ఆమెకు చూపులేదు. లో చూపు ఉంది!

మిగతా అందరిలా ఉండదామె. మిన్నగా ఉంటుంది!

ఇతరుల్లా చదువలేదుకానీ, తనకు తానుగా చదువుకుంటుంది!

విధిరాతను నమ్మదసలు. తన తలరాతను తానే రాసుకుని, ముందుకు దూసుకెళ్లింది. దూసుకువెళ్తూనే ఉంది ఇప్పటికీ!

పేరు రష్మి. ఇంటిపేరు మరువాడ. స్వస్థలం విశాఖ. తండ్రికి ఉద్యోగం కోల్‌కతాలో కాబట్టి అక్కడే నివాసం.

ఆ మధ్య విశాఖలోని న్యాయ విశ్వవిద్యాలయం నుంచి ఏకంగా బంగారు పతకం అందుకుందీ అమ్మాయి.

విభిన్న ప్రతిభావంతురాలు. అవును, ఆ యువతి ప్రతిభ, దక్షత, సంకల్పం, సాధించి తీరడం – అంతా విభిన్నమే!

ఎలా సాధ్యమైందీ ప్రత్యేకత?

ఆ రోజు విశాఖలోని సువిశాల మందిరంలో స్నాతకోత్సవ సదస్సును ఏర్పాటు చేసింది దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. ప్రధాన అతిథిగా మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి. జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌పలుమార్లు ఉక్కు సంకల్పం గురించి విపులీకరించారు. న్యాయవాద రంగంలోకి వనితలు మరింతగా రావాలనీ, యువతమీద ఈ బాధ్యత ప్రధానంగా ఉందనీ అంటున్నపుడే రష్మీ పేరు ప్రస్తావన!

విశిష్ట అతిథిగా ప్రసంగించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌మహేశ్వరి, విశేష అతిథిగా ఉపన్యసించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌నరసింహ; ఉత్సవ సభకు అధ్యక్షత వహించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌ధీరజ్‌సింగ్‌…. ఈ ‌సుప్రసిద్ధులంతా యువతరంలో ఉండాల్సిన వృత్తి నిబద్ధతను చాటి చెప్పారు. ఆ అన్ని సందర్భాల్లోనూ రష్మీవైపే అందరి చూపూ!

తన తనయ బాగా చదవాలనీ, సమాజానికి ఉపకరించే వృత్తిని చేపట్టాలనీ ముఖ్యంగా రష్మి తండ్రి ఆశ, ఆశయం.

ఆమెకు దృష్టి లేదని ఆయన కుంగిపోలేదు ‘చదువు ఎలా’ అని నిరాశకు లోనవలేదు. బ్రెయిలీ లిపి ఆధారంగా ముందడుగు వేయించారు. ముందంజ వేసింది కూతురు.

చూసి చదవులేని, రాయలేని వారికి ఏకైక ఆశాకిరణం బ్రెయిలీ లిపి. చూడలేనివారికి స్పర్శ రచన పద్ధతిని అలవాటు చేయడం, ప్రత్యేకంగా ఉండే కంప్యూటర్‌ ‌స్క్రిన్స్, ‌మరికొన్ని ఎలక్ట్రానిక్‌ ‌సంబంధాలు దోహదమవుతుంటాయి ఎప్పుడూ.

చుక్కల ఉపయోగంతో ప్రస్ఫుటమైన రచనా సంవిధానం. బ్రెయిలర్‌లోని పాయింట్లు- అక్షరాలు, వర్ణమాలలు, సంకేతాల ఆకారంలో రూపొందినవే. పదాలు, సంఖ్యలు, ఇతర వాటిని సైతం గుర్తించే సావకాశముంది. చుక్కల గుర్తింపు ద్వారా భాష సంబంధ అక్షరాలు/పదాలు అవగతమవుతుంటాయి.

ఫ్రెంచి విద్యావేత్త బ్రెయిలీకి పఠన, రచన వ్యవస్థలు రుణపడే ఉంటాయి ఎప్పటికీ. ఈ ప్రత్యేక స్పర్శ రచన సంవిధానమే కనుచూపుగా పరివర్తితమవుతుంది అన్నివేళలా!

స్పర్శలోనే రాయవచ్చు, చదవవచ్చు, విరామచిహ్నాలను కూడా అమరికల రీత్యా తెలుసుకోవచ్చన్నమాట. పేజీ/ఉపరితలంపైన పెరిగిన చుక్కల శ్రేణులపరంగా వేళ్లను కదలిస్తూ చదువుకోవచ్చు. ఈ పనే చేసింది రష్మీ.

బ్రెయిలీ లిపి మీద పట్టు సంపాదించడంవల్లనే పదో తరగతి పరీక్షల్లో నూటికి 77 మార్కులు సాధించింది.

ఇంటర్మీడియట్‌లో 85 శాతం సాధించి సత్తా చాటారు. న్యాయశాస్త్రం చదవాలన్న దృఢదీక్షతో ఉమ్మడి పరీక్ష రాసి ప్రవేశం సంపాదించింది. అదీ మంచి ర్యాంకుతో!

అది 2018. విశాఖ వర్సిటీలోనే ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీలో స్థానం పొందింది. బ్రెయిలీ లిపి పరంగా అక్కడే కంప్యూటర్‌ ‌పరిజ్ఞానాన్ని మరింత పెంచుకుంది. అంతేకాదు; రెండేళ్ల కిందట కంప్యూటర్‌పైనే పరీక్షలు రాసి ‘శభాష్‌’ అనిపించుకుంది అందరితోనూ! అక్కడ ఉత్తమత్వమే.

వైకల్యం అనే పదమే అనడానికి / వినడానికి / రాయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అసలు ఆ పదం గురించే ఒక్క క్షణమైనా అనుకోదు రష్మి. అనదు కూడా ‘సకలం’ అనే మాటనే ఎప్పటికీ ఇష్టపడుతుంటుంది తను.

ఇదంతా చదువుతుంటే మనకు ఒక చలనచిత్ర కథ గుర్తుకొస్తుంది. ఇలాగే ఒక అమ్మాయి, అంధత్వాన్ని అధిగమిస్తుంది. అదృష్టం అనే పదానికే సవాలు విసురుతుంది. మనిషి తలచుకోవాలే కానీ, ఏదీ అసాధ్యం కాదని నిరూపిస్తుంది.

న్యాయవాదాన్ని వృత్తిగా తీసుకున్న ఆ కథానాయిక నిజ జీవితంలోనూ నేతగా నిలుస్తుంది.

రష్మిదీ సవాళ్లను స్వీకరించే తత్వమే. ఉదా హరణలు ఇంకా అనేకం ఉన్నాయి.

  1. విశాఖలోని లా వర్సిటీ నుంచి బీఏ ఎల్‌ఎల్‌బీ
  2. ముంబయిలో ఉన్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ (‌సామాజిక శాస్త్రాలు) నుంచి ఎల్‌ఎల్‌ఎం. అదే విద్యా సంస్థ నుంచి సోషల్‌సైన్సెస్‌లోనే ఎంఏ చేయడం. ఈ కోర్సు పేరు : డిజీబిలిటీ స్టడీస్‌ అం‌డ్‌ ‌యాక్షన్‌.

‌విశాఖలోనే స్నాతకోత్సవ సభావేదిక మీద డిగ్రీని అందుకుంది. అదీ న్యాయమూర్తుల చేతులమీదుగా!

సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆదర్శప్రాయ.

సామాజిక, మానవీయ శాస్త్రాల అధ్యయనంలో స్ఫూర్తిదాయని. కఠినతర అసైన్‌మెంట్లను దిగ్విజయంగా పూర్తి చేసింది.

సహాయ పరికరాల వినియోగాన్ని పూర్తి చేసుకుంది.

ఫలితంగా, మార్కుల వరాలు ఆమెకు లభించాయి.

అప్పట్లో ఆంగ్లంలో 90 శాతం మార్కులు. మనస్తత్వశాస్త్ర పరీక్షలో 86 శాతం.

పౌర హక్కుల అధ్యయనానికి సంబంధించి 88.

న్యాయ సంబంధ పరీక్షలపరంగా 77శాతం మార్కులు.

ఇవన్నీ రష్మి ధీశక్తికి ఉదాహరణలు. విధిని ఎదిరించి విజయం సాధించిందని చాటిచెప్పే తార్కాణాలు.

‘ఇవన్నీ ఏ విధంగా సాధ్యమయ్యాయి మీకు’ అని అడిగితే….

ఇవీ ఆమె సమాధానాలు. ఆ మాటల్లోనే చెప్పాలంటే.

  1. నా శక్తి నాది, పూర్తిగా ఎవరిపైనా ఆధారపడను.
  2. చదువు గురించి నా ఆలోచనలు నాకున్నాయి.
  3. అవకాశాల కోసం అన్వేషిస్తాను. సాంకేతికంగా అవసరమైనపుడు అమ్మ నా వెంట ఉంటుంది. స్నేహితురాలి మాదిరిగా సహకరిస్తుంది.
  4. నడిచేటపుడు ఇతరుల సాయాన్ని అంతగా కోరుకోను. దారి చూపించాలనో, చేయిపట్టుకోవాలనో అడగను. నా శక్తిని, సామర్థ్యాన్ని ఉపయోగించి ముందుకు నడుస్తానే తప్ప- ఎవరి అండదండలో కావాలని ఎదురు చూడను. ఇది నా మీద నాకున్న నమ్మకం. ధైర్యంగా ఉండాలన్న గట్టిపట్టుదల.
  5. చదువుతోపాటు కొన్ని పోటీల్లో పాల్గొనడం నాకు ఎంతో ఇష్టం. కొన్నేళ్ల క్రితం ఒక సంస్థ ఓ కొత్త తరహా పోటీ పెట్టింది. ఆ సంస్థ పేరు – నేషనల్‌ ఇన్నోవేషన్‌ ‌పౌండేషన్‌ (ఇం‌డియా). సృజనాత్మకంగా ఎలా ఉండాలన్న ఆలోచన చేశాను. కంప్యూటర్‌ ఆధారిత మూడు చక్రాల సైకిల్‌ ‌గురించి భావన రాగానే, ఆచరణకు తెచ్చాను. దీంతో ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బండిని నడుపుతూ వెళ్లవచ్చన్న మాట.
  6. నాకు ఆటలన్నా ఇష్టమే. ట్రెక్కింగ్‌ ‌వంటివి చేయాలని ఉంటుంది కొన్నిసార్లు. కొండను అధిరోహించాలన్న ఆలోచనా వస్తుంటుంది చాలాసార్లు. ఆసక్తితో ఒక కోర్సు చేశాను కూడా. భయంతో ఏదీ సాధించలేం. ధైర్యంతో ఏదైనా ఎలాగైనా సాధించగలం. ఇదే నా సిద్ధాంతం.
  7. ఏదో ఒక లోపముందని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనమేమిటి? ఆ ఆలోచనను పక్కనపెట్టి, సొంతంగా ఆలోచన చేసి, మనకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పాటుచేసుకుంటే… అదీ జీవితం అంటే!

రష్మీ మనోనిబ్బరాన్ని, ఆత్మబలాన్ని వెల్లడి చేస్తున్నాయి కదా ఈ అన్నీ. అందుకనే, తనదైన మార్గంలో నడిచింది, నడుస్తోంది. సాధించింది, ఇంకా సాధించనుంది. ఎవరి శక్తిని వారు తెలుసుకుంటే అద్భుతాలు జరుగుతాయని చెప్తోందామె.

‘న్యాయవిద్యపైనే ఎక్కువ మక్కువ ఎందుకు?’ అని ప్రశ్నిస్తే….

  1. ప్రశ్నించడం అనేది మనకు ఉండాల్సిన లక్షణం.
  2. న్యాయం, అన్యాయం మనందరికీ తెలుసు. న్యాయాన్నే గెలిపించాలన్నది ఒక్కటే నాకు తెలుసు బాగా. ఎందుకంటే – న్యాయం ఎన్నడూ ఓడిపోకూడదు. ఓడిపోనివ్వకూడదు.
  3. మంచి, చెడు పక్కపక్కనే ఉంటుంటాయి. ఏది ఏమిటన్నది తెలుసుకోవడమే మన పని. తెలుసుకున్నదాన్ని ఆచరణలో పెడితే న్యాయాన్ని గెలిపించినవాళ్లమవుతాం. మనకు ఎందుకు? మనమే ఎందుకు చేయాలి? ఎవరికీ పట్టనిదాన్ని మనమెందుకు తలకెత్తుకోవాలీ అనుకుంటే మటుకు అది మనిషి జన్మ కానట్లే! నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. నిజం కాని దాన్ని బోనులో నిలబెట్టాలి. ఇదీ మొదటి నుంచీ నా పంతం, ప్రయత్నం.
  4. చదువుకున్న న్యాయవిద్యను సార్థకం చేసుకుంటా. వృత్తిలో సైతం ముందు భాగంలోనే ఉంటా.

బంగారు తల్లి రష్మీ ఎంచుకున్న న్యాయశాస్త్ర ప్రధాన అంశం: క్రిమినాలజీ, డ్రగ్‌కంట్రోల్‌ ‌లా. అందులోనే ఆమె అగ్రస్థాయిన నిలిచి, స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

భవిష్యత్‌ ‌ధ్యేయం గురించి తనకు కలలున్నాయి. వాటిని సాకారంచేసుకునే విధానాలూ తన అధీనంలోనే ఉన్నాయి. ‘దివ్యాంగురాలు అనే మాట పదే పదే అనకండి ఎవ్వరూ! ఆ పిలుపులో బయటపడాల్సింది. సానుభూతి కాదు. ఎప్పుడూ ఎవరూ సానుభూతినే కోరుతూ ఉండరు. మనిషిలోని శక్తిని చూడాలనే ఆశిస్తారు. అదే జరగాలి. ప్రోత్సాహమిస్తే, ఎవరు ఎంతైనా సాధించవచ్చు. దీనికి నన్ను నేనే తార్కాణంగా అనుకుంటా. ఇంకా చదవాలని ఉంది నాకు. సామాన్యులను ఆదుకునే పనులను మరింతగా చేయాలనుంది.’

దూరమెంతో ఉందని దిగులుపడకు, బాధపడకు!

అవరోధాల దీవుల్లోనే ఉంటుంది ఆనంద నిధి!

సంకల్పం నీదైతే; నీ ముందు సాగిలపడి చేతులెత్తి మొక్కుతుంది విధి!

ఈ వాక్యాలే తనకెంతో ఇష్టమంటోంది రష్మీ!

జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE