‘హృదయము కరిగే’ అని లలిత గీతిక పాడినపుడు – శ్రోతల హృది ఆ శ్రవణ రసాస్వాదనలో కరిగి నీరైంది. ‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ’ అంటూ ఆలాపన సాగించిన వేళ – ఊరూవాడా గల నేస్తాలందరిలోనూ మధురానుభూతి.
‘సుమ కోమల తను లీలా’గా అభివర్ణిస్తూ రాగాలాపన చేస్తున్నంతసేపూ- ఒళ్లు ఝల్లుమనేంత కళా వివశత్వం రసజ్ఞులందరిలో.
‘సంగీతమేలనే’ అంటూనే ఆ రసస్రవంతిలో ఓలలాడించిన రావు బాలసరస్వతిని చూస్తే చాలు- ‘మా దరికి రావూ గాన సరస్వతీ!’ అని మదినిండారా ఆహ్వానించే అలౌకిక భావవాహిని ఆబాలగోపాలంలో.
‘శశివదనముగని నే వికసితమొందితినే’నని ఆ దేవి తేనెలు చిలుకుతుంటే ఒక్కో బిందువుకోసమూ పరితపించే దివ్యానురక్తి ప్రతీ ఒక్కరిలోనూ.
అనంత లాలిత్యానికి శాశ్వత చిరునామా ఆమె.
‘నీవు లేక నిలువలేవు’ అనేలా, ‘ఆలయమున వినపడునదిగో’ అనిపించేలా ఆ లోకానికి తరలివెళ్లారు ఈ లోకం నుంచి.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ; సింహళవంటి విదేశీ భాషల్లో వేలాది పాటలు పాడిన…. నటరంగంలో సైతం సహజ పటిమ చాటిన తపస్విని. తొలిగా తెలుగు నేపథ్యగాయని, ఆకాశవాణిలోనూ ప్రథమంగా లలిత సంగీత గాయని.
బాల సరస్వతి నేపథ్యగాత్ర రీత్యా అసలు సిసలు ‘భాగ్యలక్ష్మి’! చిత్రంపేరు అదే. మరింత ప్రత్యేకత; తెలుగులో సోలోగ్రామ్‌ఫోన్ రికార్డూ తనదే!
వేదిక మీద మొదటగా పాడింది నాలుగేళ్ల వయసులో. మరి రెండేళ్లకే మొట్టమొదటి సోలో ఆపించారు. ఒక సందర్భంలో తానే అన్నట్లు పుట్టుకనుంచే ‘భాగ్య సౌభాగ్య శీలి’.
రావు బాల సరస్వతీదేవి మరో మూడేళ్లు ఉండి ఉంటే – శతజయంతి. ఇప్పటి వెంకటగిరి ప్రాంతం (అప్పట్లో మద్రాసు ప్రెసిడెన్సీ)లో పుట్టి, గుంటూరులో గాత్ర- వాద్య సంగీత శిక్షణ పొంది, జీవన పరిణామ క్రమంలో హైదరాబాద్‌లో స్థిరపడి, వృద్ధాప్య సమస్యల ఫలితంగా నిష్క్రమించారు.
గాత్ర మాధుర్యం చివరివరకు పదింగా ఉంది. తెర వెనక నుంచి గళం అందించిన చిత్రాల్లో కొన్ని; ఇల్లాలు, స్వప్నసుందరి, రూపవతి, శాంతి. ఈ పేర్లన్నీ బాలసరస్వతి స్వరూప, స్వభావాలకు పూర్తిగా వర్తిస్తాయి.
ప్రత్యక్ష ప్రభావం తండ్రి పార్థసారథిది. ఆయనే వాద్య నైపుణ్యం అలవడేలా చేశారు. నటప్రావీణ్యానికి బాలయోగిని, అనసూయ, రాధిక, సువర్ణమాల, ఇతర చిత్రాలు దోహదమయ్యాయి.
మద్రాసు, విజయవాడల్లోని ఆకాశవాణి కేంద్రాల్లో లలిత సంగీత ప్రాభవాన్ని ఆమె గొంతే వెలవరించింది. పలు సంవత్సరాలు అనేక లలిత గీతాలు ఆలాపించి, ఎందరెందరినో అలరించి మురిపించారు. ‘రాధామాధవం’ అనేది తన స్వర శోభను ప్రస్ఫుటం చేసిన విశిష్ట కార్యక్రమ పక్రియ.
ఆ తోటలోనొకటి ఆరాధనాలయము, కనుగొంటి కనుగొంటి, ఘల్ ఘల్ ఘల్‌మని గజ్జెలు మోయగ, చూచవా చిన్ని గోపాలుని, దయచూడమయా తిరుమల నిలయా, నల్లనివాడా, నీల మోహనుడు నా కనులలో, ప్రాభాత ప్రాంగణాన,… ఇటువంటి వన్నీ ఆమె ధార్మిక తత్వచింతనకు నిదర్శన గీతాలు. పదాలు పలకడంలో ఒక విశిష్టత సంపాదించారు.
ఈ ప్రేమ ఎలా కలిగెను నాపై, కోపమేల రాధా.., దయ చూపవేల నాపై తలుపు తీయునంత లోన తత్తరమది ఏలవోయి, తుమ్మెదా ఒకసారి మోమెత్తి చూడమని, నటనమాడవే మయూరీ, నీవు లేక నిలువలేను, పెందలకడ ఓ సుందరుడా, పొదరింటిలో నుండి పొంచి చూచెదవేల, రావే రావే కోయిలా! రాగము పాడవే, వినవే చెలీ – పిలుపు అల్లదిగో, విరహానలంపు బాధ, సరగున రారా సమయమిదేరా – ఈ పాటలన్నీ భావోద్వేగ పూరితాలు. వీటిల్లోని ప్రతీ పాటలో బాలసరస్వతి ప్రత్యేకత వినవస్తుంది.
ఆమెను ‘బాలబాంధవి’ అని పిలవాల్సిందే. పిల్లల పాటలంటే మక్కువ ఎక్కువ.
హాయమ్మ హాయీ నా పాపాయీ
మా ఇంటి దీపానివే!
ఓ ముద్దు చిలుకా ముత్యాల మొలకా
నా పుణ్యఫలమీవె ఓ వెలుగు రేఖా!
అదే విధంగా –
దినదినము పాపణ్ణి దీవించి పొండి
దేవలోకములోని దేవతల్లారా!
మా తండ్రి నిద్దట్లో మాట్లాడతాడు
తెలియజెప్పెనేమొ దేవరహస్యాలు!
వాగీశ్వరీ ప్రేమరాగమాలించి
చిన్నయ్య బబ్బోర…. శ్రీరామరక్ష!
పాపణ్ణి, మా తండ్రి, బబ్బోర – ఈ మూడింటినీ పలికేటపుడు బాలసరస్వతి గళంలో వినిపించే వైవిధ్యం ఇప్పటికీ ఎంతో అబ్బురంగా ఉంటుంది.
ఇక, మనందరికీ బాగా పరిచితమైన పాట. ఇది అనగానే / వినగానే గుర్తొచ్చే పేరు బాల సరస్వతీదేవిదే. అప్పటికీ, ఇప్పటికీ శృతిమధురంగా ఉండే గీతిక. అన్నీ సరళ పదాలే! పాడిన రీతితో స్వర ఆత్మీయత మరింత ప్రస్ఫుటమవుతుంటుంది.
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు!
పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి
కళలన్ని చూపించి ఘనకీర్తి తేవాలి!
ఏ దేశమే జాతి, ఎవరింటిదీ పాప?
ఎవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి!
తెనుగు దేశము నాది తెనుగు పాపను నేను
అని పాప జగమంత చాటి వెలయించాలి.
ఆమె బిడ్డ పుట్టిన రోజు సందర్భాన రూపుదిద్దు కున్న పాట ఇదని ప్రతీతి.
గీత, సంగీత మధురిమ సమంగా ఒదిగిన పాట మరొకటుంది.
నడపవ పడవ రాజా / నడపవా పడవ
నవ వసంత సుమ పవన… అంటూ కొనసాగే గీతంలో –
తెలివెన్నెల జలతారు మెరుగు, వలపు తలపు ఉయ్యాల, వయ్యారి నడల – అని ఉచ్చరిస్తున్నపుడు స్వర సొబగులను ఆస్వాదించి తరించాల్సిందే.
మరికొన్ని భావోద్వేగ గీతికలపరంగా….
దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా!
ధరణికి గిరిభారమా, గిరికి తరువు భారమా!
తరువుకు కాయభారమా, కనిపెంచే తల్లికి పిల్లభారమా!
ఈ పాటల్లో ఆమె గళంలోని విషాదం, ఉద్వేగభావనం విని తీరాల్సినవే.
పాటతోనే తన జీవితమంతా. పూర్తికాని కీర్తన వంటిది నా జీవితం అనీ ఒక ముఖాముఖిలో అన్నారు. పాడుతూండగానే మధ్యలో ఆగిన గ్రామ్‌ఫోన్ రికార్డుతో తన జీవితాన్ని పోల్చుకున్నారు, ‘నాకు మరో జన్మంటూ ఉంటే, గాయకురాలిగానే పుడతా’ అనడం ఆ గాయనీమణిలోని సంగీత ఆరాధనకు అక్షరాక్షర సాక్ష్యం.
హుషారు పాటలకు పెట్టింది పేరు ఆమె. అన్ని భావాలనూ వ్యక్తీకరించే స్వర సామర్థ్యం ‘ముల్లోకాల లేని సల్లాపాల ముంచి తేలించి లాలించేనయా! పూల జంపాలలు, తూగుటుయ్యాలలు… నీడగా జోడుగా ఆడిపాడేనయా! అందం చూడవయా, ఆనందించ వయా! హాసాలలో సహవాసాలలో చిద్విలాసా లలో… లలిత లలితమ్ముగా, భావ భరితమ్ముగా, రంగరంగేళిగా’ ఇలా పదాల ఆలాపనతో వీనుల విందు చేసిన గొంతు ఆమెకే సొంతం.
ఆ సులలిత స్వరాల లహరి సంగీత ప్రపంచానికి రాజబాట పరచింది. ఆమెదొక అజరామర పాటల పేటిక. ఎన్నెన్నో అనుభవాల రంగరింపు ఉంది అందులో. సౌందర్యం, గాత్రశుద్ధి, అభినయ చాతుర్యం – అన్నీ నిండిన దీక్షాదక్షురాలు. తనది అరుదైన స్వరం. విశిష్ట, విశేష మూర్తిమత్వం. అయినా, అవరోధాల బెడద తప్పులేదు. అసూయా ద్వేషాలకు గురికాక తప్పింది కాదు. ఇంటా బయటా ఆ అన్నింటినీ నిలువరించి నిలిచారు. పాటే ప్రాణంగా జీవనయానం సాగించారు. ఏ దశలోనూ స్థితిల్లోనూ రాజీపడని వ్యక్తిత్వం బాలసరస్వతీ దేవిది. ఉదాహరణలు అనేకం.
అందుకున్న పురస్కారాలు ఎన్నో విధాలుగా ప్రతిష్ఠాత్మకాలు. పాలగుమ్మి విశ్వనాథం స్మారక పురస్కృతి ఆమెనే వరించింది. ఆకాశవాణిలో దశాబ్దాలుగా లలిత సంగీతానికి ప్రాచుర్యం కలిగించినవారు ఆయన. సంగీత, సాహిత్య, నాటకరంగ ప్రసిద్ధులెందరికో సన్నిహితులు. అంతటి ‘పాలగుమ్మి’ పురస్కారాన్ని స్వీకరించారు బాల సరస్వతి. అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ (అజో-విభో) నుంచి ‘ప్రతిభామూర్తులు’ బహూకృతిని పాతికేళ్ల క్రితం అందుకున్నారామె. ఎటువంటి ప్రతిఫలాన్నీ ప్రయోజనాన్నీ ఆశించకుండా, జీవితకాలం సృజనాత్మక ప్రతిభ వెలార్చిన వారికి జీవితకాల సాధన పురస్కారంగా అందుతుందది. అప్పట్లో ఆ నిర్వాహకులు అన్నట్లు – బాలసరస్వతీదేవి లలిత సంగీత సామ్రాజ్ఞి. స్వరరాగ సుధారసం ఒలికించే, తీయదనం పలికించే శక్తిశీలి ఆమె.
లలిత సంగీతంలో కచేరీలు చేయడం తెలుగు నాట ప్రారంభించింది ఆమే! అటువంటి ఘన ఒరవడికి ఆద్యురాలు తానే. రామినేని ఫౌండేషన్, పైడి లక్ష్మయ్య స్మారక పురస్కృతీ ఆమెకే లభించాయి.
మద్రాసు తెలుగు సంగీత అకాడమీ సత్క రించింది. ఐక్య అకాడమీ గొప్ప సన్మానం జరిపింది. నాడు భాగ్యనగరంలో అపురూప సత్కారం ఏర్పాటైంది. తెలుగు ఆత్మగౌరవ పురస్కారం, సాక్షాత్తు అలనాటి ప్రధాని చేతులమీదుగా జాతీయ సమైక్యత అవార్డు ప్రదానం, దేశరాజధానిలో సభాముఖంగా అత్యుత్తమ గాయకురాలిగా పురస్కృతి, ఇంకెన్నో గౌరవాలు.
విజయాంబికే విమలాత్మికే… ఆమె పాటల్లో ఒకటి. ఆమెది విమల మానసం. కొనసాగింది విజయమార్గం. రైలు పూల పానుపుపైన వెన్నెల చల్లినారమ్మా ఎవరో – అనేది మరో పాటలోని పంక్తి. వెన్నెల కురిసినట్లు ఉంటుంది రావు బాల సరస్వతీదేవి పాట. మాట కూడా అంతే సున్నితం, సుతారం, సుతిమెత్తన.
ఇప్పుడు ఆమె లేరు. ఆ పాట, మాట ఎప్పటికీ ఉంటాయి. మనలో, మనతో, సదా, సర్వదా. ఆబాలగోపాలాన్నీ మురిపించిన గాన సరస్వతి!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్