భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిపై దాదాపు ఏడాదిన్నరగా  సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. వచ్చే ఎన్నికలకు సమాయత్తమయ్యే దిశగా బృహత్తర బాధ్యతలు నెరవేర్చాల్సిన ఈ పదవి కోసం గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి భారీగా పోటీ  నెలకొంది. పార్టీ సారథ్యపగ్గాల  కోసం  పలువురు నేతలు  ప్రయత్నించారు. ఈ నియామకంలో పార్టీ  అధిష్టానం తన మార్క్ ‌చూపించింది. రాష్ట్రస్థాయిలో, క్షేత్రస్థాయిలో పరిస్థితులను బేరీజు వేసుకొని.. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలను విశ్లేషించుకుంది. పార్టీలోకి  కొత్తగా  వచ్చిన వాళ్లకు పదవులా? అన్న ప్రశ్నల మధ్య ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బీజాలున్న నారపరాజు రామచందర్‌రావును  అధిష్టానం పార్టీ అధ్యక్ష పీఠం కూర్చోబెట్టింది.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి కొన్నాళ్లుగా హాట్‌ ‌టాపిక్‌ అయ్యింది. గతంలో ఏనాడూ లేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉండటం.. ఒక రకంగా అధికార పక్షం పార్టీ కాంగ్రెస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయమని ప్రచారమవుతున్న దశలో రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో అధిష్టానం ఆచి తూచి వ్యవహరించాల్సి వచ్చింది. అధ్యక్షుని నియామకం విషయంలో పదులసార్లు రాష్ట్రస్థాయి, క్షేత్రస్థాయి నాయకులతో పాటు.. పార్టీ ముఖ్యులు, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రముఖులతో ఢిల్లీ పెద్దలు చర్చలు జరిపారు. అయితే, ఎప్పటికప్పుడు పదవి ప్రకటన వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు రామచందర్‌ ‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంతో పార్టీలో కొత్త జోష్‌ ‌నెలకొంది.

ఈ అధ్యక్ష పదవికి ఎంపీలు ఈటల రాజేందర్‌ (‌మల్కాజ్‌గిరి)ధర్మపురి అర్వింద్‌(‌నిజామాబాద్‌), ‌డీకే అరుణ(మహబూబ్‌నగర్‌), ‌రఘునందన్‌రావు (మెదక్‌), ‌రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌, ‌గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌తదితరులు పోటీ పడ్డారు. అధిష్టానానికి తమ విన్నపాలు సమర్పించారు. తమకు మద్దతుగా పలువురితో పార్టీ పెద్దలకు సిఫార్సులు కూడా చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా.. అవకాశం చిక్కినప్పుడల్లా తమకు అవకాశం కల్పించే అంశంపై అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, చివరకు అధిష్టానం తమ ముద్రను ప్రదర్శించింది. పార్టీ రాష్ట్రం పగ్గాలను ఎవరికి అప్పగించాలనే అంశంపై తీవ్ర కసరత్తు చేసింది. అన్ని సమీకరణాలను బేరీజు వేసుకున్న రామచందర్‌రావు వైపే మొగ్గు చూపింది. ఆయన అభ్యర్థిత్వానికి పార్టీలోని కొందరు సీనియర్‌ ‌నాయకులు బలంగా మద్దతు తెలిపినట్లు సమాచారం.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్‌ ‌నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.‌రామచందర్‌రావును ఖరారు చేసినట్లు జూన్‌ 30‌వ తేదీన అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయి. ఆయన వెంటనే నామినేషన్‌ ‌దాఖలు చేయాలంటూ పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అదే రోజు మధ్యాహ్నం ఆయన నామినేషన్‌ ‌దాఖలు చేశారు.

పార్టీ రాష్ట్రశాఖ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తోపాటు ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ ‌బన్సల్‌, ‌రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్‌ ‌పాటిల్‌, ‌సీనియర్‌ ‌నాయకులు గరికపాటి మోహన్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నామినేషన్‌ ‌కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, మరికొందరు పార్టీ నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రయత్నించి, తర్వాత వెనక్కి తగ్గారు. రాజాసింగ్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చినప్పటికీ.. సాంకేతిక కారణాలతో నామినేషన్‌ ‌సమర్పించలేకపోయారు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకే ఒక్క నామినేషన్‌ ‌దాఖలు కావడంతో రామచందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి శోభా కరంద్లాజే అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి కీలక సవాళ్లను దృష్టిలో ఉంచుకునే కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈసారి అధికారం మాదే..!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ వంద సీట్లతో అధికారంలోకి వస్తుందని రామచందర్‌ ‌రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశమిస్తే.. ఆ రెండు పార్టీలూ పాలనలో విఫలమయ్యాయని, ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని అన్నారు. కార్యకర్తలు, నాయకులందరి సహకారంతో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని రామచందర్‌ ‌రావు చెప్పారు.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్‌ ‌నుంచి జడ్పీటీసీ వరకు అన్ని సీట్లలో పోటీ చేస్తామని, అత్యధిక స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని , ఈ తర్వాత వాటిని అమలు చేయలేక• ‘డబ్బుల్లేవ్‌… ‌ప్రభుత్వం భిక్షాటన స్థితిలో ఉంది’ అని గగ్గోలు పెడుతోందని అన్నారు. రాష్ట్రంలో యూరియా లేదంటూ కాంగ్రెస్‌ ‌తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు అవసరమైన 12 లక్షల టన్నుల యూరియాను కేంద్రం సరఫరా చేసిందని, దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్‌ ‌విసిరారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను, 63 అనుబంధ హామీలను అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి లేఖ రాశారు.

మరోవైపు.. ఫాతిమా ఒవైసీ కాలేజీ వ్యవహారం పైనా రామచందర్‌ ‌రావు స్పందిస్తూ, అక్బరుద్దీన్‌ ఒవైసీ అక్రమణల తొలగింపుపై హైడ్రా వైఖరిని ఖండించారు. ‘అక్బరుద్దీన్‌కు ఒక న్యాయం… అట్టడుగు పేదలకు ఇంకో న్యాయమా?’ ప్రశ్నించారు. ‘మీకు అక్బరుద్దీన్‌ ‌కాలేజీల్లో చదివే వాళ్ల జీవితాలు మీకు ముఖ్యమా.. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది పేదల జీవితాలు మీకు పట్టవా?’ అని నిలదీశారు. అక్రమంగా నిర్మితమైన అక్బరుద్దీన్‌ ‌కాలేజీ భవనాన్ని కూల్చేయాలని డిమాండ్‌ ‌చేశారు. హైడ్రా కూల్చేయకుంటే.. ప్రజల పక్షాన ఆ పని తామే చేస్తామని ఆయన హెచ్చరించారు. మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్‌ ‌దాడులు దుర్మార్గమని.. మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నానని అన్నారు. మీడియా సంస్థలపై చేయి వేస్తే.. టీ న్యూస్‌ ‌ఛానల్‌ అం‌తు చూస్తామని హెచ్చరించారు రామచందర్‌ ‌రావు.

సుజాత గోపగోని

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE