ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో సాగు, తాగునీటి కొరత తీవ్రమైంది. భూసేకరణ సమస్యలు, నిధుల విడుదలలో ఆలస్యం, పరిపాలనా పరంగా జాప్యం, పొరుగు రాష్ట్రం ఒడిశాతో వివాదాలు  పనులకు ఆటంకంగా మారాయి.  దీంతో వ్యవసాయ ఉత్పాదకత తగ్గి, రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సమస్యతో కూడా పలు గ్రామాలు అల్లాడుతున్నాయి.

ఉత్తరాంధ్రలో కీలక సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే రూ.2,678 కోట్లు అవసరమని తాజా అంచనా. ఇందులో కేవలం రూ.1,068.32 కోట్లు ఉంటే 7 సాగు నీటి ప్రాజెక్టులతో పాటు జైకా కింద చేపట్టిన మిగిలిన ప్రాజెక్టులూ పూర్తి చేసే అవకాశం ఉంది. వంశధార ప్రాజెక్ట్ ‌రెండో భాగం రెండో దశ, తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్టు, వంశధార- నాగావళి అనుసంధానం, హిరమండలం ఎత్తిపోతల పథకం, నాగావళి చంపావతి అనుసంధానం, మడ్డువలస రెండో దశ, జంఝావతి రిజర్వాయర్‌ ‌ప్రాజెక్టుతో పాటు జైకా (జపాన్‌ ఇం‌టర్నేషనల్‌ ‌కోఆపరేషన్‌ ఏజెన్సీ-జైకా) నిధులతో చేపట్టిన ఆండ్ర, రైవాడ, పెద్ద కలం, వట్టిగడ్డ తదితరాల నిర్మాణం పూర్తి చేస్తేగాని సమస్యలు తొలగిపోవు.

వంశధార ప్రాజెక్టు జాప్యం

శ్రీకాకుళం జిల్లాలో వంశధార నిర్మితమైన ప్రాజెక్టు ప్రధాన క్ష్యం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించి సస్యశ్యామలం చేయడం. ఈ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా హీర మండలం సమీపంలోని గొట్టా వద్ద బ్యారేజీని నిర్మించారు. దీని ఎడమ, కుడి ప్రధాన కాలువల ద్వారా సుమారు 1.48 లక్షల ఎకరాలకు నీరు అందించా లన్నది ప్రధాన లక్ష్యం. మొదటి దశ నిర్మాణంతో పాత ఆయకట్టుతో కలిపి 2.92 లక్షల ఎకరాలపైగా స్థిరీకరించారు.

ప్రాజెక్టు రెండవ దశలో మొదటి భాగంగా, వరద నీటిని నిల్వ చేయడానికి హీరమండలం వద్ద జలాశయాన్ని నిర్మించారు. వంశధారకు వరద నీటిలో దాదాపు 19.5 టీఎంసీల నీటిని నిల్వ చేసి, కరవు కాలంలో సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగించడం దీని లక్ష్యం. పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేయడానికి రెండవ దశలోని రెండవ భాగం నిర్మాణం పూర్తికావాలి. ఇది ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది. ఒడిశాతో గల అంతరాష్ట్ర ఒప్పందాల కారణంగా, నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణంలో జాప్యమైంది. దీనికి ప్రత్యామ్నాయంగా, కట్రగడ్డ వద్ద సైడ్‌ ‌ఛానల్‌ ‌వియర్‌, ‌వరద కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. సెకనుకు 8 వేల క్యూసెక్కుల వరద నీటిని హీరమండలం జలాశయానికి మళ్లించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీనిని ‘వంశధార-నాగావళి అనుసంధానం’ లో భాగంగా పరిగణిస్తారు. ఈ పనుల కోసం ప్రభుత్వం సుమారు రూ.933 కోట్లు కేటాయించింది.

వంశధార రెండో భాగం రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.188.20 కోట్లు అవసరమవుతాయి. ఇది పూర్తయితే, 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టులో భూసేకరణ కింద రూ.12.46 కోట్లు, హిరమండలం జలాశయం ప్యాకేజీలో రూ.26.07 కోట్లు, ప్యాకేజీ 88లో రూ.14. 58 కోట్లు, ప్యాకేజీ 87లో రూ.1.71 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి. మూడు ప్యాకేజీల్లోనూ పనులు కొద్దిగా చేయాలి.

తోటపల్లి ప్రాజెక్టుకు సమస్య ఏమిటి?

విజయనగరం జిల్లాలో సాగునీటి కష్టాలు తీర్చేందుకు ఉద్దేశించిన తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్టు పనులు తుది దశలో అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. ప్రాజెక్టులో మిగిలి ఉన్న పనుల పూర్తికి తక్షణమే రూ.263.36 కోట్లు అవసరమని జల వనరుల శాఖ అధికారులు గుర్తించారు. రైతులకు పూర్తి ప్రయోజనాలు రైతులకు అందాలంటే, బ్యారేజీలో 105 మీటర్ల స్థాయి వరకు నీటిని నిల్వ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ స్థాయిలో నీటిని నిల్వ చేస్తే కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఆయా గ్రామాలకు పునరావాసం కల్పించడం అత్యంత కీలకం. అందుకు రూ. 119 కోట్లు అవసరం. మరోవైపు, మొదటి రెండు ప్యాకేజీల పనులు నత్తనడకన సాగాయి. 25% కన్నా తక్కువ పనులు జరిగాయి. ఇంత తక్కువ పురోగతి ఉన్న కాంట్రా క్టులను నిబంధనల మేరకు రద్దు చేయాల్సి ఉంటుంది. అలా జరిగి, మళ్లీ టెండర్లు పిలిస్తే ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రాజెక్టు మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని కోరుతూ జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తేనే తోటపల్లి ఆయకట్టు రైతులకు సకాలంలో నీరు అందే అవకాశం ఉంది.

వంశధార-నాగావళి అనుసంధానానికి అడ్డంకులు

శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చగల వంశధార-నాగావళి నదుల అనుసంధానం ప్రాజెక్టు చివరి అంకంలో అనేక ఆర్థిక, పరిపాలనా పరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. నిధుల కొరత, భూసేకరణ సమస్యలు, కాంట్రాక్టు పరమైన చిక్కులు దాని పురోగతిని మందగింప జేస్తున్నాయి. ప్రాజెక్టులో మిగిలి ఉన్న పనులను పూర్తి చేయడానికి తక్షణమే మరో రూ. 50.23 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అధికారులు తేల్చారు. సవరించిన అంచనాలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ప్రాజెక్టు కాలువ నిర్మాణానికి అత్యంత కీలకమైన 7.50 ఎకరాల భూమి దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. దానిని జలవనరుల శాఖకు బదిలీ చేసే పక్రియ ఇంకా పూర్తి కాలేదు. వీటితో పాటు, మరో 54.5 ఎకరాల ప్రైవేట్‌ ‌భూమిని కూడా సేకరించాలి. రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి సుమారు రూ. 7.50 కోట్లు అవసరమవుతాయని అంచనా. ప్రస్తుత గుత్తేదారు సంస్థ (కాంట్రాక్టర్‌), ‌తమ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి తెలియచేయడం, ప్రాజెక్టు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. పాత కాంట్రాక్టు రద్దు అయితే, కొత్తగా టెండర్లు పిలిచి, మరో సంస్థకు పనులు అప్పగించే పక్రియకు చాలా సమయం పడుతుందని, ఇది ప్రాజెక్టుకు మరింత ఆలస్యానికి మరో కారణమవుతుందని అంటున్నారు.

హీరమండలం పూర్తి చేయాలి

శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టులో అత్యంత కీలకమైన హిర మండల అనుబంధ పథకం పనులు ఇప్పటి వరకు కేవలం 37 శాతం పనులు పూర్తి కావడం ఆందోళన కలిగించే అంశం. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం వంశధార నదిపై నిర్మించిన హిరమండలం జలాశయంలో నిల్వ చేసిన నీటిని ఎత్తిపోయడం (లిఫ్ట్ ‌చేయడం). ఇలా లిఫ్ట్ ‌చేసిన నీటిని వంశధార పాత ఆయకట్టు అయిన ఎడమ, కుడి ప్రధాన కాలువలకు మళ్లించడం ద్వారా సాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడటం దీని లక్ష్యం. ఈ పథకం పూర్తయితే, ఇప్పటికే ఉన్న 2.55 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ‘‘ఆయకట్టు స్థిరీకరణ’’ అంటే, వర్షాభావ పరిస్థితుల్లో లేదా నదిలో నీటి ప్రవాహం తగ్గినప్పుడు కూడా పంటలకు కచ్చితమైన భరోసాతో నీరు అందించడం. దీనివల్ల రైతులు ముఖ్యంగా రెండో పంటకు నీటి కొరత లేకుండా ధైర్యంగా సాగు చేసుకోవచ్చు. మిగిలిన 63 శాతం పనులు పూర్తి కావడానికి తక్షణమే రూ. 175.35 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు.

మడ్డువలసకు నిధులు అవసరం

మడ్డువలస రెండో దశ పనులకు రూ.30.04 కోట్ల నిధులు అవసరమని అంచనా. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 25% లోపు పనుల పురోగతిలో ఉంది. అంటే ఇంకా గణనీయమైన పనులు పూర్తి కావాల్సి ఉంది. అదేవిధంగా, నాగావళి-చంపావతి అనుసంధానం ప్రాజెక్టుకు మరో రూ.21.53 కోట్ల నిధులు అవసరం. ఈ ప్రాజెక్టు కూడా 25% లోపు పనుల జాబితాలో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు కొనసాగించాలని, వాటి పూర్తికి అవసరమైన నిధులు, సమయం, వనరుల కేటాయింపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. నిధుల కేటాయింపు, పనుల వేగవంతం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, ఈ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు మెరుగుపడతాయి.

జంఝావతి ప్రాజెక్టు

ఈ ప్రాజెక్టును విజయనగరం జిల్లా కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద నాగావళి నదిపై నిర్మించారు. జిల్లాలోని కొమరాడ, పార్వతీపురం, సీతానగరం, గరుగుబిల్లి, మక్కువ మండలాల్లో 24,640 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. 4 టి.ఎం.సి. నీటి నిల్వ దీని సామర్ధ్యం. ప్రాజెక్టు పనులు 1976లో రూ.13.50 కోట్ల అంచనాతో మొదలైనా పూర్తి కాలేదు. దీని నిర్మాణం వల్ల ఒడిశాలో 1,175 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. సుమారు 250 కుటుంబాలు నిర్వాసితులవుతారు. ఒడిశా ప్రభుత్వం భూమి ఇవ్వడానికి నిరాకరించడంతో సమస్యలు తలెత్తాయి. కాలువ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించకపోవడం వల్ల 2017లో తులసిరామినాయుడువలస, గొల్లవానివలస గ్రామాల రైతులు నిరసనలు చేపట్టి పనులను అడ్డుకున్నారు.

జైకా నిధులతో చేపట్టిన ప్రాజెక్టులు

జైకా సహకారంతో ఆంధప్రదేశ్‌లో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులలో ఆండ్ర, రైవాడ, పెద్ద కలం, వట్టిగడ్డ ప్రాజెక్టులు ఆంధప్రదేశ్‌ ఇరిగేషన్‌ అం‌డ్‌ ‌కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ‌పథకంలో భాగంగా ఉన్నాయి.

ఆండ్ర ప్రాజెక్టును విశాఖపట్నం జిల్లాకు నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడానికి చేపట్టారు. జైకా నిధులతో నిర్మిస్తున్న మధ్యస్థాయి ఈ ప్రాజెక్టుకు రైతుల నుండి భూమి సేకరణ, పరిహార చెల్లింపులో జాప్యం, కాలువల నిర్మాణం, డ్యామ్‌ ఆధునీకరణలో సాంకేతిక అడ్డంకులు, జైకా నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుండి అదనపు నిధుల కేటాయింపు ఆలస్యంతో పనుల్లో మందగొడితనం చోటు చేసుకుంది.

రైవాడ ప్రాజెక్టు

రైవాడ రిజర్వాయర్‌ ‌విశాఖపట్నం జిల్లాలో గోస్తని నదిపై నిర్మితమైంది. 3,960 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించడం, తాగునీటి సరఫరాను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పర్యావరణ, అటవీ శాఖల నుండి అనుమతులు పొందడంలో ఆలస్యం, భూసేకరణ, పరిహార సమస్యలపై స్థానిక రైతుల నిరసనలు, కాలువల విస్తరణ, డ్యామ్‌ ‌రిపేర్లలో సాంకేతిక సమస్యలు ఈ ప్రాజెక్టు పూర్తికాకపోవడానికి ఏర్పడ్డ సమస్యలు.

పెద్ద కలం ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లాలో జైకా నిధులతో చేపట్టారు. సుమారు 2,500 హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. జైకా నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి అదనపు నిధుల విడుదలలో ఆలస్యం, స్థానిక రైతుల నుండి భూమి సేకరణలో సమస్యలు, పరిహారం చెల్లింపులో జాప్యం, ప్రాజెక్టు ఆమోదం, టెండర్‌ ‌పక్రియలలో ఆలస్యం ఈ ప్రాజెక్టు జాప్యానికి కారణాలు.

వట్టిగడ్డ ప్రాజెక్టు వంశధార నదిపై గల ఈ ప్రాజెక్టు ద్వారా 4,000 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించాలని, గ్రామీణ ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టు కున్నారు. జైకా సహాయంతో కాలువల నిర్మాణం, డ్యామ్‌ ఆధునీకరణ జరుగుతున్నాయి. డ్యామ్‌ ఆధునీకరణ, కాలువల విస్తరణలో సాంకేతిక అడ్డంకులు పర్యావరణ అనుమతులు, భూసేకరణ, జైకా నిధుల విడుదల ఆలస్యం వంటివి దీని జాప్యానికి కారణాలు.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE