సుంకాల యుద్ధాలు, కరెన్సీల మధ్య గట్టి పోటీ నుంచి నిర్బంధ మార్కెట్ వరకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచీకరణను పునర్ నిర్వచిస్తున్నాయి. నిరాకారమైన విస్తరణకు భౌతికవాదంతో కూడుకున్న క్రీడ మాత్రమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది.
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని మరోసారి చేపట్టిన కొద్ది నెలలకే వాణిజ్యం, పెట్టుబడులు, ప్రపంచ ఆర్థిక క్రమాన్ని దెబ్బ తీస్తున్న వ్యక్తిగా అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఈ అంతరాయం వాణిజ్యం, పెట్టుబడులకు మాత్రమే పరిమితం కాకపోవచ్చు. కరెన్సీ మార్కెట్లకు కూడా ఈ వేడి తగలవచ్చు. రుణ, ఈక్విటీ మార్కెట్లకు ఈ గందరోగళం విస్తరించవచ్చు.
వచ్చే ఆగస్టు 1న అధ్యక్షుడు ట్రంప్ విధించే సుంకాలపరంగా తమకు ఏమి జరుగుతుందో అని దాదాపు డజను దేశాలు ఎదురుచూస్తున్నాయి. అధ్యక్షుడి శ్వేతసౌధం చేస్తున్న ప్రకటనలను బట్టి చూస్తుంటే దాని ప్రభావం అంతటా కనిపిస్తోంది. భారత్ దృక్కోణం నుంచి, పాశ్చాత్య దృక్కోణం నుంచి ఇప్పటివరకు మనం అర్థం చేసుకున్న ప్రపంచీకరణను పునర్ నిర్వచించుకోవలసి ఉంటుంది. డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ఉత్పత్తులపై సుంకాల నుంచి దేశ`నిర్దిష్ట సుంకాల వరకు భౌగోళిక ప్రాంతాల్లో వాణిజ్యం నిర్వహించే విధానాన్ని తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు వ్యూహాత్మక భాగస్వాములకు, ఇతరులకు వేర్వేరు సుంకాల విధానాలను ప్రకటించారు. ఆగస్టు 1నుంచి అమలయ్యేలా ఎలాంటి మినహాయింపు లేకుండా జపాన్, దక్షిణ కొరియాపై 25 శాతం సుంకాలు విధించారు. దక్షిణాఫ్రికా నుంచి ఎగుమతి అయ్యే విలువైన రాళ్లు, వజ్రాలు నుంచి లోహాల వరకు సుంకాలు ఎక్కువ మోతాదులో 30 శాతంగా ఉన్నాయి.
కొద్ది రోజుల క్రితం 14 దేశాలకు బట్వాడా చేసిన లేఖల ప్రకారం థాయ్‌ల్యాండ్, మయన్మార్, లావోస్, కంబోడియా, సెర్బియా, ఇండోనేషియా, మలేషియా, బోస్నియా, హెర్జిగోవినా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే సరుకులు, సేవలపై సుంకాలను భారీ ఎత్తున 25 శాతం నుంచి 40శాతం మధ్య పెంచారు. ఇది సరిపోదన్నట్టుగా సొంత కరెన్సీలో లేదా అమెరికా డాలర్ ప్రమేయం లేకుండా వ్యాపారం చేయడానికి కట్టుబడి ఉన్న బ్రిక్స్ సభ్య దేశాలపై 10 శాతం చొప్పున సుంకాలు విధించారు. ట్రంప్ బ్రిక్స్ సభ్య దేశాల ఈ వైఖరిని అమెరికా ఆధిపత్యానికి ఓ పెద్ద ముప్పుగా చూస్తున్నారు.
అమెరికాతో వ్యాపారం లేదా వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశాలన్నీ మూడు నుంచి నాలుగు ఐచ్ఛికాల మీద కసరత్తు చేస్తున్నాయి. అనేక దేశాలు వేచి చూసే ధోరణిని అవలంబించాలని నిర్ణయించుకున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ తన దేశీయ పరిశ్రమలను, సేవా ప్రదాతలను రక్షించడానికి ఏర్పాటు చేసిన ఈ సుంకాల గోడలను తొలగిస్తారని అవి ఆశిస్తున్నాయి. భారత్, దక్షిణ కొరియా, జపాన్ సహా కొన్ని దేశాలు ఆగస్టు 1 గడువుకు ముందే పనులు కార్యరూపం దాల్చడానికని సుంకాలపై మంతనాలు జరపడానికి నిశ్చయించుకున్నాయి.
ఉదాహరణకు, అమెరికా రిపబ్లికన్ ప్రభుత్వం భారత్ నుంచి ఉక్కు, ఇనుము, అల్యూమినియం, రాగి ఎగుమతులపై 50 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. ఔషధ ఉత్పత్తులపై 200 శాతం సుంకాన్ని విధిస్తామని అమెరికా బెదిరించింది. ట్రంప్ ప్రభుత్వం అతిపెద్ద భారత వ్యవసాయ, పాల మార్కెట్‌లో ఒకవైపు జన్యుపరంగా మార్పు చేసిన ఉత్పత్తులను జోరుగా విక్రయిస్తూనే మరోవైపు అదే మార్కెట్‌లోకి మరింతగా చొచ్చుకుపోవడానికి పావులు కదుపుతోంది. అలాగని జరుగుతున్నదాన్ని కేవలం కళ్లప్పగించి చూడటంతో ఊరుకోవడంలేదు. ఈ విషయంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ నేతృత్వంలోని బృందం కఠినమైన బేరసారాల కోసమని చేస్తున్న ప్రయత్నాలు చాలావరకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి.
ట్రంప్ సుంకాలపై చేసిన తప్పిదాల గురించి ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. అలాగని ఐరోపా యూనియన్`ఈయూ పవిత్రమైనది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈయూ తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికని విధించనున్న సరిహద్దు కార్బన్ పన్ను మరోసారి ప్రపంచ వాణిజ్యానికి పెద్ద విఘాతం కలిగిస్తుంది. కార్బన్ సరిహద్దు సర్దుబాటు విధానం – సీబీఏఎం 2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఈయూ సభ్యదేశాలు దిగుమతి చేసుకునే ఉక్కు, సిమెంట్, ఎరువులు, ఎలక్ట్రానిక్ వస్తువులపై కార్బన్ పడుతుంది. అయితే భారత్ సహా బ్రిక్స్ సభ్య దేశాలు పర్యావరణ ఆందోళనలు ముసుగులో ఏకపక్ష, నియంత్రణాత్మక, కృత్రిమ వాణిజ్య అవరోధం అని పేర్కొంటూ ఈ కార్బన్ పన్నును తిరస్కరించాయి. ముఖ్యంగా చైనా, భారత్‌లపై ఈ పన్ను ప్రభావం పెద్ద ఎత్తున పడుతుంది.
గత పావు దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా పాశ్చాత్య శక్తులు బోధించిన ప్రపంచీ కరణను తలక్రిందులు చేస్తున్నది సుంకాలు మాత్రమే కాదు. ఒకప్పుడు స్వేచ్ఛ, ప్రపంచీకరణ ప్రపంచానికి తార్కాణంగా నిలిచిన స్వేచ్ఛా మార్కెట్లు, అపరిమిత వాణిజ్యం, సేవలు, ప్రజల వలసలు కొత్త నిర్వచనకు నోచుకుంటున్నాయి. దీనికి పాశ్చాత్య శక్తుల రక్షణాత్మక, నిర్బంధ విధానాలకే కారణం. ప్రపంచీకరణ ప్రపంచపు ప్రాథమిక పాశ్చాత్య భావనను సుంకాల యుద్ధాలు మాత్రమే తుంగలో తొక్కలేకపోవచ్చు. ఈ యుద్ధాలు సభ్యత్వంలో, వాణిజ్య వ్యవహారశైలిలో, పెట్టుబడిలో, ఆర్థికపరమైన చర్చల్లో ప్రాంతీయ, బహుపాక్షికంగా పరిగణించే వాణిజ్య బ్లాక్‌లు, గ్రూప్‌లకు అతీతంగా విస్తరిస్తున్నాయి. ఉదాహరణకు, 13 సభ్యదేశాలతో కూడిన బ్రిక్స్ తన సొంత కరెన్సీతో లేదా అమెరికా డాలర్‌తో ముడిపెట్టుకోకుండా సంబంధిత కరెన్సీలతో వ్యాపారం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న పక్షంలో కరెన్సీ మార్కెట్లు భారీ ఒడుదొడుకులను ఎదుర్కొంటాయి. ఇది అమెరికా అధ్యక్షుడిని కలతపరిచింది. బ్రిక్స్ దేశాల ఈ వైఖరి అమెరికాకు అత్యంత వ్యతిరేకమైనదిగా ఆయన భావించారు. దీంతో బ్రిక్స్, దాని మిత్ర దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలను విధిస్తానని బెదిరించారు. నేటికీ 90 శాతానికిపైగా వాణిజ్య ఒప్పందాలు అమెరికా డాలర్లలోనే జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ రిజర్వ్ కరెన్సీని అన్వేషించే క్రమంలో ‘డీ-డాలరైజేషన్’ (డాలర్ వాడకాన్ని తగ్గించే ప్రక్రియ) మరింత ఊపందుకుంది. ఉమ్మడి కరెన్సీపై బ్రిక్స్ దేశాల మధ్య విభేదాల కారణంగా ఈ ప్రక్రియ పూర్తికావడంలో జాప్యం తలెత్తుతోంది. అయినప్పటికీ నిర్దేశిత దేశ కరెన్సీ ఒప్పందాలు జోరందుకున్నాయి. భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష పదవిని త్వరలో చేపడుతున్న ప్పటికీ బంగారం వెన్నుదన్నుగా నిలిచే కరెన్సీని కనిపెట్టే పనిలో బ్రిక్స్ ఉంది. ఈయూ, యూఎస్‌తో పోల్చినప్పుడు బ్రిక్స్ అధ్యక్షశ స్థానానికి చేరుకునే భారత్ తన సొంత ప్రయోజనాలకు, బ్రిక్స్ ప్రయోజనాలకు సమతూకం పాటించడంలో ఓ పెద్ద పాత్ర పోషిస్తుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. చైనా, రష్యా దేశాల మధ్య అతిపెద్ద ఇంధన ఒప్పందాలు, రూబెల్స్, యువాన్ కరెన్సీల్లో జరుగుతున్నాయి. భారత్ రూపాయి, యువాన్, దిర్హామ్ కరెన్సీల్లో చెల్లింపులు జరపడం ద్వారా రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. కనుక స్థానిక కరెన్సీలు అమెరికా డాలర్‌ను తోసిరాజని ప్రాబల్యం పొంద లేవని చెప్పడానికి సరైన కారణం కనిపించడంలేదు.
నవ`ప్రపంచీకరణ సరళీకరణ ప్రపంచంలో తిరిగి నిర్వచనకు నోచుకునేది సుంకాలు, కరెన్సీల మార్కెట్ మాత్రమే కాదు. రెండవ ప్రపంచ యుద్ధకాలం నాటి బ్రెట్టన్ వుడ్స్ ఇన్‌స్టిట్యూషన్స్ పాత్రను కూడా తిరిగి నిర్వచించవలసి ఉంటుంది. ఇది నైపుణ్యంతో కూడిన పనివారల వలసల వరకు విస్తరించే నిర్బంధ వాణిజ్యం, పెట్టుబడులు, వైవిధ్యభరితమైన కరెన్సీల కొత్త వాస్తవికతను పరిగణన లోకి తీసుకుంటుంది. ఇదే కొత్త వాస్తవికతను పరిగణనలోకి తీసుకొని ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి` ఐఎంఎఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ`డబ్ల్యూ హెచ్‌వో లాంటి బహుముఖ సంస్థ తమకు తాము సరికొత్త నిర్వచనంతో కూడుకున్న పాత్రను చూసుకోవాలి. క్వాడ్, బ్రిక్స్ లాంటి గ్రూప్‌లు ఆవిర్భRవిస్తున్న సామాజిక` ఆర్థిక వాస్తవికతలతో వ్యవహరించడానికి తగిన మార్గాలను కనుక్కోవాలి. పాశ్చాత్య దృక్పథం, అజెండా నుంచి పుట్టుకొచ్చిన ప్రపంచీకరణ ఒక వర్తులము పూర్తి చేసుకుంది. దాన్ని కొత్తగా రూపొందించాల్సిన అవసరం ఉంది. అందుకు సవాళ్లకు గురవుతున్న సుస్థిరమైన ఆర్థిక నమూనాలను దాటుకొని మరీ పోవాలి. ప్రపంచ వ్యవహరాలకు పనికొచ్చే సరికొత్త లయను, పదాన్ని కనుక్కోవాలి. దీనికి మార్కెట్లు, డాలర్లకు అతీతమైన ఆధ్యాత్మిక ప్రపంచీకరణ ఏకైక ఐచ్ఛికం కావొచ్చు.
– కె.ఎ.బదరీనాథ్
డైరెక్టర్ ; చీఫ్ ఎగ్జిక్యూటివ్,
సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్
హోలిస్టిక్ స్టడీస్, న్యూఢిల్లీ.