ఈ ఏడాది మార్చి 31 నాటికి రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా-ఆర్‌బీఐ నిర్వహిస్తున్న మొత్తం బంగారం 879.58 మెట్రిక్‌ ‌టన్నులు! 2021 సంవత్సరంలో 695.31 మెట్రిక్‌ ‌టన్నులతో పోలిస్తే మన బంగారం నిల్వలు గణనీయంగా పెరిగినట్టే లెక్క. ఈ విధంగా వ్యూహాత్మకంగా బంగారం నిల్వలను పెంచుకుంటూ వస్తున్న ఆర్‌బీఐ ఇందులో సింహభాగాన్ని దేశీయంగా నిల్వచేస్తుండగా మిగిలిన దాన్ని విదేశీ నేలమాళిగల్లో భద్రం చేస్తుంటుంది. ముఖ్యంగా మన బంగారం బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌గ్లండ్‌ ‌వద్ద భద్రపరచడం జరుగుతోంది. ఇదిలా ఉండగా గత ఏడాది అక్టోబర్‌ ‌నాటికి భారత్‌ 102 ‌టన్నుల బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌గ్లండ్‌ ‌నుంచి మనదేశానికి తరలించడం గమనార్హం.

ఆర్బీఐ నివేదిక ప్రకారం దేశీయంగా బంగారం నిల్వలు గత సెప్టెంబర్‌ ‌నాటికి 60శాతానికి పెరిగాయి, గత మార్చిలో ఇది 50శాతంగా ఉండింది. దీన్నిబట్టి పరిశీలిస్తే భారత్‌ ‌విదేశాల్లో ఉండే మన బంగారాన్ని క్రమంగా స్వదేశానికి వ్యూహాత్మకంగా ఒక క్రమ పద్ధతి ప్రకారం తరలిస్తున్నట్టు అర్థమవుతుంది. గత మార్చిలో దేశీయంగా 408 మెట్రిక్‌ ‌టన్నుల బంగారం నిల్వ ఉండేది. అయితే 102 మెట్రిక్‌ ‌టన్నుల బంగారాన్ని తరలించడంతో గత సెప్టెంబర్‌ ‌నాటికి ఇది 510.46 మెట్రిక్‌ ‌టన్నులకు చేరుకుంది. 1991 తర్వాత దేశీయ బంగారం నిల్వలకు అదనంగా చేర్చడం ఇదే ప్రథమం. 324.01 మెట్రిక్‌ ‌టన్నుల బంగారం ఇంకా బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌గ్లండ్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌టర్నేషనల్‌ ‌సెటిల్‌మెంట్స్ (‌బీఐఎస్‌) ‌వద్దనే ఉన్న విషయం గమనార్హం.

అదేవిధంగా 20.26 మెట్రిక్‌ ‌టన్నుల బంగారాన్ని డిపాజిట్ల రూపంలో ఉంచారు. యు.ఎస్‌. ‌డాలర్ల పరంగా విదేశీ మారకద్రవ్యంతో బంగారం నిల్వలను పోలిస్తే, గత మార్చిలో ఇది 8.15% ఉండగా, సెప్టెంబర్‌ ‌నాటికి 9.25%కు చేరుకుంది. ఇదిలా ఉండగా 2022 నుంచి 2024 వరకు భారత్‌ ‌మొత్తం 214 టన్నుల బంగారాన్ని స్వదేశానికి చేర్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌గ్లండ్‌ ‌నుంచి నిల్వలను తరలించడం వల్ల దానికి చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. అదీకాకుండా కొన్నేళ్లుగా బంగారం కొంటూ రావడంవల్ల విదేశాల్లో నిల్వలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ మొత్తంలో కొంత భాగాన్ని దేశానికి తరలించాలన్నది కూడా ఆర్బీఐ ఉద్దేశం. 16 సంవత్సరాల క్రితం మన్మోహన్‌ ‌సింగ్‌ ‌నేతృత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వం హయాంలో ఆర్బీఐ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఆ విధంగా 6.7బిలియన్‌ ‌డాలర్ల విలువైన ఆస్తులను వివిధ రూపాల్లో పెట్టుబడులుగా పెట్టింది. ఆ తర్వాతనుంచి ఆర్బీఐ వరుసగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు, విదేశీ కరెన్సీల్లో ఉన్న రిస్క్‌ల బారిన పడకుండా ఉండేందుకు ఈ విధంగా బంగారం కొనుగోళ్లపై ఆర్బీఐ దృష్టిపెట్టింది. ఈ పక్రియ 2017 నుంచి వేగంగా కొనసాగుతుండటంతో, క్రమంగా విదేశీ మారక ద్య్రవ్య నిల్వల్లో బంగారం శాతం పెరుగుతూ వస్తోంది.

అధిక కొనుగోళ్లు చేస్తున్న బ్యాంకులు

బంగారాన్ని స్వదేశానికి తరలించడం వల్ల మనదేశ జీడీపీ, పన్ను వసూళ్లు వంటి వాటిపై ఎటువంటి ప్రభావం పడదు. ఆర్బీఐ బ్యాలన్స్ ‌షీటుపై కూడా దీని ప్రభావం శూన్యం. కేవలం బంగారం నిల్వ ప్రదేశం మారుతున్న దంతే. అదీకాకుండా ఈ బంగారం మన దేశానికే చెందింది కాబట్టి జీఎస్టీ చెల్లింపులు కూడా అవసరంలేదు. వరల్ట్ ‌గోల్డ్ ‌కౌన్సిల్‌ ‌లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసే ఐదు సెంట్రల్‌ ‌బ్యాంకుల్లో ఆర్బీఐ కూడా ఒకటి.

2009లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సమయంలో కూడా భారత్‌ 200 ‌టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2022లో 65.11 టన్నులు, 2023లో 34.22 టన్నులు, 2024లో 19 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. బంగారం కొనుగోళ్లు దేశ ఆర్థిక పరిపుష్టిని వెల్లడిస్తాయి. అంతేకాదు దేశ ఆర్థికపరమైన ఆస్తుల పరిరక్షణ, దేశ ఆర్థిక సుస్థిరత ఈ బంగారం కొనుగోళ్లతో ప్రపంచానికి సుస్పష్టంగా తెలుస్తుంది. కరెన్సీలను సెంట్రల్‌ ‌బ్యాంక్‌లు అవసరానికి అనుగుణంగా అచ్చు వేస్తాయి. అదే బంగారం అలా కాదు. పరిమితంగా లభించడం ఈ లోహానికున్న ప్రత్యేకత. చారిత్రక ప్రాధాన్యత నేపథ్యంలో దీని విలువ ఎప్పటికీ పడిపోదు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న సమయంలో బంగారం స్థిరమైన విలువతో కొనసాగింది. దేశంలో వివిధ కరెన్సీ నిల్వలున్నప్పుడు, వాటి విలువల్లో వ్యత్యాసాలు ఇబ్బంది కలిగిస్తాయి. అదే బంగారంతో ఈ సమస్య ఉండదు.

భారత్‌లో బంగారం నిల్వలు

నేషనల్‌ ‌మినరల్‌ ఇన్వెంటరీ గణాంకాల ప్రకారం 2015 నాటికి మన దేశంలో మొత్తం బంగారం నిల్వలు 501.83 మిలియన్‌ ‌టన్నులు. దేశంలో అత్యధికంగా బంగారం నిల్వలు కలిగిన రాష్ట్రం బిహార్‌ (44%) ‌కాగా తర్వాతి స్థానాన్ని రాజస్థాన్‌ (25%) ఆ‌క్రమిస్తోంది. కర్ణాటక (21%), పశ్చిమ బెంగాల్‌ (3%), ఆం‌ధప్రదేశ్‌ (3%), ‌ఝార్ఖండ్‌ (2%)‌తో వరుసగా తర్వాతి స్థానాలను ఆక్రమిస్తు న్నాయి. ప్రస్తుతం దేశంలో బంగారం ఉత్పత్తిలో కర్ణాటక 80%తో అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి కోలార్‌ ‌గనులు ప్రపంచంలోనే అతి పురాతనమైనవి మాత్రమే కాదు అత్యంత లోతైనవి కూడా.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌గ్లండ్‌

‌వివిధ దేశాల సెంట్రల్‌ ‌బ్యాంకులకు చెందిన బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌గ్లండ్‌లో భద్రపరచడం సంప్రదాయంగా వస్తోంది. ఇందుకు మనదేశం కూడా మినహాయింపు కాదు. ఇది స్వాతంత్య్రానికి పూర్వంనుంచి కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో వివిధ దేశాలకు చెందిన సెంట్రల్‌ ‌బ్యాంకులు క్రమంగా తమ బంగారం నిల్వలను పెంచుకుంటూ వస్తున్నాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి పీపుల్స్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ‌చైనా, సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ‌టర్కీ. వరల్డ్ ‌గోల్డ్ ‌కౌన్సిల్‌ 2024, ఏ‌ప్రిల్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని పీపుల్స్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ‌చైనా కొనుగోలు చేసింది. ఇక సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ‌టర్కీ ఆ ఏడాది 8 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. 2024, ఏప్రిల్‌ ‌నాటికి టర్కీవద్ద బంగారం నిల్వలు 578 మెట్రిక్‌ ‌టన్నులు.

1991 సంక్షోభం

1991లో మనదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు గణనీయంగా పడిపోవడంతో బ్యాలన్స్ ఆఫ్‌ ‌పేమెంట్స్ ‌సమస్య ఉత్పన్నమైంది. దీనికితోడు గల్ఫ్ ‌యుద్ధం పరిస్థితిని మరింత దిగజార్చింది. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగిపోయాయి. అప్పట్లో భారత్‌ ‌వద్ద 1 బిలియన్‌ ‌కంటే తక్కువ విదేశీ మారకద్రవ్య నిల్వలున్నాయి. ఈ మొత్తం మూడు వారాల పాటు చెల్లింపులకు మాత్రమే సరిపోతాయి. అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్‌ ‌సిన్హా, ఆర్బీఐ గవర్నర్‌ ‌వెంకటరమణన్‌ ఇతర ఆర్థిక శాఖ అధికార్లు ప్రయత్నిస్తే ఇంటర్నేషనల్‌ ‌మానిటరీ ఫండ్‌ ‌నుంచి 755 మిలియన్‌ ‌డాలర్ల సహాయం అందింది. ఇది ఏ మూలకూ సరిపోదు. ఫలితంగా నాటి ప్రధాని చంద్రశేఖర్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అప్పట్లో 1991, జులై 4-18 తేదీల మధ్యకాలంలో 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌గ్లండ్‌, ‌బ్యాంక్‌ ఆఫ్‌ ‌జపాన్‌లో తాకట్టు పెట్టి 400 మిలియన్‌ ‌డాలర్లను తీసుకుంది. దేశం ఇటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో చంద్రశేఖర్‌ ‌నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వానికి రాజీవ్‌ ‌గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ‌పార్టీ మద్దతు ఉపసంహరించింది. రాజీవ్‌ ‌గాంధీపై నిఘా ఉంచారన్నది ప్రధానంగా కాంగ్రెస్‌ ‌చేసిన ఆరోపణ. హరియాణాకు చెందిన పోలీస్‌ ‌కానిస్టేబుల్‌ను ఇందుకోసం ప్రభుత్వం నియమించిం దని ఆ పార్టీ ఆరోపించింది. ఈ దెబ్బతో అంతర్జా తీయ మార్కెట్‌లో భారత్‌ ‌రేటింగ్‌ ‌గణనీయంగా పడిపోయింది. 1991, నవంబర్‌ ‌నాటికి మనదేశం ఈ రుణాన్ని తీర్చివేసినప్పటికీ, బంగారాన్ని అక్కడే ఉంచింది. ముఖ్యంగా వాణిజ్య లావాదేవీలు సులభంగా నిర్వహించవచ్చునన్న ఉద్దేశమే ఇందుకు కారణం.

అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు

దేశంలో బంగారం నిల్వ సామర్థ్యం బాగా ఉన్నదని ఆర్బీఐ చెబుతున్నప్పటికీ అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణమని కొందరి నిపుణుల అంచనా. ఉదాహరణకు 2022, ఫిబ్రవరి చివరివారంలో రష్యా, ఉక్రెయిన్‌పై దాడికి దిగింది. ఫలితంగా రష్యా బంగారాన్ని, ఇతర ఆస్తులను పశ్చిమ దేశాలు స్తంభింప చేశాయి. అమెరికా అయితే మరింత ముందుకు వెళ్లి రష్యా విదేశీ మారకద్రవ్య నిల్వల గుర్తింపును రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా ఇజ్రాయెల్‌ ‌గత అక్టోబర్‌ ‌నుంచి త్రీ ఫ్రంట్‌ ‌వార్‌ను కొనసాగిస్తోం ది. ఈ నేపథ్యంలో ముందు ముందు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తమ బంగారాన్ని దేశీయం గానే భద్రపరచడం శ్రేయస్కరమని ఇజ్రాయెల్‌ ‌నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నిర్వహణ, వడ్డీ వంటి ఖర్చుకోసం మిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దేశీయంగా బంగారాన్ని నిల్వ చేసుకుంటే, ఈ ఖర్చులు మిగులుతాయన్నది అంచనా. అంతేకాకుండా విదేశీ మారకద్రవ్య నిల్వలు, బంగారాలను ఒకేచోట కాకుండా బహుముఖీయంగా నిల్వ చేయడం వల్ల అనుకోని రిస్క్‌లను బాగా తగ్గించవచ్చునన్న అభిప్రాయం కూడా ఉంది. ఇదిలా ఉండగా బ్రిటన్‌ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎంతమాత్రం బాగాలేదు.

దాని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే పరిస్థితేంటన్నది ఆర్బీఐని తొలుస్తున్న ప్రధాన సమస్య. ముఖ్యంగా ఉక్రెయిన్‌ ‌యుద్ధం నేపథ్యంలో ఆ దేశానికి పెద్ద మొత్తంలో ఆయుధాల రూపంలో సహాయాన్ని అందిస్తున్న దేశాల్లో బ్రిటన్‌ ‌కూడా ఒకటి. ఈ యుద్ధం ద్వారా రష్యాను దివాలా తీయించాలని చూసిన నాటో దేశాలే ఇప్పుడు సంక్షోభంలో కూరుకు పోయాయి. ఒకవైపు ఆయుధ నిల్వలు తగ్గి, ఆర్థికంగా కుదేలయ్యే దుస్థితికి చేరుకున్నాయి. వీటికితోడు రష్యానుంచి చమురు, సహజవాయు దిగుమతులు నిలిచిపోవడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటు న్నాయి. అమెరికాను గుడ్డిగా నమ్మి ఆర్థికంగా ఈ దేశాలు కుదేలవు తున్నాయి. కానీ యు.ఎస్‌. ‌మాత్రం యుద్ధంలో పాల్గొ నకుండా, సహచర దేశాలను ప్రోత్సహిస్తూ తాను ఒడ్డునే ఉండటంతో యూరప్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోయే పరిస్థితి ఏర్పడింది.

ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ ముందుజాగ్రత్త పడుతోందని భావించవచ్చు. అంతేకాదు క్రమంగా మనం బంగారం నిల్వలను పెంచుకుంటూ రావడం వల్ల రూపాయి ఆరోగ్యం బాగుంటుంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని కూడా సమర్థవంతంగా నిరోధించవచ్చు. అంతేకాదు బంగారం ఉండటం వల్ల ఆర్బీఐ మంచి ఆదాయాన్ని పొందగలుగుతుంది. బంగారం నిల్వలు పెంచుకోవ డానికి, స్వదేశానికి రప్పించడానికి మధ్య యిన్ని కారణాలున్నాయి.

జమలాపురపు విఠల్‌రావు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE