రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవం ‘పంచ పరివర్తన్’ భవిష్యత్ ప్రణాళికగా నిర్ధారించింది. పరిసరాల శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నివారించడం, చెట్ల పెంపకం, నీటిని పొదుపు చేయడం, పర్యావరణ పరిరక్షణపై జాతి యావత్తు దృష్టి సారించాల్సిన అవసరాన్ని చెబుతున్నదే పంచ పరివర్తన్.
ఈ సందర్భంలో మనమంతా ‘భూసూక్తం’ గురించి స్మరించుకోవాలి. దీనితో పంచ పరివర్తన్ అవసరం మరింత అర్థమవుతుంది. వేద జనితమైన ఈ సూక్తం మహోన్నత భావాల గని. కృష్ణ యజుర్వేదం, తైత్తరీయ సంహితలలోను ఈ సూక్తం దర్శనమిస్తుంది. 14 శ్లోకాల ఈ సూక్తంలో సప్త సముద్రాలంత శాస్త్ర విజ్ఞానం నిక్షిప్తమై ఉంది. మహా విష్ణువును స్తుతించే ఐదింటిలో ఇదొకటి. భూమిని పవిత్రంగా చూసుకోవలసిన అవసరం గురించి కొన్ని యుగాల నాడే చెప్పిన మన పెద్దలకు నమోవాకాలు చెప్పుకోవాలి. భూస్తుతి గురించి చర్చించే ముందు కొన్ని విషయాలు చర్చించుకుందాం. ఇవి ఆధునిక ప్రపంచానికి సంబంధించినవి. అనాదిగా భారతీ యుల ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం వర్షంపై ఆధారపడి ఉంది. వానలు పడితే పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండితే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు.
ఆధునికకాలంలో శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెంది మానవుడు ప్రకృతినే శాసించే స్థాయికి ఎదిగాడు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి అత్యాధునిక సాంకేతిక పరికరాలతో మేఘమథనం వంటి అసహజ పద్ధతులను అవలంబించడమూ మొదలుపెట్టాడు. అందువల్ల ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటున్నది (2006-2008 మధ్య ఆంధప్రదేశ్ ప్రభుత్వం కృత్రిమ వర్షాల కోసం మేఘమథనం చేపట్టి కోట్లు ఖర్చు చేసింది. అయినా ఫలితం లేదు). ఇదంతా ఒక విష వలయం. అధికారికంగా, అనధికారికంగా కాలుష్యం పెరుగుతోంది. ఈ అంశాన్ని హెచ్చరిస్తున్న వారూ ఉన్నారు. జరిగేది జరుగుతూనే ఉంది. అభివృద్ధి ముసుగులో వాతావరణ కాలుష్యం అధిక కావడంతో భూమి వేడెక్కి ధ్రువప్రాంత మంచు కరిగి సముద్రమట్టాలు పెరుగుతాయని, తీర ప్రాంత గ్రామాలు మునిగిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తు న్నారు. కానీ వినేదెవరు? భూమి మీద ఇతర జీవుల ఉనికిని, ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడినప్పుడే రుతుపవనాలు కరిమబ్బులై వర్షాన్ని ప్రసాదిస్తాయి. భూమిని సస్యశ్యామలం చేస్తాయి. అందుకు ప్రతివారు పరిసరాలను అందమైన అరణ్యాలు మార్చాలి. అప్పుడే ఆ గాలికూనలు మబ్బు తల్లులను చల్లబరు స్తాయి. వర్షాన్నిస్తాయి, సస్యానందం కలుగుతుంది. ప్రకృతిని ఆరాధిస్తూ వరహమిహిర, దోనయా మాత్యులు శాస్త్రగ్రంథాలు రాశారు. ‘ప్రకృతి ఎప్పుడు విపరీత ధోరణులకు పోదు’ అంటారు సస్యానందం గ్రంథకర్త దోనయామాత్యులు.
భూమి పుట్టి సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలైంది. విశ్వపరిణామాన్ని వివరించే సిద్ధాంతాలలో ఒకటి ‘బిగ్ బ్యాంగ్’. భూమిపై ఇప్పటి వరకు నివసించిన జాతులలో 99 శాతం అంతరించి పోయాయి. పర్యావరణాన్ని రక్షించుకోక పోతే భూమికీ అదే గతి పడుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ‘సేవ్ ఎర్త్’ నినాదం బలంగా వినిపించడం వెనుక కారణం ఇదే. వాతావరణ మార్పు, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వాడకంను వ్యతిరేకిస్తూ చాలా సాహిత్యం వచ్చింది. ఎమిలా జోలా ‘ది ఎర్త్’ పర్యావ రణమే వస్తువుగా రాసిన నవల. వాడిస్లావ్ రేమాంట్ ‘ది ప్రామిస్డ్ లాండ్’ నవల 19వ శతాబ్దపు పారి శ్రామికీకరణ, పర్యావరణంపై దాని ప్రభావాలను వివరిస్తుంది. రేచల్ కార్సన్ ‘సైలెంట్ స్ప్రింగ్’ నవల పురుగు మందులతో ఉండే హానికర ప్రభావాన్ని తెలియజేస్తుంది. పర్యావరణ ఉద్యమానికి ఇది మార్గదర్శి. ‘వాల్షెన్’ నవల హెన్రీ డేవిడ్ తోరూ రాశారు. ఇది ప్రకృతితో కలిసి జీవించడం, సరళ జీవనం ప్రాముఖ్యతను వివరిస్తుంది. ‘ది పిల్లర్స్ ఆఫ్ ది ఎర్త్’ కెన్ పోలెట్ రాసిన నవల. మధ్యయుగపు భవన నిర్మాణం, పర్యావరణ సామాజిక పరిణామా లను గురించి వివరిస్తుంది. ఇవి కొన్ని మాత్రమే.
తెలుగులో వచ్చిన నవలల్లో గూండ్ల వెంకట నారాయణ ‘భూమి పతనం’ రైతుల కష్టాలను, భూమితో వారికి గల బంధాన్ని వివరిస్తుంది. కాలువ మల్లయ్య ‘భూమిపుత్రుడు’ భూమి అమ్ముకుని పట్టణాలకు వలస వెళుతున్న రైతుల పరిస్థితిని వివరించింది. వాసిరెడ్డి సీతాదేవి ‘మట్టి మనిషి’ నవల భూమిని నమ్ముకున్నవారు చెడిపోరనే సందేశాన్ని ఇస్తుంది.
పంచభూతాలు-భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాలకు ప్రకృతే మూలం. ఎన్నోవేల సంవత్సరాల క్రితమే వీటి ఆవశ్యకతను మానవుడు గుర్తించాడు. వేదవాఙ్మయంలో వీటి ప్రస్తావన ఉండడమే ఒక అద్భుతం. నేడు మానవ మనుగడకు భూమిని రక్షించుకోవలసిన ఆవశ్యకత మరింతగా ఏర్పడింది. అధర్వణ వేదం 12.1 భూమితో ఉన్న సంబంధాన్ని, భూమి పట్ల మనకు ఉండాల్సిన శ్రద్ధ బాధ్యతలను వివరిస్తుంది. అదే భూసూక్తం.
భూ సూక్తం ఇలా ప్రారంభమవుతుంది.
ఓం భూమిర్భుమ్నా ద్యౌర్వరిణాన్తరిక్షం మహిత్వా
ఉపస్థే తే దేవ్య ద్వితేగ్ని మన్నాద మన్నాద్యాయాదధే
……………………………………………
తచ్చో ణైతి శ్రవ ఇచ్ఛమానా పుణ్యగ్గ్ శ్లోకం యజమానాయ కృణ్వతీ
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః తో పూర్తి అవుతుంది.
భూసూక్తం పుడమితల్లిని స్తుతించే మంత్రం. ఇది భూమిని సత్యం, ధర్మం, భక్తి, త్యాగం ద్వారా నిలిపిన తల్లిగా వర్ణిస్తుంది. ప్రకృతి పర్యావరణం అన్ని జీవులకు పోషకాలుగా ఎలా వుంటాయో వివరిస్తుంది. ప్రతీ శ్లోకం నేను భూమాతకు భక్తితో నమస్కరిస్తున్నాను అని ప్రారంభమవుతుంది. సత్యం, విశ్వదైవిక చట్టం, బ్రహ్మం (రుతం) కోసం అన్వేషణ (రుషుల ద్వారా) శక్తిమంతమైన దీక్షలు, తపస్సులు స్వీయ సమర్పణలలో వ్యక్తమయ్యే ఆధ్యాత్మిక అభిరుచి, ఇవి యుగయుగా లుగా భూమాతను నిలబెట్టాయి (ఆమె తన వక్షస్థలంతో వీటిని ఆదరించింది).
ఆమె (భూమాత) పర్వతాలు, వాలులు, మైదానాల ద్వారా మానవులకు ఆటంకం లేని స్వేచ్ఛను ఇచ్చింది. (బయటి లోపలి రెండింటిని). ఆమె, అనేక మొక్కలు, వివిధ శక్తి గల ఔషద మూలికలను కలిగి ఉంది. ఆమె తన సంపదను మానవులకు విస్తరించి మనలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆమెలో మహాసముద్రం, నదీజలాలు అల్లి ఉన్నాయి. దున్నినప్పుడు ఆమెలో కనిపించే ఆహారంతో అన్ని జీవులు సజీవంగా ఉంటున్నాయి.
ఆమెలో ప్రపంచంలోని నాలుగు దిశలు ఉన్నాయి. ఆమె తనలో నివసించే వివిధ జీవితాలను కొనసాగిస్తుంది. భూమాత అయిన ఆమె ఆహారంలో ఉండే జీవన కిరణాన్ని మనకు ప్రసాదించుగాక.
ఆమెలో మన పూర్వీకులు నివసించారు. కార్యకలాపాలు నిర్వహించారు. ఆమెలో దేవతలు (మంచిశక్తులు) అసురులు (దుష్టశక్తులు) పూర్వకాలం నుండి కొనసాగుతున్నాయి.
ఆమెలో ఆవులు, గుర్రాలు, పక్షులు ఇతర జంతు వులు పూర్వకాలం నుండి ఉన్నాయి. భూమితల్లి, మాకు శ్రేయస్సు వైభవాన్ని ప్రసాదించునుగాక.
ఆమె విశ్వంభర (అన్ని సంపదల నిర్మాత). ఆమె ప్రతిష్ఠ మనం నివసించే పునాది. ఆమె హిరణ్య వక్ష (బంగారు వక్షస్థలం కలది). ప్రపంచంలోని అగ్ని మాపక స్థలం. ఇంద్రుడు, వృషభాలను శక్తిమంతం చేసే అగ్ని ఆమె, మాతృభూమి మాకు, ఆ అగ్ని తేజస్సును ప్రసాదించి మమ్ములను బలపరుచుగాక.
ఆమెను దేవతలు జాగరూకతతో నిద్రలేకుండా రక్షిస్తారు. ఆమె సర్వదాత, భూమాత, గొప్ప తేజస్సును (దైవత్వం) ఇచ్చే ఆ రమ్యమైన తేనెను ఆమె మన పరం చేస్తుంది. సముద్రం పైన కూర్చుని, దాని నీటిలో (ధ్యానంలో) మునిగిన రుషులు ఆమెను అతీంద్రియ శక్తుల ద్వారా అనుసరించారు (అంటే యోగశక్తుల ద్వారా ఆమె నిజస్వభావాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించారు. భూమి మాత హృదయం, సత్యం, అమరత్వంతో కప్పిన అత్యున్నత వ్యోమన్ (ఆధ్యాత్మిక ఆకాశం)లో ఉంది. భూమిమాత, తన అద్భుతమైన శక్తిని మనకు మన గొప్ప రాజ్యానికి ప్రసాదించాలి.
ఆమెలోని జలాలు, పగలు రాత్రి జాగరూకతతో ప్రవహిస్తాయి (అనగా ఎడతెగకుండా). ఆమె మన మాతృభూమి తనలో సమృద్ధిగా ఉన్న ప్రవాహాల పాలను అందించి దాని వైభవంతో (నీటితో ఉన్న) మనలను తేమ చేస్తుంది. ఆమెను అశ్వినులు (దైవ వైద్యులు) కొలుస్తారు (అంటే ఆమెను మూలికలు వైద్యం చేసే గుణాలతో నింపారు).
ఓ భూమిమాతా! నీ కొండలు, మంచుతో కప్పి ఉన్న పర్వతాలు (మనలో) చల్లదనాన్ని వ్యాపింప జేయు గాక. నీ అడవులు మనలో ఆనందాన్ని వ్యాపింప జేయుగాక. నీవు నీ అనేక రంగులతో విశ్వరూపాన్ని గోధుమ రంగు పర్వతాలు, కృష్ణవర్ణ (నల్లటి) నదులు, రోహిణి రంగు (ఎరుపు) పువ్వులు, (కానీ ఈ మంత్ర ముగ్ధమైన రూపాలన్నిటి వెనుక) ఓ భూమిమాతా! నీవు ధ్రువుడిలా ఉన్నావు, దృఢంగా, స్థిరంగా (సంపూర్ణంగా, ఓ తల్లీ) నిలబడతావు.
ఓ మాతా! నీ కేంద్రంలో నీ నాభి ఉంది. దాని నుండి ప్రాణశక్తి ఉద్భవిస్తుంది, వ్యాపిస్తుంది. ఆ శక్తిలో మమ్మల్ని గ్రహించి మమ్మల్ని శుద్ధి చేయండి, ఓ మాతా! నేను భూమిమాత కుమారుడిని. పర్జన్యం దేవుడు మనలో నింపుతాడు.
ఆమెలో భూమి తనను తాను త్యాగం చేసే బలిపీఠంగా విస్తరించుకున్నది, ఆమెలో ప్రపంచంలోని అన్ని కార్యకలాపాలు యజ్ఞంగా వ్యాపించాయి. ఆమెలో ప్రారంభం నుండి యజ్ఞాల సమయంలో ప్రపంచ కార్యకలాపాలు శబ్దాలు (యాగ మంత్రాలను పోలి ఉంటాయి, పైకి లేచి శుద్ధి చేసే పై పొరలలో అదృశ్యమవుతాయి ప్రతీకాత్మకంగా కార్మికులను శుద్ధి చేయడం) విస్తరించాలి.
ఓ భూమి! మనల్ని ద్వేషించేవాడు లేదా మానసికంగా మనల్ని శత్రువుగా భావించేవాడు లేదా మనల్ని కొట్టేవాడు, ఓ మాతృభూమి, మీరు పూర్వ కాలం నుండి చేసినట్లుగానే లొంగదీసుకోండి!
నీ ద్వారా ఉత్పత్తి అయినవి, నీలో సంచరించేవి రెండు పాదాలు, నాలుగు పాదాలు కలిగినవి. భూమిలో నీవు మోస్తున్నవి, మానవుడు, వీరి నుండి అమరత్వం కాంతి మృత్యుభూమి నుండి కూడా వెలువడుతుంది. ఓ భూమాతా! ఉదయించే సూర్యుని కిరణాల అమరత్వ సారాంశం నీలో వ్యాపించి ఉంటుంది.
మేము మీ పిల్లలము. ఓ మాతృభూమి! గొప్ప మధురమైన వాక్కు (వేద మంత్రాలను) గ్రహించడం ద్వారా మీలో ప్రతీచోట ఉన్న (దైవక్రమాన్ని) రుతం పాలు చేయవచ్చు.
ప్రపంచ మాతృమూర్తి! మమ్ములను పోషించే మూలికలు (మొక్కలు) కదలని భూమిపై పెరుగు తాయి. ధర్మం చేత పట్టుకున్న భూమి శోభ ప్రపంచ మంతా వ్యాపిస్తుంది.
మనం కలిసి ఉండే ఈ ప్రదేశం గొప్పది. శక్తిమంతమైనది. దానిలోని శక్తి, ఇది దాని కదలిక గొప్ప వేగాన్ని నియంత్రిస్తుంది. ఆమెను రక్షించే దేవుడు ఇంద్రుడు గొప్పవాడు.
దైవశక్తులతో ఆవరించి ఉన్న (ఈ గొప్ప సమావేశ స్థలంలో) భూమి ద్వేషపూరిత దృక్పథంతో ఉన్న ఎవరిని మనం చూడకుండా ఉండటానికి మనల్ని బంగారంలా మెరిసేలా చేస్తుంది. చివరకు శాంతి మంత్రంతో ముగుస్తుంది.
రాజర్షి జనకునికి అసితముని భూసూక్తం వినిపించాడు. తేత్రాయుగం పోయి ద్వాపర యుగం వచ్చింది. పరాశర మహర్షి మె•త్రేయునికి, కలి యుగంలో జరగబోయే రాజకీయ పరిణామాలను గురించి సామాజిక పరిస్థితులను గురించి చెప్పాడు. విష్ణు పురాణంలో కూడా ఈ ప్రస్తావన ఉంది.
రాజ్య విస్తరణ కాంక్షతో ఎన్నో యుద్ధాలు చేసి పరదేశాలను ఆక్రమించి, ఈ భూమిని శాశ్వతంగా ఏలుకోవాలని కోరుకున్న రాజులెందరో కాలగర్భంలో కలిసిపోయారు. అలాగే నియతి తప్పిన ప్రజా ప్రభుత్వాలు పడిపోక తప్పదు. చరిత్రలో దుర్మార్గులైన ఏలికలు ఎందరో జన జీవితాలను అతలాకుతలం చేశారు. రక్తపాతాన్ని, అశాంతిని కరువులను సృష్టించారు. భూదేవత వారి అధికార దాహాన్ని చూసి నవ్వుకుంది. సహనంలో భూమాతను మించిన వారు లేరు. జీవులు తనకు ఎన్ని అపచారాలు, అపకారాలు చేసినా భరిస్తుంటుంది. ఈ భూమి మీద నడయాడే జీవులకు ఆ సహనం అలవడినప్పుడే లోక కల్యాణం సాధ్యమవుతుంది.
మూలం:
- శ్రీ వేంకటేశ్వర స్తోత్ర నిధి (నిత్య పారాయణ గ్రంధము) (భూస్తూకం). 2) స్తోత్ర నిధి కామ్. 3) శ్రీ దోనయామాత్య విరచిత సస్యానందము పేజీ -25, 26.
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు