‘‘ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం?’’ అన్న ప్రశ్నకు సమాధానం అది తిరిగి తెరపైకి రావడమే. పరపీడనం సహించలేక ఏదో ఒకరోజు దేశ ప్రజలు తిరగబడతారు. తమ ఉనికిని, వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటుతారు. ఇది తరతరాల చారిత్రక సత్యం. చెరిపినా చెరగదు.
దీనికి తాజా ఉదాహరణ ఇరాన్. ఒకప్పుడు పశ్చిమా ఆసియా దేశాలు భారత వర్షంలోని భూభాగాలు. దేశ, కాల, పాత్రల కారణంగా అవి తమ రూపురేఖా విలాసాలు కోల్పోయాయి. స్వధర్మంవలె స్వాభిమానం – దెబ్బతిన్న నాగు పాములా, సమయం కోసం ఎదురుచూస్తూ, అదను కాచి, పడగ చాచి కాటు వేస్తుంది. అదే ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న రాజకీయ సంక్షోభం.
‘‘ఆసింధు సింధు పర్యంతా
యస్య భారత భూమికా।
పితృభూః పుణ్యభూమిశ్చైవ
సవైహిందురితి స్మృతః।।
నేడు జనం చెప్పుకుంటోన్న ఇరాన్, అఫ్ఘానిస్తాన్ మొదలైన దేశాలు ఒకే భూమికగా వెల్లివిరిశాయి. మనుచక్రవర్తి అఖండభారత వర్షాన్ని ఏకఛత్రంగా ఏలుకున్నాడు.
ఇరానీలుగా పిలువబడుతున్న దేశ ప్రజలు ఒకప్పుడు పర్షియావాసులు ఆనాటి ఆర్యనులే ఇరానీలు. ‘‘ఓరియన్’’ అన్న పదం ‘‘ఆర్య’’ అనే సంస్కృత శబ్దం నుంచి పుట్టింది. ‘‘ఆర్యా!’’ అంటే ఉత్తముడు అని అర్థం. అది ఒక గౌరవవాచకం. ఏ వర్గానికి సంబంధించిన పదం కాదు. ఆర్య, ద్రావిడ విభేదాలు, ఆర్యుల దండయాత్రలు, మేధావులు చేసిన చారిత్రక తప్పిదాలకు నిదర్శనాలుగానే భావించాలి. తప్పిపోయిన కుమారులు పురిటగడ్డకు తిరిగి రావడం సహజ పరిణామం.
సింధునాగరికత వెల్లివిరిసిన ఆర్యావర్తంలోని ఒక కులీన వంశీయులు ‘‘వారుణులు’’, ‘‘సింధు’’ – ‘‘హిందు’’ అయినట్టుగా ‘‘వారుణ’’ ‘‘ఆర్యాయణ’’ శబ్దంగా మారింది. కుటుంబ కలహాల కారణంగా వారుణులు విడిపోయారు. అలా వలసపోయిన ఒక భాగమే పరస్తానీయులు. పరస్తానీయులు పారశీకులయ్యారు. వేషభాషలు, ఆచార వ్యవహారాలు మారాయి. కాని పేగుబంధం, జన్యుసంబంధం మారలేదు. దక్షిణాపథంలోని ఆసియా దేశాలు అగ్నిగుండాలుగా మారడానికి కారణం విదేశీ హస్తాలు. ఉచ్చారణలో ‘‘స’’ ‘‘హ’’గా మారింది. ‘‘ఛ’’ ‘‘జ’’గా మారింది. ‘‘ఆహుర్’’ అంటే పరమాత్మ. సంస్కృత శబ్దం. ఆహుర్ మజ్జా పారశీకుల దైవం. ఛాందోగ్యఉపనిషత్తు వారి మత గ్రంథం- అయిన జెండా వెస్తాకు మూలం. అలా మారడానికి వారి గురువు ‘‘జరద్రస్త’’ అనే ముని కారణం. (జొరాస్ట్రియెన్‌లు అగ్నిని ఆరాధిస్తారు.) ఏరస్థానీ యులయిన వారిపైన మంగోలియన్లు, తురుష్కులు దాడిచేసి దురాక్రమణకు పాల్పడ్డారు. జంగిజ్‌ఖాన్, తైమూర్‌లంగ్ మతమార్పిడులకు పాల్పడ్డారు. ‘షా’లను తరిమి ఖొమేనీలు పీఠం ఎక్కి ఎక్కి దేశ ప్రజల్ని అణిచివేశారు. ‘‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’’. ‘షా’ సంతతి షియా! షియా ముసల్మానులు నాగరీకులు, సున్నీలు మతవాదులు. వారి మధ్య పోరాటం సాగుతూనే ఉన్నది.
అఫ్ఘానిస్తాన్‌లో ఇటీవల స్త్రీలు తిరుగుబాటు చేశారు. హిజాబులు, బురఖాలు, తీసివేసి తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించారు. బారెడు గడ్డాలు, చారెడు మీసాలు, ఆచారంగా పెంచుకున్నా, ఆంతర్యం వేరు. ఇరాన్ ప్రజలు కొత్త ప్రభుత్వం కోరుకుంటున్నారన్న మాట అసత్యం కాదు. ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్, ఇరాన్‌ను ఎడాపెడా వాయించేస్తున్నాయి. అబ్రహామీకులు; యూదులు, మహమ్మదీయులు స్వయానా అన్నదమ్ములే! ఇది మహాభారతం నాటి దాయాదిపోరాటపు చరిత్ర పునరావృత్తం అని చెప్పటానికే ఇప్పుడు అవకాశం వచ్చింది. చరిత్ర దాచినా దాగని సత్యం.
ఇరాన్ అణు ప్రధాన దేశం. జాత్యహంకారం, మతోన్మాదం ఆయా దేశాలలో రాజ్యం ఏలుతున్నది. భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్, మతం ముసుగులో తుర్కియ్ లాంటి దేశాలను రెచ్చగొట్టి హిజ్‌బుల్లా, హమాస్ లాంటి ఉగ్రవాద ముఠాలను ఆశ్రయించి, భారత్‌పైన పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది.
గతంలో తాలిబాన్‌ను కౌగిలించుకుని దెబ్బతిన్నా బుద్ధి మారక, ఇరాన్ పంచన చేరి కుట్ర పన్నుతున్నది. రాజకీయ లబ్ధికోసం డోనాల్డ్ ట్రంప్ అసీమ్‌మునీర్ లాంటి ఐఎస్‌ఐ సైన్యాధిపతికి విందు ఇచ్చినా, పొందు గురించి జాగ్రత్తగానే వ్యవహరించక తప్పదు. ట్రంప్ రాజకీయం అంతుపట్టని ప్రహేళిక.
ఇంగ్లాండు దేశం నుంచి పారిపోయి ‘‘మేఫ్లవర్’’ అనే నౌకలో ప్రాణాలు దక్కించుకుని, బయట పడ్డ జనాభా సంతతి ఈనాటి• అమెరికన్ పౌరులు, ఇంతవరకు పరదేశీయులతో నానా చాకిరీలు చేయించుకుని, ఇప్పుడు తరిమివేయడం- హెచ్1, బి1, ఎమ్, ఎఫ్, వగైరాలను ఏరిపారేయడం కూడా చరిత్ర పునరావృత్తంలోని మరొక భాగం. అమెరికాకు అమెరికన్లు, బ్రిటన్‌కు బ్రిటిషువారు ఎలాగో హిందూస్థాన్ – నేటి భారత్‌కు హిందువులు అంతేవాసులు. 82% హిందూ జనాభా ఉన్న దేశం హిందూ దేశం కాక మరేమి అవుతుంది? ఈ పరిణామాలనుబట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా జాతీయ భావన, స్వాభిమానం, ఆభిజాత్యం మొగ్గు తొడుగుతున్నట్టు అనిపిస్తుంది. కాలం మారుతుంది. కాలానికి తగిన విధంగా ఆలోచనలు, ఆచరణలు మారటం సహజం. మూలాలు సడలకుండా కాపాడుకోవడం ధర్మం.
ఇరాన్ ప్రస్తుతం ‘అగ్ని’ పరీక్షకు గురి అయి ‘యురేనియమ్’ నిలువలను పోగొట్టుకున్నది. ఇరువైపుల నుంచి జరుగుతున్న దాడుల కారణంగా ఆర్థిక రంగానికీ తీరని అపకారం, నష్టం జరిగింది. ఇప్పట్లో కోలుకోవడం కల్ల. అయినప్పటికీ కల్లబొల్లి కబుర్లు; బీరాలు, డాంబికాలు, ఖమేనీలో ఏ మాత్రం తగ్గలేదు. హింస, కల్లోలం సృష్టించి ప్రజల దృష్టిని ఆకట్టు కోవడంవల్ల ఇక లాభం లేదు. ఇరాన్‌లో ఒకవైపు ఐశ్వర్యం, మరోవైపు పేదరికం ఆ సమాజంలో ఒక అగాధం సృష్టించింది.
పులి మీద పుట్రలా ఖమేనీ ఆధిపత్యంలో జనజీవనం అస్తవ్యస్తం అయింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న షియాలు, షా వంశీయులు, ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలగొట్టడం తథ్యం! తిరిగి ఇరాన్‌లో ‘షా’ల పరిపాలన రావచ్చున్న రాజకీయ అంచనాలు అచిరకాలంలోనే సాకారం కాబోతున్నాయి. చరిత్ర ఎండిన ఎముకల గూడు కాదు. చితాభస్మం నుంచి సజీవంగా ఎగిరే ‘ఫినిక్స్’ పక్షిలా చరిత్ర పునరావృతం కాకమానదు.
– నిరామయ