ఆగస్ట్ 16 శ్రీకృష్ణాష్టమి
జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన, ప్రతి పనిలో ఆనందాన్ని వెదుక్కోవడం గురించి వేల సంవత్సరాల పూర్వమే లోకానికి చాటి చెప్పాడు. సుఖదుఃఖాలను సమంగా స్వీకరించే వారే స్థితప్రజ్ఞులంటూ ఆచరించి చూపాడు. రాజసూయ యాగంలో ప్రథమ తాంబూలంతో అగ్రపీఠ గౌరవం దక్కడాన్ని, తాను నిర్మించిన ద్వారకాపురి తన కళ్ల ముందే సముద్రంలో కుంగి పోవడాన్ని సమానంగా పరిగణించాడు. ఆ స్థిత ప్రజ్ఞత్వం, వర్ణించ అలవికాని వ్యక్తిత్వమే గోపాలుడిని (గోపబాలుడిని) గోవిందుడిని చేశాయి. అందుకే ‘కృష్ణం వందే జగద్గురుం’.
‘వస్తూని కోటి శస్సంతు పావనాని మహీతలే
నతాని తత్తులాం యాంతి కృష్ణ నామానుకీర్తనే’
(భూమిమీద గల కోట్లాది పవిత్ర వస్తువులన్నిం టినీ కలిపినా అవి శ్రీకృష్ణ నామ సంకీర్తనకు సాటిరావు) అని కూర్మపురాణం పేర్కొంటోంది. ‘శ్రీకృష్ణుడి పేరు పలకడం వల్ల ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమే ఆయనను నీ వద్దకు తెస్తుంది’ అని ఉపదేశామృతం గ్రంథం చెబుతోంది. అధరం మధురం… వదనం మధురం.. నయనం మధురం, హసితం మధురం.. హృదయం మధురం… గమనం మధురం… మధురాధిపతే అఖిలం మధురం’ అని వల్లభాచార్యులు (మధురాష్టకమ్) కీర్తించారు. ‘అన్నిటికిది పరమౌషధము, వెన్నుని నామమే విమలౌషధం’ (శ్రీకృష్ణ నామామృతపానమే భవరోగమును రూపు మాపే దివ్యౌషధం) అని అన్నమాచార్యగానం చేశారు.
మానవ సంబంధాలు నెరపడంలో కృష్ణుడిది ప్రత్యేకత శైలిగా ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.. మిత్రధర్మం, గురుభక్తి గురించి ఈ తరం ఆయన నుంచి నేర్చుకోవాలంటారు. తాను పెరిగిన పరిసరాల్లో తెలియని వారు, ఆయన ప్రేమాభిమానాలను పొందనివారు లేరంటారు. వయోలింగభేదం లేకుండా అందరిని ఆకర్షించి అందరివాడయ్యాడు.ఉత్తమ సంస్కారం, శక్తియుక్తులతో జనావళిని ప్రభావితం చేశాడు. ప్రేమమైత్రీ భావాలను పెంపు చేశాడు. బాల్య స్నేహతుడు కుచేలుడిని సమాదరించడమే కాక, అర్జునుడిని బంధువు కన్నా స్నేహితుడిగానే మన్నించాడు.
అధికారం, హోదాల కోసం వెంపర్లాడలేదు. కోరి వచ్చిన అవకాశాలను మృదువుగా తిరస్కరించాడు. ఒక మాటలో పాలకుడి ఎంపికలో నిర్ణయాత్మక శక్తిగా ఉండాలనుకున్నాడు. ద్వారాకాధీశుడు అయి కూడా గోకులం వచ్చి గోవులు కాశాడు. భారత ఖండంలో కృషి (వ్యవసాయం) ప్రధానమైనది. అందుకే గోవంశాభివృద్ధిని కాంక్షించాడు. వాటిని పాలించి, రక్షించాడు. ఆదర్శవంతమైన గ్రామ వైభవాన్ని వృద్ధి చేశాడు. వనమాల, నెమలి పింఛం ధరించి, వెదురుతో మురళి తయారు చేసి… స్థానికంగా(పల్లెల్లో) దొరికే వస్తువులను వినియోగిం చాలని నేర్పారు.
అధర్మం పెరిగి, ధర్మం నశించేటప్పుడు తనను తాను సృష్టించుకుంటానని (ధర్మ సంస్థాపనార్థాయ/సంభవామి యుగేయుగే’) చాటిచెప్పి, లోకకల్యాణం కోసం అత్యాచారులను శిక్షించవలసిందే అనే సంకల్పంతో బంధువులు, స్నేహితులు, వృద్ధులు, గురువులు అనే వ్యత్యాసం చూపలేదు.. వ్యక్తిగతంగా ఎంత సచ్ఛీలురైనా లోక ధర్మరక్షణకు ముందుకు రాని వారిని కురుక్షేత్రంలో కడతేర్చడంలో వెనుకాడలేదు జన్మతః కుసంస్కారులై ఎలాంటి ధర్మాలను పాటించని వారిని అంతమొందించి యుగధర్మ సృష్టి చేశాడు. అత్యాచార, అక్రమవర్తనులు, ప్రజా కంటకులను అంతం చేసి సుఖశాంతులు కలుగ చేశాడు. ప్రజలను చక్కగా పాలించే సమర్థుడైన ఒక రాజు పాలనలో దేశాన్ని ఉంచే సంకల్పంతో యుధిష్ఠిరుడితో రాజసూయం చేయించి ఏకఛత్రాధి పత్యాన్ని ఇచ్చాడు. కురుక్షేత్రంలో నైరాశ్యంలో కూరుకుపోయిన పార్థుడికి చేసిన గీతోపదేశం మానవులను తట్టి లేపే ధర్మఘంట.
దుష్టులకు ప్రళయకాళరుద్రుడు. సజ్జనులకు ఆశ్రయస్థాపకుడు. మహాయశస్వి, కార్యకుశలుడు. ఆయన రాజనీతి, తత్సంబంధిత బుద్ధి కుశలత, శత్రునిర్మూలన వ్యూహం అద్భుతమైనవి. వ్యూహం ప్రకారం శత్రువులను నిష్కంటకం చేస్తూ వచ్చాడు. కంసజరాసంధుల వధ అందుకు ఒక ఉదాహరణ. వారిద్దరి అండతో చెలరేగిపోతున్న దుర్యోధనుడిని కట్టడి చేయడానికి ఒకరిని సంహరించి, మరొకరిని సంహరింప చేశాడు.
శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమినాడు జన్మించినందున ‘జన్మాష్టమి’ అని, నామకరణా నంతరం ‘కృష్ణాష్టమి’, బాల్యం గోకులం గడపడం వలన ‘గోకులాష్టమి’ అని, ఆయన జన్మదినం కనుక ‘శ్రీకృష్ణ జయంతి’ అని, లోకానికి శ్రీకరం కనుక ‘శ్రీజయంతి’ అని వ్యవహారంలోకి వచ్చింది. అష్టమి నాటి రాత్రి రోహిణీ నక్షత్రంలో అవతరించినందున, ఆ తిథినాడు పగ లంతా ఉపవాసం ఉండి, సాయంత్రం పూజాదికాలు నిర్వహిస్తారు.
దేశవ్యాప్తంగా అన్ని వైష్ణవ ఆలయాలలో కృష్ణాష్టమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి. ఉత్తరప్రదేశ్ మధురలో, బృందా వనంలో, ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి, కేరళలోని గురువాయూర్‌లోని గురువా యూరప్పన్, చెన్నైలోని పార్థసారథి స్వామి, తిరువాయూరులోని రాజగోపాల ఆలయాలలో, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణాలయం తదితర ప్రముఖ ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో కనువిందు చేస్తాయి. దేశవిదేశాలలోని ‘ఇస్కాన్’ మందిరాలు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాయి. తిరుమలలో శ్రీనివాసుడి పక్కనే కొలువై ఉన్న కృష్ణస్వామికి అర్చన చేస్తారు. ఆ రోజు సాయంత్రం శ్రీవారు ప్రత్యేకంగా కొలువుతీరడాన్ని ‘గోకులాష్టమి ఆస్థానం’ అంటారు. జగదానందకారకుడు, జగన్నాటక సూత్రధారి, రాధామానసచోరుడు, సత్యా విధేయడు… ఇలా ఎన్నిపేర్లతో పిలిచినా ‘చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ…’ అని బాలకృష్ణ రూపాన్నే భక్తకోటి ఇష్టపడుతుంది.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్