ఎట్టకేలకు అమెరికా ప్రమేయంతో ఇజ్రాయెల్‌-ఇరాన్‌లు యుద్ధాన్ని ఆపాలని నిర్ణయించిన నేపథ్యంలో మధ్య ప్రాచ్యదేశాలు దీనివల్ల కలిగిన లాభనష్టాలపై అంచనాలు వేయడం మొదలుపెట్టాయి. అంతేకాదు ఈ యుద్ధం సందర్భంగా ఈ దేశాల వ్యవహారశైలి అయోమయంగా ఉండటం గమనార్హం. పైకి ఇజ్రాయెల్‌ ‌దాడులను ఖండించినా, లోపాయికారీగా ఆ దేశంతో ఏ విధమైన ఇబ్బందులు రాకుండా వ్యవహరించాయి. యు.ఎస్‌.‌తో కూడా వాటికున్న బలీయమైన ఆర్థిక సంబంధాలు కూడా ఇరాన్‌తో అంటీ ముట్టనట్టు ఉండటానికి మరో కారణం.  ఉదాహరణకు జోర్డాన్‌ ‌సహా 20 ముస్లిం మెజారిటీ దేశాలు, ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ‌దాడిని ఖండించాయి. కానీ ఇరాన్‌ ‌క్షిపణులు, డ్రోన్‌లు తమ గగనతలం గుండా ప్రయాణిస్తున్నప్పుడు జోర్డాన్‌ ‌కూల్చివేసింది. అదేమంటే తమ దేశ, పౌరుల రక్షణ కోసం ఈ విధంగా చేయాల్సి వచ్చిందని పేర్కొంది. మరి సౌదీ అరేబియా కూడా ఇరాన్‌పై దాడిని ఖండించే ప్రకటనపై సంతకాలు చేసినప్పటికీ, యుద్ధం కొనసాగిన కాలంలో ఇజ్రాయెల్‌ ‌విమానాలు తమ దేశ గగనతలంపై ఎగిరేందుకు అనుమతించింది. ఈ రెండు దేశాలకు ఇజ్రాయెల్‌తో బలీయమైన సంబంధాలున్నాయి. జోర్డాన్‌ ‌కైతే యు.ఎస్‌. ఏటా 1.45 బిలియన్‌ ‌డాలర్ల ద్వైపాక్షిక ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రపంచంలోని మరే ఇతర దేశానికి ఇంత పెద్దమొత్తంలో యు.ఎస్‌.ఆర్థిక సహాయం అందదు. సౌదీ అరేబియాకు యు.ఎస్‌.‌తో సంబంధాలున్నాయి. ఇక యు.ఎస్‌.‌నుంచి అత్యధిక సహాయం పొందుతున్న దేశాల్లో యుక్రెయిన్‌, ఇథియోపియా, ఇజ్రాయెల్‌ ఉన్నాయి.

ఇక పొరుగుదేశమైన ఈజిప్ట్ ‌విషయానికి వస్తే యు.ఎస్‌. ‌సైనిక సహకారం పొందుతున్నది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వ్యవహరించ లేదు. ఇదే సమయంలో ఇరాన్‌ను పూర్తిగా సమర్థించ లేని పరిస్థితి! ఈ నేపథ్యంలో యు.ఎస్‌, ఇ‌జ్రాయెల్‌ ‌దేశాలకు కోపం రాకుండా అడుగడుగునా జాగ్రత్త పడింది. ఉదాహరణకు జూన్‌ 14‌న పాలస్తీనా అనుకూలురు 1500 మంది ట్యునీసియా నుంచి ‘గాజాకు సంఘీభావ ర్యాలీ’ నిర్వహించగా, సినయ్‌ ‌పట్టణంలోకి ప్రవేశించకుండా ఈజిప్ట్ ‌దళాలు అడ్డుకున్నాయి. ఈ పట్టణం గాజా సరిహద్దులో ఉంది. ఉగ్రవాదంపై పోరులో యు.ఎస్‌.‌తో కలిసి పని చేస్తున్నది. ముఖ్యంగా లిబియా, సూడాన్‌, ‌గాజా ప్రాంతం నుంచి ఉగ్రవాదులు తమదేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం దానికి చాలా ముఖ్యం. దేశంలో శాంతిభద్రతల సమస్య లేకుండా చూసుకో వాలన్నది దాని తాపత్రయం. ఇదే సమయంలో ఏటా 1.3 బిలియన్ల సైనిక సహాయాన్ని అమెరికా నుంచి పొందుతోంది. ప్రస్తుత ఈజిప్ట్ అధినేత అబ్దుల్‌- ‌ఫతాహ్‌ ఎల్‌ ‌సిసి పాలనలో దేశంలో తీవ్రస్థాయిలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఇంత వరకు ట్రంప్‌ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఇరాన్‌ ‌చుట్టుపక్కల దేశాలు తమ అవసరాలు ప్రయోజనాల రీత్యా యు.ఎస్‌, ఇ‌జ్రాయెల్‌కు కోపం రాకుండా తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా వ్యవహరించాయనే చెప్పాలి.

ఇరాన్‌ ‌కట్టడే యు.ఎస్‌. ‌వ్యూహం

 ఇరాన్‌పై దాడుల ద్వారా ఒక పక్క కట్టడి చేస్తూనే మరోపక్క దాన్ని తన దారికి తెచ్చుకోవడానికి డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే చమురు రాజకీయం నేపథ్యంలో ఇరాన్‌ ‌పూర్తిగా నాశనం కావడం యు.ఎస్‌.‌కు ఇష్టం కాదు. చమురు అవసరాలు, ఇరాన్‌ అణ్వస్త్రాలను సమకూర్చుకోకుండా అడ్డుకోవడం దాని ప్రధాన లక్ష్యం. ఇందుకోసం అక్కడ తనకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి యత్నిస్తుంది. ఇందుకు బెంజమిన్‌ ‌నెతన్యాహు ఎలాగూ పూర్తి సహకారం అందిస్తారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో నెలరోజుల క్రితం వరకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌ ‌ప్రధాని బెంజమిన్‌ ‌నేతన్యాహు ఇప్పుడు ఒక హీరోగా నిలిచిపోయారు. నిజానికి ఇజ్రాయెల్‌కు సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన ఘనత ఆయనదే. సంక్లిష్ట సమయాల్లో చాతుర్యంతో గట్టెంక్కించే సామర్థ్యం ఆయన సొంతం. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఆయన పదవీగండం నుంచి బయట పడ్డారు. మధ్య ప్రాచ్యంలో అవసరమైనప్పుడు తనకు సహాయంగా యు.ఎస్‌. ‌పరిమిత యుద్ధంలో పాల్గొనేలా చేయగలనన్న అంశాన్ని ఇజ్రాయెల్‌ ఈసారి నిరూపించింది. 1967, 1973 యుద్ధాల్లో ఇజ్రాయెల్‌కు వస్తు రూపేణా యు.ఎస్‌. ‌సహాయం అందించింది తప్ప ఇప్పటి మాదిరిగా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగలేదు. ఇది ఇజ్రాయెల్‌కు ఒనగూడిన ప్రయోజనం. ఇరాన్‌కు ఒకప్పటి సన్నిహిత మిత్రుడైన ఇజ్రాయెల్‌ ఇప్పుడు బద్ధ శత్రువు. ఇరాన్‌ ‌తన ఉనికికే ప్రమాదమని ఇజ్రాయెల్‌ ‌భావిస్తోంది. ఇరాన్‌పై దాడికి ముందే, దాని ప్రాక్సీలైన యెమెన్‌లోని హౌతీలను, గాజాలోని హమాస్‌ను, లెబనాన్‌లోని హెజ్‌బొల్లాను బాగా దెబ్బతీసింది. ఇప్పుడవి కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి. హమాస్‌, ‌హెజ్‌బొల్లా సంస్థలు గత రెండేళ్ల కాలంలో బాగా బలహీనపడ్డాయి. ఈ విధంగా ఇరాన్‌ను బలహీనపరచిన తర్వాతనే ‘ఇరాన్‌పై ఆపరేషన్‌ ‌రైజింగ్‌ ‌లయన్‌’‌ను ప్రారంభిం చడం గమనార్హం.

ఇక ఇరాన్‌కు మద్దతుగా నిలబడ్డ ప్రధాన దేశం రష్యా. ఈదేశ సహకారం లేకుండా బహుశా ఇరాన్‌కు తన అణ్వస్త్రాలను మరో ప్రదేశానికి తరలించడం సాధ్యమయ్యేది కాదనే చెప్పాలి. రష్యా ఇంటెలిజెన్స్ ‌సహకారం వల్లనే ఈ విధంగా ముందుగా జాగ్రత్త పడగలిగింది. ప్రస్తుతం యుక్రెయిన్‌తో (పరోక్షంగా నాటోదేశాలతో) యుద్ధంలో ఉన్న రష్యా పెద్దగా కల్పించుకోలేని పరిస్థితిలో ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మధ్య ప్రాచ్యంలో రష్యా తన పట్టును చాలా వరకు కోల్పోయిందనే చెప్పాలి.

అణ్వస్త్ర ప్రదేశాల విధ్వంసంపై కొనసాగుతున్న సస్పెన్స్

ఇక అమెరికా తన వైమానిక బాంబు దాడుల్లో ఇరాన్‌ అణ్వస్త్ర ప్రదేశాలను ధ్వంసం చేశామని చెబుతున్నా, ఇంకా నిర్ధారణ కాలేదు. ఇక్కడ ఇరాన్‌ ‌భద్రపరచినట్టు చెబుతున్న 400 కిలోల యురేనియం జాడ తెలియడంలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ అటామిక్‌ ఎనర్జీ ఆర్గనైజేషన్‌ అధినేత మహమ్మద్‌ ఇస్లామీ ఒక ప్రకటన చేస్తూ, ఇరాన్‌ అణుకార్యక్రమం ఆగలేదని, దీని పునరుద్ధరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ప్రకటించడం డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌చేసిన ప్రకటనల్లో నిజాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇజ్రాయెల్‌, ‌యు.ఎస్‌.‌ల ప్రధాన లక్ష్యం ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని కొనసాగించకుండా నిరోధించడం! ఈ విషయంలో ఎంతవరకు విజయం సాధించా రన్నది ఇంకా సందిగ్ధంగానే ఉంది.

 ఇదిలావుండగా కాల్పుల విరమణ ప్రకటించిన మూడున్నర గంటల తర్వాత ఇరాన్‌ ‌ప్రయోగించినట్టు చెబుతున్న రెండు బాలిస్టిక్‌ ‌క్షిపణులు ఏమయ్యాయన్న విషయంలో ఇంకా సస్పెన్స్ ‌కొనసాగుతోంది. ఇరాన్‌ ‌ప్రభుత్వం మాత్రం తాము ఎటువంటి క్షిపణులను ప్రయోగించలేదని చెబుతోంది. మరి వీటిని ఎవరు ప్రయోగించారనేది తేలాల్సి వుంది. ఈ ప్రాంతంలో ఇంకా శాంతి నెలకొనలేదన్న మాట నిజం.

యుద్ధం ప్రారంభం

జూన్‌ 13‌న ఇరాన్‌లోని అణు ప్రదేశాలపై ఇజ్రాయెల్‌ ‌జరిపిన ఆకస్మిక వైమానిక దాడులతో రెండు దేశాల మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. దాడుల మొదట్లో ఇజ్రాయెల్‌ ‌వైమానిక దళం, గ్రౌండ్‌ఫోర్స్‌లు ఇరాన్‌కు చెందిన కీలక కొందరు కీలక సైనికనేతలు, రాజకీయ నాయకులు, అణుశాస్త్రవేత్తలను చంపేయడంతో ఆగ్రహించిన ఇరాన్‌ ‌ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ ‌సైనిక స్థావరాలు, నగరాలపై క్షిపణులతో దాడిచేసింది. యెమెన్‌లోని హౌతీలు కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడులు చేశారని ఇరాన్‌ ‌తెలిపింది. ఇరాన్‌ ‌క్షిపణులు, డ్రోన్ల దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను కాపాడిన అమెరికా, యుద్ధం ప్రారంభమైన తొమ్మిదవ రోజున ఇరాన్‌కు చెందిన మూడు అణ్వస్త్ర నిల్వ ప్రదేశాలు ఫోర్డో యురేనియం అణుశక్తి కేంద్రం, నటంజ్‌ అణునిల్వ కేంద్రం, ఇస్‌ఫహాన్‌ ‌నూక్లియర్‌ ‌టెక్నాలజీ సెంటర్‌ ‌పై బాంబుదాడులు చేసింది. ఇందుకోసం నార్త్‌రప్‌ ‌బి-2 స్టెల్త్ ‌బాంబర్‌ ‌విమానాలను ఉపయోగించి, 14వేల కిలోల బరువున్న బంకర్‌ ‌బస్టర్‌ ‌బాంబు లను ప్రయోగించింది. ఇదే సమయంలో సమీపంలో సముద్రంలోని జలాంతర్గామి నుంచి తోమహాక్‌ ‌క్షిపణులను కూడా ప్రయోగించింది. దీనికి ఆపరేషన్‌ ‌మిడ్‌నైట్‌ ‌హామర్‌ అని పేరుపెట్టింది. అయితే ఈ బాంబుదాడుల వల్ల జరిగిన నష్టంపై ఇంకా పూర్తి వివరాలు అందాల్సివుంది. యు.ఎస్‌. ఇం‌టెలిజెన్స్ ‌వర్గాలు మాత్రం నష్టం చాలా స్వల్పమేనని వెల్లడిం చడం గమనార్హం. ఈ దాడులను పసిగట్టిన ఇరాన్‌ ‌ముందుగానే ఆయా ప్రదేశాల నుంచి యురేనియం సహా ఇతర అణ్వస్త్రాలను వేరే చోటుకు తరలించిం దన్న వార్తలు వచ్చాయి.అయితే యు.ఎస్‌. అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌మాత్రం తమ దాడిలో ఇరాన్‌ అణు ప్రదేశాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ప్రకటించారు. ట్రంప్‌ ‌చర్యను రిపబ్లికన్‌లు సమర్థించగా, డెమోక్రట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా బాంబు దాడులకు ప్రతీకారంగా ఖతార్‌లోని యు.ఎస్‌. ‌సైనిక స్థావరంపై ఇరాన్‌ ‌క్షిపణులతో దాడి జరిపింది. విచిత్రంగా మరునాడే అంటే జూన్‌ 24‌న, ‘‘యుద్ధం ముగిసింది. ఇరుపక్షాలు చర్చలకు ముందుకు రావాలి’’ అని డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రకటించారు.

పరస్పర దాడులు

పన్నెండు రోజుల పాటు కొనసాగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ ‌తన 200 యుద్ధ విమానాలతో ఇరాన్‌ ‌లోని వంద అణుప్రదేశాలపై దాడులు జరిపింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్‌ ‌కూడా క్షిపణులు, డ్రోన్లతో ప్రతి దాడులకు దిగడంతో, ఇరుపక్షాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇరాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం జూన్‌ 24 ‌నాటికి 185 మంది మహిళలు సహా 4746 మంది గాయపడ్డారు. మొత్తం 610 మంది మరణించగా వీరిలో 49 మంది మహిళలు, 13మంది పిల్లలు. ఇజ్రాయెల్‌ ‌బాంబుదాడులు ప్రారంభం కాగానే చాలామంది టెహ్రాన్‌ ‌నగర పౌరులు ఉత్తర ప్రాంతా లకు పారిపోయారు. అలా తరలిపోయిన వారి సంఖ్య తొమ్మిది మిలియన్ల వరకు ఉంటుందని ఇరాన్‌ ‌పేర్కొంది. ఇక దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్‌పై కనీసం 120సార్లు ఇరాన్‌ ‌ప్రతిదాడులకు దిగింది. ఇరాన్‌ ‌దాడుల్లో టెల్‌ అవీవ్‌లోని సరోకా మెడికల్‌ ‌సెంటర్‌ ‌కూడా ధ్వంసమైంది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. దీంతో పాటు ఇజ్రాయెల్‌ ‌మిలిటరీ ఇంటెలిజెన్స్ ‌స్కూల్‌, ‌హైఫా నగరంలోని మినిస్ట్రీ ఆఫ్‌ ఇం‌టీరియర్‌, ‌వైజ్‌మాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సైన్స్‌పై, చమురుశుద్ధి కర్మాగారంపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో 3238 మంది ఇజ్రాయెల్‌ ‌పౌరులు గాయపడగా, 28 మంది మరణించారు.

మాటలకే పరిమితమైన చైనా

ఈ యుద్ధంలో ఇరాన్‌కు పూర్తి మద్దతుగా నిలిచినట్టు చైనా ప్రకటించింది. కానీ ఈ మద్దతు చాలా వరకు మాటలకే పరిమితం కావడం ఇరాన్‌ను కూడా చాలా అసహనానికి గురిచేసింది. కొద్దో గొప్పో వస్తు రూపేణా సహాయం చేసింది తప్ప ఆయుధాలు, సైనికసహాయం చేయలేదు. చైనా మాటల స్థాయిని గమనించి పశ్చిమ దేశాలు కూడా, దాని వ్యవహారశైలి పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తంచేసిన మాట వాస్తవం. అయితే గతంలో యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌. ‌పతనం, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌ల్లో అమెరికా పరాభవం వంటి అంశాలు ఇరాన్‌కు పూర్తిస్థాయి మద్దతివ్వకుండా చైనాను నిరోధించివుండవచ్చు. ఎందుకంటే ఇతర దేశాల్లో సైనికంగా, ఆయుధపరంగా జోక్యం చేసుకోవడం వల్ల చేతులు కాల్చుకోవడం తప్ప మిగిలేదేమీ ఉండదన్నది గత చరిత్ర చెబుతున్న పాఠం నేపథ్యంలో చైనా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండవచ్చు. అదీ.. వనరులు తగ్గిపోతున్న మధ్య ప్రాచ్యాన్ని ఇప్పటికీ పట్టుకొని వేలాడుతుండటం అమెరికా వ్యూహాత్మక తప్పిదమన్నది చైనా భావన. అంతేకాదు మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఆసియా-పసిఫిక్‌ ‌దేశాలవైపు మళ్లితేనే ఆశించిన ప్రయోజనాలు దక్కుతాయన్న అభిప్రాయం కూడా చైనాకు ఉండి ఉండవచ్చు.

ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన యుద్ధానికి అయిన ఖర్చు పది బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్‌ ఇనిషియేటివ్‌ ‌పెట్టుబడులకు సమానం. ఇరాన్‌ ‌సమస్యలో తలదూర్చడం ద్వారా కొరివితో తల గోక్కోవడమెందుకన్న భావన చైనాది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు సైనికేతర సహాయానికే ప్రాధాన్య మిచ్చింది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఇరాన్‌ ‌చమురును కొనుగోలు చేయడం, సౌదీ అరేబియాతో ఇరాన్‌కు సత్సంబంధాలు పెరిగేలా దౌత్యపరమైన సహాయం అందించడం, 25 సంవత్సరాల పాటు ఇరాన్‌తో సత్సంబంధాల కొనసాగింపునకు వీలుగా 2021లో ఒక ఒప్పందంపై సంతకాలు చేయడం వంటివి ఇందుకు ఉదాహరణ. నిజం చెప్పాలంటే ఈ రకమైన సహాయం, యు.ఎస్‌. ఆం‌క్షల నేపథ్యంలో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా కాపాడింది. అందువల్ల సైనిక సహాయం కంటే ఈ రకమైన మద్దతే అధిక ప్రయోజనకరం.ఇది చైనా వ్యూహం. కాగా, అమెరికా ఆంక్షలకు భయపడి చైనా వెనకడుగు వేసిందని కథనాలు ప్రచురించాయి. కానీ చైనావి గుంటనక్క విధానాలు. అందువల్ల స్నేహం ముసుగులో, కాలం చెల్లిన ఇరాన్‌ ‌యుద్ధ విమానాల స్థానే తమ దేశంలో తయారు చేసిన విమానాలను, వైమానిక రక్షణ వ్యవస్థలను అమ్మజూపే అవకాశాలే ఎక్కువ. అయితే ఇవన్నీ ఆపరేషన్‌ ‌సింధూర్‌లో భారత్‌ ‌విజయవంతంగా ధ్వంసం చేసిందన్న సంగతి ఇరాన్‌కు తెలియదనుకుంటే అంతకంటే అమాయకత్వం మరోటుండదు.

భారత్‌ ‌వ్యూహాత్మక సంయమనం

ప్రస్తుతం యు.ఎస్‌. ఇరాన్‌ ‌పట్ల వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో భారత్‌ ‌చాలా వ్యూహాత్మక సంయ మనాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇరాన్‌-ఇ‌జ్రాయెల్‌లు మనకు అత్యంత సన్నిహిత దేశాలు కావడం ఇక్కడ ప్రధానం. ఇరాన్‌పై యుద్ధం చేసేకంటే శిక్షించి దారికి తెచ్చుకోవాలన్న వ్యూ హాన్ని అమెరికా అనుసరిస్తోంది. వసుధై•క కుటుంబకం అనే నానుడికి కట్టుబడి ఉన్న భారత్‌ ‌వ్యూహాత్మకంగా తన భద్రత, రాజకీయ ప్రాధాన్యతలకు అను గుణంగా వ్యవహరించాల్సి ఉంది. ప్రస్తుతం భారత్‌ ‌చమురు అవసరాల్లో సగం కంటే తక్కువ మధ్యప్రాచ్య దేశాల నుంచే సరఫరా అవుతోంది. యుక్రెయిన్‌ ‌యుద్ధానికి ముందు ఇది 60శాతంగా ఉండేది. ప్రస్తుతం భారత్‌ ‌రష్యా నుంచి ముడి చమురు చాలావరకు ఉరల్స్ (‌మధ్య తరహా క్రూడాయిల్‌)‌ను రాయితీలతో దిగుమతి చేసుకుంటోంది. అయితే రష్యా-యుక్రెయిన్‌ ‌యుద్ధం నేపథ్యంలో ఈ రాయితీలు ఆవిరై పోవడంతో, మళ్లీ పశ్చిమాసియా దేశాల నుంచి భారత్‌ ‌చమురును దిగుమతి చేసుకుంటోంది.

2024 జులై నుంచి పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌ను 40.3 శాతం నుంచి 45.86 శాతానికి పెంచింది. ఆంక్షలు శాశ్వతం కాదు కనుక, రానున్న కాలంలో ట్రంప్‌ ‌రష్యాపై ఆంక్షలను సడలిస్తే చమురు దిగుమతి కోసం పశ్చిమ దేశాలతో మనం పోటీపడాల్సి వస్తుంది. ఇక ఇరాన్‌ ‌విషయానికి వస్తే అమెరికా బాంబు దాడులకు ప్రతీకారంగా ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ ఇదెంతవరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ పరిస్థితులు అడ్డం తిరిగితే అమెరికాకు సరఫరా అవుతున్న గల్ఫ్‌లోని చమురు క్షేత్రాలపై ఇరాన్‌ ‌దాడులు చేసే అవకాశాలు లేకపోలేదు. దీనివల్ల చమురు ధరలు పెరిగి మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవొచ్చు. ఇప్పటికే అమెరికా ఆంక్షల పుణ్యమాని… ఒకప్పుడు మనకు చమురు సరఫరా దేశంగా మూడో స్థానంలో ఉన్న ఇరాన్‌ ‌నుంచి దిగుమతులు చాలా వరకు తగ్గించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మన ప్రధాని నరేంద్రమోదీ వ్యూహాత్మకంగా, కచ్చితంగా వ్యవహరిస్తుండటాన్ని సానుకూల దృక్పథంతో చూడవచ్చు. యు.ఎస్‌, ‌రష్యా, చైనా వంటి దేశాలతో పోలిస్తే మనం ముడి చమురు, ద్రవరూపక సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) వంటి వాటి దిగుమతులపై ఎక్కువ ఆధారపడుతున్నాం. ఒకవేళ ఇరాన్‌లో ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొడితే భారత్‌ ‌వంటి ఉద్గమిస్తున్న దేశాలకు మధ్యప్రాచ్యంలో తమ ప్రాబల్యాన్ని విస్తరించుకునే అవకాశాలు కుంచించుకు పోతాయి. మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా గల్ఫ్ ‌దేశాల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. యుద్ధం వల్ల వీరు మనదేశానికి పంపుతున్న విదేశీ మారక ద్రవ్యం నిలిచిపోతుంది. దీనికితోడు వీరిని అక్కడి నుంచి స్వదేశానికి రప్పించడం మరింత ఖర్చుతో కూడిన వ్యవహారం. మరో ముఖ్య విషయమేంటంటే, ఒకవేళ ఇరాన్‌ ‌ప్రభుత్వాన్ని కూలగొడితే, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలోని బహుళ ధ్రువాత్మక రాజకీయం యు.ఎస్‌. ‌నేతృత్వంలో ఏక ధ్రువాత్మకంగా మారిపోగలదు. ఎందుకంటే ప్రభుత్వం పడిపోయినా, కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జరిగే గందరగోళం వల్ల సిరియాలో మాదిరి పరిస్థితులే ఇరాన్‌లో కూడా ఏర్పడే అవకాశముంది. ఆ విధంగా ఈ ప్రాంతంలో యు.ఎస్‌.‌ను వ్యతిరేకిస్తున్న ఒక పెద్ద దేశం కుప్పకూలి పోతుంది. దీనివల్ల గత దశాబ్ద కాలంగా భారత్‌ ఈ ‌ప్రాంతంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలకు నీళ్లొదులుకోక తప్పదు. అప్పుడు భారత్‌ ‌వ్యూహాత్మకంగా నెరపే ప్రతి వ్యవహారాన్ని యు.ఎస్‌. అడ్డుకుంటుంది. అందువల్ల ఇరాన్‌ ‌సమన్వయ పాత్ర లేకుండా మధ్యప్రాచ్యంలో భారత్‌ ఇటు గల్ఫ్ ‌దేశాలతో అటు ఇజ్రాయెల్‌తో సంబంధాలు నెరపడం కష్టమవుతుంది. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికా తన సైన్యాలను అక్కడికి తరలించి సుదీర్ఘకాలం ఉంచక తప్పదు. ఇది ఆసియా-పసిఫిక్‌లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవ డానికి చైనాకు దోహదం చేస్తుంది. ఇక తైవాన్‌ను ఆక్రమించుకోవడానికి చైనా తప్పక ప్రయత్నిస్తుంది. నయానో లేక భయానో.. ఏదోరకంగా దీన్ని సాధించే అవకాశాలే ఎక్కువ. ఆ విధంగా మరింత బలపడిన చైనాతో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించు కోవడం భారత్‌కు సమస్యగా మారుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో యథాతథ స్థితిని కొనసాగించాలని యు.ఎస్‌.‌పై భారత్‌ ఒత్తిడి తీసుకురావాలి.

జమలాపురపు విఠల్‌రావు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE