‘‌కృషి ఉంటే మనుషులు రుషులవుతారు…’అన్నట్టు… ప్రాథమిక పాఠశాల గడప తొక్కని వ్యక్తి విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అం‌దుకున్నారు. తాపీ కార్మికుడు భాషా (సాహిత్య) శిల్పిగా ఎదిగాడు. జానపదానే తన పథంగా మార్చుకొన్నాడు.‘ఆశువుగా పాడిన పాటలను’ ఈసడించిన వారితోనే మెప్పులందుకున్నారు. గొర్రెల కాపరి తన కవితా పటిమతో విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్‌ అం‌దుకున్న అరుదైన ఘట్టం. బాల్యం నుంచి దైవభక్తిపరుడు. కవిగా ఎదిగిన తరువాత తన రచనలను బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి పాదాల వద్ద ఉంచిన తరువాతే అచ్చువేయించేవారు. అనంతరం కాలంలో రాష్ట్ర గీతమైన ‘జయ జయహే తెలంగాణ’ను ఆ చదువుల తల్లికే అంకితమిచ్చారు.

ఆదిలో అంతగా అక్షర జ్ఞానం లేకపోయినా పల్లె వాతావరణంలో, జానపద కళారూపాలతో మమేకమై అపార లోకజ్ఞానాన్ని ఆర్జించారు అందెశ్రీ. మట్టి (ప్రకృతి) మనిషి, మానవత్వం ఆయన కవితా వస్తువులు. ఆయన రచనల్లో పల్లెతనం, అందులోనూ కులవృత్తులు ప్రధానాంశాలు. అంశం ఏదైనా ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకం. వాటిలో తెలంగాణ జీవన విధానం, సంస్కృతి,యాస స్పష్టంగా కనిపి స్తాయి. సాధారణ పదాల్లో అపాధారణ భావాలు, జీవన తత్వాలను లోతుగా అవిష్కరించే శైలి ఆయన సొంతం. పల్లెజీవితం,అందులోని కష్టసుఖాలు, ప్రేమాభిమానాలు, శ్రమ, పండుగలు, సంస్కృతి ఆయనకు తొలిగురువులు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఎలాంటి సాహిత్య నేపథ్యం లేకపోయినా, ఆసక్తి, స్వయంకృషితో ఎదిగారు.

తెలంగాణ ప్రాంతంలో ప్రజాకవులుగా మన్ననలు అందుకుంటున్న వారిలో అందెశ్రీ మాత్రమే ఎటువంటి ప్రాథమిక విద్యార్హత లేకుండానే కవిగా ప్రసిద్ధులయ్యారు. రాష్ట్ర గీతాన్ని సృజించారు. ఎలాంటి సాహిత్య ప్రవేశం లేకుండానే భాషపై పట్టు సాధించారు. ప్రకృతి ప్రేమికుడు. పల్లెలంటే ప్రాణం. ప్రకృతి ఒడిలో ఆశువుగా పాటలు అల్లేవారు. ప్రకృతి, మానవ సంబంధాలపై రాసిన గీతాలు ప్రజా హృదయాలకు హత్తుకున్నాయి.

బడికిపోయి పలకాబలపం పట్టకనే ‘జయ జయహే తెలంగాణ…’ అంటూ రాష్ట్ర గీతానికి ఊపిరిలూదారు. అక్షరాలు రాని దశ నుంచి రాష్ట్ర గీ•తావిష్కరణ దాకా స్వయం ప్రతిభ ఎదిగారు. బడికి వెళ్లి చదివితేనే భాష వస్తుందనుకోవడం పొరపాటని, అయితే విద్యావంతుల సాంగత్యం లేకుండా మాత్రం భాష పట్టుపడదని అభిప్రాయపడేవారు. అలాంటి వారితో సంచరించడం వల్లే తనకు ఈ మాత్రం అబ్బిందని చెప్పుకొనేవారు. తనను ఆదరించిన వారందరకీ కృతజ్ఞతగా ఉంటూ, అనేక వేదికలపై గుర్తు చేసుకొనేవారు. వారంతా తన జీవిత మార్గ దర్శకులని, తాను వారు మలచిన ‘బొమ్మ’ను అని ఉద్వేగంగా చెప్పేవారు. చిన్నతనంలో తనతో పని చేయించుకొన్న జిక్కిరెడ్డి మల్లారెడ్డిని గురువుగా చెప్పుకొనేవారు. ఆయన చెప్పిన రామాయణ, మహాభారతం వంటివి తన జీవితాన్ని నడిపాయని, ఎప్పుడో విన్నవి భవిష్యత్‌లో ఇంతగా అవసరానికి వస్తాయని ఊహించలేదని ఒక ముఖాముఖిలో చెప్పారు. భవన నిర్మాణ కార్మికుడిగా నిజామా బాద్‌లో వెళ్లినప్పుడు ఆయన పాటలు విన్న శృంగేరి పీఠానికి చెందిన స్వామి శంకర్‌ ‌మహరాజ్‌ ‌చేరదీసి, ఆదరించారు. తన జీవితంలో అదే కీలకమలుపు అని అందెశ్రీ పేర్కొనేవారు. ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడంలో ఏ ఇతర ‘అంశాలు’ పరిగణన లోకి రావని రుజువైన క్షణం. శంకర్‌ ‌స్వామి ఆయనకు ఉపనయనం చేసి, వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని తెలియ చెప్పారు. ఆయన చలువ, ఆశీస్సులతో అందె ఎల్లయ్య ‘అందెశ్రీ’గా మారారు. పీడిత జన చైతన్యానికి అక్షరాన్ని ఆయుధంగా చేసుకోవాలని శంకరస్వామి ఉపదేశించారు.

భవన నిర్మాణ కార్మికుడిగానే హైదరాబాద్‌ ‌చేరిన తరువాత ప్రఖ్యాత జానపద పరిశోధకుడు ఆచార్య బిరుదురాజు రామరాజుతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన వద్ద దాదాపు ఇరవయ్యేళ్లు శిష్యరికం చేశారు. అలా ఆచార్యులు ‘నాన్న’, వారి అర్ధాంగి సూర్య దేవమ్మ ‘అమ్మ’ అయ్యారు. ఆమెను ఉద్దేశించి రాసిన ‘సూడ సక్కని నా తల్లి సుక్కల్లో జాబిల్లి’ గీతం అనంతరం కాలంలో వెండితెరను అలరించింది. బస్సులో పరిచయమై తన కవితాధోరణికి అబ్బురపడిన అభినందించిన పెద్దాయనకు అల్లుడయ్యారు.

అయితే అలాంటి ఆత్మీయతానుబంధాలు లోపిస్తున్న వర్తమానంలో ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు/మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు…’ అని ఆవేదన చెందారు.

‘నిలువెత్తు స్వార్థము నీడలా వెంటుంటే

చెడిపోక ఏమవుతడమ్మా

ఆత్మీయ బంధాలు స్నేహ సంబంధాల

దిగజారుతున్నడోయమ్మా

అవినీతి పెనుఆశ అంధకారములోన

చిక్కికొని నరుడు శిథిలమవుతున్నాడు’

మానవ మనస్తత్వాన్ని, కనుమరుగవుతున్న మానవతా విలువలను కళ్లకు కట్టారు. ఆ లక్షణాలు ఉన్నాయను కొని భావించుకొనే ప్రతి ఒక్కరు అంతర్మాతను ప్రశ్నించుకొనేలా చేసిన గీతం.

మానవీయ జీవన విలువలు పరిమళించాలని తపించారు. మానవత్వం పరిఢవిల్లి, పరస్పరం ప్రేమించుకోవాలని ఆకాంక్షించారు. అలాంటివారు ‘నూటికో కోటికో ఒక్క• ఒక్కడు/యాడనున్నడో గానీ కంటికీ కనరాడు’ అని అన్వేషించారు. ఆంధప్రదేశ్‌ ‌లోని విశ్వవిద్యాలయాల్లో వ్యక్తిత్వ వికాస కోణంలో ఇది పాఠ్యాంశం కావడం దీని విశిష్టతకు మ(మె)చ్చు తునక.

అందెశ్రీ సాహితీ సృజనకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. వంశీ ఇంటర్నేషనల్‌ ‌పౌండేషన్‌ ‌వారి దాశరథి సాహితీ పురస్కారం (2015), జ్ఞానపీఠ్‌ ‌పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయపురస్కారం (2022), దాశరథి కృష్ణమాచార్య సాహితీ (2024) పురస్కారం, లోక్‌నాయక్‌ (‌విశాఖ) పురస్కారం …ఇలా ఎన్నెన్నో ఆయన వరించాయి. తమ సాహిత్యం ద్వారా రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించినందుకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(జూన్‌ 2, 2025) ‌సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి రూ.కోటితో సత్కరించారు. ఈ గీతం గొంతుకెక్కిన రెండు దశాబ్దాలకు రాష్ట్ర గీతంగా గౌరవం దక్కించు కొంది. కామారెడ్డిలో సెప్టెంబర్‌ 30, 2002‌న ధూంధాం వేదికపై ఉన్నప్పుడు ఈ గీత రచనా లోచనకు బీజం పడిందని, ఆ మరుసటి సంవత్సరం మార్చి 2న తెలంగాణ రచయిత వేదిక వార్షి కోత్సవంలో తన నోట వెలువడిందని తరచూ చెబు తుండేవారు. ఈ గీతం ప్రత్యేక రా) ఉద్యమానికి ఊపిరిలూదిందనే పలువురు అభిమానులు మాట. అయితే ‘‘నేను తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిని కాను. నాదే కీలక పాత్ర అని చెప్పను. రాష్ట్రావతరణ ఏ ఒక్కరి కృషో కాదు. అలా ‘సొంతం’ చేసుకోవాలను కోవడం విజ్ఞత కాదు. పసికూన మొదలు ముసలి వరకు ప్రజలంతా ఒక్కటైతేనే వచ్చింది నా తెలంగాణ’ అని ఒక ముఖాముఖిలో నిర్మొహమాటంగా చెప్పారు’

పాలేరుగా కటిక పేదరికం అనుభవించి, భవన నిర్మాణ కార్మికుడిగా అరకొర ఆదాయంతో నెట్టు కొచ్చిన ఆయన పాటే ప్రాణంగా, పదమే ప్రపంచంగా సాగారు. జానపద సాహిత్యాభిలాష తపనతో ప్రజాకవిగా, లోకకవిగా ఎదిగారు. ఒక సినిమాకు (గంగ)మాటలు, ఇరవై సినిమాల దాకా పాటలు అందించారు. ‘పాటకు ఎంత వరకు న్యాయం చేయ గలను. ప్రజలు నా పాటన ఎంత ఆదరిస్తారు? అన్నదే ముఖ్యం తప్ప, ఇతరత్రా ఆశలు లేవు. నా కవిత్వం ప్రపంచాన్ని మారుస్తుందని ఎన్నడూ అనుకో లేదు. ఆత్మసంతృప్తి కోసం కవిత్వాన్ని నమ్ముకున్నానే కాని అమ్ముకోలేదు’ అని నిక్కచ్చిగా చెప్పేవారు.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE