రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్ల చరిత్రలో మూడు పర్యాయాలు నిషేధాలకు గురైంది. ఆ మూడు ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీయే చేసింది. దారుణంగా చతికిలపడింది. అయినా కర్ణాటకలో బహిరంగ ప్రదేశాలలో ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు నిర్వహించరాదని రాష్ట్ర మంత్రి ప్రియాంక ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2025లో కూడా ఒక ప్రయత్నం చేసి, న్యాయ వ్యవస్థ కారణంగా భంగపడ్డారు. తరువాత ఆయన తండ్రి, అఖిల భారత కాంగ్రెస్ నామమాత్రపు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలని, బహుశా జాతీయ స్థాయిలో, ముచ్చట పడ్డారు. కానీ అడుగు ముందుకు వేయలేదు. వేయలేరు కూడా. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌తో గాంధీ-నెహ్రూ కుటుంబానికి తప్ప ఆ కాలం నాటి చాలామంది ప్రముఖులకు తీవ్ర వైరమేమీ లేదు. సర్దార్ పటేల్, పురుషోత్తమదాస్ టండన్ వంటి కొందరు తప్ప ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు గుప్పించిన చాలామంది ఉద్దేశం నెహ్రూ కుటుంబాన్ని మెప్పించడమే. ఆ పనే ఇప్పుడూ జరుగుతున్నది.
గాంధీజీ హత్య తరువాత స్వతంత్ర భారత ప్రథమ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించింది. బ్రిటిష్ ప్రభుత్వం చేసింది కూడా అదే. కానీ స్వతంత్ర భారతదేశం విధించిన నిషేధం ఎత్తివేసిన కేవలం మూడు మాసాలకే స్వయంసేవకులు కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చునని కార్యవర్గ సమావేశం తీర్మానించడమే గొప్ప చారిత్రక వైచిత్రి. నిజానికి ఆ తొలి నిషేధం పట్ల కాంగ్రెస్‌లోనే ఏకాభిప్రాయం లేదని కొన్ని వార్తలను బట్టి అర్ధమవుతుంది. స్వయంసేవకుల మీద ఆ పార్టీ నేతలు కొందరికి పూర్తి సానుభూతి ఉంది. సంఘ పెద్దలతో బంధం ఉంది. నాటి రాష్ట్రపతి (కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అలా పిలిచేవారు) డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య, పురుషోత్తమదాస్ టండన్ వంటి ప్రముఖ నేతలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులకు స్వయంసేవకుల మీద గౌరవం ఉంది. వారి దేశభక్తి మీద, భారతీయత మీద వారికి ఉన్న నిబద్ధత మీద ప్రగాఢ నమ్మకం ఉంది. కాబట్టే, స్వయంసేవకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అభ్యంతరం ఉండదని నిషేధం ఎత్తివేసిన మూడు నెలలకే కాన్పూర్ కార్యకర్తల సమావేశంలో డాక్టర్ పట్టాభి ప్రకటించారు. అదే తరహా పిలుపును టండన్ కూడా ఇచ్చారు. కానీ గాంధీజీ హత్య తరువాత స్వయంసేవకులను వేధించిన తీరు దారుణమే.
ఇక్కడే గమనించవలసిన కీలక అంశం ఉంది. 1936 త్రిపురీ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో నేతాజీ బోస్ మీద పోటీ చేసిన డాక్టర్ పట్టాభి అపజయం పాలయ్యారు. పట్టాభి ఓటమి తన ఓటమి అని గాంధీజీ వ్యాఖ్యానించిన మాట నిజం. ఒక సంచలనం. గాంధీజీకీ, పట్టాభికీ ఉన్న సాన్నిహిత్యం అంతటిది. అయినా గాంధీజీ హత్య నిందను మోసిన ఆర్‌ఎస్‌ఎస్‌ను పట్టాభి శంకించలేదు. కానీ స్వయంసేవకులు కాంగ్రెస్‌లో చేరడమనే ప్రతిపాదన ప్రథమ ప్రధాని నెహ్రూ జీర్ణించుకునే అవకాశమే లేదు. అయినా డాక్టర్ పట్టాభి కాన్పూర్‌లో సాక్షాత్తు కార్యకర్తల సమావేశంలో ఇలాంటి ప్రకటన చేయడం సాహసం. 1940 దశకంలో డాక్టర్ పట్టాభి ఆర్‌ఎస్‌ఎస్‌కు సన్నిహితంగా ఉండేవారని కొన్ని వార్తలు చెబుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించి కాంగ్రెస్ అపచారానికి ఒడిగట్టిందన్న న్యూనతాభావం ఆనాడు ఆ పార్టీలో నిజం ఇవాళ్టి కాంగ్రెస్ నాయకులకు, నెహ్రూ వీరభక్తులకు తెలియడం కోసం ఇలాంటి చారిత్రక వాస్తవాలు వెలుగులోకి రావలసి ఉన్నది. అందుకే ఈ ప్రయత్నం.
ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత రాహుల్ శివ శంకర్ ఎక్స్ వేదికగా పంచుకున్న చారిత్రక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించి తరువాత చర్చలోకి వెళదాం. జూలై 9, 2024న నరేంద్ర మోదీ ప్రభుత్వం ముఖ్యమైన ఆదేశం జారీ చేసింది. ప్రభుత్వోద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉండా లంటూ 1966లో నాటి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని ఉపసంహరిస్తూ ఇచ్చిన కొత్త ఆదేశమిది. కానీ స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి వ్యక్తి డాక్టర్ భోగరాజు పట్టాభిసీతా రామయ్య 1940 దశకంలో ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యుడే అయినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌తో సన్నిహితంగా వ్యవహరించారు. ఆర్‌ఎస్‌ఎస్ కొన్ని సిద్ధాంతాలను స్వాగతించారు. కొన్ని పుస్తకాలలో దొరుకుతున్న సమాచారం ప్రకారం డాక్టర్ పట్టాభి ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు కూడా. అలాగే నాటి సర్‌సంఘచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్‌తో సన్నిహిత బంధం కూడా ఉండేది. 11.10.1949 నాటికి డక్కన్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రిక, 13.10.1949 నాటి జాగృతి తెలుగు వారపత్రికలలో ఈ వార్తలు, విశ్లేషణలు చూడవచ్చు.
స్వయంసేవకులను ఆహ్వానించిన సీడబ్ల్యుసీ
సంఘం మత సంస్థ కాదని తొలిసారిగా రాష్ట్రపతి ప్రకటన అన్న శీర్షికతో జాగృతి (13.10. 1949) ఈ అంశాన్ని విశ్లేషించింది. ఆర్‌ఎస్‌ఎస్ అసలు కాంగ్రెస్ శత్రువే కాదని, కాంగ్రెసులోని విభిన్న వర్గాలే కాంగ్రెసుకు శత్రువులు అని కూడా డాక్టర్ పట్టాభి వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం, హిందూ మహాసభ, ముస్లింలీగు వంటి మత సంస్థకాని, రాజకీయ సంస్థ కాని కాదు. కాంగ్రెసుకు శత్రువు ఆర్‌ఎస్‌ఎస్ కాదు. కాంగ్రెసులోని విభిన్న వర్గాలే కాంగ్రెసుకు నిజమైన శత్రువు- కాన్పూరు కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో కాంగ్రెసు అధ్యక్షుని విస్పష్ట ప్రకటన ఇది. ఇంకా, రా.స్వ.సంఘ సభ్యులకు కాంగ్రెసులో ప్రవేశార్హతను కల్పిస్తూ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని గురించి ప్రేక్షకులు వేసిన ప్రశ్నలకు డాక్టరు పట్టాభి సమాధానమిస్తూ ఇలా అన్నారు:
కాంగ్రెసువారు ఆత్మవిశ్వాసాన్ని, చిత్త స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవాలి. ఆసంఖ్యాకులుగా సంఘ సభ్యులు కాంగ్రెసులో చేరితే, కాంగ్రెసువంటి మహాసంస్థ శక్తి ఉడిగిపోతుందనే భావాన్ని కాంగ్రెసు వారు త్యజించాలి. ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులకు కాంగ్రెసులో ప్రవేశార్హత కల్పిస్తూ వర్కింగ్ కమిటీ చేసిన నిర్ణయంలో కొత్త ఏమీ లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ను కాంగ్రెసు ఎప్పుడూ వెలివేయలేదు. రాజకీయాలతో ఎట్టి సంబంధం పెట్టుకోకుండా సాంస్కృతిక రంగం లోనే పనిచేస్తామని, భారత ప్రభుత్వాన్ని, భారత పతాకనూ గౌరవిస్తామనీ, ఆర్‌ఎస్‌ఎస్‌వారు మాట యిచ్చారు. ఒక పెద్ద మనిషి చెప్పిన మాటను విశ్వసించడం అహింసా సూత్రాలను అనుగుణమైన పద్ధతేననీ డాక్టరు పట్టాభి పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం, దృష్టి, సేవ ఎలాంటివో కాంగ్రెస్‌కు ఎరుకేనని పట్టాభి మాటల వల్ల తెలుస్తుంది.
కాంగ్రెసు కార్యకర్తలను ఉద్దేశిస్తూ పట్టాభి కాస్త నిరసన కూడా ప్రకటించారు. కాంగ్రెసును నిశితంగా విమర్శిస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్ వారిని నిందించి ప్రయోజనం లేదు. పరస్పరం నిందించుకుంటూ ప్రతి నిత్యం ప్రభుత్వాన్ని దూయబట్టేవారు కాంగ్రెసువాదులే. కాంగ్రెసుకు శత్రువు ఆర్‌ఎస్‌ఎస్ కానే కాదు. కాంగ్రెసులో ఉన్నట్లే ఉంటూ కాంగ్రెసులో అంతఃకల హాలు ప్రేరేపించిన విభిన్నవర్గాలే. స్వార్థ ప్రయోజనా లను సాధించే ప్రయత్నంలోనే మీరు నిమగ్నులైతే ఎంతో కాలం మీరు మన లేరు. ఇతరులను విమ ర్శించే ముందు మీరు మీ యింటిని చక్కబెట్టు కోవడం ఎంతేని అవసరం అని పట్టాభి హెచ్చరించారు.
బాపూరావ్ మోఘే ఏమన్నారు?
దీనికి ఆర్‌ఎస్‌ఎస్ ఎంత సున్నితంగా స్పందిం చిందో కూడా చూడాలి. కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ చేసిన ప్రకటనపై మీ అభిప్రాయమేమిటని ప్రశ్నిస్తే ఆంధప్రాంత రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రాంత ప్రచారక్ బాపూరావ్‌జీ మోఘే -సంఘ సభ్యులను కాంగ్రెసులో చేర్చుకొమ్మని బ్రతిమాలడం కానీ భంగపడడం కానీ మాతరఫు నుంచి ఏమీ జరగలేదు. కాంగ్రెసుకు తోచిన విషయమే ఇది. అన్నారు. ఇంకా, సంఘం పద్ధతులపట్ల విశ్వాసం కలిగి ఉందనీ, జాతీయ పతాకాన్ని గౌరవించిందనీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘంపై మోపిన నేరారోప ణలు కేవలం నిరాధారాలని ఏనాడో స్పష్టమైంది. సంఘం మొదటి నుండీ సాంస్కృతిక పురోభివృద్ధికే పాటుబడుతోంది గాని రాజకీయాలతో ఎన్నడూ ఎట్టి సంబంధమూ పెట్టుకొనలేదు. సంఘ కార్యక్రమంలో ఈనాడు ఎట్టి మార్పూ రాలేదు. సంఘం ఏవో కొత్త హామీలను యిచ్చింది గనుక పూర్వపు పంథాను మార్చుకొని నూతన మార్గాన్ని అనుసరిస్తోంది గనుకనూ సంఘ సభ్యులకు కాంగ్రెసులోనికి ప్రవేశార్హతను కల్పిస్తున్నామనడం కేవలం అసంగతమైన విషయం మాత్రమేగాక హాస్యాస్పదం కూడా అన్నారాయన. (జాగృతి, 13.10.1949).
అటు కాంగ్రెస్ ప్రకటన, ఇటు సంఘ పెద్దల స్పందనలను సమన్వయం చేస్తూ నాటి రాజకీయ సామాజిక వాతావరణం నేపథ్యంగా జాగృతి (13.10. 1949 ) సంఘే శక్తిః కలౌయుగే పేరుతో రాసిన సంపాదకీయం స్మరణీయమైనది-
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సభ్యులు కాంగ్రెసులో చేరవచ్చునని కాంగ్రెసు కార్యనిర్వాహక వర్గం తీర్మానించింది. తీర్మానాన్ని సమర్థించుకుంటూ కొందరూ, ఖండిస్తూ కొందరూ తమ తమ అభిప్రా యాల్ని కూడా వ్యక్తం చేశారు. కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు కాన్పూరు కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో కొందరు వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆర్‌ఎస్‌ఎస్, ముస్లింలీగు, హిందూ మహాసభలవంటి మత సంస్థ కాదు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని సంస్థ అని స్పష్టీకరించారు. కాంగ్రెసుకు శత్రువు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కాదు. కాంగ్రెసులో ఉంటూ అంతఃకలహాలలో మునిగి తేలుతున్న భిన్న బిన్న వర్గాలే అని కూడా ఆయన విమర్శించారు. కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ కళావెంకట్రావుగారు కాంగ్రెసు ప్రణాళికలోని ర(సి)నిబంధన ప్రకారం మత సంబంధ మైనదిగాని మరి ఏ ఇతర సంబంధమైనది గాని అయిన రాజకీయ సంస్థలో సభ్యుడుగా ఉండని ప్రతి భారతీయుడు కాంగ్రెసులో చేరవచ్చును అని పేర్కొంటూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం మతంతోగాని రాజకీయాల్తోగాని సంబంధం లేని సంస్థ అన్నారు. స్వయంగా పండిత జవాహర్లాల్ నెహ్రూ ఇందోరులో పోలో మైదానాన్ని పప్రథమంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సమావేశానికి మంజూరు చెయ్యడంలో సహాయపడ్డారు. సంఘం మీద నిషేధం తొలగి యిప్పటికి మూడు నెలలు పూర్తి అయ్యాయి. నిషేధంలో ఉన్నప్పుడు కాంగ్రెసు నాయకుల మనః ప్రవృత్తులు నిషేధం తొలగిన తర్వాత ఏ కారణాలవల్ల మారాయో సాకల్యంగా విచారిస్తే పిలవని పేరటంలాగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తరఫు నుంచి ఎలాంటి కోరిక వెల్లడి కాక పోయినా కూడా కాంగ్రెసు ఈ తీర్మానాన్ని యిప్పుడు ఎందుకు తీసుకోవలసి వచ్చిందో బోధపడుతుంది. నిషేధం తొలగక పూర్వం ప్రధానమంత్రి లగాయతు గోవింద సహాయ్‌లాంటి ఛోటా నాయకుల వరకూ అందరూ గ్రుడ్లురిమినవాళ్లే. సంఘం మతోన్మాద సంస్థ అనీ, ఫాసిస్టు సంస్థ అనీ ప్రతి వ్యక్తీ దూషించడానికి నడుం కట్టుకున్నవాడే. శాంతి, అహింస, సత్యాల పేరున ఈనాడు రొమ్ము విరుచుకొని ముందునకు నడుస్తున్న ప్రతి కాంగ్రెసు నాయకుడు మహాత్ముని హత్యకు దేశంలోని మత కలహాలకూ సంఘమే కారణమని బల్లగ్రుద్ది ఉపన్యాసాలిస్తూ అన్యాయంగా సంఘ సభ్యులమీద జరిగిన అత్యాచారాల్ని, కళ్లారా చూస్తూ ఊరుకున్న వాడే. మరి ఇంత మార్పు వీరిలో రావడం ఆశ్చర్యం కలిగించకపోతుందా?….
కాని కాంగ్రెసు మాత్రం మొదటి నుంచీ ఆర్‌ఎస్‌ఎస్ మీద కత్తి ఝుళిపిస్తూనే ఉంది. అవకాశం చేజిక్కినప్పుడల్లా అణచాలని ప్రయత్నించింది. న్యాయాన్ని అర్థించిన సంఘ నాయకుల పట్ల నెహ్రూ పటేళ్లు చూసిన అసహజ ప్రవర్తన నాగరిక జాతులకే తీరని కళంకాన్ని ఆసాదించాయి. ఇలా యిన్ని విధాల దూషించి, ద్వేషించి ఏ ఉపాయాలవల్ల సంఘ శక్తిని అణచడం సాధ్యం కాదని గ్రహించి దేశం ఎదుర్కొం టున్న సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెసుకు శక్తి చాలదని తెలుసుకొన్న పిమ్మట ఈ తీర్మానం ద్వారా తమ కళ్లు తెరుచుకున్నట్లు ప్రపంచానికి రుజువు చేసింది కాంగ్రెసు.
సంఘం స్థాపించినప్పటి నుండీ సంఘ నాయకులు సంఘం కేవలం సాంస్కృతిక సంస్థ అని ఎన్నిసార్లు చెప్పినా అప్పుడు మాకు నమ్మకం లేదు, మేము విశ్వసించలేము అని అనడమేకాక ఒక కంటితో కనిపెట్టి ఉంచుతామన్న వారు పెద్ద మనిషి మాటలను నమ్మడం కాంగ్రెసు అహింసా సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉంటుంది అనడం వింటే సంఘం కాంగ్రెసు మీద నైతికంగా ఎంత విజయాన్ని సాధించిందో వేరే చెప్పనవసరం లేదు. నాయకులతో సహా సంఘ సభ్యుల్నందర్నీ నిర్బంధించడం- వారి పట్ల పశు ప్రవర్తన చూసి పీడించడం – మొదలైన ఎన్ని అత్యాచారాలు చేసినా తమ శక్తి కన్నా సంఘానికి అధికంగా నైతిక శక్తి ఉన్నదని గుర్తించి కాంగ్రెసు ప్రభుత్వం నిషేధాన్ని తొలగించింది. ఇది ఒక ఎత్తు.
జరిగిన అన్యాయాలన్నీ, విస్మరించండని చెపుతూ సంఘ నాయకులు శ్రీ గురూజీ వారూ మన సోదరులే, వారు చేసిన తప్పిదాన్ని మనస్సులో ఉంచుకోకండి అని (ప్రజాస్వామికం పేరిట కాంగ్రెసు ప్రభుత్వం ఎన్ని నాటకాలాడినా) దేశాన్ని దృష్టిలో ఉంచుకొని స్వయంసేవకులకిచ్చిన ఉపదేశం ఒక ఎత్తు.
…. తమ తీర్మానాన్ని సమర్థించుకోడానికి రాష్ట్రపతి పట్టాభి సంఘం ఏదో హామీలిచ్చిందని చెప్పవచ్చు. నిషేధానికి పూర్వం నిషేధం తొలగిన తర్వాత కూడా సంఘ కార్యకలాపాల్ని చూస్తూ వచ్చినవారికి అప్పుడు లేనిది ఇప్పుడేమి వచ్చిపడిందో అప్పుడు ఉన్నది ఇప్పుడేమి తొలగింపబడిందో బోధపడడం లేదు.
సంఘంలో ఎట్టి మార్పూ రాలేదని సంఘం ఎట్టి హామీ ఇవ్వలేదని ప్రభుత్వం తనంతట తానే నిషేధాన్ని తొలగించిందనీ శ్రీ గురూజీ స్పష్టం చేశారు.
రెండు శక్తులు తలపడ్డాయి. ఒకటి అన్యాయంతో మరొక దాన్ని అణచాలని ప్రయత్నించింది. కాని సత్యం జయించింది, అన్యాయం అణగిపోయింది. సంఘం జయించింది. ఇక మార్గం కానక కాంగ్రెసు మైత్రి కోసం చెయ్యి చాపుతోంది. చింత చచ్చినా పులుపు చావదు! ఏదెట్లయినా శుభం భూయాత్!
మీరు సంఘాన్ని ఏమీ చేయలేరని నాడే చెప్పిన సంపాదకీయమిది.
పురుషోత్తమదాస్ గొప్ప జాతీయవాది. ఆయన మాటలు కొన్ని వాస్తవాలను బయటపెట్టాయి. స్వయంసేవకులు కాంగ్రెస్‌లో చేరాలని పార్టీ ఎంత బలంగా వాంఛించిందో ఆ మాటలు చెబుతాయి. కాంగ్రెస్‌లో చేరి ప్రభుత్వాన్ని బలపరచండి స్వయం సేవకులకు పురుషోత్తమ దాస్ టండన్ సలహా (జాగృతి, 20.11.1949. హిందుస్థాన్ సమాచార్ నుంచి వార్త) వార్త చదివితే ఇది తెలుస్తుంది. స్వయంసేవకులను మరింతగా ఆకర్షించడానికి పట్టాభిని తొలగించి, టండన్‌కు అధ్యక్ష బాధ్యత ఇస్తారన్న మాటను ఆయన ఖండించడమే ఇందులో సారాంశం-
శ్రీపురుషోత్తమదాస్ టాండన్ ఇటీవల నాగ పూర్‌లో హిందూస్థాన్ సమాచార్ ప్రత్యేక విలేకరితో ప్రసంగిస్తూ రాష్ట్రపతి పట్టాభి సీతారామయ్య గారి రాజీనామా అనంతరం ఎక్కువమంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ సభ్యులను కాంగ్రెస్‌లోకి ఆకర్షించేందుకు తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవిని నిర్వహించబోతున్నట్టు ఒక నాగపూర్ పత్రిక ప్రకటించిన వార్త అసంబద్ధమైనదని అన్నారు. కాంగ్రెస్‌లో చేరి భారతీయ సంస్కృతి ఆదర్శాలకు అనుగుణంగా సుదృఢమైన ప్రభుత్వాన్ని ఈ దేశంలో నిర్మించవలసిందిగా సంఘ సభ్యులకు టండన్‌జీ అభ్యర్థించారు.
నెహ్రూ స్పందన
సాక్షాత్తు కాంగ్రెస్ అధ్యక్షుడే ఇలాంటి ప్రకటన చేయడం గురించి నెహ్రూ స్పందన ఏమిటన్న ప్రశ్న రాక తప్పదు. అందుకు సమాధానం జాగృతి (20.11.1949) ఇచ్చింది. దాని శీర్షిక- కాంగ్రెసు- ఆర్‌ఎస్‌ఎస్ పండిట్ నెహ్రూ.
కాంగ్రెసులో రా.స్వ.సంఘ సభ్యులను చేర్చు కొనవచ్చునా లేదా అన్న సమస్యను మీతో చర్చించిన వెనుకనే కాంగ్రెసు కార్య నిర్వాహక వర్గం తేల్చిందా అన్న ప్రశ్నకు నెహ్రూ సమాధానం ఇచ్చారు. ఆ విషయం తనతో సంప్రదించాలా అక్కర్లేదా అన్న ప్రశ్నే రాదన్నారాయన. తాను విదేశీ యాత్ర ముగించు కుని వచ్చి జరిగిన విషయాలు తెలుసుకునే క్రమంలో ఒక బిహారు కాంగ్రెస్ సభ్యుడు ఈ విషయం మీద ప్రశ్నింపగా దానిని కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం వివరించిందని విన్నాను. రా.స్వ.సంఘ్ సభ్యుడు కాంగ్రెస్‌లో చేరవచ్చు. కాంగ్రెసు నియమావళిలో సూచించిన సంస్థ సభ్యులు తప్ప అంతా కాంగ్రెస్‌లో చేరవచ్చు. ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడో మరొకరో కొద్దిరోజులలో ఒక స్పష్టం చేస్తారు అని నెహ్రూ అన్నారు.
రా.స్వ. సంఘ నియమావళిలో అభ్యంతకర విషయమేమీ లేదు. కాంగ్రెస్ నియమావళి ప్రకారం దాన్ని ఒప్పుకున్న వ్యక్తి కాంగ్రెస్‌లో చేర్చుకోవాలి. రా.స్వ.సంఘ్ వలంటీర్ సంస్థ. కాంగ్రెస్ నియమాల ప్రకారం ఏ కాంగ్రెస్ వ్యక్తి ఒక కాంగ్రెస్ దళ్‌లో తప్ప ఇతర వలంటీర్ సంస్థల్లో సభ్యునిగా ఉండరాదు. కనుక ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్ లోనుంచి తప్పుకోకుండా ఆ వ్యక్తి కాంగ్రెస్ సభ్యుడు కావచ్చునా? వీలు లేదు అని చెప్పాల్సివస్తుంది. ఎందు కంటే అతడు ఇతర వాలంటీర్ సంస్థలో సభ్యుడు కనుక. రెండో సంగతి జాతీయ సమస్యల యెడల రా.స్వ.సంఘ విధానం కాంగ్రెస్ దృక్పథం మతేతర మైనది. జాతీయమైంది. రా.స్వ.సంఘ దృక్పథం పూర్తిగా మతతత్వంతో కూడుకుందని చెప్పాలి. కనుక అది కాంగ్రెస్ తత్వానికి వ్యతిరేకం. ఇలా ఉంది ఆయన స్పందన. ఈ మొత్తం అంశంలో రా.స్వ. సంఘ నియమావళిలో అభ్యంతకర విషయమేమీ లేదు అని సాక్షాత్తు నెహ్రూ అంగీకరించడమే. సరిగ్గా ఈ విషయాన్నే నేటి కాంగ్రెస్ తెలుసుకోవాలి.
– జాగృతి డెస్క్