కేంద్ర ప్రభుత్వంలో పాలక పక్షానికి ఒక మంత్రి మండలి ఉన్నట్టే ప్రతిపక్ష నాయకుడైన రాహుల్‌ ‌గాంధీకి కూడా ఒక మంత్రి మండలి ఉండాల్సిన అవసరం అనిపిస్తోంది. అటు రాజకీయ పరిజ్ఞానంలోనూ, ఇటు విషయ పరిజ్ఞానంలోనూ అంతర్జాతీయ నాయకులకు ఏమాత్రం తీసిపోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంటులోనూ, పార్లమెంటు బయటా ఎదుర్కోవడానికి ప్రస్తుతం రాహుల్‌ ‌గాంధీకి ఉన్న శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదు. దేశానికి శక్తిమంతమైన పాలక పక్షం ఉన్నట్టే, అత్యంత శక్తివంతమైన ప్రతిపక్షం కూడా అవసరం. అటువంటి స్థితికి చేరుకోవాలన్న పక్షంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ ‌గాంధీకి సరైన సలహాదార్లు అవసరం. సరైన ప్రసంగాలు, ప్రకటనలు తయారు చేయగల వ్యక్తులు కూడా అవసరం.

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఎదగాలన్నా, తన సమర్థతను నిరూపించుకోవాలన్నా, పాలనా వ్యవహారాల్లో పరిణతి సాధించాలన్నా, చివరికి దేశ ప్రజల మనసులను చూరగొనాలన్నా రాహుల్‌ ‌గాంధీకి తనకంటూ ప్రత్యేక సలహాదార్లు, నిపుణులు, అనుభవజ్ఞుల బృందం అవసరమని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి సూచనలు, సిఫారసులు అందాయి. ఏ అంశం మీదా సరైన అవగాహన లేకుండా, ఏ అంశాన్నీ లోతుగా అధ్యయనం చేయకుండా, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియకుండా లోక్‌సభలో నెగ్గుకు రావడం చాలా కష్టం. ఇటువంటి పరిస్థితి అంతిమంగా వైఫల్యాలకు, అప్రతిష్టకు దారి తీసే ప్రమాదం ఉంది. నిజానికి, రాహుల్‌ ‌గాంధీ విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది.

కాంగ్రెస్‌ ‌పార్టీలో రాహుల్‌గాంధీకి సరైన సలహాలు ఇచ్చే నాయకులు, సరైన విషయ పరిజ్ఞానాన్ని అందించే నాయకులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారన్నది వాస్తవం. ఆయన పెత్తందారీ విధానాలు, వ్యవహార శైలివల్ల సీనియర్‌ ‌నాయకులు పలువురు తెరవెనుకే ఉండిపోతున్నారు. రక్షణ, ఆర్థిక వ్యవహారాలు, దౌత్య, విదేశీ వ్యవహారాలు, సామాజిక విషయాలు, సంస్కృతి, నాగరికత, ఉద్యోగాల కల్పన వంటి విషయాల్లో ఆయనకు మార్గదర్శకత్వం వహించగల సమర్థులు, అనుభవజ్ఞులు పార్టీలో తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇటువంటి విషయాల్లో తనకు సలహాలు, సూచనలు ఇవ్వగలిగిన, మార్గదర్శ కత్వం నెరపగలిగిన నాయకులను తన చుట్టూ ఉంచుకునే బదులుగా ఆయన భజనపరులను, విధేయు లను, వందిమాగధులను తన చుట్టూ ఉంచుకోవడం వల్ల పార్లమెంటులో ఏ అంశంపైనా సమగ్ర అవగాహ నతో మాట్లాడగల సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడకపోతే ఆయన రాజకీయంగా ఎదిగే అవకాశం ఉండదు. ఆయన రాజకీయంగా ఎదగడం మీద ఆయన పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

సుమారు 20 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగు తున్న రాహుల్‌ ‌గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడుగా కూడా నిలదొక్కుకోలేకపోతున్నారు. అందువల్ల ఆయన వివిధ అంశాల్లో నిపుణులు, అనుభవజ్ఞులు, పరిశోధకులతో తనకంటూ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలయిన తర్వాత జరిగిన కాంగ్రెస్‌ అం‌తర్మథన సమావేశంలో ఒకరిద్దరు సభ్యుల నుంచి ఇటువంటి సూచనలు వ్యక్తమయ్యాయి కానీ, వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రాహుల్‌ ‌గాంధీకి ముఖ్య సలహాదారైన శామ్‌ ‌పిట్రోడా కూడా అనేక పర్యాయాలు ఇటువంటి సలహాలు ఇచ్చారు. వాస్తవానికి ఐరోపా దేశాల్లో ఈ విధంగా సలహాదార్ల బృందాలను ఏర్పాటు చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఇటువంటి బృందాన్ని అక్కడ ‘షాడో క్యాబినెట్‌’‌గా వ్యవహరించడం జరుగుతోంది. బ్రిటన్‌, ఆ‌స్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, ఇటలీ, ఫ్రాన్స్ ‌తదితర దేశాల్లో ఈ పద్ధతి విజయవంతంగా కొనసాగు తోంది. పాలక పక్షం తమ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సమయంలోనే ప్రతిపక్ష నాయకుడు కూడా తన షాడో క్యాబినెట్‌ను, అంటే పోటీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.

వ్యూహాత్మక మార్పులు

వాస్తవానికి రాహుల్‌ ‌గాంధీకి సలహాదార్లు లేకపోలేదు. తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీతో పాటు పలువురు నాయకులు ఆయనకు సలహాలనిస్తుంటారు. ప్రతిపక్ష నాయకుడుగా లోక్‌ ‌సభలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆయన అఖిలేశ్‌ ‌యాదవ్‌, ‌సుప్రియా సూలే, టి.ఆర్‌. ‌బాలు వంటి సభ్యులను ఆయన తరచూ సంప్రదిస్తున్నారు. స్పీకర్‌ను ఎన్నుకునే విషయంలో ఆయన పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత మమతా బెనర్జీని సంప్రదించారు. ఆయనకు అవసర సమయాల్లో ఆ విధంగా రాజకీయ శిక్షణ లభిస్తూనే ఉంది. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన కొంతమంది సన్నిహితుల నుంచి రాజకీయ అవగాహన పెంచు కుంటూనే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన మల్లికార్జున్‌ ‌ఖర్గే తర్వాత ఎక్కువగా సంప్రదించింది మమతా బెనర్జీనే. మమతా బెనర్జీతో పాటు ఆయన తరచూ పి. చిదంబరాన్ని కూడా ఎక్కువగా సంప్రదిస్తుంటారు.

అయితే, ఇటువంటి అరకొర సలహాలు, సంప్రదింపుల వల్ల ఆయనకు రాజకీయంగా పెద్దగా ఉపయోగం  ఉండటం లేదు. ఆయన తన బలాన్ని పెంచుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు నరేంద్ర మోదీ బలాన్ని కూడా అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయాల్లో శత్రువు బలం మీదా, బలహీనతల మీదా దృష్టి పెట్టడం తప్పనిసరి అవుతుంది. సలహాలు, సంప్రదింపులు వ్యవస్థీ కృతంగా జరగడం వల్ల ఆయనకు రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది. అందుకు షాడో క్యాబినెట్‌ ‌తప్పనిసరిగా అవసరమవుతుంది. ఇటువంటి షాడో క్యాబినెట్‌లో అఖిలేశ్‌ ‌యాదవ్‌, ‌సుప్రియా సూలే, అభిషేక్‌ ‌బెనర్జీ, బాలు వంటి నాయకులతో పాటు, తమ పార్టీకే చెందిన మనీశ్‌ ‌తివారి, తారిక్‌ అన్వర్‌, ‌కె. సురేశ్‌, ‌గౌరవ్‌ ‌గొగోయ్‌, ‌వేణుగోపాల్‌, ‌కుమారి షెల్జా, శశికాంత్‌ ‌సెంథిల్‌ ‌వంటి నాయకులకు స్థానం కల్పించడం వల్ల, ఆయా రంగాలకు చెందిన నిపుణులను కూడా అందులో చేర్చడం వల్ల ఆయనకు వివిధ అంశాలలో సరైన సలహాలు, సూచనలు లభించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పోటీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల రాహుల్‌ ‌గాంధీ సమర్థత, శక్తి సామర్థ్యాలు మరింతగా పెరగడంతో పాటు, ప్రజల దృష్టి కూడా ఆయన మీద పడే అవకాశం ఉంది. ఇండీ కూటమి సహకరించినా సహకరించక పోయినా ఆయనకు 2029 ఎన్నికలు కొద్దిగానైనా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది.

పార్టీకి పూర్వ వైభవం

ప్రతిపక్ష నాయకుడి స్థాయికి ఎదిగిన రాహుల్‌ ‌గాంధీ తాను స్వయంగా మరింత ఎదగాలన్నా, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు రావాలన్నా పార్టీ పగ్గాలను కూడా పూర్తి స్థాయిలో స్వీకరించడం మంచిది. నిజానికి, పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్‌ ‌గాంధీకి అహ్మద్‌ ‌పటేల్‌ ‌లేని లోటు తీర్చలేనిది. సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా, ముఖ్య సలహాదారుగా అహ్మద్‌ ‌పటేల్‌ ‌వ్యవహరించినంత కాలం పార్టీ ఉచ్ఛ దశలోనే ఉంది. ప్రస్తుతం పార్టీ నాయ కత్వానికి ఇది కీలక దశ. రాహుల్‌ ‌గాంధీకి తప్పనిసరిగా ఒక రాజకీయ కార్యదర్శి అవసరం ఉంది. కేరళకు చెందిన కె.ఆర్‌. ‌వేణుగోపాల్‌ అనుభవం ఆయనకు బాగా ఉపయోగపడుతుంది. వేణుగోపాల్‌ను రాజకీయ కార్యదర్శిగా నియమించు కోవడం వల్ల రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాల్లో రాహుల్‌ ‌గాంధీ ఆరితేరే అవకాశం ఉంటుంది. శశికాంత్‌ ‌సెంథిల్‌, ‌ప్రణితి షిండేల వల్ల అనేక అంశాల్లో రాహుల్‌ ‌గాంధీ సిద్ధహస్తుడయ్యే అవకాశం కలుగుతుంది.

ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కాంగ్రెస్‌ ‌నాయకులతో సంప్రదింపులు జరపడానికి, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్‌ ‌నాయకుల మధ్య అభిప్రాయ భేదాలను పరిష్కరించడానికి ప్రియాంక గాంధీకి ఉన్నంత అర్హత మరెవరికీ లేదనడంలో సందేహం లేదు. ఇదివరకు ఈ పాత్రను కూడా అహ్మద్‌ ‌పటేల్‌ ‌సమర్థవంతంగా పోషించేవారు. వేణుగోపాల్‌ని రాహుల్‌ ‌గాంధీ తన వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా చేసుకున్న తర్వాత ప్రియాంక గాంధీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి, ఆమెకు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించడం వల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుంది. రాహుల్‌ ‌గాంధీ 2029 ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి తప్పకుండా ఇప్పటి నుంచే వ్యూహ రచన చేయాల్సి ఉంటుంది. 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందుగా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో విజయాలు సాధించేవరకూ ఆయనను విజేతగా గుర్తించడం కష్టమని పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. భారత్‌ ‌జోడో యాత్రల ద్వారా కొంత రాజకీయ, సామాజిక అనుభవాలను పండించుకున్న రాహుల్‌ ‌గాంధీ ఇక్కడితో ఆగడం వల్ల పార్టీకే కాక, దేశ ప్రజాస్వామ్యానికి కూడా ఉపయోగమేమీ లేదు. ఒక షాడో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఆయన పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రతిపక్షాల ఐక్యతకు కూడా దిక్సూచిగా మారడం జరుగుతుంది. ప్రతిపక్షాలను ఒక తాటిమీద నడిపించడంతో పాటు, పార్టీని సంఘటితంగా ముందుకు తీసుకు వెళ్లడానికి కూడా ఆయనకు షాడో క్యాబినెట్‌ ‌తప్పకుండా దోహదం చేస్తుంది.

జి.రాజశుక

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor