రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత నాజీజం పట్ల పెంచుకున్న తమ అక్కసునంతా వెళ్లగక్కడానికి ఐరోపా దేశాల రచయితలు ఉపమానాలు, ఉత్ప్రేక్షలతో నిండిన రచనా శైలిని ఆశ్రయించారు. సర్రియలిజం అలా వచ్చినదే. నాజీజాన్ని చీల్చి చెండాడడంలో కమ్యూనిస్టు దేశాల రచయితలు, కమ్యూ నిస్టులు ముందు వరసలో నిలబడ్డారు. 20వ శతాబ్దం మధ్యలో వచ్చిన ఆ యుద్ధం మనుషుల మనస్తత్త్వాన్ని ఎలా మలిచింది? అసలు ఆధునికతలోని హేతుబద్ధతను గురించి అంతిమంగా రచయితలలో ప్రశ్నలు రెకెత్తించింది. చిత్రంగా నాజీజాన్ని కమ్యూనిజంతో చీల్చి చెండాడవచ్చునని నమ్మిన మేధావివర్గానికి తరువాత నాజీజాన్ని ద్వేషించిన తీరులోనే కమ్యూనిజాన్ని కూడా ఛీత్కరించవలసిన పరిస్థితిలో తాము ఉన్నామని తెలిసి వచ్చింది. నిజంగా చరిత్రలో ఇది పెద్ద వైచిత్రి. కానీ నాజీజం, కమ్యూనిజాలలోని నిర్హేకతలతో నేరుగా పోరాడడం కన్నా, కళాత్మకంగా ఎదుర్కొనడం అవసరమని రచయితలు అభిప్రాయపడ్డారు. నోబెల్ సాహిత్య పురస్కారం అందుకుంటున్న 122వ రచయిత, హంగరీ నవలాకారుడు లాస్లో క్రాస్నహోర్కయి జీవితం, రచనలు చూసినా ఇదే అనిపిస్తుంది.
కమ్యూనిస్టు పాలన నాటి హంగరీ సామాజిక స్వరూపం, ముద్ర లాస్లో రచనలలో స్ఫుటంగా కనిపి స్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ దేశం సోవియెట్ రష్యా కనుసన్నలలో నడిచింది. హంగరీ దేశం నుంచి ఈ పురస్కారానికి ఎన్నికైన రెండవ రచయిత లాస్లో. ఆయనను ఫ్రాంజ్ కాఫ్కా, శామ్యూల్ బెకెట్, మెల్‌విల్లేలతో పోలుస్తారు. దారుణమైన అన్యాయం, బాధలు ఉన్నట్టు చెప్పే ఒక కల్పిత సమాజమే ఇతివృత్తంగా నవలలు రాసినవారు లాస్లో. ఆయన కమ్యూనిజం బాధితుడు. మరి అలాంటి కల్పిత సమాజాన్ని కల్పించి ఈ పేరుతో డైస్టోపియన్ శైలి అంటూ ఆయన రచనలను ఎందుకు వర్గీకరిస్తున్నారన్న అనుమానం వస్తుంది. అదొక రచనా విధానం. లాస్లో కంటే ముందు కూడా ఈ ధోరణితో నవలలు ప్రసిద్ధమైనాయి. జార్జ్ ఆర్వెల్ ‘1984’ అనే నవల ఇలాంటి ధోరణితో రాసిన నవలగా ప్రసిద్ధి చెందింది. క్షీణిస్తున్న సమాజ భవిష్యత్ చిత్రాన్ని ఈ ఇతివృత్తాలలో చూస్తాం. ఇప్పుడు ఆ సమాజాలు ఎదుర్కొంటున్న అణచివేత భవిష్యత్తులో వాటికి ఎలాంటి రూపం ఇస్తుంది అన్నదే ఈ రచనలలో కనిపిస్తుంది. అంటే వ్యవస్థను నేరుగా విమర్శించడం కంటే, ఆ వ్యవస్థ రేపటి విషాద స్థితిని ఇవి చెబతాయి. ‘ఫారెన్‌హైట్ 451’ కూడా అదే ధోరణిలో రాసిన నవల.
లాస్లో హంగరీ గ్రామీణ ప్రాంత జీవితాన్ని ఈ రచనా శైలితో వర్ణించారు. లాస్లో 1954లో గయూ లాలో పుట్టారు. మొదట న్యాయశాస్త్రం, తరువాత భాషా సాహిత్యాలు అధ్యయనం చేశారు. ఆయన పరిశోధనాంశం సాందోర్ మైరాయి రచనలు. హంగరీలో కమ్యూనిజాన్ని ద్వేషించిన మొదటితరానికి తాను చెందుతానని లాస్లో చెప్పు కున్నారు. సహజంగానే నాజీజం, కమ్యూనిజాలను వ్యతిరేకించారు. నిజానికి ఆయన 1968లోనే హంగరీ నుంచి పారిపోయారు. మరొక రచయిత మాగ్దా జాబాకు ఇలాంటి స్థితే పట్టింది. మరొక ప్రఖ్యాత రచయిత అనటాల్ జెర్బ్ కాన్‌సెంట్రేషన్ క్యాంపులో చనిపోయాడు. 2002 సంవత్సరంలో నోబెల్ బహుమతికి ఎంపిక అయినప్పటికి కెర్టెజ్ మారాయి అనే రచయితకు తన రచనలను అనువదించుకునే అవకాశం 1990 నుంచి మాత్రమే వచ్చింది.
లాస్లో బుడాపెస్ట్ విశ్వవిద్యాలయంలో సాహిత్యం చదివారు. డీఏఏడీ విద్యార్థి వేతనం రావడంతో లాస్లో తొలిసారి కమ్యూనిస్టు హంగరీ విడిచి పశ్చిమ బెర్లిన్‌కు వెళ్లారు. ఆయన తొలి నవల ‘సాతాన్‌టాంగో’ (ఆరు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి).1985లో వెలువడిన నవలతోనే ఆయన ప్రముఖ రచయితగా ఆవిర్భవించారు. హంగరీలో కమ్యూనిస్టు పాలన అంతమైన తరువాత చైనాలో విస్తృతంగా పర్యటించారు. తన చైనా పర్యటనానుభవాలతో రాసినదే ‘స్వర్గసీమల కింది విధ్వంస,విషాదాలు’ (2004). ‘హెర్ష్ 07769’ ఆయన మరొక నవల. 2024లో ఆంగ్లంలో తర్జుమా అయింది. దీనిని సమకాలీన జర్మనీ నవలా సాహిత్యంలో సమున్నతమైనదిగా శ్లాఘిస్తారు. ఇందులో లాస్లో రాసినది జర్మనీలోని సాంఘిక అశాంతి గురించే. ఆ అశాంతి అంతా 2010 ప్రాంతంలో ఫ్లోరియన్ హెర్ష్ అనే ఒక వ్యక్తి నాటి చాన్సలర్ ఏంజిలా మర్కెల్‌కు ఉత్తరాల రూపంలో తెలియచేయడమే ఇందులో ఇతివృత్తం. ఎక్కడా వాక్యాంత విరామ చిహ్నాలు, కామాలు లేకుండానే సుదీర్ఘ వాక్యాలు రాయడం ఆయన శైలి. ఇంకా అసంబద్ధ శైలీ పోకడలు, హాస్యం కూడా జోడించి ఉంటాయి. తనకి బుకర్ పురస్కారం వచ్చిన సందర్భంగా ‘ది గార్డియన్’ (బ్రిటన్)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక తమాషా అయిన వివరణ ఇచ్చారు. ‘మీ రచనల గురించి అసలేమీ తెలియని పాఠకులకు వాటిలో దేనితో మొదలుపెట్టమని చెబుతారు?’ అని అడిగింది ది గార్డియన్. ‘నా రచనలేవీ చదవని పాఠకులు అంటూ ఉంటే వారికి ఏదో చదవమని నేను సిఫారసు చేయలేను. మీరు బయటకు వెళ్లండి. ఒక చోట, సాధ్యమైనంత వరకు ఒక ప్రవాహం పక్కన కూర్చోండి. అంతే, ఏమీ చేయ వద్దు. దేని గురించీ ఆలోచించవద్దు కూడా. పాషాణాల మాదిరిగా మౌనంగా ఉండండి. అంతి మంగా వాళ్లకి నా రచనలు చదివిన ఎవరో ఒకరు పరిచయం అవుతారు’ అన్నారాయన.
లాస్లో అక్షర వాహినులన్నీ ఎపోకలప్టిక్ హారర్ వర్గానికి చెందుతాయి అంటారు విమర్శకులు. ప్రపంచ నాగరికత విధ్వంసం గురించి ఎపోకలప్టిక్ హారర్ ధోరణి ఆవిష్కరిస్తుంది. ఇందులో ఒక మహమ్మారి కావచ్చు, అణుయుద్ధంతో జరిగిన విధ్వంసం కావచ్చు, ఆఖరికి ప్రకృతి నుంచి ఎదురైన విపత్తు కూడా ఇతివృత్తంగా ఉంటుంది. అంటే ఈ నవలలో వర్ణిత విధ్వంసం సమాజ విచ్ఛిన్నం నుంచి ఉద్భవిస్తుంది. ముంచెత్తిన విపత్తు కారణంగా వచ్చిన మనుగడ సమస్య నుంచి వచ్చిన సంఘర్షణ నుంచి రావచ్చు. అలాంటి విధ్వంసాన్ని లాస్లో హంగరీ పట్టణాలు, గ్రామాలలో చూశాడు. పేరు ఏదైనా కావచ్చు, ఒక వ్యవస్థ కారణంగా జరుగుతున్న పతనాన్ని ఆయన అక్షరబద్ధం చేసే పని పెట్టుకున్నాడు. అందుకే తన పోరాటం కమ్యూనిజం మీద కంటే, ఆ పేరుతో ఉన్న వ్యవస్థ మీద అని ఆయన చెప్పుకున్నారు.

లాస్లోను అధ్యయనం చేయడం ఒకింత సంక్షిష్టం గానే ఉంటుంది. ఆయనది ఒక ప్రపంచం. అది పతనదిశను అక్షరబద్ధం చేస్తూ కనిపిస్తుంది. అలాగే ఆయన రచనా శైలిలోని అందాన్ని భారంగా భరించ వలసి ఉంటుంది. వాటికి సిద్ధమైతేనే మయసభ వంటి ఆయన సృజనాత్మక ప్రపంచంలోకి వెళ్లాలి. రచయితగా మారడానికి ముందు ఆయన చిత్రవిచిత్ర మైన వృత్తులు చేశాడు. పూర్తిగా పేదరికం ఉన్న వాడలలో నివసించాడు. అవన్నీ తనను రచయితగా మలుస్తా యని కూడా నమ్మాడు. అదే నిజమైంది.
తొలి నవల సాటన్‌టాంగో. అంటే అర్ధం పతనం ఆడే ఆట. 1985లో ఇది వెలువడింది. లాస్లోను నడిపించిన అన్ని విశ్వాసాలకు ఈ ఇతివృత్తంలోనే మూలాలు ఉన్నాయి. హంగరీలోని కమ్యూనిస్టు రాజ్య పతనానంతర చవిటి భూమి దీనికి నేపథ్యం. రెండు రోజుల ఎడతెరిపి లేని వర్షంలో ఇతివృత్తం తడుస్తూ ఉంటుంది. విసిరేసినట్టు ఉన్న, పేరు లేని కుగ్రామంలో మిగిలి ఉన్న ఒక పది పన్నెండుమంది ఇందులో పాత్రధారులు. జార్జ్ సిర్టెస్, శ్రీమతి షిమిట్ ప్రధాన పాత్రలు. ఆ పన్నెండు మంది నిరాశాజీవులు మరొక ఆకర్షణీయమైన మోసగాడు వస్తాడని, లేదా మరో విధ్వంసకుడు వస్తాడని భ్రమాజనితమైన విషాదం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారు అనుకున్నట్టే ఒక మోసగాడు (నవలలో ప్రధాన పాత్ర) ఉద్ధరించేవాడిలా గ్రామంలోకి ప్రవేశిస్తాడు. ఆ గ్రామస్థులను మోసగించి వారి ధనమంతా దొంగి లించుకు పోతాడు. ఈ నవలను హంగరీ దర్శకుడు బెలా టార్ ఆరుగంటల నిడివి గల చిత్రంగా నిర్మిం చాడు. మరొక నవల ది మెలాంకలీ ఆఫ్ రిసిస్టెన్స్. సాటన్‌టాంగోలో ఏది గుసగుసలా డుతూ చెప్పాడో, అదే ఇతివృత్తాన్ని ఈ నవలలో బిగ్గరగా చెప్పాడు. ఇందులో ఇతివృత్తమంతా హంగరీ పట్టణానికి వచ్చిన ఒక సర్కస్ బృందం చుట్టూ తిరుగుతుంది. ఆ సర్కస్‌లో రెండు ప్రధాన ఆకర్షణలు ఉంటాయి. ఒకటి ప్రపంచంలోనే అతి పెద్దది అని చెప్పే తిమింగల కళేబరం. ఇంకొకటి, వాగుడుకాయ వంటి ఒక యువరాజు. ఇతడు రెచ్చగొట్టేటట్టు బిగ్గరగా మాట్లాడ తాడు. దీనితో అక్కడ ఘర్షణలు జరుగుతాయి. సర్కస్ బృందం వెళ్లిపోయిన తరువాత ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి ఎస్తేర్ సైనిక శాసనం అమలు చేస్తుంది. ఆయన మొదటి, రెండో నవలల మీద తూర్పు యూరప్ కమ్యూనిస్టు సిద్ధాంత ప్రవేశం, పాలనల తీరుతెన్నులు కనిపిస్తాయంటారు విమర్శకులు.
1990లో లాస్లో మంగోలియా, చైనాలో విస్తృతంగా పర్యటించారు. ఆ పర్యటన ఒక నవలకు ఇతివృత్తాన్ని ఇచ్చింది. పురాతన నాగరికతకూ, వర్తమాన చైనాకు మధ్య ఉన్న సంబంధం నవలగా ఆవిర్భవించింది. అదే డిస్ట్రక్షన్ అండ్ సారో బెనీత్ ది హెవెన్స్.
బెర్లిన్‌లో చిరకాలం అధ్యాపక వృత్తిలో ఉన్న తరువాత• ఆయన హంగరీలోని చిన్న స్వగ్రామంలో నివసించడానికి వచ్చారు. తరువాతి రచనలలో ఆయన బాచ్ పార్టీని, జర్మనీలో నియో నాజీజాన్ని వస్తువులుగా స్వీకరించారు. ఉక్రెయిన్ మీద రష్యా దాడి సమయంలో జరిగిన భీతావహాన్ని ఒక కథలో వర్ణించారు. రాజకీయ వ్యవస్థలు ఖరీదైన తప్పులు చేస్తూ ఉంటాయి. దానితో జరిగే పెను నష్టం కొన్ని తరాలను పట్టి పీడిస్తుంది. కనుకొనలలో సిద్ధంగా ఉన్న బాష్పకణాల గురించి చెప్పిన రచయిత లాస్లో.
– జాగృతి డెస్క్