింది. దీన్ని తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. సంవత్సరాల తరబడి ఆశ్రయం పొందుతున్నవారిని పంపించొద్దని, వారి ఉపాధిని దెబ్బ తీయొద్దని విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్‌ ‌దీన్ని పట్టించుకోలేదు.

మరోవైపు అఫ్గాన్‌ ‌భూభాగం నుంచి పని చేస్తున్న తెహ్రీకే తాలిబన్‌ ‌పాకిస్తాన్‌ – ‌టీటీపీ సంస్థ పాకిస్తాన్‌ ‌పక్కలో బల్లెంగా మారింది. ఈ సంస్థకు నాయకత్వ వహిస్తున్ననూర్‌ ‌వాలి మోహ్సూద్‌ ‌కొరకరాని కొయ్యగా మారాడు. 2021 ఆగస్టులో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే టీటీపీ క్రియాశీలమైంది. ఖైబర్‌ ‌ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ‌సహా పాక్‌లోని వివిధ ప్రాంతాల్లో టీటీపీ గత నాలుగేళ్లుగా అనేక దాడులు నిర్వహిం చింది. ఈ సంస్థకు తాలిబన్లు అండగా నిలిచారని పాకిస్తాన్‌ ఆరోపణ.

అఫ్గాన్‌తో మైత్రి మేలేనా?

ఏ దేశ విదేశాంగ విధానం అయినా సొంత ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ విషయంలో భారత్‌ ‌చాలా స్పష్టంగా ఉంది. తాలిబన్‌ అనగానే అఫ్గానిస్తాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేపట్టిన మత ఛాందస తీవ్ర వాదులు గుర్తుకు వస్తారు. మరి వీరితో భారత్‌తో అధికారంలో బీజేపీ నేతృత్వ జాతీయవాద ప్రభు త్వంతో చెలిమి ఎలా కుదిరింది అన్న ప్రశ్న తలెత్తక మానదు. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనే రాజనీతిని ఇక్కడ వర్తింప చేసుకోవాలి. అఫ్గాని స్తాన్‌ ‌ప్రభుత్వాన్ని ఇప్పటి వరకూ రష్యా తప్ప ఏ దేశమూ గుర్తించలేదు. భారత్‌ ఇప్పటికే వరకూ వారిని గుర్తించ కున్నా దౌత్య సంబంధాలు పెట్టుకో లేదు. అఫ్గానిస్తాన్‌ అధికారిక ప్రభుత్వంగా గుర్తించే దిశగా భారత్‌ ‌మరో అడుగు వేసినట్లయింది. శరవేగంగా మారుతోన్న మన దౌత్య సమీకరణాలకు ఇదో సంకేతం.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం- పాకిస్తాన్‌ ‌బలం, బలహీనత రెండూ తాలిబన్‌. ‌వీరిని తయారుచేసింది పాకిస్తానే. అప్పట్లో అఫ్గానిస్తాన్‌లో సోవియట్‌ ‌సేనలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అమెరికాతో పశ్చిమ దేశాల ప్రోద్భలంతో పాకిస్తాన్‌ ‌నిఘా విభాగమైన ఐఎస్‌ఐ ‌వీరికి శిక్షణ ఇచ్చింది. తాలిబన్‌ ‌మొదటి ప్రభుత్వ హయాం (1996-2001)లో అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్‌ అడ్డూ అదుపూ లేకుంగా తన ఆటలు సాగించింది. ఆ తర్వాత తాలిబన్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అమెరికా వీరిని పూర్తిగా నిర్మూలించలేకపోయింది.

గతంలో తాలిబన్‌ అ‌గ్రనేత ముల్లా ఉమర్‌ ‌పాకిస్తాన్‌ అడుగుజాడల్లో నడవగా ఇప్పుడు అతని కుమారుడు, ప్రస్తుత రక్షణమంత్రి ముల్లా యాకబ్‌ ఇం‌దుకు భిన్నంగా ఉన్నారు. పాకిస్తాన్‌తో విభేదిస్తూ తమ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో తాలిబన్ల చూపు భారత్‌ ‌మీద పడింది. మన దేశానికి చేరువ కావడానికి కొంత కాలంగా గల్ఫ్ ‌దేశాల పాలకుల అండదండలతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఖతర్‌లో భారత విదేశాంగ శాఖ అధికారులతో ముల్లా యాఖూబ్‌ ‌సమావేశం కావడం ఆ తర్వాత దుబాయిలోనూ అఫ్ఘానిస్తాన్‌ ‌విదేశీ వ్యవహారాల మంత్రి ముత్తఖీ సమావేశం కావడం పాకిస్తాన్‌ను కలవరపరిచింది. పహల్గాంలో ఉగ్రదాడిని పాకిస్తాన్‌ ‌పేరును నేరుగా ప్రస్తావిస్తూనే అఫ్గాన్‌ ‌ఖండించింది. కానీ మన పొరుగునే ఉన్న నేపాల్‌ ఆపని చేయలేక పోయింది. ఇది భారత దౌత్యనీతికి విజయం.

కాగా అప్గాన్‌ ‌తాలిబన్‌ ‌ప్రభుత్వంతో భారత్‌ ‌సంబంధాలపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఉగ్రవాదులుగా, క్రూర స్వభావులుగా, మహిళల స్వేచ్ఛను గుర్తించని వారిగా, బాలికల విద్యకు వ్యతిరేకులుగా ఉన్న ఆరోపణలు వాస్తవమే. అయితే అంతర్జాతీయ సంబంధాల రీత్యా చూస్తే అనేక సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. తాలిబన్‌కు దగ్గరైతే పాకిస్తాన్‌తో మన సంబంధాలు మరింత క్షీణిస్తాయనేది కొందరి అభ్యంతరం. కానీ 1996 నాటి తాలిబన్‌ ‌వేరు, 2025 తాలిబన్‌ ‌వేరు. వారు మరికాస్త మధ్యేవాదులుగా మారారు.

క్రాంతిదేవ్‌ ‌మిత్ర

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE