అది 1941, జనవరి.

మేమంతా ఎరవాడ జైలులోని పొలిటికల్‌ ‌వార్డులో ఉన్నాం. సర్దార్‌పటేల్‌, ‌భూలాభాయ్‌ ‌దేశాయ్‌, ‌ఖేర్‌, ‌మగన్‌భాయ్‌ ‌పశ్వాసా, గిల్డర్‌, ‌నూరీ, ఎల్‌.ఎమ్‌. ‌పాటిల్‌, ‌నేను. మాకందరికీ నాయకుడు పటేల్‌. ‌గాంధీజీ సమక్షంలో తప్ప మిగిలిన అన్ని పరిస్థితుల లోను ఆధిపత్యం వహించకుండా ఉండలేదు ఆయన.

పటేల్‌ ‌మా అందరి బాగోగుల బాధ్యత తన మీద వేసుకున్నారు. ఒక ఖాళీ గదిలో భోజన పదార్థాలన్నీ సర్దించారు. ఆయన గది ఆయన రాజ్యం. ఆయన అనుమతిలేనిదే ఎవ్వరూ ఆ గదిలోనికి తొంగి చూడడానికైనా వీలు లేదు. అక్కడ అరలలో వరుసల వారిగా నెయ్యి, పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలు వంటి నంబారాలన్నీ ఒక పద్ధతిలో అమర్చి ఉండేవి.

పటేల్‌ 5 ‌గంటలకే లేచేవారు. స్టవ్‌ ‌వెలిగించి టీ చేసుకుని త్రాగేవారు. ఆ తర్వాత ఆలస్యంగా లేచే మిగతా వారికి టి తయారుచేసేవారు. మాలో ఎవరు ఏ సమయంలో లేచేదీ ఆయనకు తెలుసు. ఆ సమయాలలో లేచినవారంతా వారి టీ త్రాగ వలసిందే. అలాగే ఎవరికి ఎంత పంచదార కావాలో, ఎన్ని పాలు కావాలో ఆయనకు తెలుసు. ఆ ప్రకారంగా  పటేల్‌ ‌చేతులతో తయారైన టీ త్రాగ వలసిందే. ఇలా ఒక్కొక్కరికీ టీ విషయం, కథలు చెపుతూ, శ్లేషలు వాడుతూ ఉదయం గడిపే వారాయన. ఈ కబుర్లలో ఎవరు ఎన్ని కప్పుల టీ త్రాగామో తెలిసేది కాదు. ఆ తర్వాత వ్యాయామానికి, స్నానానికి ఎవరి స్థలాలకు వారు వెళ్లేవాళ్లం.

సుమారు 10 గంటలకు జైళ్ల ఇన్‌స్పెక్టర్‌ ‌జనరల్‌ ‌భండారీ వచ్చేవారు. పటేల్‌ ఏమంటారో అని భయపడుతూ వచ్చేవారాయన. పటేల్‌ ఒకరోజున భండారీని ఆట పట్టించేవారు. ఒకరోజున వ్యంగ్యంగా మాట్లాడేవారు. పాపం భండారీకి ఎలా బయట పడాలో తెలిసేది కాదు.

1931లో నేను నాసిక్‌ ‌జైలులో ఖైదీగా ఉన్నప్పుడు ఈ భండారీ సూపరిండెంటెట్‌గా ఉండేవారు. ఆ తర్వాత ఆయనకు జైళ్ల ఇన్‌స్పెక్టర్‌ ‌జనరల్‌గా నియమించడం నా వల్ల జరిగింది.

పటేల్‌ ‌కోపదృష్టి తనపై పడినప్పుడల్లా భండారీ నన్ను తన ఆఫీసుకు ఆహ్వానించి, ‘‘చూడండి నేను ప్రభుత్వోద్యోగిని. రాజకీయ వాదులంటే ముఖ్యంగా  నాయకులంటే నాకు సానుభూతి ఉంది. కాని నేను నా బాధ్యత నెరవేర్చాలి కదా! నా స్థితి అర్థం చేసుకోమని మీరు కాస్త పటేల్‌తో చెప్పాలి’’ అనేవాడు.

ఒకరోజున ఒక జైలరు వచ్చి దోమతెరలు చిరిగిపోయాయనీ, రాత్రికి అవి ఉండవనీ తెలిపాడు. ‘బజారు వెళ్లి కొనుక్కురా’ అన్నాడు పటేల్‌. ‘‘ఆర్డరిచ్చాం, ఇంకా రాలేదు’’ అన్నాడతడు. ‘‘వెళ్లి భండారీతో చెప్పు, జైలుకు నా అంతట నేను రాలేదు. ఆయనే నన్ను తెచ్చాడు. ఆయన దోమతెరలు ఇవ్వలేకపోతే, తలుపులు తెరువు, వెళ్లిపోతాను. దోమతెరలు వచ్చిన తర్వాత తిరిగి వస్తాను’’ అని దృఢస్వరంతో అన్నారు పటేల్‌. ఆ ‌మాటలే మరొకరంటే అది హాస్యంగానో, వట్టి బెదిరింపుగానో ఉండేది. కాని పటేల్‌ ‌మాటలలోని గట్టితనం ఆ జైలర్‌ను  కదిలించింది. గంట లోపల దోమతెరలు వచ్చాయి.

                                                                                                      *   *   *

పది గంటలయింది, ‘టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా’, ‘బాంబే క్రానికల్‌’’ ‌వచ్చాయి. పటేల్‌ ‌కుర్చీ ఎండలో వేసుకుని పేపరు చదువుతున్నాడు. మేము ఇద్దరు ముగ్గురం చేరుతాం. ఆయన చదువుతూ వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూ ఉంటారు. నేను ఆంగ్లేయాభిమానిని, కనుక (రెండో ప్రపంచ) యుద్ధం వార్తలు చదువుతూ మీ ఇంగ్లీషువాళ్లు, సముద్రంలో అట్టడుగుకు పోయారు అని వ్యాఖ్యానించేవారు.

నేను స్నానం చేసి, ధ్యానం, స్వాధ్యాయం చేస్తాను. ఆ తర్వాత రాతపని. లేకపోతే భూలాభాయ్‌ ‌వద్దకు వెళతాను.

11 గంటలకు పటేల్‌ ‌పంటలో నిమగ్న మవుతారు. ఆయన పర్యవేక్షణలో ఒకరిద్దరు ‘‘సి’’ క్లాసు ఖైదీలు పంట చేస్తారు.

ఒకరోజున మాలో ఒకరిని చూడడానికి వచ్చిన వారు మిఠాయిలు తెచ్చారు. పటేల్‌ అక్కడ లేనందున వాటిని అందుకున్న వ్యక్తి వాటిని వంటగదిలో పెట్టాడు. వాటి చుట్టూ చీమలు చేరాయి. ఆపై అవి పాలకూ, పెరుగుకూ పట్టాయి. అది చూచి పటేల్‌ ఉ‌గ్రుడయ్యారు. మిఠాయి తెచ్చినవారి మీద, తీసుకున్న వారి మీద, ఆఖరికి మిఠాయిల మీద, చీమల మీద కారాలు మిరియాలు నూరారు. ఆ మిఠాయి లన్నిటినీ ‘సి’ క్లాసు ఖైదీలకు పంచారు. ఇక ఆ రోజంతా ఆ వంటిల్లు కడిగించి, శుభ్రం చేయించారు, ఒక చీమయినా లేకుండా. ఆయన భోజనం క్లుప్తంగా ఉండేది. రుచులూ, పాకాలు, రకరకాల పంటలు ఆయనకు అక్కరలేదు. అయితే వండిన దాన్ని శుభ్రంగా తినేవారు, తినిపించేవారు. అలా తినిపించి నప్పుడు మేము వద్దనలేకపోయేవాళ్లం. నాలాంటివాళ్లు ఆ తర్వాత బాధపడేవారు. మధ్యాహ్నం భోజనం తర్వాత అంతా కాసేపు విశ్రాంతి తీసుకునేవాళ్లం.

                                                                                                      *   *   *

విశ్రాంతి తర్వాత చర్ఖా క్లబ్‌ ‌సమావేశం ప్రారంభించేది. అంతా రెండు గంటలపాటు రాట్నాల వద్ద సూలు వడుకుతూ కూచునేవారు. నేను మాత్రం -అనారోగ్యంవల్ల – పది నిమిషాలు వడికి ఆ తర్వాత రాసుకునేవాణ్ణి.

3.30కు పటేల్‌ ‌మళ్లీ టేబుల్‌ ‌వద్దకు వెళ్లి టీ తయారు చేసేవారు. సరిగా 4 గంటలకు అంతా టేబుల్‌ ‌వద్దకు చేరి టీ త్రాగేవారు. కులాసాగా కబుర్లు చెప్పుకునేవారు. పటేల్‌ ‌తలచుకోవాలేగాని, ఆయనంత సరసంగా ఎవరూ ఉండలేరు. పటేల్‌ ఆ ‌తర్వాత వరండాలో పచార్లు చేసేవారు.

4.30కు భూలాభాయ్‌ ‌నా గదికి వచ్చారు. మేమిద్దరం కలసి భగవద్గీత చదివాము. భూలాభాయ్‌కి గీత తెలియదు. పైగా దానిపై తరచు హేళనగా మాట్లాడేవారు. పచార్లు చేస్తూ ఈ మాటలు విన్న పటేల్‌ ‌నాతో ‘మీరు గీతలో చెప్పినదాన్ని పాటించడం లేదు. నన్ను ఈసడించే వారికి నా సందేశాన్ని చెప్పవద్దని శ్రీ కృష్ణుడు చెప్పలేదా?’ అన్నారు.

పటేల్‌కు గీత అంటే ఎంతో అభిమానం. అయితే ఆ తరహా వేరు. దాని లోని తాత్విక విషయాలు ఆయన కంత పట్టేవి కాదు. ఆయనకు కావలసింది అది ఇచ్చే ప్రేరణయే. ఆయన పగలు గీత చదువుతూ ఉండడం నేను చూచేవాణ్ణి.  ఆయనకు భగవంతునిలో ప్రగాఢమైన విశ్వాసం ఉన్నదని కొన్ని సందర్భాలలో నాకు తెలిసింది. అయితే సాధారణంగా పైకి వ్యక్తమయ్యేది కాదు.

4.30 నుండి పటేల్‌ ‌పచార్లు చేస్తూ ఎవరో ఒకరితో కబుర్లాడుతూ ఉండేవారు. ఇవి ఎంతో ఆసక్తికరంగా ఉండేవి. యుద్ధ పరిస్థితి, భారత రాజకీయాలు, నాయకులు, వారి అలవాట్లు, వారి దృక్పథాలు ఇలా ఎన్నో విషయాలు దొర్లిపోయేవి. ప్రతి ఒక్కదానిపై ఆయన వ్యాఖ్య సగం హాస్యంగా, సగం నిశితంగా ఉండేవి. ఆయన ప్రతి వ్యాఖ్యలో  ఆ వ్యక్తిని గాని, ఆ పరిస్థితిని గాని లోతుకుపోయి చూడగల ప్రతిభ కానవచ్చేది. ఆయన ఎవరిని గురించయినా ఎన్నో ఘట్టాలు, అనుభవాలు చెప్పేవారు. ఆయన నవ్వు అందరినీ నవ్వించేది. తన మీద జోక్‌ ‌వేస్తే మాత్రం ఆయన సహించేవారు కారు.

పచార్లు తర్వాత మామిడిచెట్టు క్రింద ప్రార్థన జరిపేవాళ్లం. గాంధీజీ ప్రార్థన సమావేశల్లో జరిపే ప్రార్థన అది.

తర్వాత 7.30కు రాత్రి భోజనం. అయితే చీకటి పడినకొద్ది పగలున్న ఉల్లాసం క్రమంగా తగ్గేది.

పటేల్‌కు ఎంతసేపు నడిచినా అలసటరాదు. రోజుకు కనీసం 8 గంటలయినా ఆయన నిలబడి పని చేసేవారు. లేదా నడిచేవారు. రాత్రి భోజనం తర్వాత ఆయన మళ్లీ పచార్లు చేసేవారు. తరచు ఆయనతోపాటు నేను పచార్లు చేసేవాణ్ణి. ఆయన గాంధీజీ ప్రభావం పడక పూర్వం తన జీవితంలోని సంఘటనలు వర్ణించేవారు.

పటేల్‌ ఒక విధంగా సన్యాసి. ఆయనది రైతు జీవితంవలె నిరాడంబరమైన జీవితం. ఆయన కోరికలు బహుకొద్ది. ఆయన సంయమి. అయితే ఆయన జీవితంలోని అన్ని రంగాలూ తెలుసు. జీవితంలోని వైవిధ్యాన్నీ పుష్టినీ ఆయన ఆస్వాదించ గలడు. ఆయనకు పాత గుజరాతీ పాటలు కొన్ని గుర్తున్నాయి. ఆయన వాటిని పాడుతుంటే వినేవాణ్ణి.

8.45కు ఆయన తన గదిలోకి వెళ్లిపోయేవాడు. 9 గంటలకల్లా గాఢనిద్రలో ఉండేవారు.

                                                                                                      *   *   *

మార్చి నెలలో నాకు తీవ్రమైన జబ్బు వచ్చింది. రోజులో సగభాగం తెలివి లేకుండా పడి ఉండేవాణ్ణి. గిల్టర్‌ ‌నాకు డాక్టరుగా, నర్సుగా సేవ చేశారు. పటేల్‌ ‌తల్లివలె వాత్సల్యంతో నా ఆరోగ్యం విషయం చూచుకున్నారు. రోజూ ఎన్నోసార్లు నా గదిలోకి వచ్చి, నాకు సదుపాయాలన్నీ జరిగేటట్లు చూచి, ధైర్యం చెప్పి వెళ్లేవారు. నా జబ్బు తీవ్రమయిన దశలో రాత్రి పూట కూడా ఒకటి రెండుసార్లు వచ్చి చూచేవారు. చివరకు నన్ను జైల్లో ఉంచడం మంచిది కాదని ప్రభుత్వం భావించింది. స్ట్రెచర్‌లో నన్ను జైలు నుండి బయటికి తీసుకువెళుతున్నారు. జైలు గేటువరకు వచ్చి పటేల్‌ ‌నన్ను సాగనంపారు. ఆ సమయంలో ఆయన కళ•్ల చెమ్మగిల్లడం నాకు కనిపించింది.

– జాగృతి, 27.10.1975

(శతజయంతి నివాళి)

About Author

By editor

Twitter
YOUTUBE