సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు కార్తిక శుద్ధ షష్ఠి – 27 అక్టోబర్ 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
భారతీయతను దర్శించుకోవాలంటే సంస్కృత భాష అనే అఖండ దీపం వెలుగులోనే సాధ్యం. ఈ నేల మీద సాగిన జీవన విధానం లేదా ధర్మంలోని లోతుపాతులు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, కళా విమర్శలు, మొత్తంగా ఆ ధర్మం ఔన్నత్యం అవగాహనకు చేసుకోవాలన్నా ఆ మహోన్నత భాషే ఉపకరణమవుతుంది. ఆ భాషామతల్లి జన్మించిన భారతభూమిలోనే ఒక గుడ్డి వ్యతిరేకత ఈనాటిది కాదు. దురాక్రమణదారులు, పరాయి పాలకులు, దిగుమతి చేసుకున్న రాజకీయ ఆదర్శాలు ఆ భాషకు చేసిన ద్రోహం క్రూరమైనది. జాత్యహంకారం, ఓర్వలేనితనం జమిలిగా ఆ భాష మీద దాడి చేశాయి. వేయేళ్లు ఆ భాష దాడులకు గురి అవుతూనే ఉంది. ఏ భారతీయ భాషను పరిశీలించినా సంస్కృతం స్పర్శ ఒక వాస్తవం. అయినా ఆ భాషను మృతభాషగానే జమ కడుతూ ఎన్నో శక్తులు అనాగరికంగా వ్యవహరిస్తున్నాయి. కానీ సంస్కృతం అమృతభాష అంటున్నారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. చిత్రం ఏమిటంటే, బ్రిటిష్ జాతి ఈ దేశాన్ని ఆత్మవిస్మృతిలోనికి నెట్టి వేయడానికి వేలాది కుట్రలు సాగించిన సమయంలోను సంస్కృతం స్వర్ణయుగాన్ని చూసిందని అంటున్నారు కేంబ్రిడ్జ్ పరిశోధకులు. భారతీయులలో బానిసబుద్ధిని శ్వేతజాతి మరింత పటిష్టం చేస్తున్న కాలంలో- 1650-1800 మధ్య, ఆ భాష స్వర్ణయుగాన్ని అనుభవించిందని కేంబ్రిడ్జ్ పరిశోధకులు ఇటీవలే వెల్లడించారు.
సంస్కృతం మీద చాలా నిందలు వేసింది ఆంగ్లజాతి. ఆ భాషలో వచ్చిన మహోన్నత గ్రంథాల మీద వెల్లువెత్తిన వక్రభాష్యాలు సరేసరి. కొన్ని గ్రంథాల నిండా అశ్లీలమన్నారు.అంటూనే కవిత్వం, ఇతర సాహిత్య పక్రియలను ఆంగ్లంలోకి అనువదించుకున్నారు. రష్యా, జర్మనీలలోకి కూడా సంస్కృత సాహిత్యం వెళ్లింది. ఆ భాషలో మహోన్నత రచనలు చేసిన ప్రతిభావంతులను చూస్తుంటే ఒక విస్మృత విజ్ఞానఖని గుర్తుకు వస్తుందని చాటుతోంది కేంబ్రిడ్జ్‌లో దక్షిణాసియా మత అధ్యయన పీఠంలో పని చేస్తున్న బృందం. డాక్టర్ జొనాథన్ డ్యుకెట్ ఆ బృంద నాయకుడు. తమ పరిశోధనకు నిర్దేశించుకున్న పరిధులను బట్టి ఈ అధ్యయనాన్ని కావేరీ డెల్టాలో సంస్కృత భాషకు దక్కిన ఆదరణను మాత్రమే, అది కూడా 150 ఏళ్ల కాలఖండంలో జరిగిన కృష్టినే చర్చిస్తున్నామని డాక్టర్ జొనాథన్ తెలియచేస్తున్నారు. ఇక కాశీ, ఉజ్జయినీ, కశ్మీర్ వంటి ప్రాంతాలలో జరిగిన కృషికి కూడా పరిశోధనను విస్తరిస్తే ఇంకెన్ని అనర్ఘరత్నాలు వెలికి వస్తాయో కదా అనిపిస్తుంది.
పరాయిపాలకుల కుట్రలూ, కుతంత్రాల నడుమ కూడా ఆ భాష ఎలా వర్ధిల్లినదో ఈ బృందమే వెల్లడించింది. దేశం నలుమూలలా ఉన్న అగ్రహారాలలోను, మఠాలలోను పండితులు అహరహం తపిస్తూ నాటకం, కవిత్వం, తత్త్వశాస్త్రం, వేదాంతం, న్మృతులు వెలయించారని ఆ బృందం చెబుతోంది. కానీ 1799 నాటికి తంజావూరు రాజ్యం ఈస్టిండియా కంపెనీ అధీనంలోకి వెళ్లింది. ఆ ప్రాంతమంతా ఆంగ్ల భాషా మాధ్యమంతో పాఠశాలలు వెలిశాయి. చాలామంది పురోహితులు, పూజారులు తమ సంతానాన్ని వాటికి పంపించారు కూడా. కానీ కొందరు మాత్రం ఎంతో సంయమనం పాటించి, కుటుంబ పరంగా వస్తున్న భాషాధ్యయనాన్ని కొనసాగించారు. ఈ వాతావరణం కొంత ఉక్కిరిబిక్కిరి చేసినా, మళ్లీ సర్దుకున్నదని డాక్టర్ జొనాథన్ అన్నారు. ఐదేళ్ల కాలం సాగే తమ అధ్యయనంలో కావేరీ డెల్టాలోని ప్రతిభావంతులను గుర్తించే సర్వేను వారు చేపట్టారు. కావేరీ తీరంలోనే ఉన్న తిరువిసునల్లార్ కేంద్రంగా అక్షరార్చన చేసిన ఆనాటి పండితులు, వారి కృషిని సేకరించేందుకే కేంబ్రిడ్జ్ బృందం ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఇక్కడికి డాక్టర్ జొనాథన్ వచ్చి వెళ్లారు. ఈ గ్రామాన్ని ఛత్రపతి శివాజీ మహరాజ్ తండ్రి షాజీ భాన్సులే 45 మంది పండితులకు దానంగా ఇచ్చినది కావడం మరొక విశేషం. వీరిలో చరిత్రలో ఎంతో పేర్గాంచిన శ్రీధర వేంకటేశ్ ‘అయ్యావల్’ అనే సాధువు కూడా ఉన్నారు. ‘నామసిద్ధాంత’ (భగవన్నామ స్మరణ తీరుతెన్నులు చెప్పే సిద్ధాంతం) వృద్ధిలో అయ్యావల్ పాత్ర ప్రముఖమైనది. వీరంతా నాడు తమిళమే మాతృభాషగా చేసుకున్నారు. కానీ రచనా వ్యాసంగమంతా సంస్కృతంలోనే. ఇప్పుడు కేంబ్రిడ్జ్ బృందం సంస్కృత, తమిళ రచనలకు మధ్య ఉన్న బంధం గురించి, తమిళ వ్యవస్థలతో సంస్కృతానికి ఉన్న అనుబంధం గురించి కూడా అధ్యయనం చేస్తున్నది. దీని ఫలితాలు కొన్ని తలతిక్క వాదనలకు సమాధానాలుగా ఉండగలవు. తమ పని ఏదో కొన్ని పదాలకు అర్థాలు వెతకడంతోనే అయిపోదని, సంస్కృతానికి పట్టుగొమ్మలుగా నిలిచిన తిరువిసునల్లార్, చుట్టుపక్కల గ్రామాల ఔన్నత్యాన్ని వెలుగులోకి తేవడం కూడానని డాక్టర్ జొనాథన్ చెప్పారు.
ఈ అగ్రహారమే కేంద్రంగా వెలువడిన మహోన్నత రచనలు ఇప్పటికీ అంధకారంలోనే ఉండిపోయాయి. అందులో కొన్ని తరువాతి కాలాలలో ముద్రణకు నోచుకున్నాయి. ఇంకొన్ని అముద్రితంగా, తాళపత్ర గ్రంథాల రూపంలోనే ఉండిపోయాయి. కొన్ని తంజావూరు సరస్వతి మహల్ గ్రంథాలయంలో శిథిలావస్థలో ఉన్నాయి. నాటి పండితుల వారసుల వద్ద, ఆలయాలలో, స్థానిక గ్రంథాలయాలలో కూడా ఈ గ్రంథాలు ఉన్నాయి. డాక్టర్ జొనాథన్ వంటి వారి కృషిని భారత ప్రభుత్వం కొనసాగించడం సబబు. ఆ జ్ఞానమంతా వెలుగులోకి వస్తే 21వ శతాబ్దంలో భారత్ ప్రయాణం మరింత సమున్నతంగా సాగుతుంది.సంస్కృతం మన జాతి జ్ఞానసంపద. దొరికిన ప్రతి అక్షరం అపురూపమే. వాటిని భద్రపరచవలసిందే.