ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం-ఈసీ తాజాగా తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -ఎస్‌ఐఆర్) ప్రారంభించింది. బిహార్‌లో విజయవంతంగా పూర్తయిన ఈ పక్రియను ఇప్పుడు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కేరళతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో నవంబర్ 4న మొదలు పెట్టింది. ఈ జాబితాలోని బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసోంలోనూ వచ్చే ఏడాది ఎన్నికలు ఉండగా అక్కడ ఎస్‌ఐఆర్ కోసం ప్రత్యేక తేదీని ప్రకటిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇటీవల వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా 321 జిల్లాల పరిధిలోని 1850 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ చేపట్టారు. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరందరి వివరాలను డిసెంబరు 4 వరకు ఎన్నికల కమిషన్ సేకరించనుంది. డిసెంబర్ 9న సవరించిన ఓటర్ల జాబితా ముసాయిదాను ఈసీ విడుదల చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ఈ ఎస్‌ఐఆర్ పక్రియ ముగియనుంది. ఈ పక్రియ సజావుగా సాగేందుకు 5.3లక్షల మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), 7.64లక్షల బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు), 10,448 ఈఆర్‌ఓ/ఏఈఆర్‌వోలు, 321 మంది డీఈవోలు విధుల్లో నిమగ్నమయ్యారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ సమయంలో ఈఎఫ్‌ల పంపిణీ, సేకరణ కోసం బీఎల్‌వోలు ప్రతి ఇంటికి కనీసం మూడుసార్లు వెళ్తారని వివరించింది.
విపక్షాల ద్వంద్వ వైఖరి
ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల ద్వంద్వ వైఖరి స్పష్టంగా బయటపడుతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ బీజేపీపై, ఎన్నికల కమిషన్ మీద ఓట్ చోరీ ఆరోపణలు చేస్తున్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడి బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోందని, ఎన్నికల సంఘం అందుకు సహకరిస్తోందని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఎస్‌ఐఆర్ అనేది ఓట్ల చోరీని కప్పిపుచ్చే ప్రయత్నమని విమర్శించారు. ప్రజా స్వామ్యంపై నేరుగా దాడి జరుగుతోంది. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కలిసి ఈ చర్యను సమన్వయం చేస్తున్నారు అంటూ అర్థం లేని వ్యాఖ్యలు చేశారు రాహుల్.
దీనికి తృణమూల్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ, డీఎంకే, వామపక్షాలు వంత పాడుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడానికి ఎస్‌ఐఆర్ చేపట్టారు. ఇందుకు విపక్షాలు ఏమాత్రం సహకరించకపోగా వ్యతిరేకిస్తున్నాయి. పైగా ఎస్‌ఐఆర్ పక్రియ అక్రమాలను కప్పిపుచ్చి, అధికారికంగా గుర్తింపు ఇవ్వడానికే ఉద్దేశించింది అంటూ నిందలు వేస్తున్నారు. ఇక్కడే వీరి దురుద్దేశ్యాలు స్పష్టమై పోతున్నాయి.
మమతకు అంత ఉలుకు ఎందుకో?
2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్-టీఎంసీ కోల్‌కతాలో భారీ ప్రదర్శన నిర్వహించింది. ఎస్‌ఐఆర్‌ను అమలు చేస్తే రక్తపు టేరులు పారిస్తామని ముఖ్యమంత్రి హోదాను మరచి మరీ బెదిరించారు మమత. ఎన్నికల సంఘాన్ని పూర్తిగా రాజీపడిన సంస్థగా, ఎస్‌ఐఆర్‌ను మోస పూరితపనిగా అభివర్ణించారు. అయితే టీఎంసీ నిరసనలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. భారత రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా టీఎంసీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. మమతా బెనర్జీ దీనిలో లోపాలను ఎత్తి చూపాలనుకుంటే సుప్రీం కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
అయితే ఎస్‌ఐఆర్ అంటే మమతా ఇంతలా భయపడిపోవడానికి కారణం ఉంది. 2023 తర్వాత బెంగాల్ జనాభాలో 13.8 శాతం పెరుగుదల చోటు చేసుకుంటే ఓటర్ల సంఖ్య మాత్రం ఏకంగా 61.6 శాతం పెరిగిపోయింది. కేవలం రెండేళ్లలో ఇంత పెరుగుదల నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలోలో దాదాపు కోటిన్నర మంది వరకూ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంత కాలంగా అక్రమ చొరబాటుదారుల ఓట్లతోనే ఈ కుహనా సెక్యులరి స్టులు గెలుస్తున్నారా అనే అనుమానం రాక తప్పదు.
ఢిల్లీలో ఇటీవల బాంగ్లాదేశీయుల ఏరివేత జరిగినప్పుడు ఇక వింత జరిగింది. ఇక్కడ చిన్నచిన్న పనులు చేసేవారు హఠాత్తుగా మాయమయ్యారు. ఎందుకీలా జరిగిందని విచారిస్తే వీరిలో ఘోరమైన నేరాలు చేస్తున్నవారు ఉన్నట్లు బయటపడింది.. వీరంతా బాంగ్లాదేశ్‌కు తిరిగిపారిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కోల్‌కతాలో కూడా ఇదే పునరావృత్తమైంది. ఎస్‌ఐఆర్ మొదలు కాగానే చాలా మంది సరిహద్దులు దాటి వెళ్లిపోతుండగా పట్టబడ్డారు. ఇలాంటి విదేశీయుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వీరిని గుర్తించడంతో పాటు వారి పేర్లు ఓటర్ల జాబితా లోంచి తొలగిస్తున్నారు. అలాగే ఆధార్, రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను స్వాధీనం చేసుకొని తిప్పిపంపేస్తు న్నారు.
కొద్ది రోజుల క్రితం బెంగాల్‌లోని బీర్బూమ్‌లో 95 ఏళ్ల వృద్ధుడు క్షితీశ్ చంద్ర మజుందార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ఎస్‌ఐఆర్‌కు భయపడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తృణమూల్ ప్రచారం చేస్తోంది. టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండిం చింది. తృణమూల్ బెదిరింపుల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. రాష్ట్రంలో ఎవరూ చనిపోయినా దానికి ఎస్‌ఐఆర్ కారణమని టీఎంసీ అబద్దాలు చెబుతోందని విమర్శించింది. బెంగాల్‌లోని పూర్బస్థలీ ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓ చెరువులో వేలాది ఆధార్‌కార్డులు లభించడం రాజకీయ దుమారం రేపింది. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ దేశ అంతర్గత భద్రతను తాకట్టు పెట్టారని ఆరోపించింది. చొరబాటుదారులకు రాష్ట్రం ఓ సురక్షితమైన స్థావరంగా మారిందని ఈ ఘటన రుజువు చేస్తోందని పేర్కొంది.
కేరళలో ఆధార్‌తో మోసం
కేరళలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యతిరేస్తున్నారు. ఎస్‌ఐఆర్ పక్రియను వ్యతిరేకిస్తూ ఏకంగా రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింపజేశారు. కేరళతో సహా ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించాలనే ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యానికి ముప్పు అని వ్యాఖ్యానించారు విజయన్. ప్రజా స్వామ్యాన్ని గౌరవించేవారందరూ ఏకమై రెండో దశ ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. బహుళ రాష్ట్రాలకు విస్తరిస్తున్న ఈ పక్రియ, సార్వత్రిక ఓటు హక్కును అణగ దొక్కడానికి, ఓటర్ల జాబితాలను తారుమారు చేయడానికి ఓ ప్రయత్నమని ఆయన హెచ్చరించారు. ఎస్‌ఐఆర్ పేరిట కేంద్రం ఓటర్ల జాబితాను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందని ఆరోపించారు.
కేరళలో జనాభా 3,60,63,000 అయితే ఆధార్ కార్డుల సంఖ్య మాత్రం 4,09,68,282. ఇందులో ఏమిటి తిరకాసు అని విశ్లేషకులు అనుకుంటున్నారు. బోగస్ రేషన్ కార్డులను అడ్డుపెట్టుకొని అక్కడి అధికార వామపక్ష నాయకులు,కార్యకర్తలు ప్రజాపంపణి వ్యవస్థ ద్వారా జారీ అయ్యే రేషన్ బియ్యాన్ని మింగేస్తున్నారు. ఎస్‌ఐఆర్ నిర్వహిస్తే ఈ ఆధార్ స్కామ్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్ని అక్రమాలు బయట పడతాయో నని పినరయ్ ప్రభుత్వం భయపడి పోతోంది. కేరళలో బీజేపీ మినహా అన్ని పార్టీలూ ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నాయి.
డీఎంకే వింత వైఖరి
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం కూడా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తోంది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ను ఆపాల్సిందేనని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది. లేకుంటే అన్నీ పార్టీల తరపున చట్ట పోరాటం దిశగా సుప్రీం కోర్టులో పిటిషన్ల దాఖలుకు తీర్మానించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న ఎస్‌ఐఆర్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ఈ సమావేశంలో తీర్మానించారు.
తమిళనాట పాగా వేయడం కోసం బీజేపీ ఎస్‌ఐఆర్ ముసుగులో కొత్తకుట్రలకు సిద్ధమైందని స్టాలిన్ ఆరోపణ. ప్రత్యర్థులు ఎంత పెద్దవారైనా.. ఎన్ని కుట్రలు పన్నినా.. మమ్మల్ని ఓడించలేక పోయారు! సైద్ధాంతికపరంగా మాపై గెలవలేకనే.. ఎస్‌ఐఆర్ రూపంలో అడ్డదారులు వెతుక్కుంటున్నారు. ఇంత హడావుడిగా ఈ పక్రియను నిర్వహించాల్సిన అవసరం ఏముంది? దీనిపై మా పోరాటం కొనసాగు తుంది అని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడులో బీజేపీ మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే ఎస్‌ఐఆర్‌ను స్వాగతించింది. ఎస్‌ఐఆర్ ఇంటే సీఎం స్టాలిన్‌కు అలర్జీగా మారిందని ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను సైతం అన్నాడీఎంకే కార్యాలయం వద్ద పొందు పరచడం గమనార్హం.
ఇక డీఎంకే అఖిలపక్ష భేటీ నాటకం అని కేంద్ర సహాయమంత్రి ఎల్. మురుగన్ ఆరోపించారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నాటకాన్ని తెరమీదకు తెచ్చారని మండిపడ్డారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా డీఎంకే కూటమి పార్టీల తరపున సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్