టిప్పు సుల్తాన్‌ను ఆరాధించడమే తెలిసిన పార్టీ పాలనలో ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. శాసనమండలి ప్రాంగణంలో పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు ప్రతిధ్వనించినా నోరెత్తని బుజ్జగింపు నేతల బుర్రలు ఇంతకు మించి ఆలోచించలేవు.  ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దైనిందన శాఖలను బహిరంగ ప్రదేశాల నుంచి బహిష్కరించాలని కన్నడ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మరొక వెర్రి ప్రయత్నం చేస్తున్నది. దేశాన్ని ఏలిన నూట ముప్పయ్యేళ్ల పార్టీ  రెండు రాష్ట్రాలకు పరిమితమయింది. అధిష్ఠానం మెప్పు కోసం, విదేశాలలో దేశం పరువును నిట్టనిలువునా తీయడానికి నిరంతరం ప్రయత్నించే రాహుల్‌ ‌గాంధీ కళ్లలో ఆనందం చూడడానికి కర్ణాటక నేతలు ఈ కుప్పిగంతులు వేస్తున్నారు.  సంఘం  ఆవిర్భవించిన ఈ వందేళ్లలో మూడుసార్లు కాంగ్రెస్‌ ‌పార్టీయే ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించింది. ఆ మూడు పర్యాయాలు చావు తప్పి కన్ను లొట్టపోయిన పార్టీయే మరో ప్రయత్నం చేస్తున్నది. ప్రజలు దీనిని గమనిస్తున్నారన్న స్పృహ లేకపోవడమే ఇందుకు కారణం. చారిత్రక దృష్టి అసలే లేకపోవడం మరొక కారణం. పదవీదాహం, దొడ్డిదారి రాజకీయాలు మరొక కారణం. అంతిమంగా హిందువుల మనోభావాలను కించ పరచడం అలవాటుగా మారిపోవడం నిజమైన కారణం.

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌శతాబ్ది ఉత్సవాలను దేశవ్యాప్తంగా క్రమశిక్షణ, సేవ, దేశభక్తితో జరుపుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాలకు దారితీసింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ‌ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖలో ప్రభుత్వ సంస్థలు, ఉద్యాన వనాలు, దేవాల యాలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్‌ ‌చేశారు. అక్టోబర్‌ 4 ‌నాటి ఈ లేఖను ముఖ్యమంత్రి కార్యాలయం అక్టోబర్‌ 12‌న బహిర్గతం చేసింది. తర్వాత, ఈ విషయాన్ని పరిశీలించి ‘‘తగిన చర్య’’ తీసుకోవాలని ముఖ్య మంత్రి సిద్ధరామయ్య ప్రధాన కార్యదర్శి షాలిని రజనీష్‌ను ఆదేశించారు. ఈ అధికారిక చర్య శతాబ్దం నాటి దేశభక్త సంస్థపై ప్రభుత్వం అప్రకటిత అత్యవసర పరిస్థితి విధించడానికి సన్నాహాలు చేస్తున్నదనే సంకేతాన్ని ఇచ్చింది. ప్రియాంక్‌ ‌ఖర్గే ఆరోపణ సైద్ధాంతికమా? లేక రాజకీయమా? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. ప్రియాంక్‌ ‌తన లేఖలో, ప్రభుత్వ ఎయిడెడ్‌ ‌విద్యా సంస్థలలో అనుమతి లేకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖలు నిర్వహిస్తున్నారని, అక్కడ స్వయంసేవకులు ‘‘కర్రలు తిప్పుతూ పిల్లలలో ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని’’ ఆరోపించారు. ఈ కార్యకలాపాలను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, వాటిని వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆయన దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే, ‘‘చట్టబద్ధమైన పక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తాం’’ అని ఖర్గే అన్నారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో బీజేపీ నుండి తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఆయన హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని కలిగి ఉన్నారని ఆరోపించింది.

ఇప్పుడు, ఈ లేఖకు అధికారిక హోదా లభించడంతో, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ ఉద్దేశాలు వాక్చాతుర్యాన్ని దాటి, సంఘ్‌పై పరిపాలనా చర్యగా మారినట్లు కనిపిస్తున్నాయి.

ప్రియాంక్‌ ‌ఖర్గే లేఖ తర్వాత, సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫామ్‌లు బ్యాన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌-ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలి అనే హ్యాష్‌ ‌ట్యాగ్‌తో నిండిపోయాయి, వీటిని ఎక్కువగా వామపక్ష, ఇస్లామిస్ట్ ‌గ్రూపులు ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం ఆర్‌ఎస్‌ఎస్‌ను ఒక ‘‘ఫాసిస్ట్’’, ‘‘‌హిందూ జాతీయవాద’’ సంస్థగా చిత్రీకరిస్తుంది. అయితే ఇటువంటి సమన్వయ ప్రచారాలు భారతదేశంలోని అతిపెద్ద సామాజిక-సాంస్కృతిక సంస్థను బలహీనపరిచే సైద్ధాంతిక ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తాయని పరిశీలకుల భావన. రాజకీయ దురుద్దేశాలు, అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ ‌మధ్య అంతర్గత విభేదాల నుండి, అలాగే అవినీతి, విద్యుత్‌ ‌కొరత నేరాల రేటుపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు మళ్లింపుగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అట్టడుగు వర్గాల మద్దతు ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్‌ ‌పార్టీ రాజకీయ అపరిపకత్వను ప్రతిబింబిస్తోంది. నాగపూర్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రధాన కార్యాలయం ఉన్న చోటు) కనుసన్నల్లోనే సీపీఐ(మావోయిస్టు) పొలిట్‌బ్యూరో తెలుగు ప్రాంత సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ ‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌మధ్య ‘బ్రాహ్మణీయ బంధం’తోనే లొంగి పోయాడంటూ వామపక్ష ఉగ్రవాదానికి పెను విఘాతం లాంటి చరిత్రాత్మక ఘటనను కూడా కులపు కళ్లద్లాల్లో నుంచి విశ్లేషిస్తున్న వారి భావదారిద్య్రం వందేళ్లుగా రెపరెపలాడుతున్న భగవాద్ధ్వజం పట్ల అసూయాద్వేషాలకు అద్దం పడుతోంది.

లక్షలాది జనహృదయాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌

‌శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్‌ ‌ముతాలిక్‌ ‌సంస్థను గట్టిగా సమర్థించారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశాన్ని విభజించి, బలహీనపరిచిన 130 సంవత్సరాల వయసున్న కాంగ్రెస్‌ ‌పార్టీ లాంటిది కాదు’’ అని ముతాలిక్‌ అన్నారు.

‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లక్షలాది మంది అంకితభావంతో పనిచేసే స్వయంసేవకుల కృషితో మరింత బలంగా పెరిగింది. వంద సంవత్సరాల తర్వాత కూడా అది ఐక్యంగా, క్రమశిక్షణతో భారత్‌ ‌నేలలో లోతుగా పాతుకుపోయింది’’ అని తెలిపారు. ‘‘భారత్‌ ‌మాతా కీ జై అని నినాదాలు చేసే వారి గొంతులను అణచివేయాలని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కోరుకుంటుంది, కానీ విధాన సౌధలో, ఇతర చోట్ల పాకిస్తాన్‌ ‌జిందాబాద్‌ ‌వంటి నినాదాలు చేసినప్పుడు మౌనంగా ఉంటుంది’’ అని ఆయన విమర్శించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ను తాలిబన్‌తో పోల్చిన కాంగ్రెస్‌ ‌నాయకుడు బీకే హరిప్రసాద్‌ను ఎగతాళి చేస్తూ ‘‘దేశానికి సేవ చేసే సంస్థకు మానవత్వాన్ని నాశనం చేసే ఉగ్రవాద సంస్థకు మధ్య తేడా ఆయనకు అర్థం కాలేదా?’’ అని ముతాలిక్‌ ‌మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తన కార్యకలాపాల కోసం ప్రభుత్వ స్థలాలపై ఎప్పుడూ ఆధారపడలేదని ఆయన నొక్కి చెప్పారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రభుత్వ స్థలాలు అవసరం లేదు. దీనికి లక్షలాది మంది పౌరుల హృదయాలు, ఇళ్లు ఉన్నాయి. సంఘ్‌ ‌పరిధి సాంస్కృతిక సామాజిక సేవా విభాగాల ద్వారా 250 దేశాలలో విస్తరించి ఉంది’’ అని ముతాలిక్‌ ‌జోడించారు.

కర్ణాటక అంతటా ‘ఐ లవ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌’

‌ప్రభుత్వ సంస్థలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకలాపాలను నిషేధించాలని మంత్రి ప్రియాంక్‌ ‌ఖర్గే చేసిన డిమాండ్‌ ‌కర్ణాటక అంతటా తీవ్ర రాజకీయ ప్రతి చర్యలకు దారితీసింది. బీజేపీ నాయకులు శతాబ్దకాలపు జాతీయవాద సంస్థకు సంఘీభావం తెలిపేందుకు ‘ఐ లవ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌’ ‌ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రియాంక్‌ ‌ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖలో సైద్ధాంతిక పక్షపాతం ఉందని ఆరోపించారు. ఇది ‘‘దేశభక్తిపై దాడి’’, ‘‘నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తున్న లక్షలాది మంది స్వయంసేవకులకు అవమానం’’ అని విమర్శించారు.

మంత్రికి కోట లాంటి కలబురగిలో, బీజేపీ నాయకులు ‘‘భారతదేశాన్ని ప్రేమించే వారు ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా ప్రేమిస్తారు’’ అని రాసి ఉన్న పోస్టర్లతో వీధుల్లోకి వచ్చారు. ఈ ప్రచారంలో మాజీ ఎంఎల్‌సి అమర్‌నాథ్‌ ‌పాటిల్‌, ‌మాజీ జిల్లా అధ్యక్షుడు శివరాజ్‌ ‌పాటిల్‌ ‌రద్దేవాడగి వంటి స్థానిక నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లను అతికించారు. ఇది వెంటనే సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయింది. ఖర్గే వివాదాస్పద లేఖకు ప్రతిగా సోషల్‌ ‌మీడియా బీజేపీ నేతలు పోస్టర్లపై పేర్కొన్న నినాదంతో నిండి పోయింది. ఒక శతాబ్దం పాటు ఐక్యత, క్రమశిక్షణతో జాతికి గర్వించదగిన చిహ్నంగా నిలిచిన సంస్థను కించపరచడానికి ఖర్గే ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ‘‘సంఘ్‌ ‌పరివార్‌ ‌దేశవ్యాప్తంగా దేశభక్తిని ప్రేరేపిస్తుంది. మంత్రికి ఇది తెలియదా?’’ అని ప్రచారం సందర్భంగా ఒక నాయకుడు అడిగారు. ‘‘దేశం మొత్తం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటుండగా, ఖర్గే అనవసరమైన వివాదాన్ని రేకెత్తించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది’’ అని ఆరోపించారు.

‘‘ప్రియాంక్‌ ‌ఖర్గేకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గురించి మాట్లాడకపోతే ముద్ద మింగుడుపడదు’’ అని మాజీ ముఖ్యమంత్రి, హుబ్బళ్లీ ఎంపీ జగదీష్‌ ‌షెట్టర్‌ ‌విరుచుకుపడ్డారు. ఖర్గే రాజకీయ ఎదుగుదల తన తండ్రి ప్రభావం వల్లే జరిగిందని, ఆయన ప్రతిభ వ్ల కాదని షెట్టర్‌ అన్నారు. ‘‘తన తండ్రి ఆశీర్వాదం వల్లే ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా మంత్రి అయ్యారు. లేకపోతే, అలాంటి వ్యాఖ్యలు చేసే స్థాయి ఆయనకు లేదు’’ అని షెట్టర్‌ ‌వ్యాఖ్యానించారు. మైసూరులో, మాజీ ఎంపీ ప్రతాప్‌ ‌సింహా ఖర్గే డిమాండ్‌ ‌సాధ్యాసాధ్యాలను ప్రశ్నించారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడం మర్చిపోండి’’ అని ఆయన అన్నారు. ‘‘నెహ్రూ కుటుంబం సైతం ఆ పని చేయలేకపోయింది. నెహ్రూ వంశపారంపర్యంగా నడుస్తున్న సిద్ధరామయ్య అలా చేయాలని ఎలా కలలు కంటారు?’’ అని సింహా చేసిన వ్యాఖ్యలు బీజేపీలో విస్తృతంగా పంచుకున్న భావనను ప్రతిధ్వని స్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దాని లోతైన మూలాలతో, స్వయంసేవకుల బలంతో రాజకీయ కక్ష సాధింపు దారులకు అందనంత దూరంలో ఉంది.

ఉద్యోగిపై సస్పెన్షన్‌ ‌వేటు

కర్ణాటక కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బాగా బరితెగిం చేసింది. సంఘ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్నందుకు ఒక ప్రభుత్వోద్యోగిని సస్పెండ్‌ ‌చేసేసింది. కేపీ ప్రవీణ్‌ ‌కుమార్‌ అనే శివార్‌ ‌తాలూక్‌ ‌పంచాయత్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ అధికారి మీద ఈ చర్యకు పాల్పడింది. అక్టోబర్‌ 12‌న లింగసాగర్‌ అనే చోట జరిగిన శతాబ్ది  ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రవీణ్‌కుమార్‌ ‌లింగసాగర్‌ ఎమ్మెల్యే మానప్ప వజ్జాల్‌కు వ్యక్తిగత సహాయకునిగా కూడా పని చేస్తున్నారు. పూర్తి గణవేష్‌లో ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌పథసంచ లన్‌లో కూడా పాల్గొన్నారు. ఇలాంటి పాల్గొనడం ప్రభుత్వోద్యోగుల నియమ నిబంధనలకు పూర్తి విరుద్ధమని సిద్ధ రామయ్య ప్రభుత్వం సెల విచ్చింది. మొత్తం ఈ వ్యవహారం మీద రాయచూర్‌ ‌జిల్లా పంచాయత్‌ ‌సీఈఓ, పంచాయతీ రాజ్‌ ‌శాఖ కమిషనర్‌ అరుంధతీ చంద్రశేఖర్‌ ‌దర్యాపు కూడా చేశారట. అంతిమంగా ఆమె ప్రవీణ్‌కుమార్‌ ‌సస్పెన్షన్‌కు సిఫారసు చేశారట. ఈ కోడ్‌, అం‌టే కర్ణాటక సివిల్‌ ‌సర్వీసెస్‌ (‌కాండక్ట్) ‌రూల్స్‌ను 2021లోనే రూపొందించారట. శాఖాపర మైన దర్యాప్తునకు కూడా ఆదేశించారు. అంటే సాధ్య మైంత కాలం ఆయనను వేధించే పని పెట్టుకుంది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం.

ఖర్గే దేశభక్తిని సవాల్‌ ‌చేసిన విజయేంద్ర

దేశభక్తికి నిదర్శనమైన సంస్థలో పనిచేసినట్టుగా ఒక తార్కాణం చూపించాలని  మంత్రి ఖర్గేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర సవాల్‌ ‌చేశారు. ‘‘కాంగ్రెస్‌ అనే అధికార కర్మాగారం కాకుండా, మీరు ఏ జాతీయవాద సంస్థకు సేవ చేసారు?’’ అని ప్రశ్నించారు. జాతీయవాద సంస్థలతో గతంలో ఏదైనా సంబంధాన్ని బహిరంగంగా వెల్లడించాలని ఖర్గేను సవాలు చేశారు. ముస్లిం ఛాందసవాద గ్రూపులు చేసిన మత హింస, ఉగ్రవాదాన్ని ఖర్గే ఎప్పుడూ  ఖండించలేదని, హిందూ సంస్థలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటారని ఆరోపించారు. హైదరాబాద్‌ ‌విముక్తి పోరాటంలో రజాకార్లు చేసిన దురాగతాలపై ఖర్గే మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించారు. ‘‘మీ పూజ్యలైన తండ్రి రజాకార్ల దాడుల నుండి బయటపడ్డారు. అయిన ప్పటికీ మీరు వారి వారసత్వాన్ని ఎప్పుడూ విమర్శించ లేదు. బదులుగా, మీరు అలాంటి భావజాలాలను పెంపొందించే పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు’’ అని ఖర్గే తండ్రి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గేను ప్రస్తావిస్తూ విజయేంద్ర అన్నారు. ప్రియాంక్‌ ‌ఖర్గే రాజకీయ లాభం కోసం ఆర్‌ఎస్‌ఎస్‌, ‌హిందూ జాతీయవాద ఉద్యమాలను కించపరచడానికి తన పదవిని ఉపయోగిస్తున్నారని విజయేంద్ర ఆరోపిం చారు. ‘‘మీ ఉద్దేశ్యం ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించడం కాదు, హిందూ మతాన్ని కించపరచడమే. మీరు మన నాగరికత మూలాలను మరచిపోయి ఇప్పుడు జాతీయవాద సంస్థలపై దాడి చేయడం ద్వారా మీ హైకమాండ్‌ను సంతోషపెట్టడానికి పోటీ పడుతు న్నారు’’ అని ఆయన ఆరోపించారు.

ఖర్గేకు బెదిరింపు కాల్‌.. ‌ప్రచారం కోసమేనన్న బీజేపీ

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకలాపాలను బహిరంగ ప్రదేశాల్లో నిషేధించాలనే ప్రతిపాదనపై మంత్రి ప్రియాంక్‌ ‌ఖర్గేను బెదిరించిన వ్యక్తిని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అక్టోబర్‌ 16‌న గురువారం మహారాష్ట్రలోని లాతూర్‌లో అరెస్టు చేశారు. నిందితుడిని మహారాష్ట్రలోని సోలాపూర్‌ ‌జిల్లా నివాసి అయిన దానేష్‌ అలియాస్‌ ‌దానప్ప నరోనిగా గుర్తించారు. కలబురగి జిల్లా పోలీసులు, బెంగళూరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. అధికారుల ప్రకారం, మంత్రి ఖర్గేకు బెదిరింపు ఫోన్‌ ‌కాల్‌ ‌చేసిన తర్వాత, నిందితుడు తన స్వస్థలం వదిలి లాతూర్‌కు పారి పోయాడు.

బెదిరింపు కాల్‌ ‌తర్వాత బెంగళూరులోని సదాశివనగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు అయ్యింది. దీనికి సంబంధించి మంత్రి ఖర్గే 2.12 నిమిషాల క్లిప్‌ను విడుదల చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకలాపాలను బహిరంగ ప్రదేశాల్లో నిషేధించాలనే తన ప్రతిపాదనపై బెదిరింపు కాల్స్ ‌వస్తున్నాయని ఖర్గే చేసిన వాదనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర స్పందిస్తూ ఖర్గే కేవలం ప్రచారం పొందడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

‘‘ఈ రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించవచ్చని చెప్పడం అవివేకం. నేను మంత్రి ప్రియాంక్‌ ‌ఖర్గేను గౌరవంగా అడగాలనుకుంటున్నాను. మీరు కలిగి ఉన్న గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్‌ (ఆర్‌డిపిఆర్‌) ‌పోర్ట్‌ఫోలియోలో మీరు సాధించిన విజయాలు ఏమిటి? మీరు ప్రజలకు ఉపయోగకరమైన ఏ సంస్కరణలను ప్రవేశపెట్టారు?’’ అని విజయేంద్ర ప్రశ్నించారు.

ఉద్రిక్తతలకు వేదికగా చిత్తాపూర్‌

ఖర్గేకు ప్రత్యక్ష సవాలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ అక్టోబర్‌ 19‌న మంత్రి చిత్తాపూర్‌ ‌నియోజకవర్గంలో ఒక కవాతు నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై ఆయన స్పందిస్తూ ‘‘బీజేపీ నాయకుల పిల్లలు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వస్త్రధారణలో నా నియోజకవర్గానికి వస్తే నేను వారిని స్వాగతిస్తాను. వారు పాదయాత్ర చేయనివ్వండి. వారిని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ నియమాలు ఉన్నాయి. బీజేపీ నాయకులు తమ పిల్లలు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌యూనిఫాంలో వచ్చి మార్చ్‌లో పాల్గొనాలని నేను అభ్యర్థిస్తున్నాను’’ అని బెంగుళూరులో అన్నారు. అయితే చిత్తాపూర్‌లో కవాతు కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వయంసేవకులు ఏర్పాటు చేసిన భగవాధ్వజాలు, బ్యానర్లు, కటౌట్‌లను మున్సిపల్‌ అధికారులు భారీ పోలీసు భద్రత మధ్య తొలగించ డంతో చిత్తాపూర్‌లో ఉద్రిక్తతలకు దారి తీసింది. ముందస్తు నోటీసు లేకుండా అర్థరాత్రి తొలగింపును బీజేపీ నాయకులు, హిందూ అనుకూల సంస్థలు తీవ్రంగా ఖండించారు. మంత్రి ప్రియాంక్‌ ‌ఖర్గే ప్రభావంతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హిందూ గొంతులను అణచివేస్తోందని, రాజకీయ పక్షపాతాన్ని ప్రదర్శి స్తోందని వారు ఆరోపించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చిత్తాపూర్‌ ‌పట్టణ మునిసిపా లిటీ అక్టోబర్‌ 17‌న అర్థరాత్రి సీనియర్‌ అధికారుల సూచనల మేరకు ఆపరేషన్‌ ‌నిర్వహిం చింది. అధికారిక అనుమతి లేదని పేర్కొంటూ ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసిన కాషాయ జెండాలు, బ్యానర్లు  హోర్డింగ్‌లను తొలగించడానికి కార్మికు లను నియమించారు. ఊరేగింపునకు అనుమతి కోరుతూ దరఖాస్తుపై నివేదిక కోరుతూ తహశీల్దార్‌ ‌పోలీసు శాఖకు రాసిన లేఖ తర్వాత ఈ చర్య చోటు చేసుకుంది. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతి ఉందని, సంబంధిత పన్నులన్నీ చెల్లించామని బీజేపీ• నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మద్దతుదారులు పేర్కొ న్నారు. వారు తొలగింపు ప్రారంభమైన వెంటనే  లాడ్జింగ్‌ ‌క్రాస్‌ ‌ప్రాంతానికి చేరుకుని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు రాజకీయ ఒత్తిడితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా పోలీసులు అదనపు బలగాలను మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌జెండాలు,  బ్యానర్లను తొలగించాలన్న తాజా ఉత్తర్వు ప్రియాంక్‌ ‌లేఖ ప్రత్యక్ష ఫలితం, ‘‘హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని’’ ప్రతిబింబిస్తుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు ఆర్‌. అశోక దీనిని ‘‘ప్రజా స్వామ్యం, హిందూ విశ్వాసంపై దాడి’’ అని అభివర్ణిం చారు. ‘‘చిత్తాపూర్‌ ‌భారతదేశంలో భాగమా లేక ఖర్గే కుటుంబం ప్రైవేట్‌ ఆస్తినా? ప్రకటనల పన్ను చెల్లించి, మున్సిపల్‌ అనుమతి పొందిన తర్వాత కూడా, శాంతిభద్రతల ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బ్యానర్లను తొలగించారు’’ అని విమర్శించారు.

ప్రియాంక్‌ ‌ఖర్గే చిత్తాపూర్‌ ‘‘‌నిజాం లేదా రజాకార్‌’’ ‌లాగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ‘‘‌హడావుడి రాజకీయాలు’’ ఎక్కువ కాలం ఉండవని హెచ్చరించారు. ‘‘ఢిల్లీలోని నకిలీ గాంధీ లను ఆర్‌ఎస్‌ఎస్‌ను కించపరచడం సంతోషపరు స్తుందని కలలు కనకండి. చిత్తాపూర్‌ ‌ప్రజలు తగిన సమాధానం ఇస్తారు’’ అని అశోక హెచ్చరించారు.

కాషాయ జెండాలను తొలగించడం ఈ ప్రాంతం లోని హిందూ సంస్థలలో విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల ధార్మిక చిహ్నాలను లక్ష్యంగా చేసుకుని, ఉద్దేశపూర్వకంగా వారిని రెచ్చగొడుతోందని, ఇతర వర్గాలు చేసే ఇలాంటి ప్రదర్శనలను పట్టించుకోలేదని ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బజరంగ్‌ ‌దళ్‌ ‌నాయకులు ఆరోపించారు. ‘‘ఇది జెండాల గురించి మాత్రమే కాదు – ఇది సెలెక్టివ్‌ ‌లౌకికవాదం గురించి. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రమాద కరమైన ఓటు బ్యాంకు రాజకీయాలను ఆడుతోందని’’ ఆరోపించారు.

నవంబర్‌ 2‌న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కవాతుకు కోర్టు అనుమతి

కర్ణాటకలోని కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలేలా, నవంబర్‌ 2‌న చిత్తాపూర్‌లో కవాతును నిర్వహించుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ఆదివారం చిత్తాపూర్‌లో కవాతను నిర్వహించడా నికి అనుమతి ఇవ్వడంలో అధికారుల నిష్క్రియాత్మ కతను సవాలు చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కలబురగి ప్రతినిధి అశోక్‌ ‌పాటిల్‌ ‌దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా అందరి మనోభావాలను గౌరవించాలని జస్టిస్‌ ఎం‌జిఎస్‌ ‌కమల్‌  ‌రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

మాట మార్చిన సీఎం

ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువడిన అనంతరం సీఎం సిద్ధరామయ్య  మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ ‘‘అన్ని సంస్థలు అనుమతి తీసుకోవాలి. జగదీష్‌ ‌షెట్టార్‌ ‌నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆ నిబంధన వచ్చింది. మేము దానిని పునరావృత్తం చేసాము’’ అని అన్నారు. మీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘‘మేము ఆర్‌ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకోవడం లేదు. ఈ నియమం అన్ని ప్రైవేట్‌ ‌సంస్థలకు వర్తిస్తుంది’’ అని అన్నారు.

మరి రోడ్లపై నమాజ్‌ల సంగతేమిటి?

ప్రభుత్వ, బహిరంగ ప్రదేశాలలో మతపరమైన కార్యకలాపాలను ఏకరీతిలో నిషేధించాలని డిమాండ్‌ ‌చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ ‌యత్నాల్‌ ‌లేఖ రాశారు. మీరు ఇప్పుడు చెబుతున్న అదే నిబంధనల ప్రకారం ప్రభుత్వ, బహిరంగ ప్రదేశాలలో నమాజ్‌ ‌లను కూడా అనుమతించకూడదని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వం లౌకికవాదం, చట్టం ముందు సమానత్వాన్ని కాపాడాలని కోరుకుంటే, దాని నియమాలను ఏ వర్గానికి అనుకూలంగా లేదా వివక్ష చూపకుండా ఏకరీతిలో అమలు చేయాలని యత్నాల్‌ ‌తన వివరణాత్మక లేఖలో పేర్కొన్నారు. ‘‘అన్ని వర్గాలకు శాంతితోట’ను సృష్టించాలనే ప్రభుత్వ ఉద్దేశం అందరికీ సమానంగా వర్తించాలి. అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను’’ అని ఆయన రాశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వంటి జాతీయవాద సంస్థలపై వివక్షను చూపుతూ ప్రభుత్వ, బహిరంగ స్థలాలను ఉపయోగించడంపై ఆంక్షలు విధించిందని ఆరోపించారు ‘‘న్యాయం, సమానత్వం అనే స్ఫూర్తితో, ఈ విధానాన్ని అన్ని సామాజిక, మత సమూహాలకు వర్తింపజేయాలి’’ అని యత్నాల్‌ ‌రాశారు.

ప్రభుత్వ రహదారులు, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ ప్రాంగణాలలో అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ప్రజలు నమాజ్‌ ‌చేసే అనేక సందర్భాలు నమోదయ్యాయని ఆయన ఎత్తి చూపారు. ఇటువంటి సమావేశాలు ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తాయని ఆయన అన్నారు.

‘‘ఈ ఆచారం రవాణా సవాళ్లను సృష్టించడమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19, 21 ‌కింద హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘి స్తుంది. ఇది పౌరుల స్వేచ్ఛా సంచార హక్కు, బహిరంగ ప్రదేశాలకు ప్రాప్యతను లేకుండా చేస్తుంది’’ అని యత్నాల్‌ అన్నారు.

ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాలలో నమాజ్‌ ‌లేదా మరే ఇతర మతపరమైన కార్యకలాపాలు నిర్వహించకుండా రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్లు, పోలీస్‌ ‌కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని యత్నాల్‌ ‌ముఖ్యమంత్రిని కోరారు. మతపరమైన ప్రయోజనాల కోసం ప్రభుత్వ స్థలాలను అనధికారికంగా ఉపయోగించడంపై ఆంక్షలు, జరిమానాలను స్పష్టంగా నిర్వచించే కర్ణాటక పోలీస్‌ ‌చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణిక ఆపరేటింగ్‌ ‌విధానం -ఎస్‌వోపీ లేదా సర్క్యులర్‌ ‌జారీ చేయాలని కూడా ఆయన డిమాండ్‌ ‌చేశారు.

ఖర్గే.. కపట నాటకాలు ఆడవద్దు..!

మంత్రి ప్రియాంక్‌ ‌ఖర్గే రాజకీయ లబ్ధి కోసం కల్పిత ప్రాణహాని సమస్యను సృష్టించారని బీజేపీ సీనియర్‌ ‌నాయకుడు, మాజీ మంత్రి ఎంపి రేణుకాచార్య  ఆరోపించారు. దావణగెరెలో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ఖర్గే తన మద్దతుదారుల ద్వారా తనకు తానుగా తప్పుడు బెదిరింపు కాల్స్ ‌చేస్తూ ‘‘కపట నాటకం’’ ఆడుతున్నారని ఆరోపిం చారు. ఖర్గే తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి బదులుగా, గుల్బర్గా ప్రాంతాన్ని ‘‘గూండాల రాజ్యం’’ మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, కలబురగిలో శాంతిభద్రతల వైఫల్యాలకు కారణమవు తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో పాటుగా ఆయన కుమారుడు ఇద్దరూ కూడా పరిపాలనా విషయాలలో జోక్యం చేసుకోవడా నికి ప్రియాంక్‌ ‌ఖర్గేను అనుమ తించారని విమర్శిం చారు. ‘‘ప్రియాంక్‌ ‌ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయాల్లో జోక్యం చేసుకోవడం ఆమో• యోగ్యం కాదు. సంక్షోభాల సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వయం సేవకులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మరీ పనిచేస్తారు. వారి సేవ గురించి తేలికగా మాట్లాడటం సిగ్గుచేటు’’ అని ఆయన అన్నారు.

దినేష్‌ ‌గుండూరావు, హరిప్రసాద్‌, ‌లాడ్‌ ‌వంటి కాంగ్రెస్‌ ‌నాయకులను కూడా రేణుకాచార్య లక్ష్యంగా చేసుకున్నారు. వారు కొన్ని నియోజకవర్గాల్లో పాఠశాలలను మసీదులుగా మార్చడం వంటి సంఘటనలపై మౌనంగా ఉంటూనే, పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ వంటి దేశ వ్యతిరేక సంస్థలను కాపాడు తున్నారని ఆరోపించారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశం కోసం నినాదాలు చేస్తుండగా దేశభక్తి గల సంస్థలపై దాడి చేయడం ద్వారా ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడంలో మీరు బిజీగా ఉన్నారు’’ అని ఆయన అన్నారు.

ప్రియాంక్‌ ‌ఖర్గే సామాజిక సేవ, జాతీయవాద ఉద్యమాలలో ఆయన అర్హతలు, నేపథ్యాన్ని ప్రశ్నించారు. ‘‘ఖర్గేకు అధికార రాజకీయాలను అనుసరించడం తప్ప, జాతీయవాద లేదా సామాజిక సంస్థలకు సేవ చేసిన రికార్డు లేదు. ఆయన ఎప్పుడూ ముస్లిం ఛాందసవాద గ్రూపులను లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఖండించలేదు, కానీ హిందూ మతాన్ని కించపరచడానికి హిందూ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు’’ అని రేణుకాచార్య ఆరోపిం చారు. ‘‘ఖర్గే దేశాన్ని రక్షించడానికి బదులుగా ఆర్‌ఎస్‌ఎస్‌, ‌తదితర జాతీయవాద సంస్థలను విమర్శించడం, కించపరచడాన్ని తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు’’ అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌ప్రధాన ఎజెండా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం, దాని రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయవాద సంస్థలను అణగదొక్కడం అని రేణుకాచార్య ఆరోపించారు. ‘‘ప్రియాంక్‌ ‌ఖర్గే తన హైకమాండ్‌ను సంతోషపెట్టడానికి ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర జాతీయవాద శక్తులకు వ్యతిరేకంగా జెండా ఎగురవేయడంలో బిజీగా ఉన్నారు. కానీ ఇదికలకలం ఉండదు’’ అని ఆయన అన్నారు. జాతీయవాద సంస్థలను కించపరిచే విధంగా భవిష్యత్తులో చేసే ఏవైనా ప్రయత్నాలను తాము సహించేది లేదని హెచ్చరించారు.

– శ్రీపాద

About Author

By editor

Twitter
YOUTUBE